6.28.2009

అమ్మో! పదో తరగతా....

కృష్ణవేణి టీచరు.. పదో తరగతి క్లాస్ టీచర్, ఇంగ్లీషు, సోషల్ సబ్జెక్ట్స్ చెప్పేవారు. అన్నిటికన్నా ముఖ్యంగా క్లాస్ టీచరు అవడం వల్ల ఇక కాలేజ్ కి వెళ్తున్నారు అంటూలుగురితో ఎలా మసులుకోవాలి అనేది ఇంట్లో మన శ్రేయోభిలాషులు ఎలా చెప్తారో అలా చెప్పేవారు. ఏ విధమైన పక్షపాత వైఖరి లేకుండా అందరిని సమానంగా చూసేవారు. ఆవిడ క్లాస్ కి వస్తున్నారు అంటే సూది కింద పడినా పెద్ద విస్పోటంలా వినిపిస్తుందేమో అనేంత నిశ్శబ్ధంగా ఉండేవాళ్ళం. ఇక చదువుల విషయం చెప్పక్కర్లేదు. అంతా ప్రత్యేకమే, అందరూ ప్రత్యేకంగా చూసేవారు. వాళ్ళు పబ్లిక్ పరీక్ష వ్రాస్తున్నారు, అందుకని అసలు వాళ్ళని డిస్టర్బ్ చేయ్యద్దు అని ఒకళ్ళు, 10th క్లాస్ వాళ్ళకి ప్రవేట్ క్లాసులట, టిచర్లు చాలా బిజీగా ఉన్నారనో, స్కూల్లో ఎటెళ్ళినా ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. సాయంత్రం 4 గంటలకి స్కూల్ అవగానే ఇంకో గంటలో మళ్ళీ డ్రస్ మార్చేసి, స్కూల్ కి వెళ్ళాలి. రాత్రి ఇంటికొచ్చేసరికి ఎనిమిదో , తొమ్మిదో అయ్యేది. అప్పుడు తెలియలేదు కాని, ఎవరికి వాళ్ళు వాళ్ళ స్కూల్ పరువు కోసం, పర్సన్టేజ్ కోసం చెప్పిందే చెప్పి, 10 వ తరగతి పిల్లలిని పబ్లిక్ పరీక్షలకి తయారుచేసేవారు. కాని ఆ ప్రత్యేకత, ఆ ప్రైవేట్ క్లాసులు , ఎప్పుడు చదువు, చదువు అనే భాద ఎంతో కొంత ఉన్నా భలే సరదాగా ఉండేది. ఎదన్నా పేరంటానికో, పెళ్ళికో వెళ్తే "అమ్మో అమ్మాయి 10 తరగతా, బాగా చదవాలమ్మా, ఇదొక మైలురాయి. ఇది దాటవంటే ఇక తిరుగే లేదు" అంటూ అందరూ చేసే హితభోదలు అవి విన్నప్పుడు ఈ 10 తరగతికి ఇంత ప్రాముఖ్యత ఉందా ..... అసలీ క్లాసులోకి రావడమే ఏదో ఎవరెస్టు శిఖరం ఎక్కినంత ఆనందం ఆరోజులలో. అలాంటి అంత ప్రాముఖ్యత ఉన్న ఆ పదో తరగతిలో.. ఓ సారి..

*****


అసెంబ్లీ లో పద్మశ్రీ .. పద్మశ్రీ పక్కన నేను.. ఎప్పుడూ పక్కన బొమ్మలా నిలబడడమే, ఎప్పుడు స్కూలుకి రాకుండా ఉండదు. ఒక్కరోజన్నా నాకు ఆవకాశం రాదు
, "భారత దేశం నామాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు...." గట్టిగా చెప్పేస్తోంది. ఆమె స్కూల్ లీడరు, నేను 2nd లీడర్ని. అంటే పద్మ రాకపోతే నాకు అలా భారతదేశం .. అంటూ ప్రతిజ్ఞ చెప్పే అవకాశం వచ్చేది. ఒక్కరోజు కూడా అవకాశం ఇవ్వదు. పోనిలే ఈరోజన్నా కాస్త నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది కదా, చూద్దాం , వాళ్ళే గమనిస్తారు అని మౌనం వహించి అందరితో పాటు " భారతదేశం నా మాతృభూమి.. అంటూ గొంతు కలిపాను. కాని మనసు మాత్రం ఊహల్లో తేలిపోతోంది, ఇంకాసెపే అందరూ నన్ను గమనిస్తారు, సిస్టర్ వచ్చి నన్ను ఏంటి అని అడుగుతారు.. అప్పుడు ఇదీ సంగతి అని చెప్తాను, అప్పుడు అందరూ గట్టిగా చప్పట్లు.. చప్పట్లతో పాటు ..అందరూ.. అని ఆలోచిస్తూ ఉండగా, అందరి చప్పట్లు మిన్నంటాయి, అరెరె! నేను చెప్పకుండానే అందరికి తెలిసిపోయినట్లుంది అనుకొని ఆలోచనలని కట్టిపెట్టి, అసెంబ్లీ చుట్టూ చూద్దును కదా!.. అంతా సైలెంట్, మైక్ లోంచి "జన గణ మన అది నాయక జయహే..." అదేంటి అసెంబ్లీ అయిపోయింది, ఎవరూ గమనించలేదు.. ప్చ్! నా కళ్ళలోంచి నీళ్ళూ..ఇదే ఆఖరి సంవత్సరం ఇంక ఇక్కడ కుదరదు ఎలా? స్కూలంతా ఒక్కచోట చేరేది అంటే ఇక్కడే కదా పొద్దున్న అసెంబ్లిటైంలోన కదా..ఎందుకిలా జరిగింది, జనగణమన తరువాత అడిగితే....?? "ఇంక ఇప్పుడొద్దు, అసెంబ్లీ అయిపోయింది క్లాసులకి వెళ్ళండి " అనేస్తారు. నాలో మధనపడ్తూనే.. క్లాస్ వైపు దారి తీసాను అందరితో పాటుగా.. పోనిలే కృష్ణవేణి టీచర్ కి చెప్పి క్లాసులో సరిపేట్టుకోవచ్చు అనుకొని.

****




పీరియడ్లు మొదలయ్యాయి.. అంతా ముందర ఉన్న హాఫ్యర్లీ పరీక్షల సిలబస్ ముగించే ప్రయత్నంలో హడావిడి, సాయంత్రం ప్రత్యేక క్లాసుల హడావిడి.. ఎవరూ గమనించడం లేదు , ప్రత్యేకంగా వెళ్ళి అసలు విషయం చెప్దామంటే ఆ అవకాశం రావడం లేదు, వస్తున్నారు హడావిడిగా క్లాసులు తీసుకొంటున్నారు, మధ్య మధ్యలో "మీరు 10 వ తరతిలోకి వచ్చారు, ఇంక చిన్నపిల్లలు కారు .. మిమ్మల్ని కొట్టలేము, అలా బాగా చదువుకోవాలి, రేపు కాలేజిలకి వళ్తారు, ఫలనా స్కూల్ పిల్లలు అని మా స్కూల్ పేరు నిలబెట్టాలి అని చెప్తున్నారు తప్పితే అసలు ఇటుకేసి చూడరు.. అసలు చివర కూర్చున్నవాళ్ళ పరిస్థితే అంతేనేమో.. మధ్యాహ్నం రెండయింది. ఇంకో గంటన్నర ఉంది, కాని అప్పటి దాకా ఆగితే ఆ తరువాత నా కోరిక నెరవేరుతుందని ఎలా అనుకోడం.... ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ ఈ కోరిక నెరవేరుతుందా? అర్థం చేసుకోరూ... సుశీల టిచర్ లెక్కల క్లాసులో ఉన్నాను, బోర్డ్ మీద (a+b) హోల్ స్క్వేర్ ఎంతా అనేది చెప్తున్నారు, అది వినే పరస్థితి కాదు నాది.. ఎలా ఎలా ఎలా ఇదే నా ఆలోచన, ఇక ఉండ బట్టలేక లేచి నించొన్నా.. నేను నించోగానే "ఏంటి" అన్నట్లుగా చూసారు టీచర్ నా వైపు.. హమ్మయ్య గమనించారు మొత్తానికి అనుకొని, నెమ్మదిగా ముందుకొచ్చా..

