4.20.2009

తర్వాణి - ఆవకాయ్ ముచ్చట్లు

ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం....ఆ రోజులిక రావేమి నేస్తం...?

ఎంత చెప్పుకొన్నా తనివి తీరదు, మళ్ళీ కావాలనుకొన్నా తిరిగిరానిది బాల్యం. అందులోని ప్రతి ఒక్క జ్ఞాపకాన్ని మధురాతి మధురంగా మలచి చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా గొప్పగా చెప్పుకోవాల్సింది పల్లెటూళ్ళగురించి అభిమానం అనురాగం కవలపిల్లలు ...... పిల్లలికి పల్లెటూళ్ళు కన్న తల్లులు.. అన్న పాట ఎలాను ఉంది. అలాంటి పల్లెటూళ్ళు నాకు మటుకు దూరపు కొండలే. ఎప్పుడో మా అమ్మకి నన్ను తీసుకొని వెళ్ళాలి అని అనిపిస్తే ఆవిడ కరుణా కటాక్షాలు నా మీద కురిస్తే నేను ఆ సంవత్సరం వేసవి కాలంలో ఊరు వెళ్ళే భాగ్యం. అలాంటి భాగ్యం నాకు వెళ్ళమీద లెక్కపెట్టుకొనేన్నిసార్లు మాత్రమే జరిగింది. ఎంత వేళ్ళమీద లెక్కపెట్టుకొన్నా అక్కడి జ్ఞాపకాలు మటుకు అలా మదిలో నిలిచిపోయేవి. అలాంటి ఎన్నో వేసవి కాలాలు ప్రతి వేసవి కాలానికి ఇలా గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అందులో ఓ వేసవి కాలం చల్ల చల్లగా చెప్తాను మీకు.. మరి వచ్చేస్తారా ....మా పల్లెటూరికి ఒక్కసారి వెళ్ళివచ్చేద్దాము. :)

****

చిన్నప్పుడంటే కూసింత లెక్కల్లో వీకు , అయినా మనలో మాట.. ఎప్పుడు ఎన్ని గదులు అని ఎప్పుడూ లెక్కపెట్టాలన్న ఆలోచన రాలేదు , మొన్నీమధ్యే మా ఊరెళ్ళి వచ్చాము కాబట్టి అక్షరాల 15 గదులు . అప్పటి ( మా) ఇల్లు , మావయ్య గది, పెద్ద పిన్ని గది, చిన్నపిన్ని గది ఇలా గదుల పేర్లు ఉండేవి .. ముందు పెద్ద హాలు, హాలులో ఒక పక్క అమ్మమ్మ పడుకొనే ఓ పెద్ద పట్టెమంచం, బయట పెద్ద వసరా.. అటువైపు వంటిల్లు, ఇటువైపు సామాను గది, వసరా అయితే ఒకేసారి ఒక 50 మంది దాక కూర్చొని భోజనం చేసే వెసులుబాటు ఉన్న పెద్ద గది అని చెప్పొచ్చు. గది మధ్యలో అష్టా చెమ్మా ఆటకని బండమీదే చెక్కించేసారు. భోజనాలయిన తరువాత అక్కడ ఆడుకొంటూ కూర్చునేవాళ్ళము. వసరాకి ముందో తులసి మొక్క, దాని వెనుక బావి, బావికి అటుపక్కగా చూస్తే పెద్ద చెరువు, విసిరేసినట్లుగా అక్కడో ఇల్లు ఇల్లు.. నాకు గుర్తున్న మా పల్లెటూరు ఇది. అంత పెద్ద ఇల్లు మాదొక్కళ్ళదే అవడమో లేకపోతే మరి మా తాతగారు అక్కడ ఎదో పేరుగన్న వ్యక్తో (నాకు తెలీదు నిజానికి) తెలీదు కాని తెల్లారితే చాలు అరుగుమీదకి వద్దన్నా వచ్చేవి కూరగాయలు మొదలుకొని, పళ్ళు అవీ.. ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ దొండపాదు, సొర పాదు, బీరకాయలు అన్ని దొడ్లోనే పండేవేమో కూరగాయలకంటూ ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండానే ఇంట్లోనే లభించేవి.

****

ఇహ వేసవి సెలవలొచ్చాయంటే , పిన్నుల పిల్లలు ,మేము, మావయ్య పిల్లలు, ఇక మా అమ్మమ్మకి ఉన్న అక్కచెల్లెళ్ళ మనవలు అందరు కలిసి పొలో మంటు అక్కడ తిష్ట వేసేవాళ్ళము, ఒక 30, 40 దాకా పిల్లలమే తేలేవాళ్ళము.


