12.08.2013

సమావేశపు సౌరభాలు



మనకోసం ఈ సమావేశం.. మనమందరం కలుద్దాము.. ఒకరికొకరం అన్నట్లుగా ఉందాము.. ఒకరికొకరం సహాయం చేసుకుందాం అనే గొప్ప సందేశంతో ఈసారి ఫేస్ బుక్ పాజిటివ్ మైండ్స్ సమావేశం జరిగింది..

చలికాలం, చల్లగా కృష్ణకాంత్ పార్క్ లో మద్యాహ్నం 3 గంటల వేళ పచ్చని పచ్చిక పై ఆహ్లాదంగా ప్రారంభమైంది. కొత్తవారు, మంచి ఆలోచనలు కలవారు, ఫేస్ బుక్ ఇలా ఈ విధంగా కూడా ఉపయోగించవచ్చు అన్న  ఆలోచనా సరళి కలవారు కలిసి కాసేపు అప్పటి కార్యాచరణాల గురించి, భవిష్యత్తులో ఏవిధమైన కార్యాచరణాలను అమలు చేయవచ్చు అనే విషయాలపై కాసేపు మాట్లాడుకుని.. అపరిచితులంతా సుపరిచితులై ...ఏ చిన్న అవసరమైనా మనమున్నాము అన్న భరోసాతో "మేము సైతం" అందాము అని తీర్మానించారు.




ఈసారి కార్యక్రమంలో అందరి పరిచయాల తరువాత పెద్దవారు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు ఇలా ఇక్కడ క్లుప్తంగా...


********


శ్రీ బ్రహ్మానందంగారు: ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా  వెనబడివున్న గిరిజనులకు మనకు చేతనైనంత సహాయము చేద్దాము అని పిలుపినిచ్చారు. ఎదో రకంగా అంటే మనకు తెలిసిన ఆరోగ్య సూచనలు  ఇస్తూ..తెలిసినంతలో వారికి విధ్యా బుద్ధులు నేర్పిస్తూ, అల్లూరి సితారామరాజు ఏవిధంగా వారిని చైతన్యవంతులని చేశారో అలాగే మనకు చేతనైంతవరకు వారికి తోడ్పడదామని  సందేశమిచ్చారు.



చివర్లో రోడ్డు ప్రమాదాల గురించి వాటి నివారణ గురించి..  గంగాధర తిలక్ గారు మాట్లాడుతున్నప్పుడు.. "ప్రమాదాలు  ప్రమోదం కాదు " అని  సరదాగా అంటూ ప్రమాదాలు కొని తెచ్చుకొవద్దని తనదైన శైలిలో యువతకి సలహా ఇచ్చారు బ్రహ్మానందంగారు.

Add caption






శ్రీ కట్నం గంగాధర తిలక్ గారు: వీరు శ్రమదాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి అన్నది విశ్లేషిస్తూ.. వాటి నివారణకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో వివరించారు.  శ్రమదాన్   ఫౌండేషన్ ముఖ్యోద్దెశ్యం ప్రమాదాలు జరకుండా చూడడమే అని చెప్పారు.







శ్రమదానం చేయమని యువతకి అక్కడ హాజరైన మిత్రులకి పిలుపునిచ్చారు. అనాధలకి అభాగ్యులకి మనకి చేతనైంత చేయూత నిద్దమంటూ కొత్త అప్లికేషన్ మనం ఒక ఎస్ ఎం ఎస్ పంపిస్తే (ప్రమాదం కాని సహాయం గురించి కాని) ఎక్కడనుండి పంపిచామో అడ్రెస్స్ తో సహా వారికి చేరే అవకాశం ఉందని పరిచయం చేశారు.  వివరాలు అంటూ అవసరం లేకుండా సదా మీ సమక్షంలో అనట్లు ఉండే అప్లికేషన్ అని విడమర్చి వివరించారు. వీరికో గ్రూప్ కూడా ఉంది ఫేస్ బుక్ లో " "శ్రమదాన్"  అసక్తి కలవారికి ఆహ్వానం అంటున్నారు కట్నం గంగాధర తిలక్ గారు.



శ్రీ మాధవ రెడ్డి గారు: ఎక్కడ సహాయం అవసరమో అక్కడ  నేను ఉంటాను అంటున్నారు .. మాధవ రెడ్డి గారు. తన ఊరిలో తనే 1st   ఉన్నత చదువులు చదివిన వ్యక్తినని, తనలా తన ఊరిలో అందరూ చదవాలని తన ఆకాంక్ష అని, అలాగే  ఎవరు లేని వారుకి తానున్నాను అని భరొసా ఇస్తూ.. తను ఏవిధంగా ఎంతమందికి  ఆపన్న హస్తమయ్యారో, అందుకు తాను పడిన కష్టాలు, వాటి వల్ల చేరుకున్న విజయ పధాలు అన్నిటినీ  కూలంకషంగా వివరించారు.





శ్రీ నల్లమోతు శ్రీధర్ గారు: మనం కూడా పాశ్చాత్య సాంప్రదాయాలకి, అపార్ట్మెంట్ కల్చర్లకి అలవాటు పడిపోతున్నాము.. పదిమందిమి కలుద్దామనే ఆలోచన అనేది ఉండడం లేదు, ఇంటికొచ్చిన వారితో కూడా మనః పూర్వకంగా మాట్లాడలేకపోతున్నాము , ఎదో ఒక ఆధునిక సాంకేతిక పరికారాలతో మనల్ని మనం బంధించేసుకుంటూ బంధుత్వాలకి దూరమవుతున్నాము. దీనివల్ల మనుషుల్లో సున్నితత్వం అనే భావన దూరమయిపోతోంది. ఇలాంటి పరిస్థితే కొనసాగితే ముందు ముందు ఇప్పుడొచ్చిన వారు కూడా రాలేరు.
 సాంకేతిక పరిజ్ఞానం మంచిదే కాని ఎంతవరకూ ఉపయోగించుకోవాలో అంతవరకే కాని విలువలు మార్చేసేంతగా కాదు.. పదిమందికి సహాయపడదాం రండి అంటూ ఇప్పటి పరిస్థితుల  గందరగోళాన్ని చాలా ఆవేదనతో వ్యక్తపరిచారు.  అందరమూ ఇలాగే    కలుద్దాము, చేతనయినంతలో చేయూతనిద్దామని ఎదో మీటింగ్ అంటే ఇలా వచ్చేసి అలా మాట్లాడి వెళ్ళడం కాదు.. మననుంఛి ఎంతో కొంత సహాయ కార్యక్రమాలు జరగాలి. అప్పుడే మన ఈ సమావేశాలు అర్థవంతమవుతాయి అని తన ఆశాభావాన్ని తెలియజేశారు




ఇక చివర్లో వచ్చినా చాలా చక్కని సందేశమిచ్చారు శ్రీ రమేష్ గారు తాను రెండు సార్లు వద్దామనుకుంటూ రాలేకపోయానని.. ఈసారి తప్పక రావాలని నిశ్చయించుకుని, నైట్ డ్యూటి చేసి వచ్చాననై ఈసారి ఎవరినీ కలవలేనని ఆందోళన కలిగిందని.. అదృష్టవశాత్తు కలవగలిగానని ఆనందించారు రమేష్ గారు.

నిజానికి మన ముందు జెనరేషన్ వారికన్నా మనమెంతో అదృష్టవంతులమని, మనం కష్టపడకుండా మనకోసమంటూ ఎన్నో కనుక్కోబడ్డాయని, వాటిని సౌకర్య్వంతంగా ఉపయోగించడమే మనకి చేత కావడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు రమేష్ గారు, ఉదా: సైకిల్, కంప్యూటరు, పలురకాల సాంకేతిక సౌకర్యాలను మనం సరైన  పద్ధతిలో ఉపయోగించుకోలేకపోతున్నామని అన్నారు. .. అలాగే మనం సంపాదించే 10 రూపాయలలో ఒక్క రూపాయి సహాయానికి ఉపయోగించినా చాలు అని తన సహాయక పధకాన్ని వివరించారు.



