11.28.2009

నా అనుభవంలోని ఒక ఆలోచన...

రెండు సంవత్సారాల క్రితమనుకొంట.. మా వారికి ఆరోగ్యం బాలేదని దండం పెట్టుకొన్నానో , మరి ఎదో పని జరగాలని దండం పెట్టుకొన్నానో నాకు గుర్తు లేదు కాని, ఆ పనేదో సక్రమంగా జరిగింది అని, షిర్డీ ప్రయాణం పెట్టుకొన్నా నేనొక్కదాన్నే. పిల్లలికి త్రైమాసిక (quarterly) పరీక్షలని వాళ్ళు కుదరదు అన్నారు. మా వారు ఎదో ఆఫీసులో పని,.."నువ్వు వెళ్ళి వచ్చేయి " అని ... పర్లేదు బస్ వాళ్ళే కదా మొత్తం సమకూర్చేది అని అనుకొని టికెట్స్ తీసుకొందామని వెళ్తే, "వసతి మీరే చూసుకోవాలి" అని చెప్పేసారు. ఒక్కదాన్నే కదా పెద్ద సమస్య ఏముంది అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు అని ధైర్యం తెచ్చుకొని బయల్దేరాను.

"ట్రైన్ అయితే మన్మాడు దగ్గిర దిగి మళ్ళీ ఏదో ఒక జీప్ చూసుకోవాలి. బస్ అయితే ఇక్కడ ఎక్కితే అక్కడ దిగొచ్చు, ఒక్కళ్ళే వెళ్ళేప్పుడు బస్ అయితేనే క్షేమం" అని చాలా మంది అనడంతో బస్ కే ప్రాముఖ్యత ఇచ్చాను. సాయంత్రం 5 గంటలకి బస్ బయల్దేరింది చుట్టు చూసాను అందరూ బార్యా భర్త జంటలు, కొంతమంది కొత్తగా పెళ్ళయిన వాళ్ళయితే కొంతమంది చిన్న చిన్న పిల్లలతో ఉన్నవాళ్ళు, ఒక్కళ్ళే వెళ్తున్నది ఎవరూ లేరా అని మళ్ళీ చూసాను నా పక్కన ఎదురుగా అమ్మాయి, సరే! చిన్న చిరునవ్వు నవ్వాను, "హాయ్" అంటూ.. తిరిగి "హాయ్" అని పలకరించింది. "ఒక్కళ్ళే వెళ్తున్నారా?" అని అడిగాను, అవునని తలూపింది, హమ్మయ్య తోడు అనుకొన్నా. షిర్డీలో అంతా ఈమె తోడుతో గడిపేయచ్చు అనుకొన్నంతసేపు పట్టలేదు, ఆమె వచ్చేది షిర్డికి కాదు అక్కడ నుండి ఇంకెక్కడకో వెళ్ళాలని చెప్పింది. పర్లేదు అక్కడ దాకా తోడు అంతే ... గుడ్డిలో మెల్ల నయం అనుకొన్నా. బస్‌లో ఆమె పరిచయం కబుర్లు.. మరాఠి అమ్మాయి ఆ అమ్మాయి తెలుగు రాదు ఇద్దరం హిందిలోనే మా సంభాషణ సాగించాము ఏదో పరీక్షలకని వచ్చిందిట, తిరిగి తన ఊరు వెళ్తోంది. అలా మాట్లాడుతూ , ఎవో భక్తి పాటలు వింటూ బస్‌లో గడిపేసాను.

తెల తెలవారుతుండగా షిర్డికీ చేరుకొన్నాము, దిగగానే అందరూ తలా ఒక హోటల్ పేరు చెప్తున్నారు. తమ్ముడు ఇచ్చిన హోటెల్ కోసం వెతుకుతూ ఉండగా కనిపించాడు ఒకతను , బస్‌లోనే చూశాను , నావైపే వస్తున్నాడు. "ఇతనికి నాతో పనేంటి?"అని అనుకొంటూ ఉండగా, అతను నా దగ్గరికి వచ్చి
"మీరొక్కరే వచ్చారా? " అని హిందిలో అడిగాడు.

