10.14.2010

జీవిత పరమార్ధం


జీవిత పరమార్ధం - కొత్తపాళీగారి పోస్టు కి సంబంధించిన వ్యాఖ్యలు అవీ చూసిన తరువాత నాక్కూడా నాకు తెలిసినదేదో చెప్పాలనిపించింది.

నిన్న ఆదివారం కదాని అమ్మతో ముచ్చట్లేసుకొన్నాను.ఒకానొక సందర్భంలో అమ్మ అన్న మాటలు: "వాడసలు నా మాట వింటున్నాడేంటి? అసలు నాకేమి చెప్పడు, అన్నీ పెళ్ళాంతోనే చెప్తాడు. ఇంతప్పటినుండి పెంచాను నాతో మాట్లడడమే తగ్గిపోయింది" అని వాపోయింది. అమ్మకి ఇప్పుడు 65 యేళ్ళు. ఈ వయసులో అమ్మ ఎంతో హాయిగా ఉండొచ్చు. నలుగురు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొన్నారు, సంపాదించుకొంటున్నారు , అందరూ సంతోషంగా ఉన్నారు. తనకి ఆరోగ్య సమస్యలు కాని, లేద కోడళ్ళ ఆరళ్ళు లాంటివేమి లేవు మాములుగా మనం ఆలోచించుకొంటే ఆవిడ చాలా అదృష్టవంతురాలు, కాలక్షేపం కావలనుకొంటే అందరూ దగ్గర్లోనే వున్నారు కాబట్టి అలా అందరిళ్ళకి వెళ్ళిరావచ్చు. కాని, అమ్మకి ఇంకా ఏదో తాపత్రయం. ఇంకా ఎదో చేసేయ్యాలి.

ఈ ఆలోచనలతోనే ఉన్న నేను, అప్పుడే నాగరాజ గారి జీవిత పరమార్ధం చదివానేమో! అసలు ఈవిడేమి చెప్తుందో చూద్దాము అనుభవజ్ఞురాలు కదా అని అడిగా(ఆవిడకి పాతికేళ్ళ వయసునుండీ ఒంటరి పోరాటం చేసింది మరి) : "అమ్మా! జీవితానికి పరమార్ధం ఏమిటి?" అని.

అప్పటిదాక కొడుకుగురించి చెప్తూ మెటికలు విరుస్తున్న ఆవిడ, అదేదో నేను అడగకూడనిది అడిగినట్లు.. "కాయలో పత్తి కాయలో వుంది, పిల్లలు చూస్తే ఇంక చిన్నవాళ్ళు (తల్లికి తన కూతురు పిల్లల తల్లి అయినా చిన్నవాళ్ళుగా కనపడడం అంటే ఇదేనేమో) అప్పుడే నీకు జీవితాలు, అర్ధాలు, పరమార్ధాలు ఏవిటీ? విడ్డూరం కాకపోతేనూ, పిచ్చి ప్రశ్నలు వేయకలా," అంటూ నన్ను దులిపేసీ, యధావిధిగా తన సీతమ్మవారి కష్టాలు ఏకరువు పెట్టడంలో నిమగ్నమయ్యింది. ఇక్కడ మూమెంట్ ఆఫ్ క్లారిటీ లేదంటార? పిల్లలమీద తల్లి ప్రేమ, మూమెంట్ ఆఫ్ క్లారిటీ కాదా?

ఒక సాధారణ వ్యక్తిని, జీవిత పరమార్ధం గురించి అడిగితే, వచ్చే సమాధానం ఏమిటి అంటే ఇదిగో! ఇలాగేవుంటుంది. జీవితానికి అర్ధాలు,పరమార్ధాలు అవీ ఆలోచించాల్సింది, మునులు, సాధుపుంగవులు లేదా బుద్ధుడంతటి గొప్పవాళ్ళు తప్పితే మిగతావాళ్ళందరూ, అంటే సంసారమనే భవసాగరమీదేవారందరూ కాదు అనే అర్ధం స్ఫురించక మానదు.