శ్రీ విక్రం గారు: తన తమ్ముడు  తాను ఎంత చెప్పినా కంప్యూటర్ నేర్చుకోలేకపోయాడని, చివరికి శ్రీధర్ గారి వీడియోల ద్వారా స్ఫూర్తి పొంది కంప్యూటరు నేర్చుకున్నాడని, అందుకు సభాముఖంగా  శ్రీధర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసూ.. ఒకప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంత పవిత్రమైనవో, మన బంధాలు, బంధుత్వాలు ఎంతటి నిజాయితీ గా ఉండేవో చెప్పడానికి రామాయణంలోని ఒక సన్నివేశాన్ని ఎంతో ఆర్థ్రతో వివరించారు.  "సీతాదేవిని రావణాసురుడు అపహరించి తీసుకునివెళ్తున్నప్పుడు తన ఆభరణాలను రామలక్ష్మణులు గుర్తుపట్టడానికి వీలుగా మూటకట్టి , రావణుని ద్వారా గాయపడ్డ ఝఠాయువుకి తెలిసేలా కిందపడేసినప్పుడు గాయపడ్డ ఝఠాయువు  తనేమి చేయలేనని నిస్సహాయురాలినని రాముని క్షమించమని వేడుకుంటూ,  ఆ అభరణాల మూటని భద్రంగా ఒక చెట్టు తొఱ్ఱలో ఉంచుతుందిట. వాటిని హనుమంతుడు కనుగొని శ్రీరాముని చెంతకి తీసుకొని వస్తాడు.

శ్రీరాముడు బాధాతత్ప్తుడై కన్నీటి ధారలో వాటిని గుర్తించలేక లక్ష్మణుడి చేతికి ఇస్తాడట ఒకసారి చూడమని, అవి సీతాదేవివా కాదా అని, అప్పుడు లక్ష్మణుడు ఈవిధంగా అంటాడట. సోదరా.. ఈ అభరణాలేమిటో వాటిని వదైనగారు ధరించారో లేదో కూడా నాకు తెలీదు కాని ఒక్కటి మటుకు నేను గుర్తు పట్టగలను.. వదినగారి పాదాల చెంత ఉండేవాడిని కాబట్టి ఆవిడ కాలి మంజీరాలను(పట్టీలను) గుర్తు పట్టగలను అని అన్నాడట.. కన్నీటితో..ఇలాంటి బాంధవ్యాలు మనవి అవి కొరవడుతున్నాయి వాటిని కాపాడుకుందాము. మన సంస్ఖ్రితిని సాంప్రదాయాలను మనం ఆచరిద్దామని చక్కగా వివిరంచారు విక్రం గారు.


ఇంకా కొందరు డాట్ నెట్ కి సంబంధించి కోర్స్ సెంటర్ మాదాపుర్ లో ఉందని... నేర్చుకోవాలనుకున్నవారు అక్కడ కోచింగ్ బాగుందని ఇలా చాలా చాలా విషయాలు తెలియజేశారు.

అలా ఈరోజు సమావేశం "సేవ చేద్దాము " మనం పలువురికి తోడ్పడదాం అన్న ముఖ్యోద్దేశ్యంతో మొదలయి ఒక సంకల్పంతో ముగిసింది.

ఈ సమావేశంలో వచ్చిన అంశాలన్నీ ఇక్కడ ప్రస్తావించాననే అనుకుంటున్నాను. ఏమన్నా, ఎవరినన్నా మర్చిపోతే క్షమించి మీ ఆలోచనలను ఇక్కడ కామెంట్ ద్వారా పొందుపర్చవచ్చు. నమస్సులతో.. రమణి.

******

మీట్ లో తీసిన మరిన్ని ఫోటోలు.
























గమనిక: నేను ఈ పోస్ట్ రాసినప్పుడు ఇంకా గ్రూప్ తెరవలేదు.. నల్లమోతు శ్రీధర్ గారు సాంకేతిక పరంగా గాని, మరేవిధమైన సహాయం కావాలన్నా.. లేదా చెయ్యాలనుకున్న హితులు సన్నిహితులు, సహృదయులు, స్నేహితులు, ఫేస్ బుక్ ధారులు ఎవరయినా సరే ఈ గ్రూప్లో ( click here) చేరవచ్చు అంటూ ఫేస్ బుక్ పాజిటివ్ మైండ్స్ పేరిట ఒక గ్రూప్ తెరిచారు . కాబట్టి మిత్రులందరూ తమ విలువైన సమయాన్ని కొంచం ఇటు  మర్లించి,  సహాయసహకారాలుపొందవచ్చు/అందిచవచ్చు.  వినమ్రతతో రమణి. 