"టీచర్ కృష్ణవేణి టీచర్తో మాట్లాడాలి " అని అడిగాను.

"ఏంటి పని? "

" అదే టీచర్ ఈరోజు.. ఈరోజు..."


"ఊ ఈ రోజు తెలుసు.. నీ పుట్టినరోజే కదా..ఇచ్చేవుగా చాక్లెట్లు."

"అదే అందర్లా..నేను టీచర్ తో మాట్లాడుతాను"


"నాకు చెప్పు నేను చెప్తాలే ఆ టీచర్ కి"

"అదే టీచర్ ఇంక తరువాత అంటే మేము కాలేజ్కి వెళ్తాము, మరి మరి...."

"నస పెట్టకు చెప్పు ఎంటో.."

"అందరికి అసెంబ్లీలో పాట పాడ్తారు... మరి ఈరోజు నాపుట్టినరోజుకి అందరూ మర్చిపోయారూ... అది చెప్దామని..."

"ఇందుకా..మళ్ళీ అసెంబ్లీ ఎలా కుదురుతుంది ఇక రేపే కదా.. స
రే వెళ్ళు వెళ్ళీ మాట్లాడు.. " అని పంపిచారు.

అలా వెళ్ళిన నేను ఆ టీచర్ దగ్గిర భయపడ్తూనే అసలు విషయం చెప్పాను. మళ్ళీ సంవత్సరం పుట్టినరోజు చేసుకోలేను కదా టీచర్ అని, నిజానికి ఆవిడ అర్థంచేసుకొన్నారు.

అందరూ ఉదయం మర్చిపోయారు. అసలు స్కూల్ లీడర్ చెప్పా
లి, ఈరోజు పుట్టినరోజు అమ్మాయిలు స్టేజ్ పైకి రండి అని అప్పుడు అందరూ కలిసి ... హ్యాపి బర్త్ డే టు యు అని పాడ్తారు. మరి పద్మ ఎందుకు మర్చిపోయిందో తెలీదు. మొత్తానికి స్కూల్ వదిలే పావు గంట ముందు, మా ప్రిన్స్ పల్ అనుమతితో స్పెషల్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకొని, అందరి చేత అడిగి పుట్టినరోజు పాట పాడించుకొన్న వైనమిది. అలా గుర్తుండిపోయింది. అది ఎవరి పుట్టినరోజునైనా అలా కళ్ళముందు మెదుల్తూ ఉంటుంది.
******

10 తరగతి, పబ్లిక్ పరీక్షలు తీసేస్తారు అంటే, ప్రాధాన్యత తగ్గినట్లే.. ప్రైవేట్ క్లాసుల హడావిడి లేదు. 10వ తరగతి అనేది ఒక మైలు రాయి అనే ప్రాధాన్యత తగ్గింది, దీనివల్ల చదువు విలువ కూడా తెలియదు పిల్లలికి అనిపిస్తుంది. ఇదివరకు 7th క్లాస్ కామన్ అనేవారు, అది తీసేసినా అంత అనిపించలేదు కాని, పిల్లలికి పరీక్షల విలువ తెలియాలి, రెపొద్దున్న ఎదన్నా కాంపిటేషన్ ఎక్జామ్స్ వ్రాయలంటే ఈ పదో తరగతి ప్రీ ఎక్జామ్ అవ్వాలి. ఆ వి్లువ తగ్గింది అనిపిస్తొంది. లాభం ఏంటి అంటే పిల్లలు ఒక్క సబ్జెక్ట్ లో పోయినా సంవత్సరం అంతా వృధా అన్నది నిజం. దీనిని ప్రత్యామ్నాయం ఆలోచిస్తే బాగుంటుంది కాని, పబ్లిక్ తీసేయడం మాత్రం ఏమో.. ఒక స్కూల్ స్టాండర్డ్ ఎలా తెలుస్తుంది? ఇప్పటిదాకా 10 వ తరగతి ని స్టాండర్డ్ కి ప్రామాణికంగా తీసుకొనేవారు. ఇప్పుడు ఏ స్కూల్ ఎలా అన్నది కచ్చితంగా అంచనా వెయ్యలేము. ఇప్పటికే పరీక్షల ప్రాధాన్యత తగ్గింది. ఆ హడావిడి లేదు.

*******


ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మా పాప 10 వ తరగతి. సెలవులంతా ప్రైవేట్ క్లాసులని స్కూల్ కి వెళ్ళింది, ఇప్పుడా ప్రైవేట్ క్లాసుల కళ లేదు. ఎదన్నా అంటే "హ్యాపీస్ అమ్మా! పబ్లిక్ లేదు" అంటోంది. "అమ్మో 10 వ తరగతా" అనే బాద లేదు.. ఏమనను.. "చదువుకో తల్లీ " అంటే .. "నొ ప్రాబ్లం" అని నాకు అభయమిస్తోంది. పబ్లిక్ లేదు అన్నది అమలులోకి వస్తే.... పరిస్థితి??

ఇవన్నీ పక్కన పెడితే , ఈ రోజు పాప పుట్టినరోజు, పబ్లిక్ ఉన్నా లేక పోయినా పరీక్షలు రాయక తప్పదు, అది స్కూల్ వదలక తప్పదు. అందుకే నా అనుభవం పాపకి జరగకూడదని, ముందే చెప్ప్పాను. ఈ అనుభూతులు మళ్ళీ రమ్మన్నా రావు నాన్న! ఒకవేళ పాడక పోతే అడుగు అని... (వాళ్ళకి కూడా అసెంబ్లీ పాటా మొ! ఉన్నాయి) స్కూల్ అనుభూతులు, ఆ అనుభవాలు ఎన్ని చెప్పినా తక్కువే .. తిరిగిరాని బాల్యం అది. అందుకే పాపని + మా పాప వయసులు పిల్లలిని కూడా ఏమి మిస్ అవ్వద్దని చెప్పడానికే ఈ ప్రయత్నం.
*****


చిట్టితల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలతో.. ఇట్లు ప్రేమతో అమ్మ.


6.25.2009

అద్భుతలీలల ఆంతర్యం?



