9.04.2011

మన భాష – మన బాట

ఆగష్ట్ 29 తెలుగుభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని , ముందురోజు అంటే ఆగష్టు 28 ఆదివారం తెలుగుభాషాభిమానుల్ని తెలుగుబాట పడదాం రమ్మనమన్న మన తెలుగు వారి పిలుపు మేరకు నేను సైతం అని అనుకుంటూ…. తెలుగు బాటకి బయల్దేరాను. సమయానికి చేరుకోలేకపోయినా, తెలంగాణ అయినా అంధ్రా  అయినా తెలుగే మాట్లాడతానని, తెలుగు మాట్లాడిస్తానని ప్రమాణం చేసే సమయానికి నేను అక్కడే ఉన్నాను.

తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా గల గల కల కల కదిలి వస్తారనుకున్నాను మన మహిళా తెలుగు భాషాభిమానులు బ్లాగర్లు కాని.. ఎవరు రాకపోవడం కించిత్ నిరాశాపరచినా.. అందరూ
సరదాగా మాట్లాడుతూ, తెలుగు భాషాప్రాభవాన్ని ఏవిధంగా పెంచాలి అన్న చర్చలతో కాలమనేది తెలియకుండా చేసారు తెలుగు భాషాభిమానులు.

తెలుగుభాషాభిమానులైన పలువురు  వక్తల తీయనైన తెలుగు మాటలు విన్నాను. వారి చమత్కారాలు కొన్ని :

బుష్ మన రాష్ట్రానికి వస్తే పంచే కట్టి మురిసిపోయాము..
ఈ రాష్ట్రంలోనే ఉంటూ పంచే కట్టడం మరచిపోయాము.

అమ్మ   సజీవం
మమ్మీ  నిర్జీవం.

తెలుగు తల్లిని పూలమాలతో సత్కరిస్తూ.. తాడేపల్లిగారు తెలుగు మాట్లాడే ప్రతి తల్లి తెలుగుతల్లే..  అని అనడం మనసులో ఒక  జలదరింపు….. రోమాలు నిక్కబొడుచుకున్నాయి అని చెప్పొచ్చు. తెలుగు భాషాభిమానం నాలో అలా ఆ అనుభూతికి లోను చేసింది.

ఇక ఆరోజు తన చమత్కారంతో మరింత ఆనందానికి లోను చేసిన మరో వ్యక్తి శ్రీ అనంత్ గారు.. వారి చమత్కారం..స్వయంగా మాతోనే..

నాకు కుల పట్టింపు  లేదు.. నేనెవరికి నా కులం గురించి చెప్పను.... నాపేరు అనంతా"చార్యులు" (హహహ నాకు గట్టిగా నవ్వేసి అరవాలనిపించింది "ఆచార్యులుగారు!  మీ కులమేంటో మాకు తెలిసిపోయిందోచ్"  అని) కాని నేను "అనంత్"  అని చెప్పుకుంటాను.. నా వయసు 60 యేళ్ళు అయినా నేను ఇప్పటికి నేను యువకుడినే.. 

నాతో తాడేపల్లి గారి ఛలోక్తి:  "సుమం  సుమం అని అనుకుంటున్నాము మరి మీరు బ్లాగు రాయడం తగ్గించేసారు"  అని..   హహహ.. తాడేపల్లిగారు!!  మీరు మరీ చతురులు సుమా!!.

అలా తెలుగులో సంభాషించుకుంటూ ... వచ్చినవాళ్ళు ఒకరినొకరం పరిచయం చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపాను ఆదివారం. ఇంటికి తిరిగివెళ్తున్నప్పుడు వానదేవుడు సంతోషంగా ఉన్న మా పై తన ఆనందాన్ని కూడా తెలియజేస్తు చినుకుల చిరుజల్లు కురిపించాడు. 

ఆ వర్షపు జల్లులలో మా ఆనందపు ఛాయా చిత్రాలు, ఆ పండగవాతవరణంలోని ఛాయా చిత్రాలు  ఇదిగో ఇక్కడ మీకోసం... 
తెంగ్లీష్ వద్దు తెలుగే ముద్దు 

జీతం కోసం పర భాష
జీవితం కోసం మన భాష
ముగిస్తూ ఇంకో చిన్న మాట మీ చెవిన వేసి సెలవు తీసుకుంటా  మరి..

తెలుగు భాష  గొప్పతనం,
తెలుగు జాతి తీయదనం
 తెలుసుకున్న వాళ్ళకి
తెలుగే ఒక మూలధనం
తల్లి తండ్రి నేర్పినట్టి మాతృ భాషరా
తెలుగు మరచిపోతే
వాళ్ళని నువు మరిచినట్లురా
ఇది మరవబోకురా.. 

ఇది ఒక గేయ రచయిత విన్నపం.. అలాగే మనందరిది కూడా  ..
****