10.04.2010

బ్లాగు స్వయంవరం


"రాచరికపు చిత్తులతో, రణతంత్రపు టెత్తులతో సతమతమవు మా మదిలో మదనుడు సందడి సేయుటయే చిత్రం".

"దూరం ..దూరం..".

"ఏమది దేవి ఎప్పుడూ లేనిది దూరమనుచూ మమ్మల్ని పరిహసించుచున్నావు ."

"ఎంతమాట నాధా! మీతో పరిహసములా?"

"మరేమది దేవి, మమ్ములను త(అ)స్మదీయుల వలే గాంచిన మాకా అనుమానం పొడసూపదా!"

"లవకుశలిద్దరూ పెళ్ళీడుకొచ్చినారు నాధా! పక్కనే ఉద్యానవనంలో కేళీ విలాసంలో తేలియాడుచున్నారు. మనల్ని గాంచే ప్రమాదమున్నదని అట్లు వేడుకొంటిగాని అన్యధా భావిచుట తమరికి ధర్మమా నాధా!."

"అటులనే దేవి నీ వేదనను అర్ధం చేసుకొంటిని."

"భూలోక విహారం చేసేదమా నాధా! పిల్లలిద్దరికి వివాహం చేయుట కాస్త సులభతరమగును."

"వివాహమునకు, భూలోక విహారమునకు సంభందమేమి దేవి?"

"మీరు నన్ను వరించినంత సులభతరమా నాధ! ఇప్పటి పరిణయం? వధువు దొరకుటయే క్లిష్ట తరముగా గాంచుచున్నది. దేవకన్యలు వయసులో పెద్దవారగుట వలన మానవ కన్యలను చూసేదము. అదియునూ కాక మనకి ఇద్దరు కుమారులు, బహు బార్యత్వం నిషేదించబడినది. మీలాగే నా కుమారులు గూడా "ఏకపత్నీ వ్రతులు" అని బిరుదాంకితులు గావలెనని నా ఆకాంక్ష. భూలోకమొలో ఓ కొత్త పద్ధతి ప్రేవేశపెట్టినారని వేగుల ద్వార తెలిసినది మరి మనము ఒకమారు భూలోకమునకు వెడలి వచ్చెదము."

"ఏమా నూతన పద్ధతి దేవి? నావరకు ఈ వేగు రానేలేదు. నావరకు ఏతెంచని ఆ పద్ధతి అంతః పురంలో ఉండే నీవరకు రావడమనగా, ఒహ్! ఏమదీ అంతఃపుర అతివలను అబల అనుకొన్నామే గాని , సబల గా మార్పు గోచరించుచున్నది."

"నిష్టూరాలేల స్వామీ! ఇప్పటికే మాపై నిందలు చాలానే యున్నవి, మేము ఆభరణముల గురించి, పాకశాస్త్ర పలహారాల గురించి , అత్తగారి ఆరడింపుల గురించి తప్ప అన్యధా ఆలోచింపలేమని మీ పురుషపుంగవుల ఉవాచ."

"ఎవరో అన్నదానికి నేనేల బాధ్యత వహిచవలె దేవి, నీవిప్పుడు అలిగినచో నేను ద్వాపరయుగ శ్రీకృష్ణ అవతారమెత్తవలె. అలుకవీడి భూలోక విహారమునకు వెడలెదము "

***

"good news for you
bad news for other computers and laptops

The feature rich stunning laptops now comes with.... ...."

"ఏమది దేవి నీవెప్పుడు ఆంగ్లం అభ్యసించినావు, అంతా శీఘ్రముగా పఠించుచుంటివి"?

"అబ్బా భూలోకమునకు వచ్చితిమి కదా ఇక ఆ భాష కట్టిపెట్టుడు నాధా! ఇక్కడి వాడుక భాషలో మాట్లాడుకొనుదము."

"అటులనే కాదు కాదు .. సరే దేవి చెప్పు ఆంగ్లం ఎక్కడ నేర్చుకొన్నావు?"

"మనఅంతఃపురంలో దూరదర్శన్లో ఇంగ్లీషు ఛానెల్స్ ద్వారా నేర్చుకొన్నాను".

