1.17.2010

బెస్ట్ బ్లాగు పోటిల్లో నా బ్లాగు... ఒకసారి ఇటు చూడండి...

ఏవిటో పండగపూటా హాయిగా బొబ్బట్లు చేసేసుకుని తినేసి బ్రేవ్ మని త్రేంచేశి.. నిద్రపోయా.. లేచి నా బుల్లి బ్లాగులో డైరీ రాసెద్దామని తెరుద్దును కదా ఇదిగో ఇలా నాకో మెయిల్ వచ్చేసింది.. చూసేయండి మీరు కూడా.. మరి అటోసారి వెళ్ళి నాకు(నా బ్లాగుకి) ఓటు వెస్తారా?

Dear Blogger,

Thanks a lot for the blogger community for participating in Best Blog 2009 Contest. We got very good response and it took a while for our panel to carefully review and select top 10 finalists. Our panel has given importance to clarity, subject and popularity. Following are top 10 Finalists. We ask our visitors to select their choice from January 15 2010 to January 31 2010. Our OPINION POLL section in the main page will display the top 10 bloggers names for the voting.

1. SIVARAMAPRASAD KAPPAGANTU (http://saahitya-abhimaani.blogspot.com/)
2. Rama (http://sumamala.info)
3. Manjusha N (http://nenu-naa-prapancham.blogspot.com)
4. Jagadeesh Reddy (http://saradaa.blogspot.com)
5. Kiran Yalamanchi(http://nishigandha-poetry.blogspot.com)
6. PHANI MADHAV KASTURI (http://funcounterbyphani.blogspot.com)


ఇప్పుడు ఈ పది బ్లాగుల్లో ఉత్తమమయిన వాటి కోసం సందర్శకుల అభిప్రాయం అడుగుతున్నారు. మీకు నా బ్లాగ్ నచ్చినట్లయితే, http://www.andhralekha.com కు వెళ్ళి అడుగు భాగంలో వున్న Opinion Poll కి వెళ్ళి, నాకూ(కే) మీ vote ప్లీజ్....

1.13.2010

13/01/2010

చిన్నప్పుడు అంటే మా తమ్ముడు 9వ తరగతి చదువుతున్నాడనుకుంట, అప్పటికి వాడిపై స్నేహితుల ప్రభావం ఎక్కువుందని చెప్పొచ్చు. అన్నయ్యేమో ఢిల్లీలో చదుకోడానికని వెళ్ళాడు. తమ్ముడికి స్నేహితుల ప్రభావం వల్ల , అమ్మ కుట్టించే బట్టలు ఇష్టం ఉండవు అలాగే ఏమి కొన్నా అడ్డుపెట్టేవాడు, నాకొద్దు నాకు నచ్చలేదు అని.. అలా ఓసారి ఏదో పండగకి వాడు కొత్త బూట్లు కొనుక్కొచ్చుకున్నాడు, అమ్మ కొనిచ్చినవేవో నచ్చలేదని, అప్పట్లో వాటి ఖరీదు 900 పై మాటే. 900 అంటే 1980 లో మామూలు మాటలు కాదు మా బడ్జెట్ ప్రకారం. అమ్మకి 300 .. 400 ఫింఛను వచ్చేది. అక్క సెలవలని ఏదో టీచర్ ఉద్యోగం, నేను స్కూల్.. ఇలాంటి పరిస్థితుల్లో వాడు అంత ఖరీదు పెట్టి ఆ బూట్లు కొనుక్కోడం ఇద్దరికి (అక్కకీ, నాకు) కోపం వచ్చేసింది. మర్నాడు తమ్ముడు ఇంట్లో లేని టైం చూసి, ఆ బూట్లు బాలేదనో మరి సరిపోలేదనో ఆ షాప్ వాడికి ఇచ్చేసి డబ్బులు తెచ్చేశాము (అంతకు ముందే మాములుగా అడుగుతున్నట్లు ఎక్కడకొన్నాడో తెలుసుకున్నాము కాబట్టి... తెలిసిన షాప్ అతనే అవడం కాస్త సులవయ్యింది) వాడు ఇంటికి వచ్చాక , మా ఇద్దరిమీద విరుచుకు పడ్డాడు, ఏడ్చేశాడు, అయినా కరగలేదు డబ్బులు ఇవ్వలేదు. ఇప్పటికి తమ్ముడా విషయం గుర్తుపెట్టుకుంటాడు, మా బాబు తో కూడా "మీ అమ్మావాళ్ళు ఇలా చేశార్రా.. మీరు మటుకు నాలా ఊరుకోవద్దు అని ఉపదేశాలు కూడా చేస్తూ ఉంటాడు :-) " . ఇప్పటికి వాడే బూట్లు కొనుక్కున్నా "ఎలా ఉన్నాయక్కా " అని అడుగుతాడు కాని అవి ఎంతో చెప్పడు, భయం అని కాదు (ఇప్పుడు చెప్పినా మేమేమి చెయ్యలేము కూడా వాడి సంపాదన :-) ) కాని ఎందుకు అనవసరంగా అని ఒకసారి ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళొచ్చేస్తాడు "అప్పుడు..అలా .. మీరు.... అంటూ" సరదాగా నవ్వేసుకుంటాము. ఇదంతా ఈరోజు ఎందుకు గుర్తొచ్చిందంటే.. అక్క , అక్క బాబు వచ్చారు ఈరోజు అరిసెల ప్రహసనం చెప్పానుగా. "బూట్లు ఇంట్లో వదులుతా పిన్నీ.. బయట వద్దు వర్షం వస్తోంది పాడయిపోతాయి " అని "సరే" అని సాధారణంగా అన్నాను కాని, "జాగ్రత్తే బాబు అవి ఇంతా ఖరీదువి" అని అక్క అనేసరికి నిజం చెప్పొద్దు నా గుండె ఆగినంత పనయింది .. అక్కా నేను ఒకేసారి తమ్ముడు బూట్లు ఇచ్చేయడం గుర్తు చేసుకున్నాము. "అప్పుడంటే అలా తిరిగి తీసుకున్నారు కాని ఇప్పుడు తీసుకోరే బాబు.. వీడేమో కొనేశాడు " అని అక్క. మా ఒక నెల ఇంటి అద్దె.. ఎందుకో అనిపించింది ఎంత ఖరీదయినా వాటిని కాలి కిందే తప్పితే మంచం మీద పెట్టలేము కదా... మా తమ్ముడు అంతకన్నా ఎక్కువే పెడ్తాడు, ఇక రేపు మా బాబు కూడా, అంత ఖర్చు చెప్పులకి అంటే నా పాతకాలపు ఛాదస్తపు మనసు ఉస్సూరుమంటోంది. (బంగారమయితే అలా పడి ఉంటుంది) ఒక 6 నెలల తరువాతో, ఇంకో సంవత్సరం తరువాతో మార్చేసే వీటికి ఇంత ఖరీదాఆఆఅ ఎమో... జిహ్వకో రుచి, పుఱ్ఱె కో బుద్ది.

