8.23.2009

వినాయక చవితి శుభాకాంక్షలు




ప్రార్థన

తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్
మెండుగమ్రోయుగజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన్న విద్యలకెల్ల నొజ్జయై ............
యుండెడి పార్వతీతనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్

తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిని బ్రార్ధన జేసెద నేకదంత! నా ......
వలపలిచేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప! లోకనాయకా! ......

తలచితి నే గణనాథుని; తలచితె నే విఘ్నపతిని! దలచిన పనిగా ..
దలచితి నే హేరంబుని దలచితె నా విఘ్నములను తొలగించుటకున్

అటుకులు కొబరిపలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెఱకురసంబున్
విటలాక్షు నగ్రసుతునకు బటుతర్ముగ విందుచేసి బ్రార్థింతు మదిన్..
______________________________________________

మా ఇంట్లో/మదిలో ప్రార్థించేశాము.. మరి మీరో??

8.10.2009

ఈ ఆదివారం మాది...

పరిస్థితులని మనకనుగుణంగా మార్చుకోవాలా? మనం పరిస్థితులకి అనుగుణంగా మారాలా? "పెళ్ళయ్యాక పరిస్థితులే దానికి అన్నీ నేర్పుతాయే.. " పాపకి పనులు అస్సలు తెలియడంలేదమ్మా అంటే అమ్మ అనేది అలా. పరిస్తితులు మనల్ని మార్చేస్తాయట. కాని మనకనుగుణంగా ఎలా మార్చుకోవాలి అని ఆలోచించాను. "మీరలా ఆలోచించండి .. నేనలా అమలు పరిచేస్తాను" అని నాకు చెప్పినట్లుగా ఈ ఆదివారాన్ని తనకనుగుణంగా, మాకనుగుణంగా మార్చారు ఓ ప్రఖ్యాత బ్లాగరు.
మంచి అదృష్టాన్నిఅందిపుచ్చుకొనే అవకాశాన్ని కలగజేసినందుకు ముందుగా ఆవిడకి కృతజ్ఞతలు.

******

"రచయిత తన ఆలోచనల్ని, తన పరిమితుల్ని అధిగమించి వ్రాసిన కథలవి. హృదయాలని స్పృశిస్తాయి చాలా గొప్పవిషయం " అని అంటారొకరు.

"ఆయన తన పరిమితులకి లోబడే వ్రాసారు. ఆమాత్రం రచయిత ఆలోచించకుండా ఉండరు" ఈ కథలకి సంబంధించి సినిమా అయితే.. ఓ మంచి హీరోయిన్ నా దృష్టిలో ఉంది అంటూ విభేదిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేసారు ఇంకొకరు.

వీళ్ళీలా వాదులాడుకొంటే .. ఇంకోపక్క

"పుస్తకాలు లభ్యం కావాలంటే మనం 10 మందికి కలిసి ఒక్కొక్కరింట్లో ఒక్కో 10 వేరు వేరు పుస్తకాలను ఒక గ్రంధాలయంలా అమర్చుకొంటే ఎలా ఉంటుంది ?" అని అందరి అభిప్రాయాలకై ఎదురుచూసిన వారొకరు..

ముఖ్య అతిథి తను వాడే తెలుగు సాఫ్ట్ వేర్ గురించి చెప్తుంటే అంతే శ్రద్ధగా వింటూ తనకి తోచిన సలహాలని చెప్తున్నారు ఇంకొకరు.

వీరిద్దరీ చర్చ ఇలా సాగుతుండగా...

మీకోసం అంటూ ముఖ్యఅతిథి పై తన అభిమానాన్ని పుస్తకం ద్వారా తెలియజేసారు ఇంకొకరు.

తనని తాను పరిచయం చేసుకొనే సమయంలో, ఇంకొకరి పరిచయాన్ని " సాహిత్యంలో తలపండిన వారు అంటే మీరని మీరు చెప్పకనే తెలిసింది" అంటూ చమత్కరించారు.

