గుర్తుకొస్తున్నాయి..



నిన్న సాయంత్రం మా పాప ఎదో డాన్స్ ప్రోగ్రాం అంటూ తెగ హైరానా పడిపోతోంది. ఎక్జామ్స్ ఓ పక్క , "ఇప్పుడీ డాన్స్ ఎంటీ" అని కోపంగా అడిగే(కసిరే)సరికి, పాపం! ఒక్కసారిగా బేల మొహం పెట్టేసి, "అసలు నీకేమి తెలుసమ్మా! మా స్కూల్ లో farewell party ఉంది అసలు నీకు ఆ పార్టీ అంటే ఎంటో తెలుసా? మళ్ళీ రమ్మంటే వస్తారా 10th class అక్కలు?" అని అడిగేసరికి నాకు చాలా బాధ అనిపించింది. 10th class... ఒకవిధంగా బాల్య జీవితానికి, స్కూల్ జీవితానికి ముగింపు, ఇంకా చెప్పాలంటే అది ఒక టర్నంగ్ పాయింట్ జీవితానికి. "సర్లే చేసుకో కాని, చదువుని నెగ్లెక్ట్ చేసావంటే ఊరుకొనేది లేదని చెప్పి, నా పనులలో పడ్డాను. ఇంట్లో పనులయితే చేస్తున్నా కాని, మనసు మటుకు నా దగ్గిర ఉండనని ఒకటే గోల, మేము చదువుకొన్న స్కూల్ వైపు వెళ్ళోద్దాం రా! అని మారాం చేసింది. ఇక నాకు మనసు మాట వినక తప్పట్లేదు. మరి ఒక్కసారి అలా మా స్కూల్ దాకా వెళ్ళొస్తా! ప్లీజ్ ఇక్కడే ఉండండి.. ప్చ్! కుదరదా మీకు? సరె అయితే నాతో పాటు వచ్చేయండి, కలిసే అనుభవాలు నెమరేసుకొందాము.

*****

10th class farewell party , అప్పుడప్పుడే ప్రిఫైనల్స్ రాసి, ఇంకా పరీక్షలకి ఎంతో కాలం లేదనగా ఇక మళ్ళీ కలవరని వారికి వీడ్కోలు చెప్దామనే ప్రయత్నం ఈ పార్టీ. అప్పట్లో తెలియలేదు కాని, ఇలా వీడ్కోలు చెప్పడం అనేది నిజంగా బాధే అందులో కల్మషం లేని వయసులో మొదటినుండి ఒక పది సంవత్సారాలు ఒకే స్కూల్లో చదివిన వారు విడిపోతున్నారు అంటే.. మళ్ళీ అంతటి స్వఛ్చత , అంతటి స్నేహశీలత దొరుకుతుందా మనకి? రంగు రంగుల సీతాకోక చిలకల్లా రెడి అయి వచ్చిన ఆ తరగతి వాళ్ళు ఇక కాలేజ్ చదువులకి వెళ్తారు అంటే , అప్పట్లో తొమ్మిదో తరగతిలో ఉన్న మాకు అబ్బా! మాదెప్పుడు అయిపోతుందో అన్న భావన కలుగుతుంది. అందుకే ఈ ఆలోచనలు కలిగినప్పుడూ ..ఒక్కోసారి అనిపిస్తుంది కాలం ఒక్కసారి వెనక్కి వెళ్తే బాగుండును. ఏ అనుభూతిని ప్రోది చేసుకోలేకపోయాము. ఇంకోసారి అవకాశం దొరికితే దానిని సద్వినియోగం చేసుకోవాలి అన్న ఆకాంక్ష కలుగుతుంది. మరిచిపోలేని మధుర క్షణాలవి. అలాంటి పార్టీని మేము ఒక చిన్న నాటిక వేసి, మా సీనియర్స్ 10th వాళ్ళని అలరించాము.

"కల కాదిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు..." అన్న పాటని అదే ట్యూన్ ని అలా సాగించి, మా తెలుగు టీచరు రాసిన పాట, పూర్తిగా గుర్తులేదు కాని, "విడలేమని, విలువైనదని, స్నేహం మరువద్దనీ .. అలా ఒక గ్రూప్ సాంగ్ పాడాము. పాట చివర్లో మటుకు నిజమైన పాటలో లా "ఏది తనంత తాను నీ దరికి రాదు శోధించి , సాధించాలి" అని ముగించాము. అంతా ముగించే సరికి అక్కడ హాలంతా వెక్కిళ్ళే, "మేము వెళ్ళము టీచర్" అంటూ 10th వాళ్ళంతా టీచర్లని పట్టుకొని ఏడ్చేస్తుంటే.. ఆ వీడలేమనే వీడ్కోలు ఇది చెప్పడానికి నాకు పదాలు కూడా కరువవుతున్నాయి. నిజానికి మనం ఆ స్కూల్ నించి వెళ్ళిపోతున్నాము అనే బాధ కన్నా ఇన్ని హంగులు ఆర్భాటలతో పంపించబడుతన్నాము అన్న బాధ చెప్పనలవి కానిది. ఆ తరువాత సంవత్సరానికి ఆలాగే ఆ స్కూల్ నిండి మేము కూడా సాగనంపబడ్డాము., అంతే హంగు ఆర్భాటాలతో..

ఇదంతా ఒక ఎత్తయితే చివర్లో మేమందరం మా టీచర్ల దగ్గిర తీసుకొన్న ఆటోగ్రాఫ్ లు. అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పేవాళ్ళే అయితే మా తెలుగు టీచరు రాసిన ఆటో గ్రాఫ్ కొంచం ప్రత్యేకంగా ఉంది.

"ఇచ్చుటలో ఉన్న హయి వేరెచ్చటనూ లేనే లేదు. మరి ఆ ఇచ్చినది పుచ్చుకొనేప్పుడు మన వంతు కర్తవ్యం మనం నెరవేర్చాలి. దేవుడు మనకీ జన్మ ఇచ్చాడు, మానవ జన్మని మనం పొందాము. మరి ఆ దేవుడికి సదా కృతజ్ఞులై ఉండాలి. మీ జీవితం సన్మార్గంలో నడవాలంటే దేవుడిని మరవద్దు.. ఆయనని కీర్తించండి" అని .....

ఒక నాలుగు మాటలు చెప్పారిలా..

"కృతజ్ఞత ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు, ఒకళ్ళు వద్దంటే పోయేది కాదు. తల్లి తండ్రులకైనా,గురువులకైనా, శ్రేయోభిలాషులకైనా ఈ సారీలు , కృతజ్ఞతలు చెప్పడం అంటే, దాని అర్థం వాళ్ళు మనకి మార్గదర్శకులు కాబట్టి మనం తప్పటడుగులు వేస్తున్నపుడే ఎక్కడ తప్పుటడుగులు వేస్తామో అని జాగ్రర్త వహించేవారు కాబట్టి , వారికి మన ప్రేమతో ఆకట్టుకోగలగాలి కాని , ప్రతి రోజు కృతజ్ఞతలు చెప్పాల్సిన ఆవకశ్యత లేదు. మన ఉన్నతి, మంచి నడవడికే వాళ్ళని గౌరవించడం, ప్రేమించడం, వాళ్ళకి కృతజ్ఞత చూపించడం./చెప్పడం లాంటిది. అలాగే మనం తెలియక చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఉంది కాని, తెలిసి చేసే తప్పు ఒక ’సారీ’ తో సమసిపోదు. అలా అని మన స్వయకృతాపరాధం తెలుసుకుని కూడా అదే దారిలో పయనించి, గొప్ప ఉన్నతినో గొప్ప పేరునో సంపాదించేసి మా ఉన్నతి చూడండి, అంటూ మా టీచర్ల దగ్గరికి వచ్చి "థాంక్స్" అని చెప్తే , అది చెల్లని రూపాయి నాణెంతో సమానం. మీ రందరూ ఇప్పుడు మీదైన ప్రపంచంలో అడుగుపెడ్తున్నారు. ఇప్పుడిది టర్న్ంగ్ పాయింట్. అందరికి good luck " అని ముగించారు.

