11.01.2010

ఏకాంత సేవ - ఏ ' కాంత ' సేవ?

అప్పుడెప్పుడెప్పుడో, అంటే మొన్నీమధ్యే నాకు పెళ్ళి కాకముందు , అంటే నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో, ఎదో రాజకీయ గొడవల వల్ల , ఆ విద్యా సంవత్సరం సాగదని అంటే ఖాళీ గా కూర్చోవడం ఎందుకని , మన అప్పటి ముఖ్యమంత్రి యన్.టి ఆర్. గారి దగ్గిర ఉద్యోగంలో చేరాము నేను మా ఫ్రండ్. ఆరు నెలలు చాలా సరదాగా గడిచిపొయాయి. 15 మంది అమ్మాయిలం, ఇంకో 5, 10 మంది దాకా అబ్బాయిలు. అమ్మాయిల్లో ఒక అమ్మాయికి మాత్రమే పెళ్ళి అయ్యింది. మిగతా అందరము చదువుకొంటూ, ఏదో అనివార్య కారణాల వల్ల ఇలా ఉద్యోగం చేస్తున్నవాళ్ళమే. సాయంత్రం వర్క్ అయిపోగానే , ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళడానికి చాలా తొందర పడేది. మాకు కేటాయించిన వ్యాన్ రెండో ట్రిప్ లో మేము వెళ్ళేవాళ్ళము. ఆమె అంతవరకు కూడా ఆగకుండా బస్ ని ఆశ్రయించేది. "ఏమిచేస్తారు ఇంటికెళ్ళి "? అని అడిగితే, అప్పుడంది కదా ఆమె, “మీకెమి తెలుస్తాయి మా బాధలు? రేపొద్దున్న పెళ్ళి అయ్యక తెలుస్తాయి ఏకాంత సేవమ్మా… ఏకాంత సేవ చెయకపోతే ఏ ‘కాంత’ నో చూసుకొంటారు “ అని.
****
మళ్ళీ ఇంతకాలం తరువాత ఆ మాటలు నాకు గుర్తోచ్చాయి. పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేసారు కాని, ఈ ఏకాంత సేవ చేసుకొనే అవకాశం ఇంతవరకు రాలేదు నాకు.

ఇప్పుడైనా ఎందుకు గుర్తొచ్చిందంటే, మావారి కల నేను నిజం చేయలేదు అని, ఆయనకి నామీద కాస్త కోపం వచ్చి, ఆ టైం లో ఆయన అన్న మాటలు , ఇలా నా చెవిలో అలా మారి మ్రోగిపోతూ వుంటే, నా కళ్ళ నుండి రెండు అశ్రు బిందువులు, పుడమి పై రాలుతూ వుండగా.... అమ్మో! ఎంత భారి డైలాగ్, అసలు ఈ సినిమావాళ్ళు ఎలా చెప్తారో అంత భారి, భారి డైలాగ్స్, వుండండి! కొంచం మంచి నీళ్ళు తాగి వస్తాను. హమ్మయ్య! ఎక్కడున్నాము మనము? అశ్రు బిందువులు కదా..

అసలింతకీ మా వారి కల ఎంటంటే:

Operation  థియేటర్:
ముందు రెడ్ లైట్ వెలుగుతూ వుంటుంది. లోపల నేను , బయట మావారు నుదిటిన లేని చెమటని టెన్షన్ గా కర్చీఫ్ తో తుడుచుకొంటూ , చేతులు నలుపుకొంటూ  లేదా చేతులు వెనక్కి పెట్టుకొని అటూ, ఇటూ నడుస్తూ, మిగతా బంధువర్గమంతా బయట కూర్చుని తదేకంగా రెడ్ లైట్ ని చూస్తూ వుంటే, ఇంతలో .. కెవ్వున వినిపిస్తుంది అది నా “కేక”. రెడ్ లైట్ ఆరిపోతుందన్నమాట. ఒక్కసారి అందరూ (మావారితో సహా ) అలర్ట్ గా తలుపువంక చూస్తూ ఉంటారు. ఇంతలో తెల్లటి డ్రెస్స్ లో నర్స్ మావారి దగ్గరికి వచ్చి, "కంగ్రాట్స్! మీకు పాప పుట్టింది” అని చెప్తుంది. మళ్ళి కెవ్వున కేక .. ఈసారి నాదగ్గరినుండి కాదు, మావారి దగ్గరనుండి. ఇదీ మావారి కల.