"అవును" అని సమాధానం ఇచ్చాను, ఇతనికి చెప్పడం అవసరమా అని మనసులో అనుకొంటూనే.. మనిషి మిలటరీలో పని చేస్తున్నాడట, పెళ్ళయి 6 నెలలు అయ్యింది, "మిలటరీ నుండి ఇంటికి వెళ్తూ... ఒకసారి బాబా దర్శనం చేసుకొందామని వచ్చాను" అని చెప్పాడు నేను అడగనవసరం లేకుండానే..అనవసరంగా మాటలు ఎందుకు పెంచుకోడం అని నవ్వేసి, చేతిలో తమ్ముడు ఇచ్చిన స్లిప్ లో ఆ అడ్రస్ కోసం వెతకడం ప్రారంభించాను. నాకు అతను మాట్లాడే హింది అర్థంకాలేదు అనుకొన్నాడో.... మరి ఎమో, నా వెనకాలే రావడం నేను ఆరా తీస్తున్నట్లుగానే అతను వసతి కోసం ఆరాతీయడం చేస్తున్నాడు. మనకెందుకని నా మానాన నేను నా పనిలో మునిగి ఉన్నాను. కొంతసేపటికి చేతిలో ఉన్న చిరునామా కాగితం చేతి చమటకి నలిగిపోయింది. మరి బస్ దిగినప్పుడే తప్పుదారి పట్టానేమో తెలీదు కాని ప్రయాణ బడలిక, అడ్రస్ దొరకకపోవడం కొంచం చికాకుగా అనిపించింది. వాతావరణం కాస్త ఎండ అక్కడక్కడ చినుకులతో కొంచం ఆహ్లాదంగా ఉంది కాబట్టి ఆ మేరకు చికాకు అంతగా లేదు. ఇంతలో మళ్ళీ ఆ మనిషి "అడ్రస్ దొరకలేదా " అని.. నన్ను వదిలేలా లేడని, తల అడ్డంగా ఊపాను లేదని. వెంటనే "పర్లేదు నాకు తెలిసినవాళ్ళూన్నారు అక్కడికి వెళ్దాం. ఆడవాళ్ళు ఇలా ఒంటరిగా ఉండడం మంచిదికాదు" అంటూ నా అంగీకార ప్రమేయం లేకుండా నా బ్యాగ్ తీసుకొని ముందుకు నడక సాగించాడా అగంతకుడు. నాలోని వ్యక్తిత్వం కించపరచబడిందో లేక నేను వెళ్ళలేననుకొంటున్నాడా అన్న పౌరుషమో తెలీదు కాని ముందుకు వెళ్తున్న అతనిపై సర్రున కోపం వచ్చిన మాట వాస్తవం , కాని చికాకు కోపాన్ని జయించింది. తప్పదు "సర్దుకుపో" అని మనసు నచ్చజెప్పింది. ఇక చేసేదేమి లేక, అతను చూసే వసతికోసం వెనక వెళ్ళక తప్పింది కాదు గుడికి దగ్గర్లోనే ఉన్న వసతిని చూసి, అక్కడ వాళ్ళతో మాట్లాడి, నా దగ్గిర డబ్బులడిగి తీసుకొని అక్కడ కట్టేసి "దర్శనానికి తొందరగా రేడి అయి వచ్చేయండి .. అదిగో అదే గుడి" అంటూ గుడి గోపురాన్ని చూపించి .. వెళ్ళిపోయాడు. "హమ్మయ్య" వెళ్ళిపోయాడు, అని మనసులో అనుకొని, రూమ్ వైపు దారి తీసాను.
*******
ఏమాట కా మాట చెప్పాలి. రూమ్ మటుకు విశాలంగా చాలా బాగుంది. మనసులోనే మళ్ళీ ఆ అపరచితుడికి థాంక్స్ చెప్పుకొన్నా(పేరు అడగలేదు అతను చెప్పలేదు). గంటలో రేడి అయి గుడికి వెళ్ళాను. ఆరోజు గురువారం అవడంతో ఇసకవేస్తే రాలనంత జనం..
"అమ్మో! దర్శనం ఎప్పటికవుతుందో" అని అనుకొంటూ.. లైన్లో నించున్నా.. బాబాని ధ్యానించుకొంటూ.. మనసులో మటుకు మధ్యాహ్న హారతి టైం కి దర్శనం అయితే ద్వారకామయి లో కాసేపు ధ్యానం చేసి భోజనానికి వెళ్ళి.. పక్కనే ఉన్న ఖండోబా దేవాలయం, బాబాగారి శిష్యుల ఇళ్ళూ , తొమ్మిది వరహాలు అవి చూడాలని ఆలోచన, సాయంత్రం మళ్ళీ 6 గంటలకి బస్ తిరుగుప్రయాణానికి.. క్యూలో ఉన్న ఈ జనాల్ని చూస్తే ఇవేవి జరిగేట్టు లేవు దర్శనం అవగానే బయల్దేరాలేమో.. అని మనసు పీకేస్తొంది ఒక పక్క. ఇలా మనసుతో మంతనాలు సాగిస్తూనే, ఒక వైపు ధ్యానం చేస్తూ.. పక్కన ఎవరో ఉన్నట్లనిపించి పక్కకి తిరిగి చూసా.. అదే చిరునవ్వు, చిరుపరిచితమైన ఆ అపరిచితుడు. .... మళ్ళీ మొదలు నా మనసు ప్రశాంతంగా ఆలోచించలేదేమో అనుకొంటుండగానే, అతను పూల మాలలు అవి నా చేతికిచ్చి ముందుకు వెళ్ళి సెక్యూరిటీతో ఎదో ఐడి కార్డ్ చూపించి నన్ను చూపిస్తూ ఎదో మాట్లాడుతున్నాడు. అదంతా చూస్తుంటే మనసులోని ఆలోచనలు కొంచంగా మారనారంభించాయి. "మంచివాడే పాపం తనే అపార్థం చేసుకొంటున్నాను" అని అనిపించింది. ఇలా ఆలోచిస్తుండగా .....