కళ్ళనీళ్ళతో వీడలేమంటూ వీడుకోలంటూ బయటికి వచ్చాము. ఇప్పుడందరూ ఎక్కడెక్కడ ఉన్నారో, ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఒక పది సంవత్సారాలు కలిసి ఉన్నవాళ్ళము మేమంతా....

****

మిత్రులొకరు "మనిషి జీవితమే అశాశ్వతమైనప్పుడు, ఇహ మధుర క్షణాలు శాశ్వతమవుతాయా? అని ప్రశ్నించినందుకు.. పాప farewell party ఇస్తున్న సందర్భం... నా చిన్నప్పటి పార్టీ అనుభవాలు , మా టీచర్ "ఇచ్చుటలో ఉన్న హయి" అన్న హిత భోధ వెరసి ఈ ’గుర్తుకొస్తున్నాయి ’ పోస్ట్. మరి నా farewell party మధుర క్షణాలని ప్రోది చేసి మాలిక చేసి ఈ సుమ మాల లో పేర్చలేదూ..? ఇది శాశ్వతం కాదంటారా? మనిషి జీవిత కాలాన్ని శాసించలేముకాని, నా బ్లాగు జీవిత కాలంలో ఈ మధురక్షణాల నుదిటి రాత నేనున్నంత కాలం నాదే కదా అంటే నా చేతిలో ఉన్నదే కదా.. ఎన్నాళ్ళు కావల్సి వస్తే అన్నాళ్ళు. కాదంటారా? మరి మీరు కూడా మీ 10 వ తరగతి వీడ్కోలు కి సంబంధిన అనుభవాల్ని,అనుభూతుల్ని పంచేసుకొండి.
*******
Justify Full

3.23.2009

సరదా సరదా స్వీట్ హోం



అనేసింది! తను అనుకొన్నంత అయ్యింది. ఎంత మాటంది, తనకు తెలుసు ఇలా ఎవరో ఒకరు ఎపుడో అపుడు మాట తూలతారని, అందుకే ఎన్నో సార్లు చెప్పింది తను బుచ్చిబాబుకి.. "నువ్వు మరీ అలా అమాయకుడిలా ఉండకు బుచ్చీ!, ఎవరో ఒకరు మరీ మెత్తనివాడమ్మా.. మీ ఆయన" అని అంటారు అని, ఆహ! వింటేగా.. 'విమల ప్రియే' అంటూ.... రాని చెప్తాను. తను "చెప్పు బుచ్చిప్రియే" అని కరిగిపోకూడదు ...ఇంకెంత చెప్పను.. లౌక్యం తెలీదా అంటే.. పెద్ద లాయరాయే!


"అబ్బా! " ఒక్కసారిగా ఉలిక్కిపడి వేలు చూసుకొంది .. సూది గుచ్చుకొన్నంత మేరా రక్తం వస్తోంది. ఎప్పుడు ఇంతే బుచ్చిబాబు గురించి ఆలోచించడం, ఇలా వేలు గుచ్చుకోడమో..కొసుకోడమో జరగడం.. "పుట్టింటి వాళ్ళ దగ్గిరన్నా కాస్త కనిపించూ బుచ్చీ! " అని చెప్పినా వినడు. మొన్నటికి మొన్న తమ్ముడు ఇంటికొస్తే మాట్లాడొచ్చు కదా.. అహ! "విమలా! అలా బయటికి వెళ్ళోస్తా " అని తప్పుకొన్నాడు. తరువాత "ఎందుకలా బయటికి వెళ్ళడం? బావమరిదితో కాసేపు మాట్లాడొచ్చుకదా!" అని అడిగితే "ఆ.. ఏమి మాట్లాడతాము చెప్పు! అయినా నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వుంటావు కదా ఇంట్లో" అంటూ అటు తిరిగి పడుకొన్న బుచ్చిబాబుని చూస్తే అసలు ఈయన లాయరేనా? నేనేమన్నా తప్పు చేసానా? అని అనిపిస్తుంది. మంచివాడే అని అన్నయ్య చెప్తే కదూ ! తను చేసుకొంది. ... థాంక్ గాడ్ ! పాదాలకింద చోటిమ్మని ఆ పాత విమలలా అడగలేదు. అడిగుంటే ఆ బుచ్చిబాబులా గేలి చేసేవాడో.. నీ స్థానం ఇక్కడ అని హృదయం చూపించేవాడో.. ప్చ్ ఏది ఏమైతేనేమి, ఆ బుచ్చి బాబు కి ఈ బుచ్చిబాబుకి తేడా లేదనిపిస్తొంది . షర్ట్ కి బటను కుడ్తూ టైం చూసింది, అమ్మో! 5 అవుతోంది. ఆకలంటూ వస్తాడు. వస్తూనే వంటిల్లంతా వెతికేస్తాడు. కాసిని పకోడీలు వేసి అసలు విషయం చెప్పాలి. ఎంత మాటంది అతని చెల్లెలు.. ఎంత మంచివాడు, బంగారంలాంటి మనిషిని అంత మాటంటుందా? ఇదంతా బుచ్చి ఇచ్చిన అలుసు కాదూ.....


"విమలా కాసిని మంచినీళ్ళు ఇవ్వూ"


ఆలోచనలో పడి చూసుకోలేదు వచ్చేసినట్లున్నాడు. అనుకొని మంచినీళ్ళు ఇచ్చి, కలిపి ఉంచిన పిండితో పకోడి ప్రహసనంలో పడింది విమల.


"ఆకలేస్తోంది విమలా.. ఏంటి టిఫిన్? "


"వేస్తుంది , వేస్తుంది ఎందుకు వెయ్యదు. నా దగ్గిరే ఈ మాటలన్నీ.. ఎవరన్నా వస్తే మూగవాడేమో అని అనుకొనేట్లు నోట్లో ముద్ద పెట్టుకూర్చుంటారు.. ఓ మాట లేదు మంతి లేదు. కాస్త ఎవరన్నా వస్తే కలివిడిగా మాట్లడడం ఎప్పటికి వచ్చేనూ మీకు? ఇప్పటికి సవాలక్షసార్లు చెప్పాను, అలా మూగనోము పట్టద్దండీ కాస్త నోరు తెరవండీ అని, అహ వింటేనా.. ఎప్పుడు ఎడ్డెమంటే తెడ్డెమనేవాళ్ళకి ఎన్ని చెప్పినా ఒకటే...... " అంటూ విసురుగా పకోడిల ప్లేట్ తీసుకొచ్చి అక్కడ పెట్టింది.


"అబ్బా ఎందుకు విమలా అంత కోపం ఇప్పుడేమన్నాను? టిఫిన్ ఏంటి అని అడిగినందుకు ఇంత క్లాసా?"

"నా ఖర్మ! టిఫిన్ ఏంటి అని అడిగినందుకు కాదు బాబు.. నాతో పాటే మిగితావాళ్ళు మనుషులే .. నీ ధైర్యం నా దగ్గిరే కాదు వాళ్ళ దగ్గిర కూడా కాస్త ప్రదర్శించు అని చెప్తున్నా.."