చమత్కారానికి హాస్యగుళికగా స్వీకరిస్తూ.. సాహిత్యంలోనే కాదు మాములుగానే తల పండిందంటూ మరో చమత్కరాన్ని సమాధానం చేసారు ముఖ్య అతిథి.

తను వ్రాసిన కథ గురించి అనుకొంట.. ఇంకో ప్రముఖ బ్లాగరు మరో ప్రముఖ రచయితతో మంతనాలాడుతున్నారు.

ప్రముఖ రచయిత అటు మంతనాలాడుతూ.. అంతే చురుకుదనంతో తను వ్రాసిన కథల ఫాంట్ , కవరు పేజ్.. వాటికి సంబంధించి తన ప్రయత్నాలు, ముఖ్య అతిధికి విశిదీకరించారు.

ఇంత సందడిలోను తనని తాను పరిచయం చేసుకొంటూ తన బ్లాగు గురించి చెప్తున్న వారు మరొకరు.

మరో పక్క....

వీరందరి చర్చల్లో .. వాదనలో... మంతనాలలో ప్రేక్షక పాత్రలతో తదేక దీక్షతో వీక్షిస్తున్న కొందరు.

మొత్తానికి సరస్వతీ దేవి ఆ ఇంట కొలువుదీరింది, అదివారం అందరి చర్చల్లో... వాదనలలో.. మంతనాలలో...

ఎంతచక్కటి అనుభవం అది. ఎలా భద్రపరుచుకోడం.. చిన్ని గుండేల్లో దాగనంటోంది మరి ఏమి చేయడం.. ఇక నావల్ల కాదని ఇదిగో ఇలా మీ ముందుకు వచ్చేసాను... పంచేసుకొందామని.

ఏంటి మొదలు చివరా లేకుండా.... అర్థం పర్థం లేకుండా అని అనుకొంటున్నారా? ఇదిగో చెప్పేస్తున్నాగా..
**********




"ఈ ఆదివారం మాది " అని ధీమాగా చెప్పగలిగే ఆ అవకాశాన్ని ఇచ్చిన వారు ప్రముఖ బ్లాగరి శ్రీమతి సుజాత గారు. వారం రోజుల ముందు నుండి హైదరాబాదులో ఉన్న తనకు తెలిసిన బ్లాగర్లందరినీ అప్యాయంగా ఆహ్వానించారు, ఆదివారం వారింటికి రమ్మనమని. పిలుపునందుకొన్నవారు అందరూ రాలేకపోయినా ... వచ్చిన వారు ఆదివారాన్ని సాహితీగోష్ఠితో ఆహ్లాదపరిచారు.
Link
రచయిత పరిథిల గూర్చి పర్ణశాల కత్తి మహేష్ గారు చర్చిస్తే.. విభేదిస్తూ హీరోయిన్ గురించి అభిప్రాయాన్ని వెలిబుచ్చిన వారు సుజాత గారు వీరి బ్లాగు మనసులో మాట.

పుస్తకాల గురించి తనకు తోచిన అభిప్రాయాన్ని వెలిబుచ్చిన వారు శ్రీవల్లీ రాధిక గారు, వీరి బ్లాగ్ మహర్ణవం .


ముఖ్య అతిథి వాడే సాఫ్ట్ వేర్ కి సలహాలు అందిస్తున్నవారు శిరీష్ కుమార్ గారు. చదువరి బ్లాగరు, పుస్తకంద్వారా తన అభిమానాన్ని తెలియజేసినవారు వరూధిని గారు.. సిరిసిరిమువ్వ బ్లాగరి.

సాహిత్యంలో తలపడి(పండి)న అంటూ చమత్కరించినవారు గీతాచార్య గారు..

తను వ్రాసిన కథల గురించి ఇంకో రచయిత తో మంతనాలు జరిపిన వారు.. జ్యోతిగారు, రచయిత.. తన ఫాంట్.. కవర్ పేజ్ గురించి వివరించినవారు : కస్తూరి మురళీకృష్ణగారు " కస్తూరి గారి బ్లాగు :
రాతలు కోతలు.. జ్యోతిగారి బ్లాగులలో ఒకటి: జ్యోతి.

తనని తాను పరిచయం చేసుకొంటూ .. బ్లాగు గురించి చెప్పిన వారు శ్రీమతి మాలా కుమార్ గారు "సాహితి" బ్లాగరు.

ప్రేక్షక వీక్షకులు:మొదట నేనే.. ముఖ్య అతిథి అన్నయ్యగారు..జ్యోతిగారి అమ్మాయి, మధ్య మధ్యలో సుజాతగారి శ్రీవారు తళుక్కున కనిపించి మాయమవడం , చిన్నారి సంకీర్తన అల్లరి హడావిడిలతో .. మాలతిగారికి తన బహుమానాలతో.. వీక్షకులను అలరించింది.

అదండీ సంగతి.. సుజాతగారింట్లో అందరు సందడి సందడిగా ఆదివారాన్ని మావారంగా మరల్చుకొని,అప్యాయంగా అందించిన ఆతిధ్యాన్ని స్వీకరించి వెనుదిరిగాము.

**********

ఎవరో హల్లో ! హల్లో! అని పిలిచినట్లు వినపడింది? ఎమయింది?

ముఖ్య అతిథి ఎవరా? అనా... అదేంటి చెప్పలేదా..... అవునా.. ఉండండి .. మొత్తం చదువుతాను....

.......

.......

.......


.....

అవునవును మర్చేపోయాను... పోని ఆవిడ పేరు చెప్పుకొండి మీలో ఎవరన్నా.....ఎవరో ఒకరు....

.......

.....

.....

ప్చ్! చెప్పలేరా..... సరే.. నేనే చెప్పేస్తున్నా....రెడీ..స్టడీ...గొ....

.........

.......

......

ఆవిడే.. అవిడే.. మన ... మన ......
......

......

......



మా ల తి గా రు ( తెలుగు తూలిక)

......

సుజాత గారింట్లో .. మాలతిగారితో మా మధుర క్షణాలివి.
*******

8.07.2009

మగధీర - ఇది సినిమా కాదు

సఖి షూటింగ్ మా ఆఫీసులో జరిగినప్పుడు అసలు షూటింగ్ అనేది ఎలా తీస్తారు అన్నది తెలిసింది. భారి భారి సెట్టింగులతో తీసే షూటింగ్లయితే ఇంతవరకూ ఎప్పుడూ చూడలేదు , అలా చూసే అవకాశం అనుకోకుండా నిన్న సాయత్రం వచ్చింది జీ టి వి లో వచ్చే డాన్స్ ప్రోగ్రాం ... "మగధీర" షూటింగ్ కి రమ్మనమని, సాధారణంగా ఇంటి దగ్గిర గుడిలో ఏదో షూటింగ్ జర్గుతుంటేనే అబ్బా ఏమి వెళ్తాములే అని బద్దకించేస్తాను. అలాంటిది ఈ మగధీర ప్రోగ్రాంకి మా ఆఫీసు మేనేజ్మెంట్ పాత్ర ప్రముఖంగా ఉండడంతో సరే అని బయల్దేరాను.