అతను నా దగ్గరికి వచ్చి, "దీదీ మై బాత్ కియే" అంటూనన్ను నేరుగా దర్శనానికి తీసుకెళ్ళి నేను చూడాలనుకొన్న ప్రదేశాలు కాక , తనకి తెలిసినవి చూపించి, మళ్ళీ నేను నా రూమ్ కి వెళ్ళి బ్యాగ్ తీసుకొని బయల్దేరి బస్ ఎక్కేదాకా నా తోడు ఉండి , కనీసం నా బ్యాగ్ కూడా నన్ను పట్టుకోనివ్వకుండా తనే పట్టుకొని బస్ స్టార్ట్ అయ్యేదాక ఉండి .. "మర్చిపోవద్దు అక్కా.." అని చివర్లో కళ్ళనీళ్ళు.. అతని బార్యకి ఇప్పుడు 6త్ మంత్ అని, తనకి మొదట ఆడపిల్ల పుట్టాలని, మిమ్మల్ని చూస్తే అక్కలా అనిపించారంటూ బస్ కదిలేలోపు తన గురించి బార్యపై అతని ప్రేమ గురించి చెప్పి సెలవు తీసుకొన్నాడా వ్యక్తి. అపరచితుడవడం వల్ల ఫోన్ నెంబరు ఇవ్వలేదు. అతను అడగలేదు కూడా.. మధ్యలో అక్కడ బ్యాంక్ ATM ఎదో ఇబ్బందిగా ఉండి నాకు డబ్బు అవసరమైతే కూడా నిస్సంకోచంగా తన దగ్గిర డబ్బులు ఇచ్చిన వైనం (ఇచ్చేసాను అనుకొండి గంట తరువాత డ్రా చేసి..) తలచుకొంటే మనుషుల్లో ఇంకా మంచితనం చావలేదు అనిపిస్తుంది. తిరిగి ఇచ్చేసేవాళ్ళకన్నా అవసరానికి అప్పు ఇచ్చినవాళ్ళే గొప్పవాళ్ళు నా దృష్టిలో. ఇలా నా షిర్డి ప్రయాణం పేరు కూడా తెలియని, భాష తెలియని ఒక అపరిచితుడి పరిచయంతో విజయవంతంగా ముగిసింది.
****
అన్నయ కుంటుంబం ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళారు దసరా సమయంలో.. "
ఎవరో వచ్చి సమయానికి దర్శనానికి ఏర్పాట్లు చేసారు అనుకొన్న సమయంలో దర్శనం జరిగింది , ఆ దేవుడి మీద నమ్మకం ఆయనే పక్కనుండి అన్నీ చూపించాడు " అని అన్నయ్య చెప్పినప్పుడు "అసలెలా జరుగుతుంది అన్నయ్యా! అలా ఎవరో అలా ఎలా కలిసి అన్నీ చూపిస్తారు వారికింక మిమ్మల్ని కలిసి అన్నీ చూపించడం తప్పితే వేరే పనులుండవా " అని అడిగితే వెంటనే "ఎందుకు అలా అనుకొంటావు? నీకెప్పుడు జరగలేదా ఇలా?" అని అన్నాడు, అదిగో అప్పుడు తళుక్కున స్మృతి పధంలోకి మెరిసి ఇంత పోస్ట్ రాసేలా చేసాడు ఆ అపరచితుడు. దేవుడిమీద నమ్మకం కన్నా. .. మనకి మనమీద నమ్మకమే మనల్ని విజయపధంలోకి తీసుకెళ్తుంది అని అనిపిస్తుంది నాకు. నాకు ఈరోజు ఈ పని అయిపోతుంది నేను చేయగలను అన్న నమ్మకం నన్ను షిర్డీ దాకా వెళ్ళేలా చేసింది. దైవ బలం తోడ్పాటు మాత్రమే, మానవ ప్రయత్నం లేనిదే దైవం కూడా ఏమి చేయలేడు. వెళ్ళడం మనపై నమ్మకం, దర్శనం లభిస్తుంది అనేది మరో నమ్మకం. ఆ సంకల్పం నమ్మకం మనకి ఇలా ఎవరో ఒకరి పరిచయంద్వారా విజయవంతం అవుతుంది. థాంక్స్ అన్నయ్యా.. బాబా దర్శనం విజయవంతంగా పూర్తిచేయించిన ఆ అపరిచితుడిని గుర్తుచేసినందుకు...... ఇలా నా అనుభవంలోని ఆలోచనలని పంచుకొనే అవకాశం కల్పించినందుకు..
******

