4.25.2012

ఆ ఎక్కువేమిటో ....ఈ తక్కువేమిటో..... :))


ఇదో చిన్న విశ్లేషణ.. అవకాశమిచ్చిన బ్లాగర్‌కి అభినందనలు. కాకపోతే ఎవరినీ నొప్పించాలని కాదు అలాగే ఒప్పించాలని కూడా కాదు...ఒకమనిషి మీద వారికి ఉన్న అభిమానం అభినందనీయమే ..... కాని మిగతావాళ్ళెవరూ గడ్డిపరకలు కాదు, అజ్ఞానులు అంతకన్నా కాదు అని చెప్దామని చిన్ని ప్రయత్నం... ఎక్కడ చదివానో గుర్తులేదు కాని బ్లాగులో ఒక వాక్యం చదివాను.. ఆ వాక్యాన్నే విశ్లేషిస్తున్నా.. వాక్యం చివర్లో ఇస్తాను.
*****
ఎదుటి మనిషిలో ఎదో ఒక ప్రత్యేకత ఉంటే ఆ ప్రత్యేకతని బేస్ చేసుకుని వారిని గౌరవించడం తప్పు కాదు కాని..... అదే ప్రత్యేకత అతిగా ఆదరించేసి, ఆ ప్రత్యేకతలు లేని వాళ్ళని చులకన చేయకూడదని నా అభిప్రాయం.. 

ఇప్పుడు మన బ్లాగుల్లోనే తీసుకొండి... సాధారణంగా ఛలోక్తులు విసురుతూ సమయస్ఫూర్తిగా మాట్లాడుతూ .... ఎంతటి అద్భుతమైన భావాన్ని ప్రకటిస్తున్నారు.... దాగి ఉన్న నైపుణ్యాన్ని అప్పుడప్పుడు అలా మనకి చూపిస్తున్నారు.. అలాగే పెయింటిగ్స్... ఫొటోస్ ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత.. కొత్తగా వచ్చారా, పాతవాళ్ళా అన్నది తరువాత విషయం కాని ఎవరి ప్రత్యేకతని వాళ్ళు చాటుకుంటున్నప్పుడు, ఆ ప్రత్యేకతని గుర్తించి గౌరవించాలి ...  అంతేకాని అవతలివారిని అజ్ఞానులనుకోవడం ఎంతవరకూ సబబు? 

ఎవరూ ఎవరికీ తక్కువ కాదు... ఒకళ్ళు రాయడంలో ఘనాపాటి అయితే ఇంకొకరు వంటల్లో, ఇంకొకరు పాటల్లో.. ఇంకొకరు... ఇంకో విషయంలో ఇలా ఇంతమంది ప్రత్యేక మనుషులు ఉన్న్నప్పుడు ఒకరిపైనే దృష్టి నిలిపి వారి అభిమానాన్ని చూరగొనాలన్న ఆలోచనో ఎమో కాని... మిగతావారిని అజ్ఞానులని చేయడం అభినందనీయం కాదేమో ఒకసారి ఆలోచించండి... ఆ వాక్యంలో చిన్న శ్లేష కూడా లేకపోలేదు ... సదరు బ్లాగరు నిర్వికారంగా అజ్ఞానులవైపు చూస్తున్నరా ?? (అది నిర్వికారంగా చూస్తున్న వారి  మనోగతమా) లేక రాసిన వారి మనోగతమా? ఎవరికి ఎవరు అజ్ఞానులు? 

నడత నేర్పిన మనిషిని, నడకనేర్పిన మనిషిని అమ్మగా, నాన్నగా, గురువుగా పోల్చుకుని అబినందించండి, గౌరవించండి.. ఇంకా చెప్పాలంటే ఆ భక్తి తీరలేదు అనుకుంటే కాళ్ళకి దండం పెట్టుకుని ఆ పాదధూళి శిరస్సున ధరించండి కాని వీళ్ళని పొగడడం కోసం ఎదుట ఉన్నవారందరినీ  అజ్ఞానులని మటుకు చేయకండి ... తప్పనిపిస్తే మన్నించండి.. 