నా పెళ్ళి , మా ఆడపడుచు పెళ్ళి ఆరు రోజుల తేడాతో జరిగింది. ఒక ఆదివారం వాళ్ళు నవ దంపతులే కదా అందరూ కలిసి సరదాగా ఎటైనా వెళ్దామని అనుకొని వాళ్ళింటికి వెళ్ళాము. ఎటైనా వెళ్ళడం సంగతి పక్కన పెడితే, ఆడపడుచు వాళ్ళ తోడికోడలింటికి తీసుకెళ్ళింది నన్ను ఏదో పనుందని, వెళ్ళేముందు విషయమేంటి అనేది చెప్పలేదు కాని, వెళ్ళిన తరువాత అనుకోకుండా "వదినా వీళ్ళింట్లో ఒక అద్భుతం జరుగుతుంది చూస్తావా" అని అడిగింది. ఈ అద్భుతాలు అవి నా ఊహకి అందని విషయాలు కాబట్టి , కొంచం ఆసక్తి కనబరిచి "ఊ సరే" అన్నాను. ఆవిడ రండి అంటూ వాళ్ళ దేవుడి మందిరానికి తీసుకెళ్ళి "ఇదిగో ఇదే ఆ అద్భుతం " చూపించారు. ష్.... ష్.... ష్...! నాది కొంచం మట్టిబుఱ్ఱ అక్కడ అధ్భుతమేంటో నాకు తెలియలేదు. అడిగితే మనల్ని ఏమనుకొంటారో అని సంశయిస్తూ ఉండగా కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్నట్లుగా ఆవిడే అన్నారు , " అసలెలా వస్తుందో తెలీదండి, రోజు రోజుకి ఆయన శిరసునుండి పాదంపై అలా విభూది ధారలు వస్తూ ఉంటుంది. మేము కళ్ళార చూడలేదంటే నమ్మండి, రెండు మూడు సార్లు కళ్ళార చూద్దామని ఎంతో ఆసక్తిగా జాగరణ కూడా చేసినా, కళ్ళార మటుకు చూడలేకపోయాము " అని అనడం చూసి అప్పుడు చూసా.. పెద్ద బాబా విగ్రహం పాదాల నుండి ఆయన మోకాలి దాకా వీభూధి.. అదే అద్భుతం.. నేనేమి షాక్ అవలేదు కాని, అర్థం కాక ఆలోచించలేదు అంతే.

******

పై సంఘటన తరువాత ఇదిగో ఇన్నాళ్ళకి, మావారి పుణ్యమా అని టి .వి లో భక్తి ఛానల్స్ తో సంబంధ బాంధవ్యాలు కాస్త ఎక్కువై.. మొన్నామధ్య "చూడు చూడు ఆ బాబా వారి లీలలు " అంటూ ఎక్కడో పనిచేసుకొంటున్న నన్ను అరిచి, గీపెట్టి పిలిచి పక్కన కూచొబెట్టుకొని, ఆ అద్భుత సంఘటనలకి తను తన్మయులై ....నన్ను తన్మయురాల్ని చేసే ప్రయత్నంలో భాగంగా ...హారతద్దుకొన్నట్లు అక్కడ కనిపించిన ప్రతి పటానికి భక్తి పారవశ్యంతో కళ్ళకద్దేసుకొంటూ "ఆహ.. ఒహో.. : అంటూ ఉంటే, ఎంటా ! అని చూశా..

బోధన్‌లో ఎవరో ఇంట్లో బాబావారి పటం నుండి, రమణానంద మహర్షుల వారి పటం నుండి వీభూధి, కుంకుమ, తేనే, గంధం దారాలు గా పడడం, జనం తండోప తండాలుగా ఆ వింత చూడడానికి రావడం.. ఇక్కడ కూడా ప్రత్యక్షంగా ఎవరు చూడలేదు కుటుంబ సభ్యులు లేచే సమయానికి అక్కడ పటాలనుండి గుట్టలు గుట్టలుగా పడి ఉండడం.. అద్భుతం కదా! (అవునా?).

******

అసలు ఇలాంటి లీలల వల్ల ఉపయోగం ఏంటి?

భగవంతుడికి అందరూ సమానమైనప్పుడు, ఇలా బోధన్లోనో, లేక మా అడపడుచు తోడికోడలి ఇంట్లో మాత్రమే ఇలాంటి లీలలు ఎందుకు జరుగుతున్నాయి? మరి నేను కూడా నాకు ఊహ తెలిసినప్పటినుండి అమ్మ చెప్పిందనో, లేక ఇంకెవరో చెప్పారనో దేవుడిని పూజిస్తూ ఉన్నానే, పూజిస్తున్నాను అంటే ఇలాంటి అద్భుత శక్తుల కోసం కాదు, అసలు, ఊహ తెలిసినప్పటికి ఈ లీలల విషయం నాకు తెలీదు. చెప్పాలంటే అవసరానికి దేవుడు, కష్టాల్లో దేవుడు అనుకొనే టైంలో "దేవుడా! దేవుడా ! నేను ఆరోతరగతి పాస్ అయిపోవాలి, ఎప్పుడు ఆ చిట్టిరాణికి ఎక్కువ మార్కులు వస్తాయి ఈ సారి నాకు రావాలి అనో , ఒకవిధంగా స్వార్ధమే అయినా నిష్కల్మషంగానే పూజించానుగా, పోని ఆ తరువాత బాగా తెలిసొచ్చిన తరువాతే అనుకొందాము, మరే విధమైన ఆలోచనో.. అవసరమో లేకుండానే పూజించాను, మరి మా ఇంట్లో ఇలాంటి అద్భుతాలు, లీలలు ఎందుకు జరగవు? ఇదంతా పక్కన పెడితే, ఏకాదశి, ద్వాదశి, కార్తిక మాసం, మాఘమసం, ఇంకోటంటూ, ఇంకోటంటూ 365 రోజులు ఏదో ఒక పూజ చేస్తూ సదా భగవద్యానంలో మునిగే అమ్మా వాళ్ళింట్లో ఏ లీలలూఊ?

అసలీ లీలలు, అద్భుతాలు అంటేఅ ఇంకో విషయం గుర్తొస్తోంది. ఆ మధ్యెప్పుడో మా ఇంటి దగ్గిర ఎవరో స్వామీజి వస్తున్నారని అందరు ఉరుకులు పరుగులు పెడ్తుంటే నాకు కూడా అసలు స్వామీజి భోధలేవో వినాలన్న కుతూహలం కలిగింది. అందుకని మా వాళ్ళనెవర్నో తోడు రమ్మని అడిగితే, "ఆ! ఎందుకండి బాబు, మన మనసులో ఉన్నవన్నీ చెప్పేస్తారు నలుగురి మధ్య, మనం మర్చిపోయిన తప్పులు కూడా "నువ్వు ఫలనా వయసులో ఫలనా తప్పు చేసావు ఆ తప్పుకి ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేయడానికే నేను వచ్చాను" అంటారు.. ఈ గొడవంతా మనకెందుకండి" అని అంది. ఈ తప్పుల ఆంతర్యం మీకర్థమయ్యిందా? ఏమో! ఇంట్లో మామూలు యాంత్రిక జీవితానికి సంబంధించో, జీతాల లావాదేవిలో తప్ప , మధ్యతరగతి మహిళలు ఒక స్వామీజి ఎత్తి చూపించేంత తప్పులేమి చేస్తారో ... నాకయితే అర్థం కావడం లేదు.