11.19.2009

చిరు కానుక

"కార్తీక మాసం , తల స్నానాలు .. అంటూ చలికాలంలో చన్నీటి స్నానాలు అని ఆవేశపడకు ... జాగ్రత్త!! అని చెప్తూ .. ఈసారి బాబే పుడ్తాడని అనిపిస్తోంది రోజు వెంకటేశ్వర స్వామి కలలోకి వస్తున్నాడు. ఎందుకో అలా అనిపిస్తోంది. పుట్టిన బాబుకి ఆయన పేరే పెట్టాలి."

"తప్పకుండా.... నాకు అలాగే అనిపిస్తోంది, ముందు బాబు తరువాత పాప పుట్టారు ఈసారికూడా బాబే పుడ్తాడు. " అని అమ్మ

******

"ఆపరేషన్ ఏమిట్రా? మన ఇంటా వంటా ఉందా ఇద్దరు పిల్లలేనా.. కష్ట సుఖాలు చెప్పుకోడానికి వాళ్ళకి తోడేవరు? దానికో చెల్లెలు, వాడికో తమ్ముడు ఉండాల్సిందే, ఆపరేషన్ లేదు ఏమి లేదు, మా కాలంలో ఇలానే ఉన్నామా? నాకు చెప్పకుండా ఆపరేషన్ అంటే పచ్చి మంచినీళ్ళు ముట్టుకోను అంతే..." మామ్మ అందిట ఇలా ....నాన్నగారితో .. అక్క పుట్టిన తరువాత..

ఇన్ని తర్జన భర్జనలతో నా జననానికి ముందు నాన్నగారికి కల... పైన చెప్పిన ఉదంతం. అలా కష్టపడ్డారో , నష్టపడ్డారో కాని కార్తీక మాసం పౌర్ణమి తరువాత పంచమి రోజు పుట్టానని అమ్మ చెప్తూ ఉంటుంది.

****

నేను రోజులలో ఉన్నానో, మరి నెలలలో ఉన్నానో తెలీదు కాని నా చిన్నతనంలో భూకంపం వచ్చింది .

భూకంపానికి ఒక్కసారిగా మంచం మీంచి కిందపడ్డానుట. మెడ అదేపనిగా కదుపుతూనే ఉన్నానని అమ్మ చెప్తూ ఉంటుంది. ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా తగ్గలేదు. తాతగారు ఇలా కాదని "గోడిలంక" కి తీసుకెళ్ళి అక్కడేదో వైద్యం చేయించారట, ఒక 6 నెలలు అలా కష్టపడిన తరువాత. "ఒకవిధంగా మళ్ళీ పుట్టావే నువ్వు, ఎన్ని కష్టాలు పడ్డామని నీతో, ఆడపిల్లవి, అలా మెడమీద తల నిలబడదు.. జీవితాంతం ఇలాగే ఉంటుందా... అన్నంతగా ఉండేది అస్సలు తగ్గలేదు ఎలారా బాబు!!! ఈ పిల్లతో అని ఏడ్చేసేదానిని మీ నాన్నదగ్గిర .. చచ్చి బతికావు " అంటూ ఉంటుంది తను నావల్ల పడ్డ కష్టాలని పదే పదే తలుచుకొంటూ ...

****

1వ తరగతి ఫోటో

వెనక్కి తిరిగి గతాన్ని, గత అనుభవాలని తరచి చూసుకొంటే , నా చిన్నతనం అమ్మ కష్టాలు, అప్పుడప్పుడు చిరుకోపాలు, గారాలు, ఏడ్చి సాధించడం.. చిన్నతనంలోనే నాన్నగారు గుండెనెప్పితో కాలం చేయడం ... అన్నీ కలగలుపుకొని.. కొంత విషాదం కొంత సంతోషం, వెరసి మొత్తం కష్టమంటే ఏంటో కూడా తెలియని బాల్యమంతా సరదా సంతోషాలే. ఒకవిధంగా ఎవరి సలహాలు, సంప్రదింపులు లేకుండానే (ఇచ్చేవాళ్ళు లేకపోవడంవల్లనేమో) సొంతనిర్ణయాలతోనే నా జీవితం ఇంతవరకూ నడిచింది. ఆఖరికి నా పెళ్ళితో సహా సొంత నిర్ణయమే. చదువు విలువ అప్పట్లో తెలియకపోయినా "పెళ్ళి చేసేద్దాము ఎందుకు చదివించడం" అని అమ్మ అన్నయ్యతో అన్నప్పుడు, "లేదు చదువుకొంటా" అని మొండిపట్టుదలతో చదువుకొన్నదాన్ని, అత్తెసరి చదువులైనా ఈరోజు అవే ఒకమార్గం చూపిస్తున్నందుకు నా మనసుకు, నా నిర్ణయానికి నేనే కృతజ్ఞతలు చెప్పుకొంటూ ఉంటాను.


10 వ తరగతి ఫోటో
*****

డిగ్రీలో ఉండగా ఆకర్షణ అనే ఉచ్చులో చిక్కుకోకుండా నాకే తెలియని దీక్షతో చదివినదాన్ని, పెద్ద చదువులు అని కాదు కాని, అక్క పెళ్ళి,
అన్నయ్య ఢిల్లీలో ఉండి అంతగా బాధ్యత తెలియకపోడం(బాధ్యత తీసుకోకపోవడం) , తమ్ముడు చిన్నపిల్లాడవడం..ఇవన్నీ నాకు అప్పట్లో అర్థం కాని సమస్యలు.. ఈ సమస్యలలో సతమతమవుతూ ఒంటరిగా ఉన్నప్పుడు తెలిసి తెలియని ఆలోనలతో, ప్రేమ కథలు వింటున్నప్పుడు... "అసలు జీవితమంటే ఏంటి?" అని ప్రశ్నించుకొనేదానిని. ... కాని చెప్పేవాళ్ళేవరు? పుస్తకాలు కొంతవరకే నాకు జ్ఞానాన్ని అలవర్చాయి.