మేము బాగా చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు మా ఆఖరు పిన్నికింకా పెళ్ళి కాలేదు, సో, అక్కడికి వెళ్ళినప్పుడల్లా మా బాధ్యత అంతా మా అఖరి పిన్నే తీసుకొనేది. స్నానాలు, జెళ్ళేయడం, భోజనాలు అవి ఇవి అని కాదు అన్ని భాధ్యతలు మా ఆఖరి పిన్నివే. అందులో ఆ పిన్నితో పనులు చేయించుకొడానికి, గోరు ముద్దలు తినిపించుకోడానికి మేమందరం ముందు ఉండేవాళ్ళము. దానికి కారణం లేకపోలేదు, ముద్ద ముద్ద కీ ముద్దు చేస్తూ.. "నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి" అంటూ అసలు ఆవిడకి విసుగంటే ఎంటో తెలీదేమో అన్నట్లుగా ఉండేది. (ఇప్పటికీ అంతే) .

ఇదిగో ఇక్కడే నా మధురమైన అనుభూతి మీతో చెప్పాలని నా మనసు ఉవ్విళూరుతోంది.


మేమందరం వస్తామని మా పిన్ని ముందుగానే కాస్త గోంగూర పచ్చడి, దోసవకాయి, మరి కాస్త ముక్కావకాయ్ పెట్టి ఉంచేది. సెలవల మొదట్లోనే కదా అప్పటికింకా మావిడికాయ పక్వానికి రాదు కదా అందుకని ముక్కావకాయ్ పెట్టేది.


నిజం చెప్పొద్దు, ఎవరిని తరిచి అడిగినా అసలు మా పిన్ని పెట్టే ఆవకాయ్ - తర్వాణి గోరుముద్దలకోసమే ఊరు వస్తారు అనేది మటుకు నేను కఛ్ఛితంగా చెప్పగలను. అంత రుచిగా ఉండేది. ఆవిడ చేతి మహత్యమో లేక ఆ ఊరు మహత్యమో తెలీదు కాని, పొద్దున్నే ఇంకా తెల్లారదేమో అప్పటికి, "మళ్ళీ ఎండెక్కిందంటే కష్టమఱ్ఱా తొందరగా మొహాలు కడుక్కొండి చక్కగా కాస్త దొసావకాయో, గోంగూరో, ఆవకా
యో వేసి చద్దన్నం కలిపి పెడ్తాను " అని పిన్ని తొందర పెట్టేది. అందరం వసరాలో వరసగా కూర్చొనే వాళ్ళము. వరసగా అరిటాకు పరిచేసి పైనుండి నల్ల కుండ తీసి ముందు రోజు రాత్రి గంజిలోనో/మజ్జిగలోనో ఉప్పేసి నానేసిన అన్నం (మేము తర్వాణి అన్నం అంటాము) గట్టిగా పిండి అందులో కాస్తంత ఆవకాయ్ వేసి ఎఱ్ఱగా కలిపి అంత నూనో, నెయ్యో వేసి (నాకయితే అందులో నూనే ఇష్టం) అందరి ఆకుల్లో పెట్టేది. మేము ఏ 10 మందో అయితే తనే తినిపించేసేది. అసలు ఆ రుచి కనక తలుచుకొంటే, ఇప్పటికీ నోరూరుతుంది. భలే గమ్మత్త్లుగా కూడా ఉండేది. ఇక ఆవకాయ్ ముక్కలు అవి తరువాత కలిపే తర్వాణి అన్నంలో నలుచుకోడానికి.. ఇప్పటి ఏ టిఫిన్‌కి సాటి రాని టిఫిన్ అది. కడుపులో చలవ చేస్తుంది అని పెట్టేవారు అప్పుడు. మరీ రెండు రోజులు మూడు రోజులు ఉంచకుండా , ముందు రోజు అన్నం అయితే ఆరోగ్యానికి మంచిదే అనేవారు అప్పటి పెద్దవాళ్ళు. వేసవి కాలం వచ్చింది అంటే .. నాకు అలా తర్వాణి అన్నం తినాలంటే ఇష్టం కాని, నల్లకుండ, గంజి/మజ్జిగ, అది కాస్త పులుపెక్కదాక ఆగడం ప్చ్! ఇప్పటి ఇన్‌స్టెంట్ జీవితాలకి అంత ఓపిక, తీరికా ఎక్కడ, కాస్త ఉప్మా చేసుకొని తిని, పరిగెత్తడమే గగనం.. అంతేనంటారా? :-)