పాపం! అప్పుడూ నెరవేరలేదు మరి బాబు పుట్టినప్పుడు నేరవేరలేదు. ఏమిటో ఇలా వెళ్ళి అలా ఇంటికి వచ్చెసాను. డాక్టర్ తో కూడా అదే చెప్పాను, " ఇలా అయితే వందమందిని కనేయచ్చు కదా " అని. తననుకున్నట్లు జరిగివుంటే చక్కగా "ఎత్తుకొని గిర గిరా తిప్పేవాణ్ణి" అన్నారు మావారు. అదిగో!! అప్పుడు అంకురించింది నాలో , సన్నటి అనుమానపు పొర. నన్ను ఎత్తుకొనే ఛాన్స్ లేదు, నేను కరణం మల్లీశ్వరిని కాబట్టి. రోజుల పిల్లలిని అసలు ఎత్తుకోరు..మరి? అంటే...... ఆ నర్స్ నే కదా.......  అమ్మో!....  ఎంత గండం గడిచిపోయింది అసలు నేను ఏకాంత సేవ చేయకపోవడం వల్లే కదా! ఈయనకి ఇలా ఏ 'కాంత' సేవో చేసేద్దామన్న ఆలోచనలు..

అప్పటినుండి అవకాశం గురించి ఎదురుచూస్తున్నాను.

ఇదిగో ఈరోజే ఆ అవకాశం వచ్చింది ఇప్పుడు చూపిస్తా , నా “ఏకాంత సేవ తడఖా ఎంటో! ఏ 'కాంత' ఊసెత్తరిక” అని మనసులో అనుకొన్నాను.

ఆదివారం పొద్దున్న, సుబ్బరంగా అరడజన్ పెసరట్లు , ఉప్మాలో నంజుకొని ఆవురావురుమని తినేసి, ఇంకా అవి పూర్తిగా అరగకముందే , “ఈరోజు వంట ఏమిటోయి?” అని , గుత్తొంకాయకూర, పట్నం పచ్చడి(దీనిగురించి తరువాత చెప్తాను ఇది చాల వెరైటీ పచ్చడి) మామిడికాయ పప్పుతో షుస్టుగా భోజనం చేసి , "ఆదివారం వంటలు అమోఘం" అంటూ అనంద పడిన నా పతిదేవుడు, సాయంత్రం అయ్యేసరికి పాపం! కడుపులో వున్న పెసరట్టుకి, మిగతా వాటికి.. పొంతన కుదరక పోట్లాడుకొంటుంటే , తట్టుకోలేక “ఒంట్లో ఏదో నలతగా వుంది” కాసేపు పడుకొంటాను అన్నారు. 

"అబ్బ! ఎన్నాళ్ళకి దొరికారు, నాకు ఏకాంత సేవ చేసుకొనే మహత్తరమైన అవకాశం వచ్చింది " అని మహదానంద పడిపోయి , ఎగిరి గంతేద్దామనుకొని , ఆ ప్రయత్నం విరమించుకొన్నాను...  శనివారమే మావాడన్న మాటలు గుర్తొచ్చి. నేను ఇంటి మొదటి మెట్టు ఎక్కగానే నేను వస్తున్నాని పసిగట్టేసి, పరిగెత్తుకొంటూ వచ్చి “అమ్మా” అంటూ చుట్టుకుపోతాడు వాడు. " వేలెడు లేడు వెధవ ఎంత సూక్ష్మ గ్రాహి" అని మురిసిపోతుంటాను నేను. ఆ మురిపం తీరకముందే వాడన్నాడు కదా. “అమ్మా నువ్వు వస్తున్నావని ఎలా గుర్తు పడ్తానో తెలుసా? నేను, " మొదటి మెట్టు ఎక్కగానే మన బిల్డింగ్ ఒక్కసారిగా షేక్ ఇస్తుందమ్మా , నువ్వొచ్చావని పరిగెత్తుకొంటూ నీ దగ్గరికి వస్తాను “ అన్నాడు.

అదన్నమాట అందుకే ఎగిరి గంతేద్దామన్న సాహసాన్ని విరమించేసుకొన్నాను.