వాక్యం:
"అఙ్ఞానులని చూస్తున్నట్టు నిర్వికల్పంగా _______________ నవ్వుతూ చూస్తుంటే,  మిగిలినవాళ్లందరూ ఆవేశంగా అంత్యాక్షరి ఆడేసేరు. "

4.24.2012

గెలుపు-ఓటమి

రాత్రి పాప... నా పక్కకి వచ్చి నా చుట్టూ చేయి వేసి "అమ్మా.. భయమేస్తోంది రేపే రిజల్ట్స్.. బాటనీ సరిగ్గా రాయలేదు...అనుకున్నవేవి రాలేదు..  ఎమవుతుందో.. ఎమో " అని.. భయపడ్తూ అంది. పాపకి ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో.. "ఏమి పర్వాలేదు, ఏమయినా నో టెన్సన్స్.. ఇప్పటితో జీవితం అయిపోలేదు ఓటమి ఎప్పుడు గెలుపుకి దారి అంతే.."  అనునయించాను కాని.. నా మనసులో నా పిల్లల గురించి మా బంధువర్గం అయితేనేమి.. దగ్గిరవాళ్ళ, దూరంవాళ్ళ ఉద్దేశ్యాలు ఈమధ్యే తెలియడంతో .. నాకెందుకో నేనే ఓడిపోతున్నాను అన్న బాధ కలిగింది..
******
"నీ పిల్లలికి క్రమశిక్షణ లేదు..." , అని ఒకళ్ళు, "ఇదిగో ఇలా చదివితే మటుకు అసలు మార్క్స్ రావు" అని ఒకళ్ళు, " వాడా ఎస్ ఎస్ సి అయితే కంప్లీట్ చేయడు.." అని ఒకళ్ళు.. "వాడికి కొంచం మాట్లాడడం నేర్పు "  అని ఒకళ్ళు.. ఇవి వింటుంటే నిజానికి నాకే భయమేసింది ..ఏంటి మరీ నా పిల్లలు అసలు క్రమశిక్షణ లేకుండా ఉన్నారా?  అని..  నాకు అవకాశం దొరికినప్పుడల్లా, చదువు విలువ, కష్టం, సుఖం, బాధలు, బంధుత్వాలు ఒకటేమిటి ఒక తల్లిగా  కాక ఒక స్నేహితురాలిగా చెప్తూ వచ్చేదాన్ని .. నాకు తెలియని ఇన్ని అవలక్షణాలు పిల్లలో వాళ్ళు చూడగలుగుతున్నారా అని మనసు మధన పడిన సందర్భాలెన్నో.. దగ్గరి మిత్రులైతే  "ఏమి లేదు రమణీ! వయసు కదా...  పిల్లలు అంతే దూకుడుగా ఉంటారు.. వాళ్ళకి ఆలోచించే వయసు వస్తుంది అప్పుడు చూడు నువ్వే ఆశ్చర్యపోతావు"  అంటూ ధైర్యం చెప్పేవారు.. ఏది ఏమైనా పిల్లలిద్దరు ఇప్పటి వరకు నా అదుపాజ్ఞాలలోనే ఉన్నారన్న నమ్మకం నాది.. ఇంకా సడలి పోలేదు..