భోగి పిండివంటలతో ఈరోజంతా గడిచిపోయింది. అరిసెలు, బొబ్బట్లు , కొంచం జంతికలు మా పిండివంటలు ఈసారి.
అందరికీ భోగి శుభాకాంక్షలతో..
*****

జీవితంలో పోలిక తెలియనంత వరకూ పర్వాలేదు.ఒకసారి పోలిక తెల్సిన తర్వాత లభ్యమయిన దానికన్నా అలభ్యమయినదే బాగుంటుంది. అందీ అందకపోడంలో ఉన్న అందమే ఆకర్షణై బలమయిన తపనగా మారుతుంది. కదా...




1.10.2010

10/01/2010

"నాన్న" బ్లాగులో అరెసెల కత చెప్పి నోరూరించేశారు. అరెసెలు పత్తి పని , భోగి రోజు చక్ర పొంగలి, సంక్రాంతి బొబ్బట్లు, కనుమ గారెలు అని ఫిక్స్ అయి ఉన్నాము, తీరా చూస్తే ఇక్కడ అరిసెలు గట్రా చెప్పేసారు సరే మెన్యూ లోకి అరిసెలని చేర్చెసాను. చేర్చడం "విజ్జీ" :-) కాని చేయడం?? అనుకొన్నదే తడవుగా ఈనాడులో కూడా "ఒహొరె అరిసెలుల్లా" అని వ్యాసం, ఇంక లాభం లేదు అరిసెలు తినాల్సిందే అని కఛ్చితంగా నిర్ణయించేసుకుని, అక్కా!! .. అమ్మా !! అంటూ సెల్ కి పని చెప్పాను, ఇద్దరినుండి తలో చెయ్యి వేస్తాము చేసేసుకుందామని గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. హమ్మయ్య అని అరిసెలు తినేసినంత సంబరం వచ్చేసిందంటే నమ్మండి.. సంబరం అరిసెలకనే కాదు..

అప్పట్లో... అసలు సాధారణంగా పండగ అంటే హడావిడి మా ఇంట్లోనే ... జనవరి నెల మొదట్లోనే "కాంతమ్మగారు మైసూర్‌పాక్ చేసిపెట్టండి", " కాంతమ్మగారు కాస్తా ఈ మెంతులు బాగు చేసి ఇవ్వండి" , "కాంతమ్మగారు ఈ పిండివంటలో ఇంత చక్కెర సరిపోతుందా " అంటూ ఇరుగుపొరుగు అమ్మకోసం చేసే సందడితో , పండగ హడావిడితో, నెల ముందు నుండి ఇల్లు కడుక్కోడం , ఇత్తడి సామాన్లకి బంగారు పూత వేసినట్లుగా తోమడం, బాయ్‌లెర్ ప్రహసనం, ఎంత హడావిడిగా ఉండేదో మా ఇల్లు. అలాంటిది ఇప్పుడు ఉద్యోగాలు, ఎదో కాస్త పులిహోర పరవాన్నం చేసుకుని పండగలు అయ్యాయి అనిపించేస్తున్నారు, అలాగే పండగలకి కుటుంబ సభ్యులు కలవడం అనేది తగ్గిపోయింది. సెల్ ఫొన్ శుభాకాంక్షలు, కలిసి చెప్పుకునే శుభాకాంక్షలని అధిగమించాయి మరి ఈ సంధర్భంలో ఇలాంటి పిండివంటలకోసమంటూ మళ్ళీ నలుగురూ కలవడం... "అరిసెలు ఒక్కటే కాదే.. బొబ్బట్లు కూడా" చేసేసుకుందామనుకోడం... పండగంటే ఇలా ఎక్కడెక్కడో ఉన్న అందరం కలవడమే కదూ.. :-)
****

ఒక మాట...ఒక స్పర్శ..స్నేహపురస్కారంగా ఒక సానుభూతి..మనిషి మనిషికీ మధ్య ప్రేమా, ఆప్యాయతా, కరుణతో కంటినిండా చిప్పిల్లిన నీళ్ళూ మనసునిండా సంతృప్తి...విషాదానికీ ఆనందానికీ తేడాలేకపోడం...ఇంతకన్నా ఏమి కావాలి జీవితానికి? డబ్బు,పదవి,రికమండేషన్లు మెటీరియలిస్టిక్ దృక్పధం...రోజువారీ జీవితం...మనిషి మనిషికీ మధ్య ఉండే బంధంతో పోల్చుకుంటే ఇవి ఏపాటివి?

