మీ అందరికి చిరుపరిచితురాలు, వనితావని వేదిక బ్లాగరు, వేద (మా అక్క) పుట్టిన రోజు సందర్భంగా మళ్ళా ఆ మధుర స్మృతులు మీ ముందు ..
పిల్లలందరూ కలిసి అక్కచేత కట్ చేయించిన కేక్ సంబరం.. :)
పిల్లలందరూ కలిసి అక్కచేత కట్ చేయించిన కేక్ సంబరం.. :)
******
చిన్ననాటి ఆ అనుభూతులు కలిగిన ఆనందాలు.. కష్టాలు బాధలు అన్నీ ఒక్కోసారి మదిని స్పృశిస్తుంటే అనిపిస్తుంది ఓ మంచి నేస్తం వుంటే బాగుండేది ఇలాంటి అనుభూతులని పంచుకోడానికి అని..
అమాలపురం దగ్గిర గోడిలంక... చిన్న పల్లెటూరు.. ఇప్పుడెలా వుందో కాని అప్పుడు ఆ ఒండ్రుమట్టి... ఈతకాయలు .. చెరువు గట్టుదగ్గర ఆటలు అరుగుమీద తాతగారి పంచాయితులు అప్పుడప్పుడు వెళ్ళినా ఎప్పుడు గుర్తుండిపోయేవి.. పెద్దకళ్ళాడొస్తున్నాడంటు (అప్పట్లో మా ఇంట్లో పాలేరు సూరిగాడు అని పిలిచేవారు) పాలేరుని చూపించి భయపెట్టి అన్నం తినిపించే అమ్మమ్మ తీయని గోరుముద్దలు... తలుచుకొంటే ఎప్పుడు అక్కడే అలా వుండిపోతే ఎంత బాగుండేది అన్నంత హాయిగా వుంటుంది.. నేను మా బడి సెలవలిస్తే మా తమ్ముడిని తీసికెళ్ళడం కుదరకపోతే అమ్మ నన్ను తీసికెళ్ళేది.. అలా నేను వెళ్ళింది వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు కాని ఆనందాలు మాత్రం బోల్డు..
అదిగో అలా ఓ వెసవి సెలవల ప్రహసనం.. అక్క అక్కడే చదువుకొంటూ ఉండేది..అమ్మమ్మ కి తోడుగా అని పంపించారు... సో!! నేను అక్కడివారికి కొత్త.. పైగా పట్నం నుండి వచ్చాను అంటే ఇంకా కొత్త + వింత(అని నా ఆలోచన)..
లేక లేక పుట్టాడని అన్నయ్యని... ఆడపిల్లల్లో మొదటిదని అక్కని... చివరగా పుట్టాడు పసివాడు అని తమ్ముడిని మా అమ్మ అందరిని గారంగా ప్రేమగా చూస్తుంది ...నన్ను మాత్రం వదిలేసిందని నాకు చిన్నప్పటినుండి మా అమ్మ మీద ఒక అపోహ ఉండేది...(అసలు మధ్యలో పుట్టిన అందరికి ఈ ఆలోచన వుంటుందేమొ) ఆ ఆలోచన.. మా అక్కకి నాకు క్షణం పడకుండా చేసింది చిన్నప్పుడు..
