6.18.2009

యాదగిరిగుట్టలో (తెలియక పడ్డ) యాతనలు



ప్రహ్లాదుని రక్షించటానికి, అహోబిలంలో నరసింహస్వామి స్తంబాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచటం ఎవరికీ సాధ్యం కాలేదుట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్ధిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింప చేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై వుండమని కోరాడుట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై వుండటం లోక విరుధ్ధమని అక్కడికి సమీపంలో వున్న యాదగిరిలో లక్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్ధం కొలువు తీరుతానని బయల్దేరారు. లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలిశారు.




ఆయనవెంట ప్రహ్లాదుడూ, సకల దేవతలూ వచ్చి ఆయనతోపాటు ఇక్కడ కొలువుతీరి స్వామిని సేవిస్తూ వచ్చారుట.

రాక్షస సంహారంచేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగాడుట. ఆ ఆకాశ గంగ లోయలలోంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది. ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం వుంది. ఇందులో స్నానంచేసి స్వామిని సేవించినవారికి సకల కోరికలూ తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృ దేవతలు తరిస్తారు.

చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానంచేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులు వస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు.

మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. (పైన కథంతా వీకీపీడియా సౌజన్యంతో)

*******

ఆఫీసులో అందరం కలిసి అనుకొన్నాము కదా... అందులోను ఆదివారం, కాస్త ఆటవిడుపు.. మళ్ళీ ఇలాంటి రోజులు రావు అనుకొంటూ.. యాదగిరి గుట్టకి వెళ్దామని ఈయనని, పిల్లలిని అడిగాను. పిల్లలు మరో ఛాన్స్ ఇవ్వకుండానే "మేము రాలేమమ్మా! చాలా హోం వర్క్ ఉంది" అని దాటేసారు. ఈయన మటుకు చివరిదాక వస్తానని , చివరికి నా వల్ల కాదు అనేశారు. సరే! అనుకొన్నాము కదా ..అని ఆఫీసు స్టాఫ్ అంతా బయల్దేరాం . పొద్దున్న 9.30 కల్లా యాదగిరిగుట్టలో ఉన్నాము చాలా వేగంగానే వెళ్ళాము అనుకొన్నాము. 25 రూపాయల టికెట్కే రెండుగంటలు పడ్తుంతుంది ఇక దర్శనం ఇంకా ఆలస్యమవచ్చు. చూస్తుంటే రాను రాను రద్దీ పెరిగిపోతోంది..అందుకని 100 రూపాయల టికెట్ కోసం అందరం నించున్నాము. పూర్తిగా సగం దూరం క్యూలో నడిచానో... లేదో కళ్ళు తిరుగుతున్నాయనిపించింది. అర్థమయిపోతోంది రాత్రి భోజనం చేయలేదు. పొద్దున్న దేవుడి దర్శనం అయ్యేదాక తినకూడదని...అలా వెళ్ళడం, ఎంత ప్రమాదకరమో తెలిసొచ్చింది. సరే! నాతో వచ్చినవాళ్ళకి తిప్పలు తప్పలేదు , మంచినీళ్ళు అవి తెచ్చిచ్చి, వి.ఐ.పి టికెట్ తీసి ఒక 20 నిముషాలలో దర్శనం ప్రశాంతంగా అయ్యింది అనిపించి, అక్కడే కాస్త ఆ కబురు.. ఈ కబురు చెప్పుకొంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాము. మాలో ఒక ఐదురుగురు మటుకు ఓపికగా ముందు నుంచున్న క్యూలోనే ఉండి , టికెట్ తీసుకొని ఒక రెండు గంటల తరువాత దర్శనమం విజయవంతంగా ముగించి మా దగ్గిరకి వచ్చారు. ఇహ రాగానే అందరం ఆవురావురుమంటూ ఉన్నామెమో, తీసుకెళ్ళిన పలహారాలు నిముషాల్లో తినేశాము. నాకు కళ్ళు తిరగడం అనేది చిన్న అపశృతిలా అనిపించినా, దర్శనం మటుకు బాగా జరిగిందన్న ఆనందంతో ఉన్నాము అందరం.