"తెలివైన వారు మీ ఆడువారు"

"పదండి! ఓ రెండు లాప్ టాప్ లను కొనెదము"

"ఇప్పుడవెందుకు దేవి? ఇంట్లో టీ.వి ఉన్నది కదా! "

"అది వేరు ఇది వేరు నాధా! ఇందులో ఇప్పుడు కొత్తగా బ్లాగులు సృష్టించుకొనే విధానం ఒకటి వచ్చినది. మనము సృష్తించుకొనకపోయినా పర్వాలేదు. పాఠకునివలే చక్కటి కథలను, వ్యాసాలను, వ్యంగ్య రచనలను చదవి, వ్యాఖ్యానించినచో, మన లవకుశలిద్దరూ అదృష్టవంతులగుదురు. ఇది ఒక పత్రికలాంటిది. భూలోకమునుండి లవ కుశలిద్దరికి బహుమతిగా రెండు కొని తీసుకొని వెడలెదము".

"బ్లాగు బ్లాగు.. వ్యాఖ్యానించినా లేదా పఠించినా మన కుమారులు అదృష్టవంతులా.. హ.. హ.. నాకు ఈ బ్లాగు బాష వంటపడ్తోంది దేవి. "

****

"దేవి ఇది చూడుడు, భూలోకం నుండి వచ్చు దారిలో పఠించినాను, ఎవరో మానవుడు నాకు ఓ రెండు దినములు సెలవు అని అడుగుచున్నాడు, ఇది ఏమి విచిత్రం దేవి? లిఖించుటకు, పఠించుటకు కూడా సెలవులా."

"అదంతా అతని అభిమానులకు విన్నవించుకోడం నాధా! అభిమానులు ఒక్కరోజు వారి బ్లాగు చదవకపోయినా, వారి అభిమానం హద్దులు దాటి ఉన్మాదులయి పోయే ప్రమాదం వాటిల్లునేమో అని సోచించి, ముందు జాగ్రత్త! ఆ సెలవు చీటి. నా దగ్గర లాప్టాప్ లో కూడా చాలా మంది , తమ తమ సొంత ప్రాంతములకు వెళ్ళూచూ , అభిమానులను అందోళన పడవద్దని విన్నవించుకొనుచున్నారు."

"ఇదేమి దేవి ఇది నా 50వ టపా, ఇది నా 100 వ టపా అనుచూ లెక్కించుకొనుచున్నారు. అర్ధ శతకం, శతకాల తరువాత వీరు రాయడం నిలిపివేయుదురా?"

"భలేవారే నాధా! ఇదేమన్నా భూలోకంలో ఆడు చిత్ర విన్యాసాలా ?? 100 రోజుల తరువాత పెద్ద ఉత్సవం జరిపి నిలిపివేయుటకు. బ్లాగులు లిఖించడం ప్రొత్సాహం, ఉత్సాహల కోసమై అట్లు రాసుకొందురు."

"బ్లాగు.. బ్లాగు... బహు బ్లాగు...హ హ హ"

"ఏమైనది స్వామీ అంత హాస్యం?"

"ఏమి లేదు దేవి! ..హ.. హ.. హ... అది..అది.. హ హ హ"

"నవ్విన తరువాతయిన చెప్పుడు లేదా చెప్పి అయినా.."

" అహ! ఏమి లేదు దేవి.. హ .. హ.. ఎవరో మానవుడు చూడు కొత్తగా సృష్టించుకొన్న తన బ్లాగు, తన టపా చదివిన తరువాత 100 వ వ్యాఖ్య రాసిన వ్యక్తి కి తన కూతురిని ఇచ్చి వివాహం చెసేదనని ..."

" నిజమా నాధా! నేను ఎదురుచూచుచున్న ఘడియ రానే వచ్చింది. నేను ఈ "బ్లాగు స్వయంవరం" గురించే సోధించుచున్నాను! నాధా! మన కుమారుల కోసం ఓ చిన్న త్యాగం చేయుడు, ఆ బ్లాగరుడేవరో కనుగొని, ఓ 99 మంది భట్రాజులవంటి వ్యాఖ్యలనిచ్చువాళ్ళను సృష్టించి వ్యాఖ్యలు రాసేట్టుగా ఉసిగొల్పుడు. టపా పఠించకపోయినా పర్వాలేదు, "బాగుంది", "చాలా బాగుంది" లాంటి రెండు పదములు చాలును ఇప్పటి వరులకు బ్లాగు పఠిచడమనే అర్హత ఒక్కటి చాలును, కుశుడు కి నేనింకో ఇలాంటి బ్లాగు శోధించెద".