****



1.09.2010

09/01/2010

అనుకోకుండా ఒక బ్లాగరుతో జరిగిన చర్చ.. ఒక కొలిక్కయితే రాలేదు కాని, సారాంశం మటుకు ఇలా తేలింది. మాములు చిన్న చిన్న పదాలతో అర్థాన్ని జోడించి చదవగలిగేలా చేసి రాసేదే నిజమయిన రచన. పెద్ద సంస్కృత పదాలు ఉపయోగించి, రాసే రచనలు పెద్దగా ఆకట్టుకోవు, వాళ్ళు ఆయా భాషలలో ఉద్ధండులు అని తెలుస్తుంది తప్పితే లోతుగా చదివితే అందులో గొప్ప సందేశమంటూ ఏది ఉండదు అని...

ఒక మనిషి ఇంకో మనిషికి ఎలా నచ్చుతారు .. అంటే ఏది బేస్ చేసుకొని? హాస్టల్ కి సంబంధించి ఒకావిడ ఆఫీసుకి వచ్చారు. "వైజాగ్ వెళ్తున్నాము మేడం " అంటూ.. నాకావిడ మాములుగా కనిపిస్తారు కాని ఆవిడ కలక్షన్స్, చేతులకి, చెవులకి, మెడకి వేసుకునే నగల సెట్ భలే నచ్చుతాయి.. ఒక్కోసారి మాచింగ్ ఒక్కోసారి వెరేవి.. ఒకసారెప్పుడో అన్నాను ఉండబట్టలేక "ఎక్కడ కొంటారండీ మీరు భలే ఉంటాయి" అని.. బాగున్నాయన్న మాటకే ఒక సెట్ నాకిచ్చెసారావిడ.. ఖరీదయినవి అలా తీసుకోకుడదు.. అమ్మ నేర్పిన మర్యాద అందుకనే వద్దు అన్నా "నాతో ఎమన్నా పని ఉందా ఇలా ఇచ్చేస్తున్నారు" చిన్న చురక... :-) "అయ్యో లేదండీ, నాకెందుకో మీరు నచ్చుతారు ఆ అభిమానంతోనే ఇస్తున్నాను" అని సమాధానం.. నిజమే నిజానికి నాతో అవసరమేమి లేదనే చెప్పాలి.. డబ్బుకి సంబంధించిన వరకు ఎకౌంట్స్ డిపార్ట్మెంట్.. మిగతావాటికి మిగతా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మరి నాతో ఏ అవసరం లేకుండానే కేవలం అభిమానంతో ఇచ్చే బహుమతులు.. అందుకే అసలు ఒక మనిషి ఇంకో మనిషికి ఎలా నచ్చుతారు.. మనసా? మాటా? బౌతికమైన శరీరాకృతి, డ్రెసింగ్ మొ... ఏది బేస్ చేసుకోవచ్చు?

ఇలా ఆలోచిస్తూ ఏదో బ్లాగు చదువుతూ సదర్ బ్లాగరు/బ్లాగరి శైలి తెగ నచ్చేసి మీరు చాలా బాగా రాస్తారంటూ ఒక లేఖ రాసేసాను. రిప్లై???? ఎమో!! నాకు వారి రచనలు నచ్చాయి కాని, నేను వాళ్ళకి నచ్చాలని రూల్ లేదు కదా.. చూద్దాము. :-)

*****

స్నేహితులు లేని మనిషిని విశ్వసించకు. ...... అవునా ????




ఇది చూడండి..

Pranav Mistry: The thrilling potential of SixthSense technology


1.08.2010

08/01/2010..No special..

శుక్రవారం.. అందరూ వీక్ ఎండ్ మూడ్‌లో ఉంటారు. మా బాస్ ఎమో వాళ్ళ స్నేహితుడేదో కంపనీ కొనాలటా యమార్జంట్గ్‌గా దాని తాలుకూ వివరాలు కావాలని, ప్చ్.. పండగలు దగ్గరపడ్తున్నాయి. పిల్లలికి బట్టలు కొనాలి, ఇదంతా ఆలోచిస్తూనే, సదరు కంపనీ సెకరెట్రీకి ఫోన్ చేశాను. సరిగ్గా షాపింగ్ టైంకి అంటే సాయంత్రం 5 గంటలకి అప్పాయింట్మెంట్ .. వెళ్ళక తప్పుతుందా.. షేర్ వాల్యు, పేయిడప్ వాల్యూ, కాంప్లైయన్స్ ఇవన్నీ బేస్ చేసుకుని ఉంటాయి కంపనీ రేట్స్ అని మొత్తం చెప్పేసరికి అక్కడే టైం అయిపోయింది.. ఈసురోమంటూ ఇంటికి రాగానే, పిల్లలు ఇద్దరు బేల మొహం.. అమ్మా పండక్కి బట్టలు.. అంటూ..నిజంగానే కోపం వచ్చింది, అర్థం చేసుకోరు అని, కాని ఎమంటాను, అప్పటికప్పుడు వాళ్ళని బయల్దెరదీసి ఆ బట్టలేవో కొని వచ్చేసరికి ఈ శుక్రవారం కాస్తా ఉస్సూరుమంది ఏ ప్రత్యేకతా లేకుండానే.

