"వదినా నేను జెనరల్‌గా అడుగుతున్నా... మీరు చెప్పిన ఇష్యూ అని కాదు..తండ్రి కొడుకుల మధ్య బేధాభిప్రాయం వచ్చినప్పుడు ఎవరు కాంప్రమైస్ అవ్వాలి?" ఒకానొక చర్చ సంధర్భంలో మా మరిది(మావారి కజిన్) ప్రశ్న.
"ఏ ఇష్యూ అయినా అనుభవం , వయసుపై ఆధారాపడి ఉంటాయి.. కొన్ని సర్దుకుపోవడాలు/కొన్ని నిర్ణయాలు .. మా విషయంలో అయితే మావాడు ఇంకా చిన్నపిల్లాడు కాబట్టి, వాడు చెప్తే ఇంకా అర్థం చేసుకోలేడు కాబట్టి తండ్రే సర్దుకుపోవాలి.. బాబు కి తరువాత అంటే సమస్య పరిష్కారం తరువాత నెమ్మదిగా చెప్పుకోగలగాలి.." నా సమాధానం.
అంటే .. చిన్నప్పటినుండి.. ఇన్నేళ్ళుగా తాను పెంచి పోషించుకుంటున్న ఇగోని ఇంత చిన్న విషయం గురించి కుదువ పెట్టాలా వదినా? నేనసలు ఒప్పుకోను….
“పెంచి పోషించుకొంటున్న ఇగో ఇంత చిన్న విషయం కోసం కుదువ పెట్టడం.. “ వినడానికి ఇది చిన్న విషయంగా తోచవచ్చు కాని అలా వదిలేస్తే ఇదే పెద్ద విషయం .. మళ్ళీ పూడ్చుకోలేని విషయం.. అలా పెద్ద విషయం అవకుండా పెంచి పోషించుకుంటున్న ఇగో ని వదలడం తప్పెలా అవుతుంది? అడిగిన ఆ సందేహానికి అర్థమంటూ ఉందా అసలు? చిన్నపిల్లాడయిన తన కొడుకు కోసం ఆమాత్రం తండ్రి సర్ధుకుపోలేడా? ఇలాంటి ఇగో ఉండడం అవసరమా?
సరే అసలు ఈ చర్చ ఎలా మొదలయింది అంటే..
మా మరిది మా బంధువుల పాపకి పరీక్షల విషయంలో కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నట్లుండి వాళ్ళ అన్నయ్యతో అన్న మాట..
"అసలు అన్నయ్యా! ఈ వైఫ్‌స్ ఏమి చేస్తారంటే.. పిల్లని తండ్రికి ఎగైనెస్ట్ గా (అంటే పిల్లలికి తండ్రిని శత్రువుని చేస్తూ) పెంచుతారు.. ఎలా అంటే "ఇదిగో బాబు ఆ పని చేయకు.. మీ డాడీకి చెప్తాను.. " అంటే " బాబు నాకు నువ్వు చేసే పని ఇష్టమే కాని మీ డాడీ నే కోప్పడ్తుతారు కాబట్టి చేయకు" అని బెదిరించడమట.. అలాగే "మీ డాడీ ఎప్పుడు అంతే.. ఇదిగో డబ్బులు నువ్వెళ్ళు సినిమాకి" అని.. డాడీని అసమర్థుడిని చేశేస్తారు అని కొన్ని సోదాహరణంగా చెప్పాడు. మౌనంగా విన్నాను.. ఏమిటీ విశ్లేషణ అనిపించింది నాకు.
నిజానికి మన పూర్వకాల ఆచార వ్యవహారాల ప్రకారం ఆలోచిస్తే అప్పటి గృహిణి ఇంట్లోనే ఉండడం వల్ల పిల్లలికి అమ్మ దగ్గర చనువు ఎక్కువగా ఉండడం వల్ల ఏది అడగాలన్నా అమ్మని అడగడం పరిపాటి.
అలాగే పిల్లల అలన పాలన తల్లి చూసుకుంటుంది అన్న ధీమాతో ఉద్యోగానికి వెళ్ళే తండ్రి.. వాళ్ళ చదువుల విషయంలోనో , ప్రవర్తన విషయంలోనో తనకి తీరిక చిక్కినప్పుడు వారిని పరీక్షిస్తూ ఒక అంచనాకి రావడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే ఎప్పుడో కాని మన దరికి రాని తండ్రి చదువుల విషయంలోనో, ప్రవర్తన విషయంలొనో తను అనుకున్న ప్రకారం ఉండకపోయేసరికి కాస్త మందలించడం వల్ల పిల్లలికి ఉన్న చనువు కాస్తా తగ్గి ఆ స్థానే భయం ఏర్పడుతుంది. ఆ భయం తల్లికి ఒక్కోసారి ఇలా సినిమాలకో షికార్లకో , అల్లర్లు చేస్తున్నప్పుడో బెదిరించడానికి ఉపయోగపడ్తుంది. అంతేకాని.. తండ్రిని శత్రువుని చేయడానికో , తండ్రిని దూరం చేయాడానికో మాత్రం కాదు. ఏ స్త్రీ అసలలా ఆలోచించదు, ఒకవేళ భర్త నిజంగా అసమర్థుడో, వ్యసన పరుడో అయితే ఆ అలవాట్లు పిల్లల దరికి చేరకుండా జాగ్రర్త పడడం జరుగుతుంది.