"దేవి! బాగుంది కాని ఈ మానవుడు ఇక్కడ లిఖించినదంటూ ఏమి లేదు. "బాగుంది", " బహు బాగుంది" అంటూ ఏవిధంగా ??"

"ఏది ఇటు చూపించుడు నేను చూసేద ఏమి రాసెనో".

" మహిళల ప్రముఖ ముచ్చట్లు: నగలు, వంట, భర్త, పిల్లలు".

"ఎవరు నాధా ఇటుల లిఖించినది ..ప్చ్! అయిననూ పర్వాలేదు మనకి కావల్సింది మన కుమారులని ఈ బ్లాగ్ స్వయంవరం కి అర్హతలు కావించడం కావున, వెంటనే వారిని పురి కొల్పుడు. ఈ టపా "బాగుంది", "చాలా బాగుంది" అని మీ 99 భట్రాజుల చేత వ్యాఖ్యానించేలా చేయుడు నాధ! పిదప 100వ వ్యాఖ్య మన కుమారుడు లిఖించేదడు. ఆలసించిన అదృష్టం చేజారిపోవును.

"చిత్తం దేవి! తమరి ఆజ్ఞ".
****

37 comments:

  1. నాకునూ ఒక మంచి అమ్మాయిని వెదికి పెట్టుడు. అట్లైన నేను సతీసమేతంగా ప్రతి టపాకి బ్లాగు బహుబ్లాగు అని వ్యాఖ్యలు రాసెద. మీరు కొత్త టపా రాయనిచో రాసినదానికే మరల మరల వ్యాఖ్యలు పెట్టెద.

    ReplyDelete
  2. బ్లాగు బ్లాగు...ఐడియా అదిరింది దేవి? అది ఫలించిన మేము కూడా ప్రయత్నించెదము..

    ReplyDelete
  3. బాగుగా బ్లాగితిరి రమణీ మణి! కొన్ని దెబ్బలు చెళ్ళు చెళ్ళున తగిలినవి(నాకు కాదు సుమా)ఏమిటి, "ఎక్కడికి" వెళ్ళినా మర్చిపోకుండా పీడకలలు వచ్చే ఏర్పాటు చేస్తున్నారా? ఇంతకంటే రాయలేను, కాసేపు కూచుని నవ్వాలి ముందు!

    ReplyDelete
  4. బహు బాగుంది :)

    ReplyDelete
  5. స్వయంవరం అద్భుతంగా చిత్రించారు. ఇప్పుడు నాకో అనుమానం వస్తోంది. నా అద్రుష్టము చేతనో, కర్మముచేతనో, నేనే ఆ 100వ వ్యాఖ్యాతను అయిన, మీ దేవీ దేవుడూ ఏం చేస్తారా అని :)

    ReplyDelete
  6. Waaow! meeru chala baga rastaru - chala bavundi.

    ReplyDelete
  7. నాకేదో స్పురించుచున్నది. ఇంత హఠాత్తుగా ధ్వజమెత్తితిరేమి సఖీ?

    ReplyDelete
  8. "మమ్ములను అస్మదీయుల వలే గాంచిన మాకా అనుమానం పొడసూపదా" ... ఈ వాక్యంలో అస్మదీయుల వలె అనే మాట సరైనదేనా అని నా అనుమానం.

    ReplyDelete
  9. మురళీ గారు: తప్పకుండా ఈసారి బధ్రాచలం వేళ్ళినప్పుడు మీగురించి ఆ సీతాదేవికి చెప్తాను. లేదు అంతకాలం ఆగలేను అంటే, నా బ్లాగుకు వ్యాఖ్యలు కాదు కాని, "ఏది తనంత తాను మీ దరికి రాదు" అన్న సూక్తి తెలుసా!! కాస్త మన బ్లాగులోకానికి వెళ్ళి సోధించి సాధించండి.

    @అనంద గారు : నెనర్లు.

    @ జ్యోతి గారు: సఫలీకృతం కావాలని నేను 100 వ వ్యాఖ్య అందుకోవాలని మీ చల్లని మనసుతో దీవించేయండి. మా అక్కలాంటి అక్క లేదు లోకాన అని పాడేసుకొంటా.

