5.23.2009

ఉద్యోగ పర్వంలో కుటుంబం పాత్ర




LSAT - India పరీక్ష ఆంధ్రప్రదేశ్ మొత్తమీద ఒక్క హైదరబాద్‍లో జరుగుతోంది , ప్రాంతీయంగా జరిగే లాసెట్ పరీక్ష వేరు. ఈ పరీక్ష ఇండియా మొత్తం మీద జరుగుతూ వీళ్ళకి మంచి ర్యాంక్ కనక వస్తే విదేశాల్లో చదువుకొనే అవకాశం ఉన్న పరీక్ష. ఈ పరీక్షకి నేను ఒక్కదాన్నే ఇన్విజిలేటర్‍గా ఎన్నికయ్యాను. రేపే పరీక్ష, చీఫ్ ఇన్విజిలేటర్ వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తారు. దీనికి ముందస్తుగా ఢిల్లీ నుండి ఆడియో కాన్‌ఫరెన్స్, జరిగి వాటిలో నెగ్గితే చీఫ్ ఇన్విజిలేటర్ ఇంటర్వ్యూ. అన్ని అయి చివరికి వచ్చాము. నేను లాసెట్ పరీక్ష రాశాను కాని ఇంత హైరాన పడలేదు. చీఫ్ ఇన్విజిలేటర్ వచ్చి ఏదో చెప్తున్నారు టెబుల్ మీద ఫోన్ మోగింది.
******
రెండు రోజుల క్రితం ఆఫీస్‍లో చేసే ట్రైనర్స్ ఇద్దరిని అర్జంట్‍గా ఖమ్మం రమ్మనమని ప్రభుత్వ ఉత్తర్వు (మాది రాజీవ్ ఉద్యోగశ్రీ‍కి సంబంధించిన ఆఫీసు) మేము ఫెకాల్టీస్‍ని కాంట్రాక్ట్ పద్దతిలో తీసుకొన్నాము కాబట్టి ప్రస్తుతం మాకు అందుబాటులో ఎవరు ట్రైనర్స్ లేకపోవడం వల్ల కాంట్రక్ట్ కి సంబంధించిన ట్రైనెర్స్‌కే ....పరిస్థితి ఇది ... అని చెప్పడం జరిగింది. ఒక ఇద్దరు ఖమ్మం వెళ్ళడానికి ఒప్పుకోడంతో అన్ని ఏర్పాట్లు జరిగిపోయి వీరి పేర్లు అక్కడి ప్రభుత్వాధికారులకి చెప్పడం జరిగంది. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే జరిగింది.

సాయంత్రం 6.30 కి: నేను ఇంటికి బయల్దేరుతున్న సమయంలో ఫోన్ మోగింది పంపించాలి అనుకొన్న వారిలో ఒక ట్రైనర్ "మాడమ్ మీతో కొంచం మాట్లాడాలి" అంటే, మర్నాడు ప్రయాణం కదా ఆఫీస్ తరపునుండి ఎమన్నా కావాలేమో స్టడీ మెటీరియల్ మొ! అనుకొని చెప్పండి అన్నా.. "మాడమ్ మా కాంట్రాక్ట్ వాళ్ళు మాకసలు శాలరీస్ పే చెయ్యడంలేదు, దీని గురించి మీ మానేజ్‍మెంట్ కలగజేసుకొంటే బాగుంటుంది " అని అన్నారు. అప్పుడే చెప్పాను "మా వైపు నుండి మొత్తం సెటిల్‍మెంట్ అయిపోయింది కదా... ఇహ మేము కలగజేసుకొనేదేముంది? అది మాకు మర్యాద కాదు అని ".. సరే మాడమ్ మీతో మా వైఫ్ మాట్లాడతారట.. అని ఫోన్ ఆవిడకి ఇచ్చారు. పరిచయం కాబోలు అనుకొన్నా! ఫోన్ తీసుకొన్న ఆవిడకి నేను తెలీదు, నాకు ఆవిడ తెలీదు మర్యాదకన్నా పరిచయం చెసుకోవాలి కదా! "మాడమ్ నాకు మీ ఆఫీస్ పొజిషన్ తెలియాలి " అంటూ మొదలు పెట్టారు. ఇలా మాట్లాడే వాళ్ళకి సమాధానం ఏమని చెప్తాము. "సారీ అండీ నేనిప్పుడు కొంచం బిజీగా ఉన్నాను తరువాత నేనే ఫోన్ చేస్తాను" అని ఫోన్ పట్టేసాను. ఇక ఆ తరువాత ఇంటి కొచ్చాక ఆ విషయం మర్చిపోయాను .

