5.02.2010

ప్రేమ లేఖ ...పెళ్ళి అయిన తరువాత :-) :-(

కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే...
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఊహలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో ఒహొ...
ఎంత బాగుంటుందీ పాట, వింటూ ఉంటే ఆ ప్రేమలో ..ఆ లాలిపాటలో హాయిగా లాహిరి ...లాహిరిలో అంటూ తేలిపోయి తూలిపోరు.

పొద్దున్నే ఇలా పాట వింటూ.... అసలిప్పుడు నేనెందుకు ఒక ప్రేమలేఖ రాయకూడదూ అని ఒక మాంచి(అవునా మంచిదేనా) ఆలోచన అలా అలలా పొంగి,.. నా హృదయంలో మురారి సినిమాలోలా గట్టి సంకల్పం అనుకుని ఒక కాగితం కలం తీసుకున్నాను.

వెంటనే స్ఫురించిన విషయం ఎవరికి రాయాలి? పెళ్ళి అయిపోయింది కదా..... "పెళ్ళయితే ప్రేమలేఖలెందుకు రాయకూడదు? " అని నా రెండో మనసు గట్టిగా గద్దించేసరికి, మొదటి మనసు రాజికొచ్చి "సరే" అని మా బుచ్చిబాబుకే ఈ ప్రేమలేఖ అని ఓటు వేసింది. ప్రేమికుడు రేడీ... ప్రేమలేఖకి నేను సిద్దం. కాని ఏమి రాయాలి.. మళ్ళీ ఆలోచన...
ప్రియాతి ప్రియమైన నీకు..

(సంబోధన బాగుంది... కన్న మనసుతో అయితే పిల్లాడికి పాలడబ్బాలు.. అమ్మాయికి ఆట సామానులు తెస్తారా తెచ్చారా అని అడగాల్సి వస్తుంది.. .. కన్నె మనసుతో అయితే... ) ....

కన్నె మనసు తొలిసారి విప్పి....
నీ కొసం కలం కదిలించి......

ఈ దీనురాలి హృదయఘొష .......
అర్దం చేసుకుంటావన్న నమ్మకం స్పందిస్తూ......
నువ్వు వస్తావన్న ఆశతో....

ఇంత ప్రేమ మా బుచ్చి బాబుకి ఎక్కడ అర్థం అవుతుంది, అందులో ఇక "నేను దీనురాలిని మీ పాద పద్మముల వద్ద కూసింత చోటు" అంటే రేపటినుండి నా నెత్తెక్కి కూర్చుంటారు , నువ్వే .... పాదాలు, చోటు అన్నావని.. అమ్మో వద్దులే ఇంత పైత్యం మనకొద్దు, హేవిటో ... ప్రేమగా ప్రేమలేఖ కూడా రాసుకోలేని జీవితం ఇది... ప్చ్..

పోని ఇలా రాస్తే..

ధనుర్మాసంపు రాత్రి నిదుర నన్ను కరుణిచక...
వెలి వేస్తే ... "చలి" కసి తీర్చుకుంటుంటే ....
కిటికి లోంచి తొంగి చూస్తూ అల్లరి చేస్తున్న వినువీధిలోని తారా శశాంకుడిని చూస్తుంటే ...
నువ్వే గుర్తు వచ్చావు... హు!!!! ఇక నిద్రకి నా దరి చేరే ధైర్యం ఎక్కడిదని ???

ఏంటా వెఱ్ఱి చూపులు?? పడుకొమ్మా.. ఆరోగ్యం పాడు కాదు""... అంటూ మొదట కసురుకుని చివరికి బుజ్జగించే అమ్మకేమి తెలుసు .... నా అలోచనలోని... నా కళ్ళలోని నీ రూపు గురించి.....

ఇది చదివితే బుచ్చిబాబు స్పందన ఎలా ఉంటుంది చెప్మా......

