2.26.2015

చిలకమ్మ



కాకినాడ రామారావు పేటలోని ఓ పెళ్ళివారిల్లు
అంతా సందడి సందడిగా ఉంది తెల్లవారుఝామున పెళ్ళి రాత్రి 9.30 కి పెళ్ళికూతురు గౌరిపూజలోనో మరి వేరే ఏ విషయంలోనో హడావిడిగా ఉంది. బ్రహ్మం గారి మంత్రాలు మైక్ అవసరం లేకుండానే భూమిని దద్దరిల్లేలా చేస్తున్నాయి. కళ్యాణమంటపం చుట్టూ పిల్లలందరూ తిరుగుతున్నారు. విడిదింట్లో పెళ్ళికొడుకు తాలుకూ సందడి కూడా కనిపిస్తోంది. డేట్ కూడా బాగా గుర్తుంది నాకు, ఎప్రిల్ 16 పెద్దక్క(పిన్ని కూతురు) పెళ్ళి సందడి అది. ఎప్రిల్ 24 పెద్దన్నయ్య(పిన్ని కొడుకు) పెళ్ళి 8 రోజుల తేడాతో అనుకున్నారు ఇద్దరి పెళ్ళిళ్ళు వేసవి సెలవలు ఇక సందడే సందడి మా అందరికీ అందులో మా కుటుంబాలలో మొదటి పెళ్ళేమో... ఇక అల్లరంతా మాదే అన్నట్లు ఉన్నాము. నేను అప్పుడు 7th లోనో మరి 8th లోనో ఉన్నాననుకుంట. ఇక వచ్చిన చుట్టాలని ఒక్కొక్కరిని అమ్మ పరిచయం చేస్తోంది. అక్క ఈడు వాళ్ళందరూ ఒక జట్టుగా చేరి ఆడుకుంటుంటే, నా ఈడూ వాళ్ళందరూ ఒక జట్టు గా చేరి ఆడుకుంటున్నాము. ఆటలో భాగంగా విడిదింటికి పక్కగా ఉన్న ఓ గదిలోకి వెళ్ళి దాంకున్నా .. సన్నగా మాటలు వినిపిస్తున్నాయి.

"సరిగ్గా నించో"
"ఇదిగో అలా చేయి వేలాడేయకు.. ఈ పమిటని ఇలా పట్టుకో ఈలోపులో కుచ్చిళ్ళు సద్దుతాను" 
"అబ్బా ఒక్క పదినిముషాలు ఓపిక పట్టు నా బంగారు కదూ చీర సరిగ్గా కట్టనీ"


అలా మాటలు వినిపిస్తుంటే ఎవరబ్బా? అని లోపలికి తొంగి చూశాను ఒక చిన్న పాప ఒక పెద్దావిడకి చీర కడుతోంది ఆ పెద్దావిడేమో చిన్న పిల్లలా కట్టుకోనని మారాం చేస్తోంది. చూడ్డానికి భలే విచిత్రమనిపించి అమ్మ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళాను "అమ్మా చూడు అక్కడ అంటూ..." చెప్పాను. అమ్మేమి కంగారు పడకుండా కనీసం కూర్చున్న చోటినుండి కూసింత అయినా కదలకుండా...

"ఆవిడ మా అత్తయ్య అమ్మా! .. మా మేనమామ బార్య అదిగో ఆ మూలగా కూర్చున్నారు చూడు పెద్దాయన మా మావయ్య . అందరూ తుని తాతగారు అంటారు" అని వివరం చెప్పింది.

తుని తాతగారు నాకు తెలుసు..మా ఇంటికి వచ్చేవారు మిలట్రీలో చేస్తారు అదే మిలట్రీ డ్రెస్ లో వచ్చేవారు ఇంటికి, బాగా గుర్తు అదే అన్నాను అమ్మతో.. ఆయన బార్యేనే ఇప్పుడు నువ్వు చూసింది ఆ చీర కడ్తున్నది వాళ్ళ మనవరాలు "చిలకమ్మ" పాపం చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు దానికి..వాళ్ళకి ఇదొక్కతే, దానికి వీళ్ళు.. అని చెప్పింది అమ్మ.

