3.28.2011

దేవుడు మన జీవితంలో ఎంతవరకు?

ramani
"మనమీద నమ్మకమే మనల్ని నిలబెట్టేది. ఈ సంపాదకీయం నన్నో పోస్ట్ రాసేలా ఉసిగొల్పుతోంది."
*****
ఇక్కడ నేను దైవ దూషణ చయడంలేదు.. పెద్దలు విజ్ఞులు గమనిచవలెను.. నా బుఱ్ఱలో చిక్కుకుని ఉన్న అనేకానేక ప్రశ్నలకి,  సమాధానాలు దొరకక..ఇక ఆలోచించడం మానేసి... పోస్ట్ రాస్తున్నాను. 

ప్రతి యుగంలో.. ఎవరో ఒక దేవుడు అవతరించి, గోవర్థన గిరి ఎత్తడమో లేకపోతే మసీదుని పుర ప్రజలకి గూడు లా ఇచ్చి వారిని కాపాడడమో చదువుతూనే ఉన్నాము. మరి ఈ యుగంలో దేవుడేడి? ఎక్కడ? గుజరాత్ భూకంపాలని, శ్రీలంక , జపాను సునామిలని ఆపడానికి ఏ గోవర్థన పర్వాతాలు, ఏ మసీదులు ఆసరాగా ఇవ్వడం చూడలేదు.. జరిగాయి అన్నవి పురాణాల్లోనా.. మన కంటి ముందు జరగవా.. కొన్నాళ్ళ కింద కొన్నేళ్ళ కిందట నాలో ఉదయించే ప్రశ్నలు..

ఎక్కడో జరుగుతున్నాయని, జరిగాయని విన్నాను కొన్నయితే కళ్ళారా కూడా చూశాను. సరే.. వీటి ఆంతర్యం? కింకర్తవ్యం?? అనే ప్రశ్నలు మళ్ళీ.. జవాబు లేని ప్రశ్నలు.. జవాబు వెతుక్కోవాల్సిన ప్రశ్నలు.

ఏమి జరిగాయి ఎక్కడ జరిగాయి అన్నది కాదు ఇక్కడ ప్రశ్న.. అసలు దేవుడు మన జీవితంలో ఎంతవరకు? అంటే.. కడదాకా అంటారు.. ఆ తరువాత కూడా ఆయనే కాపాడాలి అంటారు.. సరే.. మన కోరిక దేవుడు మన వెన్నంటి కడదాకా ఇంకో మానవ జన్మ అనేది లేకుండా మనల్ని కాపాడుతూ ఉండాలి.. మనకి ముక్తిని ప్రసాదించాలి. ఆధ్యాత్మికతతో ఉన్నవాళ్ళ కోరిక ఇది. 

అధ్యాత్మికత ఎలా రావాలి? ఎప్పుడు రావాలి? ఎందుకు రావాలి.. పసి పిల్లలుగా ఉన్నప్పటినుండి అమ్మ చేసే పూజలో చుట్టు జరిగే భజనలో వ్రతాలో మనల్ని ఎవరో ఒక అదృశ్యమైన వ్యక్తి కాపాడుతూ ఉంటాడు అని మనకి తెలియకుండానే "దేవుడు" అనేమాటకి కమిట్ అయిపోతాము. ఒకవిధంగా చెప్పాలంటే ఆయన ఒక "ఆపధ్బాంధవుడు" మాత్రమే .. మనకేదన్నా కావల్సివస్తే మటుకు (అప్పటికి మనం సంపాదించము కాబట్టి ) అమ్మా నాన్నలని అడగాల్సిందే.. మరి వాళ్ళెందుకు దేవుళ్ళు కాలేకపోయారు? మనకి తెలియని వయసు నుండి తెలిసే వయసు దాకా ఆలన పాలన చూసి మనల్ని ఇంతవాళ్ళని చేసిన వాళ్ళు వృద్ధులు, ముసలివాళ్ళు.. కాని అప్పటినుండి మనకి కనపడకుండా ఉన్న అదృశ్య వ్యక్తి మనకి దేవుడు.. :-)  ఎలా? ఏవిధంగా? విచిత్రంగా వాళ్ళు కూడా తమకి జన్మని ఇచ్చిన వారిని కాకుండా.. దేవుడినే ప్రార్థిస్తూ ఉంటారు లెండి అది వేరే విషయం.  

అసలు ఆధ్యాత్మికత అనేది ఎలా ఆచరించాలి? ఏ వయసులో ఆచరించాలి? పూర్తిగా నీ సేవలోనే భగవంతుడా అని అనుకున్నప్పుడు అసలు మనకీ మానవ జన్మ ఎందుకిచ్చాడు ఆ భగవంతుడు.. ఎందుకీ సంసారం? పిల్లలు, బాధ్యతలు.. నా జీవిత పరమావధి ఆధ్యాత్మిక జీవితం అయినప్పుడు నన్ను ఈ సంసార చక్రంలోకి లాగ కూడదు.. నిండా మునిగినవాడికి చలి ఉండదని సందేశమా?? మరి అలాంటప్పుడు పూర్తిగా మునగనివ్వాలి.. కాదు నువ్వు తేలిపో అనే ఆధ్యాత్మికత ఏంటి?? 

నా పిల్లలు ఇప్పటినుండే భగవంతుడి మార్గంలో ఉన్నారు.. వాళ్ళకి రేపు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చాలా మంది.. పెద్దవాళ్ళ ఉవాచ...ఉదాహరణకి.. నా పిల్లలినే తీసుకుందాము.. వాళ్ళకి "దేవుడు అనే ఒక మనిషి తమని అదృశ్యంగా కాపాడుతూ ఉన్నాడని తెలుసు.." ఆ జ్ఞానం వాళ్ళు చూపించే విధానం .. తినే మొదటి ముద్ద సర్వం "భగవధర్పితమస్తూ" అనుకుంటారు.. లేదా పరీక్షలు దగ్గర పడ్తున్నాయంటే "మేము బాగా రాసేలా దీవించు భగవంతుడా" అని దేవుడిని వేడుకుంటారు. అంటే దీని అర్థం "మేమేమి చదవము.. కాని నువ్వొచ్చి మా చేయి పట్టుకుని రాయించేయి"  అని కాదు కదా.. చదువుతారు.. కాని మర్చిపోతామేమో అని భయం.. వాళ్ళ పరిజ్ఞానం మీద అపనమ్మకం.. దేవుడిమీద విపరీతమైన నమ్మకం. ఇంతవరకే వాళ్ళకి తెలుసు. దేవుడు తాము కోరిన కోరిక తీర్చాలి.. అంతే అంతవరకే..

అంతే కాని.. దేవుడిమీద నమ్మకం .. పుస్తకం చదవకుండా ఉదయం మొదలు, సాయంత్రం వరకు ఏ భజనలోనో ఏ వ్రతంలోనో గడిపితే అంతటి ఆధ్యాత్మికత వాళ్ళని పరీక్షలలో ఉత్తీర్ణులని చేస్తుందా? అధ్యాత్మికతతో ఉండడం అంటే ఇదేనా? నా మనసు సదా భగవన్నామస్మరణం చేయడం అంటే ఆధ్యాత్మికత కాదా? 

ప్రాపంచిక విషయాల పట్టింపు లేకుండా సదా అధ్యాత్మికతతో గడపాలంటారు చాలా మంది సాధుపుంగవులు? అప్పుడు మరి ఆకలి దప్పులు ఉండవా? సంసారి కానివాడు అన్నిటికి అతీతుడై ఉండొచ్చు.  కాని ఒక సంసారి ఇలా అకలి దప్పులకి దూరంగా తన పిల్లలిని వదిలేసి ఆధ్యాత్మికతలో ఎలా?

అసలిదంతా కాదండి.. పూజలో వ్రతాలో నిత్యం చేస్తూ, ఇంకేపని చేయకుండా ఉండడం వల్ల నా జీవితం సాఫీగా గడుస్తుందా? మన వృత్తి ధర్మం మనకి ఉంటుంది.. ఆ ధర్మం అధర్మం కాకుండా ఉండడానికో ఆ వృత్తి అభివృద్ధి చెందడానికో, సరే ఇవేమి కాదు ఈ తిప్పలేవో నేను పడతాను నాకు కాస్త పూర్తి ప్రశాంతత ఇవ్వు తండ్రీ అని ఒక దండం ఒక కొబ్బరికాయ కొట్టి మన దైనందిక జీవితంలోకి వెళ్ళాలి అనేది నా అభిప్రాయం. కాదా చెప్పండి??

దేవుడు ప్రత్యక్షమై నీకేమి వరం కావాలో కోరుకో అంటే మనమేమి కోరుకుంటాము? మనసంతా ఆధ్యాత్మికతో నిండేలా చేయి అంటే.. మరి మన భాద్యతలో? మనం రధ సారధులై నడపాల్సిన బండిని వదిలేస్తే ఎలా? నన్ను నీలో ఐక్యం చేసుకో, ముక్తిని ప్రసాదించు ఇవన్నీ  ఇప్పుడు కాదేమో కదా..మనకి ప్రశాంత జీవితం.. పిల్లల ఉన్నత స్థితి నేను కోరుకునేది.. కాని నువ్వు పూర్తిగా మాతో పాటే ఉండిపో అనగలమా? మా ఆతిధ్యం స్వీకరించు అని ?? అలాంటి అథిధి దేవోభవ!  అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకరోజు, రెండురోజులు పోని మూడు రోజులు.. హహహ్హ విసుగు వస్తుంది కదూ ఒక అతిధిని జీవితాంతం మనతో ఉంచుకోడమంటే.. మరి దేవుడిని.. అతిధిగా పిలిస్తే??

ఇవన్నీ చెప్తున్నానంటే నేనేదో నాస్తికురాలిని అనుకునేరు.. నేను పూజలు చేస్తాను. వ్రతాలు నిత్యం ఉంటాయి మా ఇంట్లో.. వీటిల్లో ఒక్క ప్రశ్నకన్నా సమాధానం దొరుకుంతుందన్న ఆశతో.. మళ్ళీ ఆ జవాబులోని ఇంకో ప్రశ్న ఉదయించకూడదు అన్న కోరికతో.

అసలు నాకో చిన్న సందేహం..(మళ్ళీ).. ;-) సాధువులు , సన్యాసులు అంటే సంసారం వదిలేసి.. ఎక్కడో ఏ పర్వతాల్లోనొ ఆకులు అలములు తింటూ తపస్సు చేసుకుంటూ ముక్తికోసం పోరాడుతున్నారు అంటే నో కమెంట్. అది వాళ్ళ జీవిత పరమావధి.. కాని, గొప్పవాళ్ళుగా చలామణీ అవుతున్న రాజర్షులకి..(సంసారం చేస్తూనే ఆధ్యాత్మికత అవలంబించేవారు.. ఎలాగో మరి..) నాకు (మరి నేను కూడ సంసారం చేస్తూనే.. పూజలు అవి చేస్తూ ఉంటా కొండొకచో నిష్ఠగా ఎన్ని సందేహాలుదయించినా పక్కకి పెట్టి మరీ) ఏంటి తేడా? నమ్మట్లేదా.. సరే నన్ను వదిలేద్దాము.. గుళ్ళో పూజారులు.. నిత్యం అలంకరణలతో, అభిషేకాలతో మునిగితేలుతూ ఉంటారు.. మరి వాళ్ళు రాజర్షులెందుకు కాలేకపోయారు? వాళ్ళకి ఊరికే ఏ పురోహితుడో, లేదా పంతులు అన్న పేరు తప్ప.. వాళ్ళెందుకు రాజర్షంత గొప్ప గౌరవం మన్ననలు అందుకోలేకపోతున్నారు? 

ఎన్ని జవాబులేని ప్రశ్నలు.. ఒక్కో జవాబుకి ఇంకో ప్రశ్న ఉదయిస్తూనే ఉంటుంది.. అందుకే సింపుల్ గా నాకు ప్రశాంత జీవితాన్ని ఇవ్వు తండ్రీ అని ఒక్క దండం చాలదు ఆయనకి..

దేవుడిమీద నమ్మకంతో/నమస్కారం పెట్టి , మన మీద మనకి  నమ్మకముంచి జీవిత లక్ష్యాన్ని సాధిస్తే చాలదా జీవితానికి..

ఈ టపా చదువుతున్న పెద్దలు విజ్ఞులు నా అజ్ఞానానికి మన్నించండీ.. ఏ మిడిసిపాటుతోటో రాసింది కాదు ఈ పోస్ట్. నాకు దేవుడంటే భయం భక్తి ఉన్నాయి.. కొందరు ఏసుక్రీస్తుని, మరికొందరు అల్లాని ఇంకొందరు శ్రీ రాముడిని పూజిస్తారు. మరి కొందరే.. రాజర్షులుగా మహర్షులుగా ఉంటున్నారు.. ఆకొందరికే ఈ దేవుడు పరిమితమా? అందరికీ కాదా.. మనకి మోక్షం కావాలన్నా, మన సందేహాలు తీరాలన్నా  దేవుడు మధ్యవర్తుల్లా చలామణి అవుతున్న వీళ్ళదగ్గరికి వెళ్ళాలా? మనం ఎందుకు అందుకోలేకపోతున్నామన్నదే నా ప్రశ్న.. రాస్తూ ఉంటే ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తూనే ఉంటాయి ఇక్కడితో స్వస్తి ఈ పోస్ట్ కి . 
****

10 comments:

  1. బాబుందండి మీ పోస్టు

    ReplyDelete
  2. మీరు చెప్పిన సునామీల్లాంటి విపత్తులలో , బ్రతికి బయటపడ్డ వారు ఖచ్చిత౦గా దైవకృప అనుకొ౦టారు . చనిపోయిన వారిని గురి౦చి దేవుడు తీసికెళ్ళాడు అనికొని సమాధాన పడతారు ..రె౦డు చోట్ల దేవుడు ఉన్నట్లే (నా ?)



    దేవుడు ఉన్నప్పుడు యుద్దాలు, విపత్తు లు రాలేదా. అప్పుడు ఎవరూ చనిపోలేదా ? అప్పుడు గోవర్ధన గిరి లానే ఇప్పుడు ము౦దు జాగ్రత్త చర్యలు ఉ౦డనే ఉన్నాయి . (తర్క౦ లోఅకి వెళితే అసలు అ౦త౦ ఉ౦డదు )


    ఇక మీ వ్యాసం కొ౦త గ౦దర గోళ౦ గా ఉంది ..మీ ప్రశ్నలకి చాలా వరకు మీరె సమాధానాలు చెప్పదలిచారా ? . ఇక మిగిలిన ప్రశ్నలు ఉ౦టే వ్రాయ౦డి.


    లేదా సిరివెన్నెల గారి పాట లాగా 'నీ ప్రశ్నలు నీవే ' అనుకొ౦టే పర్లేదు .. అపుడు మీకు తెలిసిన ప్రశ్న, సమాధానాలు కొ౦చె౦ క్లారిటీ తో పెట్ట౦డి .

    ReplyDelete
  3. రమణి గారు చాలా బాగున్నాయండి మీ ప్రశ్నలు. ఇటువంటి ప్రశ్నలు వచ్చిన వారిలో మీరు మొదటి వారు కాదు. అర్జునుడు గీతలోనూ, పరీక్షిత్తు భాగవతంలోనూ ఏనాడో అడిగినవే.

    మీకు/ఎవరికైనా చెప్పగలిగినంత వాడిని కాదునేను. మానీ మీ జిజ్ఞాస చూశాక ఏదో రెండు మాటలు, పెద్దలు చెప్పగా విన్నవి, అక్కడక్కడా చదివినవి, విన్నవిద్దామనుకున్నాను. అవధరించండి.

    కోరికలు కలిగి రంగు రుచి వాసనలే ఆధారంగా జీవితాన్ని కృమి కీటకాలు కూడ గడుపుతాయి, వాటికి బానిస అయి మరణాన్ని పొందుతాయి. దీనికి గాను ఉపనిషత్తులలో ఒక ఉదాహరణ చెపుతారు.

    రంగుకు - మిడుత
    రుచికి - చేప
    స్పర్శకు - ఏనుగు
    శబ్దానికి - లేడి
    వాసనకు - తుమ్మెద
    ఇలా ఇంద్రియాలకి

    వీటికి బుద్ధి / తప్పు ఒప్పుల మీమాంస లేదుకనక. భర్త్రుహరి తన శుభాషితాలలో, మనిషికి తెలివి ఉండి అలాగే ప్రవర్తిస్తే మరి తేడా ఏమిటి అని అడుగుతాడు. మరి మనకున్న ఆ జ్ఞానము ఎందుకు? దానితో ఏమి చేయాలి? ఎలా చేయాలి ? అన్న ప్రశ్నలు మనకు ఉదయిస్తే, వాటికి సమాధాలు, విధానాలు మనకున్న శాస్త్రాలలోనూ, గ్రంధాలలోనూ ఎన్నో.

    ఐహిక సుఖాలకు మించిన ఒక సుఖం ఉందని, దానిని నిష్కామ క్రియ ద్వారానే అనుభవించగలమని, దానికి క్రియారుపాన్ని ఎలా ఇవ్వలన్నదాన్ని భగవద్గీత ద్వారా తెలుసుకోవచ్చు.

    గోవర్ధనమన్నారు కాబట్టి మరో మాట.. భాగవతంలో ఉన్న కధలను, క్రిష్న లీలలు అంటారు. అంటే మనము చదివిన కధకు వెనుక ఎంతో తత్వము ఎంతో వేదాంత రహస్యము దాగి ఉన్నదన్న మాట. అవి కధలుగా చదివిన వారికి "కృష్ణుడు ఆజన్మ బ్రహ్మచారి " అన్న మాటనే ప్రశ్నిస్తారు.

    మీకు వచ్చిన ప్రశ్న లన్నిటికీ మన గ్రంధాలలో సమాధానాలు ఉన్నాయి. జిలేబీ తియ్యగా ఉంటుంది అని వందమంది చెప్పినా.. ఆ రుచి మనము తినేదాకా తెలియనట్లే. ఇలా ఎంత చెప్పుకుంటూ పోయినా.. మనసుకు వంట పట్టదు. కనుక మీరే వాటిని చదివి ఆశ్వాదించండి. చాగంటి కోటేస్వరరావు గారు వంటి తెలిసిన వారి ప్రవచనాలను వినండి. సమాధానాలు అవే వస్తాయి.

    మీ ప్రశ్నలు మీకున్న విశ్వాసాన్ని బలపరిచేందుకని, నమ్మకాన్ని ప్రశ్నిచేందుకు కావు అన్నారు కనుక ఈ సలహాని ఇస్తున్నాను.

    తప్పులున్న క్షంతవ్యుడను.

    -- ఆత్రేయ

    ReplyDelete
  4. రమణిగారూ, ఈ కామెంటు మీకు కాస్త,నాకు తెలిసినంతలో క్లారిటీ ఇద్దామని అంతే,ప్రచురించక్కర్లేదు ఇంత పెద్దది.


    >>మరి ఈ యుగంలో దేవుడేడి? ఎక్కడ? గుజరాత్ భూకంపాలని, శ్రీలంక , జపాను సునామిలని ఆపడానికి ఏ గోవర్థన పర్వాతాలు, ఏ మసీదులు ఆసరాగా ఇవ్వడం చూడలేదు.. జరిగాయి అన్నవి పురాణాల్లోనా.. మన కంటి ముందు జరగవా..

    నమ్మశక్యం కాని రీతిలో తాము చావు నుండి బయటపడి పునర్జన్మ అని భావించే వాళ్ళు మీకు తారసపడలేదేమో. గోవర్ధనాలు,మసీదు ఆసరాలు ఏవి అన్నారు కాబట్టి చెప్తున్నాను,అప్పటి ప్రజల లాగ మనము ఉన్నామా?కానీ ఇప్పటి ట్రెండు కి తగ్గట్లు ఏదో అద్రుశ్య సక్తి మనల్ని కాపాడుతూనే ఉంటుంది,ఆయన చతుర్భుజాలతోనో,నెత్తి మీద పింఛంతోనో మనకి కనపడకపోవచ్చు కానీ ఏదో సంఘటనో,లేదా ఎవరయినా వ్యక్తి వల్లో మీకు ఉపకారం జరిగి ఉంటుంది మీరు ఆశలు వదిలేసుకున్న సమయంలో(ఏదయినా విషయంలో),గుర్తు తెచ్చుకోండి.ఒక వేళ మీకు ఇలా జరగకపోయినా,నా అనుభవం లో చెప్తున్నా ఇలా మనకి ఆ అద్రుశ్య శక్తి/దేవుడు మనకి ఉపకారం చేస్తాడు.

    మన పాప పుణ్యాల బ్యాలెన్సు అనుసారం కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి.

    ఇక పిల్లలు,ఆధ్యాత్మికత కి వస్తే,చిన్నప్పటి నుండీ వాళ్ళకి ఏది అలవాటు చేస్తే ఆ అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళకి దేవుడు కాన్సెప్టు చెప్తారు.సదా స్మరించడం అనే బేసిక్ ప్రిన్సిపల్ ని మర్చిపోయి వాళ్ళు ఎక్జాంస్ అప్పుడు కొబ్బరికాయలు కొట్టడం వరకే పరిమితమవుతున్నారంటే మనము వాళ్ళకి బేస్ సరిగ్గా ఇవ్వనట్లే.

    ఇక ఆయన సేవ కోసం అన్నప్పుడు ఈ జన్మ ఎందుకు అన్నారు,అందరిలో భగవంతుడిని చూడటం నేర్చుకోవాలని. అలా అని మనము ఆఫీసులో "ఎక్కడకెయ్యెది ప్రస్తుతం" అన్నట్లు ఉండకుండా సత్య హరిశ్చంద్రుడిలా ఉండటం కాదు.మన నిత్య జీవితంలో జరిగే "ఫైట్ ఫర్ సర్వైవల్" కోసం హానికరం కాని అసత్యాలు ఓకే అని నా అభిప్రాయం.

    మీలో ఉదయించినలాంటి ప్రశ్నలే నన్ను చాలా కాలం వేధించాయి,నేను ఈ సంసార చక్రం లో పడి మునిగిపోతున్నాను,ఆయన కోసం టైం లేదు ఎలా అని. అసలంటూ ఒకసారి ఆ ఆధ్యాత్మికపధం లోకి వెళ్ళి చూసాను.ఊహూ,ఓ ఏడెనిమిదేళ్ళు ఇంకా గందరగోళం గానే ఉన్నాను. ఆ తరువాత తెలిసింది ఆధ్యాత్మికత అంటే నాలుగు శ్లోకాలు చదివేసి నైవేద్యాలు కాదు,ఆయన/ఆవిడ ని నిత్యం స్మరించుకోవడమే అని.

    మనము నిత్యం భగవద్ ధ్యానం లో ఉండటం వల్ల సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ కి అవకాశం ఖచ్చితం గా ఉంటుంది.నేను ఇంతకముందు ఖాళీ సమయంలో ఫోనులో కాలక్షేపం చేసేదానిని.దాని వల్ల తప్పకుండా ఎవరినో తిట్టుకోవడమో,వాళ్ళ తప్పులు ఎత్తి చూపడమో చెయ్యల్సి వస్తుంది సంభాషణ లో భాగం గా.(రోజూ మాట్లాడుతోంటే ