"లక్ష్మీ బ్రష్ ఏది? పేస్ట్ పెట్టావా?"
హు! మొదలయినట్లుంది భాగోతం, లేచినట్లున్నారు.. "ఆ వస్తున్నానండీ! ఇదిగో తెస్తున్నా"
"తెల్లవారుజామునుండి లేపుతున్నా! ఇప్పటికి లేచారన్నమాట, లేస్తే ఇక ఆగరుగా కాళ్ళ కింద నిప్పులు పోసేస్తారు.. అబ్బా! ఏమి మగవాళ్ళో ఏమో! సన్యాసంలో కలిసిపోతే బాగుండనిపిస్తొంది ఈ భవ సాగరం ఈదలేక, హు!! అయినా చేసుకొన్న వాళ్ళకి చేసుకొన్నంత అని , నాకు తప్పుతుందా ఇదిగొండి! బ్రష్! బ్రష్ మీద పేస్టూ.. దీనికి కూడా బార్య రావాలి, పని చేసుకొనివ్వరు పెట్టి పుట్టారు, ఈ పిల్లలు లేచారో లేదో, వీళ్ళొక్కళ్ళు రాక్షషులు నా ప్రాణానికి".
"అబ్బా! బుద్ధి పొరపాటై అడిగా, మొదలెట్టావా దండకం.. అయినా పొద్దున్నే పిల్లల్నెందుకు తిడతావు లక్ష్మీ? పడుకోనిద్దూ కాసేపు.."
"ఆ! మీకే ఎన్నయినా చెప్తారు, లేవడం, తయారవడం టింగు రంగా అంటూ ఆఫిసుకెళ్ళడం, మీకెమి తెలుస్తాయి మా ఆడవాళ్ళ బాధలు, ఇప్పుడు ఈ వెధవలు లేవకపోతే ఎప్పుడయ్యేను నా పనులు? నేనెప్పుడెళ్ళను ఆఫీసుకి? అయినా నేనీ గొడ్డు చాకిరి చెయ్యలేకపొతున్నాను, ఓ వారం రోజులు సెలవు పెట్టి అమ్మావాళ్ళింటికి వెళ్ళిపోతాను".
"అమ్మో బార్యమణీ!! అంత మాటనకు, నిను చూడక నేనుండలేను.... సరె ! కాని కాస్త కాఫీ ఇవ్వు, స్నానానికి వేణ్ణీళ్ళు పెట్టావా? ఆఫీసు కి టైం అయిపోతొంది ఓ పక్క!"
"అవుతుంది అవకేమి చేస్తుంది, బారెడు పొద్దెక్కాక లేచారు, పైగా ఏదో ప్రేమ ఉన్నట్లు , విరహ గీతాలొకటి.. నన్ను చూడక ఉండలేరా, నేను వెనకాల పడి పనులు చేయకపోతే ఉండలేరా? అయినా నాదే తప్పులెండి పెళ్ళయిన కొత్తలో మీకెందుకండీ శ్రమ అంటూ, అన్ని పనులు నేను నెత్తిన వేసుకొన్నాను చూడండీ! అది నా తప్పు. ఎవరి కర్మ కి ఎవరు బాధ్యులు లెండి, సుఖపడడానికి కూడ ప్రాప్తం ఉండాలి, ఉండండి కాఫీ తెస్తాను".
ఇంకా ఎక్కువ మాట్లాడితే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల కధలన్నీ మొదలు పెడ్తారు ఈ ఆడవాళ్ళు అని మిన్నకున్నాడు శ్రీనివాస్.
***
శ్రీనివాస్, సుబ్బలక్ష్ములకు పెళ్ళి అయి 10 యేళ్ళయ్యింది . శ్రీనివాస్ బ్యాంక్ ఉద్యోగి అయితే, సుబ్బలక్ష్మి ఓ ప్రైవేటు కార్పొరేట్ సంస్థ లో ఉద్యోగిని.. ఇద్దరు పిల్లలు. చక్కటి సంసారం. ఇద్దరిది అన్యోన్య దాంపత్యం. అరమరికలు లేని సంసారం.
