11.19.2012

మనసా తుళ్ళి పడకే.....


ఏయ్ ఏమయింది నీకు అలా ఉన్నావు?

ఎలా ఉన్నాను బానే ఉన్నాను కదా ఎందుకు మౌనంగా ఉన్న నన్ను అనవసరంగా కెలుకుతావు..

ఎప్పుడూ వాగుతూ ఉండే నువ్వు మౌనంగా ఉన్నావనే పలకరించింది ఏమయింది చెప్పు..

చెప్పడానికేముంది? ప్రతీసారి చెప్తున్నదే ప్రత్యేకంగా చెప్పేదేముంది? చిన్నప్పటినుండి అడుగుతున్నా నాకో తోడు చూడు అని.. విన్నావా? అసలు వింటావా?



నీకు తోడా నేను ఉన్నాను గా ఇంకేమి తోడు కావాలి?

నువ్వు నాకు తోడా.. హహహహహహహహ.. నువ్వు నేను ఒకటే అయినప్పుడు నువ్వు నాకు తోడు ఎలా అవుతావు.. పోని నువ్వు నేను వేరు వేరు అనుకున్న్నా కూడా మనిషిగా నువ్వు నీకు ఇంకో మనిషిని తోడుగా చేసుకున్నావు కాని నాకేరి నాకు ఇంకో మనసు తోడు కావాలి

ఇంకో మనసా ఎక్కడినుండి తీసుకురాను? తీసుకొచ్చిన ఎవరు అర్థం చేసుకునేవాళ్ళు? అయినా అంత అత్యాశ కూడా పనికిరాదు

ఆపు నాది అత్యాశా? నువ్వు హాయిగా నీకు మనిషిని తోడు చూసేసుకుని నాది అత్యాశ అంటావా? ఎప్పటిఎప్పటినుండి ఈ ఒంటరితనం ఎదన్నా మంచి ఊహ కలిగితే చెప్పుకోడానికి ఒక స్నేహం లేక.. సరే నీకు చెప్తే నువ్వలా గుండెల్లోనే కప్ప్ట్టెస్తావు.. నాకు అసలు నీతో విడాకులు కావాలి.. నీతో ఉండలేకపోతున్నాను.

నాతో విడాకులా.. నన్ను వదిలేసి ఎక్కడికెళ్తావు? నిన్ను అక్కున చేర్చుకునేవాళ్ళే లేరు నేను తప్ప.. పిచ్చి వేషాలు మాని అసలు నీ బాధేంటో చెప్పు..

బాధ.. ఏమని చెప్పను? చిన్నప్పుడెప్పుడో చెప్పావు.. నాకే కాదు నీకు కూడా, నిన్ను కూడా ఇష్టపడే మనిషినే ఎంచుకుంటాను అని ఏది? నా ఇష్టాలు నీకు తెలియవా? ఎన్ని సార్లు చెప్పాను.. అసలు నువ్వేమాత్రం చెప్పకుండా నీకోసం నేనున్నాను  అనే మనసు కావాలి అని.. విన్నావా నువ్వు తోడు తెచ్చుకున్న నీ మనిషి కూడా అందరిలాగే బాధ్యతలు, బంధాలు అంటున్నాడు.. పోని కనీసం ఎప్పుడన్నా ఒక్కసారన్నా తనంత తానుగా నీ మీద ప్రేమని కురిపించాడా లేదే.. నీ మీదే ప్రేమ లేనివాడు ఇక నీ లోపల ఉన్న మనసు సున్నితత్వాన్ని ఎలా తెలుసుకుంటాడు? అతను నాకు తోడెలా అవుతాడు?

ష్హ్! తప్పు అలా మాట్లాడకూడదు.. బంధాలు అంటున్నాడంటే ఇక పిల్లలు పెద్దవాళ్ళయ్యారు.. ఇంకా నాకోసం, నాకోసం మాత్రమే అని అనకూడదు.. బాధ్యతల మధ్య బందీ అంతను..

ఎహె ఆపు సోది గోల.. చిన్నప్పటినుండి ఇలాగే సర్ధిచెప్తున్నావు.. వాళ్ళెవరో ప్రేమించుకుంటున్నారని వాళ్ళిద్దరు ఎక్కడెక్కడికో వెళ్ళాలంటే నువ్వేదో తగుదునమ్మా అంటు మధ్యవర్తిగా వెళ్ళావు... నువ్వెళ్ళింది చాలాక నన్ను కూడా తీసుకెళ్ళి మరీ "చూడు వాళ్ళిద్దరూ ఒకళ్ళకోసం , ఒకళ్ళలా ఎలా ఉన్నారో, భలే అన్యొన్యంగా ఉన్నారు కదా మనకి (నీకు+నాకూ) అలాగే మంచి వ్యక్తి రావాలి అని నన్ను ఊరించలేదా? ఆరోజునుండి ఆ అందమయిన ఊహని అలాగే పదిలపరుచుకుని ఉన్నానే ఇంతవరకు నెరవేరిందా?  ఎంతసేపు నీ గోల నీదే కాని...


