7.15.2009

నా మనోభావాలు దెబ్బ తిన్నాయా?

సమజంలో భిన్న మనస్తత్వాలలో ఒక స్నేహ పూరిత వాతావరణాన్ని కలిపించే ఉద్దేశ్యంతో తెలుగు బ్లాగులు మొదలయ్యాయి. ప్రపంచంలోని తెలుగు ప్రజల మధ్య సహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పేందుకు, పరస్పరం సమాచారం అందించుకోవడం , అభిప్రాయాలను పంచుకోవడానికి చక్కని వేదికలుగా ఆదరణ పొందాయి బ్లాగులు.

వేసుకొనే దుస్తులు మెప్పుకోసం,
పెట్టుకొనే నగలు గొప్పకోసం
కట్టుకొనే ఇల్లు హోదా కోసం
చేసుకొనే శుభకార్యం మన అంతస్థుకు అద్దం
అవసరార్థం అయ్యో పాపం అంటాం
అనవసరమైనా ఆహ , ఓహో అంటాము
ఈ జగన్నాటకంలో కొన్ని పాత్రలు వెయ్యకా తప్పదు

కొందరిని మొయ్యకా తప్పదు.
నవ్వూ, ఏడుపూ మెప్పు కోసం,
తిప్పలు ముప్పని తెలిసినా తప్పులు
అన్నీ 'లోక కల్యాణం ' కోసమే.

మరి ఇన్నిటిలో మనకోసం కేవలం మనకోసమే మన అభిప్రాయాలు పంచుకోడం కోసం, మనల్ని మనం అర్ధం చేసుకోడం కోసం, మనగురించి ఇంకొకరు తెలుసుకోడం కోసం జరిపే అన్వెషణా ఫలితమే ఈ బ్లాగులు.


బ్లాగులు ఎవరైనా వ్రాసుకోవచ్చు, విద్యార్ధి, ఉద్యోగార్ధి, సంసారి, బ్రహ్మ చారి అన్న తేడా లేదు. ఎవరు వ్రాసుకొన్నా భాష మెరుగుపడ్తుంది, వ్యక్తీకరణ బాగవుతుంది, మనకి మనం అర్ధం అవుతాము. మనలో ఉన్న రచయిత, విమర్శకుడు, విశ్లేషకుడు, తాత్వికుడు అందరు కట్టగట్టుకొని బయటకి వస్తారు. మనకే తెలియని కొత్త కోణాలు చూపెడ్తారు, మనల్ని మనకే కొత్తగా పరిచయం చేస్తారు.

*******

ఈనాడులో "డైరి" గురించి చదివినప్పుడు మురిసిపోయి రాసుకొన్న వ్యాసం ఇది. ఈరోజు వరకు అలానే అనుకొంటున్నాను. ఇకముందు కూడా ఇదే భావనతో ఉంటాను. ఇకపోతే..


ఒక కుటుంబం లేదా మా కుటుంబమనే అనుకొందాము ఏదన్నా ఫంక్షన్ కి వెళ్ళాలనుకొన్నామనుకొండి, చక్కగా ఎవరికివారు తయారయిపోయి "పదండి వెళ్దాం" అనేసుకొంటామా ? లేకపోతే మనమెలా ఉన్నాము అని అడుగుదామన్నా ఆలోచన లేదా ఆ భావన ఒక్కసారన్నా కలుగుతుంది. ఈ డ్రస్ ఎలా ఉందనో, ఈ నగ బాగుందా అనో అడుగుతాము. "అమ్మా బాగుందా మరీ ఓవర్గా ఉందా చెప్పు నువ్వే చెప్పాలి పార్టీలో ఇంకెవరన్నా చెప్తే గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది." అని అంటుంది మా పాప . నాకు నచ్చితే " బాగున్నావు " అని చెప్తాను లేకపోతే "ఇలా మార్చు" అని చెప్తాను. నాకు నచ్చకపోతే ఇంకొకళ్ళకి కూడా నచ్చకూడదని రూల్ ఏమి లేదు. పాప విషయంలో "ఇది బాలేదు" అంటే, లేదు "నాకు నచ్చింది " అని మావారు అన్నారనుకొండి, కాదు కూడదు అని పోట్లాట దిగము కదా! ఇక్కడే అంటే ఇంట్లోనే కుటుంబసభ్యులం భిన్నాభిప్రాయాలతో ఉంటాము. అలా అని ఏఇద్దరి మధ్య ఏవైరము లేదు. ఒక స్నేహపూరితమైన వాతావరణంలో అభిప్రాయాలని తెలియజేసుకొంటున్నాము. అలాగే ఒక కథ విషయంలోనో, ఒక నవల విషయంలోనో, ఒక పుస్తకం గురించో .. మన అభిప్రాయం విమర్శగానో , పొగడ్తగానో వెలిబుచ్చడం తప్పు కాదని నా అభిప్రాయం.


క్కడ నా బ్లాగులో నేను చేసింది అదే. నాకు ఒక కథ నచ్చలేదు, ఎందుకు నచ్చలేదో చెప్పాను. అలాగే ఇంకో కథ నచ్చింది, ఎందుకు నచ్చిందో కూడా చెప్పాను. నాకు నచ్చడం , నచ్చకపోడం అనేది నా బ్లాగులోనె వెలిబుచ్చాను. అలాగే నా అభిప్రాయలని ఏకిభవించినవాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించినవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక చర్చలాంటి అభిప్రాయ సేకరణ జరిగింది. అంతేకాని ఏకీభవించినవారు ప్రాణమిత్రులు కారు, వ్యతిరేకించిన వారు శత్రువులు కారు. ఒకళ్ళకొకళ్ళము తెలియని మనమధ్య వ్యక్తిగత ధూషణలు, ప్రతీకారవాంఛలు , శపధాలు ఎంతవరకు సమంజసం?



ఇక నేను విమర్శించినది కథని కాని , రచయిత్రిని కాదే? మరి ఏవిధంగా అంటే ఏ విషయాన్ని ఆధారం చేసుకొని నన్ను "మీకు సిగ్గుండాలి " " "దిగజారుడుతనం" "దివాళకోరుతనం" లాంటి పదాలు వాడతారు?


