9.26.2009

బొమ్మరిల్లు

పండగ ఇంకా రాకుండానే మా ఇంట్లో హడావిడి మొదలయ్యింది. కారణం ఒకటే మావారి వైపు వాళ్ళందరూ దసరా పెద్దఎత్తున చెస్తారు. చిన్నప్పటినుండి ఇక్కడే పెరగడంవల్ల వచ్చిన అలవాటది. నేనూ ఇక్కడే అనుకొండి కాని, అమ్మ దగ్గరినుండి వచ్చిన అలవాటు సంక్రాంతి పండగని పెద్ద ఎత్తు చేసుకోడం. అలా అని దసరా అంటే చిన్నచూపు లేదు.

సో! తన అలవాటు ప్రకారం, ఏ పండగ పట్టించుకొన్నా పట్టించుకోపోయినా ఈ దసరాకి మటుకు మావారు బట్టలు కొనడం దగ్గరినుండి హడావిడి చేసేస్తారు. సాధారణంగా ఎక్కడికన్నా వెళ్ళడానికి వెనుకంజవేసే మా బుచ్చిబాబు దసరాకి మటుకు "నన్ను మర్చిపోతారా?" అనే చందాన ఈసారి మాతో పాటు బట్టలు ..తదితర పండగ సంబంధిత సామాన్లు కొనడానికి ఉద్యుక్తులయ్యారు. ఇహ పిల్లల సంబరం వేరే చెప్పాలా.. వాళ్ళు ఆడింది ఆట.... పాడింది పాట.

మొన్న 8వ తారీఖున మాబాబు పుట్టినరోజు జరిగింది.... కాబట్టి వాడు కొంచం పెద్దరికం ఫోజొకటి పెట్టి, "డాడీ ! మొన్నేగా నాకు బట్టలు కొన్నది, ఇక పండగకి వద్దు , ఇంకోసారెప్పుడన్నా చూద్దాము" అ
న్నాడు వెళ్ళేముందే. " ఏమి పర్లేదు నాన్నా... నేనున్నాగా, అందరికీ కొంటూ ....నిన్నేలా వదిలేస్తాను" అంటూ ఓ అభయహస్తమిచ్చేసి మరీ బయల్దేరారు మా శ్రీవారు.

9.11.2009

నాకో సందేహం!!!!!


"అసలు సందేహం రాని వాడి కంటే.. సందేహం వచ్చి, అడగని వాడు మూర్ఖుడట"

ఇది ఎంతవరకు నిజమో కాని నాకో చిన్న సందేహం గత వారం రోజులుగా పురుగు తొలిచినట్లు తొలిచేస్తోంది. మనకెందుకులే అని వదిలేద్దామనుకొన్నా కాని, మనసు తీర్చేసుకోవాలి అని మరీ భీష్మించుకొని కూర్చునే సరికి ఇక మీ ముందు పెట్టడం తప్పడంలేదు,. సందేహం అడిగే ముందు చిన్న ఉప్పొధ్ఘాతం.
****

నేను బ్లాగు వ్రాసే కొత్తలో ఇంకా నా వ్రాతల గురించి నాకే తెలియని రోజుల్లో, నేను చాలా గొప్పగా వ్రాసేస్తానని, నన్ను అకాశానికెత్తేసి, నా కాళ్ళు నేల మీద నిలవకుండా, కళ్ళు నెత్తికెక్కాలా కిక్కెక్కించి , "అబ్బే ఇది చాలా చిన్న విషయమండి, మీరింకా ఎదిగిపోగలరు" (అప్పటికే ఎదిగిపోయా ఎత్తు, బరువులో కూడా... :)) అని మరి కాస్త ఉబ్బించేసి, చెట్టు కొమ్మ మీద ధీమగా కూర్చొన్నప్పుడు రాజకీయం మొదలెట్టి కొమ్మని నరకడం మొదలెట్టారు, అందులో మచ్చుకి, ఒక అద్భుతమైన కథ రాసేస్తే, దానిని పేరున్నవారి
పేరుతో ప్రచురించేస్తే (మనకి పేరు లేదన్న విషయం అప్పటికింకా అవగాహన రాలేదులెండి, కాళ్ళు నేలమీద కాదుగా ఉన్నవి) తరువాత నెమ్మదిగా ఇంకా ఇంకా ఎత్తుకు ఎదిగిపోవచ్చన్న ఆశని కల్పించారు కొంతమంది నా శ్రేయోభిలాషులు(???) .