నేను సాధారణంగా ఏ పిల్లలిని వాళ్ళు ఇలా వున్నారు అంటూ  వేలెత్తి చూపను ఎందుకంటే చిన్నప్పుడు జులాయిగా తిరిగి పెద్దయ్యాక పద్దతిగా ఉద్యోగం చేస్తూ ......కుటుంబ బాధ్యతలు స్వీకరించి పెద్దరికంగా, పెద్దతరహాగా మారినవాళ్ళని చాలా మందిని చూశాను..అలాగే క్రమశిక్షణ, అంటూ ఏ స్నేహితులు లేక ఇంట్లోనే ఉండి.. బిడియపడ్తూ ఉండేవాళ్ళనీ చూశాను... సో, నా నమ్మకం ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక మనసుని తాకే సంఘటన ప్రతి మనిషికి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది... అందరూ మారతారు.. తెలిసి తెలియని వయసు.. ముఖ్యంగా మా బాబు... వాడి వయసు, వాడి ఆలోచనలు చాలా పెద్దవాడినయ్యాను అన్న ఒక భావన.. వాడి దృష్టిలో , అమ్మకేమి తెలీదు.. అక్కకి తను అండగా ఉండాలి ... :)) అందుకే మాములుగా గేట్ బయట వాళ్ళ అక్క నించున్నా "ఏయ్! అక్కా లోపలికి వెళ్ళు" అని కసురుతాడు ఎదో పెద్ద భారం మొసేస్తున్న వాడిలా .. నాకే నవ్వు వస్తుంది.. సినిమాల ప్రభావం అని నవ్వుకుంటా..

అలాగే పాప ... ఇదో కొత్తకోణం చెప్పాలంటే.. రెండు నెలలు కాలు సమస్యతో మంచం పై ఉన్న నన్ను పసిపాపలా చూసుకుంది.. నా పనులు నేను చేసుకుంటూ ఉన్నప్పుడు , ఒక్క పని కూడా చేయవు అంటూ కసురుతూ ఉండేదాన్ని.. ఇద్దరికి గొడవ కూడా అయ్యేది.. అలాంటిది పరిస్థితి ఒక్కసారిగా మారేసరికి పాప నన్ను అమ్మలా చూసుకోడం.. నన్ను నేనే మర్చిపోయేంత పసిపిల్లనయ్యాను ఆ సమయంలో .. ఇలాంటి పాపకి క్రమశిక్షణ లేకపోవడం...:((

ఇవన్నీ గమనించి బంధువుల అవహేళన అవి , చూసి పిల్లలికి ఒకటే చెప్పాను.. "రాత్రింబవళ్ళు  కష్టపడి చదివేసి , మంచి మార్క్స్ తెచ్చుకొండి"  అని మాత్రం కాదు.. "మీకు లోకజ్ఞానం తెలియాలి నాన్న.. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియాలి.. అందరూ మనవాళ్ళు కాదు..  అలా అని అందరూ పరాయివాళ్ళు కాదు.. నా పిల్లలు మరీ అజ్ఞానంలో, మీరనే క్రమశిక్షణ లేకుండా  లేరు ... వాళ్ళు వాళ్ళ పరిథిలో తెలివైనవాళ్ళే" అని నేను వాళ్ళకి చెప్పిన మాటని నిలబెట్టండి చాలు అని...పాప కనక నిజంగా బాటనీ పేపర్ మళ్ళీ రాయాల్సి వస్తే .. బంధువుల నుండి నేను ఎదుర్కోవల్సింది మటుకు .. "మాకు ముందే తెలుసు .. మీ పాప చదవదని.. చదవలేదని.. క్రమశిక్షణ లేదు... మొ! కాని అలా జరగలేదు..... నాకు తన పరీక్షల టైంలోనే  యాక్సిడెంట్ అవడం పాపకి పెద్ద దెబ్బే ... అయినా పాప  మంచి మార్క్స్ స్కోర్ చేసింది.. పొద్దున్న రిజల్ట్స్ చూడగానే ఆనందభాష్పాలతో నన్ను చుట్టేసుకుని పరవశించిపోయింది నా చిట్టి తల్లి.. ఎంతసేపు కాలేజ్, ఇల్లు ఇదేనా అని మొన్న ఆదివారం బ్లాగు సమావేశానికి తీసుకెళ్ళాను.... చూసినవాళ్ళందరి దగ్గరా మంచి మార్కులే తెచ్చుకుంది.... బాబు కూడా తన విషయంలో అదే అన్నాడు "ఎస్ ఎస్ సి కంప్లేట్ చేయని చూద్దాం"  అనేవాళ్ళే ముక్కున వేలేసుకుంటారమ్మా!  నీకా డౌటే లేదు అని.. వాడు మాములుగానే 90%లో ఉన్నాడు నాకసలు సందేహం లేదు.... ముందు ముందు ఏమి జరుగుతుందో కాని ఇప్పటివరకు గెలుపే.. ఒకవేళ ఓటమైనా  మనసులో మధన పడ్తాను ..  పిల్లలికి మటుకు ..గెలుపుకి దారి వెతుక్కోమనే స్థైర్యం, ధైర్యం  ఇస్తాను కాని ఓడిపోయాను అని ఒప్పుకోదల్చుకోలేదు.... నా వాళ్ళు .. నా పిల్లల కోసం.
*****

