11.17.2017

వనభోజనం-మన భోజనం 4. ఎస్సార్ కట్టా గారు





వనభోజనాలకి పిలవగానే వచ్చిన ఆజానభాహులు అమ్మో తల ఎంత పైకేత్తినా ఇంకాస్త తల ఎత్తితే కాని కనపడరేమో అన్నంత పొడుగు ఎస్సార్ కట్టాగారు. అసలెలా మాట్లాడతారో వినాలనుంది. ఒక చిరునవ్వు, తప్పితే మాట్లాడింది చాలా తక్కువ , నెమ్మదితనం, అందరిని గమనిస్తూ చివరిదాకా ఉండి చివరిలో బై అని చెప్పిన ఆ సింప్లిసిటీ , మీగురించి నాకేమి తెలియదండి మిమ్మల్ని కవిసంగమం గ్రూప్ లో చూసాను కాస్త చెప్పరూ! అని అడగగానే తన గురించి క్లుప్తంగా ఇలా చెప్పారు శ్రీ ఎస్సార్ కట్టాగారు.... ఆయనే కాదు తన గురించి కూడా తలెత్తుకునేలా "ఓ మంచి స్నేహితుడు"  అన్నట్లుగా చెప్పిన ఆ తీరు చూడండి/చదవండి. 



ఎస్సార్ కట్టా గారు.. చాలా చాలా థాంక్స్ మీరు వచ్చినందుకు. 

***** 


పేరు కట్టా సుదర్శన రెడ్డి. తండ్రి కీ.శే. కట్టా రామచంద్రారెడ్డి గారు. తల్లి వజ్రమ్మ గారు. స్వస్థలం ఛాయా సోమేశ్వరాలయంతో ప్రసిద్ధిగాంచిన పానగల్లు స్వస్థలం. మాది వ్యవసాయ కుటుంబం. వారి సంతానంలో నేను రెండవ వాన్ని. అన్నయ్య ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ డిపార్టుమెంట్ హెడ్ గానూ, నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గానూ పనిచేసి వున్నారు. నాకిరువురు చెల్లెళ్లు. ఒకరు న్యాయవాదిగా, మరొకరు అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగంలో వున్నారు. 
నా విద్యాభ్యాసం పూర్తిగా నల్లగొండలోనే జరిగింది. నాకు చిన్నప్పటినుంచి పుస్తక పఠనం పిచ్చి. కనిపించిన ఏ పుస్తకాన్ని, పేపరును చదవకుండా వదిలేవాని కాను. ఈ అలవాటు మా అమ్మ ద్వారా కలిగిందని గట్టిగా నమ్ముతాను. అమ్మ చదువుకున్నది మూడవ తరగతి. అయినా కనిపించిన వారపత్రికలలో, మాస పత్రికలలో అన్ని కథలు చదివి అర్ధం చేసుకునేది. నల్లగొండ లైబ్రరీలో నుండి తన కిష్టమయిన "కాశీ మజిలీ కథలు" నా ద్వారానే తెప్పించుకునేది. తరచుగా లైబ్రరీ వెళ్లడం వల్ల ఆ అభ్యాసం నాకూ సంక్రమించింది. ఆరోజుల్లో అందులో ఉన్న  పుస్తకాలలో దాదాపుగా అన్నీ నేను చదివినవే. ఎక్కువగా కవిత్వం పుస్తకాలను చదవడం వల్లనేమో నాకు కవిత్వం పై మక్కువ ఎక్కువగానే ఉండేది(ఇప్పటికి కూడా). అంపశయ్య  నవల రాసిన శ్రీ డి. మల్లయ్య (నవీన్) గారు ఆరోజుల్లో మా ఇంట్లోనే అద్దెకుండేవారు. ఆ నవల మా ఇంటిలో ఉన్నప్పుడే వారు పూర్తిచేసి విడుదల చేసినారు. మా నాన్నగారికి ఆ నవల అందిన మరుసటి రోజే అది పూర్తిగా చదివేశాను. అప్పుడు నేను ఇంకా పాఠశాల విద్యార్థినే. నాపై సినారె గారి కవిత్వ ప్రభావం బాగానే వుంది. కాలేజీలో చదువుతున్నపుడే కొన్ని కవితలు రాసి ఎవరికీ చూపించకుండా దాచుకునేవాడిని. అవి నాన్న కళ్ళల్లో పడడంతో వారి మిత్రులకు నన్ను ఓ కవిగా పరిచయం చేస్తుండేవారు. నాన్నగారు కొంతకాలం తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గం ద్వారా ఎన్నికై MLC గా 1969-71 ప్రాంతంలో పనిచేసినారు.
నా డిగ్రీ చదువు పూర్తికాగానే నల్లగొండ రెవెన్యూ డిపార్టుమెంటులో ఉద్యోగం రావడంతో నాకిష్టమయిన ఉన్నత చదువుల ప్రస్థానానికి బ్రేక్ పడింది. కొంత కాలం తహశీలు కార్యాలయంలో పని చేసినన్ను. పై చదువులు ఆగిపోయాయనే బాధ నన్ను బాగా కలచివేసేది.  పెళ్లి తరువాత హైదరాబాదు నగరానికి వచ్చి సివిల్ సప్లయిస్ డిపార్టుమెంట్లోకి మారి ఉద్యోగం చేస్తూనే మళ్లీ చదువును కొనసాగించే ప్రయత్నం చేసాను. కానీ అది కుదరకపోవడంతో ఉద్యోగంపైనే పూర్తిగా దృష్టి సారించాను. 

