7.12.2009

ఇదే ... నా మొదటి ప్రేమలేఖ

వ్రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక....
తెలుపుటకు భాష చేతకాక.....

పాటలు వింటూ పని చేసుకొంటున్నా..రోజూకన్నా ఆదివారం అనేసరికి కాస్త పని ఎక్కువగానె ఉంటుంది. ఏదో సర్దుతూవుంటే పాప ఒక పేపరు తీసుకొచ్చింది

"అమ్మా చూడు ఏదో పనికొచ్చేదేమో అంటూ.. " ఎంటా అని పరికించి చూసాను. అందులో ఇలా ఉంది.

డియర్,

బహుశా ఈ టైంకి నిద్రాదేవి ఒడిలో సేద తీరుతూ ఉంటావనుకొన్నాను. ఇప్పుడు సమయం రాత్రి 12 గంటలు.. నిద్రపోతున్నావా లేక నాలాగే ఆలోచనా తరంగాలలో మునిగి తేలుతున్నావా? పొద్దున్నా ఆఫీసు , రాత్రి నీ ఆలోచనలు తప్ప వేరే పని కూడా తోచడంలేదు. ఎంత మంది నా చుట్టూ ఉన్న ఎదో తెలియని వెలితి నాలో చోటు చేసుకొంది. మనసంతా భారంగా ఉంది. ఏమి చెయ్యాలో తోచడంలేదు. ఆదివారమని మీ ఇంటికీ వచ్చాను. నీవు గుడికి వెళ్ళావని........
ఇట్లు.. ప్రేమతో... (పక్కన డేట్)
****
ఇలాంటి కాగితం ఎదో పుస్తకంలో చూశాను అని బీరువా తీసి , అడుగున ఉన్న ఓ పొడవాటి పుస్తకం తీశాను. యెస్! పెళ్ళయిన కొత్తలో చూశాను కాని, మనకి సంబంధించినది కాదు, సభ్యత కాదు అని వదిలేశాను. ఇప్పుడు పైన ఉత్తరం ఒక ప్రేమలేఖలా అనిపించేసరికి ఎందుకో ఒకసారి మొత్తం చదవాలని అనిపించింది.

ఒక్కో పేజీ ఒక్కో పేజీ చదువుతుంటే.... ఆశ్చర్యం... ఆనందమా ఏమో! ఆ భావన ఏంటో..

భువినుండి దివికి దిగివచ్చే పారిజాతమే నీవై,.... అని ఒకచోట, ఏ దివిలో విరిసిన పారిజాతమో.. ఏ కవిలో .... అని ఇంకో ఉత్తరం, నీ చూపు కోసమే ఇన్నాళ్ళ నా నిరీక్షణ.. ఇలా ఎన్ని ఉత్తరాలు, ఇవన్నీ పెళ్ళి కాకముందయితే.. పెళ్ళయ్యాక ఇంకో అన్ని ఉత్తరాలు కనులు మూసినా నీవాయే , నేను కనులు తెరిచినా నీవాయే.. ఊహలు గుస గుస లాడే అంటూ .. సాగిన ఈ ప్రేమలేఖల ప్రహసనం, పెళ్ళయి సంవత్సరం దాటిన తరవాత వచ్చిన జూన్ 29 దాకా అంటే "మన చిన్నారి అచ్చం నీలాగే ఉంది , నాకు చాలా గర్వంగా ఉంది " అంటూ సాగాయి. మా శ్రీవారు నాకు వ్రాసిన ప్రేమలేఖలు అవన్నీ. ఒక్కటీ కూడా నా చేతికి ఇవ్వలేదు. ఈరోజు మా పాప ద్వారా తెలిసి వెలికి తీసిన లేఖలు అవన్నీ. ఎప్పుడూ చూస్తూవుండడమే తప్ప చదవాలన్న ధ్యాస కలగలేదు. కాగితం ఎక్కడో చూసాను అన్న అనుమానం వచ్చిన నాకు ఆ పొడవాటి పుస్తకం తెరిచి చూస్తే కనపడిన ప్రేమలేఖలు. "మీరో మంచి ప్రేమలేఖ వ్రాయండి " అని అడిగిన సంధర్భాలు కూడా ఉన్నాయి. కాని పాప పుట్టేదాక అలా తెలియకుండా వ్రాసుకొంటున్నారు అని తెలిసేసరికి ఎదో ఆనందం ముప్పిరిగొంది.