4.23.2012

బ్లాగు క్రీడల 'రమణు(ణి)ల గాంచిన....:-)



సమావేశానికి రెండురోజుల ముందు వరూధినిగారి నుండి ప్రమదలందరూ ఒకసారి సమావేశమవుతున్నాము.. మీరు కూడా ఆహ్వానితులే అంటూ మేయిల్ ఆహ్వానం పంపారు.. మెయిల్‌తో పాటుగా మాలగారు పంపిన చూడ చక్కని ఆహ్వాన పత్రిక కూడా జోడించారు.
(కొంచం ఎడిట్ చేశాను )



ఇంతకీ మా సమావేశ ముఖ్యోద్దేశ్యం.. మన సుజాతగారు అమెరికా వెళ్తున్నారు కాబట్టి ఆవిడ మళ్ళీ మనల్ని ఎప్పుడు కలుస్తారో అని.. అందరం ఒక చోట కలుసుకుని కాసేపు కబుర్లాడుకుందామన్నారు (గెట్ టుగెదర్ అన్నమాట) ఇలాంటి అరుదైన అవకాశాలు అంత తొందరగా జారవిడుచుకోను నేను... సమావేశ ముహూర్తం ఆదివారం ఉదయం 11 గంటలకు.. వేదిక మాలగారి ఇంద్రభవనం.. ఇక కాదనడానికేముంది.. 

వాతావరణం బయట ఎండ రూపేణా నిప్పులు చెరుగుతున్నా, మాలగారింట్లో నవ్వుల పువ్వులు వెల్లి విరిశాయి.. మా ఇంటికి చాలా దగ్గర్లోనే వారి ఇల్లు తొందరగానే చేరుకున్నాము.. నేను మా పాప. మెట్లు ఎక్కుతుంటేనే మాలగారు సాదరంగా ఆహ్వానించారు.. అప్యాయంగా ఎదుర్కోలు చెప్తూ, పి ఎస్ ఎం లక్ష్మిగారు ఎదురొచ్చి కుశలమడిగారు.. లోపలికి అడుగుపెట్టగానే తెలియనివాళ్ళు చిరునవ్వు చిందించారు.. తెలిసిన వాళ్ళు   'హాయ్!' అంటూ చేతులెత్తి ఆహ్వానించారు... వెళ్ళగానే పరిచయ కార్యక్రమాలు అయ్యాక...సమావేశ విశేషాలు ముందుగానే తయారుచేసుకున్నారేమో, ఒక ఆట ఆడదామంటూ అక్కడివారినుద్దేశించి అనౌన్స్ చేశారు జి ఎస్ లక్ష్మి గారు.