ఒకళ్ళు ఎత్తి చూపనవసరంలేకుండా, ఏ అద్భుత హడావిడి లేకుండా ఉదయాన్నే ప్రశాంత చిత్తంతో భగవంతుడికి గుడ్ మార్న్ ంగ్ చెప్పేసి ఉద్యోగాల‍కి వెళ్ళడం అంత హాయి ఇంకోటి లేదు కదా. ఈ అద్భుతాల హడావిడికన్నా. అందుకేనేమో ఆ భగవంతుడు ఈ లీలలు మనిళ్ళదాకా రానీడు. ప్రశాంతంగా , ఆనందంగా ఆయనకి ధన్యవాదాలు తెలిపేద్దాం.

ఇహ ఇవి కాక నా దృష్టిలో అద్భుతం అంటే చిన్నపిల్లలు చకా చకా ఒక్క అక్షరం పొల్లు పోకుండా ఏకసంధాగ్రాహిలా చదివినది చదివినట్లు గుర్తుంచుకొని ఓ నాలగు పేజీలు అంతా ఒక్క సెకన్ తేడాతో చెప్పడం అత్యంత అద్భుతం. అలాగే అక్కడెక్కడో చిన్న పాప ఎంత పెద్ద సంఖ్యలనన్నా ఇట్టే కూడి జవాబు చెప్పడం ఒక లీల. జి టీవీ ఆటలో "గీతిక " అనే పసిపాప ఎలాంటి పాటకైన చక్కటి ప్రతిభ కనబరుస్తూ హావభావాలలో అద్భుతం అనిపించేలా నృత్యం చేయడం చాలా గొప్ప విషయం. ఆ లీలలు గొప్పా? ఇది గొప్పా? అంటే మౌనం మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఎవరి అభిప్రాయలనైనా గౌరవించాలి కాబట్టి ..
*******

6.18.2009

యాదగిరిగుట్టలో (తెలియక పడ్డ) యాతనలు



ప్రహ్లాదుని రక్షించటానికి, అహోబిలంలో నరసింహస్వామి స్తంబాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచటం ఎవరికీ సాధ్యం కాలేదుట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్ధిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింప చేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై వుండమని కోరాడుట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై వుండటం లోక విరుధ్ధమని అక్కడికి సమీపంలో వున్న యాదగిరిలో లక్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్ధం కొలువు తీరుతానని బయల్దేరారు. లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలిశారు.




ఆయనవెంట ప్రహ్లాదుడూ, సకల దేవతలూ వచ్చి ఆయనతోపాటు ఇక్కడ కొలువుతీరి స్వామిని సేవిస్తూ వచ్చారుట.

రాక్షస సంహారంచేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగాడుట. ఆ ఆకాశ గంగ లోయలలోంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది. ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం వుంది. ఇందులో స్నానంచేసి స్వామిని సేవించినవారికి సకల కోరికలూ తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృ దేవతలు తరిస్తారు.

చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానంచేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులు వస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు.

మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. (పైన కథంతా వీకీపీడియా సౌజన్యంతో)

*******

ఆఫీసులో అందరం కలిసి అనుకొన్నాము కదా... అందులోను ఆదివారం, కాస్త ఆటవిడుపు.. మళ్ళీ ఇలాంటి రోజులు రావు అనుకొంటూ.. యాదగిరి గుట్టకి వెళ్దామని ఈయనని, పిల్లలిని అడిగాను. పిల్లలు మరో ఛాన్స్ ఇవ్వకుండానే "మేము రాలేమమ్మా! చాలా హోం వర్క్ ఉంది" అని దాటేసారు. ఈయన మటుకు చివరిదాక వస్తానని , చివరికి నా వల్ల కాదు అనేశారు. సరే! అనుకొన్నాము కదా ..అని ఆఫీసు స్టాఫ్ అంతా బయల్దేరాం . పొద్దున్న 9.30 కల్లా యాదగిరిగుట్టలో ఉన్నాము చాలా వేగంగానే వెళ్ళాము అనుకొన్నాము. 25 రూపాయల టికెట్కే రెండుగంటలు పడ్తుంతుంది ఇక దర్శనం ఇంకా ఆలస్యమవచ్చు. చూస్తుంటే రాను రాను రద్దీ పెరిగిపోతోంది..అందుకని 100 రూపాయల టికెట్ కోసం అందరం నించున్నాము. పూర్తిగా సగం దూరం క్యూలో నడిచానో... లేదో కళ్ళు తిరుగుతున్నాయనిపించింది. అర్థమయిపోతోంది రాత్రి భోజనం చేయలేదు. పొద్దున్న దేవుడి దర్శనం అయ్యేదాక తినకూడదని...అలా వెళ్ళడం, ఎంత ప్రమాదకరమో తెలిసొచ్చింది. సరే! నాతో వచ్చినవాళ్ళకి తిప్పలు తప్పలేదు , మంచినీళ్ళు అవి తెచ్చిచ్చి, వి.ఐ.పి టికెట్ తీసి ఒక 20 నిముషాలలో దర్శనం ప్రశాంతంగా అయ్యింది అనిపించి, అక్కడే కాస్త ఆ కబురు.. ఈ కబురు చెప్పుకొంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాము. మాలో ఒక ఐదురుగురు మటుకు ఓపికగా ముందు నుంచున్న క్యూలోనే ఉండి , టికెట్ తీసుకొని ఒక రెండు గంటల తరువాత దర్శనమం విజయవంతంగా ముగించి మా దగ్గిరకి వచ్చారు. ఇహ రాగానే అందరం ఆవురావురుమంటూ ఉన్నామెమో, తీసుకెళ్ళిన పలహారాలు నిముషాల్లో తినేశాము. నాకు కళ్ళు తిరగడం అనేది చిన్న అపశృతిలా అనిపించినా, దర్శనం మటుకు బాగా జరిగిందన్న ఆనందంతో ఉన్నాము అందరం.

అంతా సవ్యంగా అయ్యింది కదా! ఇక తిరిగి ఇళ్ళకు బయల్దేరుదామని నిర్ణయించుకొన్నాము. ఇంతలో ఎవరో అన్నారు.. మెట్లెక్కి వచ్చిన వారు తిరిగి మెట్లు దిగే వెళ్ళాలని. అదేమంత పెద్ద సమస్యలా అనిపించలేదు మా ఎవ్వరికి్, ఎందుకంటే మెట్లు ఎక్కేప్పుడు కష్టం, కాని దిగేప్పుడు శ్రమ ఏముంది అనుకొన్నాము, అదీ కాక ఆత్మారాముడు కూడా కాస్త చల్లబడ్డాడు కదా! అని అనుకొని అందరమూ సంతోషంగా బయల్దేరాము.
*****

అనుకొన్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్నీ.... జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని.....

చివరాఖరికి ఇలా అనుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఎండ నిప్పులు కక్కుతోంది అని వినడమే కాని ఎప్పుడు చవి చూడలేదు, చండ్ర నిప్పు అంటే కూడా అర్థం తెలీదు ఇన్నాళ్ళు. సినిమాల్లో ముస్లిం సోదరులు అసలు అలా నిప్పుల్లో ఎలా నడుస్తారో బాబోయ్ అని కళ్ళు గట్టిగా మూసేసుకొనదానిని. కాని ప్రత్యక్షంగా అక్కడ మేము అనుభవించాము, ఈ చండ్రనిప్పులు, నిప్పులు కక్కడం.