12.01.2013

మజారె అప్పడాలు పులిహోర దప్పళాలు...వహ్వారే పాయసాలు అహా హాహాహా...




మజారె అప్పడాలు పులిహోర దప్పళాలు




     
 





                        వహ్వారే పాయసాలు అహా హాహాహా...





కార్తీక గృహ  భోజనంబు..
కమ్మనైన విందు పసందు ...
కాంతలంతా కలిసే...
స్వాములేమొ మురిసే...

*****


అదన్నమాటసంగతి.. ఇంతకి ఏంటంటారా.. మన ఫేస్ బుక్ ఫ్రండ్స్ అందరూ కార్తీక వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసారు..




 వీరే వారు వీరే.. ఒకరు కార్యక్రమ నిర్వాహకురాలు, అల్లరి హేల , మాటల పఠిమ, దూసుకేళ్ళే స్వభావం, ఈ కార్యక్రమమే కాదు భావ వల్లరి ని ఒక్క తాటిపై నిలబెట్టిన అమ్ము.. అలియాస్ అనురాధ, మరొకరు.. ఇంతకు ముందు ఫేస్ బుక్ positive mind  మీట్ లో అనర్గళంగా మాట్లాడిన ఉష రాణి గారు..  (ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. ;)] ఈ మధ్యే జూ కి వెళ్ళి అక్కడ జరిగే అవకతవకలను తమ పద్ధతిలో అధికారుల దృష్టికి తెచ్చిన మహిళ. ముఖ్యంగా తను చేసే ఈ సామాజిక సేవ బయటికి చెప్పుకోని నిరాడంబరత ఈవిడ సొంతం. 

ఇక అసలు విషయం : అసలే అటువైపు తుఫాన్ .. హైద్రాబాదులో వర్షాలు ఎలా అని అనుకుంటూ వన భోజనాలు కాదు గృహ భోజనాలు అని ఏర్పాటు చేసారు 






ఓ ముద్ద మందారం లాంటి ముగ్ధ  సాయి గీతగారు







సాయి గీత గారింట్లో..

గృహ భోజనం అంటే ఎవరు ముందుకొస్తారు? నేనున్నాను అంటూ వచ్చారు సాయి గీత గారు... ఇంతమందికి భోజనాలు ఏర్పాటు చేయడమంటే మాటలు కాదు .. మరి అలాంటిది "అవును మాటలు కాదు నేను చేసి చూపిస్తాను అంటూ చక చకా వండి వార్చేసారు... వారి శ్రీవారు స్వామి ధీక్షలో ఉన్నారు కాబట్టి ఎవరన్నా  ఓ చెయ్యెస్తాను అని వచ్చారంటే ఊరుకునేది లేదు అని కచ్చితంగా చెప్పేసి మరీ పైన ఉన్న వంటకాలు ఒక్క చేత్తో వండేసి గాజుల గల గలలతో వడ్డించేశారు.. ఏమి సందడనుకున్నారు..మరిక మేము మటుకు తక్కువా.. అవే గాజుల చేత్తో ఆ వంటకాన్నిటిపై దాడి చేసి ... కష్టపడి/ఇష్టపడి తినేసాము ఇలా...:)





పాట వినేసారా .. ఏంటి అయిపోయిందనుకున్నారా.. ఇంకా ఎక్కడండీ బాబూ.. భామల అల్లరి, స్వాముల గాన లహరి...  పాటల హోరు, ఆ జోరు ఆ తరువాతే కదా మొదలయింది.. అంటే ఆ తరువాత అంత్యాక్షరి.. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. గానకోకిలలు... శ్రీవల్లీ గారు, వసంత గారు.. అబ్బా ఏమి పాడారు ఏమి పాడారు.. చక్కటి తీయనైన గొంతు.. స్వాములిరువురు పాత పాటల హోరు జోరు తో మమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని  చేశారు.. 