    @సుజాత గారు: "రమణీ మణి" పేరు నాకు తెగ నచ్చేసింది అలా ఫిక్స్ అయిపోనా? "ఎక్కడికి వెళ్ళినా" నాకు "హచ్ " వాణిజ్య ప్రకటన గుర్తోస్తోంది. ఎక్కడికి వెళ్ళినా మీ వెంట అంటూ, నెట్ వర్క్ ఎక్కడైనా ఉంటుంది అనుమానం లేదుగా! ఏమి చేస్తాము చెప్పండి గంగవెల్లువ కమండలంలో ఇమిడేనా??
    ఎల్లలు దాటి(నా)న నా అభిమానం గిరి గీస్తే అది ఆగేదేనా?
    హ్యాప్పీ గా నవ్వేసుకొండి.

    @ తెరెసా:హ.. హ.. బ్లాగు, బ్లాగు, బోల్డు నెనర్లు.

    @te.thulika: అంత భయం వద్దని అభయం ఇచ్చేస్తున్నా! నాకు 100 వ్యాఖ్యలు రావాలంటే నెనింకో 7 బ్లాగు జన్మలెత్తాలి. మనలో మన మాట మీకంతటి అదృష్టం కావాలంటే 7 బ్లాగు జన్మల దాక ఎదురుచూస్తే.... వద్దులెండి.. మరీ అత్యాశ కూడా పనికిరాదు నాకు. కాని ప్చ్! మిమ్మల్ని మిస్ అవుతున్నాను.

    @sujata: నెనర్లు.

    @రాధిక : మీరు బహు సూక్ష్మగ్రాహి సుమా! ద్వజమెత్తడం కాదు బ్లాగులో ఇలాంటి స్వయంవరాలకు స్పందన ఎలా ఉంటుందా అని... అర్ధం చేసుకోరూ!!!! (స్వర్ణ కమలం భానుప్రియ గుర్తొచ్చిందా?)

    రానారే గారు: ఈ అనుమానం నాకు వచ్చింది ఈ పదాలు వాడినప్పుడల్లా ఆలోచిస్తూ ఉంటాను అందుకే ఈసారి అలాంటి బాధ లేకుండా ఉండేందుకు, రెంటిని వాడేస్తున్నాను. క్షమించండి మీకు ఇబ్బంది కలిగించినందుకు.

    ReplyDelete
  10. రమణి గారిచే ప్రకటించబడిన ఈ 'బ్లాగ్ స్వయంవరానికి' దయచేసి నిజ్జంగా 'పెళ్లి' ముగింపునివ్వరూ ... తదుపరి ప్రయత్నమెవ్వరిదో .. తొందరగా చదివే అవకాశం ఎప్పుడో కదా ...... మొదటి అడుగు పడింది కనుక ఇక వెనకడుగు వెయ్యకండి .... దీనికి కొనసాగింపుగా రాయగలిగిన 'చేయి తిరిగిన ' వారెందరో ! :-)

    !!!!!!!! దగ్గరలో ఉన్న పౌర్ణమి వేళలో మంచి జాతకం చూసుకొని జ్యోతి ప్రజ్వలనం చేసి రాదిక ఈ అవకాశం అనుకుంటూ, గడ్డి పూలని చూడక మాలగ కట్టి దేవునికర్పించి , నేర్చిన విద్యతో మా కన్నులు తెరిపిస్తూ వెలుగుచూసే ఈ టపాల ప్రయత్నం మాకు సరిగమలు వినిపిస్తూ.. అప్రతిహతంగా కొనసాగాలని కోరుకుంటూ .... !!!!!!!!!!

    ReplyDelete
  11. తెలుగు 'వాడి ' ని గారు : నెనర్లు. తెలిసే అడుగుతున్నారా? తెలియక అడుగుతున్నారా? నిజ్జంగా నిజం చేయండి అని. మాములుగా సినిమా కథలు మొదలై తరువాత, చివర్లో శుభం కార్డ్ పడుతుంది. నా కథలు శుభం కార్డ్ పడిన తరువాత మొదలయ్యాయి.

    మీ మాటల మాల , ఆ గారడి సింప్లీ సుపర్బ్.

    ReplyDelete
  12. పోలీసు దెబ్బల్లాగా తగిలించారు. క్షతగాత్రులెందరో మరి!

    ReplyDelete
  13. చదువరిగారు: నెనర్లు! అంతఃపుర అతివలు అబలలు అనుకొనే వారందరు క్షతగాత్రులే .

    ReplyDelete
  14. murali: హహహ.. ఇంక ఏం చెప్పినా చేసేస్తారా? మరీనూ! కమ్మెంట్ అదిరెన్!