గుడి ప్రాంగణం కదా! అని వచ్చేప్పుడు కనీసం ఆలోచన లేకుండా మెట్ల కిందే అందరం చెప్పులు విప్పేసి, ఆవేశంగా ఎక్కేసాము కాని, దిగడం ఏమంత ఇబ్బంది కాదులే... అని అనుకొన్న మేము ఒక్కొ మెట్టు, ఒక్కో మెట్టు బాబోయ్ ఇన్ని మెట్లా? ఇంకెన్ని మెట్లు? అనుకొంటూ ... మా వల్ల కాదు అని కళ్ళనీళ్ళ పర్యంతం అవుతూ... అసలు ఒక రాయి రాయి కలిపి కొడితేనే నిప్పు రాజేసుకొంటుందే.. అలాంటి బండ రాళ్ళే మెట్లు అయినప్పుడు, నీడ అన్నది కనుచూపు మేరలో కాన రానప్పుడు, అన్ని నిప్పులు చెరిగే మెట్లు దిగుతున్నప్పుడు మా బాధ వర్ణనాతీతం.

కింద అరికాలిలో పుట్టిన ఆ వేడి నరాల్లోంచి తలవెంట్రుక దాకా పాకి , వణుకు పుట్టి నడవడం కూడా రాక ఇబ్బంది పడ్డాము కొన్ని చోట్ల, కొంతమంది చేతిరుమాళ్ళు, స్కార్ఫ్స్, చున్నీస్ ఏమి కాలికింద వేసినా కాలిమంట తగ్గదే. చివరి మెట్టు దగ్గిర చర్మం ఈ వేడికి మాంసం ముద్ద అవుతుందేమో అని హడలి పోయాము. అంతలా యాతన పడితే చివర్లో అక్కడి వాళ్ళు అన్నారు "ఇంత ఎండలో ఎందుకమ్మా చెప్పులు కింద వదిలారు. పైన వదలచ్చు " కదా అని... ఏమంటాము, ఏడవలేక నవ్వి, గుడ్లల్లో నీళ్ళు గుడ్లల్లో కుక్కుకొని, "ఇన్ని కష్టాలు పడ్డాము తండ్రీ మరి మమ్మల్ని గుర్తుంచుకో" అని తిరుగు ప్రయాణం సాగించాము.

********

6.07.2009

పెళ్ళంటే....



ఏదో మా బావమరిది గడ్డం కింద బెల్లం ముక్క కొట్టి "మా అక్క ఉంది బావగారు అన్నాడు కాబట్టి కాని, లేకపోతే హాయిగా కాశీలో ఉండేవాడిని కాదు ఈ పాటికి " అంటూ ఎదన్నా వాదనలో , చిలిపి తగాదాలో వచ్చనప్పడు, వాటిని పెంచకుండా అంటూ ఉంటారు మా వారు. విన్నప్పుడల్లా భలే ఉంటుంది ఈ కాశీ సన్నివేశం అని నవ్వొస్తుంది నాకు. "వెళ్ళుండాల్సింది నాకు సగం బాధ తప్పేది" అని నేను..

నా పెళ్ళి తెల్లవారుఝామున 3.45 నిముషాలకేమో అప్పటిదాకా ఎవో గౌరి పూజలని... అవనీ ....ఇవనీ చేయించి ఉన్నారేమో.. మంటపం దగ్గరికి తీసుకెళ్ళే సమయంలో నిద్ర వచ్చేసి పక్కన బల్ల మీద తల వాల్చాను. పిన్నులో, అత్తయ్యలో తెలీదు కాని, " పెళ్ళి కొడుకు కాశీ వెళ్తానంటున్నాడే.. లే.. తమ్ముడు బతిమాల్తున్నాడు,అక్కడ మా అక్కనిచ్చి పెళ్ళి చేస్తాం అంటూ రా .. వెళ్దాం " అని "అబ్బా! నిద్దరొస్తోంది, వెళ్తే వెళ్ళనిద్దూ.. తమ్ముడు అంత బతిమాలడం ఎందుకు? వచ్చిన తరువాత చేసుకోవచ్చులే, ఏం పని ఉందో ఎంటో " అని అన్నానట నిద్రలో. ఇప్పటికీ చెప్పుకొని నవ్వుకొంటూ ఉంటారు చుట్టాలు ఏ పెళ్ళిలో కలిసినా.. :)

కట్నాలు, కానుకలు, లాంఛనాలు, ఆర్థిక పరిస్థితి లాంటి వన్నీ పక్కన పెడితే పెళ్ళిలో జరిగే సాంప్రదాయకమైన కొన్ని పద్దతులు భలే సరదాగా, సందడి సందడిగా.. ఉంటాయి. నాకు చాలా నచ్చుతాయి. ప్రేమ వివాహాలనో, ఇంకోటనో వివాహలన్నీ రిజిష్టర్ ఆఫీసుల్లో సంతకాల వరకో, గుళ్ళో దండల మార్పిడులకో పరిమితమవుతున్నాయి, కాని ఇలాంటి సరదాలకి ఒకసారి దూరం అయ్యామంటే ఇక మనము అలాంటివి జరిగితే చూడడానికే మాత్రమే పరిమితమవుతాము (అదృష్టం బాగుండి ఎక్కడన్నా జరిగితే)తప్ప.. ఆ అనుభవం స్వతహాగా మనకి తెలీదు. పూర్వకాలంలో అయితే ఐదురోజుల చేసేవారు పెళ్ళి. అప్పటిరోజుల్లో వివాహం వ్యాపారం కాదు కాబట్టి సరదాగా ఉండేది. ఇప్పుడు ఒక్కరోజు చేయడమే గగనం. అలాంటి వివాహాల్లో నేను చూసిన మా అన్నయ్యల అక్కల పెళ్లి తంతు .. ముచ్చట్లలో కొన్నిటి గురించి సరదాగా మీతో పంచుకొందామని ....... మరి... చిత్తగిస్తారు కదూ...

********

పెళ్ళి స్నాతకంతో మొదలయి కాశీ ప్రయాణం ,
ఎదురు సన్నాహాం, వివాహంఘట్టం , సూత్రధారణ, మధుపర్కాలు, యఙ్ఞోపవీతధారణ , తలంబ్రాలు....ఇలా ఇంకా ఎన్నో అంశాలతో కూడుకొ్ని..చివరికి అప్పగింతలతో ముగుస్తుంది.

బ్రహ్మచర్యం నుండి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేముందు స్నాతకం చేసుకోవాలి. ఇది సర్వ ప్రాయశ్చిత్తం కోసం, శరీర శుద్ధికోసం చేస్తారని పెద్దలు చెప్తారు. .

బ్రహ్మచర్య దీక్షను వదలి, వేడినీటితో స్నానం చేసినవాడు స్నాతుడౌతాదని అందుకనే ఈ స్నాతకం . పూర్వకాలంలో బ్రహ్మచారిగా గురుకులానికి వెళ్ళి విద్యనభ్యసించి యువకునిగా తిరిగి ఇంటికి వచ్చినవాడు వీలయినంత తొందరలో వివాహం చేసుకోవాలిట. ముందుగా గణపతి పూజ అయ్యాక, శుద్ధ పుణ్యాహవాచనం చేస్తారు ఆతర్వాత హోమాలు . ఈతంతు అయ్యేసరికి గంటా, గంటన్నర పడ్తుంది.

