10.11.2010

పండు వెన్నెల - పప్పుగుత్తి , ఓ ప్రహసనం

"ఇదిగో! నువ్వీమధ్య బొత్తిగా నన్ను పట్టించుకోవడం లేదు ఎంతసేపు పిల్లలు, ఇంటి పని అంటున్నావుకాని, నేనున్నానా? తిన్నానా? అనేది అసలు పట్టించ్చుకోవడం లేదు"
ఆఫిస్ కి వెళ్తూ, వెళ్తూ తన భర్త బుచ్చిబాబు అన్న మాటలు , చెవిలో గింగురుమంటున్నాయి నీరజకి.
నిజమే! ఇంట్లో చాకిరి, పిల్లలు అసలు బుచ్చిబాబుని పట్టించుకోవడం లేదు. తనలో మార్పు రావాలి, ఇలా లాభం లేదు. బుచ్చిబాబు తనకోసం ఎన్నిసార్లు ఎంత త్యాగం చేసాడు. ఒకసారి, పెళ్ళి అయిన కొత్తలో అనుకొంట! ఎంత ప్రేమగా తను అడిగిందని, "రిక్షా తొక్కి అయినా సరే తెల్లారేసరికి లక్ష రూపాయలు సంపాందించి, నీ కొరిక నేరవేరుస్తాను" అన్న రీతిలో తనకోసం కష్టపడి, తన ఫ్రండ్స్ నవ్వుతున్నా పట్టించుకోకుండా తనకోసం, కేవలం తనకోసం, ఓ మూరెడు మల్లెపూవులు తెచ్చిన తన బుచ్చిబాబుని తను సరిగ్గా చూసుకోకపొవడం ఎంత అన్యాయం, రేయింబవళ్ళూ చెమటోడ్చి కష్టపడి అప్పుడెప్పుడెప్పుడో మల్లెపూవుల కోసం, తన సంపాదనని త్యాగం చేసిన తన బుచ్చిబాబు రుణం తనేవిధంగా తీర్చుకొంటుంది? కళ్ళముందు అలా త్యాగాలు చేసిన బుచ్చిబాబు కనిపిస్తుండగా, కనువిప్పు కలిగింది తనకి. ఎప్పుడో జ్ఞాన దంతాలు వచ్చాయి, జ్ఞానం వచ్చేసింది అనుకొంది కాని , లేదు ఈరోజు ఉదయమే తనకి జ్ఞానోదయమయ్యింది. లాభం లేదు తను మారాలి , "ఎదో ఒకటి చేయాలి" . "అవును ఎదో ఒకటి చెయాలి", "ఎదో ఒకటి చెయాలి". (తను ఒకసారే కదా అన్నది , ఇంకో రెండు సార్లు ఎక్కడనుండి అబ్బా? అనుకొని చుట్టు చూస్తే, ఓ వైపు తెల్ల చీరతో ఒకరు , నల్ల చీరతో ఒకరు, ఒహ్! అంతరాత్మలన్నమాట, సినిమా వాళ్ళకే కాదు తనకు తప్పలేదన్నమాట ఈ తిప్పలు. అయినా తనలోని మార్పు నిర్ణయాన్ని ఏకీభవించారుగా హమ్మయ్య!)
***
సాయం సంధ్యవేళ, అలిసిపోయి వచ్చిన బుచ్చిబాబుకి మంచినీళ్ళు అందించి, స్నాననికి వేనీళ్ళు పెట్టి, పతిసేవయే మహా భాగ్యం అనుకొని మురిసిపోయింది నీరజ.
రాత్రి - భోజానాలయిన తరువాత, "రా! బుచ్చిబాబు! పైకి వెళ్దాము వెన్నెల్లో కాసేపు కబుర్లు చెప్పుకొందాము" అని అంది. (క్రీగంట తనలో మార్పు ని గుర్తించాడా లేదా అని గమనిస్తూ).
ఇద్దరూ కలిసి పైకి వెళ్ళారు.