శ్రీవల్లి గారు, వసంత గారు

నాగేంద్ర గారు, స్వామి సత్యనారయణగారు (సాయిలక్ష్మి శ్రీవారు) స్వామి పి వి విజయకుమార్ గారు






 అంత్యాక్షరి గ్రూప్







వాటిల్లో కొన్ని ఆణిముత్యాలు మీకొసం.. అంటే ఒరిజినల్ ఇస్తున్నాను అక్కడ అంత్యాక్షరి రికార్డ్ చేయలేదు మరి :(







మారాలి మారాలి  మనుషుల నడవడి మారాలి..
తరతరాలుగ మారని వాళ్ళని మీ తరమైన మార్చాలి..

మారాలి మారాలి  మనుషుల నడవడి మారాలి..
ఇలా ఇంకా చాలా చాలా పాటలు ఉన్నాయి అన్ని ఇక్కడ ఉంచలేను.. అన్ని మధురమైన గీతాలే.. 

ఇలా సాగిన ఆ పాటల హోరులో ప్రేవేశించారు.. 



మూర్తి గారు వారి శ్రీమతిగార్తో.. వీరు కొత్తగా పెళ్ళయిన కోడే వయసు జంటట. ;)  నాకప్పుడే పరిచయం.. (అందరూ అక్కడే అప్పుడే అనుకొండి) .. 



       సాయి లక్ష్మిగారు, శ్రీమతి మరియు శ్రీ మూర్తి గారు.



వారు వచ్చినతరువాత ఫొటోల సెషన్ ..

 ఇలా ఫొటోలకి పోజులిచ్చేసి అలా బయల్దేరిపోయాము..


ఇక్కడ నానుండే మొదలుపెడదాము.. నేనే అంటే రమణి,  సాయి లక్ష్మిగారు, శ్రీమతి మరియు శ్రీ మూర్తి గారు,  స్వామి ,పి వి విజయకుమార్ గారు, స్వామి సత్యనారయణగారు (సాయిలక్ష్మి శ్రీవారు),నాగేంద్ర గారు, , ఉష గారు, శ్రీవల్లి గారు, వసంత గారు, అనురాధ గారుఉషగారి పక్కన చిన్న పాప కనిపిస్తోంది చూశారా శ్రీవల్లి గారి గారాల తనయ.. కుముదిని  (ఇదే కదా పేరు శ్రీవల్లీ?)

ఇవండీ సంగతులు.. భామల  భావాల లహరి, లాహిరి లాహిరి, లాహిరి...  :)))))))))))))))
                                                      *****

మరిన్ని ఫోటోలు వచ్చిన వారికి గోరు ముద్దలు..



 


రాని వారికి దూరపు ముద్దలు ;)))

11.19.2013

రమణి కే జైస చెష్మా లగాకే :))))



ఏమి రాయాలి ఎప్పుడు ఈరోజు  నాకు నేను గుర్తు చేసుకుంటూ ఎదో ఒకటి రాస్తూ ఉంటాను.. ఈసారి ఏమి రాయాలో తెలియడం లేదు.. ఎక్కడో వయసు సంవత్సరం సంవత్సరం పెరుగుతూ ఆయుష్షుని తగ్గించేస్తోంది. :) అయినా ఇలా వయసు పెరుగుతున్నా మనసు వయసు మటుకు తగ్గిపోతోంది. ఇక ఈసారి మటుకు ఇలా కొత్తగా వచ్చే వయసు  మార్పులను అంగీకరించాల్సిందే :( అప్పుడెప్పుడో మీఅందరికీ చెప్పిన 30+ నుండి  ఇదిగో ఈ మధ్యే 40+ లోకి అడుగుపెట్టాను అతికష్టంగా  ( ఎప్పుడు అని అడగకండి, నా చిన్ని మనసు చిన్నబుచ్చుకుంటుంది :(  ) మొన్నామధ్య ఎప్పుడో మా బాబు "ఇంకెన్నేళ్ళమ్మా నీకు 40+ " అని అడిగాడు హ...హ ....నేను మటుకు తక్కువ తిన్నానా "50+ వచ్చేదాకా రా!! " అని సమాధానం. :