    మాలతి గారు: భలేంటి ప్రశ్న! వ్యాఖ్యతల్లో కూడా ఆడ వ్యాఖ్యలూ, మగ వ్యాఖ్యలూ ఉండాల్సిందే కదూ!

    తెలుగువాడిని: భలే భలే! వాహ్.. వాహ్ అంతే!

    రమణీ గారు: భలే రాసారండీ! I'm a thorough admirer of the way you get the flow of the story. నేను అలా అలా ఫాలో అయిపోతూ ఉంటాను. అన్నీ సమపాళ్ళల్లో కుదిరిన కథ. చాలా బాగుంది.

    దీనికి కొనసాగింపు అనుకున్నారా? ప్రయత్నించండి.. ఇంకా చదవాలని ఉంది.

    ReplyDelete
  15. పూర్ణిమ గారు: కథ కొనసాగింపుకి, తెలుగు 'వాడి ' ని గారి పెళ్ళి ముగింపుకి వారు అడిగినవిధంగా:

    "దగ్గరలో ఉన్న పౌర్ణమి వేళలో మంచి జాతకం చూసుకొని జ్యోతి ప్రజ్వలనం చేసి రాదిక ఈ అవకాశం అనుకుంటూ, గడ్డి పూలని చూడక మాలగ కట్టి దేవునికర్పించి , నేర్చిన విద్యతో ......"

    మీలో ఒకరు రాయలని నా కోరిక. నిజంగానే అలా పెళ్ళి ముక్తాయింపులు, ముగింపులు ప్రస్ఫుటించేలా చేస్తే బాగుంటుంది, సో! పూర్ణిమా! మీ ఊహలన్నీ ఊసులుగా చెప్పేసి పెళ్ళి సందడి చేసేయండి మీ బ్లాగుకి మేమొచ్చి వ్యాఖ్యల విందు భోజనాలని వడ్డిస్తాము.

    ష్! మాలతి గారు 100 వ వ్యాఖ్య "తనదైతే?" అన్నారు కదా! ఆడవాళ్ళ వ్యాఖ్యలైతే వరుడివైపువాళ్ళము, మగవాళ్ళ వ్యాఖ్య అయితే మనం వధువైపు వాళ్ళం. మరి మొదలుపెట్టండి "బ్లాగ్ పెళ్ళిసందడి."

    ReplyDelete
  16. బ్లాగు స్వయంవరం బహు బ్లాగండీ!
    శివధనుస్సుని మేంటేన్ చెయ్యాలంటే ఒకటే బరువు అటు నించి ఇటు కదపాలన్నా గూడా. ఇహ మత్స్య యంత్రం అంటే, ఇంటో వెధవ చేపల కంపు.
    పనిలో పని ఇటు బ్లాగుకి హిట్లూ కామెంట్లూ, అటు అమ్మాయికి వరుడూ.
    ఏటొచ్చీ ఈ ఆడంగి లవకుశులు మాకొద్దు, ఏ మహేషుబాబో ప్రభాసో మాత్రమే కావాలని కూతుళ్ళు మొండికేస్తే సదరు బ్లాగు తండ్రి కిం కర్తవ్యం?

    ReplyDelete
  17. మీ కథ ఆనందాన్నిచ్చింది. కొత్తపాళీ గారు చెప్పి కథలకు ఐడియాలిస్తుంటే, నా మాటలు, వ్యాఖ్యలు, ఊసుపోక చెప్పే కబుర్లు ఇలా కథవస్తువుగా మారి మీ చేతిలో ఇలా అందంగా, రమణీమణి కంఠాహారంగా తయారవటం ముదావహం.

    మాటే మంత్రము వ్యాఖ్యే బంధము
    ఈ బ్లాగే స్వయంవరం ఈ బ్లాగే మంగళ వాద్యము
    ఇది కళ్యాణం కమనీయం జీవితం
    మాటే మంత్రము వ్యాఖ్యే బంధము
    ఈ బ్లాగే స్వయంవరం ఈ బ్లాగే మంగళ వాద్యము
    ఇది మనలోని మాట.. నా మనసులోని మాట