8 comments:

  1. Tharwaani - Aavakai muchatlu ane ee blog chadhuvuthoo unte naa jnapakaala putallonchi chinnppudu vesangi selavallo thirigina maathamahulu, pithamahula swagramaalu, kausikalonu, godaavarilonu jaripina snaanaalu,tharpaani (Andhaala Ramudu fame)Aavakai tho thinna chadhi annalu, dongathanamga thagina kobbari bondaalu, thaatimunjelu, owner ki theliyakunda dongathanamga thinna thmpuduvesina thegalu, kobbar aakulatho cheina automatic watches, booralu annee okksari kallamundhu ringulu ringulaga thippukunela chesindhi. ippati generation ki atuvanti anubhavaalu cinimallone nemo!!!!!

    ReplyDelete
  2. Rachpoodi vaari blog chaduvuthoo unte chinna nadu vesangi salavullo maatha mahulu, pithamahula gramaalaki velli cheuvullonu, godaavari pya kausikalonu jaripina eethalu,Tharpaani(Andaala Ramudu fame) with Aaavakai chadhi annalu, dongathanamga thaagina kobbari bondaalu, thampudu thegalu, kobbari aakulatho chesukuni pettukunna automatic wrist watches, Booraalu, anne okkasaari girrumani ringulu ringulauga thelugu cinimalo laa thippukunela chesindhi.

    ReplyDelete
  3. ఆవకాయ ఓకే గానీ ఈ తరవాణీ సంగతే నాకర్థం కాదు. నేనెప్పుడూ రుచి చూడలేదు. ఇప్పుడెక్కడైనా దొరికే ఛాన్స్ ఉందంటారా?

    BTW మీరు ప్లాను గీసి మరీ ఇల్లు చూపించడం బాగుంది.చిన్నప్పటి జ్ఞాపకాలెప్పుడూ మధురాలే! కానీ ఈ మధ్యేమో 'నోస్టాల్జియాలు ఎవరైనా రాస్తారు, ఒరిజినాలిటీ ఉండాలంటే బుర్రలో మేథస్సు ఉండాలి ' అని సన్నాయి నొక్కులు వినబడుతున్నాయి. ఏమిటో మరి!

    ReplyDelete
  4. నేను ఇప్పుడే పర్ణశాల నుండి లిన్క్ ద్వారా ఇక్కడికి వచ్హాను. రాగానే ఆవకాయ గుర్తుచేసారు.ఇంట్లోనుండి ఊరికి పారిపోవాలనిపిస్తోంది.ఇంకా మా అబ్బాయి exams అవలేదు. సరే అసలు విషయానికి వస్తాను. అక్కడ మీ వ్యాఖ్యలు చూసినతరువాత మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను.ఇవి ఎవరికైనా ఉపయోగపడతాయి.గుర్తుంచుకోండి.
    మార్చటం-మారటం రెండూ ఒక్కటే, మార్చటంలో ఏం జరుగుతుందో మారటం లో అదే మిగులుతుంది. కాకపోతే మార్చటం కష్టతరం.మారటం శ్రేయస్కరం. మిమ్మల్ని మీరే ఉద్దరించుకోవాలి. ఉధ్ధరేదాత్మానామ్........ ఎవరిని వారే ఉధ్ధరించుకోవాలి. ఇది భగవంతుని మాట.
    ఇంత బాగా వ్రాసే మీరు అంత బేలగా ఎవరూ ఏమి చేయలేదు అని అంటే అక్కడి కంటే ఇక్కడ చెపితే మంచిది అని చెప్పాను.తప్పయితే delete చేయండి.

    ReplyDelete
  5. first ఫోటో సూపర్ గా ఉందండి

    ReplyDelete
  6. శర్మ గారు: థాంక్స్ అండీ! ఏకంగా రెండు కామెంట్లు ఇచ్చినందుకు. మొత్తానికి చిన్న నాటి జ్ఞాపకాలు మధురాతి మధురమే.