పట్నం అంతా కాంక్రీటు మయమయినా, తాము బేగంపేటకి దగ్గర్లో వుండడం వల్ల అయితేనేమి, చుట్టూ అపార్ట్మెంట్స్ అంత ఎత్తులో లేకపోవడం వల్ల అయితేనేమి అక్కడక్కడ పచ్చని చెట్లు పలకరిస్తున్నాయి. ఈ మధ్యే బేగంపేట ఏయిర్ పోర్ట్ మూసేయడం వల్ల కాస్త కళా విహీనంగా అగుపిస్తున్నా, ఒకటి రెండు ఫ్లైట్స్ (మిలటరి) లాండ్ అయి వుండడం వల్ల, అక్కడక్కడా లైట్స్ వెలిగి చూడ్డానికి పర్వాలేదు అన్నట్లుగా వుంది.
ఇక వెన్నల చెప్పనక్కర్లేదు. "వెండివెన్నల జాబిలి" అన్న పాట గుర్తోస్తోంది. అలా చుట్టూ పరికిస్తూ, అసలు బుచ్చిబాబు ఏమి చేస్తున్నాడా? అని అటు చూసింది. బుచ్చిబాబు కూడా ఆకాశంలో లో నక్షత్రాలని, చందమామని చూస్తుండడంతో, అనుకొంది " పర్లేదు, మబ్బుల చాటున వున్న చందమామని పరికిస్తున్నాడంటే, తనలోని మార్పు కూడా పసిగట్టే వుంటాడు. ఎప్పుడూ భోజనం చేయగానే "నిద్ర వస్తోంది నీరజా!" అంటూ పడుకొంటాడు. "హు! చూద్దాము చందమామ ఏమంటోంది? వెన్నెల ఏమంటోంది?" అంటాడేమో, "ఎమందో ఎమో కాని పరిహాసాలే చాలునంది, శ్రీవారిని అయిదారడుగుల దూరాన ఆగమంది " అని తనూ బెట్టు చేయాలి. తనిలా ఆలోచనలో వుండగానే "నీరజా" అన్న పిలుపు వినపడింది.మార్దవంగా పిలిచిన బుచ్చిబాబు పిలుపుకి "ఏమిటి బుచ్చిబాబు?" అని బదులిచ్చింది."ఏమిలేదు, ఒక మాట చెప్తాను కోపం రాదుగా?" అని అడిగాడు.
ప్చ్! తను మారింది అని ఇంకా గమనించలేదన్నమాట.
"సరె ! చెప్పు బుచ్చిబాబు కోపం లే(రా)దులే" అని అంది.
"ఏమి లేదు .."
"ఆ ఏమి లేదు.. ? చెప్పు" అసహనం కనిపించకుండానే అంది నీరజ.
"అదిగో! నీకు కోపం వస్తోంది, రాదంటావు ఇంకా చెప్పకుండానే కోపం తెచ్చుకొంటావు ఎలా నీరజా! ఇలా అయితే?"
"లేదు చెప్పు వెన్నెల నచ్చిందా? ఆ ఏయిర్ పోర్ట్ చూడు చాల బాగుంది కదా .. నక్షత్రాల మధ్యన , మబ్బుల చాటునుండి తొంగిచూస్తున్న చందమామ ఎంత బాగుందో కదా ఇదేనా నువ్వు చెప్పదల్చుకొంది?"
" లేదు నువ్వు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి. ఇందాక నువ్వు వేసిన పప్పు కొంచం రుచి మారింది. పప్పు యినపలేదా నీరజా? పప్పుగుత్తి కనపడలేదా?"
అమాయకంగా అడుగుతున్న బుచ్చిబాబుని చివ్వున తలెత్తి కోపంగా చూస్తూ , రుస రుస లాడుతూ వెళ్ళబోయింది.
"అదేమిటి అంత కోపంగా చూస్తున్నావు, కోపం రాదన్నావుగా? ఎక్కడికెళ్తున్నావు? కబుర్లు చెప్పుకొందామని పైకి తీసుకొచ్చి?"
బుచ్చిబాబు ప్రశ్నల పరంపరకి మధ్యలోనే అడ్డొచ్చి, "ఆ! పప్పుగుత్తి ఎక్కడుందో వెతికి, పప్పు ఎలా యినపాలో ప్రాక్టీస్ చేద్దామని" ఉక్రోషంతో అంది.
"ఏమిటో ! కబుర్లంటారు, రమ్మంటారు, ఆనక ఇలా చేస్తారు ఈ ఆడవారి మాటలకి అర్ధాలే వేరు.. "