ఆనాటి ఆ ఆచార వ్యవహారాలే నేడు గృహిణి ఉద్యొగిని అయినా కొనసాగింపబడుతున్నాయి. తండ్రి పిల్లలికి దూరంగా ఉండే కాలం ఎక్కువ కాబట్టి తల్లి దగ్గరే పిల్లలికి చనువెక్కువ ఉంటుంది కాబట్టి, తల్లి ద్వారా రాయబారాన్ని కొనసాగిస్తున్నారు తప్పితే తండ్రి అసమర్థుడు, శత్రువు ఏమాత్రం కాదు. ఇవి వాళ్ళకై వాళ్ళు ఏర్పరుచుకున్న అభిప్రాయాలు.
ఇదే విషయం నేను అతనికి విశదీకరించాను. అదిగో అలాంటప్పుడు వచ్చిన చర్చ ఇగో.. దీని గురించి మా బాబు వాళ్ళ తండ్రి మధ్య వచ్చిన సమస్య.. నిజానికి వినడానికి చాలా చిన్న విషయమే.. విన్న తరువాత నా ఆలోచన అవునా కాదా తేల్చి చెప్పాల్సింది పాఠకులే.. ఎందుకంటే ఇంతమందీ ఇలా కొడుకుదే తప్పు అని చెప్తుంటే .. నా ఆలోచన విధానమే తప్పా? అని నన్ను నేను తరచి ప్రశ్నించుకుంటూ ఉంటాను.
బాబు పరీక్షల సమయంలో ప్రతిరోజు స్నేహితుడి ఇంటికి కలిసి చదువుకోడానికి వెళ్తూ ఉండేవాడు. ఓకరోజు వాళ్ళ నాన్న వాడు బయటకి అడుగు పెడ్తున్నప్పుడు.. ముందు పాపని పిలిచారు.. పాప “ పక్కన అమ్మాయితో మాట్లాడుతున్న డాడీ!” అంటే సరే అని బాబుని “చింటూ ఇటు రా “ అని పిలిచారు. వాడు వాళ్ళ అక్కలాగే “చదువుకోడానికి వెళ్తున్నా డాడీ!” అని వెళ్ళిపోయాడు. ఇహ వాళ్ళ నాన్నకి సర్రున కోపం వచ్చేసింది మళ్ళి మాట్లాడేంతలో వాడు వెళ్ళిపోతాడా.. అని కోపం . మాములుగా ఇది చాలా చిన్న విషయం. నేను చాలా లైట్ గా తీసుకున్న విషయం. ఎందుకు పిలిచారు అంటే కాళ్ళు నెప్పిగా ఉన్నాయి పట్టడానికి..
అది మొదలు దాదాపుగా మొన్న మొన్నటి దాకా.. అంటే వాళ్ళు ఊరు వెళ్ళే ముందు దాకా వాడితో మాట్లాడడం మానేశారు నా పతి దేవుడు.. మొదట్లో నేను పసిగట్టలేకపోయాను కాని వాడికి సంబంధించిన ప్రతి విషయం నా ద్వారా చెప్పిస్తుంటే అడిగాను.. “వాడితో మీరు మాట్లాడడం లేదా?” అని.. తరువా త బాబుని కూడా అడిగాను.. “అవునమ్మా ఆరోజు నుండి డాడీ నాతో మాట్లాడడం లేదు.. ఒక్కటే నేనేం తప్పు చేయలేదమ్మా! .. చదువుకోడానికి వెళ్ళడం తప్పా?” అని వాడు.. వాడు నా మాట వినకుండా వెళ్తాడా అని ఈయన.. ఇద్దరి మధ్యలో నేను.. ఏమి చేసాను?? అదే చెప్తున్నా..
ఇప్పుడు బాబుకి 15 వస్తున్నాయి అంటే ఉడుకు రక్తం దుడుకు స్వభావం.. అయినా నెమ్మదిగా చెప్పాను “ తప్పుకదా నాన్నా! డాడీ పిలిచినప్పుడు కొంచం ఓపికగా అసలెందుకు పిలిచారో ఎంటో కనుక్కోవాలి కదా.. అలా వెళ్ళొచ్చా?” అని.
వాడేమో “నేనేమన్నా తప్పు పని చేయడానికి వెళ్తున్నానా అమ్మా? చదువుకోడానికే కదా బయట నా ఫ్రండ్ వేయిట్ చెస్తున్నాడని వెళ్ళాను డాడీ అంత సీరియస్ అవుతారని అనుకోలేదు” అని..
ఇహ లాభం లేదని.. ఇద్దరం సరదగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్న సమయంలో ప్రశాంతంగా ఉన్నారు అని నమ్మకం కలిగిన తరువాత నెమ్మదిగా కదిపాను.. దాదాపుగా గంట మాట్లాడానని చెప్పొచ్చు నెమ్మదిగా బుజ్జగిస్తున్నట్లు.
”ఈ వయసులో మీరు వాడికి తండ్రిలా కాదు స్నేహితుడిలా ఉండాలి.. అంతే కాని మాట్లాడడం మానేస్తే వాడి ఆలోచనలో, అసహనాన్నో, ఆవేదననో లేదా ఆవేశాన్నో షేర్ చేసుకునేది ఎవరు? వాడిప్పుడే పెద్ద మగాడు అయిపోయిన భావనతో కనీసం వాడి పక్కన నన్ను కాని, వాళ్ళ అక్కని కాని కూర్చోనివ్వడం కూడా లేదు. ఏదన్నా జెండర్ పరమైన సమస్య వస్తే చెప్పుకోవాల్సింది మీకే ఆ చనువు వాడికి మీరు ఇవ్వాలి కాని నా మాట వినడా హన్నా ! అని అలిగితే ఎలా? ఫోని ఆ కోపాన్ని ఒకరోజు… రెండు రోజులు.. ఇలా దాదాపుగా 15 రోజుల దాకానా.. ? ఆలోచించండి.. మా నాన్నగారు లేక మా తమ్ముడు , అన్నయ్య ఆత్మన్యునతా భావంతో బాధపడ్డారు .. మీరు ఉండి వాడు అలా బాధ పడాలా?” అని చెప్పాను..
ప్చ్.. ఎదురుగుండా గోడకి చెప్పినట్లే అయిందిలెండి నా పరిస్థితి.. మొత్తం విని, “ ఇవన్నీ నీ కొడుక్కి చెప్పుకోవచ్చు కదా వాడి తలబిరుసు మానుకోమని..” అని.. అన్నారు.. ఏమి చేస్తాము కొడుక్కే నచ్చచెప్పి, వాళ్ళిద్దర్ని మాట్లాడేలా చేశాను.. కాని నా ఆలోచన ఎంతవరకూ కరెక్ట్.. ? పిల్లలు కాస్త అర్థం చేసుకునేదాకా తండ్రే సర్దుకుపోవాలి అన్నది నా ఉద్దేశ్యం.. అన్నిటికన్నా ముఖ్యం ఇగో .. పెంచి పోషించడం అన్నది పక్కన పెడితే.. అసలు తన పిల్లల దగ్గిర ఇగో అవసరమా?
నాకయితే ఈ విషయంలో తండ్రిదే తప్పని అనిపిస్తోంది.. ఒకవేళ తండ్రిది తప్పులేకపోయినా సర్దుకుపోవాలన్నది నా ఆలోచన.. అవునా? ప్చ్!! నన్ను అర్థం చేసుకోరూ.. . మీ ఆలోచన చెప్పండి..
నాకయితే ఈ విషయంలో తండ్రిదే తప్పని అనిపిస్తోంది.. ఒకవేళ తండ్రిది తప్పులేకపోయినా సర్దుకుపోవాలన్నది నా ఆలోచన.. అవునా? ప్చ్!! నన్ను అర్థం చేసుకోరూ.. . మీ ఆలోచన చెప్పండి..
*****
నన్నడిగితే ఇద్దరూ తప్పుచేసారు.
ReplyDeleteతండ్రి పిలిచినప్పుడు ఆగి ఉండాల్సింది. ఎందుకు పిలిచారో ఏంటో తెలుసుకుని తర్వాత తను ఏ పని మీద వెళ్తున్నాడో చెప్పి ఉండాల్సింది. ఊర్లో ఎవరికో కష్టం వస్తే టి.వి. లైవ్లో చూస్తూ ఏడ్చేస్తాం మరి ఇంట్లో అవసరాలు ఎరిగి ఉండాలిగా. స్నేహితులకి లవ్ విషయంలో గొడవలంటే కాలర్లెగరేసి, చొక్కాలు మడిచే యువతరం ఇంట్లో కూడా అదేలా భాద్యత తీసుకోవాలి కదా!
పిలుస్తున్నా వెళ్ళిపోయిన కొడుకు మీద కోపం రావటం సహజమే కానీ చదువుకోవటానికి వెళ్ళాడని తెలిసాక 15 రోజులు మాటలు మానేసి అలా ఉండాల్సింది కాదు. ఆ రోజు కాస్త కాలు నొప్పిగా ఉందిరా అందుకే పిలిచాను. ఇంట్లో పెద్దోడివి కాస్త అమ్మని నన్ను కనిపెట్టుకుని ఉండాల్సింది నువ్వే కదరా అని అర్ధమయ్యేలా చెబితే తనూ తెలుసుకునేవాడు.
ఇద్దరూ చేతులు ముందుకు చాచినపుడే షేక్ హ్యాండ్ సాధ్యమవుతుంది మరి.