ఈ సంధర్భంలో ఒకటి మటుకు చెప్పొచ్చు, కొత్తగా పాటల రచయిత పరిచయమయ్యారు, నన్ను ఈ పదాలు ఇక్కడ వాడొచ్చా.. ఇంకేమన్న పదాలు మారతాయేమో చూడండి అంటూ అడగడం ముదావహం.
****

ఆనందాల్ని కొలిచే సాధనాలు లేనట్టే అసంతృప్తిని కొలిచే సాధనాలు కూడా లేవుట.. అవునేమో కదా

*****



1.06.2010

06/01/2010

ఉద్యోగం పురుష లక్షణం... హ ..హ .. ఎందుకో ఈ మాట అసలు నిజమేన అనిపిస్తుంది. మా అపార్ట్మెంట్లో ఒకాయన నన్ను పలకరిస్తూ నా సమాచారాలు తెలుసుకుంటూ ఉంటే "మీరేమి చేస్తారండి " అని అడిగాను. "ఏమి లేదండి, మా అక్కయ్య మానసికంగా ఎదగలేదు చూసుకోడానికి ఎవరు లేరు అందుకని ఏమి ఉద్యోగం చేయడంలేదు" అని... సమాధానం. ఏమి చెయకుండా వెనకా ముందు ఆస్తిపాస్తులు లేకుండా ఎలా వీళ్ళు సంసారాన్ని , ఈ భవ సాగరాన్ని ఈదుతారు? ఇక్కడనే కాదు, మా చుట్టాల్లో కూడా చాలామంది నాకు తెలిసినవాళ్ళు ఏ ఉద్యోగం లేకుండానే గడిపేస్తూ ఉంటారు .. ఎలా వాళ్ళు కాలం వెళ్ళబుచ్చుతారో నాకర్థం కాదు. ఇద్దరం ఉద్యోగం చేస్తుంటేనే 5 రూపాయల అప్పు పుట్టడం కష్టం ..(మాకని కాదు) కాని, అసలేమి చేయకుండా తెగ అప్పులు చేసెసి ఇంటిని అలకరించుకోడంవల్ల సుఖమేంటి? నాకు పెళ్ళయినప్పటినుండి నాలో తొలుస్తున్న ప్రశ్న ఇది. ఏమో! చెప్పలేము వీళ్ళకేమన్నా లంకె బిందెలు దొరుకుతాయని నమ్మకమేమో అనిపిస్తుంది.. :-)

సరే.. ఆయన అలా అన్నారు కదా అని, " అకౌంట్స్ అవి బాగా వస్తే .. మీకు ఉద్యోగం చూడడం పెద్ద సమస్య కాదండి, నేను చూస్తాను" అన్నా... "లేదండి నాకు బి పి ... షుగర్ అవీ ఉన్నాయి ఎదో ఆవిడ చేస్తోంది కదా కాస్త పిల్లలు ఎదిగేవరకు.. ఇలా తప్పదు " అన్న సమాధానం... :-) ఆవిడ అదేదొ చిన్న స్కూల్ లో ప్రైమరీ టీచర్.. మహా అయితె 3,000/- ఇస్తారేమో.. ఇంకా స్కూల్ కెళ్ళే పిల్లలు.. మరి ఆ ధీమా ఎంటో? ప్చ్.. నాకర్థం కారు ఇలాంటి వాళ్ళు.
****

అన్నీ కోల్పోయినప్పటికీ,జీరో బేస్డ్ స్థాయి నించీ జీవితాన్ని మొదలెట్టచ్చట.. అవునంటారా?

****


1.05.2010

05/01/2010

ఆఫీసులో పనిలో ఉండగా ఇంతకు ముందు నేను చేసిన ఆఫీసునుండి.. స్నేహితురాలి ఫోన్. "మీరిక్కడ ఎలా ఉన్నారో అలాగే ఉన్నారండి ఏమి మారలేదు. ఆర్కుట్‌లో మీ బ్లాగు చూసాను .... బ్లాగంతా ఈరోజే చదివాను" అని, మనకి సంబంధినది ఏదయినా ఇంకొకళ్ళు ఆసక్తితో గమనిస్తున్నారు అన్న విషయం మనకె తెలిస్తే ఆ ఆనందం వేరు కదా. అందునా పరిచయస్థులు, స్నేహితులు, ప్రముఖులు మొ! అని తెలిస్తే ఆ అనుభూతి చెప్పలేము. అదే ... ఆ సంతోషమే నాకు కలిగింది. మా మాజీ కొలీగ్ ఎప్పటికీ స్నేహితురాలు అయిన ఆవిడ ఫోన్ చేసి " చదివాను, మిగతావి ఎలా చదవాలి" అని అడిగితే చెప్పాను కూడలి గురించి.

ఇహ ఈరోజు బ్లాగు విహరణలో భాగంగా అనుకోకుండా కంట బడిన ఒక కామెంట్‌కి నా ఆలోచనలు....మీతో పంచుకుంటున్నా ఇలా...

సహొద్యోగులుగా ఉన్నప్పుడు పని విషయంలో అపార్థాలు, గొడవలు, మళ్ళీ కలిసిపోడాలు అవి సహజం అయినా దూరమయ్యాక "నాకు తెలుసు మీరు మీరు మమ్మల్ని మర్చిపోయారు" అంటూ ఫోన్ చేయడం అనేది స్నేహం గొప్పదనం. అప్పుడెప్పుడో అపార్థాలు వచ్చాయి కదా అని అవతలి వాళ్ళు చెడ్డవాళ్ళు ఎలా అవుతారు అన్నది నా అనుమానం. అలాగే మంచి వాళ్ళు కారు అన్న కంక్లూషన్ ఎలా వచ్చేస్తుంది? ఒకళ్ళకి మంచి అన్నది ఇంకొకళ్ళకి చెడు, అంతేకాని మనిషిని మంచివాళ్ళు కాదు అనుకోడం ఎంత అసహజంగా ఉందో కదా!

నేను సికింద్రాబాదులో ఉద్యోగం చేసేప్పుడు అనుకోకుండా పరిచయమయిన బస్ పరిచయం ఎంతటి సన్నిహిత స్నేహమయ్యిందంటే, నాకు కుదరక ఫోన్ చేయలేకపోతే, "మీరు మానేయండి చేయడం నాకు మాట్లాడాలనిపించినప్పుడు నేనే ఫోన్ చేస్తాను... నాకు మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు నేనే మీ ఇంటికి వస్తాను" అని .. ఈరోజు వరకు అంతే స్వచ్ఛంగా ఉంది... ఆ స్నేహం. మా ఇద్దరికి కోపాలు వస్తాయి, " ఎప్పుడూ నేనే ఫోన్ చెయాలా" అని ఒకసారన్నా ఆవిడ అనుకొనే అవకాశాలు ఉన్నాయి కదా.. అలాగే అర్జంట్ పనిలో ఉండి ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, నేను అపార్థం చేసుకొనే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి.. ఇలాంటి అపార్థాలకి, అనుమానాలకి, కోపాలకే స్నేహం విడిపోతుంది అనుకుంటే అసలు అది స్నేహం ఎలా అవుతుంది? అపార్థాలు, అనుమానాలు కోపాలు వచ్చి వెళ్ళిపోయినవాళ్ళు.. మనకి చాలా సన్నిహితులయి, నచ్చడమంటూ జరిగితే ... వాళ్ళ వల్ల మనం చాలా ఆనందంగా ఉన్నాము అని అనిపిస్తే , వెళ్ళేవాళ్ళని ఆపలేమా? కోపాలు , అపార్థాలు ఎందుకో తెలుసుకోలేమా? అనుమానాలు తొలగించలేమా? ఇవేవి చెయకుండా వదిలివెళ్ళిపోయే స్నేహితులు చెడ్డవాళ్ళని , వెళ్ళీపోయి పాలు పోసారని ముగింపు హాస్యాస్పదం కాదా..

ఇకపోతే నేను చదివిన కామెంట్... :-)

“అలిగో కోపగించో అపార్ధం చేసుకునో దూరమైపోయిన మిత్రులు కొందరు తొలగిపోగా…”
....

comment

"వాళ్ళు నిజమైన స్నేహితులు కారని తెలుసుకొని ,మీ నెత్తిన వాళ్ళు పాలు పోసారని సంతోషించండి. ......."


****

మనకి దూరమైన వాళ్ళు.. మనకి నచ్చినవాళ్ళయితే అపార్థాలకి, కోపాలకి, అలకలకి కారణాలు తెలుసుకొని స్నేహాన్ని నిలుపుకుంటాము వాళ్ళు స్నేహితులవుతారు... ఒకవేళ దూరమయినవాళ్ళతో ఏదో మన కాలక్షేపం కోసమో, లేక ఎదన్నా ఫలితం ఆశించో పరిచయం చేసుకుని ఉంటే దూరమయ్యారన్నది మిత్రులు అవరు , వాళ్ళ వల్ల ఉపయోగం లేకపోవడంవల్ల వదిలి వెళ్ళిన ఒకప్పటి పరిచయస్థులు అవుతారన్నది నా అభిప్రాయం. కాబట్టి మనము కూడా పోనీలే వెళ్ళిపోయారని వదిలేస్తాము కారణాలు తెలుసుకొనే అవసరం/అవకాశాలు లేక... :-)

******

ప్రతీ సమస్య వల్లా మనకి ఏదో ఒక లాభం ఉంటుంది. కనీసం అనుభవం వస్తుంది. .... కదా!!!


1.04.2010

04/01/2010

మళ్ళీ రొటీన్ ఆఫీసు, పిల్లల స్కూల్ హడావిడి. పొద్దున్నే టిఫిన్ చేస్తే పాప "ఈ టిఫిన్ మటుకు చెయకమ్మా ఇంక" అంటుంది. "ఏరా ఎందుకు " అంటే "అమ్మమ్మకి అసలు ఇష్టం ఉండదు, నేనున్నానుకుందా లేదా మీ అమ్మ! అని అడుగుతోంది వద్దంటే మానేయొచ్చు కదా.." అని, "ఎందుకు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఏమి పర్వాలేదు చెయ్యి " మావారి హుకుం..