"హఠాత్తుగా ఎమైంది విమలా నీకు? పొద్దున్న బానే ఉన్నావు కదా, ధైర్యం ప్రదర్శించడాలు అవి మాట్లాడుతున్నావు.. "

"ఆఆఆఆఆ... నిన్నూ.. ఛ! నీకు మంచి చెప్పాలి అనుకొన్నాను చూడు అది నాది తప్పు..నువ్వు మారవిక".

"ఇప్పుడు బానే ఉన్నా కదా ఇంకా మార్పెందుకు? అయినా నువ్వున్నావు కదా విమలా, ఇక నేనెలా ఉన్నా పర్వాలేదు. "

"నువ్వో రాయి.. నీ హృదయం ఓ పెద్ద బండరాయి."

"ఊ అవును.. అందుకే హృదయంలో చోటడగకుండా నీకిచ్చేసాను. విమల ప్రియే!"

"ఛట్! నాకు చాఆఅలాఆ ఖోపంగా ఉంది అలా పిలవకు, మీ చెల్లెలు ఎంత మాటందో తెలుసా అసలు? ఇక నువ్వెప్పుడు తెలుసుకొంటావు?"

" నువ్వు చెప్పందే నేనెలా తెలుసుకొంటాను, ఇందాకే అన్నావు ఎంతమాటందో తెలుసా? అని.. పోనిలెద్దూ విమలా, ఎవరేమనుకొంటే మనకెందుకు? అనవసరంగా నువ్వెందుకు బాధపడ్తావు చెప్పు?"

"ఇదిగో నీ లాయర్ బుర్ర నాదగ్గిర చూపించకు.. ఎవర్నో అంటే నాకెందుకు ఇంత బాధ, అన్నది నిన్నూ.. "

"అసలేమంది విమలా?"


"అబ్బో బుచ్చిబాబు బుద్ధిమంతుడులా అసలేమంది విమలా? ఎంత నెమ్మదిగా అడుగుతున్నాడో.."


" చెప్తే చెప్పు.. లేకపో్తే లేదు, అవునూ వచ్చి ఇంతసేపయింది పిల్లలు కనపడరేం? నా మీద కోపం వాళ్ళమీద చూపించావా?"


"ఆ మరె.. నేనో పెద్ద రాక్షసిని వాళ్ళని రాచి రంపాన పెట్టేస్తున్నాను. ఎక్కడో ఆడుకోడానికి వెళ్ళుంటారు. నువ్వు మాట మార్చకు"


"అబ్బా! పిల్లల గురించి అడగడం కూడా తప్పేనా? సరె చెప్పు, ఏమంది మా చెల్లెలు?"


"ఏమంది మా చెల్లెలు? ఎంత నెమ్మదిగా అడుగుతున్నావో? నువ్విచ్చిన అలుసుకాదూ! అది,.. ఎన్నిసార్లు చెప్పాను, కాస్త ఆ మెతకతనం మానుకో అని వింటేగాఆఅ.."


"ఏమందో చెప్పు విమలా! "

"ఏమంటుంది?
వదినా ముందు అన్నయ్యని మారమనూ.. అలా బుద్ధావతారంలా ఉండోద్దని చెప్పు, కాస్త గట్టిగా అల్లుడి హోదాలో చెప్తే.. ఎవరన్నా వింటారు, అంతే కాని అంత మెతకతనము కూడదొదినా " అని అంది.."

"హ హ్హ హ్హ హ్హ.. అంతేగా ఈ మాత్రం దానికేనా అంత ఉక్రోషం? అంత కోపం? అయినా కోపంలో కూడా భలే అందంగా ఉంటావు విమలా నువ్వు.."

"మీ చెల్లెలు అంత మాటంటే నీకు అది నవ్వులాటగా ఉందా? నేను అందంగా ఉన్నానా? నా కోపం నీకంత ఆటగా ఉందా? "


"లేదు బాబోయ్! లేదు. సరె నేను మారతాను. , ఈసారి నుండి ఎవరూ నన్నేమి అనలేనంతగా మారిపోతాను. "

"నా బుచ్చి బంగారం, అలా ఉండాలి, ఇదిగో ఇంకో రెండు పకోడీలు వెయ్యనా.." ఉ షారుగా అంది.

"ఊ వెయ్యి! బాగున్నాయి , పకోడీలు.. అవును కాని విమల ప్రియే...!"

"చెప్పు బుచ్చి ప్రియే!"

"నిజంగానే కోపంలో కూడా అందంగా ఉంటావు. పకోడీల రుచిలా.."

"ఏంటి పకోడిలకి నాకు పోలికా?"


"అదిగో మళ్ళీకోపం... ఎదో పకోడీలు ఎదురుగా ఉన్నాయని అలా అన్నాను. సర్లే.. కాదులే.. ఎంటో మీ ఆడాళ్ళకి ఎప్పుడు కోపమొస్తుందో, ఏమంటే కోపం వస్తుందో తెలియడం లేదు.. అవునూ.. సాయంత్రం ఏం కూర చేస్తున్నావు?"


"కొరివికారం చేసి పెడతాను, ఛ ఎప్పుడూ తిండి గోల, వంట గోల... నువ్వు మారవు కదా.." విస విసా వంట ఇంటివైపు వెళ్ళిపోయింది విమల.

"ఎంటో ఈ ఆడవాళ్ళు అర్థంకారు" అనుకొన్నాడు బుచ్చిబాబు.

******

ఓ వారం తరువాత.........

"విమలా నేనలా రావు గారింటికి వెళ్ళొస్తా..." బయటికి వెళ్తూ విమలని కేకేశాడు బుచ్చిబాబు.

"ఇప్పటిదాకా బానే ఉన్నావు హఠాత్తుగా ఇప్పుడు బయటికి వెళ్ళడం,, " అంటూ చేతులు కొంగుకి తుడుచుకొంటూ హాల్లోకి వచ్చిన విమలకి సందు చివర్లో అన్నయ్య తమ ఇంటి వేపు రావడం కనపడింది.

నా ఖర్మ.. పకోడీల కోసమో, వంట కోసమో మారతానని మాటలన్నమాట.. ఇక ఈ జన్మకి మారడు.. తన కంఠశోష తప్పితే...

********

స్వీట్ హోం లోని పాత్రలు మాత్రమే తీసుకొన్నాను మిగతా అంతా నా సొంతమే..సరదాగా రాద్దామనిపించి..ఇలా..

3.21.2009

బిల్ గేట్స్ - మైక్రో సాఫ్ట్


అవునూఉఉ.. బిల్ గేట్స్ మైక్రో సాఫ్ట్ ని ఎందుకు అమ్మేశారో తెలుసా......



...............







................







...................






.....................



.........................

నాకు తె
లుసిందోచ్...

ఎందుకంటే బాంట సింగ్ అనే పెద్దమనిషి బిల్ గేట్స్ కి ఒక లెటర్ రాసారట. మరి చదివేద్దాం మనము వచ్చేయండొచ్చేయండి. ..


******

సబ్జెక్ట్ : నా కొత్త కంప్యూటర్ లో తలెత్తిన సమస్యలు.

డియర్ మిస్టర్ బిల్ గేట్స్,

మా ఇంట్లో మా వాళ్ళ కోసం మేమో కొత్త కంప్యూటర్ కొన్నాము. కొన్నప్పటినుండి మేము ఆ కొత్త కంప్యూటరు తో చాలా సమస్యలని ఎదుర్కొంటున్నాము. అవన్నీ మీ దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నమే ఈ లేఖ.

1. ఈ కంప్యూటర్ కి సంబంధించి ’start' బొత్తాం ఉంది కాని 'stop' బొత్తాం లేదు. కొంచం మీరు ఈ విషయం శ్రద్ధ తీసుకొంటారని మా విన్నపం.

