అనంత సాహితీ సాగరంలో మునకలు వేసినవారు మోసుకువచ్చిన రెండు ఆణిముత్యాలు – మరువం ఉష
1 ప్రశ్న: చాలామంది కవులు త్వరగా కావ్య రచన మానుకుంటుంటారు కదా! ఎందుచేత?
కృష్ణశాస్త్రి జవాబు: ఒక్కొక్క మహాకవికి అంతరాంతరాల్లోనే ఒక గొప్ప రిజర్వాయర్ ఉంటుంది. ఒక పెద్ద డైనమో ఉంటుంది. సామాన్య కవులకు ఒక గరిటెడో, గంగాళమంతో శక్తి ఉంటుంది. అది అయిపోయేటప్పటికి మళ్ళీ నింపుకుంటుండాలి; మళ్ళీ చార్జి చేసుకుంటుండాలి. మన చుట్టూ అక్షయ చైతన్యంతో చలించిపోయే జీవలోకమే — ప్రకృతీ, ప్రజా — మనకు నిరవధికమైన రిజర్వాయరూ, డైనమోను. వానిలో పడిపోతూ ఉండాలి. లేకపోతే చల్లపడి పోవడం, వట్టిపోవడం, ఆరిపోవడం జరుగుతుంది. నవజీవన ప్రవాహంలో మొదట పడిపోయిన కవికి ఏదో అనుభూతి వస్తుంది. దానిని గూర్చి ఆవేశంతో వ్రాస్తాడు. తరువాత ఆ అనుభవం అంటే ఆప్యాయం చేతనో, అహంకారం చేతనో తన చుట్టూ గోడ కట్టుకుని, లేక తాను ఒక గదిలో చతికిలబడి ఆ అనుభూతినే గట్టిగా కౌగిలించుకుని కూర్చుంటే, అది అతని చేతుల్లో ఊపిరాడక నలిగిపోయి చనిపోతుంది. దానిలోకి కొత్త వేడీ, కొత్త రుచీ రావడానికి గాని, లేక కొత్త కొత్త అనుభవాలు రావడానికి గాని అన్నివైపులా మనల్ని పొదిగి ఉన్న అనంత జీవలోకంతో కవికి అవిశ్రాంతమూ, అనవచితమూ, అత్యంతాప్తమూ అయిన సంబంధం ఉండి తీరాలి! జీవమే జీవం ఇస్తుంది; గోడ గోరీ కడుతుంది.
ఇంకో విశేషం – కష్టసుఖాలతో, పందిరి బాంధవ్యాలతో నిండి ఉన్న ఈ లోకంతో సన్నిహిత సంబంధం ఉండడం వల్ల కవిలో ఒక కరుణ పుడుతుంది. జాలి కాదు; కరుణ. జాలి నీరసం. కరుణ శక్తి; కరుణ ప్రేమ. ఆర్తక్రౌంచ విరహం నుంచి ఆదికావ్యం పుట్టింది. జీవలోకంతో నిత్య స్నేహం వల్ల కావ్య వస్తువుగా అనుభూతీ, కావ్య కల్పనకు ప్రేరేపించే కరుణా, కల్పన చేయించగలిగే శక్తీ, చైతన్యమూ వస్తాయి. (సాహిత్యవ్యాసాలు)
2 “సాహిత్యానుభవం వాస్తవ జీవితానుభవం కన్నా విలక్షణమైంది. ఒకటి స్వభావ జగత్తు వాస్తవమైంది. రెండవది విభావజగత్తు కావ్యలోకంలోనిది. స్వభావ జగత్తు రెండవదానికి ఆధారమైనదే అయినా విభావ జగత్తుగా పరిణమించి గొంగళిపురుగు సీతాకోకచిలుక అయిన రీతిగా పరిణమిస్తుంది. ఒకదాని కొకటి ప్రతిఫలన రూపాలు కావు. అట్లాగే సమానానుభవం కలిగించేవీ కావు.” – కోవెల సుప్రసన్నాచార్య
ఇలాంటి మరెన్నోఅ ఆణిముత్యాలకి ఆనావలమవుతోంది అంతర్వేది కవితా సమ్మేళనం.. ఈ సమ్మేళానానికి కవులకి కవయిత్రులకి సాదర ఆహ్వానం పలుకుతొంది అంతర్వేది..
వివరాలు:
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.