నీకు గుర్తుందా? అప్పుడెప్పుడో ఆ పిల్లాడెవరో తన ప్రేయసి పుట్టినరోజని ఆరోజు మీరు వెళ్తున్న వ్యాన్ అంతా చక్కటి పూలతో అలకరించి, వాన్ నిండా పూలతో నింపేసి పాదాలు కందకుండా నడిపించడం.... భలే ఉంది కదా ఇదిగో నీకోసం అంటూ అతను ఆ అమ్మాయికి ఇచ్చిన గిఫ్ట్ ఏడు వారాలు పేర్లు కల కర్చీఫ్ ఏరికోరి ఎంబ్రాయిడిరీ చేయించి ఇచ్చిన ఆ విధానం.. అప్పుడు నువ్వనుకొలేదు ప్రేమంటే అలాగే ఉండాలి అని.. ఏది అలా ఉందా నీకు.. నువ్వు గుర్తు చేస్తే కాని నీ పుట్టినరోజు తెలీదు ఈ మహానుభావుడికి ఇక  బహుమతులు కూడానా?”
ష్హ్.. అతన్నేమి అనకు పాపం.. ఎదో సంసారం కోసం తాపత్రయపడే వాడు..భవసాగరం ఈద లేక ఈదుతున్నవాడు..  నా ఆలోచనలన్నీ  అతనికి చాలా వింత గా ఉంటాయి.. వదిలేయ్..

ఆ ఆ! వదిలేస్తూనే ఉన్నా కొత్తగా పంతం పట్టుకుని కూర్చుంటే మటుకు మారే మనిషా ఏంటి? అయినా ..భవసాగరం, సంసారం అంటూ అంత పెద్ద మాటలెందుకు? నువ్వు లేకుండానే ఈదేస్తున్నడా ఒంటి చేత్తో నీ పుషోత్తముడు?మరీ చెప్పేస్తున్నావు...

పాపం నేనున్నాను కాబట్టే ఆ మాత్రమయినా లేకపోతే :(

కదా!  లేకపోతే అంతే కదా అదయినా ఆలోచించి.. నా గురించి తెలుసుకోవాలి కదా కనీసం నీ గురించి కాకపోయినా నీ లోపల ఉన్న నీ మనసుని గుర్తించాలి కదా .. మనసులోని మాటని మన్నించాలి కదా ఇంకా ఎన్నాళ్ళిలా మూగనోము పట్టను. ఇక నా వల్ల కాదు అటో ఇటో తేలిపోవాలి..

ఏంటి అటో ఇటో తేలిపోయేది ఏమి చేస్తావు నువ్వు ఏమి చేయగలవు? ఒక్కసారి కమిట్ అయిపోయాము ఈ జీవితానికి ఇంక దీనిని తిరగ రాయలేము.. మరీ అంత మిడిసిపడకు..

మిడిసిపడి మటుకు నేనేమి చేయగలను కాని.. ముందు నీనుండి మార్పు రావాలి.. నీకా భర్తని ఏవిధంగా మాట వినేలా చేసుకోవాలో తెలీదు.. ఎంతసేపు నీ పిల్లలు, నీ ఎదుగుదల అందరు కలిసి నన్ను ఇలా అదిమిపెట్టేసారు.. పుట్టినప్పటినుండి నీతో ఉంటూ నీ చితిలో కూడా నిన్ను వెన్నంటి వచ్చే నాకోసం మటుకు ఒక్క క్షణం కూడా ఆలోచించవు.. ఎలాగు నేను కమిట్ అయి నీతోనే ఉంటాననే/ఉంటున్నాననే  కదా ఈ అలుసు..

ఏయ్ అంత మాట అనకు.. ప్లీజ్. నువ్వు కాకపోతే నాకింకెవరు తోడు చెప్పు.. చిన్నప్పటినుండి నా ప్రతి ఆశ నా ప్రతి ఊహ, నా ప్రతి ఊసులు నీకే కదా నేను చెప్పుకున్నది.. ఎందుకలా నా స్నేహాన్ని కాదంటావు.. ఎంత నువ్వు నేను ఒకటి అయినా.. ఇప్పుడు నువ్వు నాకు చెప్పినట్లు నేను కూడా నీకన్ని చెప్పేస్తూనే ఉన్నా కదా.. ఏదన్నా దాచానా చెప్పు.. ప్రతివాళ్ళు మనకోసమే అన్న పిచ్చి భ్రమలో ఉండి, అది కాదు స్వలాభం కోసమనుకున్నప్పుడు ఇద్దరం ఒకరికొకరం ఓదార్చుకోలేదు.... గాలి, నీరు , అన్ని చితిలో కూడా తోడు వస్తాయి అంటారు కాని అదంతా ఉత్తదే అవి ఇక్కడే ఉంటాయి.. కాని నువ్వు నేను చితిలో కూడా కలిసే ఉంటాము..