ఆ తరువాత ఆ పెళ్ళి లోనే మేమిద్దరం బాగా క్లోజ్ అయ్యాము .. నాకన్నా రెండేళ్ళో మరి మూడేళ్ళో చిన్నది. తలవెంట్రుక మొదలుకొని కాలి చిటికెన వేలు దాక ఏ పార్ట్ వదలకుండా బంగారం అభరణాలతో నింపేసేది. జడంతా బంగారు చేమంతి పూలు... అలా మొదలుకుని ఆఖరికి కాలికి కూడా బంగారు పట్టీలే... అంత చిన్నపిల్ల అలా అలకరించుకుంటే చూడడానికి ఎంత బాగుండేదో. సరే చిన్నపిల్ల తనలా తయారవడం ఒక ఎత్తయితే వాళ్ళ అమ్మమ్మని అలా తయారుచేయడం మరో విశేషం ఆవిడ ఆ నగలని మోస్తూ ఎలా ఉండేదా అని అప్పుడు తెలియలేదు కాని ఇప్పుడనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడా చిన్నప్పటి రూపం ఆ అలంకరణ చిన్న వయసులోనే ఆ పెద్దరికం అవి తలుచుకుంటుంటే నాకు గురజాడ వారి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ , భానుమతి గారి అత్తగారి కథల్లో ఓ కథ లో ఓ పసిపిల్ల పురిటికి వచ్చిన తన పిన్ని పసిపిల్లల విషయంలో పెద్దాపేరక్క కబుర్లు గుర్తోస్తాయి. అన్నట్లు మర్చిపోయా ఈ పుత్తడి బొమ్మ పేరు కూడా "అన్న పూర్ణ " అలాగే ఉంది అప్పటికి ఇప్పటికి కూడా పుత్తడి బొమ్మలా...

రెండురోజుల క్రితమే చూశాను మళ్ళీ.. అడపా దడపా ఎవో ఫంక్షన్‌లకి చూస్తున్నా మాట్లాడుకోవడం తక్కువే తన హడావిడికి కాని ఈసారి పెద్ద హడావిడి లేదు కాబట్టి ఫోన్ నెంబర్ కూడా తీసుకునేంత వీలు చిక్కింది. తీసుకుని నిన్న మాట్లాడాను ఒక్కసారి అలా పాత రోజుల ప్రేమతో కూడిన ఆప్యాయతలు, ఆ కలివిడి తనం అన్నీ గల గలా పారే సెలయేరులా ఆ మాటలు నన్ను చాలా సేపు అక్కడినుండి తీసుకురాలేకపోయాయి.
*****