కాశీయాత్ర:

ఆతర్వాత పెళ్ళీకొడుకుకి కాటుక పెట్టి, బుగ్గను చుక్క పెట్టి, స్నాతకానికి కూర్చునేముందే కుంకుమతో నామం, కాళ్ళకు పసుపు పారాణి పెట్టి మెళ్ళో ముత్యాల హారం వేస్తారు . చెవులకు దర్భతో చేసిన గుండ్రని రింగులు తొడుగుతారు. భుజమ్మీద కండువాలో స్వయంపాకానికి కావలిసిన సామగ్రి పెట్టి, ఒక తాటాకుల గొడుగు (ఇప్పట్లో మామూలు గొడుగులే వాడుతున్నారు), చేత్తో ఒక కర్ర పట్టుకొని పాంకోళ్ళు తొడుక్కొని (ఇది వేసుకొని నడవడం దుర్భరంట మావారు అంటారు) కాశీ యాత్రకు బయల్దేరమంటారు.

ముందు సన్నాయి, వెనుక పెళ్ళికొడుకు, పురోహితులు, వెనక్కాల బంధువర్గం ఇలా బయల్దేరి వీధిలోకి వచ్చి తూర్పుదిశగా కొంత దూరం నడుస్తూవుండగా భావమరది ఎదురవుతాడు. "నేను వేదధ్యాయనం పూర్తిచేసి వేదవ్రతాలను అనుష్టించాను. నాకు కాశీ యాత్రకు వెళ్ళడానికి అనుమతి యివ్వండి" అని బంధువులను అనుమతి కోరుతున్నట్లు అనిపిస్తారు.

ఈకాశీయాత్ర ఒక వేడుకగా జరుగుతుంది. అయితే ప్రతీ వేడుక వెనక ముఖ్య ప్రయోజనాలు,
ఉద్దేశ్యాలు ఉంటాయని పెద్దలు చెప్తారు. అవన్నీ వివరిస్తే ఇదో పెద్ద గ్రంధం అయిపోతుంది. అందుకనే సరదాగా ఉండే కొన్ని సన్నివేశాలను చెప్దామని నా ప్రయత్నం.

"ఓ బ్రాహ్మణుడా! నీకు మాకుమార్తెనిచ్చి వివాహం జరిపిస్తాం. అపుడు ధర్మపత్నీ సమేతుడవై త్రేతాగ్నులతో కూడ వెళ్ళగలవు. ఇప్పుడు మాయింటికి రమ్ము" అని బావమరిదిచేత అనిపించి అతనిచేత కాళ్ళు కడిగించి, గంధంపూసి, సెంటు రాసి, తాంబూలం చేతికి ఇచ్చి నూతనవస్త్రాలు (పంచెలచాపు) మెడలో కప్పి, బెల్లంముక్క గడ్డంకింద మూడుసార్లు సుతారంగా కొట్టినట్టు ఆనించి "బావగారూ! మా అక్కను ఇచ్చి పెళ్ళి చేస్తాము, కనుక కాశీయాత్ర విరమించండి" అని బ్రతిమాలుతున్నట్లు అనిపిస్తారు.

ఈ తంతు ఒక వినోదం. బెల్లం ముక్కతో గట్టిగా కొట్టరా ... అని ఒకరు సలహా ఇస్తే, ఇప్పుడు మీరు వెళ్ళడానికి లాంచీలు లేవు. లాంచీ దొరికినా స్టేషన్ వెళ్ళేసరికి రైలు దాటిపోతుంది అని ఒకరు అంటే, మరేం ఫరవాలేదు జట్కామీద తీసుకు వెళ్ళి అక్కడ బస్సు ఎక్కిస్తాం అక్కడినుండి రైలు అందుకోవచ్చు కనుక కాశీ యాత్ర మానక్కర్లేదు అని మరొకరు చమత్కరిండం..... సరదా సరదా సన్నివేశమీ కాశీ ప్రయాణం

తెరసెల్లా:- మురిసెను వలపులు మనసెల్లా... తొలగెను తలపుల తెరసెల్లా.........

సుముహూర్తమునకు ముందుగా వధూవరులు ఒకరినొకరు చూడకుండా మధ్య తెరసెల్లా అడ్డం పెడతారు. వరుడు పరమాత్మ, వధువు జీవాత్మ, తెరసెల్లా మాయ జీవాత్మ పరమాత్మను సుముహూర్తసమయంలో కలవగానే మధ్యనుండే మాయ అనే తెర తొలగిపోతుందిట. పెద్దలు చెప్తారు . "తల వంచమ్మా కాస్త.. నువ్వెంత తల పైకెత్తి చూసినా అబ్బాయి కనపడడం కల్ల.. అంటూ చమత్కిరించే వాళ్ళుంటేనే ఈ తెరెసెల్లాకి అర్థం.


గంపలో పె
ళ్ళికూతురు: దివిలో నిర్ణయం భువిలో పరిణయం

మా అమ్మాయి అసలే ఏడుమల్లెల ఎత్తు బంగారు బొమ్మ కాస్త నెమ్మదిగా తీసుకురా అన్నయ్యా/తమ్ముడూ అని పెళ్ళి కుమార్తె తల్లి వేడుకొంటే..... గంప మోసే మేనమామని చూస్తే నవ్వు రాక మానదు. ఇదో సరదా వేడుక పెళ్ళిలో.... పెళ్ళికుమార్తె చేతికి తాంబూలం కొబ్బరిబొండాం ఇచ్చి గంపలో కూర్చోమని, ఆ గంపను మేనమాలు మోసుకొని వచ్చి కన్యాదాత దంపతుల ప్రక్క ఉంచుతారు.

సుముహూర్తం:

సుముహూర్తానికి ముందు పురోహితులు మహాసంకల్పం చెప్పారు.

సుముహూర్తం సమీపించేలోగా పురోహితులు జీలకఱ్ఱ బెల్లం నూరిన ముద్దను రెండు తమలపాకులలో పెట్టి ఒకటి వరునికి , మరొకటి వధువుకు ఇస్తారు.

"ఆఁ ఆఁ! టైం అయింది" అని పెళ్ళికొడుకు తండ్రిగారు అనగానే, జీలకఱ్ఱబెల్లం ముద్దను పట్టుకొన్న పెళ్ళికొడుకు చేతిని పెళ్ళికూతురు నెత్తిమీద, పెళ్ళికూతురు చేతిని పెళ్ళికొడుకు నెత్తిమీద పెట్టిస్తారు .

"తలమీద గట్టిగా మొత్తేసిందే బాబు.. అలా పెట్టాలా?? నేను నెమ్మదిగా పెట్టాను" అని మా తమ్ముడు బేలగా అడిగాడు వాడి పెళ్ళిలో మా మరదలు జీలకఱ్ఱబెల్లం ధాటికి తట్టుకోలేక... ఇదో సరదా




మంగళ సూ
త్రం:

పుత్తడిబొమ్మకి పుస్తెలు కడుతూ పురషుడి మునివేళ్ళు పచ్చని మెడపై రాసే వెచ్చని
చిలిపి రహస్యాలు. పెళ్ళయిన తరువాత పూర్తి హక్కు ఉంటుంది కాని, ఇలా అందీ అందనప్పుడు చేసే చిలిపి అల్లరికోసం తాళి కట్టే దాకా ఎదురుచూడాల్సిందే....కడుతూ..... కాబోయే శ్రీవారి చిలిపిదనం.....