అసలు జీవిత పరమార్ధం ఏమిటి అనే ఆలోచన మనిషికి ఎప్పుడు కలుగుతుంది?

మనిషికి వున్నవి మూడు దశలు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం.

బాల్యమంతా తల్లి -తండ్రుల నీడలో , భవిష్యత్ కి గట్టి పునాది వేసుకోడంతో సరిపోతుంది. బాల్యం అంతా నిష్కల్మషమైన జీవితం అసలప్పుడు జీవితం గురించి ఆలోచన కాని జీవితమంటే ఇదని కాని తెలిసే అవకాశాలు తక్కువ. ఇక వృద్ధాప్యం, ఇక్కడ మనిషి మనస్తత్వం పసిపిల్లాడి లాగానే ఉంటుంది. తన పెద్దరికం నిలబెట్టడం లేదనో, లేదా తనని పట్టించుకోవడంలేదనో ( మా అమ్మ లాగ) మొ! ఇక్కడ జీవితం గురించి ఆలోచించాల్సిందంటూ ఏమి లేదు. ఒకసారి వెనక్కి తిరిగిచూసుకొని తనవాళ్ళని, తను సంపాదించినది చూసుకొని తృప్తి పడడం తప్ప.

ఇక మధ్యలోది యవ్వనం+ మధ్యవయసు: యవ్వనమంతా ఆకర్షణ మయం. ఇక్కడ జీవితమంతా తమ గుప్పిట్లో వుంది, అని భ్రమపడి, ఆ వాడి , వేడిలో జీవితం అంటే ఎంజాయి చేయడమని వక్రీకరించుకొని, తప్పటడుగులు వేస్తారు. కాస్త ఆలోచించగలిగే వాళ్ళూ లేదా పెద్దవారి అదుపులో ఉన్నవారు ఐతే పెళ్ళి చేసుకొని, పిల్లల్ని కని,తమకంటూ ఓ బాధ్యత, బంధం ఏర్పడ్డప్పుడో లేదా ఎదో అనుకోని ఎదురుదెబ్బ తగిలినప్పుడో , అప్పుడు అసలు జీవితమంటే ఏంటి? నేనెవరు? అసలు నేనెందుకు అని ఆలోచిస్తారు. ముందు మటుకు అసలు ఆలోచించే అవకాశం రావడం తక్కువే. బాధ్యతల మధ్య బందీ అయినవారు, అసలు ఈ బాధ్యతలు తీర్చుకోవడం, ఈ బంధాలను పదిలపర్చుకోడమే మన జీవన పరమార్ధం అనో, లేదా ఎదురుదెబ్బలు తగిలినవారో కొంచం నిభాయించుకొని మళ్ళీ లేచి నిలబడగలగడమే అసలు జీవన పరమార్ధం అని ఎందుకనుకోరు.

బాగా ఆకలేస్తున్నవాడిని నీ జీవిత పరమార్ధమేమిటి అని అడిగితే ప్రస్తుతం ఆకలి తీర్చుకోవడం అన్నట్లు ..అప్పటికప్పుడు పరిస్థితులకి అనుగుణంగా మారిపొయేదే ఈ జీవిత అర్ధం , పరమార్ధం అని నాకనిపిస్తుంది.

"అవధిలేని(అవనిలోని) ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్ధం"

ఏ పని చేసినా మన ఆత్మ సంతృప్తి చెందాలి అదే జీవిత పరమార్ధం.

జీవితానికి మరణం తప్పదని, ఉన్న జీవితమంతా నిస్తేజంగా అర్ధాలు, పరమార్ధాలు వెతుక్కొంటూ కాలాన్ని గడపడం మాత్రం జీవితానందం కాదు. నాలుగు రోజులుండే ఈ జీవితానికి చిన్న చిన్న ఆనందాలు అనుభవించే హక్కు ఉంది. చివరిగా మూమెంట్ ఆఫ్ క్లారిటీ, ఎదో ఆశ్రమానికో , ఎవరో సాధువు దగ్గరికో వెళ్తే దొరుకుతుంది అంటే ఎందుకో అంత నమ్మశక్యంగా లేదు. మన ఇంట్లోనే పసిపిల్లాడి బోసినవ్వులో మూమెంట్ ఆఫ్ క్లారిటీ లేదంటార?