*****
మాములుగా ఈ షూటింగ్స్ చాలా సమయం తీసుకొంటాయని తెలుసు . నా పాత్రంటూ ఏమి లేకపోయినా, "సఖీ" ప్రత్యక్షంగా చూసిన అనుభవం కొంత ఉంది కాబట్టి, అటు యాంకర్స్ ఇటు పాల్గొన్నవాళ్ళు అంతా కలిపి సగం కట్ లతో సరిపోతుంది. కాని ఇక్కడ అలా జరగలేదు. అదే ఆశ్చర్యం నాకు. ముందు జరగాల్సింది వెనకాల, వెనకాల జరగాల్సింది ముందు చేసి మొత్తం అన్ని కలిపి ఒక రూపు తీసుకొచ్చి ప్రసారం చేస్తారన్నమాట. అలా జరగాల్సిన ఈ క్రమంలో, మీ అందరికి (చూసినవాళ్ళకి) తెలిసిందే, "మగధీర" ఒకవిధంగా సాహసకృత్యాలకి , వికాలంగులకి సంబంధించిన కార్యక్రమం. వీళ్ళెన్ని టేకులు తింటారో అని ఎదురుచూస్తున్న షాక్ ఏంటంటే నేర్చుకొన్నది నేర్చుకొన్నట్లుగా స్టేజ్ మీద నిర్భయంగా వేయడం. కాళ్ళు లేనివాళ్ళు,మరుగుజ్జులు , నాకైతే ఒక సమయంలో వళ్ళు గగుర్పొడించింది. చాలా బాగా చేసారు. ఒక్కో స్టెప్ నిత్యనూతనంగా వైవిధ్యభరితంగా ఉంది.

సో ! నాకర్ధమయ్యింది ఒకటే ఇక్కడ ఇలాంటి కార్యకరమాల్లో 5 లేదా 6 నిముషాల డాన్స్ మాత్రమే నిజమైన ప్రతిభావంతమైన ప్రదర్శన. మిగతాది అంటే , యాంకరింగ్, మెంటర్స్, జడ్గెస్ అందరూ స్క్రిప్ట్ ని ఆశ్రయిస్తారు. అది తెలిసింది. ముందుగా వీళ్ళంతా డాన్స్ చేసిన తరువాత యాంకరింగ్ జరుగుతుంది, ఆ తరువాత వరసగా జడ్జ్ మెంట్.. వీటన్నిటికీ అంటే ఈ యాంకరింగ్కి, మెంటర్స్ వాదులాటలకి, కట్స్, టేకులు, మొ!.

ఇదంతా వరసక్రమం, ఎడిటింగ్.. అలా ఒక ఎపిసోడ్ ముగించాలంటే ఇన్ని కార్యక్రమాలు, వెరసి దీనికి వెచ్చించే కాలం ఉదయం 4 గంటలకి మొదలెడితే రాత్రో , తెల్లవారుఝామునో ముగిస్తారు. అంతసేపు మరి ఆ లైట్లమధ్య ఆ శబ్ధాల హోరుని వాళ్ళెలా తట్టుకొంటారో బాప్రే బాప్! ఒక నాలుగు గంటలు విన్నందుకే, తలనొప్పితో మంచమెక్కాకు. మనకొద్దు బాబోయ్! అని అనిపించేలా. వాళ్ళలా ఎలా భరిస్తున్నారో అనీపిస్తుంది. ఇదంతా ఆ టి వి లో కనపడాలనే?? ఏమో మొత్తానికి వారి ధీక్షకి మెచ్చుకోవాలి.

కొ. మె: అక్కడ మాకు జరిగిన మర్యాదలకి మటుకు లోటు లేదనే చెప్పాలి అంత హడావిడిలోను...నాకు బాగా నచ్చింది అంటే " నీకు భూలోకుల కన్ను సోకిందిలే "... పొద్దు తెల్లారేలోగా పంపిస్తాలే... అంటూ వెన్నలతే..... అన్న పాటకి నీతు అనే అమ్మాయి డాన్స్. ఆ ఎపిసోడ్ కి అది హైలైట్ నాకు.
*********


8.02.2009

ఒక మాట...ఒక స్పర్శ..