నా జీవితం అంతా ... "రేపు నేనేంటి" అన్న ప్రశ్న వేసుకోనవసరం లేకుండానే గడిపోయిందని చెప్పొచ్చు. అందులో భాగమే పెళ్ళి. "నేను నచ్చానా" అంటూ నా మనిషైన వైనం ... "నావల్ల ఏమన్నా ఇబ్బంది పడ్తున్నావా" అని అడిగి నా వ్యక్తిత్వాన్ని గౌరవిం
చడం చూస్తుంటే , నాకు తెలియకుండానే నేను ఎంచుకొన్న మార్గాలన్ని సన్మార్గాలే అవడం..నాకు మరింత ఆనందాన్ని ఇచ్చే విషయం. "నువ్వెప్పుడన్నా ఏవిషయంలోనైనా కమిట్ అయ్యావా పిన్ని.. ?" అని అప్పుడెప్పుడో అక్క కూతురు అడిగింది. జీవితంలో కమిట్మెంట్, సర్దుకుపోడం,కష్టం , సుఖం ఇవన్నీ లేకపోతె జీవితాన్ని అర్థం చేసుకోగలమా? ఆనందించగలమా? అందుకేనేమో కొన్నిటిని సమాధానం లేని ప్రశ్నలంటారు వాళ్ళ వాళ్ళ స్వీయానుభవాలే జవాబులు చెప్పాలి. అందుకే అప్పుడు మౌనం సమాధానమయ్యింది.

బాల్యం, చదువులు, ఉద్యోగం, తరువాత పెళ్ళి, పిల్లలు ఇలా ఒక్కో మెట్టు, ఒక్కో మెట్టు, మెట్టు మెట్టుకి జ్ఞాపకాల దొంతరలు.. ఎన్నో ఆనందాలు, కొన్ని కష్టాలు ఈ మజీలీలలో తాత్కాలికమైన/శాశ్వతమైన పరిచయాలు..

పిల్లలు సంవత్సరమంతా చదివి వారి చదువుల జ్ఞానమెంత అని పరీక్షించడానికి పరీక్షలంటారు? జీవితంలో మరి మనమే స్థాయిలో ఉన్నామో ఒక్కసారన్నా మన గతాన్ని తరచి చూసుకోవాలనిపిస్తుంది కదా.. అదే ఎలా? ఇలా పుట్టినరోజు పుట్టినరోజుకి మన పిల్లలు స్థిరపడేదాక మన ఎదుగుదలను గ్రాఫ్ వేసుకొంటే?? ఆ ఏటికాయేడు వయసుతోపాటు ఆలోచనలు అప్పటి పరిస్థితులకనుగుణంగా మార్చుకొనే అవకాశముంటుంది కదా.

"అయినా ఈ వయసులో ఇక పుట్టినరోజేంటి?" అని అన్నయ్య అడిగిన ప్రశ్నకి నాకనిపించిన సమాధానమిది, మన పుట్టినప్పటినుండి మళ్ళీ పుట్టినరోజువరకు వెనక్కి తిరిగి మనల్ని మనం తరచి చూసుకొనే తీపి అనుభవాలు, చేదు గుర్తులు, చేసిన అల్లర్లు, చెయాల్సిన పనులు.. గుర్తుకొస్తున్నాయి అని ఇలా రాసుకోలేమా? ఇది ఒకళ్ళు నిర్దేశించిన జీవితం కాదు కదా, మన జీవితం మన పుట్టినరోజు ..మన కష్టం , మన సుఖం.. వెరసి అదో వింత అనుభూతి.. ఆనందం.

నా జీవితమేమి ఇంకొకరు స్ఫూర్తి చెందే జీవితమని కాదు, కాని నా వరకు నా పిల్లలికి నేను చెప్పుకోగలిగే అంటే సలహాలివ్వగలిగే జీవితం కదా, అలా నా కుటుంబానికి మార్గదర్శకత్వం చెయాలంటే .. ముందు నేను గతానుభవాల్ని
తరచి చూసుకోవాలిగా.. అందుకే ఈ పుట్టినరోజు. ఇప్పటికీ రేపు "నేనేంటి" అన్న ప్రశ్న లేదు. నిన్న ఏమి చేసాము, ఈరోజు ఏమి చేస్తున్నాము ప్రస్తుతం ఇదే .. రేపు ఏమి చెయ్యాలి అన్నది తరువాత మాట,. చేసినవి, చేస్తున్నవి పిల్లలికి చెప్పగలిగితే చేయాల్సినవి వాళ్ళు చేస్తారనే ఆలోచన నాది.
*****

ఇహ ఈ జీవన ప్రయాణంలో ఇప్పటివరకూ కలిగిన స్నేహ పరిచయాలలో కొన్ని తాత్కలికంగా వాళ్ళ స్టేజ్ వచ్చిందనుకొని దిగిపోయినవాళ్ళున్నారు . శాశ్వతంగా నీతో పాటే అన్న ప్రాణస్నేహాలు ఉన్నాయి. తాత్కాలికంగా అనుకొన్నవాళ్ళు వెళ్ళిపోయినా... వాళ్ళ తీపిజ్ఞాపకాలు నన్ను కదిలిస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు. అలాంటి తీపిజ్ఞాపకాలలో ఒకటి, 2007 లో 20/11కి నా పుట్టినరోజు
కి చ్చిన ఒక చిరు కానుక... ఇదే..



