3.06.2009

ఏ నిముషం నాది?


"అమ్మా కంప్యూటరు ముందు కూర్చుంటే ఒప్పుకొనేది లేదు ఎప్పుడూ కంప్యూటర్ ముందే ఉంటావు, కొంచం మమ్మల్ని కూడ చూడమ్మా!?

పొద్దున్న మా పాప అన్న మాటలవి. నిజానికి నిజంగా నాకు చాలా కోపం వచ్చేసింది, ఆ కోపం అంతా శ్రీవారి పై చూపించేసాను. అసలు నాకంటూ నేను ప్రత్యేకంగా ఇంత టైం అని కేటాయించుకొన్నానా? నేను ఏమి చెయ్యడం మానేసి కంప్యూటర్ ముందు కూర్చుంటున్నాను? నాకు సంభందించిన పనులన్నీ, ఒక బాధ్యత అనుకొని చేస్తున్నానా? లేక ప్రేమగా చేస్తున్నానా? నా ఇల్లు నా సంసారం అని అనుకోపొతే నేనిలా చేయగలనా" అంటూ ఆయన మీద విరుచుకుపడితే, ఓ గొప్ప చిరుమందహాసమిచ్చేసి....

"ఉరుమురిమి మంగలం మీద పడ్డట్లు , పాప ఏదో అంది అని నువ్వు నన్నాడిపోసుకోడం బాలేదు అత్తమీద కోపం దుత్త మీద చూపిచినట్లుంది" అంటూ వెళ్ళిపోయారు.

అంతేలెండి, వీళ్ళెప్పుడు అర్థం చేసుకొన్నారు కనక మనల్ని ....అలా అనేసుకొని అసలు నా రోజు వారి కార్యక్రమాలను ఓ సారి తరిచి చూస్తే , అసలు ఈ వారం రోజులు, ఈ 168 గంటలు, ఈ 10080 నిముషాలలో ఏ ఒక్క నిముషం నాది అని ఆలోచిస్తే..ప్చ్!

ప్రతి మనిషి తన జన్మకి పరమార్థం తెలుసుకొని ........
తనకోసమే కాక, పరులకొరకు బ్రతకాలి ....
తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి. ...

హ హ :) మన జన్మ పరమార్థం .... పిల్లలు, శ్రీవారు అంతే, అసలింక ఆలోచించడానికి టైమేది? అసలిందులో భాగంగా నేను ఒకసారి నా రోజు వారి కార్యక్రమాలను నా కళ్ళ ముందు గిర గిరా తిప్పుకొన్నాను.

పొద్దున్న 5 గంటలకి మెలుకువ వస్తే, కాస్త అటు ఇటు బద్ధకాన్ని బుజ్జగించి మళ్ళీ కలుద్దామని పంపించేసరికి 5.30 అవుతుంది. ఇహ పనులు నన్ను వేటాడి మరి ఆ పని అయ్యేదాకా నన్ను వదలవు.

మొదట అమ్మ పాత్ర, పిల్లలు స్కూలు, హడావిడి, వంట, ఈలోపులోనే ..ఇంటి ఇల్లాలి పాత్ర ... ప్రతిరోజు వచ్చే పేపర్ ,పాలు, పనమ్మాయి హడావిడి 'ఇల్లాలే ఇంటికి దీపం అనుకొని ఇవన్నీ ముగిసేసరికి ఆఫీసు టైం అవనే అవుతుంది.


ఆఫీసులో మేనేజర్ పాత్ర: ఫైల్స్ , ఒక్కొక్కళ్ళు రావడం, వాళ్ళ సందేహాలు తీర్చడం, లంచ్ టైం ఎవరో గుర్తు చేస్తే కాని తెలియడం లేదు. అక్కడ మన పాత్ర ముగిసింది హమ్మయ్య అనుకొనేలోపు, మళ్ళీ అమ్మ పాత్ర "నేనున్నాను" అంటూ మన పక్కకి ఒద్దికగా వచ్చేస్తుంది. "అబ్బా ! పొద్దున్న చూసాగా నిన్ను కాసేపాగి రా అని బుజ్జగిస్తే, "అహ! పిల్లలు ఆకలి " అంటున్నారు అని మారాం చేస్తుంది మరిక తప్పుతుందా, మళ్ళీ 'అమ్మ అన్నది ఒక కమ్మని మాట' అని నడుము బిగించాల్సిందే. మళ్ళీ అంతా అయి హమ్మయ్య! ఇప్పుడన్నా "నా కోసం" అంటూ ఈ చిన్ని సమయాన్ని కేటాయించుకొందామంటే, శ్రీమతి బహుమతి అంటూ శ్రీవారి పిలుపు. ఇక మరి ఈ 10080 నిముషాల్లో మన నిముషం ఏది?

మరి ఇంతలా చేస్తున్నా మా పిల్లలో, మా శ్రీవారో "ఎప్పుడు కంప్యూటర్ ముందే ఉంటావు" అని నిలాపనిందలు వేసేస్తున్నారు. మరి మీరు చెప్పండి ఈ టైం సమస్య నాదేనా? మీకందరికి ఉందా ? ఎందుకంటే మనందరికి ఉన్నది రోజుకి 24 గంటలే, వారానికి 168 గంటలే, 10080 నిముషాలే మరి నేనే ఇలా అనుకొంటున్నానా? అసలిందులో కేవలం " ఈ నిముషం నాది" అనుకొనే నిముషం ఏది? ఇప్పుడు నేను రాస్తున్న ఈ పోస్ట్ కూడ ఒకవిధంగా మీ కోసం , నా సందేహ నివృత్తి కోసం. మరి నా సందేహం తీరుస్తారు కదూ.... :-)

3 comments:

  1. సుమ గారూ ఈ పోస్ట్ రాయడానికి ఎన్ని నిమిషాలు పట్టి౦ది? ఎ౦త గొడవ జరిగి౦ది? బాగు౦ద౦డీ చాలా బాగా రాసారు. కేవల౦ అ౦దుకే నేను కూడా రాయట్లేద౦టే మీరు నమ్ముతారా!

    ReplyDelete
  2. మగవారికి మాత్రం?

    ReplyDelete
  3. suma gaaru ,nenu house wife kaabatti no problem!

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.