ఇంతకీ టిఫినేమి చేశానో చెప్పలేదు కదా.. గారెలు,అల్లం పచ్చడి.... చేయకూడదంటారు కాని ఏమి చేస్తాము జిహ్వచాపల్యం..... చేసుకోవాలనిపిస్తుంది. :-)

ఆఫీసులో అంతా మాములే.. నా పని నేను చేసుకుని ఇంటిదారి పట్టాను. ఆఫీసు , ఇంటికి దగ్గర్లోనే అని ఈ మధ్య బస్‌ప్రయాణం మార్చి ఆటోల్లో వెళ్తున్నాను. 5 నిముషాలలో ఇంటికి వెళ్ళేట్టుగా...ఈరోజు ఇంట్లో ఏమి హడావిడి లేదు.. "మీ మరదలు లేదు నేను ఒక్కదాన్నే ఉన్నాను పిల్లలు ఇక్కడుంటారులే" అని అమ్మ అంటే .... "సరే " అని ఒప్పేసుకున్నాను. అందుకని కాస్త నింపాదిగా వెళ్ళొచ్చని బస్ ఎక్కాను. ఇహ మొదలు హైదరాబాదు సంగతి చెప్పేదేముంది? ట్రాఫిక్.. పావుగంటలో ఇంటికెళ్ళాల్సినదానిని 45 నిముషాలు పట్టింది. ఇంటికెళ్ళేసరికి శ్రీవారు కాఫీతో కుస్తీ పడ్తున్నారు... వెళ్ళగానే వేడి వేడిగా నాకూ అందిస్తూ.... చాలా రోజుల తరువాత ఇద్దరం.. కబుర్లు చెప్పుకుంటూ కలిసి వంట చేసుకున్నాము. అన్నిటికన్నా ఆనందమయిన విషయం అలా ఘంటసాలగారి పాత పాటలన్నీ వింటూ రాత్రి ఒంటిగంటదాకా తన్మయత్వం చెందడం. ఎంత చక్కటి అనుభూతి.. మా ఇద్దరి అభిరుచులు సాధారణంగా కలవవు కాని పాత పాటల విషయంలో మటుకు కలుస్తుంది. ఇద్దరం ఆ భావాల గురించి, అందులోని తీయదనం గురించి చెప్పుకుంటూ ఆ పాటల మాలికలని ఆస్వాదించాము.

ఈ పాటలన్నీ కూర్చి పేర్చి బహుమతి గా ఇచ్చిన శ్రీ నల్లమోతు శ్రీధర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. "సఖి" షూటింగ్‌లో పరిచయమయినప్పుడు.. "రేడియో ఇంటర్వ్యూలలో అన్నీ పాత పాటలే ఎంచుకుంటారు బాగుంటుందండి " అంటే "నాదగ్గిర పాతపాటల కలెక్షను ఉంది" అని అన్నారు శ్రీధర్ గారు. నాకు కాపీ చేసి ఇవ్వమని అడిగిందే తడవు వాటినన్నింటిని కూర్చి .. నిన్న ఆ పాటలు వినే అవకాశాన్ని ఇచ్చి మా ఇరువురికి ఒక మంచి అనుభూతిని మిగిల్చారు.
*****

జీవితమంటే గొప్ప త్యాగాలు,బాధ్యతలూ కాదు.చిన్న చిన్న ఆనందాలూ,కాస్త దయా,నిరంతర చిరునవ్వూ - అదీ జీవితం.......నిజమే కదా!


1.03.2010

03/01/2010

ఆదివారం హాయిగా పెసరట్టుప్మా చేసి పిల్లలతో పాటు తింటూ ఉంటే ఎవరో పెద్దాయన వచ్చారు ఇంటిముందుకి "జాతకం చెప్తాను" అని ... జరగాల్సింది ఎలాగు జరుగుతుంది, తెలుసుకోడంవల్ల ఉపయోగం లేదని నా అభిప్రాయం. అందుకే వద్దని చెప్పాను. ఆ వచ్చినతను తనలో తను ఏదో గొణుక్కుని వెళ్ళాడు వద్దన్నానని అసహనమేమో అనుకున్నాను కాని, మళ్ళీ ఎందుకో నన్ను చూడగానే అతనికేమన్నా అనిపించిందా , భవిష్యత్తులో జరగబోయేది ఏదన్నా ముఖ్యమైన విషయం చెప్పేవాడా ఒకవేళ నేను ఒప్పుకుని ఉంటే, అంటే అసలీ జాతకాలు నిజమేనా.. ఇలా ఆలోచించుకుంటూ ఉంటే నాకు గుర్తొచ్చింది ఒక ఆరేడు సంవత్సారాలముందు పరిచయమయిన వ్యక్తి.. మనిషి తెల్లగా , ఉంగరాల జుత్తు, నుదిటినిండా వీభూతి రేఖలు, తెల తెల వారుతుండగా పెద్ద పెద్ద అంగలతో గుడికి వెళ్ళిరావడం, అన్నిటికన్నా ముందు ఎదురుగుండా తెలిసినవాళ్ళు వెళ్తున్నా కనీసం పలకరింపు లేకుండా అలా తలవంచేసుకుని వెళ్ళడం.. అప్పట్లో ఈనాడులో అనుకుంట ఉద్యోగం... ఇప్పుడెక్కడున్నారో ఎలా ఉన్నారో.. భలే విచిత్రమైన వ్యక్తి ....