చిన్నప్పుడు నా తోటి వాళ్ళల్లో ఎవరన్నా కళ్ళజోడు పెట్టుకున్నారంటే బాగా చదువుతారు , మాంచి తెలివయినవాళ్ళని అనేవారు. నాకు కూడా ఓ కళ్ళజోడు పెట్టుకోవాలనిపించేది. ప్చ్! మనిష్టమా  ఎదన్నా కావాలనిపిస్తే ఇలా వెళ్ళి అలా తెచ్చుకొని పెట్టుకోడానికి అన్నీ అమ్మని అడగాల్సిందే.. అడిగితే "భూమికి జానేడు బెత్తెడు లేవు.. నీకెందుకే కళ్ళజోడూ !"  అని ఓ పెద్ద ధీర్ఘం తీసేసి అదేదో అడగకూడనిది అడిగినట్లుగా బుగ్గలు నొక్కేసుకుని వచ్చేవాళ్ళకి వెళ్ళేవాళ్ళకి పక్కున నవ్వేసి చెప్పి శాంతపడేది మా అమ్మ.  ఇంక నేను మాట్లాడానికి ఏముంది.

సరే! కాలేజ్ చదువులు.. అప్పుడిక కళ్ళజోడంటే కాస్త మోజు తగ్గింది దానికి తగ్గట్లు నాకున్న స్నేహితుల్లో కళ్ళజోళ్ళు ఉన్నవాళ్ళు వేళ్ళమీద లెక్కపట్టొచ్చు. ఎదో మనకి ఏ "సైట్" లేదులే!  అన్న సంతృప్తి. అలా అసలు ఈ కళ్ళజోడు అన్న concept కి నేను దూరంగా ఉన్నాను. కాని మరి ఇప్పుడో.. :((((((

40+ మార్పులు అంగీకరించాలి... తప్పట్లేదు .. జానెడు బెత్తెడు ఉన్నప్పుడు అమ్మని అడిగిన ఈ కోరిక ఇప్పుడు బారెడు ,(weight)  మూరెడు (height) ఉన్నప్పుడు తీరుతోందన్నమాట .. ఇప్పుడసలు ఇష్టంలేదు కాని తప్పదు మరి,, అది సంగతి.. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే "రమణీ లలామ నవ లావణ్యసీమ"    కాస్తా   "రమణి లలామ కళ్ళద్దాల భామ... బామ్మ"  అయిందన్నమాట. ఇప్పటికిదే  రేపు జరగబోయే నా పుట్టినరోజు వచ్చిన మార్పు.. 

 (ఇంకా కొత్త ఫొటో(with spectacles) తీయలేదు మరి.. అందాక అన్నమాట ఇది. :)) 


ముజ్కో తోడ రౌండ్ ఘుమాకే
"రమణి  కే జైస చెష్మా లగాకే"
కొకొనట్  మే  లస్సి మిలాకే

ఆజా  సారే మూడ్ బనాకే
ఆల్ ది రమణి ఫాన్స్ 
( ఇక్కడ రమణి ఫాన్స్ అంటే ఆత్మీయులన్నమాట,,, )
డోంట్ మిస్ ది ఛాన్స్..


:)))))))))))))))))))) అదన్నమాట విషయం మరి విష్ చేసేయండి...Ready 1.........2............3...:))))))))

11.10.2013

ఆత్మీయ సమావేశం

ముందుగా శ్రీ వాక్యంతో...

"కాలం ఎంత గడుసుదో .. నువ్వుంటే పరుగెత్తిపోతుంది వాయు వేగంతో..."   -శ్రీ వాక్యం

నిజంగానే రసాత్మకం కదూ :)

 (ఆర్ వి ఎస్ ఎస్ శ్రీనివాస్ గారు అద్భుతమండీ!  మీ ఏక వాక్య కవితా సహస్రం... దేనికదే సాటి .. పోటీ మాట లేదు )