అలా మావారికి ఏకాంత సేవ చెద్దామని, మావారు పడుకొన్న మంచం పక్కన చిన్న టీపాయి వుంచి, దాని మీద ఇంట్లో వున్న బి - కాంప్లెక్స్ టాబ్లెట్స్, బలానికి టానిక్, ఒక జగ్ నిండా నీళ్ళు , ఓ పెద్ద గాజు గ్లాసు, ఇంకా.. ఆ! ఓ చిన్న పింగాణి బేసిన్ లో వేడి నీళ్ళు, ఒక తెల్లటి క్లాత్ అక్కడ సిద్దంగా పెట్టుకొని(మధ్య మధ్యలో నుదిటి మీద క్లాత్ తో అద్దాలిగా మరి, చాల సినిమాల్లో చూసానన్నమాట) , ఆ పక్కన ఓ మిక్సీ , జార్ కొన్ని ఆరెంజస్, మావారికి మధ్యలో, మధ్యలో జ్యుస్ తీయడానికి అనువుగా అన్నీ సమకూర్చుకొని, ("నైట్ అయి వుంటే ఇంకా బాగుండేది కదా" అని మనసులో అనుకొని ) పక్కన పడక కుర్చీలో కూర్చుని/పడుకొని, అలా ఆయిన వైపు దీనంగా చూస్తుంటే ..నాకు నిద్ర పట్టేయాలి , మధ్యలో ఉలిక్కిపడి లేచి, టైం చూసుకొని , మందులిచ్చే టైం అయిందని తనని లేపి , జాగ్రత్తగా వళ్ళో పడుకోబెట్టుకొని ఓ టాబ్లెట్ వేయాలి. తను కూడా మద్యలో ఒకసారి లేచి నావైపు చూసి “పాపం నా గురించి ఎంత కష్టపడుతోందో .."(చేసుకొంటే ఇలాంటి అమ్మాయినే ..ఓహ్!సారి మాకు పెళ్ళి అయిపోయింది కదా మర్చిపోయాను) అని నా ఏకాంత సేవని గుర్తించాలి. నాకెందుకో రాజశేఖర్ – జీవిత, యన్.టి ఆర్- లక్ష్మి పార్వతి, ఇంకా చాలా మంది సినిమా బార్యా, భర్తలు గుర్తొచ్చారు, వీళ్ళందరూ ఇలాగే కదా, ఏకాంత సేవ చేసి మెప్పు పొందారు. గెటప్ కూడ మార్చేసాను, అప్పుడప్పుడు కళ్ళ నీళ్ళు తుడుచుకొడానికి అనువుగా చీర కొంగు అవసరంవుతుందని. ఇలా అన్నీ సమకూర్చుకొని, ఆయనవైపు ఒకసారి దీనంగా చూసి పడక కుర్చీలో అలా చేరగిలపడ్డాను.

కల: నేను చేసిన ఏకాంత సేవకి మెచ్చుకొని ఎంతో మంది హీరోలు, " నేనంటే నేను " అని పోటీ గా వాళ్ళ జేబులో వున్న తాళి బొట్లు తీసి నా దగ్గరికి వస్తున్నట్లుగా(వాళ్ళెప్పుడు అంతే ! జేబులో అలా మంగళ సూత్రం పెట్టుకొని వుంటారు రేడీ గా) ..

ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను, "బహుశా మావారికి టాబ్లేట్ వేసే టైం అయి వుంటుంది అందుకే మెలుకువ వచ్చింది" అని అనుకొని , నా సమయస్ఫూర్తికి నన్ను నేనే మెచ్చుకొని, మంచం వైపు చూద్దును కదా ఈయన లేరు. ఎక్కడికెళ్ళి వుంటారబ్బా, అసలే ఒంట్లో బాగోలేదన్నారని ఇల్లంతా కలియ తిరిగి, ఇక లాభం లేదనుకొని సెల్ కి ఫోన్ చేసాను. అటు వైపు నుండి జవాబు. “ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే పక్కింట్లో వున్నాను” అని “ పక్కింట్లోనా? అక్కడ ఏమి చేస్తున్నారు? మీకు వంట్లో బాగోలేదు కదా! నేను... ఏకాంత సేవా… " అంటూ నసుగుతూ ఉంటే... (నాకెందుకో ఏ కాంతో గుర్తొచ్చింది) “ఏంటి ఏ 'కాంత' ?” అంటూ తనూ సాగదీసారు..”హు !హు! ఏ 'కాంత' కాదు ఏకాంత అంటూ .. అసలు ఈయనతో మాటలెందుకని నేనే ఆయన చెప్పిన పక్కింటికి వెళ్ళి చూద్దునుకదా, ఆయన పక్కింటాయనతో కార్డ్స్ ఆడుతూ కనిపించారు , పక్కింటావిడ పెట్టిన పకోడి పర పరా నములుతూ.. అప్పుడనుకొన్నా! కసిగా “మళ్ళీ దొరక్కపోరు నాకు ఏకాంత సేవ కోసం “అని :( :(