మొదట్లో బాగానే ఉండేది, భర్త కి కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకొనేది, రాను రాను మరి వయసు ప్రభావమో,ఇంకోటో తెలియదు కాని లేని అసహయత, అంతా తనే చెయ్యాలి, అన్నీ తనే చూసుకోవాలి, అనే అశక్తతో, ఇంకోటో కాని ఈ మధ్య కాస్త చిరాకు ఎక్కువయ్యింది, అందుకే మాట్లాడితే, ఓ 10 రోజులు పుట్టిల్లు అంటుంది. పుట్టింటికని ఒకటికి నాలుగు సార్లు అంటుంది కాని, తనకు మటుకు తెలీదా ? పుట్టింట్లో తన పరిస్థితి, పెళ్ళయిన ఆడపిల్ల పుట్టింటి కి ఇక చుట్టంలా వెళ్ళాల్సిందే , అందుకే అన్నారు అలిగి అమ్మంటికి, చెడి చెల్లెలింటికి వెళ్ళకూడదని. ఇప్పుడీయనకి, ఈయన చెప్పే పనులకి అలిగి అమ్మ ఇంటికి వెళ్తే ... "ప్చ్! కుదరని పనిలే!" అయినా పెళ్ళికాకముందు ఎంత హాయి గా ఉండేది, అమ్మ చేతి గోరుముద్దలు, సుప్రభాతాల మేలుకొలుపులు, ఆ రోజులే వేరు.
***
"మొగాడికి మొగుళ్ళా పడుకొంటావు, ఓ శుక్రవారం లేదు, ఓ మంగళవారం లేదు, అయినా ఆడపిల్లలికి అంతంత సేపు ఎలా పడుకోబుద్దవుతుందే?? మా కాలంలో మేము తెల్లవారు ఝామున లేచి, కల్లాపి జల్లి ముగ్గులెట్టేవాళ్ళము, ఇప్పుడేముంది? అంతా సుద్దముక్కల భాగొతమాయే".. ఓ కల్లాపి జల్లడమా ముగ్గులు పెట్టుకోవడామా? లక్ష్మీ దేవి రమ్మంటే ఎందుకొస్తుందీ?? కుంచమంత కూతురుంటే కూడు కూడా మంచం దగ్గరికే వస్తుందంటారు. తాడిలా ఉన్నావు, కంచం నుండి , మంచం దాకా అన్నీ అమరుస్తే కాని, నీకు తెల్లారదు, .. లే! రేపొద్దున్న పెళ్ళి అయితే ఎలాగో ఏమిటో, ఇంత అరుస్తున్నా , నా కంఠ శోషే కాని, కనీసం కదలవు.
****
అలా అమ్మ మురిపంగా తిడుతూ లేపే సుప్రభాతంతో హాయిగా ఆఫీసు కి వెళ్ళి వచ్చేదాన్ని. ప్చ్! ఇప్పుడు మరీ తెల్లవారు ఝాము కన్నా, ముందుగానే లేవాల్సివస్తోంది. ఈయనకి అన్నీ అమర్చేసరికే ప్రాణం అలసిపోతోంది, అమ్మా! ఛస్తున్నాననమ్మా తల్లీ! ఈ మొగుడితో ఏ అదృష్టమో లేదా అదృష్టదేవతో వచ్చి తన పరిస్థితి మార్చేస్తే బాగుండును. "నను బ్రోవమని చెప్పవే...."అనుకొంటూ ఆ ఆలోచనల్లోనే .... మగతగా నిద్ర పట్టింది లక్ష్మి కి, నిద్రలో ఎక్కడికో దూరంగా పయనం అహా! ఏంటది? దూరంగా .... పాలకడలిలో శేషతల్పంపైన పవళించిన విష్ణు మూర్తి, పాదాలొత్తుతూ అమ్మవారు లక్ష్మీదేవి..తన గురించే ఏదో మాట్లాడుకొంటున్నారు, ఏంటి వీళ్ళిద్దరి మధ్య తన ప్రస్తావన...
***
పాలకడలి శేషతల్పం:
"స్వామీ ఏమిటా ధీర్ఘాలోచన"
"స్వామీ ఉలకరు, పలకరేమి స్వామీ"?
