5.01.2009

తొలి అడుగులు

"ఆ.... నెమ్మదిగా.. వచ్చేయ్యాలి, వచ్చేయ్యాలి.. వచ్చేశాడొచ్చాసాడు. నా బంగారు కొండ. ...... అంటూ అడుగులో అడుగు వేస్తూ జాగ్రత్తగా తన చెంతకి వచ్చేసిన చిన్నారికి అక్కున చేర్చుకొని ముద్దు చేసిందా కన్నతల్లి...

అమ్మపిలుస్తోంది వెళ్ళాలి అని ....అడుగులు తడబడ్తున్నా.. పడిపోతామేమో అన్న భయం ఉన్నా .... అమ్మ అక్కున చేర్చుకొన్నప్పుడు బోసి నవ్వుల ఆనందానికి విలువ కట్టగలమా ? ఎంత చక్కటి భావన ఇది... బాల్కనిలో కూర్చుని కాఫీ తాగుతూ ఎదురు ఇంటిలోని చిన్నారికి, తల్లి నేర్పుతున్న తొలి అడుగులోని ఆనందాన్ని చూస్తూ .. ఆలోచిస్తున్న నాకు...

"వదినా! ఇదిగోండి గారెలు అత్తయ్యగారు చేసారు " అన్న మరదలు మాటలకి ఆలోచనలనుండి తేరుకొన్నాను.

"ఏంటి ఈరోజు ప్రత్యేకం? ఆదివారమనా గారేలు" అని అడిగాను.

"లేదొదినా బాబు గడప దాటాడు ఈరోజు " అని మురిపెంగా చెప్పింది మరదలు.

"హ ...హ .. బాగుంది, గార్ల పండగ అన్నమాట ఈరోజు " అనుకొన్నా ..

పుట్టినప్పుడు మొదలుకొని, 11 రోజుల పండగ, ఉయ్యాల (బారసాల) పండగ, బోర్లా పడ్డాడని బొబ్బట్లు, అడుగులేస్తున్నాడని అరిసెలు, గడపదాటాడని గారెలు, అన్నప్రాస్న పండగ, అక్షరాభ్యాసం పండగ, ఇలా పెళ్ళి దాకా ఎదో ఒక విధంగా మనతో పాటు ఉన్నమన కుటుంబం.. వాళ్ళ క్షణ క్షణ ప్రోత్సాహంతో మన జీవనం సాగుతుంది. అంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు మన బాగోగులు చూడాలి మనకి తెలియకుండానే మనలో ఆ అలోచన కలుగుతుంది. అలా జీవన విధానం మన అలవర్చుకొని, మనకంటూ మన కుటుంబం వచ్చేసరికి అదే విధమైన ఆచారాన్ని, ప్రోత్సహాన్ని కొనసాగిస్తాము. ప్రతి పనికి మనకి ప్రోత్సాహం కావాలి. తెలిసిన మనిషి అయినా, తెలియని మనిషి అయినా మనం చేస్తున్న పనిని మెచ్చుకోవాలని మన ఆలోచన. ఆ అలోచనా ఆ ప్రోత్సాహల మధ్య పెరిగినవాళ్ళము.

ఇదే విషయాన్ని బ్లాగులకి అన్వయించుకొంటే ఒకసారి ఎలా ఉంటుంది?

******

కొత్తగా బ్లాగ్ తెరిచి ఏమి చెయ్యాలో తెలియక, ఏమి రాయాలో తెలియక , ఏదో ఒకటి రాసేద్దాము అసలు స్పందన ఎలా ఉంటుందో అన్న సంధిద్ఘావస్తలో ఓ నాలుగు లైన్ల కవిత రాసి తొలి అడుగు స్పందన చూద్దామనుకొన్న బ్లాగర్లకు మొదటే పరాభవం జరిగితే?
********

