11.12.2017

లేఖా సాహిత్యం -2

"నీకు ఎన్నో చెప్పాలనుకుంటాను అమ్మలూ కాని మీ హడావిడి జీవితాలకి తీరికగా మా ముందు కూర్చుని వినే ఓపిక తీరిక మీకు లేవని నాకు తెలుసు. సరే కూర్చున్నారు కదా అని చెప్పాలి అనుకుంటే ఎందుకమ్మా బి సి నాటి మాటలు అంటావు. నీకు ఎలా చెప్పాలో అర్థం కాక, ఏ విధంగా చెప్తే నీ దగ్గరికి నా మాటలు చేరుతాయో తెలియక సతమతం అవుతున్నాను.
ఏమి తెలియని బాల్యాన్ని, తెలిసి తెలియని యవ్వన ప్రయాణాన్ని , తెలుకుందామన్న అవగాహన రాని వివాహ బంధం , తెలిసిన తరువాత వచ్చిపడిన పెద్దరికం, వెరసి మీ అమ్మ. ఈ పని నేనే ఎందుకు చేయాలి అనే పెంకితనం, బెట్టు నుండి , ఇది నేను మాత్రమె చేయగలను వీళ్ళంతా నామీద పూర్తిగా ఆధారపడినవారు అన్న విషయం తెలిసే సరికి జీవితం సగబాగం గడిచిపోయింది. ఇంక ఎంత మిగిలి ఉందొ కాని.. పిల్లలికి ఏమి చెప్పకుండా నాలాగే పెరిగితే ఇప్పటి సమాజం వాళ్ళని అమాయకులని చేసుకుని ఆడుకుంటుంది అన్న భయం ఉంది.


భయం ... అనుక్షణం భయంతోనే జీవితాన్ని గడుపుతారు తల్లి తండ్రి తెలుసా అమ్మలు.. మొన్న అర్థరాత్రి పని ఉంది హాల్ లోకి వస్తే నువ్వు సెల్ లో చాటింగ్ చేస్తున్నావు... చూస్తె ఏముంది వాట్స్ అప్ కి లాక్, ఫేస్ బుక్ లాక్, ఫోన్ కూడా లాక్... అయినా నీమీద కొండంత నమ్మకం.. ఏంటి అమ్మలూ ఇది అని నిలదీసి అడిగితే ఆ ఒక్కరోజుకి నా మాట వింటావు.. తరువాత యదా ప్రకారం సెల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటావు. పిల్లలిని నమ్మడం విషయంలో అమ్మా , నాన్నా అమాయకులే అమ్మలు.. వారి జ్ఞానం ఎందుకు పనికిరాదు అనిపిస్తుంది. చెప్తే వినలేరు , చెప్పలేము, పోనీ దెబ్బలు వేద్దామన్నా చెట్టంత పిల్లలు.... మార్పు రావాలమ్మా ,జీవితం , జీవనం సెల్ తోనే ఉంది అన్న భ్రమ నుండి బయటకి వస్తే ఏంతో అందమయిన ప్రపంచం కనిపిస్తుంది. ఆ అందమయిన ప్రపంచంలోకి అడుగిడినపుడు నువ్వే అంటావు ఇవన్నీ నాకెప్పుడు కనపడలేదు అమ్మా అని..
నీలో /మీలో మార్పు కోరుకునే 
మీ అమ్మ..

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.