11.20.2012

అహో! ఒక మనసుకి నేడే పుట్టినరోజు..


 చదువుతున్న, చూస్తున్న, వింటున్న అందరికీ .. మీ అందరికీ....


 ఎందుకూ అంటే నా ఈ పుట్టినరోజు.. ఎంతో ఆనందంగా జరిగినందుకు.. జరిపించినందుకు.




నన్ను ఆత్మీయురాలిగా భావించి ఎంతో వేడుకగా నా పుట్టినరోజు జరిపించిన నా బ్లాగు + ప్లస్ మిత్రులకి.. ఫోన్ ద్వారా శుభాకాంక్షలు అందజేసిన ప్రియ మిత్రులకి, ఊహించనంత ఆర్భాటంగా మా మేడం పుట్టిన రోజు అంటూ హంగామా చేసిన మా "పెన్సిల్ ట్యుటోరియల్"  పిల్లలికి అందరికీ,  ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

ముఖ్యంగా బ్లాగరు, మరియు ప్లసరు శ్రీమతి మాలా కుమార్ గారికి, 

అత్మీయురాలు అంటు అభిమానం చూపించిన శ్రీధర్ గారికి, 

అక్కయ్యా.. అంటూ ఆప్యాయంగా పిలిచి శుభాకాంక్షలందించిన  తమ్ముడు రాజేష్ కి,


విషెస్ ద్వారా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలందించిన లక్ష్మీ నరేష్ గారికి ,  
 వీరి పోస్ట్ల ద్వార నాకు శుభాకాంక్షలందించిన ప్రతి ఒక్క ప్రియ మిత్రునికి/మిత్రురాలికి అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. 


పెన్సిల్ ట్యుటోరియల్ చిన్న హంగామ చేసి నన్ను ఆనందింపజేసి సారధ్య బాధ్యత వహించిన మౌనిక, భరద్వాజ్, వరుణ్, ఐయెషా, హుస్సేన్, సుబ్రహ్మణ్యం, గణపతి, రాణి, తదితురలకి...  ప్రత్యేక కృతజ్ఞతలు.


ఇంకా నా FB  ఫ్రండ్స్ కి కూడా.. :) 





మళ్ళా ఇంకోసారి    ...............................................















శుభాకాంక్షలందించిన మిత్రులు . శ్రేయోభిలాషులు.




******


11.19.2012

మనసా తుళ్ళి పడకే.....


ఏయ్ ఏమయింది నీకు అలా ఉన్నావు?

ఎలా ఉన్నాను బానే ఉన్నాను కదా ఎందుకు మౌనంగా ఉన్న నన్ను అనవసరంగా కెలుకుతావు..

ఎప్పుడూ వాగుతూ ఉండే నువ్వు మౌనంగా ఉన్నావనే పలకరించింది ఏమయింది చెప్పు..

చెప్పడానికేముంది? ప్రతీసారి చెప్తున్నదే ప్రత్యేకంగా చెప్పేదేముంది? చిన్నప్పటినుండి అడుగుతున్నా నాకో తోడు చూడు అని.. విన్నావా? అసలు వింటావా?



నీకు తోడా నేను ఉన్నాను గా ఇంకేమి తోడు కావాలి?

నువ్వు నాకు తోడా.. హహహహహహహహ.. నువ్వు నేను ఒకటే అయినప్పుడు నువ్వు నాకు తోడు ఎలా అవుతావు.. పోని నువ్వు నేను వేరు వేరు అనుకున్న్నా కూడా మనిషిగా నువ్వు నీకు ఇంకో మనిషిని తోడుగా చేసుకున్నావు కాని నాకేరి నాకు ఇంకో మనసు తోడు కావాలి

ఇంకో మనసా ఎక్కడినుండి తీసుకురాను? తీసుకొచ్చిన ఎవరు అర్థం చేసుకునేవాళ్ళు? అయినా అంత అత్యాశ కూడా పనికిరాదు

ఆపు నాది అత్యాశా? నువ్వు హాయిగా నీకు మనిషిని తోడు చూసేసుకుని నాది అత్యాశ అంటావా? ఎప్పటిఎప్పటినుండి ఈ ఒంటరితనం ఎదన్నా మంచి ఊహ కలిగితే చెప్పుకోడానికి ఒక స్నేహం లేక.. సరే నీకు చెప్తే నువ్వలా గుండెల్లోనే కప్ప్ట్టెస్తావు.. నాకు అసలు నీతో విడాకులు కావాలి.. నీతో ఉండలేకపోతున్నాను.

నాతో విడాకులా.. నన్ను వదిలేసి ఎక్కడికెళ్తావు? నిన్ను అక్కున చేర్చుకునేవాళ్ళే లేరు నేను తప్ప.. పిచ్చి వేషాలు మాని అసలు నీ బాధేంటో చెప్పు..

బాధ.. ఏమని చెప్పను? చిన్నప్పుడెప్పుడో చెప్పావు.. నాకే కాదు నీకు కూడా, నిన్ను కూడా ఇష్టపడే మనిషినే ఎంచుకుంటాను అని ఏది? నా ఇష్టాలు నీకు తెలియవా? ఎన్ని సార్లు చెప్పాను.. అసలు నువ్వేమాత్రం చెప్పకుండా నీకోసం నేనున్నాను  అనే మనసు కావాలి అని.. విన్నావా నువ్వు తోడు తెచ్చుకున్న నీ మనిషి కూడా అందరిలాగే బాధ్యతలు, బంధాలు అంటున్నాడు.. పోని కనీసం ఎప్పుడన్నా ఒక్కసారన్నా తనంత తానుగా నీ మీద ప్రేమని కురిపించాడా లేదే.. నీ మీదే ప్రేమ లేనివాడు ఇక నీ లోపల ఉన్న మనసు సున్నితత్వాన్ని ఎలా తెలుసుకుంటాడు? అతను నాకు తోడెలా అవుతాడు?

ష్హ్! తప్పు అలా మాట్లాడకూడదు.. బంధాలు అంటున్నాడంటే ఇక పిల్లలు పెద్దవాళ్ళయ్యారు.. ఇంకా నాకోసం, నాకోసం మాత్రమే అని అనకూడదు.. బాధ్యతల మధ్య బందీ అంతను..

ఎహె ఆపు సోది గోల.. చిన్నప్పటినుండి ఇలాగే సర్ధిచెప్తున్నావు.. వాళ్ళెవరో ప్రేమించుకుంటున్నారని వాళ్ళిద్దరు ఎక్కడెక్కడికో వెళ్ళాలంటే నువ్వేదో తగుదునమ్మా అంటు మధ్యవర్తిగా వెళ్ళావు... నువ్వెళ్ళింది చాలాక నన్ను కూడా తీసుకెళ్ళి మరీ "చూడు వాళ్ళిద్దరూ ఒకళ్ళకోసం , ఒకళ్ళలా ఎలా ఉన్నారో, భలే అన్యొన్యంగా ఉన్నారు కదా మనకి (నీకు+నాకూ) అలాగే మంచి వ్యక్తి రావాలి అని నన్ను ఊరించలేదా? ఆరోజునుండి ఆ అందమయిన ఊహని అలాగే పదిలపరుచుకుని ఉన్నానే ఇంతవరకు నెరవేరిందా?  ఎంతసేపు నీ గోల నీదే కాని...


నీకు గుర్తుందా? అప్పుడెప్పుడో ఆ పిల్లాడెవరో తన ప్రేయసి పుట్టినరోజని ఆరోజు మీరు వెళ్తున్న వ్యాన్ అంతా చక్కటి పూలతో అలకరించి, వాన్ నిండా పూలతో నింపేసి పాదాలు కందకుండా నడిపించడం.... భలే ఉంది కదా ఇదిగో నీకోసం అంటూ అతను ఆ అమ్మాయికి ఇచ్చిన గిఫ్ట్ ఏడు వారాలు పేర్లు కల కర్చీఫ్ ఏరికోరి ఎంబ్రాయిడిరీ చేయించి ఇచ్చిన ఆ విధానం.. అప్పుడు నువ్వనుకొలేదు ప్రేమంటే అలాగే ఉండాలి అని.. ఏది అలా ఉందా నీకు.. నువ్వు గుర్తు చేస్తే కాని నీ పుట్టినరోజు తెలీదు ఈ మహానుభావుడికి ఇక  బహుమతులు కూడానా?”
ష్హ్.. అతన్నేమి అనకు పాపం.. ఎదో సంసారం కోసం తాపత్రయపడే వాడు..భవసాగరం ఈద లేక ఈదుతున్నవాడు..  నా ఆలోచనలన్నీ  అతనికి చాలా వింత గా ఉంటాయి.. వదిలేయ్..

ఆ ఆ! వదిలేస్తూనే ఉన్నా కొత్తగా పంతం పట్టుకుని కూర్చుంటే మటుకు మారే మనిషా ఏంటి? అయినా ..భవసాగరం, సంసారం అంటూ అంత పెద్ద మాటలెందుకు? నువ్వు లేకుండానే ఈదేస్తున్నడా ఒంటి చేత్తో నీ పుషోత్తముడు?మరీ చెప్పేస్తున్నావు...

పాపం నేనున్నాను కాబట్టే ఆ మాత్రమయినా లేకపోతే :(

కదా!  లేకపోతే అంతే కదా అదయినా ఆలోచించి.. నా గురించి తెలుసుకోవాలి కదా కనీసం నీ గురించి కాకపోయినా నీ లోపల ఉన్న నీ మనసుని గుర్తించాలి కదా .. మనసులోని మాటని మన్నించాలి కదా ఇంకా ఎన్నాళ్ళిలా మూగనోము పట్టను. ఇక నా వల్ల కాదు అటో ఇటో తేలిపోవాలి..

ఏంటి అటో ఇటో తేలిపోయేది ఏమి చేస్తావు నువ్వు ఏమి చేయగలవు? ఒక్కసారి కమిట్ అయిపోయాము ఈ జీవితానికి ఇంక దీనిని తిరగ రాయలేము.. మరీ అంత మిడిసిపడకు..

మిడిసిపడి మటుకు నేనేమి చేయగలను కాని.. ముందు నీనుండి మార్పు రావాలి.. నీకా భర్తని ఏవిధంగా మాట వినేలా చేసుకోవాలో తెలీదు.. ఎంతసేపు నీ పిల్లలు, నీ ఎదుగుదల అందరు కలిసి నన్ను ఇలా అదిమిపెట్టేసారు.. పుట్టినప్పటినుండి నీతో ఉంటూ నీ చితిలో కూడా నిన్ను వెన్నంటి వచ్చే నాకోసం మటుకు ఒక్క క్షణం కూడా ఆలోచించవు.. ఎలాగు నేను కమిట్ అయి నీతోనే ఉంటాననే/ఉంటున్నాననే  కదా ఈ అలుసు..

ఏయ్ అంత మాట అనకు.. ప్లీజ్. నువ్వు కాకపోతే నాకింకెవరు తోడు చెప్పు.. చిన్నప్పటినుండి నా ప్రతి ఆశ నా ప్రతి ఊహ, నా ప్రతి ఊసులు నీకే కదా నేను చెప్పుకున్నది.. ఎందుకలా నా స్నేహాన్ని కాదంటావు.. ఎంత నువ్వు నేను ఒకటి అయినా.. ఇప్పుడు నువ్వు నాకు చెప్పినట్లు నేను కూడా నీకన్ని చెప్పేస్తూనే ఉన్నా కదా.. ఏదన్నా దాచానా చెప్పు.. ప్రతివాళ్ళు మనకోసమే అన్న పిచ్చి భ్రమలో ఉండి, అది కాదు స్వలాభం కోసమనుకున్నప్పుడు ఇద్దరం ఒకరికొకరం ఓదార్చుకోలేదు.... గాలి, నీరు , అన్ని చితిలో కూడా తోడు వస్తాయి అంటారు కాని అదంతా ఉత్తదే అవి ఇక్కడే ఉంటాయి.. కాని నువ్వు నేను చితిలో కూడా కలిసే ఉంటాము..

ఎప్పటికీ నాకు నువ్వు , నీకు నేనే తోడు.. నీడ కూడా తోడురాదు.. కాబట్టి ఎక్కువగా ఆలోచించకు.. చూడు నువ్వలా బాధపడ్తుంటే నాకు కన్నీళ్ళు ఆగడం లేదు..

అయ్యో! వద్దూ.. నువ్వలా కన్నీరవకు.. నేనేమన్నానని.. బాధ అంతే.. నాగురించి పట్టించుకునేవాళ్ళు లేరు అందరూ నన్నిలా ఒంటరిగా వదిలేశారు, నువ్వేమో నీ వ్యాపకంలో బిజీగా ఉంటావు.. ఎప్పుడయినా కబుర్లు చెప్పుకుందమంటే ఇప్పుడు కాదని నిద్రపుచ్చేస్తావు.. అన్న బెంగ అంతే.. అయినా సరే నీకు నేను తోడు ఉంటాను సరేనా!..నువ్వలా కన్నీరవకు.. లేనిది కోరను, ఉన్నది మరవను.. ఒక పొరపాటుకు  యుగములు వగచను... మౌనం మటుకు నా భాష కాదు.. నేనిలా వాగుతూ నిన్ను విసిగిస్తూనే ఉంటాను.. నువ్వు బయటికి చెప్పలేకపోయినా సరే..:)

తప్పదు.. జీవనం సాగాలి కదా.. బతుకు బండి నడవాలంటే నీతో కబుర్లు చెప్తూ ఉంటే సాగదు కదా అందుకే బిజీ బిజీ.. అయినా నేను కూడా నిన్ను వదలను.. మనిద్దరం ఒక్కటే.. నీ ఆలోచనలను నేను పంచుకుంటూనే ఉంటాను.. నీతో మాట్లాడుతూనే ఉంటాను.. కాని నీ ఆలోచనలను నేనుగా వ్యక్తం చేయలేను.. తనుగా కనుక్కునే మనిషి తోడు నాకు లేదు.. అందుకే ఈ మౌనం..

అంతేలే.. అంతకన్నా మనం చేసేదేముంది కనక.. తోడు లేనని మటుకు అనుకోకు.. ఎదో కొంచం ఆవేశంలో తిట్టేశాను నిన్ను.. బుజ్జి పాపాయివి కదా నాకు.. రేపు నీ పుట్టినరోజు కదా మరి ఏమి చేస్తున్నావు?

హెయ్" అవును నాదే కాదు.. నాతో పాటు నువ్వు కూడా పుట్టావు కదా.. ఏమి చేద్దాము.. ?

ఆనందంగా ఉందాము.. సరదాగా మంచి మంచి రుచికరమయిన వంటలు చేసిపెడ్తాను నీకు.. సరెనా!... "పుట్టినరోజు శుభాకాంక్షలు" ఓ నా మంచి మనసా"

నేను రేపటికోసం ఎదురు చూస్తున్నా.. నీకు కూడా.. అంటే  నన్నింతకాలం, నా ఊహలని, నా ఆలోచనలని భరిస్తూ , నన్ను నవ్విస్తూ అప్పుడప్పుడు కోపానికి గురి చేస్తూ నన్ను నీలో దాచుకున్న చక్కటి నా ప్రియ నేస్తానికిరమణీయమైన నీ స్నేహానికి .......


"పుట్టినరోజు శుభాకాంక్షలు"
*******

11.14.2012

ఇంతలో ఎంత మార్పు

అందరూ బాగున్నారా? చాలా రోజులు/నెలలు అయింది కదా బ్లాగు వైపు చూసి.. ఎందుకో మరి బ్లాగు రాయాలి అన్న భావన కలగడం లేదు. గూగుల్ + లో తరచు "నేనున్నాను " అని అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా ఎదో వెలితి.. అదే ఈ బ్లాగు , రాయడం లేదన్న భాద,  రాయలన్న తపన , సమయం లేదా అంటే హాస్యాస్పదం. 24 గంటలు ఖాళీగా ఉన్నా,  ఆలోచనలు బ్లాగు దాకా రానీయడం లేదు. సరే ఇక ఈరోజు ఒకసారి బ్లాగు మిత్రులను ఒకసారి పలకరిద్దామని వచ్చాను. మరి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తానా?  ఏమో మాటిచ్చాననుకొండి మాటకి కట్టుబడి ఉండలేనేమో , ఇలా మూడ్ వచ్చినప్పుడు రాయలనిపించినప్పుడు కీ బోర్డ్ టక టకలాడించేయడమే :-)

ఏమి రాయడంలేదు అని నేనేమి రాయనప్పుడు .. రాస్తున్నప్పుడు సలహాలిస్తూ,  సహకరిస్తున్న / భరిస్తున్న మిత్రులందరికి ముందస్తూ ధన్యవాదాలతో.. :-)

****

దీపావళి పిల్లలికి భలే సరదా సరదా పండగ. నరకచతుర్థశి కి ముందే ఆఫీసు నుండి వచ్చేప్పుడో వెళ్ళేప్పుడో టపాసులు కొనేసేవాళ్ళం .. వాటిని ఎండబెట్టడం తుపాకులతో కాల్చుకోడం అవి మొదలెట్టేవాళ్ళు.. చిచ్చుబుడ్లు. చిన్న చిన్న సీమ టపాకాయలు కాలుస్తున్నప్పుడు.. నేను , శ్రీవారు పక్కనే ఉండి ఎన్నో జాగ్రత్తల మధ్య ప్రతీ దీపావళిని ఆహ్లాదంగా చేసుకుంటూ ఉండేవాళ్ళము.  ఒక బకేట్ నిండా నీళ్ళు, ఎందుకన్నా మంచిదని బర్నాల్, కాటన్, ప్రతీసారి అన్ని రేడీ గా ఉంచుకుని మరీ పిల్లలచేత  కాల్పించడమనే  కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసేవాళ్ళము. 

"చింటూ జాగ్రత్త,"
"అమ్మలూ జాగ్రత్త.."

 అంటూ ఇద్దరం వాళ్ళేమాత్రం ఆలశ్యం చేసినట్లనిపించినా ఎత్తుకుని దూరంగా వచ్చేవాళ్ళము అవి పేల్తున్నప్పుడు.. దీపావళి ఎంత ఆనందంగా చేసుకునేవాళ్ళమో , అంతా పూర్తయింత తరువాత "హమ్మయ్య " అని అంతే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేదానిని. 

మరి ఈరోజు.. 

నిజమే వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు. "లైట్ అమ్మా.. అవసరమా?  పండగ కాబట్టి ఎదో నాలుగు అలా అలా కాలుద్దాము అంతే!"  అని మూడు రోజులనుండి అంటున్నారు.. కాని చివరికి మావాడు బానే తెచ్చాడు అన్ని రాకెట్స్, బాంబులు , నాకిష్టమని చిచ్చుబుడ్లు.. ఇక నా గురించి చెప్పేదేముంది.. 

భయం .. 

ఇద్దరు దూకుడుగానే ఉంటారు వెనకా ముందు చూసుకోరు వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూడాలి ఇవే ఆలోచనలు ఉదయం నుండి  .. అనుకున్న సమయం వచ్చింది...  ఎప్పట్లానే అన్ని రేడీ చేశాను. 

కాకపోతే ఇదివరకటిలా వాళ్ళు కాలుస్తున్నప్పుడు అక్కడ ఉండగానే పేలిపోతాయేమో  అనే ఆదుర్ధా .. ఎత్తుకువచ్చేంత చిన్న పిల్లలు కాదు వాళ్ళు అన్న ఆలోచన, కాని వాళ్ళకి వెనకాల ఉండి , జాగ్రత్తలు చెప్పడమే అనుకున్నాము ఇద్దరం.. కాని మేము అనుకున్నట్లు జరగలేదు .. మా ఆలోచనలకి , అంచనాలకి అందనంతగా... ఇంకా చెప్పాలంటే మా కళ్ళు చెమ్మగిలేంతగా....

"అమ్మా రా, డాడీ రండీ.. "
"దా అక్కా... ఆ కాకరపువ్వొత్తులు తీసుకో... కాలుద్దాము మావాడి హడావిడి.. "
నా ఆలోచన అంతా వాడు అల్లంత దూరాన ఒక రాకెట్ పెట్టాడు... ఇక్కడ నేను కాకరపువ్వొత్తు(sparkles) రేడీ చేసి ఉంచితే అవి  కాలుస్తాడు అని..
కాని అలా జరగలేదు...
 " రా అమ్మా! నీకిష్టమయిన చిచ్చుబుడ్లు (flower pots) కాల్చు....


 అమ్మా జాగ్రత్త.. ,
"అదిగో అమ్మా బాంబ్ అక్కడ పెట్టాను దా!  అగరబత్తి  జస్ట్ అలా అంటించి వచ్చేద్దాము, "

"అమ్మా జాగ్రత్త అంటుకుంది దా వచ్చేయ్!.. అమ్మా!  నన్ను పట్టుకో!"
"డాడీ అమ్మకివ్వండి,  అమ్మ కాలుస్తుంది"
ఇలా ఇద్దరూ దాదాపుగా మా చేతే అన్నీ కాల్పించారు.. ఎంతలో ఎంత మార్పు....
ఒక విధంగా చెప్పాలంటే ఇది నాకు అసలయిన దీపావళి.. ఇది ఒక తల్లి ఆనందం.

ఈ ఆనందంతోనే మిత్రులందరికీ ..

*****
అసలు కొసమెరుపు చెప్పడం మరిచాను: నిన్న ఈ కాల్చడం హడావిడిలో  lakshmi bomb  నా చేతిలోనే పేలింది..... ఒక్క క్షణం ఏమి జరిగిందో అర్థం కాలేదు.. వెలిగించిన తరువాత వదిలేశాను అనుకున్నాను, కాని వదలలేదు వింత ఏమిటంటే ఏమి జరగలేదు.. కనీసం కాలింది అని చెప్పడానికి కూడా అవకాశం లేదు అన్నంత యాధాతధంగా ఉంది నా చేయి.. అదృష్టం .. ఏదో అదృశ్య శక్తి నన్ను కాపాడింది అని మనసులోనే థాంక్స్ చెప్పుకున్నాను. ఆ Time  లో  నేను కట్టుకున చీర కూడా మాములు సిల్క్ చీరే.. ఒక్క నిప్పు రవ్వ పడినా అంతే ఇక....  అయినా ఏమి కాలేదు చేతిలోనే పేలింది  అని చెప్పడానికి చేతిలో మిగిలిన బాంబ్  తాలుకూ పేపర్లే సాక్ష్యం. చేయి కాసేపు మొద్దు బారినట్లుగా అయిపోయింది అంతే.  భగవంతుడో లేక ఎదో అదృశ్య శక్తో మరింకేదో దీపావళిని నిరాశ పరచకుండా నన్ను అక్కున చేర్చుకుని   నా ఆనందంలో పాలు పంచుకుంది.
*******


5.13.2012

ఈ మథర్స్ డే కి శుభాకాంక్షలు


"ఆపరేషన్ ఎలాగోలా అయిపోతుందే! అసలా విషయం గురించి మాకు బెంగే లేదు కాని ఆ తరువాత రెండు నెలలు నువ్వు పూర్తి విశ్రాంతి తీసుకోవాలి కదా!  అప్పుడు నిన్ను  చూసేవారెవరు? మేము అదే ఆలోచిస్తున్నాము .. " 
నాకు జరిగిన ప్రమాద నిమిత్తం హాస్పిటల్ లో ఉన్నప్పుడు  అక్క  అన్న మాటలు అవి.


నిజానికి అసలు నేను ఎవరు చూస్తారు ఏంటి .. అన్న ఆలోచన నాకు రాలేదు. (అప్పటికింకా నాకు జరిగిన ప్రమాదం ఏ స్థాయో కూడా తెలీదు శస్త్ర చికిత్స అవసరం అని మాత్రమే చెప్పారు)  ఎందుకు రాలేదు అంటే ఏమో మరి, నేను ఇంటికెళ్ళగానే మళ్ళీ  రొటీన్ గా నా పని నేను చేసేసుకుంటాను అనుకున్నానో లేక ఎవరి అవసరం నాకు రాదన్న ధీమానో తెలీదు కాని నన్ను చూసుకునేది ఎవరు అన్న ఆలోచన నాకు రాలేదు.
******
అమ్మ.....

ఎంతని చెప్పను? ఎలా చెప్పను తన గొప్పతనం? అందరూ చాలా గొప్పగా ఆర్థ్రంగా చెప్తున్నారు మా అమ్మ ఇలా కష్టపడింది, అలా కష్టపడింది అని నేనే అక్షరాల్లో చెప్పలేకపోతున్నాను మా అమ్మ అమాయకత్వాన్ని, ఆవిడ అలసిన మనసుని.

ఏకాదశి ఉపవాస దీక్షలో ఉన్నా, (నాకు ప్రమాదం జరిగిన రెండోరోజు అంటే అమ్మ నన్ను చూడడానికి వచ్చిన రోజు ఏకాదశి )  చిన్న కూతురికి ఇలా జరిగింది అని తెలిసి,  ముందురోజు నన్ను చూడాలనిపించినా  అంత రాత్రి కొడుకుకి చెప్పి బాధపెట్టలేక, వింటే కొడుకు బాధపడతాడని, బాధని దిగమింగుకుని రాత్రంతా కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ , ఉదయం నా దగ్గరికి రాగానే కళ్ళనీళ్ళపర్యంతం అవుతూ, "నీకు ఇలా జరగడమేమిటే , నాకు జరిగినా బాగుండేది"  అని వల వలా ఏడ్చేసిన  అమ్మగురించి  నేనెంత చెప్పగలను?
కాస్త ఆవిడ కుదుటపడి మనసు నిమ్మళం చేసుకున్నాక, "అమ్మా! అక్క ఇలా అంది మరి.. "  అన్నా నసుగుతూ..నిజానికి అమ్మ నాదగ్గరికి రావాలని కాదు, నాకు తెలుసు ఆవిడకి ఇప్పుడు 80 ఏళ్ళు చేయలేదు. అసలు ఆవిడ అభిప్రాయం ఏంటి అన్నది తెలుస్తుందని, ఇంకా నా వాక్యం పూర్తి కానేలేదు " ఎవరుండమేమిటే పిచ్చిదానా! నేను లేనా, ఆమాత్రం చేయలేనా? ఇప్పుడు నేను చేయలేకపోతే బతికి అనవసరం నువ్వలాంటి దిగుళ్ళేమి పెట్టుకోకు, నేను ఉన్నాను భగవంతుడి దయవల్ల నువ్వు క్షేమంగా ఉన్నావు అంతే చాలు, నేను చేస్తాను ..రెండు నెలలు కాదు ఎన్ని నెలలయినా" అని కాస్త గట్టిగా, కొంచం నిక్కచ్చిగా చెప్పింది. ఇక నా పరిస్థితి చెప్పేదేముంది కళ్ళల్లో ఆనందభాష్పాలు. ఎంత అదృష్టవంతురాలినో కదా నేను... ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను అమ్మకి?

*****

నేను రెండునెలల విశ్రాంతి నిమిత్తం ఇంటికొచ్చిన తరువాత తన కంటిపాపలా చూసుకుంది. అర్థరాత్రి అపరాత్రి అని లేదు, "అమ్మా" అని పిలవడం ఆలశ్యం, "పిలిచావా అమ్మా! ఇదిగో వస్తున్నా!" అంటూ రావడం నా అవసరాలు తీర్చడం.. ఈ రెండు నెలల్లో, నాకు కొన్ని విషయాల్లో ఆవిడపై కోపం వచ్చింది, (అరిపిస్తోంది అని) బాధ కలిగింది(పెద్దావిడ చేయలేకపోతోంది అని) ఆనందం వేసింది (ఇది కావాలి , అని అడిగిన వెంటనే చేసిపెట్టడం) అన్ని వచ్చాయి ఒక్కోసారి రెండు,మూడు రోజులు మాట్లాడని సందర్భాలు ఉన్నాయి , టి వి తదేకంగా చూస్తోంది, బలవంతంగా నేను చూడలేక,  తలనెప్పి తెచ్చుకున్నా...(టి వి హాల్‌లోనే ఉంది) ఇన్ని రసాల మధ్య ఆవిడ కి నాకు మధ్య  సేవానుబంధం.. ఎలా వర్ణించను ఆవిడ గురించి. చెప్పడానికి ఇదంతా చాలా మాములుగా ఉంటుంది ,  కాని మనసు అనుభవించిన ఆ ఆనందం మటుకు మాటల్లో చెప్పలేను. ఒక్క మాట.. " మా అమ్మ " అంతే.

ఇప్పుడు చేసింది అని నేను ఆవిడని "మా అమ్మ " అని అనడం లేదు.. ఎప్పుడు నిర్విరామంగా చేస్తూనే ఉంటుంది. కోడళ్ళు వచ్చినా సరే. ఆవిడ 30 లో ఉండగానే నాన్నగారు నలుగురు పిల్లల బాధ్యత ఆవిడకి అప్పగించేసి, దేవుడి దగ్గర పని ఉందని వెళ్ళారు. ఇక అప్పటినుండి ఆవిడ మమ్మల్నందరినీ కంటికి రెప్పలా చూసుకుంది. అన్నయ్య ఢిల్లీలో చదువు, తమ్ముడు పసి పిల్లాడు అవడం వల్ల ఒంటి చేత్తో, ఏమి తెలియని అమాయకత్వంతో (అమాకత్వం ఎలా అంటే రాస్తే పెద్ద గ్రంధం అయిపోతుంది )  సంసారాన్ని అన్ని కష్టాలమధ్య నడిపించింది అని చెప్పొచ్చు. నలుగురిని ఒక తాటిమీదకి తీసుకొచ్చింది.
నాకు ఇంత మంచి కుటుంబం ఇచ్చినందుకు, నాకింతమంది బంధువుల్ని ఇచ్చినందుకు, వీళ్ళందరి మధ్య, నాకు  "కాంతమ్మగారి  చిన్న  కూతురు" అనే గుర్తింపు ఇచ్చినందుకు, ఇప్పటికీ.. ఎప్పటికీ .. ఆవిడకి కృతజ్ఞురాలిగా ఉంటాను.

ఈరోజు మథర్స్ డే..
పొద్దున్నే అమ్మే నాకు ఫోన్ చేసింది "ఎప్పుడూ నువ్వే చెప్పేదానివి మథర్స్ డే శుభాకాంక్షలు ఈరోజు ఇంకా చెప్పలేదు అంటూ... " నిజమే ఎప్పుడూ పొద్దున్నే చేసేసి శుభాకాంక్షలు చెప్పేదాన్ని, నిన్నంతా పాప EAMCET  హడావిడిలో మర్చేపోయాను ఇది మే రెండో ఆదివారమని.. అదే చెప్పాను అమ్మతో.. అలా అని శుభాకాంక్షలు చెప్పానా అంటే అప్పుడు కూడా లేదు ఎప్పుడు నీతోనే అమ్మా... నేను నీకెప్పుడు నా శుభాకాంక్షలు వుంటాయి ఈరోజే కాదు అన్నాను. 
ఈసారి నేను ఈరోజు ప్రత్యేకంగా ఈ మథర్స్ డే కనుగొన్నవారికి కృతజ్ఞతలు, ఈ మథర్స్ డే కి శుభాకాంక్షలు తెలియజేయాలి .. ఎందుకంటే నాకు ఇదంతా అందరికీ చెప్పగలిగే అవకాశం ఇచ్చినందుకు. అమ్మని అపురూపంగా తలుచుకునేలా చేసినందుకు. 
అందరికీ మథర్స్ డే శుభాకాంక్షలు. 
మా అమ్మకి వందనం-అక్షరాభివందనం.
*********
పైన అంతా నన్ను కన్నతల్లి గురించి చెప్పి , మీకందరికీ శుభాకాంక్షలు చెప్పాను. కాని నాకు ఇంకో తల్లి ఉంది. మొన్నటిదాకా నాకే తెలియని నేనే గుర్తించలేని నేను కన్న నా తల్లి, మా పాప. 

మా పాపలో ఇంకో కోణం ఇది. "ఏనాడయినా అనుకున్నానా కల్లోనయినా.. ఈనాడయినా కలగంటున్నానా" అనుకునేంతగా నాకు తనలోని ఇంకో కోణాన్ని చూపించింది  మా పాప. కాఫీ ఎంత ఇష్టంగా పెట్టి ఇస్తుందో, తాగిన గ్లాసులు "లోపలికి తీసుకెళ్ళమ్మా !"  అంటే అంత చికాకు పడిపోతుంది, "నాకు చెప్పకమ్మా అలాంటి పనులు " అంటుంది. ఎప్పుడయినా పనమ్మాయి రాకపోతే , "ఒక రెండు ప్లేట్స్ కడిగివ్వమ్మా!"  అంటే, కాళ్ళు చిందులు తొక్కేసి ఇల్లంతా ఏకం చేసేసి కాని ఆ పని చేసింది అని అనిపించుకోదు, ఆలాంటి మా పాపలోని మరొ కోణం, అదే ప్రమాద సమయంలో నాకు అన్నం తినిపిచడం, "చేతులు బానే ఉన్నాయి కదా! నేను తింటాను"  అంటే  "వద్దు నేనే తినిపిస్తాను"  అంటూ... ఆపరేషన్ అయి, ఇంటికొచ్చాక.. నా అంత భారికాయానికి "ఎన్నిరోజులయిందో స్నానం చేసి"  అంటూ నలుగు పెట్టి స్నానం చేయించడం జుట్టుకి సాంబ్రాణి పొగ.. ఇంకా ఎన్నో చేప్పలేని పనులు, నాకు తల్లి అయిన వైనం.. ఎలా చెప్పగలను , చేస్తున్నందుకు ఆనందపడాలో, చేయించుకుంటున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి నాది. నన్ను కళ్ళల్లో పెట్టి చూసుకున్న  నా చిట్టి తల్లికి అభినందనలు  తెలియజేసే అవకాశం ఇచ్చిన ఈ మథర్స్ డే కి మరోమారు శుభాకాంక్షలు.
*******

4.25.2012

ఆ ఎక్కువేమిటో ....ఈ తక్కువేమిటో..... :))


ఇదో చిన్న విశ్లేషణ.. అవకాశమిచ్చిన బ్లాగర్‌కి అభినందనలు. కాకపోతే ఎవరినీ నొప్పించాలని కాదు అలాగే ఒప్పించాలని కూడా కాదు...ఒకమనిషి మీద వారికి ఉన్న అభిమానం అభినందనీయమే ..... కాని మిగతావాళ్ళెవరూ గడ్డిపరకలు కాదు, అజ్ఞానులు అంతకన్నా కాదు అని చెప్దామని చిన్ని ప్రయత్నం... ఎక్కడ చదివానో గుర్తులేదు కాని బ్లాగులో ఒక వాక్యం చదివాను.. ఆ వాక్యాన్నే విశ్లేషిస్తున్నా.. వాక్యం చివర్లో ఇస్తాను.
*****
ఎదుటి మనిషిలో ఎదో ఒక ప్రత్యేకత ఉంటే ఆ ప్రత్యేకతని బేస్ చేసుకుని వారిని గౌరవించడం తప్పు కాదు కాని..... అదే ప్రత్యేకత అతిగా ఆదరించేసి, ఆ ప్రత్యేకతలు లేని వాళ్ళని చులకన చేయకూడదని నా అభిప్రాయం.. 

ఇప్పుడు మన బ్లాగుల్లోనే తీసుకొండి... సాధారణంగా ఛలోక్తులు విసురుతూ సమయస్ఫూర్తిగా మాట్లాడుతూ .... ఎంతటి అద్భుతమైన భావాన్ని ప్రకటిస్తున్నారు.... దాగి ఉన్న నైపుణ్యాన్ని అప్పుడప్పుడు అలా మనకి చూపిస్తున్నారు.. అలాగే పెయింటిగ్స్... ఫొటోస్ ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత.. కొత్తగా వచ్చారా, పాతవాళ్ళా అన్నది తరువాత విషయం కాని ఎవరి ప్రత్యేకతని వాళ్ళు చాటుకుంటున్నప్పుడు, ఆ ప్రత్యేకతని గుర్తించి గౌరవించాలి ...  అంతేకాని అవతలివారిని అజ్ఞానులనుకోవడం ఎంతవరకూ సబబు? 

ఎవరూ ఎవరికీ తక్కువ కాదు... ఒకళ్ళు రాయడంలో ఘనాపాటి అయితే ఇంకొకరు వంటల్లో, ఇంకొకరు పాటల్లో.. ఇంకొకరు... ఇంకో విషయంలో ఇలా ఇంతమంది ప్రత్యేక మనుషులు ఉన్న్నప్పుడు ఒకరిపైనే దృష్టి నిలిపి వారి అభిమానాన్ని చూరగొనాలన్న ఆలోచనో ఎమో కాని... మిగతావారిని అజ్ఞానులని చేయడం అభినందనీయం కాదేమో ఒకసారి ఆలోచించండి... ఆ వాక్యంలో చిన్న శ్లేష కూడా లేకపోలేదు ... సదరు బ్లాగరు నిర్వికారంగా అజ్ఞానులవైపు చూస్తున్నరా ?? (అది నిర్వికారంగా చూస్తున్న వారి  మనోగతమా) లేక రాసిన వారి మనోగతమా? ఎవరికి ఎవరు అజ్ఞానులు? 

నడత నేర్పిన మనిషిని, నడకనేర్పిన మనిషిని అమ్మగా, నాన్నగా, గురువుగా పోల్చుకుని అబినందించండి, గౌరవించండి.. ఇంకా చెప్పాలంటే ఆ భక్తి తీరలేదు అనుకుంటే కాళ్ళకి దండం పెట్టుకుని ఆ పాదధూళి శిరస్సున ధరించండి కాని వీళ్ళని పొగడడం కోసం ఎదుట ఉన్నవారందరినీ  అజ్ఞానులని మటుకు చేయకండి ... తప్పనిపిస్తే మన్నించండి.. 

వాక్యం:
"అఙ్ఞానులని చూస్తున్నట్టు నిర్వికల్పంగా _______________ నవ్వుతూ చూస్తుంటే,  మిగిలినవాళ్లందరూ ఆవేశంగా అంత్యాక్షరి ఆడేసేరు. "

4.24.2012

గెలుపు-ఓటమి

రాత్రి పాప... నా పక్కకి వచ్చి నా చుట్టూ చేయి వేసి "అమ్మా.. భయమేస్తోంది రేపే రిజల్ట్స్.. బాటనీ సరిగ్గా రాయలేదు...అనుకున్నవేవి రాలేదు..  ఎమవుతుందో.. ఎమో " అని.. భయపడ్తూ అంది. పాపకి ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో.. "ఏమి పర్వాలేదు, ఏమయినా నో టెన్సన్స్.. ఇప్పటితో జీవితం అయిపోలేదు ఓటమి ఎప్పుడు గెలుపుకి దారి అంతే.."  అనునయించాను కాని.. నా మనసులో నా పిల్లల గురించి మా బంధువర్గం అయితేనేమి.. దగ్గిరవాళ్ళ, దూరంవాళ్ళ ఉద్దేశ్యాలు ఈమధ్యే తెలియడంతో .. నాకెందుకో నేనే ఓడిపోతున్నాను అన్న బాధ కలిగింది..
******
"నీ పిల్లలికి క్రమశిక్షణ లేదు..." , అని ఒకళ్ళు, "ఇదిగో ఇలా చదివితే మటుకు అసలు మార్క్స్ రావు" అని ఒకళ్ళు, " వాడా ఎస్ ఎస్ సి అయితే కంప్లీట్ చేయడు.." అని ఒకళ్ళు.. "వాడికి కొంచం మాట్లాడడం నేర్పు "  అని ఒకళ్ళు.. ఇవి వింటుంటే నిజానికి నాకే భయమేసింది ..ఏంటి మరీ నా పిల్లలు అసలు క్రమశిక్షణ లేకుండా ఉన్నారా?  అని..  నాకు అవకాశం దొరికినప్పుడల్లా, చదువు విలువ, కష్టం, సుఖం, బాధలు, బంధుత్వాలు ఒకటేమిటి ఒక తల్లిగా  కాక ఒక స్నేహితురాలిగా చెప్తూ వచ్చేదాన్ని .. నాకు తెలియని ఇన్ని అవలక్షణాలు పిల్లలో వాళ్ళు చూడగలుగుతున్నారా అని మనసు మధన పడిన సందర్భాలెన్నో.. దగ్గరి మిత్రులైతే  "ఏమి లేదు రమణీ! వయసు కదా...  పిల్లలు అంతే దూకుడుగా ఉంటారు.. వాళ్ళకి ఆలోచించే వయసు వస్తుంది అప్పుడు చూడు నువ్వే ఆశ్చర్యపోతావు"  అంటూ ధైర్యం చెప్పేవారు.. ఏది ఏమైనా పిల్లలిద్దరు ఇప్పటి వరకు నా అదుపాజ్ఞాలలోనే ఉన్నారన్న నమ్మకం నాది.. ఇంకా సడలి పోలేదు..

నేను సాధారణంగా ఏ పిల్లలిని వాళ్ళు ఇలా వున్నారు అంటూ  వేలెత్తి చూపను ఎందుకంటే చిన్నప్పుడు జులాయిగా తిరిగి పెద్దయ్యాక పద్దతిగా ఉద్యోగం చేస్తూ ......కుటుంబ బాధ్యతలు స్వీకరించి పెద్దరికంగా, పెద్దతరహాగా మారినవాళ్ళని చాలా మందిని చూశాను..అలాగే క్రమశిక్షణ, అంటూ ఏ స్నేహితులు లేక ఇంట్లోనే ఉండి.. బిడియపడ్తూ ఉండేవాళ్ళనీ చూశాను... సో, నా నమ్మకం ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక మనసుని తాకే సంఘటన ప్రతి మనిషికి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది... అందరూ మారతారు.. తెలిసి తెలియని వయసు.. ముఖ్యంగా మా బాబు... వాడి వయసు, వాడి ఆలోచనలు చాలా పెద్దవాడినయ్యాను అన్న ఒక భావన.. వాడి దృష్టిలో , అమ్మకేమి తెలీదు.. అక్కకి తను అండగా ఉండాలి ... :)) అందుకే మాములుగా గేట్ బయట వాళ్ళ అక్క నించున్నా "ఏయ్! అక్కా లోపలికి వెళ్ళు" అని కసురుతాడు ఎదో పెద్ద భారం మొసేస్తున్న వాడిలా .. నాకే నవ్వు వస్తుంది.. సినిమాల ప్రభావం అని నవ్వుకుంటా..

అలాగే పాప ... ఇదో కొత్తకోణం చెప్పాలంటే.. రెండు నెలలు కాలు సమస్యతో మంచం పై ఉన్న నన్ను పసిపాపలా చూసుకుంది.. నా పనులు నేను చేసుకుంటూ ఉన్నప్పుడు , ఒక్క పని కూడా చేయవు అంటూ కసురుతూ ఉండేదాన్ని.. ఇద్దరికి గొడవ కూడా అయ్యేది.. అలాంటిది పరిస్థితి ఒక్కసారిగా మారేసరికి పాప నన్ను అమ్మలా చూసుకోడం.. నన్ను నేనే మర్చిపోయేంత పసిపిల్లనయ్యాను ఆ సమయంలో .. ఇలాంటి పాపకి క్రమశిక్షణ లేకపోవడం...:((

ఇవన్నీ గమనించి బంధువుల అవహేళన అవి , చూసి పిల్లలికి ఒకటే చెప్పాను.. "రాత్రింబవళ్ళు  కష్టపడి చదివేసి , మంచి మార్క్స్ తెచ్చుకొండి"  అని మాత్రం కాదు.. "మీకు లోకజ్ఞానం తెలియాలి నాన్న.. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియాలి.. అందరూ మనవాళ్ళు కాదు..  అలా అని అందరూ పరాయివాళ్ళు కాదు.. నా పిల్లలు మరీ అజ్ఞానంలో, మీరనే క్రమశిక్షణ లేకుండా  లేరు ... వాళ్ళు వాళ్ళ పరిథిలో తెలివైనవాళ్ళే" అని నేను వాళ్ళకి చెప్పిన మాటని నిలబెట్టండి చాలు అని...పాప కనక నిజంగా బాటనీ పేపర్ మళ్ళీ రాయాల్సి వస్తే .. బంధువుల నుండి నేను ఎదుర్కోవల్సింది మటుకు .. "మాకు ముందే తెలుసు .. మీ పాప చదవదని.. చదవలేదని.. క్రమశిక్షణ లేదు... మొ! కాని అలా జరగలేదు..... నాకు తన పరీక్షల టైంలోనే  యాక్సిడెంట్ అవడం పాపకి పెద్ద దెబ్బే ... అయినా పాప  మంచి మార్క్స్ స్కోర్ చేసింది.. పొద్దున్న రిజల్ట్స్ చూడగానే ఆనందభాష్పాలతో నన్ను చుట్టేసుకుని పరవశించిపోయింది నా చిట్టి తల్లి.. ఎంతసేపు కాలేజ్, ఇల్లు ఇదేనా అని మొన్న ఆదివారం బ్లాగు సమావేశానికి తీసుకెళ్ళాను.... చూసినవాళ్ళందరి దగ్గరా మంచి మార్కులే తెచ్చుకుంది.... బాబు కూడా తన విషయంలో అదే అన్నాడు "ఎస్ ఎస్ సి కంప్లేట్ చేయని చూద్దాం"  అనేవాళ్ళే ముక్కున వేలేసుకుంటారమ్మా!  నీకా డౌటే లేదు అని.. వాడు మాములుగానే 90%లో ఉన్నాడు నాకసలు సందేహం లేదు.... ముందు ముందు ఏమి జరుగుతుందో కాని ఇప్పటివరకు గెలుపే.. ఒకవేళ ఓటమైనా  మనసులో మధన పడ్తాను ..  పిల్లలికి మటుకు ..గెలుపుకి దారి వెతుక్కోమనే స్థైర్యం, ధైర్యం  ఇస్తాను కాని ఓడిపోయాను అని ఒప్పుకోదల్చుకోలేదు.... నా వాళ్ళు .. నా పిల్లల కోసం.
*****

4.23.2012

బ్లాగు క్రీడల 'రమణు(ణి)ల గాంచిన....:-)



సమావేశానికి రెండురోజుల ముందు వరూధినిగారి నుండి ప్రమదలందరూ ఒకసారి సమావేశమవుతున్నాము.. మీరు కూడా ఆహ్వానితులే అంటూ మేయిల్ ఆహ్వానం పంపారు.. మెయిల్‌తో పాటుగా మాలగారు పంపిన చూడ చక్కని ఆహ్వాన పత్రిక కూడా జోడించారు.
(కొంచం ఎడిట్ చేశాను )



ఇంతకీ మా సమావేశ ముఖ్యోద్దేశ్యం.. మన సుజాతగారు అమెరికా వెళ్తున్నారు కాబట్టి ఆవిడ మళ్ళీ మనల్ని ఎప్పుడు కలుస్తారో అని.. అందరం ఒక చోట కలుసుకుని కాసేపు కబుర్లాడుకుందామన్నారు (గెట్ టుగెదర్ అన్నమాట) ఇలాంటి అరుదైన అవకాశాలు అంత తొందరగా జారవిడుచుకోను నేను... సమావేశ ముహూర్తం ఆదివారం ఉదయం 11 గంటలకు.. వేదిక మాలగారి ఇంద్రభవనం.. ఇక కాదనడానికేముంది.. 

వాతావరణం బయట ఎండ రూపేణా నిప్పులు చెరుగుతున్నా, మాలగారింట్లో నవ్వుల పువ్వులు వెల్లి విరిశాయి.. మా ఇంటికి చాలా దగ్గర్లోనే వారి ఇల్లు తొందరగానే చేరుకున్నాము.. నేను మా పాప. మెట్లు ఎక్కుతుంటేనే మాలగారు సాదరంగా ఆహ్వానించారు.. అప్యాయంగా ఎదుర్కోలు చెప్తూ, పి ఎస్ ఎం లక్ష్మిగారు ఎదురొచ్చి కుశలమడిగారు.. లోపలికి అడుగుపెట్టగానే తెలియనివాళ్ళు చిరునవ్వు చిందించారు.. తెలిసిన వాళ్ళు   'హాయ్!' అంటూ చేతులెత్తి ఆహ్వానించారు... వెళ్ళగానే పరిచయ కార్యక్రమాలు అయ్యాక...సమావేశ విశేషాలు ముందుగానే తయారుచేసుకున్నారేమో, ఒక ఆట ఆడదామంటూ అక్కడివారినుద్దేశించి అనౌన్స్ చేశారు జి ఎస్ లక్ష్మి గారు.

జి ఎస్ లక్ష్మి గారు: అసలేమని చెప్పాలి ఈవిడ గురించి..  ఫలనా ఆట ఆడదాము, ఇప్పుడీ పని చేద్దాము, ఆ పని చేద్దామని ఎంతో చలాకీగా, సరదాగా గడిపి మమ్మల్నందరినీ అలరించారు ఈవిడ...శ్రీలలిత బ్లాగరి

జ్ఞాన ప్రసూనగారు: తీసుకెళ్ళిన వంటకాలను చూసి ఆసువుగా కవిత చెప్పి.. తన ముగ్ధ మనోహరమైన డ్రాయింగ్స్ చూపించి,  జి ఎస్ లక్ష్మి గారు ప్రతీ ఆటకి 'సయ్యా'  అంటే 'సై సై' అని సరదాగా గడిపిన ఎనర్జిటిక్  మహిళ ప్రసూన గారు.. ఎవ్రిడే సురుచి బ్లాగరి
సి ఉమాదేవి గారు: మౌనంగా ఉన్నా.. మధ్య మధ్యలో ఆటల్లో "నేనే సుమా " అని గెలిచి హుందాగా ఉన్నారు  చిన్నిగుండే చప్పుళ్ళు బ్లాగు ఈవిడదే

అన్నపూర్ణ గారు: ఇక ఈవిడ గురించి చెప్పక్కర్లేదు.. చూస్తే ఎవరో మనకి తెలీదు... పరిచయం లేనే లేదు అనుకుంటాము కాని , పరిమళం వెదజల్లుతున్న బ్లాగు నాదేనండి అంటారు.. :)  ఇంక తెలియకపోవడమేముంది ఎన్నో ఏళ్ళు పరిచయమున్నట్లు కలిసిపోము ఈ సాదా సీదా పల్లెటూరి అమ్మాయితో... చాలా చలాకిగా జోక్స్ చెప్పి నవ్విస్తూ కవ్విస్తూ గడిపారు పరిమళం బ్లాగు అధికారిణి అన్నపూర్ణ గారు. అన్నట్లు ఈవిడ పాటలు చాలా చాలా మధురంగా పాడతారండీ..

జ్యోతి గారు: జ్యోతిగారి గురించి నేను అందరికి చెప్పడం అంటే తాతకి దగ్గులు నేర్పడంలాంటిది.. కాబట్టి జ్యోతిగారిని పరిచయం చేసే సాహసం నేను చేయలేను... 'మీకంటే మాకే బాగా తెలుసు'  అన్నారనుకొండి నా చిన్ని మెదడు చిన్నబోతుంది మరి.. ;-)

మాలా కుమార్ గారు: ఈరోజు ప్రోగ్రాం అంతా వీళ్ళింట్లోనే కాబట్టి ప్రతీ ఆటలో, పాటలో, మిగతా విశేషాల్లో హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ మావల్ల వారి శ్రీవారి భోజనానికి ఇబ్బంది పాలు చేసి, మమ్మల్ని నొప్పించక, శ్రీవారికి నచ్చచెప్పుకుని, తానొవ్వక,  నేర్పుగా సమావేశాన్ని విజవంతం చేసిన "సాహితి"బ్లాగరి.

పి ఎస్ ఎం లక్ష్మి గారు: యాత్రల విశేషాలతో అలరిస్తూ.. పాత పాటల ఊపందుకుని మమ్మల్ని పరవశింపజేసిన యాత్ర బ్లాగరి.

వరూధిని గారు: "మువ్వగారు" అని బ్లాగర్లు ఆప్యాయంగా పిలుచుకునే బ్లాగరి,  అభినవ ఇందిరాగాంధి గారు. వరూధినిగారు కనపడరు కాని భలే చలాకి అండీ బాబు.. "సిరి సిరి మువ్వ" బ్లాగరి

సుజాత గారు: జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల అన్నట్లు సుజాత గారి పరిచయం నేను చేయడమంటే అబ్బే.. ఎంత రాసినా తక్కువే.. కాకపోతే సుజాతగారిని 'మిస్' అయ్యామనే చెప్పొచ్చు "మెరుపులా మెరిశావు.. " అన్నట్లు అందరం 'హమ్మయ్య!' ఇక పరిచయాలయ్యాయి కాసేపు పిచ్చాపాటి అనుకునేలేపు అంతే మెరుపులా మాయమయ్యారు ... అర్జంట్ పని ఉంది అని "మనసులో మాట " చెప్తూ.. తన సుపుత్రిక సంకీర్తనతో సహా.. 

స్వాతి గారు: మువ్వలా నవ్వకలా.. ముద్ద మందారమా.. ముగ్గులో దింపకిలా.. ముగ్ధ సింధూరమా అని పాడుతూ మమ్మల్ని అలరించిన ముద్దుగుమ్మ స్వాతిగారు.. నువ్వు నాతోనే ఉన్నట్లు నా నీడవయినట్లు, నన్నే చూస్తునట్లు ఊహలో (మాలగారి ఇంట్లో) అని వారి శ్రీవారిగురంచి తలచుకుంటూ... గడిపారు చక్రవర్తి "భవదీయుడు" బ్లాగరు అర్థాంగి స్వాతిగారు.

ఇక మరో సుందరాంగి సాయి సుజన: మాట్లాడాలా..  వద్దా అనే బిడియం, మౌనం మరో ఆభరణం.. ఏమి మాట్లాడినా  చిరునవ్వు చిందిస్తూ .. పెదవులు కదిలీ కదలకుండా ఆ ముద్దు మాటలు సుజన అంటే ఈవిడేనా.. అంత చక్కటి కవితలు అని అనుకోకుండా ఉండలేము... 



క్షమించాలి చివర్లో రావడం వల్ల రచయిత్రి మంథా భానుమతిగారిని మరిచాను.. మన్నించండి మేడం.. ఆవిడ రాసిన ఆదర్శ కుటుంబం కథ . కథాజగత్‌లో ఇప్పుడే చదివాను అదే లింక్ ఇస్తున్నాను.. ఆవిడగురించి నాకు తెలిసింది తక్కువ చివర్లో కలవడం వల్ల వివరాలు తీసుకోలేకపోయాను.


ఇక నేను: ఇదిగో మధురభావాల  సుమమాల నా బ్లాగు... నేను రమణినీ.. నాగురించి కొత్తగా చెప్పడానికంటూ ఏమి లేదు.. నేను  వెళ్ళాను మా పాప ఫోటోలు తీసింది...ఇలా..

అలా ఆరోజు ఎంతో ఆహ్లాదంగా సంతోషంగా గడిపాము. 
****

కొన్ని ముఖ్యమైన మరిచిపోలేని అనుభూతులు:

జ్యోతిగారు ఆ పాత మధురాలు పేరిట.. తెలుగు హిందీ భాషల పాత పాటల సి డి లు అందరీకీ బహుమనంగా ఇవ్వడం.

సుజాతగారు అమెరికా వెళ్తున్న సందర్భంగా "చిరుకానుక " (నా చేతుల మీదుగా) అప్యాయంగా అందుకోడం.. సంకీర్తన భాషలో గిఫ్ట్..

"మిస్ గెట్ టుగెదర్" గా వరూధినిగారు  బహుమానం అందుకోడం..

ఆటల్లో జ్ఞాన ప్రసూన గారు, ఉమాదేవి గారు, జి ఎస్ లక్ష్మిగారు, జ్యోతిగారు బహుమానాలు గెల్చుకోడం...


జ్ఞాన ప్రసూన గారి art  పెయింటింగ్స్ ....

ఇదంతా ఒక ఎత్తయితే..

రాత్రి 9 గంటలకి మాలాకుమార్ గారు పులిహోర బాగుందని వాళ్ళ శ్రీవారు చెప్పమన్నారని,  నాకు ఫోన్ చేసి చెప్పడం.. (మెచ్చుకోలు కొంచం తృప్తే కదా)

మాల గారి ఇంద్రభవనం లాంటి ఇల్లు..
****
గమనిక: ఏమన్నా, ఎవరినన్నా మర్చిపోతే క్షమించమని ప్రార్థన.