14 comments:

  1. హాహాహా చితగ్గొట్టారు రమణి గారు,మొన్న కంది పచ్చడి,ఇవ్వాళ పప్పు గుత్తి తో,ఇంతకీ ఇనపటం అంటే ఏమిటండి?ఈ ప్రహసనం చదివాక వంశీ ప్రేమించు-పెళ్ళాడు సినిమాలో ఒక రసవత్తరమైన సన్నివేశం గుర్తు కొచ్చింది.

    ReplyDelete
  2. బాగుంది. టపా టపాకీ మీరచనల్లో పరిణతి కనిపిస్తోంది. ఇలాగే కొనసాగించండి. ఇంతకీ 'ఇనపడం' అంటే ఏమిటండీ? కలపడమా?? ఈ పదం ఎక్కడా విన్నట్లు లేదు.

    ReplyDelete
  3. రాజేంద్ర కుమార్ గారు, బ్లాగగ్ని గారు:నెనర్లు. "ఇనపడం" అంటే పప్పు మెత్తగా అవడానికి పప్పుగుత్తి తో బాగా కలపడం, కొంతమంది మెదపడం అంటారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా వాడే పదం "ఇనపడం".

    ReplyDelete
  4. ఒక నాడు రాత్రంతా రిక్షా తొక్కి లక్షరూపాయలు సంపాయించి మూరెడు మల్లెపూలు తెచ్చిన బుచ్చిబాబు .. ఈ నాడు ఏమయిపోయాడు? ఇనిపీ మెదపని కందిపప్పు ధగధగల్నే వెన్నెలగా భ్రమపడుతున్నాడు గదా?
    ఈ పర్యవసానానికి కారణమేవిటని విజ్ఞులంతా యోచించాలి.
    రమణి గారూ తెల్లచీర నల్లచీర అంతరాత్మలతో సహా పప్పుగుత్తి ప్రహసనం ఇంగువ తిరగమోతలాగా గుబాళించింది పొండి.
    ... అయినా భావుకత తమ సొత్తయినట్టూ, మగవారికి ఆ వూసే తెలియినట్టూ ఈ మధ్యన మన బ్లాగ్రమణులు చేస్తున్న దుష్ప్రాపగాండాని ఖండిస్తున్నా నధ్యక్షా!

    ReplyDelete
  5. మేమ్ ఎనపడం అంటాం !

    ReplyDelete
  6. మీ టపాలు వేటికవే సాటి గా వుంటున్నాయి.10/10
    ఇనపడం అన్నది నెను వినలేదు.మేము మెదపడం/కలపడం అంటాము.

    ReplyDelete
  7. హిహిహి.. కథ భలే ఉంది. చిన్న చిన్న వాటిలో ఆనందాన్ని అభినందనించలేరు కానీ.. అవి లేనప్పుడు మాత్రం చాల మిస్స్ అవుతారు ఈ మగవాళ్ళు. ఎది ఎటు వచ్చినా "ఆడవారి మాటలకు.." అనే థీసిస్ నే ఆశ్రయిస్తారు. బుజ్జి కథలో బోలెడు చెప్పారు.. నాకు బాగా నచ్చింది.

    ReplyDelete
  8. హిహిహి .. భలే ఉంది మీ కథ. చిన్న చిన్న వాటిలో అభినందించే ఓపిక ఉండదు కానీ.. అవి లేకపోతే మాత్రం భలే విసుక్కుంటారు వీళ్ళు. ఏది ఎటు వచ్చినా "ఆడవారి మాటలకు" అన్న థీసెస్స్ ని ఆశ్రయిస్తారు. బుజ్జి కథలో బోలేడు భావాలు కనబరిచారు.. అభినందనలు.