2. మరొక విషయం ఏమనగా.. ఎదైనా menu ని ఆపరేట్ చేయడానికి 'run' అనే బొత్తాం ఉండడం వల్ల నా స్నేహితుడొకడు అది నొక్కి అమృత్ సర్ పరిగెత్తాడు. అందువల్ల కొంచం మాపై దయ ఉంచి ఆ’ run’ అనే బొత్తాం ని ’sit’ గా మార్చినచో మేము కూర్చుని 'menu 'ఆపరేట్ చేసెదము.

3. ఒక చిన్న సందేహం ఈ కంప్యూటర్ లో ’re-cycle’ అని ఉంది, దాని బదులు ’re-scooter’ లభిస్తుందా? నేను స్కూటరు వాడుతున్నాను అందుకని ఈ కోరిక..

4. మొన్నా మా ఇంట్లో తాళం చెవి పోయింది కంప్యూటర్ లో ఉన్న ’find' బటన్ ద్వారా ఎంత ప్రయత్నించినా దొరకలేదు. ఈ సమస్య పరిష్కారం కనిపెడ్తారని మేము ఆశిస్తున్నాము.

5. మా బాబు 'microsoft word ' నేర్చుకొంటున్నాడిప్పుడు. మరి తరువాత ’microsoft sentence ' నేర్చుకోవాలంటే ఎలా? ఈ సౌకర్యం ఎప్పుడు అందుబాటులో ఉంటుంది?

6. నాకనిపించిన ఇంకో విచిత్రమైన విషయం మీరు 'enter' బటన్ ఎలా ప్రెవేశపెట్టారు, ’exit '’ బటన్ లేకుండా??

7. మరింకో వింత విండోస్ లో ’my pictures' అని ఉంది కాని తెరిచి చూస్తే అందులో ఒక్కటి కూడా నా ఫొటోలేదు. నా పోటో ఎప్పుడు పెడ్తారు అందులో?

8. నేనేమో కంప్యూటర్ ఇంట్లో వాడుతున్నాను కాని అందులో ’microsoft office " అని ఉంది మరి అదెప్పుడు ’microsoft home" గా మారుస్తారు?

9. అందులో "my recent documents" ఉంది . మరి "my past documents " ఎలా?

10. మీకెలా థాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. ఈ కంప్యూటర్ లో "my network places " ఉంచారు కాని "my secret places" లేదు కాబట్టి "హమ్మయ్య" అనుకొంటున్నాను.

రిగార్డ్ లతో
బాంట.

చివరిగా చిన్న ప్రశ్న.. మీ పేరు ’Gates ' కదా మరి మీరు "windows" ఎందుకు అమ్ముతున్నారో తెలుసుకోవచ్చా?? :)

******

నాకొచ్చిన e-mail ని సరదాగా ఇలా తెలుగీకరించాను చిరునవ్వులు చిందిచేయండి మరి...

3.19.2009

చిన్న విశ్లేషణ

ఆ మధ్య ఒకసారెప్పుడో మావారికి నాకు మాట మాట పెరిగి ఎవరికి వారం ఎడమొహం పెడమొహం అయ్యి పరాకు పరాకుగా ఉన్నాము. ఆ కోపంలో నేను ఇంట్లో వంట కూడా చెయ్యలేదు. పిల్లలికి మటుకు అమ్మ వాళ్ళింట్లో భోజనం చేసేయ్యమని చెప్పేసి నేను ఆఫీసుకి వెళ్ళాను. కాని ఎందుకో ఎక్కడో పాపం తనేమి చేస్తున్నారో ఇంట్లో అన్న ఫీలింగ్ .. ఇక ఉండబట్టలేక ఇంటిదగ్గిర వాళ్ళ ఫ్రండ్ కి ఫోన్ చేసి [మావారికి చేసినా సరిపోయిఉండేది ప్చ్! ఎక్కడో బెట్టు సడలక..:)] "ఇలా ఎదో చిన్న ప్రాబ్లం వచ్చింది ఇంట్లో వంట చేయలేదు కొంచం చూడండి .." (బయట ఎంతో అవసరం అయితే కాని చెయ్యరు ) అని చెప్పాను.

ఓ గంట తరువాత ఫోన్ చేసి "మా ఇంట్లో భోం చేసారు మీరేమి కంగారు పడకండి " అని చెప్పారు. "హమ్మయ్య" అని అనుకొన్నాను. ఇక్కడే నాకు తెలియకుండా నేను మూడో వ్యక్తికి కొంచం అవకాశం ఇచ్చేసాను. మేమిద్దరం ఎందుకు గొడవ పడ్డాము అనే విషయం శ్రీవారు పొరపాటున కూడా ఎవరికీ చెప్పరు. తనంత తను బయటపడేది చాలా అంటే చాలా తక్కువ.

ఆరోజు సాయంత్రం సదరు ఫ్రండ్ నాతో అన్నమాటలు "ఇద్దరూ ఏమి గొడవలు పడ్డారో తెలీదు. కాని ఈరోజు కొత్తగా వచ్చినవి కాదు ఈ సమానత్వ గొడవలు? మీరొచ్చి హఠాత్తుగా మారిపొమ్మంటే మారిపోయేది కాదు ఈ లోకం.. ఆయన తేకా (డబ్బులు)తప్పదు, మీరు చేయకా(వంట ) తప్పదు. ఎందుకిలా అనవసరపు గొడవలు " అని చిన్న ఉపన్యాసం ఇచ్చేసి తన బాధ్యత తీరినట్లుగా వెళ్ళిపోయారు.

ఆ స్నేహితుడు మాటల ద్వారానే తెలిసింది నాకు మావారేమి గొడవ సంగతి చెప్పలేదు అని, ఎందుకంటే మా ఇద్దరిమధ్య సమానత్వ గొడవలు రావు సాధరణంగా. కాని తన బాధ్యతగా చెప్పాలి కాబట్టి చెప్పారు ఆ స్నేహితుడు అంతె. ఇదంతా ఒక ఎత్తయితే ఆయన పైన అన్న మాటలు గమనించండి ఒకసారి. "ఆయన తేకా (డబ్బులు)తప్పదు, మీరు చేయకా(వంట ) తప్పదు. ఎందుకిలా అనవసరపు గొడవలు".

ఇక్కడ చిన్న విశ్లేషణ: నిజానికి ఆ స్నేహితుడు ఒక మంచి ఉద్దేశ్యంతో మమ్మల్నిద్దరిని కలపాలనే ఆలోచనతో చెప్పిన నాలుగు మంచి మాటలు. నిజానికి అతనిది సదుద్దేశ్యమే కాని మగవాడికైనా ఆడవాళ్ళకైనా చిన్నప్పటినుండి పెంపకం వల్ల అయితేనేమి, కుటుంబంలో మొదటినుండి ఆచార వ్యవాహారల అవగాహన వల్ల అయితేనేమి మగవాడు సంపాదించి తీసుకొని రావడం, ఆడవాళ్ళు వంట చెయ్యడం అంతే. ఇది మారదు. మారాలి అని కూడా నేను ఆవేశపడటం లేదు. నేను ఇక్కడ చెప్పేది నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను కదా... అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే నేను తెస్తున్నాను కదా! మరి అది ప్రస్తావనలోకి వచ్చిందా? అంటే ఆడవాళ్ళు ఉద్యోగం చేసినా లెఖ్ఖలోకి రాదు. కుటుంబ బాధ్యతలో భాగంగా నేటి మహిళలు వంట ఇంటి బాధ్యతతో పాటు ఉద్యోగ బాధ్యత కూడా నిర్వహిస్తున్నారు కాని నలుగురిలో మాట్లడేప్పుడు మటుకు ఇలా సామ్యం చెప్పినట్లు "ఆయన తేకా తప్పదు మీరు చేయకా తప్పదు" అని. మా అత్తగారు అంటుండేవారు "లక్షలు సంపాదించినా ఆడది ఆడదేనమ్మా... పది రూపాయాలు సంపాదించే మగవాడికి సరి రారు అని.. " ఈ విషయంలో ఎవరూ బయటపడరు కాని ఎప్పుడో అప్పుడు నరనరాల్లో జీర్ణించుకు పోయిన ఈ తత్వం వాళ్ళకి తెలియకుండా బయటపడ్తూనే ఉంటుంది. ఉద్యోగం పురుష లక్షణం అన్న సామ్యం ఉంది, కాని స్త్రీ లక్షణం వంట చెయ్యడమే ఉద్యోగం చేసినా లెక్కలోకి రాదు అని చెప్పకనే చెప్తారు మనకి.