గోడితిప్ప సంతకి వెళ్దామని అక్క నన్ను బయల్దేరతీసింది.. మార్గ మధ్యలో తొందరగా నడూ అంటూ వెనకనుండి ముందుకు తోసింది.. జాగ్రత్తగా వుండకపోవడమో లేక ఇంకేంటో కాని పడ్డాను.. పెదవి చిట్లి రక్తం.. అందరూ నీళ్ళతో కడుగమ్మా అని సలహాలు... నాకు మటుకు పిచ్చ ఆనందం.. నాకు ఛాన్స్ దొరికింది.. నాకొస్తున్న రక్తం చూసి ఈరోజు ఇంట్లో అందరూ అక్కని తిడ్తారు... అమ్మయితే కొడ్తుందేమొ కూడా.. లేకపోతే ఎప్పుడు అక్కనే ముద్దు చెయ్యడం.. నన్ను అసలు పట్టించుకోరు... వీళ్ళందరు కడగమంటున్నారు .. ఈ రక్తం రావడం ఆగిపోతే అసలు దెబ్బ సరిగ్గా తగలలేదనుకొంటారు... చిన్నదే అని వదిలేస్తారెమో... అమ్మో అసలు అలా వీలు లేదు... అక్క పక్కనుండి పోరు పెడ్తోంది.. దా !!అక్కడ నీళ్ళు వున్నాయి కడుగుతాను అని.. ఆహ.. వింటేనా.. నాకేమక్కర్లేదు.. చెప్తానుండు నీ పని..(మనసులో ఆనందం ఈరోజు అయిపోయింది నీ పని) మద్య మద్యలో ఏయ్! ప్లీజ్ అమ్మకి చెప్పకే నేను తోసానని.. నీకు నా గౌన్లన్నీ ఇచ్చేస్తాను అని అక్క బతిమాలుతుంటే నాకు నవ్వు.. నా ఆలోచనలు మాత్రం.. ఇంటికెళ్ళగానే చెప్తే అమ్మ అక్కని కొడ్తుందా?? ఊరందరు వస్తారా?? అయ్యో !! ఎంత రక్తమో అని బాధపడ్తారా??.. అమ్మమ్మ "నా బంగారు తల్లి నీకింత దెబ్బ తగిలిందా" అంటూ ఆ బుజ్జగింపు ఎంత బాగుంటుంది.. ఇంకా గట్టిగా ఏడ్వాలి ఈ ఏడుపు సరిపోదు.. అక్క బతిమాలుతూనే వుంది ఇంకా... లేదు అసలు వినకూడదు..
ఇల్లు దగ్గరికొచ్చింది... తలుపుకొట్టగానే అమ్మమ్మ.. అయ్యో!!తల్లి ఏంటే రక్తం.. ఏమయ్యింది (అమ్మమ్మ అనుకున్నట్లుగానే స్పందించింది కాని అమ్మే ఏంటి అలా అక్కడినుండి కదలడం లేదు అన్న ఆలోచన ) అని అడగగానే.. అక్క తోసింది అంటూ గట్టిగా ఏడుపు.. నేను అనుకొన్నది ఏమి జరగట్లేదు... అందరు నింపాదిగానే వున్నారు ఎవరూ కంగారుపడట్లేదు... ముఖ్యంగా అమ్మ.... అక్కని ఏమి అనట్లేదు.. పోనిలే అమ్మా!! దీనికే కాస్త దుడుకుతనం ఎక్కువ అది చూసుకోలేదేమొ.. కాస్త కాఫిపొడుం పసుపు పెడ్తే అదే తగ్గిపోతుంది.. ఏడవకే!! నీకేమి కాలేదు అని నావైపు చూసి కసరడం..
హు! అమ్మ ఎప్పుడూ ఇంతే ...నేను ఎప్పుడూ డామిట్ కధ అడ్డం తిరిగింది అని అనుకోవడమే..
ఇలాంటి సంఘటనలు (మా అక్కకి నాకు సంబంధించి ) చాలానే వున్నాయి .. కాని మా అక్క శాంత స్వభావాన్ని నా దుడుకుతనాన్నీ సమన్వయించేసి సర్ధి చేప్పేసేది అమ్మ..అప్పుడవి కాఫిపొడుమంత చేదుగా వున్నా ఇప్పుడు తలుచుకొంటుంటే సరదాగా మంచి కాఫీ తాగిన ఆనందాన్ని ఇస్తూవుంటాయి...
*****
cedu kaafee pudumu ninche kammati kaafee vastundi mari :-)
ReplyDeleteManchi coffee lanti post![:)]
ReplyDeleteనిజంగానే మంచి కాఫీ లాంటి పోస్ట్
ReplyDelete