నా శ్రీమతి పేరు ఇందిర. తను పోచంపల్లి భూదాన్ రామచంద్రారెడ్డి గారి మేనల్లుని కుమార్తె. మాకిద్దరు కుమారులు. ఇద్దరూ Information Technology లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆస్ట్రేలియాలో స్థిరపడినారు. నేను 2011లో ఉద్యోగము నుండి రిటైర్ అయి హైదరాబాదులోనే ఉంటున్నాను. ప్రస్తుతం నాకు మా ఆవిడ, ఆవిడకు నేను తోడూనీడ. 


ఇక నా కవన జీవితంలోకి వస్తే రిటైర్మెంట్ తరువాత నా కవిత్వానికి మళ్లీ జీవంపోసుకున్నాను. ఫేస్ బుక్ సామాజిక మాధ్యమం ద్వారా కవి యాకూబ్ గారు పరిచయం కావడం వారి ద్వారా "కవి సంగమం" గ్రూపులో చేరి నా కవిత్వాన్ని పలువురితో పంచుకోవడం జరిగింది. కవి సంగమ ప్రస్థానం ఎంతో మంది ప్రముఖులతో పరిచయ భాగ్యాన్ని ప్రసాదించింది. మరెన్నో కవిత్వ సమూహాల ద్వారా నా రచనల్ని విస్తృత పరచుకున్నా. అయితే నా రచనలు చాలా వరకు అంతర్జాలంలోనే ప్రచురణకు నోచుకున్నాయి. నా కవిత కవి యాకూబ్ గారి వల్ల కవి సంగమ గ్రూప్ వారి సంకలనంలో తొలి సారిగా ముద్రణకు నోచుకుంది. నేను రాసిన రచనలు ఇంకా అముద్రితాలే. నేను రాసిన వాటిలో ఏక వాక్య కవితలు, ద్విపాద కవితలు, నానోలు, రూబాయీలు, గజళ్ళున్నాయి. కొన్ని గజళ్ళు ప్రముఖ గజల్ గాయని శ్రీమతి జ్యోతిర్మయి మళ్ళా గారు ప్రచురించిన "గజల్ సుమాలు" సంకలనంలో ప్రచురణకు నోచుకున్నవి. 

ఇవే కాక రాష్ట్ర వయోవృద్ధుల సంక్షేమ సమాఖ్యలో సంయుక్త అధ్యక్షునిగా, హైదరాబాదు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీలో సెక్రెటరీగా, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘంలో  బాధ్యునిగా, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షునిగా సామాజిక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటూ ఉంటాను. 

ఇవీ నా పరిచయ వాక్యాలు.
*****


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.