నిజమే మరి ఈరోజు ఫేస్ బుక్ ఆత్మీయుల  సమావేశం ఉంది  (face book positive minds meeting ) అని శ్రీధర్ గారు అటు ఫేస్ బుక్ లోను, ఇటు గూగుల్‌లోను చెప్తుంటే మొదటి సమావేశానికి నేను వెళ్ళలేకపోయాను ఇప్పుడయినా  కుదురుతుందో లేదో అని చాలా సార్లు అనుకున్నాను. మొత్తానికి కుదిరింది. శ్రీధర్ గారికి బోల్డు నెనర్లు. ఇలా ఆత్మీయంగా మేము , మీరు , మనమందరం కలిసే చక్కటి వేదికని అమర్చినందుకు. ఇక సమావేశ సమయం గం 4.30ని.. సరిగ్గా ఆ సమయానికి ముఖపుస్తక పర్చయస్తులు వారి స్నేహితులు, సన్నిహితులు, హితులు దాదాపు 70 మంది దాకా వచ్చారు. సమావేశం కృష్ణకాంత్ పార్క్ లో జరిగింది. అందరూ అప్పటికప్పుడు ముఖ/ పరిచయం చేసుకున్నవాళ్ళమే


 అందరి పరిచయాల తరువాత...సమావేశమంతా  ఫేస్ బుక్ , ఇతర సోషల్ నెట్ వర్క్ ల వల్ల కలిగే పరిచయాలను ఎలా సద్వినియోగ పరుచుకోవాలో, ఏవిధమైన దృక్పధంతో ఉండాలో ఎంతో చక్కగా సందేశాత్మకంగా పలువురు వక్తలు తెలియబరచారు. ఆ వివరాలు క్లుప్తంగా ఇక్కడ:



ముందుగా నల్లమోతు శ్రీధర్ గారి మాటల్లో చెప్పాలంటే: "మన మానవ జన్మ ఎంతో ఉత్తమమైనది, నిజానికి మనమందరం చాలా అదృష్టవంతులం. ఎదో చేయాలి , ఎదో చెయ్యాలి అన్న తపన చేతల్లో చూపించండి, మనకున్నది ఒకే జీవితం ఈ జీవితాన్ని నిస్సారంగా, ఏమి చేయలేమనుకుంటూ  కాలాయాపన చేయకుండా , మన తల్లితండ్రులు మనకిచ్చిన ఈ జీవితానికి ఏదో ఒక సార్థకమయిన పనితో విలునిద్దాము. మన వ్యక్తిత్వాన్ని మన స్వతంత్ర్యతని  మంచి పనులు చేయడానికి ఉపయోగిద్దాము. ఈరోజు ఎంతో మంది రోడ్డు మీద అనాధ బాలలు ఉన్నారు వాళ్ళతో పోల్చుకుంటే మనకిచ్చిన ఈ విలువైన జీవితానికి, విలువైన సమయానికి.. మన తల్లితండ్రులకి  రుణపడి ఉందాము "మంచి పనులు " చేయడం ద్వారా."

ఎంత చక్కటి సందేశం కదా!


ఇక పెద్దవారు బ్రహ్మానందం గారు: తన పేరే తనకి మంచి వైబ్రేషన్ అంటున్నారు. చిన్నప్పుడు ఈ పేరేంటి అసలు పలకడానికి రావడం లేదు ఎందుకు పెట్టారు అని అనుకున్న ఈ ఆరడుగుల బ్రహ్మానందం గారు ఇప్పుడు తన పేరంటే తనకెంతో ఇష్టమని.. తనకి ఆజానుబాహుడు బాహుబలి అయిన ఆ ఆంజనేయుడి అండదండలు ఎలా ఉన్నాయో అలా వారి దీవెనలతొ ఇప్పటికీ తన ఉపాధ్యాయ వృత్తి పదవీ విరమణ తరువాత సంఘ సేవకి అంతే విధంగా అంతే ఆనందంగా తోడ్పడుతోందని అన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఈ సాంకేతిక వసతులు , సోషల్ నెట్వర్క్లు తనని ఎంతగానే తను సేవ చేయాలి  అనుకున్నవారికి దగ్గర చేశాయని, వీటిని ఇలాగే ఉపయోగించుకోవాలని ఉధ్ఘాటించారు. 



ఇక తరువాత ఆర్ వి ఎస్ ఎస్ క్లుప్తంగా చెప్పాలంటే శ్రీ గారు(వారి కలం పేరు): ప్రేమ అంటే ఒక్క ప్రేయసి ప్రియుల మధ్య ఉండేది మాత్రమే కాదు ప్రేమ అనే పదానికి నిర్వచనం ప్రేమే.. ఇంక వేరే ఏ పదం ఆ పద నిర్వచానికి సరిపోదని, అలాగే ఇప్పటి సినిమాలు చూసి యువతరం ఆ మోజులో పడొద్దని, తన కవితలన్ని ప్రేమ మీదే అయినా అవి ఈ సినిమాల్లో చూపిస్తున్న లేదా ఇప్పటి యువతరం పాటిస్తున్న ప్రేమ పొకడ కాదని, ఇందులో ఎంతో భావార్థం ఉందని, ఆ ప్రేమ ఏ ఇద్దరి మధ్య అయిన అవచ్చు ఒక్క పేయసి ప్రియులు మాత్రేమె కాదు,సందర్భానుసారమును బట్టి తన వాక్యాలు అందరికి ఉపయోగపడతాయని చెప్తూ, కంప్యూటర్ పై ఒక చక్కటి భావ కవితని చెప్పారు.



ఇప్పుడు మేమే అంటే నేను కాదు (నాకంత దృశ్యం లేదు) మహిళలం అన్నమాట...:)



ఉషా రాణి గారు: ఫేస్ బుక్ అంటే చాటింగ్ మాత్రమే కాదు, ముఖ్యంగా మాలాంటి మధ్య వయసువారికి ఫ్రండ్ రిక్వస్ట్ పంపిన వెంటనే "చాటింగ్"  అంటే అది పద్ధతి కాదని, ఎంతో విలువైన సమయాన్ని ఎదో కొద్దిపాటి సృజనాత్మక ఆలోచనలతో కవితలు కథలు రాసుకునే తమలాంటి వారిని చాటింగ్ అంటూ హింసించవద్దని/వేధించవద్దని, అసలు తమకు చాటింగ్ చేసే ఉద్దేశ్యం ఉందో లేదో కనుక్కోడం ఉత్తమమయిన పద్ధతని, చాటింగ్ వల్ల కలిగే నష్టాలను వివరించారు. అలగే మన సంస్కృతి ఎంత బ్రష్టు పడిపోయిందో, మన గురించి గొప్పగా చెప్పుకునే పాశ్చ్యాత్తులు ఇక్కడికి వచ్చి మనల్ని మన అశుభ్రమైన వీధులని, చూసి ఏవిధంగా మన గురించి అక్కడ రాస్తున్నారొ ఉదాహరణలతో వివరించారు. "జూ"  లో జరిగిన ఒకానొక తన అనుభవాన్ని కూడా ఎంతో ఆవేదనతో చెప్పారు. మన సోషల్ నెట్వర్క్ ద్వారా  అందరికి చక్కటి సందేశాల ద్వారా  అందరిని మార్చుదాము రండి అని పిలుపునిచ్చారు.


అనూరాధ గారు: అమ్ము అని అందరూ పిలుచుకునే అనురాధ గారు నాది భావవల్లరి గ్రూప్, భలే అల్లరి గ్రూప్ అంటూ ఎంతో సందడి చేశారు. ఫేస్ బుక్ గురించి దాదాపుగా ఉషారాణి గారు చెప్పినవే ఇంకొంచం విపులంగా చెప్పారు, తరువాత శ్వేత వాసుకి గారు, గీత గారు ఎంతోమంది తమ అనుభవాలతో కూడిన చక్కటి సందేశాలనిచ్చారు. 





ఇక నేటి యువతరం కూడా వారి వారి అనుభవాలను చెప్తూ చక్కటి సందేశాలతో   సమావేశాన్ని విజయవంతం చేశారు.
















చివరగా మళ్ళీ శ్రీ వాక్యంతో..

"పూరణ తెలిసేది వచ్చినప్పుడైనా.. లోటు తెలిసేది నీవు వెళ్ళిపోయాకే.. "

అందరం ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళాక అనిపించింది మళ్ళీ ఎప్పుడో కదా అని.. లోటు తెలిసిందన్నమాట.. :(


ళ్ళీ చివరగా

శ్రీ గారు బోల్డు బోల్డు నెనర్లు శ్రీ వాక్యం .. రసాత్మకం.. కి.