ఇన్ని వాదాలు ఇన్ని అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నా నేను పరుషంగా ఒకమాట మాట్లాడానా? " సిగ్గుండాలి " "దిగజారుడుతనం" "దివాళకోరుతనం" అని నన్ను అన్నందుకు నా మనోభావాలు దెబ్బతిన్నాయా?... అని రెండు క్షణాలు ఆలోచించాను. ఆలోచించినతరువాత తీసుకొన్న నిర్ణయం.. ఇకముందు ఇలా అన్నవారి వ్యాఖ్యలు నన్ను ఆకాశానికి ఎత్తేసినట్లు పొగిడినా, పాతాళానికి కృంగిపోయేట్లు అవేశ వ్యాఖ్యలు వ్రాసినా ప్రచురింపబడవు.. ఎందుకంటే నాకు సిగ్గు ఉంది కాబట్టి , సిగ్గులేకుండా ప్రచురించలేను కాబట్టి(మనోభావాలు ఇంతలా దెబ్బతిన్నాయి).


ఇకపోతే చివరిగా నేను తెలియజేయాలనుకొన్న ముఖ్యమైన విషయం , నిజంగా నేను విమర్శించిన కథలోలా ఓ 60 యేళ్ళ స్త్రీ మళ్ళీ పెళ్ళి చేసుకొని(దేనికోసమైనా కావచ్చు) , నాదగ్గిరకి వచ్చినా.... ఓడిపోయాను, గెలిచాను లాంటి ఫీలింగ్స్ నాకు కలగవు. ప్రస్తుత సమాజానికి సరిపడదు అని వ్రాసాను తప్పితే ఎరెలా ఉన్నా నాకెంత మాత్రం అభ్యంతరంలేదు , దీనిగురించి ఆలోచించాల్సిన అవసరం , ఎవరెవరికో క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ విషయాల గురించి నిరూపణలు గట్రా అంటూ శపధాలు చేయడాలు , సవాళ్ళు విసరడాలు లాంటివెన్ని జరిగినా.. నేను ఏ హిమాలయాలకి వెళ్ళను, ఏ కాషాయ వస్త్రాలు ధరించను. ప్రస్తుతానికి నేను కోరి మనసుపడి సృష్టించుకొన్న నా కుటుంబమే నాకు హిమగిరిసొగసులాంటి మనోజ్ఞ సీమ.

*********

Note 1: నేను ఫీల్ అవుతున్నానని ఫోన్ ద్వారా . మెయిల్ ద్వారా నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చిన స్నేహితులకి మనఃపూర్తిగా ధన్యవాదాలు.


Note 2: వాదనలొద్దు అన్నతరువాత వ్యాఖ్యలు ఎందుకు ప్రచురించానా అని అనుకొంటున్నారా? వ్యక్తిగత ధూషణ, దాడులు లాంటివి ఎవరికి జరిగింది అన్నది.. విజ్ఞులైన పాఠకులకి తెలియాలి అని. ఇప్పటికీ నేను మౌనమే. నా నిర్ణయాలు చెప్పాను అంతె.
*******

7.12.2009

ఇదే ... నా మొదటి ప్రేమలేఖ

వ్రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక....
తెలుపుటకు భాష చేతకాక.....

పాటలు వింటూ పని చేసుకొంటున్నా..రోజూకన్నా ఆదివారం అనేసరికి కాస్త పని ఎక్కువగానె ఉంటుంది. ఏదో సర్దుతూవుంటే పాప ఒక పేపరు తీసుకొచ్చింది

"అమ్మా చూడు ఏదో పనికొచ్చేదేమో అంటూ.. " ఎంటా అని పరికించి చూసాను. అందులో ఇలా ఉంది.

డియర్,

బహుశా ఈ టైంకి నిద్రాదేవి ఒడిలో సేద తీరుతూ ఉంటావనుకొన్నాను. ఇప్పుడు సమయం రాత్రి 12 గంటలు.. నిద్రపోతున్నావా లేక నాలాగే ఆలోచనా తరంగాలలో మునిగి తేలుతున్నావా? పొద్దున్నా ఆఫీసు , రాత్రి నీ ఆలోచనలు తప్ప వేరే పని కూడా తోచడంలేదు. ఎంత మంది నా చుట్టూ ఉన్న ఎదో తెలియని వెలితి నాలో చోటు చేసుకొంది. మనసంతా భారంగా ఉంది. ఏమి చెయ్యాలో తోచడంలేదు. ఆదివారమని మీ ఇంటికీ వచ్చాను. నీవు గుడికి వెళ్ళావని........
ఇట్లు.. ప్రేమతో... (పక్కన డేట్)
****
ఇలాంటి కాగితం ఎదో పుస్తకంలో చూశాను అని బీరువా తీసి , అడుగున ఉన్న ఓ పొడవాటి పుస్తకం తీశాను. యెస్! పెళ్ళయిన కొత్తలో చూశాను కాని, మనకి సంబంధించినది కాదు, సభ్యత కాదు అని వదిలేశాను. ఇప్పుడు పైన ఉత్తరం ఒక ప్రేమలేఖలా అనిపించేసరికి ఎందుకో ఒకసారి మొత్తం చదవాలని అనిపించింది.

ఒక్కో పేజీ ఒక్కో పేజీ చదువుతుంటే.... ఆశ్చర్యం... ఆనందమా ఏమో! ఆ భావన ఏంటో..

భువినుండి దివికి దిగివచ్చే పారిజాతమే నీవై,.... అని ఒకచోట, ఏ దివిలో విరిసిన పారిజాతమో.. ఏ కవిలో .... అని ఇంకో ఉత్తరం, నీ చూపు కోసమే ఇన్నాళ్ళ నా నిరీక్షణ.. ఇలా ఎన్ని ఉత్తరాలు, ఇవన్నీ పెళ్ళి కాకముందయితే.. పెళ్ళయ్యాక ఇంకో అన్ని ఉత్తరాలు కనులు మూసినా నీవాయే , నేను కనులు తెరిచినా నీవాయే.. ఊహలు గుస గుస లాడే అంటూ .. సాగిన ఈ ప్రేమలేఖల ప్రహసనం, పెళ్ళయి సంవత్సరం దాటిన తరవాత వచ్చిన జూన్ 29 దాకా అంటే "మన చిన్నారి అచ్చం నీలాగే ఉంది , నాకు చాలా గర్వంగా ఉంది " అంటూ సాగాయి. మా శ్రీవారు నాకు వ్రాసిన ప్రేమలేఖలు అవన్నీ. ఒక్కటీ కూడా నా చేతికి ఇవ్వలేదు. ఈరోజు మా పాప ద్వారా తెలిసి వెలికి తీసిన లేఖలు అవన్నీ. ఎప్పుడూ చూస్తూవుండడమే తప్ప చదవాలన్న ధ్యాస కలగలేదు. కాగితం ఎక్కడో చూసాను అన్న అనుమానం వచ్చిన నాకు ఆ పొడవాటి పుస్తకం తెరిచి చూస్తే కనపడిన ప్రేమలేఖలు. "మీరో మంచి ప్రేమలేఖ వ్రాయండి " అని అడిగిన సంధర్భాలు కూడా ఉన్నాయి. కాని పాప పుట్టేదాక అలా తెలియకుండా వ్రాసుకొంటున్నారు అని తెలిసేసరికి ఎదో ఆనందం ముప్పిరిగొంది.