******

ఇదంతా జరగడం అనేది అనుకోకుండా అయినా, ఎందుకో రెండు రోజుల క్రితం కజిన్తో చాటింగ్లో "వదిన బెంగ పెట్టుకొన్నట్లుంది .. "పర్లేదులే తొందర్లో ఇండియా వచ్చేస్తున్నా " అని చెప్పు అన్నయ్యా! కాస్త ఊరడిల్లుతారు " అని అంటే.. "ఆ !!! ఆడవాళ్ళకి అవన్నీ చెప్పాలా? వాళ్ళే లెక్కలు వేసేసుకొంటారు" అని నా ముందు బయటపడడం ఇష్టం లేక పైకి చెప్పిన మాటలవి.

యస్! వాళ్ళకి తెలుసు ఫలనా అప్పుడు వచ్చేస్తారు అని, కాని తెలియడం వేరు ... చెప్పడం వేరు ..

"చిన్ని తల్లి ఏమంటుంది?" అని అడిగితే

"నాన్న ముద్దు కావాలంటుంది "

"పాలు గారు చెక్కిలిపైన పాపాయికి ఒకటి , తేనేలూరు పెదవులపైన దేవిగారికొకటి.."

అంటూ కుశలం ఆడిగేతీరు ఎన్నేళ్ళయినా ఎదురుచూసేలా చెయ్యదూ.. అలాగే శ్రీవారికి ప్రేమ ఉంది అని తెలిసేది ఎలా? అది వ్యక్తం చేసెది ఎలా? ఇలా వ్రాసినది దాచుకోడం వల్ల ప్రయోజనం శూన్యం అని నా అభిప్రాయం. ఎదన్నా మనసులో దాచుకోవాలి అంటారు. కాని మనసు మూగది ఇన్నింటిని ఎలా బయల్పరచగలదు? మనసు మూగదే కాని బాషుంటది దానికి , చెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది.. అంటారా.. :-) అయివుండచ్చు, ఇన్నాళ్ళు నా మనసుకు ఉన్న చెవులే పనిచేయలేదేమో... :-(

ఆదివారం నేను పొందిన ఈ చక్కటి అనుభూతిని మీతో పంచుకోవాలనిపించి...ఇలా..
******

4 comments:

  1. ఎక్జాక్ట్లీ! ఇందుకే నండి నే చెప్పింది! ఇక పర్వాలేదు. నేను మీకు నా పోస్టులో ఇచ్చిన సమాధానం మీకర్ధమౌతుంది. చాలా మంది భర్తలకి వాళ్ళ భార్యలంటే పిచ్చి ప్రేమ! కాకపోతే ఇంకా చాలామందికి, వాళ్ళ వైవాహికం జీవితం బాగోదు. కానీ దాని మీనింగు నిజంగా జీవితంలో ప్రేమ లేదని కాదండీ!
    ప్రేమే సత్యం. ప్రేమే నిత్యం. పెళ్ళాం బిడ్డలకు మించిన ప్రేమ కూడా ఒకటుంది. అది కూడా ఒక ఎమోషన్. అనుభవిస్తేనే తెలుస్తుందేమో!

    ReplyDelete
  2. సృజనగారు, శివ చెరువు గారు : నెనర్లు

    రేరాజ్ గారు: "ఎక్జాక్ట్లీ! ఇందుకే నండి నే చెప్పింది! ఇక పర్వాలేదు. నేను మీకు నా పోస్టులో ఇచ్చిన సమాధానం మీకర్ధమౌతుంది. చాలా మంది భర్తలకి వాళ్ళ భార్యలంటే పిచ్చి ప్రేమ! కాకపోతే ఇంకా చాలామందికి, వాళ్ళ వైవాహికం జీవితం బాగోదు. కానీ దాని మీనింగు నిజంగా జీవితంలో ప్రేమ లేదని కాదండీ!
    ప్రేమే సత్యం. ప్రేమే నిత్యం. పెళ్ళాం బిడ్డలకు మించిన ప్రేమ కూడా ఒకటుంది. అది కూడా ఒక ఎమోషన్. అనుభవిస్తేనే తెలుస్తుందేమో!"

    పైన వ్యాఖ్యకి సమాధానంగా కింద ఇచ్చిన న్నా పోస్ట్ చదవండి నేను అర్థంచెసుకోగలనని నమ్మకం మీకు కలుగుతుంది.
    http://teluguratna.com/content/view/164/28/ సారి! శ్రమ పెడ్తున్నందుకు.. :)

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.