    Camp:London,Ontario,Canada

    ReplyDelete
  18. కొత్తపాళీ గారు: భలే వారే! ఆడంగి లవకుశలు అనుకోనవసరం లేకుండా వాళ్ళని మహేష్ బాబు, ప్రభాస్ లుగా మార్చేస్తే సరి. ౠషిపత్నులు ...నీలాపనింద కథ మనకి తెలియనిదా ఏమిటి? ఎటొచ్చీ ఈ విషయం అటు మహేష్ బాబు కుటుంబానికి, ఇటు ప్రభాస్ కుటుంబానికి (ప్రభాస్ కి పెళ్ళి అయ్యిందా?) తెలియకుండా మానేజ్ చేయగలిగితే చాలు. మనలో మనమాట మానవులకే సాధ్యమవగా లేంది ఇహ దేవుళ్ళకి సాధ్యం కానిదేముంది చెప్పండి? ఎమంటారు? ష్! ఈ అవుడియా ఎక్కడా చెప్పకండి , నిజంగా ఎవరన్నా స్వయంవరం కోసం కామెంట్ రాస్తే మరి వాళ్ళని(లవకుశల్ని) అర్జంట్ గా మార్చేయ్యాలి కదా! :)

    సి.బి.రావు గారు: నెనర్లు. సమయస్ఫూర్తిగా మీరు రాసిన కవితకి ఇక్కడ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నా! మీకు మీదు మిక్కిలి ధన్యవాధములు. "నా మాటలు వ్యాఖ్యలు, ఊసుపోక చెప్పే కబుర్లు....ఇలా కథా వస్తువుగా మారి... " మొ!.. ప్చ్! ఎంత ఆలోచించినా అర్ధం కావడం లేదు. క్షమించండి, నాది కాస్త మట్టి బుఱ్ఱ. మీకు వీలైతే అన్యధా భావింపక కొంచం వివరించగలరా?

    ReplyDelete
  19. రమణి గారు
    వేసుకోండి నాలుగు వీరతాళ్ళు. నాకు మూడు రోజులనుండి నెట్ సమస్య, ఇవ్వాళ్టికి ముడిపడింది వ్యాఖ్య రాయటం. అదరగొట్టేసారు పోండి. మీ టపాతోపాటు వ్యాఖ్యలు కూడా అదిరాయి. ఇంతకి దెబ్బలు తగలాల్సిన వాళ్ళకి తగిలాయంటారా?
    తీరికగా మరలా వస్తా!

    ReplyDelete
  20. సిరిసిరి మువ్వ గారు: నెనర్లు. గాజుల చేయి కావాలనుకొంటే కమ్మహ్గా కందిపచ్చడి చేసిపెట్టగలదు, కాదనుకొంటే, ఖాకీ దెబ్బలు తెలిసేలా చేయగలదు అని .......

    ఇహ దెబ్బలు తగలడం అంటారా... చెప్పడమే మన ధర్మం.. వినకపోతే....

    ముందు ముందు నేనెన్ని ఎదుర్కోవాలో ... కాని మీరందరు ఉన్నారుగా అన్న ధీమా ఉంది.

    ReplyDelete
  21. రమణిగారు,

    చింతించవలదు.. పెళ్ళి పనులు అంటే చేయి వేయకుండా ఉంటామా??? మాకు చేతనైనది మేము తప్పక చేయగలమని వాగ్ధానం చేస్తున్నాము..ముందు స్వయంవరం కానివ్వండి. తర్వాత తీరిగ్గా పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుందాము...

    ReplyDelete
  22. జ్యోతి గారు: హమ్మయ్య! ఆ మాట అన్నారు చాలు, నాకు తెలుసు పెళ్ళి పనులకు పిలుపులుండవు అంతా వస్తారని.. అందుకే అన్నా! మీరందరూ ఉన్నారన్న ధీమా ఉందని. ఇహ మీరు కూడా భరోసా ఇచ్చేసారుగా! మీరు నా పక్కన ఉంటే ఇహ చింత నా చెంత ఉండనే ఉండదు.:)

    ReplyDelete
  23. 24వ వ్యాఖ్యాత హాహా
    రోజూ చూస్తున్నా 99 కోసం.

    ReplyDelete
  24. @te.thulika గారు: మీ భ్రమ! నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా, అలా కష్టం అని, ఇహ కాదు కూడదు అనుకొంటే మనమే "భట్రాణి " ల అవతారమెత్తాలి మీరు రాసే 100 వ వ్యాఖ్య కోసం. మరి ఆ పనేదో చేసేద్దామంటారా?