8 comments:

  1. రమణిగారు,

    మీరు చెప్పింది "ఏకాంత సేవ" కాదండి. సినిమా కాంత సేవ. అది నిజంగా జరగదు కాని. మన తిరుమల వెంకన్న చేయించుకుంటాడు చూడంది వైభోగంగా ఏకాంత సేవ.. "మల్లెపూలు... etc. etc..
    యద్ధనపూడి నవళ్ళు ఉంటే తీసి చదవండి. "ఏకాంత సేవ .. వివరాలు తెలియవచ్చు. ఇక్కడ చేప్తే బాగోదు. పెళ్ళి కాని కుర్రోలు కూడా ఈ బ్లాగు చదువుతుంటారు. అనవసరంగా వాళ్లనెందుకు చెడగొట్టడం..

    ReplyDelete
  2. ఏకాంత సేవ అంటే ఏంటో నేను చెప్పను. కానీ నేను చిన్నప్పుడు విన్న శివుడు-పార్వతి దేవుళ్ళ పాట కొద్దిగా రాస్తాను. మీరే అర్థం చేసుకోండి. ఇదీ పాట.

    "ఏకాంత సేవకి వేళాయె శ్రీకాంతు సోదరి రావమ్మా

    ప్రకృతి నీవు పురుషుడు స్వామి ఇరువురి కలయిక శుభమేగా

    సుకృతమ్ముతో కాంతుని చేరగ కరుణామయివై రావమ్మా"

    ఈ పాట స్వాముల సేవకు వేళాయే వైరిములార చెలులారా అన్న అదేదో పాత సినిమాలోని పాటకి పేరడీ. శ్రీకాంతుడంటే విష్ణవు. విష్ణవు సోదరి పార్వతిని ఈశ్వరుడితో ఏకాంత సేవకి ఆహ్వానిస్తున్నారన్నమాట భక్తులు. ఇప్పుడు మీకు మొత్తం అర్థం అయుంటుందనుకుంటాను. అయినా పిల్లలు కనేసిన తర్వాత, ఎన్నో ఏకాంతసేవలు చేసిన తర్వాత మీరీ ప్రశ్న అడగడం ఏం బాలేదండి. :)

    ReplyDelete
  3. జ్యోతిగారు సినిమా కాంత సేవ ఏ 'కాంత ' సేవో అవుతుంది కాని, ఏకాంతం ఎలా అవుతుందండీ? ఇక యద్దనపూడి నవల అంటార.. నవలంతా హీరో ని , ప్రకృతి ని వర్ణించడంతోనే సరిపోతుంది. ఇక ఏకాంతాలు , సాయంత్రాలు తక్కువే ఆవిడ నవలలో. ఇక శ్రీనివాసుడు, మిగతా దేవుళ్ళ లీలలు గురించంటార.. ఇద్దరు బార్యల వాళ్ళు అందరూ, ఏ కాంత కాదు, ద్వి కాంత సేవలు వాళ్ళవి. ఇక కుర్రోళ్ళూ అన్నారు .. నొ కామెంట్స్.

    ReplyDelete
  4. సరదాగా నేను రాసిన దానికి సీరియస్ గా మీరిచ్చిన వివరణ సూపర్బ్ వింజమూరిగారు.

    ReplyDelete
  5. bagundi miku ekanta seva chese avaksam labhinchalani karkuntunanandi

    ReplyDelete
  6. :):) అధిరిందండి మీ ఏకాంత సేవ సీన్ .పట్నం పచ్చడి గురించి ఎప్పుడండి.

    ReplyDelete
  7. హ్హ హ్హ హ్హ.....మీ ఇద్దరి కలలు సూపర్ గా ఉన్నాయ్.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...