"భక్తి తోడ నిను కొలిచే పరమార్ధం తెలపవయా" అని ఆ దేవుడిని అడుగుతున్నాము. అలాగే జీవితానికి కూడా పరమార్ధం ఏమిటో ఆ దేవుడినే అడిగేద్దాము తరువాత. ఎలాగు అందరము కొట్టుకొంటూ , తిట్టుకొంటూ కొండ చేరి, ఆయన అండ కోరేవాళ్ళమే కదా..

7 comments:

  1. "కడుపులో చల్ల కదలకుండాఅ ఉన్నది కదా! ఇప్పుడివన్నీ అవసరమా? :)"
    అని ఒరెమునా అన్నారు. :)
    Jokes apart: "ఏ పని చేసినా మన ఆత్మ సంతృప్తి చెందాలి అదే జీవిత పరమార్ధం" అన్న మీ మాట బాగుంది!

    ReplyDelete
  2. >>అప్పుడే నీకు జీవితాలు, అర్ధాలు, పరమార్ధాలు ఏవిటీ?
    ఇది పాత ప్రపంచం, కలియుగం... జనాలు ఇలా ప్రశ్నించడంలో ఆశ్చర్యమేమాత్రమూ లేదు.

    >>ఈ భందాలను పదిలపర్చుకోడమే మన జీవన పరమార్ధం
    జీవితంలో ఉండవలసిన స్కిల్స్‌లో ఇది ఒక్కటి మాత్రమే.

    >>బాగా ఆకలేస్తున్నవాడిని నీ జీవిత పరమార్ధమేమిటి అని అడిగితే ప్రస్థుతం ఆకలి తీర్చుకోవడం అన్నట్లు

    ఆకలి తీర్చుకోవడం అన్నది ప్రస్తుత అవసరం. జీవించినంత కాలం ముప్పొద్దులా మెక్కాలన్నది జీవితాశయం. జీవిత పరమ'అర్థం' వీటన్నిటికన్నా చాలా పెద్దది.

    >>ఏ పని చేసినా మన ఆత్మ సంతృప్తి చెందాలి
    "ఆత్మ" సంతృప్తి. ఆత్మకు సంతృప్తి. భేషైన మాట. బాహ్యాంతర్ముఖాలను వేరు చేసి చూసినప్పుడే కదా అసలైన సంతృప్తి, ఆనందం.
    >> మన ఇంట్లోనే పసిపిల్లాడి బోసినవ్వులో మూమెంట్ ఆఫ్ క్లారిటీ లేదంటారా?
    లేదు: అది మొమెంట్ ఆఫ్ హ్యాపీనెన్. ఆ బోసినవ్వు ఎలా సాధ్యపడిందని ఆలోచిస్తే 'మూమెంట్ ఆఫ్ క్లారిటీ' వచ్చునేమో
    >> అలాగే జీవితానికి కూడా పరమార్ధం ఏమిటో ఆ దేవుడినే అడిగేద్దాము
    100% సరైన పని :)

    - నవీన్ గార్ల
    (http://gsnaveen.wordpress.com)

    ReplyDelete
  3. నెటిజన్ గారు: నెనర్లు.

    నవీన్ గార్లపాటి గారు:నెనర్లు. చిన్నపిల్లాడి నవ్వులో మూమెంట్ ఆఫ్ క్లారిటీ వుంది, ఆ క్లారిటీ చూసిన మనకి అది మూమెంట్ ఆఫ్ హాపినేస్ అవుతుందేమో కదా.