    ReplyDelete
  25. భట్రాణీలూ లేవు, బటానీలూ లేవు. సుజాతా, రాధికా, రాజేంద్రబాబూ, కొత్తపాళీ ,,, అందరూ రండి, రండి, తలోచెయ్యీ ఏస్తే 99 అయిపోతాయి, నాలుగు రోజుల్లో. నూరవనిశానీ నేనే వెయ్యాలి. గిన్నెలు కడగడానికెవరూలేక నానా అవస్థగా వుంది.

    ReplyDelete
  26. మాలతి గారు: హ... హ..హ మనిద్దరము ఇలా ప్రశ్న జవాబులిచ్చేసుకొంటూ 99 వ్యాఖ్యలూ ముగిదంచేద్దాము. ఇహ 100 వ కామెంట్ మళ్ళీ మీ ప్రశ్న తో మొదలవుతుంది. అంతవరకు మీకా గిన్నెల బాధ తప్పేట్టులేదు. మీకు తప్పని ఆ గిన్నెల బాధ గురించి నేను కూడా ఓ రెండు నిముషాలు లేచి నుంచొని మరీ చింతిస్తున్నాను.

    ప్చ్! అసలే "సోది " అంటూ చవితి చంద్రుడిని చూడకుండానే నీలాపనిందలు ఎదుర్కొంటున్నాము. మీరేమో అలా గిన్నెలు, బట్టలు అంటే, ఇహ ఆడవాళ్ళు చేసే పనేముంటుంది? అని ..ప్చ్! అర్ధం చేసుకోరూ! :)

    ReplyDelete
  27. రమణీ, నేనొప్పుకోను! వందో వ్యాఖ్య నాదే కావాలి, మా అమ్మాయి మీ ఇంటి కోడలు కావాలి! ఏమంటారు?(ఇంతకీ మీకు అబ్బాయి ఉన్నాడు కదా)

    ReplyDelete
  28. హ.. హ ..సుజాత ఉన్నాడు, ఫోటోలో కనిపిస్తున్నాడుగా! వాడే .. చూద్దాము 100 వ వ్యాఖ్య కి వాడు పెళ్ళీడుకొస్తాడేమో! ష్! ఎవరికీ చెప్పొద్దు! నిషి వాడిని తన బాయ్ ఫ్రండ్ గా మొన్నీ మధ్యే డిక్లేర్ చేసింది మరి.

    ReplyDelete
  29. blaagu blaaagu swayam valamaaa
    ha ha ha ha ha nenu chilli pillani gaa edo naa vantu chaayam nenu chechetunnanaaa
    nenu koola waiting mali 100 post kosam
    aaa adlsuta vantulu evalo maliiiiiii :):)

    "lamani" gaaalu blaagu blaaagu
    naaku koolaa meelaa laayadam nelpalooooooooo :):)

    ReplyDelete
  30. లచ్చిమి గారు: అందరూ వ్యాఖ్యలకోసం అంటుంటే మీరు పోస్ట్ అంటున్నారు. పోస్ట్ లయితే మీరు ఎదురుచూడనవసరం లేదు. :)

    నాలా 'లాయడం' ప్చ్! కాదు, కాదు 'రాయడం '... హ..హ.. నాకూ మీలా వచ్చేస్తోంది:( ప్చ్! లాభం లేదండీ, ఇంకా నేనే నేర్చుకొంటున్నా. నేర్పెంత ఎదగలేదు నేను. :)

    ReplyDelete
  31. లవకుశుల వివాహానికి...ఏ వనజారావ్ దగ్గర్కో వెళ్ళి చేతులు కాల్చుకోకుండా...మంచి కాన్సెప్ట్ కనిపెట్టారు!!

    ReplyDelete
  32. ఇంతకూ కట్నకానుకల సంగతేంటి? చెప్పారు కాదు
    పెళ్ళి ఎక్కడ చేద్దామంటారు?

    ReplyDelete
  33. చాలా బాగుంది, మంచి టాపిక్.

    ReplyDelete
  34. బ్లాగు బహు బాగు, కాకుంటే ('రామాయణం'లో పిడకలవేట అనుకోపోతే) చిన్నచిన్న అప్పుతచ్చుల్ని (ఉదా: సంభందమేమి) సరిదిద్దగలరు.

    ReplyDelete
  35. chaala baaga rasaaru, chala baga rastunnaaru kuda. inthaki aa vando comment evarido

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...