******

ఇదంతా జరగడం అనేది అనుకోకుండా అయినా, ఎందుకో రెండు రోజుల క్రితం కజిన్తో చాటింగ్లో "వదిన బెంగ పెట్టుకొన్నట్లుంది .. "పర్లేదులే తొందర్లో ఇండియా వచ్చేస్తున్నా " అని చెప్పు అన్నయ్యా! కాస్త ఊరడిల్లుతారు " అని అంటే.. "ఆ !!! ఆడవాళ్ళకి అవన్నీ చెప్పాలా? వాళ్ళే లెక్కలు వేసేసుకొంటారు" అని నా ముందు బయటపడడం ఇష్టం లేక పైకి చెప్పిన మాటలవి.

యస్! వాళ్ళకి తెలుసు ఫలనా అప్పుడు వచ్చేస్తారు అని, కాని తెలియడం వేరు ... చెప్పడం వేరు ..

"చిన్ని తల్లి ఏమంటుంది?" అని అడిగితే

"నాన్న ముద్దు కావాలంటుంది "

"పాలు గారు చెక్కిలిపైన పాపాయికి ఒకటి , తేనేలూరు పెదవులపైన దేవిగారికొకటి.."

అంటూ కుశలం ఆడిగేతీరు ఎన్నేళ్ళయినా ఎదురుచూసేలా చెయ్యదూ.. అలాగే శ్రీవారికి ప్రేమ ఉంది అని తెలిసేది ఎలా? అది వ్యక్తం చేసెది ఎలా? ఇలా వ్రాసినది దాచుకోడం వల్ల ప్రయోజనం శూన్యం అని నా అభిప్రాయం. ఎదన్నా మనసులో దాచుకోవాలి అంటారు. కాని మనసు మూగది ఇన్నింటిని ఎలా బయల్పరచగలదు? మనసు మూగదే కాని బాషుంటది దానికి , చెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది.. అంటారా.. :-) అయివుండచ్చు, ఇన్నాళ్ళు నా మనసుకు ఉన్న చెవులే పనిచేయలేదేమో... :-(

ఆదివారం నేను పొందిన ఈ చక్కటి అనుభూతిని మీతో పంచుకోవాలనిపించి...ఇలా..
******

7.11.2009

ఊహ కాదు నిజమే

రేరాజుగారి పోస్ట్ చదువుతుంటే దొరికింది లింక్ "నాకు ఈ కథ చాలా నచ్చింది ఎందుకూ అని ఎవరన్నా అడగాలని ఆశ అన్నారు. ఎందుకు అని అడుగుదామనుకొని నా అభిప్రాయం చెప్పిన తరువాత అడుగుదామనిపించింది. అందుకని ఆ లింక్ లోకి వెళ్ళి చూస్తే శారద గారి "ఊహ చిత్రం " కథ. నిజానికి నాకు చాలా నచ్చింది. ఇక్కడ కథని ఒక శుభం, ఒక విషాదంతో ముగించారు. ఇంచుమించు ఇలాంటి కథే నా పరిధిలో నిజంగా జరిగింది. అందుకే నాకు ఈ కథ లాంటి నిజం మీకు చెప్పాలనిపిస్తోంది . సహజంగాను, నిజంగాను జరిగే కొన్ని సంఘటనలు ఇందులో ఉండబట్టి రేరాజు గారు నచ్చిందీ అంటున్నారా అని ఆలోచించాను. నేను చెప్పిన ఈ సంఘటన తరువాత ఈ కథ ఎందుకు నచ్చిందా అని చెప్పదల్చుకొన్నాను. జరిగిన సంఘటనని కథగా వ్రాద్దామనుకొంటున్నా కాబట్టి పేర్లు మారుస్తున్నాను.




రేణుక నల్లగా ఉంటుంది అయినా ఆ కళ్ళల్లో ఎంత కళో. చూసినవాళ్ళు నల్లగా ఉన్నా ఎంత అందంగా ఉంది అని అనుకోకుండా ఉండలేరు. బేగంపేటలో కాలేజ్లోని ఇంటర్ చదువుతోంది. ఈమెకి ఇద్దరు ఫ్రండ్స్. రేణుకది సి .యి. సి గ్రూప్ అయితే వీళ్ళిద్దరిది ఎం.పి. సి గ్రూప్. ఒకే స్కూల్లో చదవడంవల్ల వీళ్ళ ముగ్గురి స్నేహం అలా కొనసాగుతూ ఉంది. రేణుక ఈ కథలో ముఖ్యపాత్ర అయితే ఆమేకి తోడుగా జాహ్నవి, పద్మజ ఉండేవారు. కాలేజ్కి ఎదురుగుండా పబ్లిక్ స్కూల్ ఉంది. దానికానుకొని బస్ స్టాండ్. అక్కడ 3 గంటలవుతుంటే చాలు అబ్బాయిలు గుమిగూడేవారు. ఎదురుగుండా వచ్చే సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిల్ని చూడడానికి.


తమకి సంబంధించిన వాళ్ళు రాలేదేమా... అని ఇటువైపు నుండి అమ్మాయిలు తమ కలువరేకులాంటి కళ్ళని చక్రాల్లా తిప్పేస్తు అటు మొదలయిన బ్రిడ్జ్ నుండి, ఇటు కాలేజ్ ఎదురుగా స్కూల్ కి పక్కగా ఉన్న పెట్రోల్ బంక్ దాకా కలయజూసేవారు, పక్కన స్నేహితులతో "పొద్దున్న వస్తానన్నడే రాలేదు చూడు" అంటూ..

ఇదిగో ఇలాంటి కోవలోకే వస్తుంది రేణుక. తనకి పరిచయమై ప్రేమ అంటూ వెంటబడిన ఓ అబ్బాయిని "సరే " అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన మర్నాడు అందంగా ఓణి వేసుకొని చూపరులని కళ్ళు తిప్పుకోలేనట్లుగా చేసేసి, "పొద్దున్న వస్తానన్నాడే తరుణ్ ఇంకా రాలేదు" అంటు కళ్ళు తిప్పుతుంటే ప్రవరాఖ్యుడైనా వెంట పడ్తాడేమో అనిపించేది.

అలా ఇద్దరూ కాలేజ్లో ఉన్నన్ని రోజులు వేళ్ళతో లెక్కపెట్టుకోలేనన్ని రోజులు సినిమాలని, షికార్లని, పార్కులని ప్రపంచమంతా తమ చేతుల్లొనే తీసేసుకొన్నట్లుగా తిరిగారు. కాలేజ్ అంతా తెలుసు ఫలనా కాలేజ్ అబ్బాయి , రేణుక మంచి ప్రేమికులు అని. వీళ్ళిద్దర్ని ఆదర్శంగా తీసుకొని ప్రేమికులైనవారు లేకపోలేదు ఆ కాలేజ్ లో .

అలా వాళ్ళు ప్రేమలో మునిగితేలుతుండగానే ఇంటర్ పరీక్షలయి ఎవరికి వారు వేరయ్యారు. తరువాత .....తరువాత పద్మజ ఊరికే ఉండడం ఎందుకని ఎక్కడో చిన్న ఉద్యోగంలో చేరింది. జాహ్నవి ఇంట్లోనే ఉంది.

ఒక నెల రోజుల తరువాత, ఓరోజు రేణుక , పద్మజ జాహ్నవి ఇంటికి వచ్చారు. రేణుక కళ్ళలోని వెలుగు ఆ నవ్వు చూస్తుంటే జాహ్నవికి అర్థమయిపోయింది ఏదో శుభవార్తే అయి ఉంటుందని.. "ఏంటి సప్రైజ్ ?" అని అడిగే లోపులే రేణుక..

"నా పెళ్ళి నువ్వు, పద్మజ తప్పక రావాలి" అని అంది

ఆమే ఆనందం చూస్తుంటేనే అర్థమయ్యింది జాహ్నవికి, అంతే సంతోషంతో "మొత్తానికి కోరుకొన్నవాడిని చేసుకోబోతున్నావన్నమాట కంగ్రాట్యులేషన్స్" అంటూ రేణుక ఇస్తున్న శుభలేఖ అందుకొంది జాహ్నవి.

"అంత లేదులే ఏదో కాలక్షేపానికి ప్రేమే కాని, పెళ్ళెవరు చేసుకొంటారు " అని విసురుగా చెప్పేసరికి , మరి పెళ్ళికొడుకెవరయి ఉంటారని శుభలేఖ తెరిచిన జాహ్నవికి తరుణ్ బదులు వేరే ఏదో పేరు కనపడింది. మరి తరుణ్.. మనసులో అనుకొంది కాని పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి బంధం అంతగా తెలీదు.. అదీ కాక ఒకే వయసు వాళ్ళవడంతో ఇంతేనేమోలే అనుకొంది.

ఆ తరువాత నాలుగో ఐదో.. సంవత్సారాలకి అనుకొంట ఎందుకో ఎవరో తెలిసినవాళ్ళకి బాలేదు పక్కనే ఉన్న మానసిక చికిత్సాలయంలో చేర్చారు అని తెలిసి, చూడడానికి వెళ్ళిన జాహ్నవికి అక్కడ పిచ్చిగా తిరుగుతున్నవాళ్ళల్లో కనిపించిన వ్యక్తిని చూసి హతాశురాలయ్యింది. త ..రు.. ణ్... ఏంటి ఇలా ఇక్కడ... ఒక్కసారిగా ఏదో ఆందోళన లాంటి భావనేదో పద్మజకి ఫోన్ చేసింది. "ఏంటి పద్మా తరుణ్ ఇక్కడ ఇలా నీకు తెలుసా అంటే".. "రేణుక పెళ్ళి టైం కే అతనలా అయిపోయాడుగా... నీకు చెప్పడానికి కుదరలేదు" అని చెప్పింది పద్మజ. ఇప్పుడు ఈ కథలోని తరుణ్ ఇంకా అక్కడే అంటే ఆ మానసిక చికిత్సాలయంలోనే ఉన్నాడు. పెళ్ళి చేసుకొన్న ఆనందంగా ఇద్దరు పిల్లలతో , పేరుమోసిన వస్త్రవ్యాపారికి బార్యగా... మంచి పేరు ప్రఖ్యాతలతో అప్పుడప్పుడు మన టి.వి ల్లో దర్శనమిస్తూ చెన్నై లో ఉంటున్నారు. పద్మజ ఆ మధ్య కొంతకాలం సింగపూరు ఈమధ్యే బెంగళూర్..
ఇది నిజమైన ఒక కథ.

******

పైన నేను చెప్పిన కథలో ఎవరిది తప్పు అంటే మీరేమని చెప్తారు? అబ్బాయిది కాదు, అమ్మాయిది కాదు అది వయసు తప్పు. అప్పటి వయసు వాళ్ళిద్దరిని ఆలోచింపనివ్వలేదు. మరి వాళ్ళిద్దరు ఏమి వాగ్ధానాలు చేసుకొన్నారో ఏమో. అసలు ప్రేమంటే కూడా తెలియకుండా పిచ్చిఆకర్షణలో పడిపోయాడా యువకుడు. అందుకే ఊహించలేని షాక్ నుండి తేరుకోలేదు. ఇక్కడ అతనిది తప్పుకాదు నిజానికి ఆ వయసులో అది ప్రేమ కాదు కూడా. ఆ అమ్మాయి అందం అతనిని పిచ్చివాడిని చేసివుండాలి అని నేను అనుకొంటున్నాను లేదా ఇంకో విధంగా ఆలోచిస్తే.. ఇంట్లో ఒక్కడే అవడం వల్ల "ప్రేమ" అనో లేకపోతే "నీకొసమే నేను " అనే చిన్న చిన్న భావనల్తో మనసుని నింపేసుకొని ఉంటాడు. ఆ అమ్మాయికి చేతినిండా డబ్బు, ఏదో ఇప్పుడిది ఫాషన్ అని అనుకొందేమో .. ఈ కథ నిజంగా జరిగింది కాని ఒకవేళ కథ అయి ఉండి, మనము ఈ అబ్బాయిని మానసిక చికిత్సాలయం .. అంటే కథ ఎవరికి నచ్చదు. పెళ్ళి చేసుకొన్న ఆ అమ్మాయి సంతోషంగా ఉన్నప్పుడు, అబ్బాయికెందుకు అన్యాయం జరగాలి అనుకొంటారు. ఇక్కడ ఎవరు ప్రేమ దాని విలువ అంటూ ఆలోచించరు.

