సంవత్సరం క్రితమనుకుంట ఎవరో దూరపు బంధువు చనిపోయారని అప్పుడు వెళ్ళడం కుదరక.. ఆ తరువాత 3 నెలలకి పరామర్శించడానికి వెళ్ళాము నేను, అక్క, అమ్మ, మరదలు. వెళ్తూ కూడా అనుకున్నాము సదరు చనిపోయిన బంధువు బార్యని ఓదార్చడం కష్టమేమో అని.. జాగ్రత్తగా మాట్లాడాలి.. ఆవిడని ఎక్కువ బాధపెట్టకూడదు అని నిర్ణయించుకుని వెళ్ళాము. మధ్యాహ్నం బోజనాలు చేసి వెళ్ళాము. వాళ్ళింట్లో కూడా అంతా నిశ్శబ్ధంగా ఉంది. ముందే ఫోన్ చేసి వెళ్ళాము కాబాట్టి.. ఆవిడ కలత నిద్దర్లో ఉన్నట్లున్నారు.. చిన్న శబ్ధానికే ఉలిక్కిపడి"రండి రండి" అని ఆహ్వానించారు. కాసిన్ని మంచినీళ్ళు తాగిన తరువాత.. మాటా మంచి అయ్యాక.. అందరం మౌనంగా ఉన్నాము మాటలు రాని వాళ్ళలాగా.. నాకయితే తుఫాను ముందు ప్రశాంతత లా అనిపించింది. ఎలా పలకరించాలో తెలియడం లేదు. ముందే చెప్పడంతో అమ్మ కూడా సైలెంట్ గా ఉంది లేకపోతే ఈ పాటికి అమ్మ కళ్ళనీళ్ళూ వత్తేసుకుంటూ "ఎలా జరిగింది వదినగారు" అంటూ పలకరించేసేది. (అదే సులువేమో..) "ఆవిడే చెప్తారమ్మా నువ్వు కళ్ళనీళ్ళు పెట్టేసుకోకు" అని చెప్పాము అమ్మకి..
ఇలా ఎంతసేపు ఎవరూ మాట్లడలేదు అనుకుంటూ.. "కోడలు లేదా" అని పలకరించాను నేను. "లేదమ్మా ఆఫీసుకు వెళ్ళింది. 20 రోజులు వెళ్ళలేదు కదా అందుకే ఈరోజు కూడా వెళ్ళింది (మేము వెళ్ళింది ఆదివారం) ఎంటో అలా జరిగిపోయింది... నాకు తెలుస్తూనే ఉంది.. జీవుడికి అన్న సహితం లేదు.. అన్నం సహించకపోతే జీవుడు ఇక ఇలలో లేనట్లే.. 6 నెలల ముందే అనుకున్నా ఇంక ఉండరని.. ఎదో అలా ఈడ్చుకొస్తున్నాడు బతుకు బండిని.. వెంటిలేటర్ అన్నారు డాక్టర్లు .. నేనే వద్దన్నాను ఎందుకు మాకేమన్నా అమెరికానుండి, ఆఫ్రికా నుండి రావాల్సిన బంధువులున్నారా ఏమన్నానా.. అదేదో మల్టీ స్పెషల్ హాస్పిటల్ అన్నారు కాని నేనే.... "ఎందుకు బాబు ఉస్మానియాకి తీసుకెళ్దామన్నాను. పోయే ప్రాణాన్ని ఎన్ని డబ్బులేసి ఆపుతాము చెప్పండి........" ఆ ప్రవాహం సాగిపోతూనే ఉంది. తెలియని వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఆవిడేదే మాతో గొడవ పెట్టుకుంటున్నారు అనుకుంటారు.. దూరం నుండి చూస్తే చేతులు తిప్పేస్తూ అలా గట్టిగా మాట్లాడుతుంటే మేము ఒకరి ముఖాలు ఒకరు చుసుకున్నాము. పైకి తేలలేదు కాని ఆవిడ ధైర్యం మెచ్చుకోతగ్గదే.. ఒక మనిషి అందులోను తన ప్రత్యక్ష దైవం.. తన భర్త చనిపోయారని తెలుసు అని ఎలా ఓదార్చాలి అని అనుకున్న మేము నిశ్చేష్టులయ్యేలా చెప్తుంటే.. నోట మాట రాలేదు.
సదరు వ్యక్తి బయట ప్రపంచానికి ఏమి కాడు, తన ఇంట్లో తన బార్య, పిల్లలు పెళ్ళిళ్ళు పేరంటాలు, ఆ భాద్యతలు ముగించుకుని అంతో ఇంతో ఆస్థి తన తరువాత తరాలవారికి ఇచ్చి తనవాళ్ళు ముందు ముందు కష్టపడకుండా చేసి వెళ్ళిన వ్యక్తి.. లేని లోటు ఉండదు అనను కాని, ఇంక ఆ మనిషి అలా రోగంతో బాధపడకూడదు అని, ఆవిడ ధైర్యంగా తీసుకున్న నిర్ణయం మెచ్చుకోతగ్గదని చెప్పొచ్చు. బార్య "అబ్బబ్బ ఏంటీ సేవలు చేయలేకపోతున్నాను" అనుకుంటేనే ఆ మనిషి సగం చనిపోయినట్లేట. తిరిగి వస్తూ ఉంటే మేము అనుకున్న మాటలు అలాంటిది ఆవిడ గుండే రాయి చేసుకున్నారు అన్నిటికి రెడీ గా ఉన్నారు అందుకే అలా .....ఆయన.. వెంటిలేటరు.. ఇంకోటి అంటూ .... బతుకు మీద ఆశ.. పోతానేమొ ఇంకెన్ని రోజులో ?? అన్న బాధ లేకుండా..తన బార్య, కొడుకులు, కూతుళ్ళు.. మనవలు మనవరాళ్ళు అందరు చుట్టూ తనకోసం ఉన్నారన్న తృప్తితో సునాయసంగా ప్రాణాలను వదిలారు అనుకున్నాము.