నైట్ 11 కి మేము మర్చిపోలేదు అనుకొంటూ .. మళ్ళీ అదే ఫోన్, ఆ టైం‍లో నిజానికి చాలా కోపం వచ్చేసింది కాని మర్నాడు వాళ్ళు ఊరెళ్ళాలి. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇబ్బందవుతుందని తీసాను. ఆ సంభాషణ చూడండి, "మాడమ్ నాకు రెండు మంచి అవకాశాలు వచ్చాయి. మీరేమో ఖమ్మం వెళ్ళమంటున్నారు. నేను అటు వెళ్తే ఈ రెండు అవకాశాలు డ్రాప్ చేసుకోవాలి, లేదు ఇటే వెళ్ళమంటే మరి నా పరిస్థితి ఎంటి?" అప్పజెప్పినట్లుగా చెప్పేసి.... ఫోన్ వాళ్ళ వైఫ్‍కి ఇచ్చెసారు. ఆవిడ "ఇప్పుడు చెప్పండి మాడమ్" అని, అదేదో నాకు "నేనే గెలిచాను చూశావా " అని అన్నట్లుగా. ఇదో రకమైన బ్లాక్‍మెయిలింగ్. అంత రాత్రి నేను ఏవిధమైన సలహా ఇవ్వగలను? ఒక్కటే చెప్పాను "ఒ .కే మీరు ఇంకో అవకాశం అంటున్నారు... వెళ్తే వెళ్ళండి, కాని ఇంత రాత్రి చెప్పడం వల్ల నాకు ఇంకో మార్గంలేదు వేరే ట్రైనర్ చూసుకోడానికి, సో ! మీరు అ రెండు అవకాశాల అధికారులని సమయం అడగండి, ఇహ ఆ తరువాత మీ ఇష్టం" అని చెప్తే సదరు భర్తగారికి సంబందించిన ఇల్లాలు, వారి అమ్మగారు నాతో ఫుట్ బాల్ ఆడుకొన్నారు. ఎమనాలి ఇలాంటి వాళ్ళని?

*******

రెండు రోజుల తరువాత ఇదిగో LSAT-INDIA పరీక్షకని జరుగుతున్న ఇంటర్వ్యూ కి మధ్యలో మోగిన ఈ ఫోన్ వల్ల ఎన్ని అవాంతరాలో (ఈ పొస్ట్ రాస్తుండగా ఇప్పటికి ౩ సార్లు అదే ఫోన్) ఉద్యోగ పర్వంలో కుంటుంబం పాత్ర ఎంత వరకు? మన ఆఫీసుకి సంబంధించిన విషయాలు అవీ ..మన దగ్గిర పనిచేస్తున్న వాళ్ళ కుంటుంబానికి మనమెందుకు చెప్పాలి అన్నది ప్రశ్న. మేము కాదు అక్కడ బాధ్యత వహించాల్సింది, వాళ్ళు ఎవరో కాంట్రాక్ట్ వల్ల వచ్చిన వాళ్ళు అక్కడ తేల్చుకోవాలి. అంతే కాని, మాకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎంత రాత్రి ఫోన్ చేసినా మేము చెయ్యగలిగినదేమి లేదు. అక్కడికీ వాళ్ళ వాళ్ళకి మా ప్రయత్నంగా చెప్పి చూశాము ఇహ మేమేమి చెయ్యగలం? ఇదే విషయాన్ని వీళ్ళకి చెప్పడం జరిగింది. మన ఆఫీస్‍లో మనమేమి పనిచేస్తామో , ఒక పని పట్ల మన బాధ్యత ఎంటీ అన్నది భర్త/బార్య కాని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది. నేను నా మనిషికి సొంతమే కాని, రోజులో ఒక 8 గంటలు ఇంకోకరికి ఇచ్చేసాము చెప్పాలంటే .. అలాంటప్పుడు నా భర్త అర్థం చే్సుకోవాలి, నా మనషిక దా అని నేను వెళ్ళమంటే వెళ్ళాలి లేకపోతే మానేయ్యాలి అనే తత్వం ఉంటే, ఇహ మన ఉద్యోగానికి నీళ్ళొదులుకోవాల్సిందే..సరదాగా ఓరోజు ఇంట్లో ఉండమనడం పెద్ద సమస్య కాదు కాని, నిరంకుశత్వం కష్టమే. అలాగే
తన భర్త తను గీసిన గీత దాటకూడదు, తనేం చేస్తున్నా తెలియాలి అన్నది ఇంటి వరకే పరిమితం చేసుకోవాలి కాని, ఇలా భర్త తరుపునుండి ఏమి మాట్లాడాలన్నా నేనే మాట్లాడతాను , అంతా నేనే అంటూ ....ఇలా విసుగు చెందకుండా ఫోన్ చేసి విసుగు తెప్పించే వాళ్ళని ఎమి చెయ్యాలి? నా మటుకు నాకు ఇలా ఇంటిని ఆఫీసుకి , ఆఫీసుని ఇంటికి తీసుకురాడం సుతారం ఇష్టం ఉండదు.
*******

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.