నిద్ర.. ఈ నిద్రాదేవికి నేనంటే ఇష్టం కాదు .. కాదు ప్రాణం.. నిద్ర సుఖమెరగదు అన్నట్లు, నిద్రాదేవి నా దరికి చేరి.... ఇంట్లో ఎవరున్నారు ఎవరు లేరు అన్నది కూడా చూడకుండా నన్నలా అల్లుకుపోయి... ఆవహించేస్తూ ఉంటుంది.. అప్పట్లో నా నిద్రకి జోలపాట ... మా అమ్మ. టీ , కాఫీ, భోజనాలు అంటూ... లేపేసి మళ్ళీ " పడుకోమ్మా తినేసి, తాగేసి ఎంత అలసిపోయావో ఎమో" అంటూ జోకొట్టేసేది. (వేసవి సెలవుల్లో లెండి... మెలుకువగా ఉంటే ఎదో ఒకటి కొనమంటూ సతాయిస్తూ ఉండేదాన్నట.. )
సరే ఇప్పుడు పెళ్ళి అయింది.. పిల్లలు.. బాధ్యతలు... ఇప్పుడు కూడా నిద్రాదేవి అదే తరహా ఇష్టాన్ని నాపై కురిపిస్తోంది.. ఇంతవరకు ఈ ఇష్టం నాకెప్పుడు కష్టమవలేదు కూడా.....ఇదిగో ఇప్పుడే... ఇలా భయంగా వస్తున్న నిద్రని ఇప్పుడు కాదు తరువాత అంటూ ఉండేసరికి ...... పూర్తిగా నన్నొదిలేసిందెమో అనిపిస్తుంది....
*********
పాపకి మొదటి పరీక్ష.. 03.03.2012.. పొద్దున్నే 8 గంటలకి వెళ్ళాలి అని ముందే చెప్పడంతో నేనంటూ అలారం పెట్టుకోను ఎప్పుడు నాకు నేను హిప్నటైజ్ చేసుకుంటూ ఉంటా... ఉదయం 5 గంటలకి లేవాలి అని.... ఆ అలవాటే 2 తారీఖున కూడా అమలుపరచాను.. రాత్రి 12 గంటలకి ఒకటికి రెండుసార్లు నన్ను నేను హిప్నటైజ్ చేసేసుకుని పడుకున్నా... పడుకోగానే నిద్రదేవి నన్ను వరించేస్తుంది... నాతో పాటు పాప, బాబు, శ్రీవారు ఒకేసారి పడుకున్నాము ఆరోజు.
ఆరతి సాయిబాబా.. అన్న పాట వినగానే ఠక్కున మెలకువ వచ్చింది. మా ఇంటికి దగ్గర్లో ఉన్న బాబా గుడి నుండి పాటలు ఉదయం 7 గంటలనుండి వస్తాయి అంటే అప్పుడు టైం 7 దాటింది. బాప్రే! పాపకి సెంటర్ చాలా దూరం .. ఉన్నపళంగా పాపని లేపేసాను అదీ టైం చూసి ఉలిక్కిపడి... "ఎలగామ్మా ఇప్పుడు ఈరోజు నేను exam రాయలేను..." ఏడుపు.. మొదటి రోజు నా నిద్ర కారణంగా అది పరీక్ష రాయలేకపోయింది.. అయినా నాతోపాటు శ్రీవారు , బాబు, పాప కూడా నిద్రపోవడమేమిటి.. నా తప్పుని కప్పిపుచ్చుకోడానికి వాళ్ళకి చివాట్లు... చ! రోజంతా చికాకు చికాకుగా ఉంది.. అనుకున్నది జరగడంలేదు.. ఆ చికాకులోనే పాపకి బుజ్జగింపు.. "పోనిలే తప్పు నాదే ఎలాగోలా వెళ్ళు.. ఒకవేళ లేట్ అయితే రిక్వస్ట్ చేయి... పర్లేదు రాసేస్తావు....." నెమ్మదిగా బుజ్జగిస్తే ....
"ఫైనలియర్ పరీక్షలంటే నువ్వు ఆషామాషీ అనుకుంటున్నావా అమ్మా..one ఇయర్ వేస్ట్ అవుతుంది.. నాదే తప్పు నాలుగు సెల్స్‌లో అలారం పెట్టుకున్నా ..... మెలకువ రాలేదు చట్.. కళ్ళనీళ్ళతో పాప..