ఎప్పటికీ నాకు నువ్వు , నీకు నేనే తోడు.. నీడ కూడా తోడురాదు.. కాబట్టి ఎక్కువగా ఆలోచించకు.. చూడు నువ్వలా బాధపడ్తుంటే నాకు కన్నీళ్ళు ఆగడం లేదు..

అయ్యో! వద్దూ.. నువ్వలా కన్నీరవకు.. నేనేమన్నానని.. బాధ అంతే.. నాగురించి పట్టించుకునేవాళ్ళు లేరు అందరూ నన్నిలా ఒంటరిగా వదిలేశారు, నువ్వేమో నీ వ్యాపకంలో బిజీగా ఉంటావు.. ఎప్పుడయినా కబుర్లు చెప్పుకుందమంటే ఇప్పుడు కాదని నిద్రపుచ్చేస్తావు.. అన్న బెంగ అంతే.. అయినా సరే నీకు నేను తోడు ఉంటాను సరేనా!..నువ్వలా కన్నీరవకు.. లేనిది కోరను, ఉన్నది మరవను.. ఒక పొరపాటుకు  యుగములు వగచను... మౌనం మటుకు నా భాష కాదు.. నేనిలా వాగుతూ నిన్ను విసిగిస్తూనే ఉంటాను.. నువ్వు బయటికి చెప్పలేకపోయినా సరే..:)

తప్పదు.. జీవనం సాగాలి కదా.. బతుకు బండి నడవాలంటే నీతో కబుర్లు చెప్తూ ఉంటే సాగదు కదా అందుకే బిజీ బిజీ.. అయినా నేను కూడా నిన్ను వదలను.. మనిద్దరం ఒక్కటే.. నీ ఆలోచనలను నేను పంచుకుంటూనే ఉంటాను.. నీతో మాట్లాడుతూనే ఉంటాను.. కాని నీ ఆలోచనలను నేనుగా వ్యక్తం చేయలేను.. తనుగా కనుక్కునే మనిషి తోడు నాకు లేదు.. అందుకే ఈ మౌనం..

అంతేలే.. అంతకన్నా మనం చేసేదేముంది కనక.. తోడు లేనని మటుకు అనుకోకు.. ఎదో కొంచం ఆవేశంలో తిట్టేశాను నిన్ను.. బుజ్జి పాపాయివి కదా నాకు.. రేపు నీ పుట్టినరోజు కదా మరి ఏమి చేస్తున్నావు?

హెయ్" అవును నాదే కాదు.. నాతో పాటు నువ్వు కూడా పుట్టావు కదా.. ఏమి చేద్దాము.. ?

ఆనందంగా ఉందాము.. సరదాగా మంచి మంచి రుచికరమయిన వంటలు చేసిపెడ్తాను నీకు.. సరెనా!... "పుట్టినరోజు శుభాకాంక్షలు" ఓ నా మంచి మనసా"

నేను రేపటికోసం ఎదురు చూస్తున్నా.. నీకు కూడా.. అంటే  నన్నింతకాలం, నా ఊహలని, నా ఆలోచనలని భరిస్తూ , నన్ను నవ్విస్తూ అప్పుడప్పుడు కోపానికి గురి చేస్తూ నన్ను నీలో దాచుకున్న చక్కటి నా ప్రియ నేస్తానికిరమణీయమైన నీ స్నేహానికి .......


"పుట్టినరోజు శుభాకాంక్షలు"
*******

4 comments:

  1. పుట్టినరోజు శుభాకాంక్షలు రమణిగారూ ..రేపు మళ్ళి చెప్తా :)

    ReplyDelete
  2. పుట్టినరోజు శుభాకాంక్షలు రమణి గారు :)

    ReplyDelete
  3. అరె, భలే ఐడియా. మనసు కి పుట్టిన్రోజు శుభాకాంక్షలా? నిజమే కదూ. అసలు మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన నెచ్చెలి మనసే కదూ. బావుంది రమణి గారూ. పుట్టిన్రోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. Thanks a lot Raja Chandra garu, Venu Srikanth garu, Sujatha garu.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.