2.24.2009

పుత్తడి ఇత్తడి

బ్లాగు లోకమంతా యమా డల్ గా ఉంది, ఎక్కడా ఎవరి అలికిడి లేదనిపిస్తోంది ఏమైంది చెప్మా! అని ఒకసారి, ఫ్లో చార్ట్ వేసుకొంటే తెలిసింది,అందరూ శివరాత్రి ఉపవాస జాగారణల ముభావమది అని . సరే ముభావం నుండి బయటికి రప్పించలేను కాని, ఈ టపా చదివి ముసి ముసి నవ్వులు నవ్వేసుకొందాము ఒకసారి... మరిటువైపు వచ్చెయకూడదూ.. ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వుల గుస గుసలన్నీ చెప్పేస్తాను.

******

ఇత్తడి సామాను, అబ్బో! నాకసలు పడదండి బాబు. "అదిగో చూడు కాస్త చింతపండు నానబెట్టి సుబ్బరంగా పట్టించవే, కిలుము వదల్లేదూ" అంటూ అమ్మ మా చేత వాటిని "బంగారంలా మిల మిలా మెరవాలే," అని సాధిస్తూ తోమించేసరికి, మా చదువుల మాటెలా ఉన్నా, ఇత్తడి గిన్నెల కిలుము పోగొట్టి , అదే మా అమ్మ చెప్పినట్లు వాటిని బంగారంలా మెరెసెలా చెయ్యడంలో ప్రావీణ్యత సాధించామని చెప్పాలి(అప్పుడు మాత్రమే) . ఇలాంటి ఇత్తడి సామాను అమ్మావాళ్ళింట్లో చాలానే ఉన్నాయి. పెద్ద గంగాళం నుండి, చిన్న కాఫి గిన్నె వరకూ అన్నీ ఇత్తడే. పురాతన ఇత్తడి వస్తు ప్రదర్శన అంటూ జరిగితే , మా ఇంటిని ముందుగా నామినేట్ చయ్యొచ్చు. "మంచినీళ్ళీవ్వమ్మా!" అని అడిగామనుకొండి, నా ఎత్తు ఇత్తడి గ్లాస్ ప్రత్యక్షం, దాహం తీర్చుకోడం కన్నా ముందు దాని బరువు మొయ్యలేము. మరి, అన్ని ఉన్నా , అమ్మ మాలో ఎవరికన్నా సరె, చిన్న ఇత్తడి స్పూన్ ఇచ్చినా సరె, ఇహ ఆరోజు ఆవిడ మీద నిద్రాదేవి అలిగిందన్నమాటే. ఫొన్ల మీద ఫోన్లు చేసి ఆ స్పూన్ తెప్పించుకొనేదాక ఆవిడ మనసు కుదుటపడదు. ఈవిడకే అనుకొంటే వీళ్ళ అమ్మగారికి అంటే మా అమ్మమ్మ ఇంకా చాధస్తంతోనో, మరి మా అమ్మకి పోటి గానో తెలీదు కాని అమ్మావాళ్ళింట్లో వాటికి రెట్టింపు సమకూర్చుకొంది . అక్కడ ఊర్లో ’సామాను గది’ అన్న పేరు గల గది నిండా కాలి చిటికెన వేలు కూడా దూరని సామాను.

అమ్మమ్మ పోయిన ఆరు నెలలకనుకొంటా, పిన్నీవాళ్ళు, అమ్మ వాటాగా ఓ పెద్ద గుండిగ పంపించామని టెలిగ్రాం ఇచ్చారు. ఓ 50 బకేట్ల నీళ్ళు పట్టె పెద్ద గుండిగ అది.

ఆ టెలిగ్రాం వచ్చిన రోజు మా అమ్మ హడావిడి చూడాలి, "బాబి!(అన్నయ్యని అలా పిలిచేది) ఓ సారి స్టేషన్ దాకా వెళ్ళిరారా! ఎవడన్నా ’నాది’ అని తీసేసుకొంటాడెమో! వీళ్ళోకళ్ళూ.. గుండిగ ఒక్కటే పంపిస్తున్నారు, [గుండిగ ఫామిలీ రావడం లేదని బాధేమో :) ] ఎవరో ఒకరు వెంట తీసుకొనిరావచ్చు కదా!.

"అబ్బా అమ్మా! ఇంకా ట్రైన్ అక్కడినుండి బయల్దేరిందో లేదో, ఇప్పుడు వెళ్ళి నేనేమి చేస్తానమ్మా" అని అన్నయ్య సమాధానం.