ఆ సంధర్భంలో కొన్ని తప్పక ఆచరించవలిసిన నియమాలు, నిబంధనలు చెప్పారు (నేనేదో గొప్పకథ రాసేస్తానన్న భ్రమలో). కథ ఇంతకు ముందు, బ్లాగుల్లో కాని, ఇంకేవిధమైన వెబ్ పత్రికల్లో కాని వచ్చి ఉండకూడదు, పూర్తిగా నాకు మాత్రమే సంబంధించినది అయి ఉండాలి.. ఇలా ఇలా ఒక హామి పత్రంలా ......ఇంకా ఇలా....

నిబంధనలు

  • రచనలు రచయితల స్వంత రచనలై ఉండాలి. తమ స్వంతం కాని రచనలను సమర్పించరాదు. స్వంత రచనలలో ఇతర రచయితలకు కాపీహక్కులున్న భాగాలను వాడినట్లైతే ఆ విషయాన్ని రచనలలో తెలియపరచాలని మనవి. సమీక్షలకు ఇది వర్తించదు.

  • ఇతర వెబ్ పత్రికలలోగానీ, అంతర్జాలంలో మరెక్కడైనాగానీ ప్రచురించినవి, ప్రచురణ కోసం సమర్పించినవి అయిన రచనలను పంపించరాదు.

  • ఇందులో ప్రచురించిన వ్యాసాలను, ప్రచురించిన రెండు వారాల తరువాత రచయితలు తిరిగి తమ స్వంత వెబ్ సైట్లలో ప్రచురించుకోవచ్చు. అయితే ఇతర వెబ్ పత్రికలలో ప్రచురించరాదు.
*******

సరె ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. ఆమధ్య ఎదో పత్రికలో చదువుతున్న వ్యాసం చూసేసరికి "ఎక్కడో చదివాను.... ఎక్కడో చదివాను..." అని బుఱ్ఱ బద్దలుకొట్టుకొని ఒకసారి వెబ్ పత్రికలన్నీ తిరగేసి మరగేసి చదివితే తెలిసింది పురాతన కాలంలో ఒక వెబ్ పత్రికలో ప్రచురించపడ్డ వ్యాసమది. ఎవరిది, ఎక్కడ, ఎందుకు అనే ప్రశ్నల కన్నా .. నా సందేహం తీర్చుకోడం ముఖ్యం. మరి పత్రికలకి సంబంధించిన పెద్దలు ..... పెద్దమనసు చేసుకొని తీరుస్తారని....

1. మరలా ఎక్కడో వెబ్ పత్రికలలోనో/ ప్రింటెడ్ పత్రికలలోనో ప్రచురించబడినవి పంపించవచ్చా? వారే రచయితలయినా సరె..
2. ఇక దానికి హామి పత్రం అవసరముందంటారా?
3. ఒక పత్రికకి పంపినతరువాత ప్రచురించినా ప్రచురించకపోయినా ఇంకో పత్రికకి పంపవచ్చా? (ప్రింటెడ్ పత్రికలకి)
4. పంపవచ్చనుకొన్నప్పుడు మరిక ఈ నిబంధనలలో ఎందుకు ఇలా ....

ఇతర వెబ్ పత్రికలలోగానీ, అంతర్జాలంలో మరెక్కడైనాగానీ ప్రచురించినవి, ప్రచురణ కోసం సమర్పించినవి అయిన రచనలను పంపించరాదు.
ఇందులో ప్రచురించిన వ్యాసాలను, ప్రచురించిన రెండు వారాల తరువాత రచయితలు తిరిగి తమ స్వంత వెబ్ సైట్లలో ప్రచురించుకోవచ్చు. అయితే ఇతర వెబ్ పత్రికలలో ప్రచురించరాదు.

ప్రస్తావిస్తున్నారు?
*******

ఈ సందేహాలన్ని ఎందుకు తీర్చుకోవాలనుకొంటున్నానంటే, కాళ్ళు నేల మీద ఉండనప్పుడు, కళ్ళు నెత్తిమీద ఉన్నప్పుడు, అలా ..... కూర్చొన్న కొమ్మని నెమ్మదిగా విరిచెసినప్పుడు , నేలమీద పడ్డ నాకు కళ్ళు తెరుచుకొని చూసేసరికి పత్రికా ఎడిటర్‌గారొకరు "కథ రాయగలరా" అని అడిగారు.. డైరెక్ట్ గా "పాతబ్లాగులో బోల్డు కథలాంటి కథలు అని" అనబోయి .. నాలికర్చుకొని, "ప్రయత్నిస్తాను" అని చెప్పాను. ఇప్పుడు ఇలా చూసిన తరువాత మళ్ళీ నాలికరిచేసుకొని, " అర్రే ! చెప్పి ఉండాల్సింది " అని అనేసుకొన్నా... చెప్పే ముందు పెద్దల సలహా అవసరమని ఇలా నా సందేహాన్ని....... మరి... :) :)
********