******

11.16.2009

మ..మ్మ....మాస్.....మౌంట్ ఒపేరా..

మొత్తం మీరే చేశారు గోపాల్ .. ఇంక చాలు.. మీరు మాకు వినిపించిన పాటలు ఇంక చాలు. మీవల్ల మా ఈ ట్రిప్‌లోని సంతోషాన్ని కోల్పోపోయేలా చేయకండి.

గోపాల్ : నావల్లా? నా వల్ల...ఏమి జరిగింది?

"ఇంకా అర్థం కాలేదా మీకు?? ..ఈ బస్ లో ఎక్కక ముందు మాలో ఉండేది..ఇప్పుడు లేనిది..."ఉత్సాహం " ... చిన్న చిన్న పాటల మాట్లల్లో కూడా " ఉత్సాహం" కోల్పోయాము , మీ వల్ల..... పాటలు మీరే సెట్ చేస్తారు..ఈ పాటలు చాలా బాగుంటాయీని అని మీరే మమ్మల్ని కన్విన్స్ చేస్తారు.. మాకు ఎలా ఉంటుందో తెలుసా.... "ఆ CD విరక్కొట్టి "మాకు కావాల్సినవి ఇవి కాదు" అని అరవాలనిపిస్తుంది. ..పాటలు వినండి అంటారు .. మేము ఏదో విందామని అనుకొని వస్తాము , మీరు మమ్మల్ని విననివ్వరు. మీరందరూ మమ్మల్ని కన్విన్స్ చేయాలనుకొంటారు. పాటలు మంచివి పెట్టరు.

ఏపాట మేము వినాలో కూడా మేరే చెప్తే, మేము ఎందుకు ఇక? చివరికి మేము ఎఏ పాటలకి డాన్స్ చేయాలో ...ఏం వినాలో .. కూడా మీరే చెప్తే మేము ఎలా ఎంజాయ్ చేయము?

సిడి ప్లేయర్‌ని సెట్ చేసి, చెత్త పాటలెలా పెట్టి , మమ్మల్ని బాధ పెట్టాలో మీకు తెలుసు .. ఆ పాటలు విని , ఎంత బాధ పడ్తున్నామో మాకు తెలుసు.. అంతా మీరే చేశారు గోపాల్..... అంతా మీరే చేశారు. "

"సరే ..సరే.. !!! మీకెమి పాటలు కావాలి సెట్ చేస్తాను... సిడిలు దొరకడం లేవసలిక్కడ.... "

అందరూ కొరస్‌గా .... "మమ్మ....మాస్.,,, బాబూ!!!... ఇక్కడ ఇప్పుడు క్లాస్ కుదరదూ...ఈ టైం లో మేమంతా మాస్"
*******

"అ .. అంటే .... అమలాపురం ... ఆ... అంటే ఆహాపురం..."

అదీ లెక్క.. కొంచం బీటు మార్చండిరా బాబు... ..

బస్‌లో చిన్న పెద్ద అందరూ ఒక్కసారి లేచి స్టెప్పులే స్టెప్పులు..ఇలా.....


*******


ఏంటిదంతా అనుకొంటున్నారా? ఆదివారం అలా మేమంతా కలిసి జాలీగా వనభోజనాలనుకొని.. మౌంట్ ఒపేరాలో హోటల్ భొజనాలు చేసి సందడి...సందడి చేసినవేళా.... ఆ గోల .. ఇదిగో ఆనంద హేల ....


ఒక వారం ముందు, ఈ కార్తీకమాసం వనభోజనాలు కుదరేదేమో ఎక్కడా తెలిసినవాళ్ళేవరూ ఎవరు ఉలకడంలేదు - పలకడంలేదు అని అనుకొంటూ....అసలు ఆఫీసులో మాట కదుపుదామని మాములుగా అన్నా! ఎవరితోనో గుర్తులేదు.. అంతే ఆరోజు సాయంత్రానికే ఎక్కడికి వెళ్దాము ఎవరెవరు ఏమేమి తీసుకొని వెళ్దాము అన్న ఎజెండా ఒకటి తయారుచేసేసుకొని, మీటింగ్ పెట్టేసారు. రాజు తలచుకొంటే దెబ్బలకి కొదవా.. అన్నట్లు రమణి తలుచుకొంటే.... :) సరే.. మీటింగ్లో అనుకొన్నది "నాగార్జున సాగర్" అని తలా ఒకళ్ళు తలా ఒక వంటకం తీసుకొని వెళ్ళాలి అని నిర్ణయించేసుకొన్నాము. చివరాఖరికి అంతదూరం ప్రయాణంలోనే అలసిపోతామేమో అక్కడికి వెళ్ళి ఏమాటలు ఆడతామని అనేసుకొని, ప్రోగ్రాం రెండురోజుల ముందే మార్చేసాము "మౌంట్ ఒపేరా" అని. మగధీర షూటింగ్ హడావిడి మాదే కాబట్టి, వెంటనే ఆ టీం వాళ్ళని బస్ పంపమంటే సరే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు అలా బస్ వచ్చేసింది.