"నిరంతరం ఆ పరికరము పట్టుకొని తిరుగుచున్నారు, నాకన్నా అదే ఎక్కువయినదా స్వామీ, ఏమది? నా పని ఇలా మీ పాదసేవలో తరించుటయేనా ..నాధా! ... నాధా! నాధా!"
"అబ్బా! ఏమిటి దేవి ఆ హాస్యం? కాలిపై చూడు గోటి గుర్తులేలా భాదించుచున్నవో!? పిలిచిన పలకనా?"
"పిలిచి పిలిచి అలసితిని నాధా! మీరా పరికముతో పరవశించుచున్నారు, ఏమా పరికరం! "
"ఓహ్! ఇదా దేవి నా భక్తుడొకడు ఇచ్చినాడు, దీనిలో భక్తుల కోరికలు చూచుచూ, అచ్చిక బుచ్చికలాడుతున్నా."
"అచ్చిక బుచ్చికలా? అదేమి స్వామి కొత్తగా ఉన్నది."
"అదా అదీ! ఏమియునూ లేదు కాని, ఎందుకు పిలిచితివో చెప్పుము దేవి!"
"ముందు ఆ మాటకి భావం చెప్పండి నాధా".
"అచ్చిక బుచ్చికలనగా ఏమియునూ లేదు దేవి ! ముచ్చట్లు, ప్రత్యక్షంగా మనముందు లేని వారితో ముచ్చట్లు చెప్పుకొనుట అన్నమాట. "
"ఇంతకీ తమరి అచ్చిక బుచ్చికలెవరితో స్వామీ? ద్వాపరయుగంలో 16 వేల మంది గోపికలతోనా? కలియుగంలో శ్రీదేవి తోనా".
"ఎంతమాట దేవి! పక్కన నీవుండగా...."
"ఊ! మాదేముందిలెండి స్వామీ! .. నిత్యం పాదసేవయే పరమావధిగా భావించేడివాళ్ళము, అదియట్లుంచి, అక్కడ భూలోకంలో నా భక్తురాలు నన్ను దీనంగా అభ్యర్ధించుచున్నది స్వామీ, పతి తో వేగలేక తరుణోపాయం చెప్పమని, కొంచం అటువైపు దృష్టి సారించినచో..."
"ఎమది దేవి! నీ భక్తురాలికంత కష్టం వచ్చినదా? ఏమైనదామెకి, భర్త తాగుబోతా?, తిరుగుబోతా? లేక మందమతా?"
"అవి ఏమియునూ కావు స్వామీ! మీరు, మీ దివ్యదృష్టి అటువైపు సారించుడు, ఏమైననూ నన్ను వేడుకొన్న నా భక్తురాలిని నేను కాపాడవలెను, ఇది నా చిరు కోరిక స్వామీ!"
"తప్పకుండా దేవి ! మీరజాలగలనా నీ ఆనతి"
"పరిహాసములకిది వేళ కాదు నాధా!"
"దేవి! నీ భక్తురాలి కష్టమేమి అంత పెద్ద కష్టంగా అగుపించుట లేదు. అయినను నీవడిగితివి కాన .. చూచెదము, కాని ఇది మా పని కాదే?.. విధాత సృష్టి ఇది, పద దేవి! బ్రహ్మదేవుల వారినిఒకసారి చూచినట్లూ ఉంటుంది, కాస్త నీ సమస్యను పరిష్కరించే మార్గము తెలుస్తుంది."
బ్రహ్మలోకం:
పరవశంగా సరస్వతీ దేవి వీణ గానాన్ని వినాల్సిన, బ్రహ్మ దేవుడు ఒళ్ళో ఉన్న పరికరంతో (అంకోపరి)కుస్తీ పడుతూ, తనలో తను నవ్వుకొంటూ ....
"స్వామీ! అతిధులు వేంచేయుచున్నారు" అన్న సరస్వతిదేవి మాటకు తల ఎత్తి చూసిన బ్రహ్మదెవుడు, దూరం నుండి వస్తున్న లక్ష్మీ సమేత విష్ణుదేవుని చూచి సాదరంగాఆహ్వానించాడు. "చిరకాలదర్శనం! ఊరక రారు, మహానుభావులు అంతా కుశలమేనా?" అంటూ..
ఆడవారిద్దరూ వారి ఆభరణాల ముచ్చట్లలో మునిగిపోగా, బ్రహ్మ అడిగిన ప్రశ్నకి సమాధానమిస్తూనే, తాము వచ్చిన విషయం ఏకరువు పెట్టాడు విష్ణు మూర్తి.
"ఊ! కొంచం జఠిలమైన సమస్యే. ఏమి చేయుదము?" పక్కన ఈ సమస్యా పరిష్కారం ఎమిటా అని, చేరిన అతివలను చూసి నవ్వుచూ, "ఓ పని చేయుదమా? మగవారు తమ గురించి ఏమనుకొనుచున్నారో మరియూ వారి గుణ గణాలు మొ! ముందుగానే ఆడువారికి తెలిసేలా చేస్తే...ఉపయోగ కరంగా," ఈ మగవాళ్ళతో పడలేకపోతున్నాము బాబోయ్!" అన్న బాధ కొంతవరకూ మటుమాయం చేయవచ్చునేమో..."సాలోచనగా అన్నాడు విధాత.
"ఇది బహు బాగుగా యున్నది. ఒకసారి మానవులపై ప్రయోగించి చూచెదము! ముందుగా వివాహము కాని జంటలపై ప్రయోగించేదము, వివాహము అయిన వారిపై ప్రయోగించినచో, విడాకుల ప్రమాదం గోచరించుచున్నది. " అన్నాడు విష్ణు మూర్తి.
"అయినచో, పదండీ భూలోకంలోని సంజీవయ్య ఉద్యానవనమునకు, అక్కడ లెక్కలేని ప్రేమ జంటలు మనకు అగుపడగలరు". అమ్మవారు లక్ష్మి దేవి.
"దేవి! మనము తరువాత విహారం చేసేదము, భూలోకమునకు పోవలెనన్న నీ కోరికను నేను గమనించితిని కాని,చేతిలో ఈ పరికరములుండగా ఈ ప్రయోగంకొరకై మనమెళ్ళడమెందులకు?" అంటూ పరికరంలోనే ఉద్యాన వనంలోని ప్రేమ జంటలను ఆహ్వానించాడు విష్ణు మూర్తి.
విధాత కూడా తన ప్రయోగానికి ఉపక్రమించినవాడై, చాలా ఆసక్తి కనబరుస్తూ, భూలోకం వైపు దృష్టి సారించాడు, ఆ వెనుక అమ్మవార్లు లక్ష్మి సరస్వతులు కూడా..
*****
భూలోకంలో ప్రేమికుల పార్క్:
"రాజా! ఇంకెన్నాళ్ళు ఇలా పార్కుల చుట్టూ తిరగడం, మా నాన్న నాకు వేరే సంభందాలు చూస్తున్నాడు, ఎప్పుడూ ఏదో ఒక వంక చెప్పి నెట్టుకొస్తున్నా, మనము పెళ్ళి చేసుకొందామిక ఇప్పటికే ఆరు నెలలయ్యింది".
"అవును రాణి! చేసుకొందాము, రేపే మా అమ్మా వాళ్ళతో మాట్లాడి, మీ ఇంటి వచ్చే ఏర్పాట్లు చేస్తాను."
"అబ్బా! నువ్వెంత మంచివాడివి రాజా! నా మనసుని అర్ధం చేసుకొన్నావు, మన ప్రేమ సఫలం కాబోతున్నందుకు, నాకెంత ఆనందంగా ఉందో, చూడు! నా కళ్ళనుండి ఆనందభాష్పాలురాలుతున్నాయి, మనసు మూగబోతోంది, మాటలు కరువయ్యాయి".
" అబ్బా! ఈమె గొలేంటో, ఇప్పటికే స్నేహితులకిచ్చిన గడువైపోయింది, ఎంట్రా! ఇంకా లైన్లో పడలేదా అంటూ వాళ్ళు గోల, ఇటు ఈమేమో, ఆనందభాష్పాలు అంటూ భారి సినిమా డైలాగులు, అమ్మేమో, మీ మావయ్య బోల్డు కట్నం ఇస్తానంటున్నాడు, నువ్వా సుందరినే చేసుకోవాలి అని పొద్దున్నే చెప్పింది, స్నేహితుల పందెం, అమ్మ కట్నం గోల, ఇక్కడ ఈమే ఆనందబాష్పాల గోల, ఎంటో ఏది వదులుకోవాలో, ఏదో సరదాగా ప్రేమిద్దామని వస్తే పెళ్ళి దాకా తీసుకొస్తోంది ఈ రాణి"..
బ్రహ్మ దేవుడి ప్రయోగం వల్ల , అతను మనసులో అనుకొంటున్న మాటలు ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క అక్షరం పదాలుగా , ఆపై వాక్యాలుగా స్పృష్టం గా వినిపించసాగాయి. ఒక్కసారిగా తను కన్న కలలన్నీ ఎవరో కూల్చేస్తున్నట్లుగా అనిపించి, బాధతో తనముందున్న ప్రేమికుడిపై భధ్రకాళీ లా విరుచుకుపడింది రాణి.
"ఏయ్ రాణి ! ఏమి చేస్తున్నావు?? ఏంటి ఆనందభాష్పాలోస్తే ఇలా కొడ్తారా? , ఆగు ! ఆపు! ప్లీజ్ ఎందుకు కొడ్తున్నావు? నేనేమన్నాను నిన్ను?....."
***
"ఇక్కడ మీ ప్రయోగం సఫలం కాలేదు స్వామీ! అలా మందిరం వైపు వెళ్ళెదము , ప్రయోగం పరిచయం కాని వారిపై మన్మధుడిని పిలిపించి, ఆ మధనుడి శరం విడువమనెదము. అప్పుడు వారిరువురు స్వఛ్చమైన ప్రేమలో తెలియాడుదురు" అంది సరస్వతీ దేవి, బ్రహ్మ వైపు చూచుచూ.
"లెస్స పలికితివి దేవి! అటులనే గావించెద"
***
గుడి ప్రాంగణం:
"ఏయ్! చూడు ఎంత బాగున్నాడో! చేసుకొంటే అలాంటి అందమైన వాడినే చేసుకొవాలి, అబ్బ నా కలల రాకుమారుడిలా ఉన్నాడే అతను .. పద, పద, ప్రదక్షణాలవ్వగానే, పలకరిద్దాము, నాలో ఏదో జలదరింపు కలుగుతోంది. తొలి వలపు అంటే ఇదేనేమో" అంది వాణి తన స్నేహితురాలు వసుధ తో.
"అవును చాలా అందంగా , హుందాగా ఉన్నాడు, నీకు సరి జోడే, పద వెళ్ళి పలకరిద్దాము". అంది వసుధ
"హాయ్! ఐ యాం వాణి, గ్లాడ్ టు మీట్ యు!".
మంచి ఫిగర్,రాత్రి తను హోటల్లో ఎంజాయ్ చేసినదానికన్నా సుపర్ గా ఉంది, తనే వచ్చి పలకరిస్తొంది కదా! తొందరగానే పడేట్లుంది, చూద్దాము! నెమ్మదిగా దారిలోకి తీసుకు రావాలి , ముందుగా పలకరించేద్దాము. తనలో తను అనుకొంటూ..
"హాయ్! ఐ యాం వేణు!". పలకరించాడు వేణు.
ఇంకా పూర్తిగా మాటలు పూర్తికాలేదు, విస, విసా అక్కడినుండి వెళ్ళిపోయింది వాణి ప్రత్యుత్తరమివ్వకుండా, బ్రహ్మదేవుని ప్రయోగ ఫలితమది.
***
"స్వామీ! భూలోకంలో! ప్రేమకి విలువలేకున్నది , ఇది యేమి కలి కాలం? ఎవరునూ పెళ్ళి సంగతులు మాట్లాడుట లేదు, ఈ ప్రయోగమేదో వికటించుచున్నది, ఏమి చేయుదము?? మార్పులేమన్నా చేసినచో ఫలితం కలుగునేమో ?" అంది అమ్మవారు లక్ష్మీ దేవి.
"అవును దేవి! నాకుయునూ అటులనే అనిపించుచున్నది. ఓ పని చేయుదము! మగవారు పని చేయునట్లూ, ఆడువారు ఇంట్లో, మగవారివలే సేవలందుకొనునట్లు చేసినచో, తరువాత మగవారికి , వీరు పడు కష్టములు తెలుసుకొని, ముందు, ముందు జాగూరకతో ఉండేదరు ఎమందురు బ్రహ్మదేవా? " అన్న విష్ణుదేవుని మాటలకు తన అంగీకరం తెలిపెను బ్రహ్మ.
"ఎవరిపైనో ఎందులకు నాధా! నా భక్తురాలు సుబ్బలక్ష్మి పైన ప్రయోగించేదము." తన భక్తురాలి ఆవేదన తీర్చవలెనన్న/తీరుతుందన్న ఆనందంతో అన్నది లక్ష్మీ దేవి.
***
"ఎవండోయి! శ్రీమతిగారు లేవండోయి పొద్దెక్కింది" అన్న మాటలకి ఉలిక్కిపడి లేచింది లక్ష్మి .
"అమ్మో!ఆఫీసు టైం అయిపోతొంది అని, లేచేసరికి, ఎదురుగుండా కాఫీ కప్ తో తన శ్రీనివాసులుంగారు.
"అబ్బా! మీరెంత మంచివారండీ"
" ఈరోజునుండీ అన్నీ నేనే చేస్తాను", పద బ్రష్ చేసుకొందూ గాని, ఇదిగో బ్రష్, పేస్ట్, వెళ్ళు నువ్వొచ్చేసరికి పిల్లల్ని లేపి వాళ్ళని స్కూళ్ళకి రెడీ చేస్తాను" .
"ఏంటి మీరేనా? కలయా? నిజమా? మీరు నా పతి, మై హజ్బండ్ నాకు పని చేసి పెట్టడమా.. నాకెంత ఆనందంగా ఉందో!. అయినా అన్నిపనులు మీరెందుకండీ ? సరె అన్నీ మీరే చెయ్యనక్కర్లేదు, నేను చేస్తుంటే, పనికి పది పనులు పెట్టకుండా , మీరు మధ్య మధ్యలో కాస్త ఆసరగా ఉంటే చాలు. " తన అదృష్టానికి మురిసిపోతూ , ఎంతో మురిపెంగా భర్తని చూసుకొంటూ చెప్పింది సుబ్బలక్ష్మి.
*****
"ఏయ్! లక్ష్మీ! లక్ష్మీ! ఏంటా మొద్దు నిద్ర! ఎంత ఆదివారమైతే మటుకు, ఇంట్లో మొగుడూ పిల్లలు ఉన్నారు , ఏమన్నా చేసిపెడ్దాము అన్న ఆలోచన లేకుండా.. లే! లే! సాయంత్రం నాలుగవుతోంది, కాస్త వేడి వేడి గా, పకోడిలు వెయ్యి, అదిగో చూడు ! పనమ్మాయి వచ్చింది, కాస్త చూడు".
ఉలిక్కిపడి లేచింది లక్ష్మి! "ఏంటి భర్త అరుపుల్లా ఉన్నాయి, తనింతవరకు నిద్రలో ఉందా? అంటే లక్ష్మీ దేవి, బ్రహ్మదేవుడు, పార్కులు, అన్నిటికన్నా ముఖ్యం, భర్త, కాఫీ ఇవన్నీ కలా? ప్చ్! కలేనా? "
"అయినా నా పిచ్చి కాని, ఇలాంటి మార్పులు మాత్రం మగాణ్ణి మార్చుతాయా? ఈ సంసార సాగరం ఇలా సాగాల్సిందే, ఇందులోనే ఆనందం ఉందని , ఆడవాళ్ళు మురిసిపోవాల్సిందే ఈ చెంచాడు భవసాగరానికి మళ్ళీ ప్రయోగాలొకటి" అనుకొని నీర్సంగా నిట్టూర్చింది.
"లక్ష్మీ! లక్ష్మీ! " భర్త పిలుపు.. కాదు కాదు అరుపు..
"ఆ! వస్తున్నానండి ఎందుకలా అరుస్తున్నారూ.... "
"కాస్త ఆ ఫాన్ ఇటువైపు తిప్పుదూ.., వేడి వేడి పకోడీలు, కాఫి గట్రా..."
మళ్ళీ మొదలు...
కొత్త పాళీ గారు, LED మహిమల కథ రాయండి ... అన్నదానికి స్ఫూర్తి ఈ కథ.
ఆడవారి కష్టాలను చాలా చక్కనైన కథాప్రయోగంతో వర్ణించారండి.
ReplyDeleteనిజమే, పక్కనే ఉన్న పెన్ అందుకొనే దానికి కూడా ఒళ్ళు హూనమయ్యే పనిలో ఉన్న భార్యామణిని పిలిచే వారెందరో!! అదేమంటే బయటి పని మాది, ఇంటి పని మీది అంటూ ఎదురుదాడికి దిగే వారెందరో!! నిజమే కదా ఇల్లాలికి ఎప్పుడు తీరెను కదో కదా ఈ కష్టాలు?
ఆలోచింపజేసారు. బాగుంది.
ReplyDeleteRealistic characterizations
ReplyDeleteWell paced narration.
Good job.
ముచ్చటగా మూడోసారి కూడా మీరే మొదటి కథకులు, అభినందనలు. కథ బాగుంది కాని కథా విషయం నుండి కాస్తంత deviate అయినట్లున్నారు.
ReplyDeleteఇచ్చిన విషయం ఇది--- "అప్పటినించీ పుట్టిన మగ పిల్లలలో ఒక విచిత్రమైన సిస్టం ఇన్స్టాల్ చేశారు. దాని ఫలితంగా, అబ్బాయికి యుక్త వయసు వచ్చాక, ఎవరన్నా అమ్మాయిని చూసి పెళ్ళాడదాము అనే దృష్టి కలిగితే చాలు, ఆ ఆమ్మాయికి అబ్బాయి నుదుటిమీద మెరిసే LED display లో ఆ అబ్బాయి గుణగణాలు కనబడి పోతాయ".....
మరి మీరేమో directగా యుక్త వయసు అబ్బాయిల మీదే ప్రయోగించేసారు:).
@ప్రతాప్ గారు, @ మహేష్ గారు, @ కొత్తపాళీ గారు నెనర్లు.
ReplyDeleteసిరిసిరిమువ్వ గారు: నెనర్లు. కథని కొత్తపాళీ గారు చెప్పినట్లుగా అప్పుడే పుట్టిన బాబు లో ఇన్స్టాల్ చేసి.. కదా, కాని అలా చేయడం వల్ల అది ఇంకో 15 పేజిల కథ అవుతుంది, ఇక్కడ పాయింట్ "మగవాళ్ళ వల్ల ఆడవళ్ళు కష్టాలు పడిపోతున్నారు" అంటే అలా కష్టపడేది, యుక్తవయసొచ్చాక, పెళ్ళయ్యకే కదా, అసలు ఆ ప్రయోగమనే ది చేస్తే ఇలా జరుగుతుంది అని ఆ కథ లో చెప్పాను, ఇంకోటి టైటిల్ చూడండి "మనం ఈదుతున్నాము ఓ చెంచాడు భవసాగరం " అన్నా, నిజమేనంటారా? ఈ మాత్రం దానికి, ప్రయోగాలంటూ బయలుదేరితే, లాభం ఉండదేమో అని చెప్పడమే ఈ కథ ఉద్దెశ్యం.
కొత్త పాళీ గారు మార్చుకొవచ్చు అనే చిన్న సూచన కూడా చేసారుగా ఆ టపాలో, ఇలా అయితే బాగుంటుందేమో అని అలా యుక్తవయసు వచ్చేవారిమీద అని రాసాను.
ఏదో సరదాగా రాసేసాను అంతే.కొత్త పాళీ గారి టపా చదువుతున్నప్పుడే ఐడియా అలా వచ్చింది. ఇలా మీ ముందు పెట్టేసాను, మొదట, చివర అనేదేమి లేదండి.
బాగుందండీ మీ కథ!! వాస్తవాన్ని..ఊహనీ కలిపిన తీరు బాగా అనిపించింది.
ReplyDeleteచాలా బాగుందండీ...
ReplyDelete