మా ఇంటి పక్కనే అద్దెకుండేవారు. వాళ్ళు ఆయన పేరేదో ఉంది వెంకటేశ్వర రావ్ అనుకుంట.. ఆడవాళ్ళంటే ఆమడదూరముంటారు ... మాకేమో తప్పదు ఇరుగు పొరుగు చూసుకుంటాము కారణం లేకపోలేదు. ఇద్దరం ఉద్యోగాలు కాబట్టి ఇంటి తాళాలు, మంచినీళ్ళు, గ్యాస్ సిలెండర్ ఇలాంటి అవసరాలకి వచ్చినవాళ్ళకి మా ఇంటి తాళం వెక్కిరిస్తూ ఉంటుంది కాబట్టి , పక్కింటి ఆసరా అత్యవసరం మాకు.(ఇప్పటికీ :-) ) అందుకే వాళ్ళు పలకరించకపోయినా పనిగట్టుకుని పలకరిస్తాను. ("వంటయిందా వదినా" అని కాదు :-) ) ఏదో విధంగా పలకరించాల్సిన అవసరం వస్తూ ఉంటుంది కాబట్టి .. మొదట నా పరిచయం చేసుకుని వారిని కుశల ప్రశ్నలు అడిగే మనస్తత్వం నాది. అలాంటి క్రమంలోనే నా పరిచయం చేసుకుంటేనే.... తనకి పట్టనట్లు తనని కాదన్నట్లు లోపలికి వెళ్ళిపోయాడీ పెద్ద మనిషి. ఇలా కాదని మళ్ళీ తలుపు తట్టి, "సారీ అండీ మేడం లేరా? ఆఫీసుకి వెళ్తున్నాను.. మా పిల్లలు 3 గంటలకు వస్తారు కొంచం తాళాలు .. అని అంటుంటే "ఆవిడ ఆఫీసుకి వెళ్ళారండీ " అని మొహం మీదే తలుపు భడాల్న వేసేసారు... నాకొచ్చింది చూడండి కోపం మరీ మంచీ.. మర్యాద లేదా మొహం మీదే అంత విస్సాటమా అని కూడా అనుకున్నాను. తరువాత తెలిసింది.. ఆయన అక్కడ ఈనాడులోనే చేస్తూ... ఇంటిదగ్గర జాతకాలు చెప్తూ ఉంటారని.. సదా ధ్యానంలో ఉంటారని, ధ్యానంలో ఉన్నప్పుడు నాలా ఎవరన్నా పలకరిస్తే ఆయనకి కోపం అని, అది అణుచుకోలేక అలా తలుపు వేసేయడంలోనూ.. తలొంచుకు చూడకుండా వెళ్ళిపోడం ద్వారాను కోపాన్ని ప్రదర్శిస్తారని.. నవ్వొచ్చింది అవి వింటుంటే.. ఎంత జాతకాలు చెప్పినా ఎంత దైవ భక్తి ఉన్నా మరీ సాటి మనుషులంటే పడకపోడం.. అప్పుడప్పుడు ఇలాంటి విచిత్ర వ్యక్తులు కూడా తారసపడ్తూ ఉంటారు అని అనిపించింది. ఆ తరువాత నాకు జాతకం చెప్తాను అని కొన్నాళ్ళు మా ఇంటికి తరచూ వచ్చేవారు కాని, జాతకాలంటే నాకు పెద్దగా ఆసక్తి లేకపోడంవల్ల వద్దని తప్పించుకునేదానిని. మరి అందుకే మా ఇంటికి రావడం కూడా తగ్గించారు..ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఎవరో జాతకం అనేసరికి అలా స్మృతి పదంలోకి ఆ జాతకాల వ్యక్తి మెదిలారు. ...
*****

" పుస్తకం మంచి స్నేహితుడు లాంటిది.అది చెప్పేది వినగలిగితే అంతకన్నా మంచి స్నేహితుడు తెలివైన వారు ఇంకొకరు ఉండరు. "


****

1.02.2010

02/01/2010

ఇంట్లో ఏదో నెట్ సమస్య వచ్చింది డైరీ కి ఆటంకం వస్తుందేమో అనుకున్నా ... రాసి పెట్టేసుకుంటే ఎప్పుడు నెట్ వస్తే అప్పుడు పబ్లిష్ చేయొచ్చని ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవు వర్డ్‌లో రాసేసుకుంటున్నాను చూద్దాము ఎప్పటికి పబ్లిష్ చేస్తానో?? :-)

శనివారం.. కొన్ని వ్యక్తిగత కారాణాల వల్ల ఆఫీసుకి లీవ్ పెట్టాను. పిల్లలికి సెలవులే .. ఇంట్లో ఉండడం వల్ల తెలిసిన విషయం బాబుకి స్నేహాలు ఎక్కువయ్యాయి. క్షణానికో ఫ్రండ్.. పిలవడం "అమ్మా ఇప్పుడే వస్తాను" అని బాబు వెళ్ళడం జరుగుతోంది. దీనికి నేను బాధ పడలేదు. కాని, ఇంటికొచ్చే ఫ్రండ్స్ కార్లో, బైక్‌లో వేసుకొచ్చేస్తుంటే వీడు రయ్యిన వెళ్ళిపోడం...వాడా లక్జరీ లైఫ్ కి అలవాటుపడితే .. అన్న భయం వేసింది. ఇప్పుడే కరెక్ట్ వయసు వాడిది. చదువునుండి పక్కదార్లు పట్టేస్తాడు అదే అన్నా వాడితో "రోజు ఇలాగె వెళ్తున్నావా?" అని.. "లేదమ్మా ఇప్పుడు హాలిడేస్ కదా.. " అని నాభయాన్ని పసిగట్టినట్లుగానే, "నువ్వేమి భయపడకమ్మా నేను స్కూల్ ఉన్నప్పుడు చదువుకోలేదా నేనేమి మారిపోను వాళ్ళంతా మంచి ఫ్రండ్స్. మంచే చెబుతున్నారు " అన్నాడు. ఏమో .. ఏమి మంచో.. నెమ్మదిగా చెప్పాను ఇది నాన్నా.. స్నేహితులని మంచి వాళ్ళని చూసుకోవాలి అని సలహా ఇచ్చాను .. ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ.. ఇలాంటి సమయంలో దేవుడు గుర్తొస్తాడు అదేంటో.. ఎందుకో అప్రయత్నంగానే భగవంతుడి ఫొటోని చేతితో కళ్ళకద్దుకున్నా బ్రహ్మానందం తరహాలో... "పిల్లలు జాగ్రత్తగా కాపాడమని" అని. భయమా? భక్తా? బాధ్యతా? ఏమో... భయంతో కూడిన భాద్యతలోంచి వచ్చిన భక్తేమో... ఎమో ఎమవునో .... ;-)
*****