జి ఎస్ లక్ష్మి గారు: అసలేమని చెప్పాలి ఈవిడ గురించి..  ఫలనా ఆట ఆడదాము, ఇప్పుడీ పని చేద్దాము, ఆ పని చేద్దామని ఎంతో చలాకీగా, సరదాగా గడిపి మమ్మల్నందరినీ అలరించారు ఈవిడ...శ్రీలలిత బ్లాగరి

జ్ఞాన ప్రసూనగారు: తీసుకెళ్ళిన వంటకాలను చూసి ఆసువుగా కవిత చెప్పి.. తన ముగ్ధ మనోహరమైన డ్రాయింగ్స్ చూపించి,  జి ఎస్ లక్ష్మి గారు ప్రతీ ఆటకి 'సయ్యా'  అంటే 'సై సై' అని సరదాగా గడిపిన ఎనర్జిటిక్  మహిళ ప్రసూన గారు.. ఎవ్రిడే సురుచి బ్లాగరి
సి ఉమాదేవి గారు: మౌనంగా ఉన్నా.. మధ్య మధ్యలో ఆటల్లో "నేనే సుమా " అని గెలిచి హుందాగా ఉన్నారు  చిన్నిగుండే చప్పుళ్ళు బ్లాగు ఈవిడదే

అన్నపూర్ణ గారు: ఇక ఈవిడ గురించి చెప్పక్కర్లేదు.. చూస్తే ఎవరో మనకి తెలీదు... పరిచయం లేనే లేదు అనుకుంటాము కాని , పరిమళం వెదజల్లుతున్న బ్లాగు నాదేనండి అంటారు.. :)  ఇంక తెలియకపోవడమేముంది ఎన్నో ఏళ్ళు పరిచయమున్నట్లు కలిసిపోము ఈ సాదా సీదా పల్లెటూరి అమ్మాయితో... చాలా చలాకిగా జోక్స్ చెప్పి నవ్విస్తూ కవ్విస్తూ గడిపారు పరిమళం బ్లాగు అధికారిణి అన్నపూర్ణ గారు. అన్నట్లు ఈవిడ పాటలు చాలా చాలా మధురంగా పాడతారండీ..

జ్యోతి గారు: జ్యోతిగారి గురించి నేను అందరికి చెప్పడం అంటే తాతకి దగ్గులు నేర్పడంలాంటిది.. కాబట్టి జ్యోతిగారిని పరిచయం చేసే సాహసం నేను చేయలేను... 'మీకంటే మాకే బాగా తెలుసు'  అన్నారనుకొండి నా చిన్ని మెదడు చిన్నబోతుంది మరి.. ;-)

మాలా కుమార్ గారు: ఈరోజు ప్రోగ్రాం అంతా వీళ్ళింట్లోనే కాబట్టి ప్రతీ ఆటలో, పాటలో, మిగతా విశేషాల్లో హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ మావల్ల వారి శ్రీవారి భోజనానికి ఇబ్బంది పాలు చేసి, మమ్మల్ని నొప్పించక, శ్రీవారికి నచ్చచెప్పుకుని, తానొవ్వక,  నేర్పుగా సమావేశాన్ని విజవంతం చేసిన "సాహితి"బ్లాగరి.

పి ఎస్ ఎం లక్ష్మి గారు: యాత్రల విశేషాలతో అలరిస్తూ.. పాత పాటల ఊపందుకుని మమ్మల్ని పరవశింపజేసిన యాత్ర బ్లాగరి.

వరూధిని గారు: "మువ్వగారు" అని బ్లాగర్లు ఆప్యాయంగా పిలుచుకునే బ్లాగరి,  అభినవ ఇందిరాగాంధి గారు. వరూధినిగారు కనపడరు కాని భలే చలాకి అండీ బాబు.. "సిరి సిరి మువ్వ" బ్లాగరి

సుజాత గారు: జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల అన్నట్లు సుజాత గారి పరిచయం నేను చేయడమంటే అబ్బే.. ఎంత రాసినా తక్కువే.. కాకపోతే సుజాతగారిని 'మిస్' అయ్యామనే చెప్పొచ్చు "మెరుపులా మెరిశావు.. " అన్నట్లు అందరం 'హమ్మయ్య!' ఇక పరిచయాలయ్యాయి కాసేపు పిచ్చాపాటి అనుకునేలేపు అంతే మెరుపులా మాయమయ్యారు ... అర్జంట్ పని ఉంది అని "మనసులో మాట " చెప్తూ.. తన సుపుత్రిక సంకీర్తనతో సహా.. 