అంతా సవ్యంగా అయ్యింది కదా! ఇక తిరిగి ఇళ్ళకు బయల్దేరుదామని నిర్ణయించుకొన్నాము. ఇంతలో ఎవరో అన్నారు.. మెట్లెక్కి వచ్చిన వారు తిరిగి మెట్లు దిగే వెళ్ళాలని. అదేమంత పెద్ద సమస్యలా అనిపించలేదు మా ఎవ్వరికి్, ఎందుకంటే మెట్లు ఎక్కేప్పుడు కష్టం, కాని దిగేప్పుడు శ్రమ ఏముంది అనుకొన్నాము, అదీ కాక ఆత్మారాముడు కూడా కాస్త చల్లబడ్డాడు కదా! అని అనుకొని అందరమూ సంతోషంగా బయల్దేరాము.
*****

అనుకొన్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్నీ.... జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని.....

చివరాఖరికి ఇలా అనుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఎండ నిప్పులు కక్కుతోంది అని వినడమే కాని ఎప్పుడు చవి చూడలేదు, చండ్ర నిప్పు అంటే కూడా అర్థం తెలీదు ఇన్నాళ్ళు. సినిమాల్లో ముస్లిం సోదరులు అసలు అలా నిప్పుల్లో ఎలా నడుస్తారో బాబోయ్ అని కళ్ళు గట్టిగా మూసేసుకొనదానిని. కాని ప్రత్యక్షంగా అక్కడ మేము అనుభవించాము, ఈ చండ్రనిప్పులు, నిప్పులు కక్కడం.


గుడి ప్రాంగణం కదా! అని వచ్చేప్పుడు కనీసం ఆలోచన లేకుండా మెట్ల కిందే అందరం చెప్పులు విప్పేసి, ఆవేశంగా ఎక్కేసాము కాని, దిగడం ఏమంత ఇబ్బంది కాదులే... అని అనుకొన్న మేము ఒక్కొ మెట్టు, ఒక్కో మెట్టు బాబోయ్ ఇన్ని మెట్లా? ఇంకెన్ని మెట్లు? అనుకొంటూ ... మా వల్ల కాదు అని కళ్ళనీళ్ళ పర్యంతం అవుతూ... అసలు ఒక రాయి రాయి కలిపి కొడితేనే నిప్పు రాజేసుకొంటుందే.. అలాంటి బండ రాళ్ళే మెట్లు అయినప్పుడు, నీడ అన్నది కనుచూపు మేరలో కాన రానప్పుడు, అన్ని నిప్పులు చెరిగే మెట్లు దిగుతున్నప్పుడు మా బాధ వర్ణనాతీతం.

కింద అరికాలిలో పుట్టిన ఆ వేడి నరాల్లోంచి తలవెంట్రుక దాకా పాకి , వణుకు పుట్టి నడవడం కూడా రాక ఇబ్బంది పడ్డాము కొన్ని చోట్ల, కొంతమంది చేతిరుమాళ్ళు, స్కార్ఫ్స్, చున్నీస్ ఏమి కాలికింద వేసినా కాలిమంట తగ్గదే. చివరి మెట్టు దగ్గిర చర్మం ఈ వేడికి మాంసం ముద్ద అవుతుందేమో అని హడలి పోయాము. అంతలా యాతన పడితే చివర్లో అక్కడి వాళ్ళు అన్నారు "ఇంత ఎండలో ఎందుకమ్మా చెప్పులు కింద వదిలారు. పైన వదలచ్చు " కదా అని... ఏమంటాము, ఏడవలేక నవ్వి, గుడ్లల్లో నీళ్ళు గుడ్లల్లో కుక్కుకొని, "ఇన్ని కష్టాలు పడ్డాము తండ్రీ మరి మమ్మల్ని గుర్తుంచుకో" అని తిరుగు ప్రయాణం సాగించాము.

********

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Loading...