"ఏంటి నువ్వు నిద్రపోకుండా ఆలోచించడమా? నిద్రకి ఎంత ధైర్యం ఉండాలి నీనుండి పారిపోడానికి మర్చిపోయావా? మన పెళ్ళయిన కొత్తలో నీ నిద్ర, దాని పర్యవసానం"

"..... వా... :( "

ఇంత చక్కగా రాసినా ప్రతిస్పందన ఇలా వస్తుందా?? ప్చ్ ప్చ్.... కొంచం ఆవేశంగా ఆవేదనగా రాస్తే పడకుండా ఉంటారా..

చందమామని చూసినా .....
గండు తుమ్మెదని చూసినా......
గుడి గంట విన్నా...
జడ గంట కదిలినా....
మల్లె విరిసినా....
ఘంటసాల పాట విన్నా....
నువ్వే గుర్తు వస్తావు.....
నువ్వు వస్తావని...
ఘంటసాల కంఠంలో జాలువరే మాధుర్యమంతా...
నీ హృదయంలో వుందని.....
నీ కళ్ళలో తిలక్ కనిపిస్తాడనీ....
నీ అవేశంలో అవేదనలో చలం సాక్షాత్కరిస్తాడని ...
నీ కొంటె తనం లో నువ్వే దర్శనం ఇస్తావని...

నిజంగా తెలీదు... తెలిస్తే ఇంత ఆలస్యంగా కబురు పంపుతానా ??? ప్రియతమా...

తెలిసాక....

విశ్వనాధుని కిన్నెరసానిలా నీ గుండెల్లో నర్తించాలని.........
నండూరి వారి యెంకినై.....
ఉమర్ ఖయ్యం సాకీ నేనై.... నీ హృదయ సామ్రాజ్యాన్ని యేలాలని.....
నా ఆశలని ... ఆకాంక్షలని నీతో పంచుకొవాలన్న తహ తహ......
*******

"హల్లో, లేమ్మా లే... ... లేచి ఈ మందు వేసుకొండి ఉదయమే వెళ్ళిపోదురుగాని.." అన్న పిలుపుకి ఉలిక్కిపడి చూశాను ఎదురుగా తెల్ల డ్రస్ లో నర్స్.. ..

"ఏంటి నేనెక్కడున్నాను నాకేమయ్యింది"

"మధ్యాహ్నమంతా ఏదో ప్రేమలేఖలు, గుడి గంట, జడ గంట , బుచ్చిబాబు ఎలా రాయాలి అని కలవరిస్తుంటే మీకేదో పైత్యం చేసిందని మీవారు ఇక్కడ చేర్చారు, ఒక సిలేన్ బాటిల్, ఒక గ్లుకోజ్ బాటిల్, కాసిన్ని మందులు , ఇంకొన్ని టానిక్కులు వెరసి ఇదిగో బిల్, కట్టేసి రేపు ఉదయం వెళ్ళిపోవచ్చు... ఇవిగో ఇంకొన్ని మందులు ఇప్పుడొకటి... రేపు మళ్ళీ " అంటూ నర్స్ ఉవాచ

బిల్‌లో అమౌంట్ చూసిన నాకు ...మళ్ళీ పైత్యం... పెళ్ళయిన ప్రేమలేఖ ఎంత చేదో .... వాక్ :( ..... మాత్ర మింగుతుంటే తెలుస్తోంది . :-(
*****

ప్రపంచ నవ్వుల రోజు సంధర్భంగా సరదాగా రాసిన ఈ తవికల పైత్యం..
*****

4 comments:

 1. bagundi. nijamgane hospital lo unara idi kuda only imagination aa

  ReplyDelete
 2. :D బాగుందండీ మీ ప్రేమలేఖ. ఈ రోజు ప్రపంచ నవ్వుల రోజా? నాకిప్పటిదాకా తెలియదండీ..

  ReplyDelete
 3. స్వప్నా.... :-) థాంక్స్ అక్కడ(hospital లో) నా పైత్యాన్ని భరించేవారేవరు చెప్పండి, వాస్తవానికన్నా ఊహే బాగుంటుంది అని సరదాగా రాసాను.

  @విశ్వప్రేమికుడు గారు : థాంక్స్ అండి..

  ReplyDelete
 4. ఛాలా ఫున్న్య్ గ ఉంధంది :)

  ReplyDelete

Loading...