శారద గారు వ్రాసిన కథలో ఇంచుమించు ఇలానే జరిగింది కాకపొతే , అమ్మాయికి చివరి క్షణంలో తనని ప్రేమించినవాడు ఎలా ఉన్నాడో అనే ఆలోచన కలిగింది. ఆమే ఊహల్లో అతను తనకోసం ఆలోచించుకొంటూ ఇంకా పెళ్ళి చేసుకోకుండా ఉన్నాడు అన్న భావన ఉంది, కాబట్టి తనకిలా అయ్యిందని తెలియజేయమని డాక్టర్ని అడగడం బాగుంది. ఇక్కడ ఆ డాక్టరు ఆమె చనిపోయిన తరువాతే ఇండియా వెళ్ళడం కథకి అర్థవంతంగా ఉంది. అలాగే అక్కడ ఆ సదరు ప్రేమికుడికి ఈమె వివరాలు చెప్పకపోడం కూడా మెచ్చేట్లుగా ఉంది. అతను కూడా వేరే పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉండడం సహజంగా ఎవరి జీవితాలు ఈ ప్రేమలాంటి ఆకర్షణలో పడకపోడంవల్ల , "ఇది బాగుంది" అనిపించిందేమో అని నాకు అనిపిస్తోంది. అదే కనక అతను ఇంకా ఈమె గురించి కొట్టుమిట్టాడుతుంటే "అయ్యో పాపం " జాలి పడేవాళ్ళం. కాని నాకెందుకో శారదగారు చెప్పినట్లు జరగడమే న్యాయం అనిపిస్తోంది. పిచ్చివాళ్ళు కాకుండా జీవితం విలువ (ప్రేమ విలువ కాదు) జీవిచడంలోని అనుభూతిని తెలుసుకొంటారు.

అంతేనంటారా రేరాజ్ గారు? మీకు ఎందుకు నచ్చిందో చెప్తారా? మీ బ్లాగులో మీ పోస్ట్ కన్నా వ్యాఖ్య ఎక్కువవుతోందని ఇక్కడ ఇలా అడుగుతున్నా... :)

7.01.2009

ఐదో గోడ అవసరమా?

కూడలిలో ప్రతి ఐదు పోస్ట్ల్లకి ఒక పోస్టు ప్రత్యక్షంగానో , పరోక్షంగానో ఈ కథ గురించి విమర్శో , పొగడ్తో తెలియకుండా కనిపిస్తోంది గత వారం రోజులనుండి. అసలు కథ చదవకుండా ఇవన్నీ చదివిన తరువాత వచ్చిన ఆలోచన ఆ కథ చదవడం. ఇక్కడ నేను ఓ ప్రముఖ రచయిత్రిని విమర్శించేంత గొప్పదానిని కాదు, అలా అని ఏమి వ్రాసినా చాలా బాగుంది అనేసేంత వెర్రిదాన్ని కాదు . ఒక మాములూ పాఠకురాలిని. ఆలా మాములూ పాఠకురాలి హోదాలో ఈ కథ గురించి నా అభిప్రాయం చెప్పాలనుకొంటున్నాను కాని ఇందులో రచయిత్రిని కించపరిచే ఉద్దేశ్యం ఎంతమాత్రం లేదు. అలాగే ఈ కథ బాగా నచ్చేసిన పెద్దవారికి తమ అమూల్యమైన సమయాన్ని , ఇలా నా టపా చదివినందుకు, అలా వారి సమయం వృధా అయినందుకు క్ష్యంతవ్యురాలిని. నాకు పెద్ద భాష , పెద్ద పదాలు రావు. నాకొచ్చిన మామూలు భాషలో మాములూ బ్లాగర్ హోదాలోచెప్పదల్చుకొన్న విషయం. ఇదిగో ఇదే:

అప్పుడెప్పుడో ఈ కథా రచయిత్రిగారు వ్రాసిందే "స్లీపింగ్ పీల్" ఆ కథకి ఈ కథకి ఒక్కటే తేడా అక్కడ సెక్స్ విషయంలో పురుషాధిక్యతని అసంధర్భంగా ప్రస్తావించారు 60 యేళ్ళ ముసలాడికి కోరికలూ అంటూ.. ఇక్కడ 60 యేళ్ళ స్త్రీ కోరికలు అంటున్నారు. అక్కడ మహిళల సానుభూతి సంపాదించారు . మరి ఇక్కడ?? ఈ రెండు కథల్లో మనకి ప్రస్ఫుటంగా కనిపించేది ఒక్కటే, ఈ జీవితం కేవలం శృంగారం కోసమే, అదే జీవిత పరమావధి అన్నట్లుంది. స్లీపింగ్ పీల్ కథని మహిళలందరూ బ్రహ్మరథం పట్టారు. సరే ఇప్పుడు వ్రాసిన ఈ కథలో యద్దనపూడి తరహాలో గది వర్ణనలు, లాన్ వర్ణనలు బాగున్నాయి. కథ ఇతివృత్తానికి వస్తే, భర్త చనిపోయిన నెలకే ఒక 60 యేళ్ళ స్త్రీ తోడునాశించడం, దాని గురించి పేపర్లో ప్రకటన, కూతురు మొదటకాదన్నా తల్లి మనసులోని భావనలను అర్థం చేసేసుకొని ఆనందబాష్పాలు రాల్చడం. తరువాత కథలోని రచయిత్రికి ఆ 60 యేళ్ళ స్త్రీ పాత్ర .."నాలోని కోరికని ఎందుకు బయట పెట్టలేకపోయావు" అంటూ ......ఇలా సాగుతుంది కథ. అంటే 60 యేళ్ళ ఆ స్త్రీ పాత్ర కేవలం కోరికల కోసమే మరో వివాహం కాదు ... కాదు తోడు కోరుకొంటోంది. ఇది సమాజం హర్షించేయాలి. దీనిని మేము హర్షిస్తున్నామంటూ ఉగాది పురస్కారలలో మొదటి బహుమతి. అర్థం కాని కథలే అవార్డు కథలు అని మరోసారి నిరూపించబడింది. . నిజంగా 60 యేళ్ళప్పుడు కోరికలతో కాలిపోతున్నప్పుడు, అప్పుడు సమాజ కట్టుబాట్లు గుర్తు రానప్పుడు, భర్త తనని సరిగ్గా చూసుకోవట్లేదు లేదా కోరిక తీర్చట్లేదు అనుకొన్నప్పుడు, బార్య అదే ఈ కథలోని నేటి మహిళ,
భర్త చనిపోయాక ఎవరితోనో సహజీవనం సాగిద్దామనుకొన్నప్పుడు, భర్త బతికుండాగానే అంతటి తెగువ ఎందుకు చూపించలేకపోయింది? ఏ కట్టుబాట్లకి లొంగింది? 60 యేళ్ళకి అన్ని అయిపోయాక ఏ కట్టుబాట్లు తెంచుకొందామనుకొంటోంది? 60 యేళ్ళకి తను అనుకొన్న మనిషి దొరకగా లేనిది, భర్త బతికి ఉన్నప్పుడు కూడా దొరుకుతాడే. దానికి భర్తని చంపేయడమెందుకు? నెలలోపు అంటూ ప్రకటన ఎందుకు? ఆవిడకి సమాజపు కట్టుబాట్లు అనవసరం అనేది 60 యేళ్ళకి పరిమితమా? పెళ్ళయిన వెంటనే ఛట్! నా కోరిక తీరట్లేదు అని వెళ్ళచ్చు కదా, పోని కొంచం డీసెంట్ గా మాట్లాడుదాము, రంగనాయకమ్మగారి జానకి విముక్తిలాగ, చలగారి మైదానం నవల్లో లా భర్త ఉండగానే "నువ్వు నా కోరిక తీర్చలేకపోతున్నావు అనో లేదా నా మనసులోకి చొచ్చుకొని నా భావనలను అర్థం చేసుకోలేకపోతున్నవు అనో " విడాకులు ఇచ్చేసి ఇంకో తోడో లేదా పెళ్ళో చేసుకోవచ్చేమో కదా. వయసుడిగినప్పటికన్నా ఇంకొంచం ముందయితే నిఖార్సయైనా మొగవాడు తోడు దొరికేవాడేమో కదా. (సమాజం కట్టుబాట్లు, ఏ సెంటిమెంట్లు మనకొద్దు అనుకొన్నప్పుడు) ఇక్కడ ఎవరిని అవహేళన చేస్తున్నారు? భర్త వెర్రివాడనా, ఒక మర మనిషి అనా? అయితే ఎందుకు? బార్యమనసులో కించిత్ విలువ సంపాదించలేకపోయాడనా? లేక బార్యనా, లేక బార్య భర్తల బంధాన్నా? నాకయితే ఇక్కడ బార్య భర్తల బంధం అవహేళన అవుతోంది అనిపిస్తుంది. ఆత్మ క్షోభిస్తుంది లాంటి మాటలు పక్కన పెడితే, లోకం దృష్టిలో అతని స్థానం ఏమిటి? ఏ మగవాడు, ఏ ఆడది తమకి తాముగా మమ్మల్ని మీ హృదయాలలో సింహాసనం మీద కూర్చోబెట్టండి అని అడగరు. ఆ బంధాన్ని కాపాడుకోడం ఇరువురి బాధ్యత. ఇష్టం లేకపోతే , నిజంగా 60 యేళ్ళ తరువాత లేని ధైర్యం తెచ్చుకొని తోడు అంటూ వెంపర్లాడేకన్నా, ఉన్నప్పుడే నాకు నువ్వు ఇష్టం లేదు అని చెప్పేస్తే ఇద్దరికి సేఫ్. చెరొకరు చెరొక దారి చూసుకొంటారు. మరి పిల్లలు? అని ప్రశ్నిస్తే, కట్టుబాట్లకే లొంగని వాళ్ళు ఇక కన్నపేగుకి లొంగుతారా? ఇలాంటి కథల వల్ల ప్రయోజనం అర్థం కావడం లేదు. యువతి యువకుల్లార! మీ నచ్చకపోతే వెంటనే తెగ తెంపులు చేసుకోకండి.. ఎవరో ఒకరు పోయేదాక ఆగి... అది 60 యేళ్ళు అయినా 100 యేళ్ళయినా తరువాత తోడుకోసం ఇంకో మార్గం ఎంచుకొండి అన్న సందేశమా? ఇది స్త్రీ జనోద్ధారణ కథా? లేక పురుషపుంగవులని అవమానించే కథా? పిచ్చివాడా అసలు నీ మగతనమేమిటి ? నువ్వు నన్ను సుఖపెట్టలేదు అని 60 యేళ్ళకి బయటికి రావడం??

*****

ఇక కోరికల విషయం: ఆంధ్ర అయినా అమెరికా అయినా స్త్రీ ... స్త్రీ నే.. 40 యేళ్ళు వస్తున్నాయంటేనే హార్మోన్ల ప్రభావం తగ్గి మొనోపాజ్ దశకి చేరుకొంటాము. అంటే మాములుగానే, మన స్లీపింగ్ పీల్ కథలోలా భర్త దగ్గరికి వస్తుంటే, ఏదో ఒక సాకు చెప్పో, లేదా బలవంతంగా "సరే" అనడమో, లేదా ఇద్దరిమధ్య ఒక అవగాహనో ఎదైతేనేమి నొప్పించక తానొవ్వక ప్రవర్తిస్తాము. ఇక్కడ కేవలం స్త్రీ గురించే మాట్లాడం లేదు. ఇద్దరివైపు మాట్లాడుతున్నాను. ఇక మొనోపాజ్ దశలో స్త్రీ కి ఈ శారీరక పరమైన కోరికలు కాస్త సన్నగిలుతాయి. ముందంతా భర్త తనని సుఖపెట్టడా లేదా అన్నది 60 యేళ్ళకి తవ్వుకొని ఆలోచించాల్సినదేమిలేదు. సో, ఆ 60 యేళ్ళకి కథలో ముందు రాసినట్లుగా తోడు అవసరమనుకోవచ్చు కాని, శారీరకపరమైన కోరికలు కలుగుతాయి అంటే అది సరి కాదు . ఎక్కడో 1% ఉంటారు ఆ మధ్య ఏదో పేపర్లో 60 యేళ్ళకి తల్లి అయిన వృద్ధ నారిమణీ అని. అలా తప్పితే 99% స్త్రీలకి 60 యేళ్ళకి వాంఛలుండవు.. వాత్సల్యంకోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి మనిషికి ఇంకా ఎక్కువ వయసున్న వ్యక్తే తారసపడ్తారు. అంటే ఒకరికొకరు సేవలు చేసుకోడం తప్పితే అక్కడ అప్పుడు కోరికలంటే హాస్యాస్పదంగా ఉంది.