" వ్యక్తిగత గెలుపే ముఖ్యం,సమాజాం,ప్రపంచం,చివరికి కుటుంబం, అన్ని తర్వాతే. తనని తాను గెల్చిన వాడే ఇతరులకి ఏమయినా ఇవ్వగలడు" .... అవునంటారా?

*****


1.01.2010

01/01/2010

కొత్త సంవత్సరం.. కొత్తగా ఏమి అనిపించలేదు నిన్న ఎలా ఉందో ఈరోజు అలానే ఉంది. ఇంట్లో కాలేండర్ మారింది, ఆఫీసులో సంతకం చేస్తున్నప్పుడు మటుకు డేట్ పొరపాటున 2009 పడ్తోంది రెండుసార్లు అలా జరిగిన పొరపాటు మూడో సారి జరగకుండా జాగ్రత్త వహించడం కొంచం కష్టమయ్యింది.
ప్రతీ సారి ఈ కొత్త సంవత్సరానికో, లేదా సంక్రాంతి పండగలకో నాకు గుర్తోచ్చేది మా అమ్మా వాళ్ళ ఇల్లు. పెద్ద వాకిలి.. సాయంత్రం 4 గంటలనుండే అమ్మ హడావిడీ ముగ్గెయ్యాలి అని.... కనీసం రవంత స్థలం కూడా ఖాళీ లేకుండా ముగ్గులు పెట్టండార్రా అని పోరేది . అన్నీ "ముగ్గులెందుకమ్మా " అని సరదాగా అనేసినా, రాత్రంతా ముగ్గులు ...రంగులతో .... నడుము పడిపోయినా, చేతులు కొయ్యబారిపోయినా ...అక్క నేను కలిసి ముగ్గులు పెట్టి , అందరికీ మా ముగ్గుల ద్వారా న్యూ ఇయర్ విషెస్ చెప్పి పడుకొనేవాళ్ళము. ఇప్పుడు ముగ్గుల సందడి అంత లేదు. ఉన్నా ఆ సరదా అంతా ఇక పిల్లలిదేగా.. :-)

కొత్త సంవత్సరానికి కొత్త నిర్ణయాలు తీసుకుంటారుట. ఏముంటాయి... నిన్నటిదాక ఎలా ఉన్నామో అలాగే ఉంటాము ఆర్థికంగా ఎదగాలి అంటేనో, దానికో నిర్ణయం తీసుకోడానికోఅయితే కొత్త సంవత్సరం అవసరమేముంది. మంచి నిర్ణయాలకి ప్రతిరోజు మంచిరోజే.

ఎదో మంచి నిర్ణయం తీసుకోవాలి .. అది ఒక ఆనవాయితి అని అంటున్నారు కాబట్టి ఈసారి నేను తీసుకున్న నిర్ణయం ఒక డైరి రాయడం.. ఇలా బ్లాగులో, అందుకే ప్రత్యేకంగా జనవరి మొదటినుండి కాకుండా 28 డిసెంబర్ నుండే ప్రారంభించాను. చూద్దాము, ఎంతవరకు నిర్విఘ్నంగా సాగుతుందో, మనసులో ఏదో అనుకుంటాను దానికి సంబంధించి రాద్దామనుకుంటూనే వాయిదా వేసెస్తాను తీరా కాస్త తీరిక దొరికి రాద్దామని కూర్చున్నప్పుడు అనుకున్న పాయింటు కాస్తా హుళక్కి. అందుకే ఆలోచన వచ్చిందే తడవు ఇక్కడ డైరీలా అమలు చేసేస్తున్నాను. ముఖ్యంగా రేపొద్దున్న నా పిల్లలకన్నా పనికొస్తుందన్న ఆలోచన అంతే. మన ప్రతీ ఆలోచనని లేదా మనగురించి ప్రతిసారి పిల్లలికి చెప్పలేము వాళ్ళే తెలుసుకుంటారు. రేపొద్దున్నఇవి చదువుకుని అమ్మ అలోచనలు ఇవి అని..

"ఒక మనిషి కష్టం లో ఉంటే ఆదుకోడానికి ప్రాణస్నేహమే అక్కర్లేదు,మమూలు స్నేహం చాలు,ఇంకా ఎదగగలిగితే మానవత్వం చాలు." ... నిజమే కదా.. :-)