పిన్ని సంవత్సరీకాలు కిందటి సంవత్సరం మార్చ్ 8 న మన ఫేస్ బుక్ ఫ్రండ్స్ కలుద్దామని విజయలక్ష్మి మురళీధర్ గారిని ముఖ్య అతిధిగా పిలిచారు అక్కడికి బయల్దేరుతున్నాను ఇక్కడ ఈ విషయం తెలిసింది పిన్ని "నో మోర్" అని... అలా వెనక్కి వచ్చి అమ్మతో వెళ్ళాను. ఆ పిన్ని సంవత్సరీకాలకి ఈరోజు కజిన్ వాళ్ళింటికి వెళ్ళాను. కార్ దిగగానే వెనకనుండి "బాగున్నావా వదినా!" అంటూ పలకరించేసరికి ఎవరా అని తిరిగి చూస్తే నేను పైన చెప్పిన పుత్తడిబొమ్మ ఎంత అందమో ... మరీ చిన్నప్పుడే పెళ్ళి చేయడం వల్లో ఏమిటో కాని కొంచం పెద్దరికపు ఛాయలు కనిపిస్తున్నా చూడ్డానికి పల్లెటూరిని అంతా తన కట్టుబొట్టులో ఇక్కడికి తీసుకొచ్చిందా అన్నంత అందంగా ఉంది. మెడనిండా చేతినిండా.. అదే చిన్నప్పటి రూపు కళ్ళ మెదిలింది. అమ్మని జాగ్రత్తగా లోపల కూర్చోబెట్టి మేమిద్దరం కబుర్లల్లో పడ్డాము. ఇద్దరు పిల్లల పెళ్ళిల్లు అయిపోయాయి ఆ పిల్లలికి పిల్లలు, వాళ్ళ బావగారు, తోడి కోడలు చనిపోవడం మొదలుకొని ఒక్కొక్కటి ఏకరువు పెట్టి భోజనాల టైం కి వాళ్ళ కుటుంబ చరిత్ర అంతా చెప్పేసింది. "నువ్వు చెప్పు వదినా!" అని అంటే ఏది అంత చరిత్ర లేదు పిల్లలు చదువుకుంటున్నారు, నేను ఉద్యోగం చేస్తున్నా తప్పించి ఏమి చెప్పాలో కూడా తెలియలేదు నాకు ఆ మాటకారికి. ఇవన్ని చెప్పడానికి ముఖ్య కారణమేమిటంటే ఇంటికి వచ్చినా నాకేందుకో తన మాటలలా చెవిలో వినిపిస్తూ ఉంటే ఒకసారి మాట్లాడాలి అనిపించి ఫోన్ చేశాను. మళ్ళీ అదే అప్యాయత నిండిన స్వరం నాకన్న చిన్నది కాని నన్ను మించిన పెద్దరికంతో "అలా కాదు బంగారూ! శ్రావణ మాసమా.. ఆ తరువాత శుద్ధ ఏకాదశి.. చూడు నాన్నా! ఒకసారి తెలుగు నెలల బట్టి " అంటూ నేనేదో విషయం గురించి అడిగితే తెలుగునెలలన్నీ తన ఒళ్ళో దాచిపెట్టుకున్నట్లు ఠకా ఠకా ఆ చెప్పే తీరు.. "అత్తా నువ్వంటే నాకు ప్రాణం అత్తా నువ్వనే కాదు మీ అక్కచెల్లెళ్ళు అందరూ నావాళ్ళు, నాకెవరున్నారు చెప్పు! " అంటూ అమ్మని పట్టుకుని అన్నతీరు... తెలుగుదనానికి, తెలుగు మాటలకి , తెలుగు కి ఆవిడ తన మాటలతో పట్టం కట్టిన తీరు చూడగానే నాకనే కాదు ఎవరికయినా ముచ్చటేస్తుంది. పేరుకి తగ్గట్టు గలా గలా పారే చిలక పలుకుల చిలకమ్మ ఈ పుత్తడి బొమ్మ అనిపించింది. బాపు బొమ్మ అని కూడా అనచ్చు.. ఆ అందాన్ని. 
smile emoticon

*****

కొసమెరుపు: చిలకమ్మని చూసి అమ్మ ముచ్చటపడిపోయి "చిన్నప్పుడు ఎంత కుదురుగా కూర్చునేదో.. భలే ముచ్చటేసేది నిన్ను చూస్తుంటే " అని అన్నప్పుడు.. "ఆ ! మరి మాకు అలా ఏడు వారాల నగలు పెట్టండమ్మా! మేము కదలకుండా కుదురుగా కూర్చుంటామని" నేను హాస్యమాడాను.. ఆ మాటకి అనుకోకుండా అక్కడ కూర్చున్న అన్నయ్యలు, వదినలు, అక్కలు అందరూ చప్పట్లు.. బాగా చెప్పావు అంటూ... హహహ చక్కటి వాతావరణమది ..