ఇక బార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోడం. ప్రతి మనిషిలోను అన్నీ మంచి లక్షణాలే ఉండవు.. అలా అని అని చెడు లక్షణాలే ఉండవు. రెండు కలగలిపినవాడే మనిషి. అది ఎవరయినా. మరి అలాంటిది భర్త బార్యని అర్థం చేసుకోపోడానికి కారణం, అతను పుట్టి పెరిగిన వాతావరణం అయి ఉండొచ్చు కదా. ప్రతి మనషి తన మనసాక్షిగా తరచి చూసుకొంటే , తన మనసుకు ఒంటరి వాడే, బార్య పిల్లలు, బంధువులు ఇవన్ని పాత్రలు ఈ జగన్నాటకంలో , మనమెప్పుడు ఎవరికివారం ఒంటరివాళ్ళము. మరి అలాంటప్పుడు ఎవరో వచ్చేసి మన మనసుల్లోకి దూరిపోయి, మనల్ని అర్థం చేసేసుకోవాలనుకోడం మన భ్రమే అవుతుంది. ప్రతి జంట 100% మనసులో భావాలు తెలిసేసుకొంటున్నార? ఎప్పుడో మనసులో భావుకత పాళ్ళు హెచ్చి,"పచ్చని పసిడి చందమామని చూడండి, వెన్నెల ఎంత బాగుందో " అని నేనంటే, "పంచదార రేట్ బాగా పెరిగింది ఆకాశానటింది" అని అంటారు ఆ మాత్రానికే మావారికి భావుకత లేదని నేను 60 యేళ్ళ తరువాత ఇంకో బంధానికి ఎదురుచూడనా?
మనిషి బంధాలకి బాధ్యతలకి కట్టుబడ్డాక, వెన్నెల రాత్రులు, తెల్ల చీరలు పక్కన పెట్టి , నిద్రపోని రాత్రులు, ఇంకా సంపాదించాల్సిన పరిస్థితులు తలుచుకొని, అవన్నీ బార్యకెందుకులే అనుకొని ముభావంగా (మన భాషలో భావుకత లేకపోడం) ఉంటే మనం తీరిగ్గా మనవాళ్ళెప్పుడు పోతారా ఎప్పుడు పేపర్లో ప్రకటన ఇద్దామా అని ఎదురుచూద్దాము, మన చిట్టి తల్లుల కళ్ళల్లో వెలుగు చూడడానికి. ఈ కథలో ఆధూనీకత కాదు కదా, అసలు అర్థమే లేదు. భర్త చేతుల్లో ఎన్నో కష్టాలు, శారీరక బాధలు పడ్డవాళ్ళ మధ్య, మనం మనదైన సొంత వ్యక్తిత్వంతో మన జీవితాల్ని జయిస్తున్నాము. అసలిదంతా ఎందుకండి? నాది ఒక్కటే ప్రశ్న. బతుకు తెరువు కోసం బార్య ఒక దేశంలో భర్త ఒక దేశంలో ఉన్నప్పుడు, వారిరువురికి ఈ కథ ఇచ్చే గొప్ప సందేశం ఏంటి? ఇదేనా? ఎందుకంటే పాపం 60 యేళ్ళ వరకూ.. పొని ఎవరో ఒకరు బతికుండే వరకూ వీళ్ళకి వెన్నెల రాత్రులు,, పడక సుఖాలు అన్నీ తెలిసినా, వీటికి దూరమే కదా! కాని ఇలా జీతాల కోసం, జమా ఖర్చుల కోసం జీవితాన్ని అనుభవించలేని వారు ఈ కథలు చదివితే?? పర్యవసానం ఎంటి? ఎన్ని రాత్రులు నిశిరాత్రులు వాళ్ళవి. నిజానికి వాళ్ళెవరూ 60 యేళ్ళ దాకా ఆగాల్సిన పని లేదేమో కదా, ఈ కట్టుబాట్లు అవి తెంచేసుకోవచ్చు. నన్నడిగితే ఈ క్షణంలో నేనేమి ఆలోచిస్తున్నాను అని నా వ్యక్తిని అడిగినా చెప్పలేరు. మన మనసు మనకే పూర్తిగా తెలీదు. ఇహ ఎవరో 60 యేళ్ళ తరువాత వచ్చేసి అర్థం చేసేసుకొని మనల్ని ఉద్దరించేస్తారు అని ఎలా ఎలా ఆలోచిస్తారండి?

ఇదంతా చదివిన తరువాత మీకెమనిపిస్తోంది? ఐదో
గోడ, 60 యేళ్ళతరువాత జీవితం కోరికలు . ఇవన్నీ అవసరమా? ఐదో గోఎప్పటికైనా అడ్డుగోడే. నాలుగుగోడలు చాలు మనిషి సుఖంగా ఉండడానికి. అవునా?

కలగూరగంప


సరదా:

మొన్న ఆ మధ్య జరిగిన ఆన్యువల్ పరీక్షలలో తెలుగు సబ్జెక్ట్లో "అసూయ" గురించి సొంత వాక్యం వ్రాయమంటే మా వాడు ఓ పెద్ద కథే వ్రాసేసా
డు కాని వాళ్ళ టీచర్ 3 మార్కులేశారని పేపర్ తీసుకొచ్చి చూపించాడు. వాడు వ్రాసింది ఇదిగో ఇలా.

అసూయ: ఆడవాళ్ళకి బంగారమంటే ఇష్టం. కాని పక్కవాళ్ళు పెట్టుకొన్నారని "అసూయ" పడకూడదు, మనమెలా సంపాదించాగలమా అని ఆలోచించాలి. ఉదా: మా అమ్మ ఉంది మా అమ్మ ఉద్యోగం చేసి సంపాదిస్తుంది కాబట్టి బంగారం కొంటుంది.
మరి మా అక్క మా అమ్మ బంగారం చూసి అసూయ పడకూడదు కదా. అందుకని ఈ అసూయ................ ఆవువ్యాసంలా ప్రతి వాక్యంలో "అసూయ" పదం ఉపయోగించాడు. భలే ఫన్నీగా ఉంది కదా.. సొంతంగా వ్రాయడం.

"ఎన్ని మార్కులేసారు అన్నది కాదమ్మా నేను కరెక్ట్ వ్రాసానా లేదా అన్నది ముఖ్యం" అని అంటే "కరెక్టే" అని చెప్పేసరికి మురిసిపోయాడు. (ఇందులో బోల్డు గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి 2 మార్క్స్ తగ్గించారు వాళ్ళ టీచర్)

******

జీవితసత్యం:

ఈరోజు ఉదయం చక్కటి చిక్కటి కాఫీ తాగుతుంటే, "గురువుగారు ఉన్నారా"! అంటూ ఓ పెద్దాయన వచ్చారు.. ఒకరినొకరు గురువుగారనే సంభోదించుకొంటారు. మావారి అవిశ్రాంత పూజలని ఉడతాభక్తిగా అంటు ఎక్కడెక్కడినుండో పువ్వులు తీ
సుకొస్తారు ఈయన. ఇద్దరూ కింద హాయిగా కాళ్ళు బారజాపి ఇచ్చిన కాఫీ తాగుతూ (ఎంత హాయో కదా ఇలా.... సొఫాల సుఖం కన్నా :) ) పిచ్చాపాటి మాట్లాడుకొంటూ ఉంటే , నేను ఆఫీసు హడావిడిలో వంటగదిలో ఉన్నా. వాళ్ళూ మాట్లాడుకొనే మాటలు అప్రయత్నంగా నా చెవిన పడ్డాయి. ఇలా..