అసలెప్పుడు చేరుకొన్నామో, అప్పుడే వచ్చెసిందా అన్నంతగా అరుపులు డాన్సులతో సందడి చేసేసాము ఆ బస్‌లో. ఇక్కడెంత సందడిగా చేసామో అక్కడ అల్లరి అలాగే చేసాము. ప్రతిచోటా ఆనందం ఎలా ఉంటుందో వెన్నంటి ఎదో ఒక చికాకు వ్యవహారం కూడా ఉంటుంది అన్నట్లుగా ... మౌంట్ ఒపేరాలో భోజనాలు అస్సలు బాలేదు ముఖ్యంగా శాఖాహారులకి ప్రత్యేకంగా వేరే లోటస్ room అని చెప్పి ఏర్పాటు చేసారు. చప్పగా ఏదో చేసామంటే చేసామన్నట్లు ఉన్నా , ఆ భోజనాలు తినాలంటే నిజంగా మనకి ఇంటినుండి తెచ్చుకొనే సదుపాయం ఉంటే బాగుండును అని అనిపించక మానదు. అస్సలు రుచించని , జీర్ణించుకోలేని విషయం అక్కడ అదొక్కటే. ఈ భోజనం విషయం పక్కన పెడితే మేము మా కుటుంబాలు సంతోషంగా ఈతకొలనులో కాసేపు ప్రపంచాన్ని మర్చిపోయాము. అలాంటి మరికొన్ని కార్తీకమాస హోటల్ భోజనాల గోల... ఆ ఆనంద హేల ..ఆ వేళా.... మరికొన్ని మీకోసమిలా..



*******

11.11.2009

జర భద్రం తల్లీ!..

తెలుగు బ్లాగర్స్‌లో పాత పోస్ట్‌లేవో చదువుతుంటే నా కంటబడింది నేను అప్పట్లో రాసిన ఈ పోస్ట్. కొత్తలో రాసిన పోస్ట్‌ ఇది. మళ్ళీ చదువుతుంటే "బాగుంది" అన్న భావన కలిగి మళ్ళీ ఇక్కడ పబ్లిష్ చేస్తున్నాను. మళ్ళీ చేయడానికి కారణమంటూ చెప్పాలంటే ఇది అప్పుడు రాసింది నా బ్లాగులో కాదు. నాదగ్గిర భధ్రపర్చుకొన్నట్లుగా ఉంటుందని... ఇలా.... చదువరులకు అసౌకర్యమనిపిస్తే క్షమించండి, బాగుందనిపిస్తే చదివేయండి సరదా.. సరదాగా.

******

జర భద్రం తల్లీ!

“వచ్చిండన్నా, వచ్చాడన్నా వరాల తెలుగు మనదే” అన్న భావనతో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతీయ భాషలో రాయడానికి సాహసం చేస్తున్నాను. తప్పులేమన్నా ఉంటే మన రమణియేగా అని అనుకొని మన్నించేస్తారుగా. మరయితే రండి! చూద్దాము సరూపక్క చెల్లెలు వెన్నెల చేసే సందడి, సందడి.
***

జర భద్రం తల్లీ! సల్లంగ ఉం(సూ)డాల!

“యేందె సరూపక్క! ఎట్లున్నావు? ఓటెయనీకి వచ్చిన, ఏందే! గట్ల యిచిత్రంగా సూస్తవ్! యాద్మర్చినవ్ లే! ఔ మల్ల సానా దినాలయ్యిందిగదా! లకడీ కా పూల్ పోరిని, లాలుదర్వజా లస్కర్ బోనాల్నాడు కలిసి “యెన్నెలా! ఇట్లుంటె ఎట్లనే, కాసింత కండ పట్టాల్న అన్నవ్”, మరిప్పుడు కండపట్టిన గదా, మంచిగొడ్తలేనే! “

ఔ గాని యక్కా! ఏమో మస్తు ముచ్చట్లుజెప్తున్నావంట గదా! మా పొరగాడు సెప్పిండు. గది యినంగానే ఉరుక్కొంట్టొచ్చినా. బత్తీ బంద్ అని మంచిగ చెప్పినవ్ గానక్కా! మొన్నోపాలి నా పొరగానినికి వొల్లెచ్చబడిందే!
“దవఖానకి పో బిడ్డా! ” అంటే

“నేంపోను తల్లో ! సర్కారు దవఖానకు”, అని ఎర్ర గోలీ తెమ్మన్నడు.

పొరగానికి కాబట్టి గోలీ యేసినా! మరి భూమి తల్లికి వొల్లెచ్చబడితె ఏమి గోలీయేస్తామక్కా?

పెద్దోళ్ళకాడ పనిజేసుటకు యెల్లిన. అక్కో! అక్క! యేమి ఇల్లక్కా, పాత సైన్మ మాయాబజారు లెక్క గొడ్తుంది. గడప, గడపకి ఓక టి.వి పెట్టిండ్రు. దినాము ఒకటే మోగుడే, మోగుడు, ఇగ వంట గదిలో బర్రుమని సప్పుడే సప్పుడు! అన్నము కూడా చివరాకరికి కరెంటే వాడ్తారక్క. ఆ సప్పుడికి నా చెవులు సిల్లులు పడినాయక్క. గట్ల సుకపడ్డోల్లకి, కట్టం తెలేదక్క, కట్టం చేసే మనలాంటొల్లకి సుకం యిలువ తెలుస్తాది. మందేముంది అక్కా! ఓ గడప, ఓ బల్బు, గంతే గద. భూమి తల్లి ఆడ పెద్దోల్ల ఇంటికాడ కన్నా మనదగ్గిర సల్లంగుంటుందక్క.