తలంబ్రాలు:

కాశీ ప్రయాణం
తరువాత మళ్ళీ అంతటి సరదా సరదా సన్నివేశం ఈ తలంబ్రాలు. మంగళసూత్ర ధారణ అయ్యాక, పెద్దలు అక్షింతలు వేసాక, వరుణ్ణి వధువుకు ఎదురుబొదురుగా పీటలమీద కూర్చోపెడ్తారు. వారియిద్దరి మధ్యా తలంబ్రాలువున్న పళ్ళేలను వుంచి, వరుణ్ణి పాలలో తామలపాకు ముంచి వధువు దోసిలలో అద్దమని, ఆ తరువాత ఎండుకొబ్బరి చిప్పతో మూడుసార్లు తలంబ్రాలు బియ్యం ఆమె దోసిలలో పోయమని చెప్తారు.

ఆ తర్వాత పురోహితులు అదేవిధంగా వరుని దోసిలిలో కూడా తలంబ్రాల బియ్యం పోసారు. ఇప్పుడు వరుని దోసిలిని ఆమె దోసిలపై వుంచి పైన నీళ్ళగ్లాసుపెట్టి అక్షతలు యిద్దరి నెత్తిమీద వేసి, వరున్ని ముందుగా ఆమెశిరస్సుపై తలంబ్రాలు పొయ్యమంటారు. ఆతర్వాత ఆమెను వరుని శిరస్సుపై పొయ్య
మన్నారు. రెండోసారి అల్లాగే తలంబ్రాలు దోసిళ్ళలో పోసాక, ఈసారి వరుని దోసిలపై ఆమె దోసిలను వుంచి నీళ్ళగ్లాసు పైన పెట్టి మళ్ళీ అక్షింతలు వేసి ఆమెను ముందుగా వరుని శిరస్సుపైన పొయ్యమంటారు. మూడోసారి మొదటిసారిలాగే చేయనిచ్చి, ఆపైన ఇక మీయిష్టం అని వదిలేస్తారు.

ఇది ఒక వేడుక. చుట్టూ చేరిన పిల్లలు, ఆడవారి కేరింతలతో పెళ్ళిపందిరి ప్రతిధ్వనిస్తుందంటే అతిశయోక్తికాదు. వరుని వైపు వాళ్ళూ వరున్ని ప్రోత్సహిస్తూ వుంటే వధువు తరఫు ఆడవాళ్ళు ఆమెను ప్రోత్సహిస్తారు .


అప్పగింతల కార్యక్రమం లోగా ప్రత్యేకమైన వేడుకలు జరిపించడం ఆనవాయితీ. మిగిలిన కార్యక్రమాలను కావలిస్తే కుదించండిగాని, ఈ వేడుకలు కుదించడానికి వీలు లేదు అని పట్టుపట్టిన సందర్భాలు కూడా ఉంటాయి.

ఒక బిందెలో కాసిని నీళ్ళుపోసి వధూవరులనిద్దర్నీ ఎదుబొదురుగా కూర్చోబెట్టి ఆ బిందెలో బంగారు వుంగరం పడేసి వాళ్ళని తియ్యమంటారు. ఇద్దరూ ఒకేసారి చేతులు పెట్టి వెతికుతారు. ఎవరు ముందుగా తీస్తే వారి భావిజీవితంలో వారిదే పెత్తనం అని అంటారుట.

నా పెళ్ళప్పుడైతే మరి మూడుసార్లు
నేనే తీసాను ఉంగరం.. మరి మీరు ఒకసారి మీ పెళ్ళి ముచ్చట్లకి వెళ్ళండి ఎవరు తీసారు ఉంగరం.?

ఈ విధంగా మూడు సార్లు తీయిస్తారు. అలాగే వెండి మట్టెలు కూడా వేసి తీయమంటారు. తీసిన ప్రతిసారీ పురోహితుడు ఆ వుంగరం, మట్టెలు నీళ్ళతో సహా తను పుచ్చుకొని ఆనీళ్ళు వారి శిరస్సులపై జల్లుతారు.

అలాగే నాగవల్లికి ముందు అల్లుడు అలగడం ఇది కూడా వేడుకే.

వధూవరులనిద్దర్నీ ఒక మంచం మీద చెరోప్రక్కా కూర్చోబెట్టి పూలచెండులతో బంతులు ఆడించడం, (సిగ్గూపూబంతి విసిరే సీతామాలచ్చి...... అని అనుకొంటూ..) ఒక చీర వుయ్యాలలో బొమ్మను పెట్టి దాంట్లోంచి వసంతం పోసి ఇద్దరిమీదా పడేటట్టు వుయ్యల వూపడం, "బొమ్మను వధువుచేతికి ఇచ్చి నేను వంట చేసుకోవాలి, బిడ్డను ఎత్తుకోండి " అని వరునికి బొమ్మను ఇస్తూ వధువు చేత అనిపించడం
(ఇక్కడ వధువు సిగ్గుపడుతూ చాలా టైం తీసుకోవడం) "నాకు ఆఫీసుకు వేళైంది కుదరదు" అని తిరిగి ఆబొమ్మను వధువుకు ఇవ్వడం, ఇలాంటి వేడుకలతో సరదాగా సాగే సాంప్రదాయమైన పెళ్ళి మనది.

అప్పగింతలు:

ఈ కార్యక్రమంలో ముఖ్యమైన వారు వరుడు, అతని తల్లి తండ్రులు. వధువు తన తల్లితండ్రుల మధ్య కూర్చోవాలి. ఎదురుగా వరుడు కూర్చోవాలి. వారి మధ్య ఒక పళ్ళెంలో పాలు పోస్తారు.

వధువు రెండుచేతులను పాలలో ముంచి వరుని చేతిలో పెట్టి అప్పగించాలి.

తర్వాత అత్తమామలు వరుని ప్రక్కన కూర్చొనగా, వారికి కూడా వధువు రెండు చేతులు పాలలో ముంచి వారి చేతులో అద్ది...అప్పగిస్తారు.


ఈ అప్పగింతలు చేసేవారికి, చూసే వారిలో చాలామందికి కంట తడిపెట్టిస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఇన్నాళ్ళుగా తాము పెంచి పోషించిన కూతురు తమను విడిచి అత్తవారింటికి వెళ్తుందని ఆమెను వదలి వుండాలే అనే బాధ కన్నవారికి కలగడం సహజం.

అప్పగింతలు అయ్యాక పెళ్ళికూతురుని లోపలకి తీసుకు వెళ్ళి కాస్త పెరుగూ అన్నం తినిపించి, ఆమెకు ఒక చీరలో స్వయంపాకం దినుసులు వేసి నడుముకు వడిగంటుగా కట్టి పెళ్ళికుమారునితో విడిది గృహప్రవేశానికి పంపుతారు.

**********

ఇవండీ పెళ్ళిముచ్చట్లు సరదాగా గుర్తున్నంతవరకూ రాశాను. సీరియస్ గా డబ్బుతో ముడిపడి ఉన్నవి, బట్టలు పెట్టాల్సిన తంతూ చాలా ఉన్నాయి కాని వాటిని ప్రస్తావించడం ప్రస్తుతం అప్రస్తుతం అనిపించి వ్రాయలేదు. ఇంతటి సాంప్రదాయంగా ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా అంటే.... ఉహు! అనే చెప్పచ్చు. ఎంతో ఆర్భాటంగా జరిగే పెళ్ళిళ్ళు కుడా , టైంలేదు అంటూ తూ తూ మంత్రంగానే జరిపించేస్తున్నారు. భవిష్యత్ లో ఇలా చదువుకోడమేనేమో .... అప్పుడు పెళ్ళిళ్ళు అలా చేసేవారు అంటూ.. ఐదు రోజుల పెళ్ళి గురించి ఇప్పుడు మనం చెప్పుకొంటునట్లుగా......