"ఎవరూ వినిపించుకోరు నామాట, " అని సణుగుతూనే ఆరోజు అయిందనిపించింది అమ్మ.

మర్నాడు తెల్లవారుఝామున అన్నయ్య ని లేపేసి, "ఓరే! ఇప్పుడిక నువ్వు స్టేషన్ కి వెళ్ళక పోతె నాకు మనసు ప్రశాంతంగా ఉండదు" అంటూ.. బలవంతంగా పంపించింది.

అన్నయ్యని పంపింది కాని, ఆ గుండిగకి ఎక్కడ సొట్ట పడుతుందో, ఆ ట్రైన్ వాడు సరిగ్గా పెట్టాడో లేదో , ఎవరన్నా దొంగ వెధవ దాని మీద కన్నేసాడేమో!, వీడు జాగ్రత్తగా తీసుకొస్తాడో రాడో, ఇన్ని సణుగుడులు, విసుక్కోడాల మధ్య మమ్మల్ని స్కూలికి పంపలేదు. ఆరోజు ఆవిడ అన్యమస్కంగా వండిన వంటలు చెప్పాలంటే .... ఎందుకులెండి, మళ్ళీ మనసు కష్టపెట్టుకొంటుంది మా అమ్మ.





ఎట్టకేలకు మధ్యాహ్నం ఒంటిగంట టైం లో పూర్తిగా కిలుమెక్కి వున్న ఓ పాత కాలంనాటి గుండిగ తో ఆటో దిగాడు అన్నయ్య. గుండిగని చూడగానే (అన్నయ్యని కాదు) ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది అమ్మకి, తటాలున వెళ్ళి ఆ గుండిగ అందుకొని బయట మోరిలో వేసి తెల్లగా బంగారంలా మెరసేలా తోమాలని మా అక్క చెళ్ళెలిద్దరికి పురమాయించింది పట్టరాని ఆనందంతో...

అమ్మో! కష్ట సుఖాలని కావడి కుండలతో పోల్చారు కాని, అప్పుడు చూడాలి మా అక్కా చెళ్ళెళ్ళ తంటాలు. కష్టం:- ఆ గుండిగ తోమడం, సుఖం: - తెల్లగా బంగారంలా మెరిసిపోతోందని మురిసిపోడం.. :( పండగ వచ్చినప్పుడల్లా ఓ రెండు కేజీల చింతపండు, తీసుకొని రావడం, అది చూసి ఎవరన్నా పండగ కదా! ఏ పులిహార కోసమో లేదా ఏదన్నా పిండి వంట చేసుకొంటున్నారేమో, ఇంత చింతపండు తీసుకెళ్తున్నారు అనుకొంటారు. కాని, అబ్బే! ఆంత ఎత్తు, బరువుగల ఆ గుండిగ తోమడమే పండగ/పిండివంటల సందడి మాకు. ఎవరన్నా పండగ స్పెషల్ ఏంటి ? ఏం కొన్నారు అని అడిగితే , నా అరిచెతులవైపు దీనంగా చూసుకొని చెప్పేదాన్ని, ఓ రెండు కెజీల చింతపండు కొన్నాం. ఇక స్పెషల్ ఆ గుండిగని తోమడం అని.

*******

అసలిప్పుడిదంతా ఎందుకు చెప్తున్నాను అనుకొంటున్నారా! మొన్నామధ్య ఎప్పుడో మాట వరసకి మా మరదలు పెద్దొదినకి కొంత సామాను, చిన్నొదినకి కొంత సామాను ఇస్తే బాగుంటుంది అని అంది, మా అమ్మ ఒప్పుకోదు నాకు తెలుసు (మా అమ్మ మరదిలితో కొంచం అత్తగారిలా కొంచం అమ్మలా ఉంటుంది అంటే కోడలు చెప్పింది నేనెందుకు ’సరె’ అనాలి అనే అత్తరికం, అన్నది నా కూతుళ్ళ కోసం కదా అని అమ్మ తత్వం చూపించే్స్తుంది ) కాని ఎందుకో, మళ్ళీ మనసు మారిపోయి, "సరె" అనేస్తే అదిగో ఆ భయానికి మా అమ్మవాళ్ళింటి వైపు వెళ్ళడం తగ్గించాను. ఏ గుండిగో నా చేతిలో పెట్టి "వదినా ఇదిగో మీ వాటా, అంటూ చివర్లో ’ఇట్లు .....ప్రేమతో ...అమ్మ ’ అని సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్ రాసారు అనుకొండి ................... ఇక ఏమి చెప్పమంటారు నా సంగతి , ఇంతే సంగతులు చిత్తగించవలెను.
*********

2.23.2009

సరదా... సరదా....