మన ముందు రెండు తరాల తీసుకొంటే అక్కడ అప్పటికి ఆడవాళ్ళు బయటికి రాకూడదు నాలుగు గోడలమధ్యే అని అనేవారు సో, అక్కడ మగవాడు తీసుకురావడం, ఆడవాళ్ళు వంట చేయడం అంతే. మరి వాళ్ళు జీవితాంతం అదే పనిలో ఉన్నట్లే కదా. ఇల్లు చక్కబెట్టుకోడం, పిల్లలిని చూసుకోడం.

ముందుతరం దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ఎంతోమంది తమ తమ బార్యలు ఉద్యోగాలు చేయవలసిన అవసరం లేదు అనో ఇష్టం లేదు అనో ఇంట్లోనే ఇంట్లోనే ఉంచేస్తారు . అంటే స్త్రీ బయటికి రాకుండా ఉన్నంత కాలం స్త్రీలకి ఉన్న వ్యాపకం ఏమిటి? వంట పిల్లలు, పని, అతిధి మర్యాదలు మొ! ఇలా ఎంత కాలము అంటే జీవించినంత కాలం .. ఉద్యోగం చేస్తున్న మహిళలికి కూడా ఇంతేగా మార్పంటూ ఏమి లేదుగా. అసలు ఉద్యోగమో వ్యాపారమో చేసినా చేయకపోయినా స్త్రీకి ఒకటే జీవితం సంసారం, ఇప్పుడు కొత్తగా వచ్చింది సంపాదన. డబ్బు అవసరం లేకపోయినా ఆడవాళ్ళకి ఇంకో వ్యాపకం అంటూ ఏమి లేదు , ఒకే ఒక బాధ్యతని విసుగు చెందకుండా.. నిర్వహిస్తున్నారు.

ఇప్పుడిదంతా ఎందుకు రాశాను అంటే "అప్పుడేం చేస్తారు?" అన్న పోస్ట్ కి వ్యాఖ్య రాద్దామనుకొంటే అనుకోకుండా మదిలో ఇన్ని ఆలోచనలు. ఈ "అప్పుడేం చేస్తారు?" అన్న ప్రశ్న పురుషులకి సంబంధినదే కాని స్త్రీలకి కాదేమో! స్త్రీలకి ఉద్యోగం లేకపోయినా, డబ్బు సంపాదన అన్న అవసరం లేకపోయినా ఎప్పటికి తీరని బాధ్యత కుటుంబాన్ని చూసుకోడం. గృహలక్ష్మి బాధ్యత నిర్వహించడం, మరి నా ఆలోచన తప్పంటారా?
*****

3.12.2009

ఈ భావ సరళి ....తరలి పోదాం రమ్మంటి....

"శుబ్బరంగా కాసిని కుంకుడుకాయలు కొట్టుకొని, అంత మందార నూని తలకి పట్టించి, కుంకుడుకాయ రసంతో తలంటుకొంటే బుర్రలో ఉన్న మట్టి కూడ వదిలిపోదూ.. వెధవ షాంపూలు పట్టిస్తారు తలకి, ఓ మెరుపా పాడా? పాతికేళ్ళకే పండువెంట్రుకలొస్తాయి చెబితే వినరూ... అంటూ... పసుపు, సున్నిపిండి రాసుకొంటే వంటికి పచ్చదనం వస్తుంది. నునుపుదనం అలాగే ఉంటుంది. ఈ సబ్బులులు షాపూలు శరీరం బిగుసుకు పోయేలా చేస్తాయి. అభ్యంగ స్నానం అంటే చక్కగా వెన్న, మీగడ, పసుపు ,సున్నిపిండి, కుంకుడుకాయలు, మందారనూనే ఇవే ..." అంటూ వంటినిగారింపులకి , జుట్టు మెరుపుల గురించి ఆరోగ్య సూత్రాలు అలా అలవోకగా చెప్పేది అమ్మ.
******

అసలు పండగ అంటే కొత్తబట్టల కోసం, చక్కటి పిండివంటల కోసం అయితే పండగ రావాలి దేవుడా.... దేవుడా ....అని దండం పెట్టుకొనేదాన్ని కాని, మా అమ్మ చేసే హడావి
డి , హంగామలకి అబ్బా! పండగ వచ్చిందా అనిపిస్తుంది. ఏంటింతకీ ఆ హడావిడి, హంగామా అంటారా? రండి మీరు చూద్దురు గాని, నాకైతే "అమ్మో పండగలొస్తున్నాయి" అని పరిగెత్తాలనిపిస్తుంది.
*****


"అయ్యో! అయ్యో! అయ్యో! బారేడు పొద్దెక్కింది, వెధవ నిద్దర్లూ మీరునూ, ఆడపిల్లలు కాదూ.. లేవండి లేచి ఆ బాయ్లేర్ అంటించండి. ఇంకా నేను బోల్డు పనులు చేయాలి, ఇంత గొంతు చించుకొని అరుస్తున్నా లెవరేమిటి?? "

"అబ్బా అమ్మా ఎందుకలా అరుస్తావు? లేస్తున్నాము కదా.. ఇంకా టైం నాలుగయ్యింది అంతే ...మరీ ఇంత పొద్దున్నే లేపుతావెందుకమ్మా.. పండగేమి చేసుకోద్దులే పడుకొంటామని.. ఇద్దరం ముణగదీసుకొని పడుకొనే వాళ్ళము(నేను అక్కా)"

"అరుస్తున్నానట .. అయినా అరిస్తేమటుకు ఒక ఇంచన్నా కదిలారా.. ఆ మంచం మీంచి? ఊరు ఊరంతా లేస్తున్నారు కాని మీరు మటుకు లేవరంటూ"
వీపుమీద ఫడీల్మనిపించేసరికి కిక్కురుమనకుండా లేచేవాళ్ళము. "