    సుజాత గారు: నెనర్లు. ఇక్కడ దొరుకుంతుందా అంటే ?? మా పిల్లలు తినరు కాబట్టి మా ఇంట్లోను దొరకదనే చెప్పాలి. కాని రజమండ్రి మా పిన్ని వాళ్ళింటికి వెళ్తే దొరుకుతుంది ఈసారి నెనెళ్ళినప్పుడు మీరు వచ్చేయండి. భలే రుచిగా ఉంటుంది. ఇహ, బాల్య స్మృతులు రాసుకోడాం అంటే మన తీయటి జ్ఞాపకాలని నెమరేసుకోడమే. ఎలాంటి విషయమైనా హృదయానికి స్పృశించేది అయితే అంతే ఆర్ద్రంగా రాయగలమండి. మళ్ళీ ఈ అనుభూతులకోసం మనం బాల్యం లోకి వెళ్ళగలమా? ఇలా మనసుకి నచ్చిన రాతల ద్వార ఇలా ఒక్కసారి ఆ జ్ఞపకాలని దొంతరల కదలించడం ద్వారా నలుగురితో పంచుకోడం తప్పు కాదనుకొంట. ఇక మేధస్సు అంటారా.. ఒక్కొక్కళ్ళది ఒక్కో తరహా భావ పరంపరల మేధస్సు అండి , కొంతమందికి రాజకీయాలగురించి అనర్గళంగా మాట్లడే మేధస్సు కొంతమందికి ప్రస్తుత కాలమానపరిస్థితులకి స్పందిస్తూ చక చకా రాసే మేధస్సు, కొంతమందికి సంగీతం గురించి దారాళంగ మాట్లాడే/వ్రాసే మేధస్సు.. ఎవరి ప్రత్యేకత వారిది. ఇలా కాదు బాల్యం ఎవరన్నా రాస్తారు, అంటే అవునేమో అని మటుకు అనిపించడం లేదు. నేను తెలుగు రత్న లో రాసే వ్యాసాలు కొన్ని ప్రస్తుత కాల మాన పరిస్థులకి సంబంధినవేనండి. కాని అప్పుడప్పుడు, నేను చదువుకొన్న స్కూల్, నేను చదువుకొన్న కాలేజ్ అంటూ మనకి గుర్తు రావడం అది పంచుకోడం దానిని మన పిల్లలు చదువుకోడం బాగుంటుంది కదండి. కాలాన్ని, కాల గమనాన్ని వెనక్కి తిప్పలేమో కాని బ్లాగుల్లో వెనకటి పోస్ట్‌లకి వెళ్ళొచ్చు కదూ..మన చిన్ననాటి సంగతులని అనుభూతి చెందడానికి కాదంటారా? :)

    నిహారిక గారు: నెనర్లు. మార్చటం.. మారడం రెండిటి గురించి చాలా బాగా చెప్పారు. మనం చేసేది తప్పు అనేది అందరికి తెలిస్తే ఇంకొకరు మనల్ని "మార్చే" అవకాశం మనం ఇస్తున్నాము. అలాగే మారడం మనం తప్పు చేస్తున్నామని మనకి మాత్రమే తెలుస్తే మారడానికి ప్రయత్నిస్తాము. నిజ జీవితంలోనైతేనేమి బ్లాగు లోకంలో నైతేనేమి ఎవరో వస్తారని ఏదో చేస్తారని నేనెప్పుడు ఎదురు చూడలేదు. ఇక ముందు కూడా చూడనండి. అయితే అక్కడ నేను రాసిన వ్యాఖ్య పరిస్థితులని బేరీజు చేస్తూ రాసాను అంతే. ఎవరో రావాలన్న ఆలోచన ఎంతమాత్రం కాదు. ఇక్కడ ముందు జరిగిన సంఘటనలు కనక మీకు తెలిస్తే నా వ్యాఖ్యని మీరు కరెక్ట్‌గా రిసీవ్ చేసుకొనే వారు. ఇకపోతే అక్కడ బ్లాగులో రాయడం మహేష్ గారు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బావిలో కప్పలంటూ రాయడంతో .. ఆ వ్యాఖ్య రాసాను. ఇక అనామకులు అజ్ఞాతలు రాసే వ్యాఖ్యలు కథాపరంగా, వ్యాసపరంగా సద్విమర్శలు అయితే నేను వాటిని అంగీకరిస్తాను, వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవయితే రాస్తే మటుకు నిరాకరిస్తాను. మంచి సలహాకి మరోసారి నెనర్లు.

    చైతన్య గారు : :) థాంక్స్

    ReplyDelete
  7. ఇన్ని చెప్పేసారు. ఇప్పుడెలా! నోరూరిపోతోందే!!

    ReplyDelete
  8. మీరు రాసింది చదువుతుంటే అర్జెంట్ గా ఒక కూఋఅగాయల మొక్కలు పెంచేసుకోవాలనిపించింది

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.