6.28.2010

వ్రతం. పిల్లి, ఒక చిల్లు బుట్ట .... ఆచారాలు

ఆచార వ్యవహారాల నేపధ్యంలో....  ఈరోజు నేను  విన్న నాకు నచ్చిన చిన్న కథ

దాదాపు ఒక నెల రోజులనుండి చిన్న పని నిమిత్తం అమ్మ మా ఇంట్లోనే ఉంటోంది. చెప్పేదేముంది అమ్మ ఉంది అంటే మా ఇంట్లో టి వి కి విశ్రాంతి ఉండదు. తెల్లవారు ఝామున 5 గంటలకి దానికి పని అప్పచెబితే, రాత్రి 12 గంటలవరకు శ్రమ అనుకోకుండా ఏ ఛానెల్ కావాలంటే ఆ ఛానెల్ నిరాటంకంగా చూపిస్తుంది (కరెంట్ మాపై కక్షబూని, మా అమ్మని కరుణిస్తే) ఈ టి వి చూడడం అనే విషయంలో మా అమ్మ ఎంత ఉద్ధండురాలంటే మేమెవరన్నా పొరపాటున టైం ఎంతయిందో అని ఏ వాల్ క్లాకో, చేతి గడియారమో చూసుకుందామని పసిగట్టిందో ఇహ చెప్పనవసరం లేదు.. ఇప్పుడు చిట్టెమ్మ వస్తోంది కదా... టైం ఇంత.. ఇందాకే భగవ్గీత ప్రవచనాలు అయ్యాయి,  అప్పుడనగా చెప్పాను ఆ వెధవకి తీసుకురమ్మనమని..  ఇదిగో అదేదో రేకులు సీరియల్ టైం కి తెచ్చాడు. అంటూ తన సీరియల్ భాష అంతా మా మీద ప్రయోగించేస్తుంది. అటొచ్చి .....ఇటొచ్చి లేదా ఒక చుక్క కాఫీ తాగుతూనో, కొన్ని సీరియల్స్‌లో  లేదా కొన్ని భక్తి సందేశాలో మా చెవిన అలా అలవోకగా పడ్తూ ఉంటాయి.

అలాంటి నేపధ్యంలో ఈరోజు పొద్దున్న నేను విన్న ఈ కథ నాకు చాలా నచ్చిన కథ, ఏ ఆచారాలన్నా దురాచారాలన్నా మనం సృష్టించుకున్నవే, వాటిని పాటించడంవల్ల ఎదుటి వారు ఇబ్బంది పడ్తున్నారు అంటే మార్చుకోడం, మార్పు కోరడం తప్పుకాదు అన్న సందేశం కూడా నాకు చాలా నచ్చింది. 

ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్పాలి. శంఖంలో పోస్తే కాని తీర్థం కాదని ఒక నానుడి... ఆచారాలు మనం మార్చుకోడం, మార్పు కోరడం విషయం గురించి ఇంతకు ముందు చాలా సార్లు నా  బ్లాగులో కూడా చెప్పాను. కాని ఇలాంటి విషయాల్లో అంత తొందరగా మార్పు రాదు కాని, ఫలనా పీఠాధిపతి చెప్పారనో, లేదా ఫలానా పేరున్నవారు చెప్తేనో దాని గురించి "అవును సుమా ! నిజమే " అని అనేవారున్నారు. అంతకు ముందు అదే విషయాన్ని మాలాంటి మామూలు అతి సామాన్య మనుషులు  నెత్తి నోరు బాదుకుని చెప్పినా,  దాని గురించి కూరలో కర్వేపాకు తీసేసినంత తేలికగా  తీసుకునేవారు చాలా మంది ఉన్నారు. మరి ఆ చెప్పేవాళ్ళు మనలా మనుషులు ..మనం చెప్పేదే  వాళ్ళు చెప్తున్నారు కదా అని అనుకోరు.  అదేంటో ఒక్కోసారి పత్రికలో కూడా రాస్తూ ఉంటారు. పత్రికలో రాసినప్పుడు.. "ఎంత బాగా రాసారో.... ఇలా చేయాలి .. "  అని దృఢ నిశ్చయం చేసేసుకునే వాళ్ళు,  వాళ్ళ వాళ్ళు ఎప్పుడన్నా ఈ విషయం గురించి చెప్పారా?  అని ఆలోచించరు.. పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు అన్నట్లు, ఇలా ఉండేవాళ్ళు చాలా మంది మా (నా ) ఎరికలో . :-)

సరే ఇక అసలు విషయం.. కథలోకి.. వెళ్దామా
*****
పూర్వం ఒక కుటుంబ పెద్ద ఒక వ్రతం చేయ నిశ్చయించుకుని, బ్రహ్మం గారిని పిలిపించారు. వ్రతం చాలా సందడిగా, ఏ లోటు రాకూండా జరగాలని బంధు మిత్ర సపరివార సమేతాన్ని కూడా ఆహ్వానించారు. పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకుని, దంపతులురివురూ పీటలమీద కూర్చుని పూజ ప్రారంభించేంతలో, ఒక పిల్లి అటుగా వచ్చింది. ఒకసారి దానిని అటువైపు రానీకుండా దూరంగా తరిమేశారు. మళ్ళీ బ్రహ్మం గారు పూజ ప్రారంభించేంతలో, మళ్ళీ పిల్లి వచ్చి "మ్యావ్ " అంటూ అక్కడ వారిని పూజ చేసుకునేందుకు లేకుండా అడ్డుగా కూర్చుంది, మళ్ళీ యధాప్రకారం దానిని దూరంగా తరిమేసి పూజ చేద్దామనుకున్నారు. 


ఇలా మూడు నాలుగు సార్లు జరిగేసరికి ఆ కుటుంబ పెద్దకి ఈ ఆటంకం పెద్ద చికాకుగా తోచి, తన పెరట్లో ఉన్న ఒక చిల్లుల తటాకు బుట్టని తీసుకుని వచ్చి దానితో అక్కడే ఉన్న పిల్లిని మూసి ఉంచారు. అలా చేసిన తరువాత ఆరోజు వ్రతం ఎంతో సంతోషంగా .. నిరాటంకంగా జరిగింది. అందరూ ఆనందపడ్డారు. వ్రత ఫలం కూడా ముగిసింది. 

ఇలా ఆ వ్రతమేదో ముగియగానే వారికి వ్రతఫలంగా తర తరాలు తరిగిపోని చక్కటి భక్తి ప్రపత్తులు, సుఖ సంతోషాలు కలిగాయిట. ఆ కుటుంబ పెద్ద ఎంతగానో సంతోషించి ఈ వ్రతం తమ ఆచారంగా పాటించి తాను ఉన్ననాళ్ళు ఒక ఆచారంలా దానిని నిర్వహించారుట . ఇహ తన తదనంతరం కూడా ఈ "వ్రతం" ఆచరించాలని తన వారికి కూడా చెప్పారుట. ఇలా వారి కుటుంబాలు ఈ వ్రతాన్ని క్రమం తప్పక ఆచరించారు. సరే! కుటుంబ తర తరాలు గడచిపోయింది తరువాతి తరం, తరువాతి తరం, ఆ తరువాత స్థలం, అంతా మార్పులు .... కుటుంబ పెద్ద ఆదేశానుసారం వారి తరువాతి తరువాతి తరం వారు వ్రతం చేసుకుంటున్నారు. ఇక్కడ బ్రహ్మం గారు కూడా తరువాతి తరువాతి తరంవారు. పూజకి అన్ని సిద్ధం చేస్తున్నారు, దంపతులిద్దరిని పీటలు మీద కూర్చోమని పూజ ప్రరంబిద్ధామని బ్రహ్మం గారు ఉపక్రమించేంతలో ఆ తరువాతి తరం, నేటి తరం మనిషి, "మా తర తరాల ఆచారం, పిల్లి బుట్ట కావాలి అని అన్నారుట" బ్రహ్మం గారు కించిత్ ఆశ్చర్యంతో ... "ఈ వ్రతం తెలుసు కాని ఈ పిల్లి,  బుట్ట ఏంటి ఎక్కడా వినలేదు" అని ... సంశయం వెలిబుచ్చారు. మా ముత్తమ్మమ్మ , మా అమ్మమ్మ , మా తాతయ్య వీళ్ళందరూ ఈ వ్రతం చేసేప్పుడు పిల్లిని బుట్టలో ఉంచేవారు, ఇది మా ఆచారం .. ఇప్పుడు మీరు కూడా ఆ పని చేయాల్సిందే అని... ఆ తరం పెద్దమనిషి అన్నారుట, ఇప్పుడు ఈ కాంక్రీటు అరణ్యంలో .. పిల్లిని , బుట్టని నేనెక్కడ తీసుకురాను (ఇక్కడ పిల్లి బుట్ట తీసుకురావడం పెద్ద సమస్య కాదు అని అనేవాళ్ళతో నేను వాదించలేను కాని...) అని ఆ బ్రహ్మంగారి ఉవాచ.

చూశారు కదా ఫ్రండ్స్, అప్పుడేదో ఆ కుటుంబ పెద్ద తనకి ఈ పిల్లి వ్యవహారం చికాకుగా తోచి అలా దానిని అటూ ఇటూ కదలనీయకుండా వ్రతం నిరాటంకంగా చేస్తే...  ఆ చికాకు వ్యవహారాన్ని తరువాతి తరం వారు ఆచారం పేరిట... దానిని పెంచి పోషిద్దామనుకోడం ఎంతటి హాస్యస్పదం...ప్చ్... :) 

మనకి ఇబ్బంది అనుకుంటే  ఈ ఆచారం .... ఈ పిల్లి వ్యవహారం అవసరమా? ప్చ్!  మనిషికి వ్రతఫలం, పిల్లికి (బ్రహ్మంగారికి)  ప్రాణ సంకటం... బాగుంది కదా, పొద్దున్న భగవధ్గీత  గురించి  చెప్తూ కాకినాడ పీఠాధిపతిగారు చెప్పిన ఈ కథ ఇలా... మీదాకా.... నచ్చలేదా? పోని వదిలేద్దాం. రెపో ఎల్లుండో ఇంకో సరికొత్త టాపిక్ తో మీముందుంటా.
*******

1 comment:

Note: Only a member of this blog may post a comment.