తరువాత మొదలు అసలు ప్రహసనం, అక్క కుంకుడుకాయలు కొట్టడం నానపెట్టడం, నేను బాయ్లెర్ వెలిగించి, నీళ్ళూ కాగేదాకా, చెక్కలు అవి చూసి అందులో వేస్తూ ఆ పొగలో నానా తంటాలు పడేదాన్ని. అతరువాత ఇంట్లో ఉన్న ఇత్తడి సామాను తళ తళా మెరిసేలా చెయ్యడం, ఒకటా రెండా ఎన్ని పనులని, కడుపు చించుకొంటే కాళ్ళమీద పడ్తుందంటారు.. వాకిలంతా ఒకళ్ళూ తుడిస్తే ఇంకొకళ్ళు ముగ్గులెయ్యడం.. (పండగలొస్తే కొంచం స్థలం కూడా ఖాళీ గా ఉంచకూడదు మొత్తం ముగ్గులతో నింపాల్సిందే మా ఇంటి మహరాణి, మా అమ్మ హుకుం జారీ చేసేది) ఇలా పనులన్నీ తెమిలేసరికి తెల్లారేది. ఇక అప్పుడు వెన్న, పసుపు, సున్నిపిండి ఇక ఆ హంగామ చెప్పనక్కరలేదు. ఒంట్లో ప్రాణాలన్ని నీరసించిపోయేవి. ఆ తరువాత మా అమ్మ దయ... ఓ గ్లాస్ కాఫీ అందించేది. మధ్యలో ఎక్కడో పని చేస్తున్నప్పుడు "రండర్రా! కాస్త కాఫీ తాగుదురూ " అనేది కాని, అలా పని ఆపేసి కాఫీ తాగడం.. ఎంటో అక్కకీ నాకు కూడా అస్సలు మనస్కరించేది కాదు. అప్పుడు తాగిన కాఫీ కి కాస్తంత అడుగంటిన ప్రాణం లేచొచ్చి, కొత్త బట్టలు... అని మారాం చేసేది. అది అయిన తరువాత పండగ బట్టలు వేసుకొని ఇహ ఒకటే పరుగులు ఇరుగుపొరుగుకి చూపించాలనే ఆత్రంతో.... ఇంత సందడి సందడి గా జరిగే అప్పటి పండగలు పొద్దున్న.. ఎందుకొస్తాయిరా బాబు ఈ పండగలు?? .... అనిపించినా భోజనాలప్పుడు మటుకు అదరహో ! పండగ.. అనిపించేది.
******

అలాంటి ఇన్ని మన తెలుగువారి పండగల మధ్య.. అస్స
లు పొద్దున్నే లేవాల్సిన అవసరం లేని పండగ, అస్సలు పొద్దున్నే స్నానం చేయాల్సిన అవసరం లేని పండగ, కొత్త బట్టలు కొనుక్కోనవసరం లేని పండగ ఏంటో చెప్పుకోండి చూద్దాము. కాని ఈ పండగ ప్రత్యేకత ఒక్కటే, చిన్న పెద్దా ఎవరు ఎవరో తెలియనక్కరలేదు. వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు. వచ్చినవాళ్ళందరూ మనకి మిత్రులే... బోల్డు సందడే... సందడి.... ప్చ్! చెప్పుకోలేకపోతున్నరా? పోని నేను చెప్పేయనా... రేడీ 1.....2.......3......



"రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బర్సే...................."

"వయసంతా ముడుపుకట్టి.. వసంతాలే ఆడుకొందాము
......"

సరదా సరదా హోలీ...
మిత్రుల
సరాగాల కేళీ .....
ఇది నా సర
దా భావ సరళి
మరి ఈ మధురభావ సరళిలో తరలి పోదాం వస్తున్నారా....

హో లీ శు భా కాం క్ష లు.

అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ అనురాగ మాల...
నా బ్లాగు సుమమాల.... మధుర భావాల సుమమాల ఇప్పుడు పూర్తిగా నాదే.... నా సొంతమన్నమాట. గమనించారా నా వెబ్ ఎడ్రస్? నా సొంత డొమైన్ తో ఏర్పర్చుకొన్న నా సరాగాల మాల ఈ మధుర భావాల సుమమాల. ఇప్పుడు నా సొంత బ్లాగు అడ్రస్ www.sumamala.info తెలుగురత్న సౌజన్యంతో ఈ మమతల మాలిక నా సొంతమయ్యింది. తెలుగురత్న వారికి కృతజ్ఞతలు.


3.07.2009

నా పేరు చెప్పుకొండి మీలో ఎవరన్నా......

"congratulations మీకు ఫిమేల్ బేబి పుట్టింది" .

"మళ్ళీ ఆడపిల్లా? ప్చ్!" దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడా తండ్రి.

"ఇంటికి మహలక్ష్మి పుడితే ఎంటిరా ఆ నిరుత్సాహం? ఆనందపడక. రెపొద్దున్న చూడు అదెంత పేరు తెచ్చుకొంటుందో .. " తండ్రి నిట్టూర్పుకి ఆ ఇంటి పెద్దావిడ ఇచ్చిన సమాధానమది. అంతటి పేరు తెచ్చుకోబోయే ఆ మహాలక్ష్మి కి జన్మనిచ్చిన ఆ తల్లి పేరు ఆ తండ్రికి బార్య అంతే. ఆ ఇంటి పెద్దావిడ పేరు? అతనికి అమ్మ.
********

"ఏంటి అందరూ హడావిడి గా ఉన్నారు ఏంటి విశేషం? " ఇంట్లోని ఆడవాళ్ళంతా అలంకారాల హడావిడిలో ఉంటే ఆ ఇంటి యజమానికి కలిగిన సందేహం అది.



"ఏంటి విశేషం అని నెమ్మదిగా అడుగుతారేంటండి? పక్కింటి "రామారావు గార అమ్మాయి"పెద్దమనిషి అయ్యిందిట, పెద్ద ఎత్తున ఫంక్షన్ చేస్తున్నారట, చేసుకొన్నవారికి చేసుకొన్నంత, ఆ "అమ్మాయి ఎంత అదృష్టం చేసుకొందో.. కలిగిన వాళ్ళింట్లో పుట్టింది, కనీ వినీ ఎరగని రీతిలో చేస్తున్నారట. ఊరు ఊరంతా వెళ్ళడానికి హడావిడి పడ్తుంటే మీరు నిమ్మకి నీరెత్తనట్లు అంత నెమ్మదిగా ఏంటి విశేషం అని అంత నింపాదిగా అడుగాతారేంటండి? విడ్డూరం కాకపోతేనూ.... " మెటికలు విరిచిందా ఇంటి ఇల్లాలు. ఇంతకీ ఆ రామారావు గారి అమ్మాయి పేరు??

*******

"ఏంటి అక్కడ అంత గుంపు? ఏం జరుగుతోంది? ఎవరో కొట్టుకొంటునట్లు ఉన్నారు?"

"ఆ "అబ్బాయి చెల్లెలిని " ఎవరో ఏదో అన్నారట, అంతే అన్నవాళ్ళో గ్రూపు, తన్నేవాళ్ళో గ్రూపులుగా విడిపోయి కొట్టుకొంటున్నారు"

"ఆహ! ఇంతకీ ఎవరా చెల్లెలు? పేరేంటి?"

"ఎవరికి తెలుసు? అందరూ ఫలనా వాళ్ళ చెల్లెలు రా... బాబు , ఆమెతో మనకెందుకు అనుకొంటూ ఉంటారు."

మరి ఆ చెల్లెలి పేరు?

********




"ఆకాశమంత పందిరి, భూలోకమంత పీట వేసి చాలా బాగా చేసారు, పెళ్ళి, విందుభోజనాలు చాలా రుచి గా ఉన్నాయి. ఫలనా వారింట్లో పెళ్ళి అంటే పరిగెత్తుకొని వచ్చేట్లు చాలా సందడిగా సరదాగా జరిగిందికదూ. ఏది ఏమైనా " మా వాడికి కాబోయే బార్య " చాలా అదృష్టవంతురాలు.

ఆ కాబోయే బార్య పేరు? ..ఫోని వధువు తరుపువాళ్ళు చెప్తారేమొ అడుగుదామా?

"అబ్బో ఆ రాజుగారు వాళ్ళమ్మాయి పెళ్ళి ఘనంగా చేసారండి. కనీ వినీ ఎరుగుదుమా ...ఇంత ఆర్భాటం, దేనికన్నా పెట్టిపుట్టాలమ్మా!"