“బాబులు! బాబులు! ఓ పాలి , ఓ గంట బల్బులన్నీ బంద్ చేసి, భూమి తల్లిని సల్లంగ సూసుకొండని” పెద్దొల్లకి జెప్పాల్నక్క.

అమ్మతో పనికెల్లేకాడినుండి, లాంతరు దీపాలే కదనే. ఇగ పోర్గాల్లు యీది దీపం దగ్గర సదూకుంటరు. మనకి దీపమున్నఒకటే, లేకున్న ఒకటే.

ఇంటిలో, మోంబత్తీ యెలిగించి, గా భూమి తల్లిని సల్లంగయ్యెల జేస్తాము. మరి, గా రోడ్డు మీద దినమంతా తిరిగే బస్సులను, కార్లను ఎవరాపుతారక్క? ఆడ ఆ రాసుడుకు మరింత యేడెక్కదా తల్లి?

గందుకే నీ మరిదికి ముందే జెప్పిన అక్కా! ” జర ఒకదినాం లేద రెండు దినాలు బండి నడపడం గిట్ల నిలుపుజేమంటే యినుకో బత్తీ బంద్ లెక్క ” అని, మంచిగా మనూర్లో అయితే యడ్లబండి మీద యెల్లోటొల్లము గదే. అంతా మారిపోయినాదక్క! అందుకే భూమి తల్లికి బరూవనిపించినాది. బాద పడలేకనే యేడి సేసినాదక్క.

“నీ మరిదా అక్క! మంచిగున్నడు, నన్ను మంచిగ సూసుకొంటుండు. నెలకో కోక తెస్తడు.”

“గదేందక్క? పేరు మర్సినావే? గట్ల అడుగుతుండావు?”

జరంత సిగ్గుగుంది గాని “సెంద్రన్న” నేను యెన్నెలనయితే ఆడు సెందురుడు, ఇగ మాకు బల్బెందుకక్క?

నువ్వన్నట్లు జూను 15 కాదక్కా! ఏ దినాము మా ఇల్లల్లో బాల్బులు ఎలగవు, మోంబత్తి యెలుగులోనే కూడు తింటము, సక్కంగా ఆరు బయట నులకమంచం యేసితినా, మబ్బులసాటుకు యెల్లే ఆ సందురిడికిమల్లే, ఈ యెన్నెల సాటుకు గీసందురుడొచ్చెస్తాడక్కా! ఇగ బల్బుల పనేమున్నదే మాకు.

గీ బత్తీ బంద్ యిసయం పెద్దోల్లకు జెప్పల్నే. టి వి లు కట్టుండ్రి , అన్నం గిన్నెలో వండుకొండ్రి, మన తల్లిని బద్రంగ జూసుకొండ్రి అని.

“ఔ అక్కా! బావెట్లున్నడే? గప్పుడు బోనాల్కి లబ్బరు గాజులు తెస్తనన్నడు, తేకనేపొతి. జర్రంత యాద్ జేయి. నే పోత అక్కా నీ మరిదొస్తాడు, నే ఇంట లేకపొతే ఆగమాగం జేస్తడు.

ఎట్లుందక్క ఈ సలవద్దాలు? నీ మరిది తెచ్చిండు, “ఎండలో అక్కిల్లంటూ పోతున్నవ్, కల్లకెట్టుకో” అని, ” మంచిగొడ్తున్నాన్ అక్క ఈ అద్దాలల్లో? “

ఎండలో కల్లు యేడిజేస్తాయని చలవద్దాలు, ఒల్లు సల్లబడడానికి, మెత్తని కోకలు అనుకొంట, మన బాగు సూసుకొంటున్నం మరి, యేడిజేసే ఆ తల్లి ని గురించి జరింత సూసుకొంటే మంచిగుంటదక్క.

నేజెప్తాలే అక్కా! మనింటి కాడ చుక్కమ్మ, రత్తమ్మ, సమ్మక్క, సారక్కలకి జరింత మంచి సేద్దం రండ్రి అని, జూను పదియేను, ఏడుగంటల నుండి ఓ గంట కదనే. దగ్గరుండి ఆపు జేయిస్తానక్క.

మరి ఉంట అక్క నేను, ఔ అక్కా ! మామిడి కాయ తొక్కు బెట్టినావంట కదనే! పొరగాడు జెప్పిండు, జరంత ఈయరాదే! సేపల పులుసు జేసిన, మామిడి ముక్క నంజుకొంటూ జల్సా జేసుకొంటాడు నీ మరిది.

ఉంట అక్క! ఇదిగో మంచి ముచ్చట్లు జెప్పేముందు “సెల్లీ! యెన్నలా!” అని బిలిచినవనుకో, ఉరుక్కొంటొస్తా.

భూమితల్లీ జర భద్రం తల్లీ! సల్లంగ ఉం(సూ)డాల!

***

Loading...