ఏమి చేయను? ఏమి చెయగలను? దగ్గరకి తీసుకుని ఒదార్చుదామని అనుకునేంతలో ".. ఏహే పో అమ్మా!" అని విదిల్చి దూరం జరిగింది....
విసుగుతో కూడిన ఆ విసురుకి ఒక్క ఉదుటన లేచి చూశాను.... హాలంతా నిశ్శబ్ధంగా ఉంది.. పక్కన పాప పుస్తకాలని తదేక దీక్షతో చదువుతోంది.. టైం చూస్తే తెల్లవారుఝాము 4 గంటలయింది అప్పటికి...
**********
"నీకు కల వచ్చిందని మమ్మల్ని ఇలా ప్రతి పదినిముషాలకి సతాయించకమ్మా ప్లీజ్!"..
ఆ తరువాత అంటే పైన కల వచ్చిన తరువాత , నేను నిద్రని దూరంచేసేసుకున్నా.. ఇష్టమైన నిద్రని అతి కష్టంగా.. భయం .... నాతో పాటు పిల్లలు కూడా నిద్ర పోతారేమో అనే ఆలోచన.... "అమ్మా! మూడింటికి లేపు" లేదా "రెండింటికి లేపు" అని చెప్తే వాళ్ళ టైంకి, అనుగుణంగా లేపడానికి నేను పన్నెడింటినుంచే ఎదురుచూపులు.. లేచిన తరువాత ప్రతి పదినిముషాలకి ... చదువుతున్నారా , పడుకున్నారా అని పిలిచి అడగడం చూసి మా పాప అన్న మాటలవి..
నిజమే కాని విచిత్రం మొదటి రెండురోజులు నిద్ర నా దరిచేరతానని ఎంత ప్రయత్నించినా బలవంతంగా దూరం నెట్టేశాను.. ఇప్పుడసలు అంటే ఇంక నిద్రపోవచ్చు పర్వాలేదు.. పిల్లలు లేపగానే లేస్తున్నారు , నేను లేపకపోయినా లేచేట్టుగానే ఉన్నారు అనుకునే సమయానికి నేను నిద్రని వెతుక్కోవాల్సిన పరిస్థితి.. :-) . పిల్లలికి పరీక్షలంటే మనమెంత కష్టపడాలో కదా..
అమ్మ గుర్తొచ్చింది హాయిగా నవారు మంచం పై పడుకు కఱ్ఱ పక్కన పెట్టుకుని, ఎప్పుడు మెలుకువ వస్తే అప్పుడు "చదువుతున్నారా, ఏది ఫలనా ఎక్కం చెప్పు" అనేది నిద్రలోనే..... మేము సగం చెప్పేసి ఠక్కున ఆపేసినా, అమ్మకి తెలిసేది కాదు.. ఇప్పుడలా కాదు.. లేచి వాళ్ళని లేపి, మనం పక్కన కూర్చుంటేకాని వాళ్ళకి చదువుకోవాలి అనే ఆలోచన రావడంలేదు..
నాకు తెలిసి ఈ పరిక్షల సీజన్‌లో తల్లితండ్రులందరూ ఇదే పరిస్థితిలో ఉండిఉంటారు.... :-) Have a nice sleep to you all ...
హ! ఇప్పుడు కూడా నిద్రపట్టకే.. పక్కన ఇద్దరు పిల్లలు చదువుకుంటూ ఉంటే రాస్తున్నా... "కునుకమ్మా ఇటు చేరవే" అంటూ ...
******
భలే వ్రాశారు! ఆ సంఘటన గురించి చదువుతుంటే చాలా భయం వేసింది. కానీ కలని తెలిసాక హమ్మయ్యా అనుకున్నా! ఒకసారి ఇలానే ౮ కి పరీక్ష అయితే నేను ౭ కి లేచా! కానీ పరీక్ష హాలు పక్కనే కనుక సరిప్పోయింది! నిజంగా పిల్లలకి పరీక్షలయితే తల్లులు ఎంతో తల్లడిల్లిపోతారు కదా! వాళ్ళ పరీక్షలకి కూడా అంతలా చదివుండరేమో!
ReplyDelete