ప్చ్! ఇక్కడ తెలిసేట్టులేదు శుభలేఖలు చూసుకోవాల్సిందే....
*******

ఇలా ఒకరికి అమ్మగా, ఒకరికి కూతురుగా, ఇంకొకరికి చెల్లెలిగా మరొకరికి బార్యగా పలు రకాల పాత్రలు సమర్థవంతంగా నిర్వహిస్తూ.. తన ఉనికిని తనవాళ్ళలో చూసుకొంటున్న మహిళలకి ఈరోజుని వాళ్ళకోసం అని కేటాయించేసారు. మరి ఒకసారి మనమెవరో తెలుసుకొని, మనకోసం పాటుపడ్తున్నవాళ్ళని తలుచుకొని మనకి మనం శుభాకాంక్షలు చెప్పేసుకొందామా..

మహిళలకు, బ్లాగరిణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

3.06.2009

ఏ నిముషం నాది?


"అమ్మా కంప్యూటరు ముందు కూర్చుంటే ఒప్పుకొనేది లేదు ఎప్పుడూ కంప్యూటర్ ముందే ఉంటావు, కొంచం మమ్మల్ని కూడ చూడమ్మా!?

పొద్దున్న మా పాప అన్న మాటలవి. నిజానికి నిజంగా నాకు చాలా కోపం వచ్చేసింది, ఆ కోపం అంతా శ్రీవారి పై చూపించేసాను. అసలు నాకంటూ నేను ప్రత్యేకంగా ఇంత టైం అని కేటాయించుకొన్నానా? నేను ఏమి చెయ్యడం మానేసి కంప్యూటర్ ముందు కూర్చుంటున్నాను? నాకు సంభందించిన పనులన్నీ, ఒక బాధ్యత అనుకొని చేస్తున్నానా? లేక ప్రేమగా చేస్తున్నానా? నా ఇల్లు నా సంసారం అని అనుకోపొతే నేనిలా చేయగలనా" అంటూ ఆయన మీద విరుచుకుపడితే, ఓ గొప్ప చిరుమందహాసమిచ్చేసి....

"ఉరుమురిమి మంగలం మీద పడ్డట్లు , పాప ఏదో అంది అని నువ్వు నన్నాడిపోసుకోడం బాలేదు అత్తమీద కోపం దుత్త మీద చూపిచినట్లుంది" అంటూ వెళ్ళిపోయారు.

అంతేలెండి, వీళ్ళెప్పుడు అర్థం చేసుకొన్నారు కనక మనల్ని ....అలా అనేసుకొని అసలు నా రోజు వారి కార్యక్రమాలను ఓ సారి తరిచి చూస్తే , అసలు ఈ వారం రోజులు, ఈ 168 గంటలు, ఈ 10080 నిముషాలలో ఏ ఒక్క నిముషం నాది అని ఆలోచిస్తే..ప్చ్!

ప్రతి మనిషి తన జన్మకి పరమార్థం తెలుసుకొని ........
తనకోసమే కాక, పరులకొరకు బ్రతకాలి ....
తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి. ...

హ హ :) మన జన్మ పరమార్థం .... పిల్లలు, శ్రీవారు అంతే, అసలింక ఆలోచించడానికి టైమేది? అసలిందులో భాగంగా నేను ఒకసారి నా రోజు వారి కార్యక్రమాలను నా కళ్ళ ముందు గిర గిరా తిప్పుకొన్నాను.

పొద్దున్న 5 గంటలకి మెలుకువ వస్తే, కాస్త అటు ఇటు బద్ధకాన్ని బుజ్జగించి మళ్ళీ కలుద్దామని పంపించేసరికి 5.30 అవుతుంది. ఇహ పనులు నన్ను వేటాడి మరి ఆ పని అయ్యేదాకా నన్ను వదలవు.

మొదట అమ్మ పాత్ర, పిల్లలు స్కూలు, హడావిడి, వంట, ఈలోపులోనే ..ఇంటి ఇల్లాలి పాత్ర ... ప్రతిరోజు వచ్చే పేపర్ ,పాలు, పనమ్మాయి హడావిడి 'ఇల్లాలే ఇంటికి దీపం అనుకొని ఇవన్నీ ముగిసేసరికి ఆఫీసు టైం అవనే అవుతుంది.


ఆఫీసులో మేనేజర్ పాత్ర: ఫైల్స్ , ఒక్కొక్కళ్ళు రావడం, వాళ్ళ సందేహాలు తీర్చడం, లంచ్ టైం ఎవరో గుర్తు చేస్తే కాని తెలియడం లేదు. అక్కడ మన పాత్ర ముగిసింది హమ్మయ్య అనుకొనేలోపు, మళ్ళీ అమ్మ పాత్ర "నేనున్నాను" అంటూ మన పక్కకి ఒద్దికగా వచ్చేస్తుంది. "అబ్బా ! పొద్దున్న చూసాగా నిన్ను కాసేపాగి రా అని బుజ్జగిస్తే, "అహ! పిల్లలు ఆకలి " అంటున్నారు అని మారాం చేస్తుంది మరిక తప్పుతుందా, మళ్ళీ 'అమ్మ అన్నది ఒక కమ్మని మాట' అని నడుము బిగించాల్సిందే. మళ్ళీ అంతా అయి హమ్మయ్య! ఇప్పుడన్నా "నా కోసం" అంటూ ఈ చిన్ని సమయాన్ని కేటాయించుకొందామంటే, శ్రీమతి బహుమతి అంటూ శ్రీవారి పిలుపు. ఇక మరి ఈ 10080 నిముషాల్లో మన నిముషం ఏది?

మరి ఇంతలా చేస్తున్నా మా పిల్లలో, మా శ్రీవారో "ఎప్పుడు కంప్యూటర్ ముందే ఉంటావు" అని నిలాపనిందలు వేసేస్తున్నారు. మరి మీరు చెప్పండి ఈ టైం సమస్య నాదేనా? మీకందరికి ఉందా ? ఎందుకంటే మనందరికి ఉన్నది రోజుకి 24 గంటలే, వారానికి 168 గంటలే, 10080 నిముషాలే మరి నేనే ఇలా అనుకొంటున్నానా? అసలిందులో కేవలం " ఈ నిముషం నాది" అనుకొనే నిముషం ఏది? ఇప్పుడు నేను రాస్తున్న ఈ పోస్ట్ కూడ ఒకవిధంగా మీ కోసం , నా సందేహ నివృత్తి కోసం. మరి నా సందేహం తీరుస్తారు కదూ.... :-)

3.04.2009

గోరింటాకు - మురిపాల అరచేత మొగ్గ తొడిగింది.


"అన్నయ్య తాగిన ఆ కాఫీ గ్లాస్ కడిగి తీసుకురామ్మా! కొంచం".

"ఉహు నేను తీసుకురాను, నా చేతులు పాడైపోతాయి."

"ఇంతట్లోనే చేతులు పాడై పోతాయా? వేషాలు కాకపొతేను.. తన్నెస్తాను మాట వినకపోతే, గారం ఎక్కువైపోయింది నీకు రోజు రోజుకి.."

"నువ్వెనన్నా తిట్టు.. నేను తీసుకొని రాను గాక తీసుకొని రాను, నీళ్ళు పడితే చేతులన్ని పాడైపోతాయి."