స్వాతి గారు: మువ్వలా నవ్వకలా.. ముద్ద మందారమా.. ముగ్గులో దింపకిలా.. ముగ్ధ సింధూరమా అని పాడుతూ మమ్మల్ని అలరించిన ముద్దుగుమ్మ స్వాతిగారు.. నువ్వు నాతోనే ఉన్నట్లు నా నీడవయినట్లు, నన్నే చూస్తునట్లు ఊహలో (మాలగారి ఇంట్లో) అని వారి శ్రీవారిగురంచి తలచుకుంటూ... గడిపారు చక్రవర్తి "భవదీయుడు" బ్లాగరు అర్థాంగి స్వాతిగారు.

ఇక మరో సుందరాంగి సాయి సుజన: మాట్లాడాలా..  వద్దా అనే బిడియం, మౌనం మరో ఆభరణం.. ఏమి మాట్లాడినా  చిరునవ్వు చిందిస్తూ .. పెదవులు కదిలీ కదలకుండా ఆ ముద్దు మాటలు సుజన అంటే ఈవిడేనా.. అంత చక్కటి కవితలు అని అనుకోకుండా ఉండలేము... 



క్షమించాలి చివర్లో రావడం వల్ల రచయిత్రి మంథా భానుమతిగారిని మరిచాను.. మన్నించండి మేడం.. ఆవిడ రాసిన ఆదర్శ కుటుంబం కథ . కథాజగత్‌లో ఇప్పుడే చదివాను అదే లింక్ ఇస్తున్నాను.. ఆవిడగురించి నాకు తెలిసింది తక్కువ చివర్లో కలవడం వల్ల వివరాలు తీసుకోలేకపోయాను.


ఇక నేను: ఇదిగో మధురభావాల  సుమమాల నా బ్లాగు... నేను రమణినీ.. నాగురించి కొత్తగా చెప్పడానికంటూ ఏమి లేదు.. నేను  వెళ్ళాను మా పాప ఫోటోలు తీసింది...ఇలా..

అలా ఆరోజు ఎంతో ఆహ్లాదంగా సంతోషంగా గడిపాము. 
****

కొన్ని ముఖ్యమైన మరిచిపోలేని అనుభూతులు:

జ్యోతిగారు ఆ పాత మధురాలు పేరిట.. తెలుగు హిందీ భాషల పాత పాటల సి డి లు అందరీకీ బహుమనంగా ఇవ్వడం.

సుజాతగారు అమెరికా వెళ్తున్న సందర్భంగా "చిరుకానుక " (నా చేతుల మీదుగా) అప్యాయంగా అందుకోడం.. సంకీర్తన భాషలో గిఫ్ట్..

"మిస్ గెట్ టుగెదర్" గా వరూధినిగారు  బహుమానం అందుకోడం..

ఆటల్లో జ్ఞాన ప్రసూన గారు, ఉమాదేవి గారు, జి ఎస్ లక్ష్మిగారు, జ్యోతిగారు బహుమానాలు గెల్చుకోడం...


జ్ఞాన ప్రసూన గారి art  పెయింటింగ్స్ ....

ఇదంతా ఒక ఎత్తయితే..

రాత్రి 9 గంటలకి మాలాకుమార్ గారు పులిహోర బాగుందని వాళ్ళ శ్రీవారు చెప్పమన్నారని,  నాకు ఫోన్ చేసి చెప్పడం.. (మెచ్చుకోలు కొంచం తృప్తే కదా)

మాల గారి ఇంద్రభవనం లాంటి ఇల్లు..
****
గమనిక: ఏమన్నా, ఎవరినన్నా మర్చిపోతే క్షమించమని ప్రార్థన.


Loading...