మొన్నామధ్య ఎదో ఒక పోస్ట్ గురించి స్నేహితురాలితో మాట్లాడుతూ " ఇక నేను కూడా ఈ నోములు వ్రతాలు వీటి గురించి వ్రాసుకోడం ఉత్తమం అని అన్నా " ఎందుకో... అలా అన్నానో , లేదో ఇలా నాకో మెయిల్ వచ్చింది. మన సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మలైన ఈ శ్రావణమాసం నోముల గురించి మీకు తెలిసింది వ్రాయండి, సాంప్రదాయ విలువలని కాపాడండి అని. వ్రాద్దామని ఉపక్రమించాను, కాని అందరికీ తెలిసిందే కదా .. నేను ప్రత్యేకంగా చెప్పాడనికంటూ ఏముంది? అని సంశయించాను. దానికి తగ్గట్లుగా బంధువులు ఫోన్ చేసి, "వరలక్ష్మీ వ్రతం కదా! ఏమి చేస్తున్నావు?" అంటూ ఆరాలు.. ఏమి చేస్తున్నావు? అన్న ప్రశ్నకన్నా ఎందుకు చేస్తున్నావు? అని ప్రశ్నించుకొంటే ఎలా ఉంటుంది.... అని ఆలోచించాను.

మంగళగౌరి వ్రతం, వరలక్ష్మీ వ్రతం ఈ రెండు మన కుటుంబం క్షేమం కోసం, ముఖ్యంగా మహిళలకు నిత్య సుమంగళిగా ఉండడానికి అని చెప్తారు. మంగళగౌరి వ్రతం 5 సంవత్సరాలు, 5 గురితో మొదలయిన వాయనాలు, 5 వ సంవత్సరంలో 25 మందికి ఇవ్వడం, ఈ వ్రతం చేస్తున్నట్లయితే... వరలక్ష్మి వ్రతానికి 9 రకాల పిండివంటలు చేయడం, తోరాల సంభరం, ఆవునెయ్యి దీపాలు, ఆ దీపాల ద్వారా తయారయిన కాటుక అందాలు, వాయనాలు, " ఇస్తినమ్మా వాయనం," " పుచ్చుకొంటినమ్మా వాయనం" అనే గాజుల చేతుల సందళ్ళు, ఇంకా కొంచం లోతుగా చెప్పాలంటే , బంగారం కొనుక్కొనే ఒకే ఒక్క అవకాశం , పసుపు రాసిన పాదాలు, పట్టు చీరల రెప రెపలు, ఎఱ్ఱ సిధూరంతో ఉదయభానుడిని తలపించే నుదురు, చేతినిండా గాజులు, తలనిండా పూలు , ఒంటి నిండా అభరణాలతో, ఈ నెలలో మంగళవార శుక్రవారాలలో ఎలాంటి అమ్మాయి అయినా కళ కళ లాడడం మన సాంప్రదాయం గొప్పదనం.

ఒక జీన్స్ పాంట్, ఒక టీ షర్ట్ కొనేసుకొని, పండగ అయ్యిందనిపించే పిల్లలికి మన సాంప్రదాయాలు తెలియాలంటే ఇలాంటి పండగలు ఉండాల్సిందే. కాస్త తెలుగుదనం ఉట్టిపడే విధంగా అలకరించుకొనే అవకాశం పిల్లలికి.. అలా తెలియజెప్పే అవకాశం పెద్దలకి గల పండగలు ఇవి. ఏ పండగయినా సంకల్పంతో మొదలయి,ఆవాహనం, పూజ, సహస్రనామాలు, కథలతో ముగిసేవే. కాని వీటి వెనక ఆంతర్యాలు... పూజలు, పిండివంటలు, కొత్తబట్టలు మాత్రమే కాదు, తలోదిక్కున ఉన్న కుటుంబ సభ్యులందరూ కలవడం, మన హడావిడి జీవితాలనుండి కాస్త ఉపశమనం, ఆహ్లాదకరమైన వాతావరణం .

*******

" ఇదిగో నువ్వెళ్ళి నాలుగు మామిడాకులు తీసుకురా.. మరీ లేత ఆకులు వద్దు, గుమ్మానికి కనపడవు . నువ్వేమో .. కాస్త చుట్టుపక్కల అందరినీ రేపు సాయంత్రానికి పేరంటానికి రమ్మనమను, కుంకుమభరిణె తీసుకెళ్ళు , అన్ని మర్చిపోతావు..... నువ్వేమో ఇదిగో ఈ గడపకి పసుపురాసి కుంకుమ బొట్టుపెట్టి ......."