"దీనికి బాగా పొగరెక్కువయ్యింది. అస్సలు మాట వినడం లేదు, సాయంత్రం స్కూల్ నుండి రా చెప్తా నీ పని, వీపుమీద నాలుగంటిస్తే కాని దారిలోకి రావు, వెళ్ళు వెళ్ళి స్నానం చేసి తొందరగా తయారయి స్కూల్ కి వెళ్ళు. "

"ఉహు ! అమ్మా ఈరోజు నేను స్నానం కూడా చెయ్యను, స్నానం చేస్తే సబ్బు వాడాల్సివస్తుంది, మొత్తం చెయ్యంతా పాడైపోతుంది, ఫ్రండ్స్ అందరికి రాత్రి పెట్టిన గోరింటాకు చూపించాలి, ఎంత ఎర్రగా పండిందో తెలియద్దా ఏంటి? ఈ ఒక్కరోజు ప్లీజ్ అమ్మా! నేను స్నానం చెయ్యను."

"ఒహో! ఈ సంబరమంతా గోరింటాకు గురించా, ఆమాత్రం గ్లాస్ కడగడానికీనీ, స్నానం చేస్తేనూ... ఎరుపు తగ్గిపోతుందేమిటి? స్నానం చెయ్యి... ఇంతట్లోకి ఏమి అయిపోదు."


"నేను అందుకే చెప్పానమ్మా! రేపు పుట్టినరోజయితె ఈరోజు గోరింటాకు పెట్టుకొంటారు కాని నువ్వు నిన్న పెట్టావు. రేపటికి ఈ ఎరుపంతా పోయి చెయ్యి పాతబడిపోతుంది. పో! నేనసలు ఏ పని చెయ్యను. అన్నం కూడా నువ్వే తినిపించు. నేను తింటే మళ్ళీ చెయ్యి కడుక్కోవాలి. ఈరోజంతా ఇలా కొబ్బరినూని రాసుకొంటూ ఈ రంగు పోకుండా జాగ్రత్తగా చూసుకొంటాను..

"అంబలి తాగేవాడికి మీసాలెత్తేవాడొకడని, నన్ను చంపేస్తున్నావు, నీ వెనకాల పదిమంది ఉండాలి అనే మనస్తత్వం మంచిది కాదు ముందే చెప్తున్నా.. రేపొద్దున్న పెద్దదానివయ్యాక ఇలాగే చేసావంటే అత్తారింట్లో బడిత పూజ చేస్తారు.. నీకు గోరింటాకు పెట్టాలి, అన్నం తినిపించాలి....ఇలా అడుగులకి మడుగులొత్తడం నావల్ల కాదు, ఈసారి గోరింటాకు పెట్టమ్మా! అని రా... చెప్తాను. గోరింటాకు పేరు చెప్పి పనులన్నీ ఎగ్గొట్టేస్తున్నావు."
********

గోరింటాకు నాకు చాలా ఇష్టం. అలా అమ్మ చేత ఎన్ని తిట్లయినా తింటాను కాని, చేయి ఎర్రగా పండిన తరువాత నా స్నేహితులకి చూపించేదాకా నేను పేషంట్ లా అన్నీ సపర్యలు చేయించుకొంటూ ఉండేదాన్ని.

గోరింటాకు మీకేనేంటి మాకందరికీ ఇష్టమే అంటారేమో. .... :) గోరింటాకు, కాళ్ళకి పసుపు లాంటివి మాకిష్టం లేదు అని అనేవాళ్ళేవరండి అసలు.. ఏదో కాస్త తెలియక గోరింటాకా...ఛీ ఛీ, పసుపా..ఛ, ఛ అని అంటారు కాని,

ఎంచక్కా పండీన ఎర్రన్ని చుక్క....
చిట్టీ చేమంతానికి శ్రీ రామ రక్ష.....
కన్నె పేరంటానికి కలకాలం రక్ష....అంటూ

గోరింటా పూచింది కొమ్మా లేకుండా.....
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది....

అని మురిపెంగా అమ్మ అలా అంటూ పెడ్తుంటే , "గోరింటాకు అంటే నాకిష్టం లేదు" అని అన్నవాళ్ళని వాళ్ళకి మంచి అభిరుచి లేదు అని అనుకోవాలి. ఇప్పుడంటే ఈ గోరింటాకు కోన్ లాంటివి వచ్చాయి కాని, అప్పట్లో అయితే ఆషాడమాసం, అట్లతద్ది, గోరింటాకు సందడే సందడి. ఎక్కడ దొరుకుతుందో వెతికి పట్టుకొని మరి ప్రతి ఆకు కోసి , జాగ్రత్తగా తీసుకొని వచ్చి ఇస్తే , అమ్మ మెత్తగా రుబ్బి ఎప్పుడెప్పుడు పెడ్తుందా అని ఎదురుచూడడం ఎంత బాగుంటుందో.. ఉట్టప్పుడు బారెడు పొద్దెక్కినా... మా అమ్మ అరిచి, గీ పెడ్తున్నా.... లేచేవాళ్ళము కాదు కాని, ఈ అట్లతద్దికి మాత్రం తెల్లవారుఝాముకన్నా ముందే లేచి, జామ చెట్టుకు ఉయ్యాలొకటి కట్టేసుకొని, చేతినిండా గోరింటాకు ఎరుపుదనంతో....


"అట్లతద్దోయ్
ఆరట్లోయ్
ముద్దపప్పొయ్
మూడట్లోయ్ "

అని చుట్టుపక్క పిల్లలందరం కలిసి పట్టు పావడాలు కట్టేసుకొని పాడుకొంటూ ఉయ్యలూగుతుంటే, ఆ అనుభూతి ఇలా మాటల్లోను, రాతల్లోను చెప్పనలవా....రాత్రి గోరింటాకు పెట్టి ఓ పెద్ద ప్లాస్టిక్ కవర్లు రెండు చేతులకి పెట్టి తాడు కట్టి , మంచం కోడుకి కట్టేసేది అమ్మ, చెయ్యి కదపడానికి వీలు లేకుండా, అలా కట్టినందుకు రాత్రి ఎంత బాధ పడినా, పొద్దున్నే ఎర్రగా పండిన చేతులు చూసుకొంటే ఎంత ఆనందం వేసేదో. చేతులు రెండు అందంగా మెరిపోతుంటే, అబ్బా! ఇలా ఉండిపోతే బాగుండుననిపిచేది. కలర్ తగ్గుతున్న కొద్దీ ఉసూరుమనిపించేది. ఇహ మళ్ళీ పెట్టమన్నా పెట్టరు. "మొన్నేగా పెట్టించుకొన్నావు" అని కసిరేవాళ్ళు. ఏది ఏమైనా ఇప్పుడు ఆ గోరింటాకు సహజత్వం , పసుపు పారాణి సాంప్రదాయం ఎక్కడా కనిపించడం లేదు.
******
"ఆంటీ ఈరోజు నా పుట్టిన రోజాంటి " అని పక్కన పాప స్వీట్స్ ఇస్తుంటే... చూసా పాప అరిచేతులవైపు, పింక్ కలర్లో చిన్న డిజైన్ తో ఏదో రంగు పులిమినట్లుగా ఉంది.

"ఏంటమ్మా ఆ కలరంతా, చక్కగా గోరింటాకు పెట్టుకోవచ్చు కదా" అని అడిగాను.

"మా మమ్మీ కి ఇష్టంలేదాంటి పెట్టడం.. ఇదైతే సాయంత్రం కడిగేసుకొంటే పోతుంది, గోరింటాకు వారమ్రోజులు అలా ఉండిపోతుంది. పైగా నల్లగా అయిపోతుంది చెయ్యి అని ఇలా పెట్టింది " అంటే.....

నాకెందుకో ఈ గోరింటాకు ఆలోచనలు అలా మనసుని తట్టిలేపాయి. సహజత్వానికి భిన్నంగా కృత్రిమానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా ఉంది ఈ తరం అనిపించింది. :(
********