"ఇక్కడింకెన్నాళ్ళు ఉంటాము, కోడలు వె
ళ్ళమని అనదు, ఉండమని చెప్పదు. కాని మా ఇల్లాలికి ఇక్కడ ఉండడం కష్టంగా ఉంది. తెలిసి తెలియకుండా ఇబ్బంది పడిపోతున్నాము "

"భలేవారే మీరు మీ కొడుకు దగ్గర ఉన్నారు, ఎక్కడ పరాయి ఇంట్లో ఉన్నట్లు ఎందుకలా డీలా పడ్తారు. పోని కొన్ని రోజులు చిన్నబ్బాయి ఇంట్లో
ఉండండి. కాస్త మార్పు ఉంటుంది" అన్నారు మావారు.

"హ..హ మా చిన్న
కోడలాండీ పాపం మంచిదే, పొద్దున్న 9 గంటలకి వెళ్తుంది, మధ్యాహ్నం 1 గంటకి వస్తుంది, మంచినీళ్ళూ కూడ పెట్టుకోడం రాదు, "అత్తయగారు మంచినీళ్ళు " అంటుంది. సాయంత్రం ఎప్పుడో 6 గంటలకి వస్తుంది. ఓ చుట్టం లేదు.. ఓ పెళ్ళి లేదు, ఓ పేరంటం లేదు, ఇద్దరూ ఉద్యోగాలంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళకే పట్టదు, అన్నానని కాదు కాని, రెపొద్దున్న ఆ నలుగురూ కూడా దోరకరు వాళ్ళకి. అయీనా మేము "రామా" అని అడగము వాళ్ళు "రండి" అనరు .

ప్రతి ఇంట్లో ఉండే మాములు సమస్య, అందరికి తెలిసి ఎవరు ఏమి చెయలేని సమస్య. నాకు ఆయన చెప్పిన చిన్నకోడలి విషయం కొంచం ఆలోచించేదిగా అనిపించింది. మరి మేము అంతేగా.. ఓ పెళ్ళి లేదు పేరంటం లేదు .. ..
అదే యాంత్రిక జీవితం... మరి ఆ నలుగురు??? ఆలోచించడానికే భయమేసింది. అమ్మో.. ఆ నలుగురు మొయ్యడానికా ఈ జీవితం? ఇంతేనా మరి ఈ జీవితం?
*******

మనసేది?

మా పాప పుట్టినరోజు నాడు బంధువు ఒకరు ఫోను చేసి " మా పాపని చూడాలనిపిస్తొందని, " అని అన్నారు, "అయ్యో అదెంటండి ఇంటికి రండి " అంటే "మీరుండరు ఎలా అండీ?" అని ప్రశ్న.. ఇది దాదాపు నా పెళ్ళైనప్పటినుండి ఎదుర్కొంటున్న సమస్య. ఎలా అంటే, 24 గంటలలో 8 గంటలు మాత్రమే బయట మిగతా సమయమంతా ఇంట్లోనే ఉంటాము కదా ! మన
సుంటే మార్గాలు అనేకం . "మాకు రావాలనే ఉంటుంది మీరే ఉండరు" అని చాలా మంది చాలా సంధర్భాలలో చాలాసార్లు నాతో అన్నమాట. వినలేక విన్న మాట. ప్చ్! అంతేనేమో...
*****

స్నేహానికి ఎదుగుదల ఎలా?

ఎప్పుడూ నేనే ఫోన్ చెయ్యాలి. నువ్వు మటుకు చెయ్యవోయ్.. మొన్నమధ్య ఒక స్నేహితురాలు, ఎప్పుడూ నేనే రావాలోయ్ మీ ఇంటికి నువ్వు మటుకు మా ఇంటికి రావు ఇంకో స్నేహితురాలు. నేనే మెయిల్స్ వ్రాస్తున్నాను మీరుమటుకు నాకు అస్సలు వ్రాయరు, మీరు బిజీ అయిపోయారని నేను వ్రాయడం మానేసాను. ఇహ ఫోన్లు కూడ మానేయ్యాలేమో. అసలు మన స్నేహ సంబంధమే ఒక మాయలా ఉంది. ఏవి నిరుడు కురిసిన హిమకుసుమాలు అంటూ గత 7 సంవత్సారాలుగా చాటింగ్ స్నేహితురాలు. స్నేహాన్ని కొద్దిరోజులు ఏవిధమైన కమ్యునికేషన్ లేకుండా ఉంచితే పెరుగుతుందా? కమ్యునికేషన్ అవిశ్రామంగా సాగితే తరుగుతుందా? ఏవిధంగా కొలుస్తాము ఈ పెరుగుదలని, తరుగుదలని?

అమ్మవాళ్ళిల్లూ మా ఇల్లూ నాలుగడుగుల దూరం అయినా రోజు ఫోన్ చేస్తుంది. "తిన్నవా? తాగావా? " అంటూ .... ఒక్కోసారి విసుక్కొన్నా ఆ మర్నాడు మళ్ళీ మాములే. ఒకవేళ చేయకపోతే "ఏంటి అమ్మ ఇంకా ఫోన్ చేయలేదు " అని నేను చేయడం.. అలాగే బార్య భర్తల మధ్య అనురాగం, ప్రేమ పెరగడం , తరగడానికి వారధులు పిల్లలు.. వాళ్ళ బాధ్యతలు ...ఇవన్ని దోహదపడ్తాయి. వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తూ బంధంలోని ఆ తీయదనాన్ని ఆస్వాదిస్తాము. ఇవన్నీ మనకి జీవితాంతం మనవెంట ఉండే విసుగురాని బంగారు బాధ్యతలాంటి సంకెళ్ళు .విసుగు అనేది తాత్కాలికం. ప్రతి పని ఇష్టపూర్వకంగా చేస్తాము."మన" అనుకొని .

మరి స్నేహానికి ఈ విసుగు... చికాకు ... మధ్యలో కొంత విరామం అవసరమా? ఆలోచించండి. నాతో పాటు కలిసిన స్నేహ ప్రయాణంలో ఒక్కొక్కరు ఒక్కో సమయంలో తెలిసి కొందరు తెలియక కొందరు బై చెప్పేసిన (నేనెవ్వరికి చెప్పలేదు) మిత్రులందరూ మరోసారి ఆలోచిస్తారని... స్నేహాన్ని ఏవిధంగా పెంపొందిచాలి ?
******
ఒక్కనిముషం: ఈ పోస్ట్ ఒకదానికొకటి పొంతన లేకుండా వ్రాసాను సరదాకి కబుర్లు చెప్పుకొనేట్లుగా. పేరు కూడ అందుకే కలగూరగంప అని పెట్టాను.