ఇలా పిల్లలికి పండగ , పండగకి పనులు పురమాయించి,
పండగంటే అసలు ఈ వీధిలోనే సుమా!.. అనేంతగా జరుపుకొనేవారు చిన్నప్పుడు మా వీధిలో ఒక 15 వాటాలవాళ్ళు. ఏ కుటుంబాలు ఎక్కడినుండి వచ్చాయో తెలీదు కాని, ఒకే కుటుంబంలా మెలిగే వాళ్ళము. ఇది వాళ్ళపని.... ఇది వీళ్ళ పని .. అని కాదు పండగలకి పిండివంటలయితేనేమి, పనులయితేనేమి కలిసిచేసుకొనేవాళ్ళము. ఇదంతా ఒక ఎత్తయితే.. "కాంతమ్మగారు!(మా అమ్మ) మీరు కాస్త నాకీ మెంతులు , జీలకఱ్ఱ బాగు చేసి పెట్టండి,.. " "కాంతమ్మగారు! రేపు మైసూర్పాక్ చేసిస్తారా కాస్త..." "కాంతమ్మగారు ! ఢిల్లీ నుండి ఈయనకి తెలిసినవాళ్ళు వస్తున్నారు.. మరి మీ ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేస్తాను, మీరు గుత్తోంకాయకూర బాగా చేస్తారట కదా, వాళ్ళు మా ఇంట్లో మొహమాటపడ్తున్నారు, మీవాళ్ళే,...కాస్త....." "కాంతమ్మగారు, పెద్దమ్మాయి పెళ్ళికి విడిదిల్లు మీ ఇల్లే మరి... మా ఇంటి దగ్గిర పెళ్ళీ.... ఇదిగో ఈ స్థలమంతా ఒక టెంట్ వేసేసి ఈ చివరి గది వాళ్ళకి ఏర్పాటు చేసేద్దాము,....." అని వాళ్ళ ఆలోచనలు , నిర్ణయాలు ... మా అమ్మ "కాదు, లేదు" అని చెప్పలేనంతగా తీసేసుకొని, వీళ్ళంతా అక్కచెళ్ళెళ్ళో, తోడికోడళ్ళో అనుకొనేంతగా కలిసి ఉండేవాళ్ళు.

*********




ఇప్పుడు వీళ్ళందరి వయసు 65 పైమాటే, అందరి ఇళ్ళల్లో కూతు
ళ్ళు కాపురాలకి వెళ్ళినవాళ్ళు, కోడళ్ళు కాపురాలకి వచ్చినవాళ్ళు. ఇదివరకు నేను వీళ్ళందరికి కొంచం దూరంలో ఉండడంవల్లనో .. అదీ కాక, ఆఫీసు పని వత్తిడిలోనో ఈ వ్రతాలకి, ఏదో ముగ్గురి ముత్తైదువలకి తాంబూలాలు చాలులే! అని సరిపెట్టేసుకొనేదానిని. కాని ఈసారి అలా కాకుండా , అమ్మకి దగ్గరలో రావడం ఒక కారణం, ఆఫీసుకి సెలవు రావడం ఇంకో కారణం చిన్నప్పటినుండి తిరిగి, పెరిగిన వాతావరణం అన్నీ కలిసిరావడంతో ఒక 25 మంది దాక పిలిచాను. సాయంత్రం అయ్యేసరికి ఒక్కొక్కరుగా రావడం ప్రారంభం అయ్యింది.