*******
ఇప్పుడు భగవాన్ సత్యసాయిబాబ గారి పరిస్థితి ఇది. ఆయన సృహలో ఉండి ఉంటే... బయట కూర్చుని "మాకేమి తెలియడంలేదు మమ్మల్ని లోపలికి రానివ్వడంలేదు.." అని భాదపడేవాళ్ళకన్నా ఆయన ఎన్నో రెట్లు మౌనంగా బాధ పడ్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన మాములు మనిషి.. పోని మానవావతారం. మనిషన్నాక చీము , నెత్తురు, సంతోషాలు, దుఃఖాలు ,కష్టం కలిగితే బాధలు, రోగాలకి అసహయత.. అన్నీ ఉంటాయి. కాని ఏ భక్తుడు లోపలికి వచ్చినా గుర్తు పట్టగలిగితే.. ఈ బాధలకి ఈ కష్టాలకి అతీతంగా ఉన్నట్లుగా ఉండగలగాలి. తనకేమి కాలేదు అనే నిర్లిప్తత ఉండాలి.. ఇంత ముదిమి వయసులో అలా ఉండగలరా? ఎంతటి గొప్ప వ్యక్తి అయినా అవసాన దశలో ప్రాణ బాధ అనుభవించక తప్పదు ఎంతటి అంతర్మధనం జరుగుతుందో కదా అతనికి.. సెంట్రల్ ట్రస్ట్, 120 దేశాల్లో 1200 సేవా సమితులు, ఆయన వేల కోట్ల ఆస్థి పాస్తులు దీని తరువాత వారసులు.. వీలునామా, లాయర్లు ఇవేమి ఆయన అంతర్మధనం కాదు... చివర్లో ఇవేమి ఆయనతో పాటుగా ఐ సి యు లో తోడుగా రాలేదు. ఆయనొక్కరే, ఆయనకొచ్చిన ఇంఫెక్షన్ తోడుగా వేరెవరిని లోపలికి రానీయక, బయట మీకోసం ఇన్ని వేలమంది ఉన్నారు అని తెలుసో లేదో కూడా తెలియనంతగా... ఉన్నారంటే.. ఆ మానవవతారంలోని మంచి సేవా మనసు ఎంత మధన పడుతోంది.. ఇందులో ఆయనకి "నా" అని చెప్పుకోతగ్గ మనిషి ఎవరు? ఆ మనసు చెప్పే మాటలు వినేవాళ్ళేవరు?
ఏది ఎలా ఉన్నా ఆయనో గొప్ప వ్యక్తి.. అతనిలోని మంచితనం తన ఊరి ప్రజలకు నీటి సౌకర్యం, వైద్య సౌకర్యం అందించిన మానవత్వం పరిమళించిన మహా మనీషి. వేల కోట్లు ఏమి చేసుకోవాలో తెలియక ..... అన్న మాట పక్కన పెడితే ఎంతోమంది కన్నా ఉన్నతుడు. అలాంటి వ్యక్తి ఈరోజు అసహాయ స్థితిలో ఉన్నప్పుడు.. ఆయన అసలు దేవుడే కాదు, ఇవి చేశాడు, అవి చేశాడు అని చర్చించుకోడం అంత సమంజసం కాదు.
మన పక్కనే ఎదో శవం వెళ్తోంది అంటే ఒకసారి దండం పెట్టుకుని అప్రయత్నంగా "అయ్యో" అనుకునే సదాచారం మనది. అలాంటి మంచి మనిషి... ఈరోజు వైద్యులు తప్ప వేరెవరు లోపలికి రాలేక/రానీయక ఆ ఐ సి యులో .. ఒంటరిగా మృత్యువుతో పోరాడుతున్నారు.. అతని బాధని అర్థం చేసుకుని అతని ప్రశాంతతకై ప్రార్థిద్దాము.
******
చివరిగా : పైన చెప్పిన ఒక మాములు మధ్యతరగతి వ్యక్తికి, ఒక మహిమాన్వితమైన వ్యక్తి కి తేడా చూశారా? ఆయన తనవాళ్ళ మధ్య తృప్తిగా సంతోషంగా కన్ను మూశారు.. ఈయన "నా" అన్నవాళ్ళు దగ్గర్లో లేక...... ప్చ్ !! పోతే అందరూ వస్తారు లెండి.. ఉన్నప్పుడు ఆ తృప్తి ఉండాలి కదా.. :(
******