"పిల్లలూ ఎంతయ్యిందర్రా టైము ఇప్పుడు? "

"మావయ్యా! అర్థరాత్రి 12 గంటలయ్యింది అయ్యింది,..రా మావయ్యా! నువ్వు కూడా మేమిక్కడ ఎంచక్కా పాటలు పాడుకొంటున్నాము."

"మీ పాటలతో ఈ శివరాత్రి నన్ను జాగారం చేయించేట్లున్నారుగా! సరె వింటాను పాడండి.."

"ఏయ్! చిట్టి ముందు నువ్వు పాడు ఆతరువాత ఇలా వరుసగా పాడదాము".

"పిల్లలూ దేవుడూ చల్లని వారే..కల్ల కపటమెరుగని కరుణామయులే,...తప్పులు మన్నించుటయే..."

చాలు !ఒక్క లైన్ పాడండర్రా అవతలి వాళ్ళకి అవకాశమివ్వండి కొంచం!" మావయ్య గద్దింపుతో ఠక్కున పాటేపిసింది చిట్టి.,

"ఏయ్ ప్రసన్నా ఇప్పుడు నీ వంతు నువ్వు పాడు!" అంది చిట్టి.

"చిట్టి పొట్టి బొమ్మలూ చిన్నారి బొమ్మలు , ముద్దు ముద్దు బొమ్మలు బహుముచ్చటైన బొమ్మలూ.."

అలా సాగి పోతోంది పాటల హోరు. జోరు.

చివరాఖరికి నా వంతు వచ్చింది.

నాకేమో ఒక్క పాట గుర్తు రావడం లేదు. చాలా సేపు ఆలోచించగా.. ఆలోచించగా గుర్తొచ్చింది.

"చక్కగా నా శ్రావ్యమైన గొంతుతో నేను పాట అందుకొనే సరికి ..మా మావయ్య నా దగ్గిరికి వచ్చి "సుమా! ఇంకెప్పుడు పాటలు పాడకే ప్లీజ్.." అని చెప్తే ......నాకెంత ఏడుపొచ్చేసిందో.. అందరిని ఏమో "ఒక్కలైన్ పాడండి " అని చెప్పి , నేను ఒక్కలైను పాడే సరికి పాడొద్దు అనడం న్యాయంగా ఉందా అసలు?

"ఛ! ఈ మావయ్యలందరూ ఇంతే" అని, అక్కడనుండి విస విసా వెళ్ళి పడుకొన్నాను.
******


అలా చిన్నప్పుడు శివరాత్రి రోజు జరిగినదీ సంఘటన, అమ్మావాళ్ళందరూ, పిల్లలందరిని మా మావయ్య దగ్గిర వదిలెసి జాగారణ చెయ్యడానికని, గుడికి భజనలకి వెళ్ళేవారు. ఇక పిల్లలికి మావయ్య దగ్గిర సందడే సందడి. అందులో మా మావయ్య కూడా కథలు, కబుర్లు బాగా చెప్తారు. ఆ రోజేమో పాటల ప్రోగ్రాం పెట్టారు. అలా పాటలు పాడుతూ ...పాడుతూ.. నావంతు వచ్చింది కదా ఎంతో ఉత్సాహంతో నేను పాడేసరికి "పాడొద్దని..అలా" ఇంతకీ నేను పాడిన పాట ఏంటో తెలుసా మీకు? .. అప్పుడే కొత్తగా విడలైన సినిమా అది. సెన్సషనల్ సృష్టించిన సినిమా ప్రతిఘటన సినిమాలోని... ఈ పాట..

"ఈ దుర్యోధన దుశ్శాసన........ "

ఇప్పటికి అంటూ ఉంటాడు మా మావయ్య, ఆరోజు నిజంగానే జాగారణ చేయించావు కదా నాతోటి అని.. :) ఈ శివరాత్రి మీరెవరన్నా జాగరణ చేద్దామనుకొంటే నాకు చెప్పండి ఇలాంటి కిటుకులు బోల్డన్ని ఉన్నాయి నా దగ్గిర. :)


అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.
*******