నేను కొత్తగా బ్లాగు మొదలెట్టినప్పుడు, నాకు వ్యాఖ్య ఎలా రాయాలో కూడా తెలీదు అప్పుడు ఏమి చెయ్యాలో తెలియక నా బ్లాగులోనే ఓ ప్రఖ్యాత వ్యక్తి పేరు ని ఉదహరిస్తూ (ఆయనని సలహా అడిగే నేపధ్యంలో) అదే టైటిల్ పేరు గా పెట్టినప్పుడు, వ్యాఖ్యల్లోనే "అదేంటి మీరు వ్యక్తి పేరు టైటిల్ గా పెట్టారు " అని అడిగారు తప్పితే, ఇలా కాదు ఆయన బ్లాగ్ కి వెళ్ళి మీ సందేహాన్ని వ్యాఖ్య ద్వారా ఆయనకి తెలియజేస్తే మీకు అక్కడే సమాధానం దొరుకుతుంది అని ఎవరు చెప్పలేకపోయారు , నేనేదో తెలియని ఘొర తప్పిదం చేసానేమో అని, వెంటనే ఆ బ్లాగు పోస్ట్ తీసేసాను (ఉదహరించిన ప్రఖ్యాత వ్యక్తి మటుకు సహృదయంతో నా సందేహాన్ని తీర్చారు) అలా నా తొలి అడుగు తడబడింది. నా విషయం పక్కన పెడితే, ఇప్పుడు వస్తున్న కొత్త బ్లాగర్లకి ప్రోత్సాహం పేరుతో వస్తున్న వ్యాఖ్యల వ్యంగ్యాల వల్ల , నిరుత్సాహం చూస్తుంటే ...పాపం భాష మెరుగుపరుచుకోడానికో లేకపోతే నాలుగు మాటలు చెప్పుకొని భావనలు పంచుకోడానికో , వచ్చేవారు మొదటే సొంత రచనలు ఎందుకు అని అనుకొని ఈ కృష్ణశాస్త్రి గారి కవితో, ఏ నండూరి వారి యెంకి పాటో పెడితే చదివే ఆ ప్రముఖ మరియూ సీనియర్ చదువర్లు/బ్లాగర్లు, మా స్థాయికి ఎదగలేరనుకొని వదిలేసి వెళ్ళిపోవాలి కాని, వ్యాఖ్యల వ్యంగ్యాస్త్రాల వల్ల , తొలి అడుగులు వెద్దామనుకొన్న వాళ్ళకి ప్రోత్సాహం కరువవుతుంది కదా... ఇక్కడ మరీ వింతగా అనిపించే ఇంకో విషయమేమిటంటే విషయమెంతమాత్రం లేని వాటికి ప్రాముఖ్యత ఇచ్చి రాసిన వాళ్ళు ..... 'నేనేమి రాసానబ్బా "బాగుంది " అని వ్యాఖ్య రాయడానికి?' అని ఆలోచించేలా వ్యాఖ్యల పేరున సమ్మోహనాస్త్రాలను విసిరేది వీళ్ళే అంటే అతిశయోక్తి కాదేమో.. (దీని వెనకాల ఏదన్నా స్వార్థం ఉందేమో ?? అనిపించక మానదు. బ్లాగ్ పోస్ట్ చదివిన వారికి ఈ అర్థం లేని వ్యాఖ్యల వల్ల).


******

సరే ఏదో ఆలోచిస్తూ ఏదో రాసేశాను .. అసలు నేనూ .. ఎక్కడో పలుసార్లు ప్రచురించబడిన ఓ మాంచి ఇంగ్లీష్ నవల శుబ్బరంగా కాపి చేసేసి ఏ ప్రముఖ వెబ్ మేగజైన్ కో పంపిచేస్తే ఎలా ఉంటుందబ్బా .... అని ఆలోచిస్తున్నా ఈ పోస్ట్ రాస్తున్నప్పటినుండీ... మరి సలహా ఇచ్చేయండి "ప్రముఖ " అని పేరు తెచ్చుకోడానికి వేస్తున్న తొలి అడుగు తడబడ కుండా ఉండడానికి మీ అందరి ప్రోత్సాహం కావాలి మరి. మరింతదాక వచ్చాక మీరందరు వెనుతిరిగితే ప్రోత్సాహం ఎలాగండీ ???????? :)
******

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Loading...