******

చివరాఖరికి పెళ్ళంటే ఇదేనా అని నన్ను నిలదీసేస్తారేమో.. చదువరులు. పెళ్ళంటే ఒక వేడుక, పెళ్ళిని మనం ఆనందించగలగాలి. సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా .. మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం అని చెప్పారు.. అదే పెళ్ళంటే ..
*******

6.05.2009

అద్దం





"వివరిస్తున్నది అద్దం మన స్నేహానికి అర్థం నేను నీలాగా నువు నాలాగా కనిపించడమే సత్యం.... పాట ....అద్దంలో చూసుకొంటే స్నేహితుడు కనిపిస్తున్నాడని స్వచ్ఛమైన తన మనసుని తెలియజేయడానికని ఇంకో స్నేహితుడు పాడుకొన్న పాట. మంచి పాట నాకెంతోనచ్చిన పాట. పాట సంగతి పక్కన పెడితే అద్దంలో మన ప్రతిబింబం మనకి ఎప్పుడూ అందంగా కనిపిస్తుందనేది అక్షరసత్యం. ఇలా ఆలోచనల్లో ఉన్న నాకు ఉన్నట్లుండి.....

"అమ్మా! హౌ టు కిల్ ఉమెన్ " అని అడిగింది మా పాప.

మొదట పాప అడిగిన ప్రశ్న అర్థంకాలేదు. అంత హఠాత్తుగా అలా అడిగిందేంటబ్బా అని ఆలోచిస్తూనే...

" ఇఫ్ఫుడు వుమెన్ చంపాల్సిన అవసరమేమిట్రా?" అని అడిగాను సాలోచనగానే...

"అహ ! ఊరికే అడుగుతున్నానమ్మా " అని అంది.

"ఎమోరా .. నాకు తెలీదు " అని అన్నా.

"నేను చెప్పనా నీకు తెలీదు కదా!" అని రెట్టించింది...

నవ్వొచ్చింది నాకు. "అదలా రెట్టించినా, కాళ్ళు బాదుకొంటూ కొపంగా వెళ్ళే ఆ తత్వం చూసినా నీ పసితనమే గుర్తొస్తుందే" అనేది అమ్మ. ఎందుకో నాకే నా బాల్యం గుర్తొంచ్చింది. నవ్వుకొంటూనే "ఊ చెప్పు" అన్నాను.

"వుమెన్‍కి కాస్మెటిక్స్ , గొల్డ్ ఆర్నమెంట్స్ , మంచి డ్రసెస్ లేకపోతే శారిస్ అన్నీ ఇచ్చేసి ఒక రూమ్‍లో ఉంచి లాక్ చేసి ఉంచాలి. మర్చిపోకుండా ఆ రూమ్‍లో ఎక్కడా అద్దం మటుకు ఉంచకూడదు" అని చెప్పింది.


పాప చెప్పేవిధానం హాస్యంగా అనిపించినా,
ఆలోచిస్తే నిజం లేకపోలేదు .. చిన్నప్పటినుండి అద్దం చూసుకోకుండా ఉన్న రోజులు ఎన్ని ఉన్నాయి అని ఆలోచించాను. ప్చ్! ఒక్కరోజు గుర్తులేదు. అమ్మా వాళ్ళింట్లో పాతబడిన అద్దం ఒకటి గోడకి వేళ్ళాడి ఉండేది., స్కూల్ టైం అయిపోతోంది అని నేను... కాలేజ్ టైం అయిపోతోంది అని అక్కా, నేను ముందంటే , నేను ముందంటూ ఆ అద్దం ముందు నించొని తయారవడానికి తంటాలు పడ్డ రోజులు కళ్ళముందు తిరిగాయి.

"ఎప్పుడూ ముందు నువ్వే నించొంటావా? నన్నొక్కసారన్నా అద్దం చూసుకోనిచ్చావా?" అని అక్కతో పేచి పెట్టుకొనే దానిని.

" రోజు నువ్వే కదే ముందు తయారయ్యేది, ఈరోజే కదా నేను "... అని అక్క..

" కిందటి జన్మలో మీ ఇద్దరూ సవతులయి ఉండి ఉంటారఱ్ఱా.. ఈ జన్మలో ఇలా అక్కచెల్లేళ్ళయి నా ప్రాణం తీస్తున్నారు.. " అని అమ్మ విసుక్కొనేది.


అమ్మ ఎంత విసుక్కొన్నా.. అద్దం ముందునుండి కదలడం అంటే నా ప్రాణాలు అద్దం దగ్గిర వదిలేస్తున్నట్లే అనిపించింది. ఆడవాళ్ళకి అద్దానికి అంతటి అనుబంధం ఉందని నాకు రోజు అద్దం చుసుకొంటున్నాను కాబట్టి తెలియలేదు కాని, అద్దం లేకపోతే పడే ఇబ్బంది మటుకు మొన్నామధ్య నేను వెళ్ళిన పెళ్ళిలో అర్థం అయ్యింది. అచ్చు మా పాప పైన చెప్పినట్లుగా... అదేదో సినిమాలోలా.. " అమ్మా కట్టుకోడానికి బట్టలిచ్చావు.. .." అంటూ ప్రకాష్ రాజ్ అన్నట్లుగా అయ్యింది మా పరిస్థితి. పెళ్ళికి వెళ్ళడానికి అన్ని రకాల హంగు ఆర్భాటలతో వెళ్ళాం... ఒక అద్దం తప్ప. నలుగురిలో ఈ చీర బాగుందా? పెట్టుకొన్న నగ బాగుందా? నా మేకప్ ఎలా ఉంది అని పదే పదే అడగడం కూడా ఇబ్బందే. ఇలాంటి సమయాల్లో అద్దం ఆవశ్యకత తెలిసొచ్చింది. ముందంతా అంటే హోటల్ లో నిలువుటద్దాలలో చూసుకొంటూ తీరా పెళ్ళి సమయానికి మంటపం దగ్గరికి వెళ్ళేప్పుడు ... అసలయిన సమయంలో అద్దం లేకపోడం .. మాములుగా ఈ విషయాన్ని పాప దగ్గిర ప్రస్తావించడం జరిగింది. అప్పుడు విన్న పాప .....ఆ తరువాత వారం రోజులకి ఇలా "హౌటు కిల్ వుమెన్ " అంటూ చెప్పడం అద్దం గురించి ఇలా వ్రాసేలా చేసింది. :) ఇలా వ్రాస్తుంటే అనిపించిన ఇంకో విషయం.. మన అందానికి అద్దం.. మరి మనసు అందం చూసుకోడానికి అద్దం??



*********

epilogue: హ్మ్!! ఆ తరువాత తిరుగు ప్రయాణంలో టికెట్ చూపించమని కండక్టర్ అడిగితే ... తీద్దామని బ్యాగ్ తీసిన నాకు ....వెక్కిరిస్తూ కనిపించింది..
ఓ చిన్న అద్దం... అప్పటిదాక కనిపించకుండా...దోబూచులాడిన నా అద్దం.... :(