    ReplyDelete
  9. @కొత్తపాళీ గారికి: ఆడవారంతా అధికార పక్షం, మగవారంతా ప్రతిపక్షం అనుకొంటే , మీరు మీరే , మేము మేమే. సొ, అసలే అసెంబ్లీ లో అవిశ్వాస తీర్మానం జరుగు తోంది. అధ్యక్షా! బ్లాగ్ రమణుల మీద మరియూ అధికార పక్షం మీదా ప్రతిపక్షం పన్నుతున్న పన్నాగం లా వుంది ఈ అభియోగం. అధ్యక్షా! ప్రతిపక్షం వారికి నేను మనవి చేసుకొనేది ఏమనగా: మగవారు , అప్పుడో ఇప్పుడో, ఎప్పుడో ఒకసారి బుచ్చిబాబు అవతారం దాల్చకపోతే, బాపుబొమ్మలాంటి బార్యల అలకలు, రుస రుసల జడవిసురులు, మనసున తొణికే చిరునవ్వులకు దూరం అవుతారు. కావున బుచ్చిబాబులందరూ కాదు కాదు ప్రతిపక్షాలవారందరూ ఈ విషయాన్ని విస్మరించకూడదని మనవి అధక్షా!.మీరు నేర్పిన విద్యే నీరజాక్షా! అన్నారట మరి.. "ముదితల్ నేర్వగరాని……. "

    ReplyDelete
  10. రమణి గారూ, మీ వ్యాఖ్య అదిరందండి. మీరు రమ నుండి రమణిగా మారాక మంచి భావుకతతో రాస్తున్నారు, ఏమిటి కథ??

    కొత్తపాళీ గారూ, ఎందుకండి అలా ఉడుక్కుంటారు. మీ మీ భావుకతలు కూడా చూపించండి, టోపీలు తీయటానికి మేమిక్కడ సిద్దంగా ఉన్నాము. BTW "బ్లాగ్రమణులు" బాగుంది.

    ReplyDelete
  11. మంచి పాటలూ మాటలతో చాలా బాగుంది ప్రహసనం. యినపడమనే పదం నాకూ కొత్తే. పప్పు రుద్దడమంటాం మేము.

    ReplyDelete
  12. సిరిసిరిమువ్వగారు: ప్రతిపక్షాలు సభని నిరవధిక వాయిదా వేసినట్లున్నారు, మన సవాలు కి ఎవరు ఉలకలేదు, పలకలేదు. నాకో చిన్న సందేహం అందరూ బుచ్చిబాబులవడానికి ప్రయత్నాలు చేస్తున్నారేమో? ష్! నేను అన్నానని మళ్ళీ వాళ్ళతో అనకండి. మరీ పట్టు పడితే మనమే టోపిలు తీయాల్సివస్తుందేమో ...ఎందుకంటే .."రుస రుసలాడుతు విసిరిన వాల్జడ" , "నిలువవే వాలు కనులదాన" , "మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు" ఇవన్నీ ప్రతిపక్షాల కలం నుండి జాలువారినవే కదా...ఆలోచించండీ. భావుకతలో పైచేయి వారిదేనేమో. పిచుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకేలే అని మౌనం దాల్చారేమోనండీ.

    ఇక పేరులోనేముందండీ. తెల్లచీర రమ, నల్లచీర మణి వెరసి రమణి(అసలు పేరు మహిమ) ఓ మంచి మహిళ(టైటిల్ బాగుంది సినిమావాళ్ళడుగుతారేమే) అందుకనే అలా భావుకత వచ్చెస్తోందేమో.. అదేదో సినిమాలో శ్రీలక్ష్మి కి మాటలు వస్తే చేసినట్లుగా...

    @రానారే గారు: నెనర్లు.

    ReplyDelete
  13. చాలా బావుంది, దంచేసారు. మా వైపు "ఎనపడం" అంటారండీ.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.