3.12.2009

ఈ భావ సరళి ....తరలి పోదాం రమ్మంటి....

"శుబ్బరంగా కాసిని కుంకుడుకాయలు కొట్టుకొని, అంత మందార నూని తలకి పట్టించి, కుంకుడుకాయ రసంతో తలంటుకొంటే బుర్రలో ఉన్న మట్టి కూడ వదిలిపోదూ.. వెధవ షాంపూలు పట్టిస్తారు తలకి, ఓ మెరుపా పాడా? పాతికేళ్ళకే పండువెంట్రుకలొస్తాయి చెబితే వినరూ... అంటూ... పసుపు, సున్నిపిండి రాసుకొంటే వంటికి పచ్చదనం వస్తుంది. నునుపుదనం అలాగే ఉంటుంది. ఈ సబ్బులులు షాపూలు శరీరం బిగుసుకు పోయేలా చేస్తాయి. అభ్యంగ స్నానం అంటే చక్కగా వెన్న, మీగడ, పసుపు ,సున్నిపిండి, కుంకుడుకాయలు, మందారనూనే ఇవే ..." అంటూ వంటినిగారింపులకి , జుట్టు మెరుపుల గురించి ఆరోగ్య సూత్రాలు అలా అలవోకగా చెప్పేది అమ్మ.
******

అసలు పండగ అంటే కొత్తబట్టల కోసం, చక్కటి పిండివంటల కోసం అయితే పండగ రావాలి దేవుడా.... దేవుడా ....అని దండం పెట్టుకొనేదాన్ని కాని, మా అమ్మ చేసే హడావి
డి , హంగామలకి అబ్బా! పండగ వచ్చిందా అనిపిస్తుంది. ఏంటింతకీ ఆ హడావిడి, హంగామా అంటారా? రండి మీరు చూద్దురు గాని, నాకైతే "అమ్మో పండగలొస్తున్నాయి" అని పరిగెత్తాలనిపిస్తుంది.
*****


"అయ్యో! అయ్యో! అయ్యో! బారేడు పొద్దెక్కింది, వెధవ నిద్దర్లూ మీరునూ, ఆడపిల్లలు కాదూ.. లేవండి లేచి ఆ బాయ్లేర్ అంటించండి. ఇంకా నేను బోల్డు పనులు చేయాలి, ఇంత గొంతు చించుకొని అరుస్తున్నా లెవరేమిటి?? "

"అబ్బా అమ్మా ఎందుకలా అరుస్తావు? లేస్తున్నాము కదా.. ఇంకా టైం నాలుగయ్యింది అంతే ...మరీ ఇంత పొద్దున్నే లేపుతావెందుకమ్మా.. పండగేమి చేసుకోద్దులే పడుకొంటామని.. ఇద్దరం ముణగదీసుకొని పడుకొనే వాళ్ళము(నేను అక్కా)"

"అరుస్తున్నానట .. అయినా అరిస్తేమటుకు ఒక ఇంచన్నా కదిలారా.. ఆ మంచం మీంచి? ఊరు ఊరంతా లేస్తున్నారు కాని మీరు మటుకు లేవరంటూ"
వీపుమీద ఫడీల్మనిపించేసరికి కిక్కురుమనకుండా లేచేవాళ్ళము. "




తరువాత మొదలు అసలు ప్రహసనం, అక్క కుంకుడుకాయలు కొట్టడం నానపెట్టడం, నేను బాయ్లెర్ వెలిగించి, నీళ్ళూ కాగేదాకా, చెక్కలు అవి చూసి అందులో వేస్తూ ఆ పొగలో నానా తంటాలు పడేదాన్ని. అతరువాత ఇంట్లో ఉన్న ఇత్తడి సామాను తళ తళా మెరిసేలా చెయ్యడం, ఒకటా రెండా ఎన్ని పనులని, కడుపు చించుకొంటే కాళ్ళమీద పడ్తుందంటారు.. వాకిలంతా ఒకళ్ళూ తుడిస్తే ఇంకొకళ్ళు ముగ్గులెయ్యడం.. (పండగలొస్తే కొంచం స్థలం కూడా ఖాళీ గా ఉంచకూడదు మొత్తం ముగ్గులతో నింపాల్సిందే మా ఇంటి మహరాణి, మా అమ్మ హుకుం జారీ చేసేది) ఇలా పనులన్నీ తెమిలేసరికి తెల్లారేది. ఇక అప్పుడు వెన్న, పసుపు, సున్నిపిండి ఇక ఆ హంగామ చెప్పనక్కరలేదు. ఒంట్లో ప్రాణాలన్ని నీరసించిపోయేవి. ఆ తరువాత మా అమ్మ దయ... ఓ గ్లాస్ కాఫీ అందించేది. మధ్యలో ఎక్కడో పని చేస్తున్నప్పుడు "రండర్రా! కాస్త కాఫీ తాగుదురూ " అనేది కాని, అలా పని ఆపేసి కాఫీ తాగడం.. ఎంటో అక్కకీ నాకు కూడా అస్సలు మనస్కరించేది కాదు. అప్పుడు తాగిన కాఫీ కి కాస్తంత అడుగంటిన ప్రాణం లేచొచ్చి, కొత్త బట్టలు... అని మారాం చేసేది. అది అయిన తరువాత పండగ బట్టలు వేసుకొని ఇహ ఒకటే పరుగులు ఇరుగుపొరుగుకి చూపించాలనే ఆత్రంతో.... ఇంత సందడి సందడి గా జరిగే అప్పటి పండగలు పొద్దున్న.. ఎందుకొస్తాయిరా బాబు ఈ పండగలు?? .... అనిపించినా భోజనాలప్పుడు మటుకు అదరహో ! పండగ.. అనిపించేది.
******

అలాంటి ఇన్ని మన తెలుగువారి పండగల మధ్య.. అస్స
లు పొద్దున్నే లేవాల్సిన అవసరం లేని పండగ, అస్సలు పొద్దున్నే స్నానం చేయాల్సిన అవసరం లేని పండగ, కొత్త బట్టలు కొనుక్కోనవసరం లేని పండగ ఏంటో చెప్పుకోండి చూద్దాము. కాని ఈ పండగ ప్రత్యేకత ఒక్కటే, చిన్న పెద్దా ఎవరు ఎవరో తెలియనక్కరలేదు. వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు. వచ్చినవాళ్ళందరూ మనకి మిత్రులే... బోల్డు సందడే... సందడి.... ప్చ్! చెప్పుకోలేకపోతున్నరా? పోని నేను చెప్పేయనా... రేడీ 1.....2.......3......



"రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బర్సే...................."

"వయసంతా ముడుపుకట్టి.. వసంతాలే ఆడుకొందాము
......"

సరదా సరదా హోలీ...
మిత్రుల
సరాగాల కేళీ .....
ఇది నా సర
దా భావ సరళి
మరి ఈ మధురభావ సరళిలో తరలి పోదాం వస్తున్నారా....

హో లీ శు భా కాం క్ష లు.

అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ అనురాగ మాల...
నా బ్లాగు సుమమాల.... మధుర భావాల సుమమాల ఇప్పుడు పూర్తిగా నాదే.... నా సొంతమన్నమాట. గమనించారా నా వెబ్ ఎడ్రస్? నా సొంత డొమైన్ తో ఏర్పర్చుకొన్న నా సరాగాల మాల ఈ మధుర భావాల సుమమాల. ఇప్పుడు నా సొంత బ్లాగు అడ్రస్ www.sumamala.info తెలుగురత్న సౌజన్యంతో ఈ మమతల మాలిక నా సొంతమయ్యింది. తెలుగురత్న వారికి కృతజ్ఞతలు.


1 comment:

  1. మీలో మంచి భావుకత దాగివుంది.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.