పిలిచిన వాళ్ళల్లో అందరూ ఇంటి కోడళ్ళు వస్తున్నారు. నే్నేమో .. ఆ తరం వాళ్ళందరూ కలుస్తారని అమ్మని కూడా ఇంటికి తీసుకొని వచ్చాను. అప్పటికే అమ్మకి నిరాశ కమ్ముకొంది "నేను వెళ్తానే అమ్మడూ" అని.. అనేసరికి "ఏంటి వాళ్ళెవరూ రారా ?" అని అడిగాను, ఇంటికి వచ్చిన కోడళ్ళని,.. "వాళ్ళ హయాం అయిపోయింది మేమొచ్చాము చాలదూ " అని అన్నారు సరదాగానే, ఇది కాదని మళ్ళా అందరిళ్ళకి వెళ్ళి అందరిని రమ్మనమని, అమ్మ ఎదురుచూస్తోందని చెప్పేసరికి...... ఎవరు కాదు అనకుండా వచ్చారు. వాళ్ళ స్నేహం ఈనాటిది కాదు మరి . వాళ్ళకి తాంబూలాల హడావిడిలో ఉన్నా నేను .. అందరూ పెద్దవాళ్ళు కాసేపు పరిసరాలని మర్చిపోయి అప్యాయంగా మాట్లాడుకొన్నారు. వాళ్ళందరూ వాళ్ళ కోడళ్ళ గురించో, కూతురు సంసారం గురించో మాట్లాడుకొంటారనుకొన్న నా ఆలోచన తారుమారై... నన్ను మరింత ఆశ్చర్యపరిచిన విషయం .. వాళ్ళు ఒకప్పటి వాళ్ళ కలసి మెలసిన తీరు గురించి, అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు ఆ పనులు, ఆ పండగ హడావిడి గురించి చర్చించుకోడం కరచాలనం, చూడడానికి రెండు కళ్ళూ సరిపోవు. ఇదంతా ఒకవైపు. మరోవైపు, రమ్మంటే కారు తీసుకొని వచ్చే కొడుకులు చేతిలో ఉన్నా , వద్దని తెగేసి చెప్పి మరీ ఒకరికొకరు చేతులు పట్టుకొని ఇంటిదాకా నడవడం, "కాంతమ్మగారు జాగ్రత్త చేయి పట్టుకొని నడవండి, రాళ్ళుంటాయి" అని ఒకావిడ, "నేను జాగ్రత్తగానే ఉన్నా మీరు నా చేయి పట్టుకొని జాగ్రత్తగా నడవండి" అని మా అమ్మ. వాళ్ళ ఆ కలిసిమెలిసి మసలే తత్వాన్ని స్నేహమంటారనికి కూడా వాళ్ళకి తెలీదు. ఇరుగు పొరుగు వాళ్ళం అంతే .. . ఎంత చక్కటి దృశ్యమది. వాళ్ళకి పక్కన నేను, మా బాబు ఉన్నామన్న ధ్యాస కూడా లేదు . వాళ్ళకి వాళ్ళే తోడుగా స్నేహంగా కలిసిమెలిసి ఉన్నవాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇరుగు పొరుగు. వారి స్నేహానికి, అర్థం చేసుకొనే ఆ మంచి మనసులకి జోహార్లర్పిస్తూ స్నేహితులందరికి ఈరోజు మాత్రమే కాదు ప్రతిరోజు మనకి ప్రత్యేకం అవ్వాలని ఆకాంక్షిస్తూ.... శుభాకాంక్షలు.
*****

ఒక మాట...ఒక స్పర్శ..స్నేహపురస్కారంగా ఒక సానుభూతి..మనిషి మనిషికీ మధ్య ప్రేమా, ఆప్యాయతా, కరుణతో కంటినిండా చిప్పిల్లిన నీళ్ళూ మనసునిండా సంతృప్తి... విషాదానికీ ఆనందానికీ తేడాలేకపోడం...ఇంతకన్నా ఏమి కావాలి జీవితానికి?... శ్రీనివాస్ పప్పుగారి బ్లాగునుండి సేకరించిన వాక్యాలివి.


Loading...