    ReplyDelete
  4. టపాలో చమక్కులు బావున్నై, ముఖ్యంగా మీ అమ్మగారి డవిలాగులు అని రాసిన పంక్తులు.
    అసలు విషయానికి వస్తే .. మీరు చర్చించిన చాలా విషయాలు యథావిధిగా జరుగుతూ ఉండేవే వాటికి మొమెంట్ ఆఫ్ క్లారిటీ అక్కర్లేదుఅని నాకనిపిస్తోంది.
    పిల్లల మీద తల్లి ప్రేమ కొంత ప్రకృతి సిద్ధంగా, కొంత సంఘ పరిణామంగా వస్తుంది. అది ఎలా చూసినా moment of clarity కాదు. కాకపోతే మొదటి సారి తల్లి అయిన స్త్రీ (బహుశ తండ్రి అయిన పురుషుడు కూడా) తమ తొలి సంతానాన్ని చూస్తున్న సమయంలో ఒక మొమెంట్ ఆఫ్ క్లారిటీ కలగచ్చు. అప్పుడు మరి సంతానం లేని వాళ్ళకీ, లేదా అసలు పెళ్ళే చేసుకోని వాళ్ళకీ ఈ మొమెంట్లు రావా, వాళ్ళ జీవితాలకి పరమార్ధం లేదా అనే ప్రశ్న వస్తుంది.
    ఈ టపాలో మీరు క్వస్చెన్ మార్కులు పెట్టి మరీ నిలదీసి అడిగిన ప్రశ్నలకి నా దగ్గిర సమాధానం లేదు. జీవిత పరమార్ధం ఏవిటీ అని వెతుక్కుంటూ జీవించడం మానెయ్యడం పిచ్చితనం - ఒప్పుకుంటాను. ఐతే మనిషై పుట్టినందుకు ఒక్కసారన్నా ఈ ప్రశ్న వేసుకోవాలనీ, దానికి కనీసం తనకి తృప్తి కలిగే సమాధానమైనా చెప్పుకోవాలనీ నేను అనుకుంటున్నా.

    ReplyDelete
  5. కొత్తపాళీ గారు: 1. తల్లి ప్రేమలో క్లారిటీ ఎప్పుడూ ఉంటుంది. నాగ రాజ గారు చెప్పినట్లు అది ఓ మూమెంట్ కి కట్టుబడో లేదా బందీ అయ్యో వుండదు. తొలి సంతానం చూసుకొన్న తల్లి తండ్రులకి పొందే మూమెంట్ ఆఫ్ క్లారిటీ ఓ గొప్ప అనుభూతి. సమాజంలో సాధారణంగా లేదా ప్రకృతి సిద్ధంగా జరిగే వాటిలో క్లారిటీ ఎందుకుండదో నాకర్ధం కావడం లేదు. ఏ కల్మషం లేని బాల్యంలో క్లారిటీ లేదంటార? (ఇది కూడా ఓ మూమెంట్ కి సంభందిచినది కాదు) కాకపొతే మీరడిగే ప్రశ్న ఏమిటంటే, ఇప్పటి సమాజంలో అన్నీ తెలిసి, అన్నిటిని చూస్తూ వుండే ఒక సంపూర్ణ వ్యక్తిత్వం గల వ్యక్తికి మూమెంట్ ఆఫ్ క్లారిటీ కలిగిన సంధర్బాలు ఎమన్నా వున్నాయా అని? (అవునా? ఇది కరెక్టేనా?) అది మటుకు చెప్పడం చాలా కష్టమే. సహజంగా చెప్పమంటే స్వచ్ఛమైన, నిష్కల్మషమైన తల్లి ప్రేమ, పసిపిల్లల అల్లర్ల గురించి చెప్పోచ్చు.
    కొ.మె: క్షమించండి కొత్తపాళీ గారు నేను ఎవరిని నా ప్రశ్నలతో నిలదీయలేదు. నా మనసుని నేనడిగిన ప్రశ్నలు అలా బయటికి వచ్చేసాయి.

    ReplyDelete
  6. ఈకోణం కూడా నిజమే!అనుభవించగలిగితే,సూర్యోదయంలో,సూర్యాస్తమయంలో,పసిపిల్లల బోసినవ్వులో,చెలి వదనంలో,అమ్మ ప్రేమలో,ప్రకృతి లోని అణువణువులో,జీవిత పరమార్ధాన్ని దర్శించవచ్చు.గ్రహించవచ్చు.ఈశావాస్యం ఇదం సర్వం!

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.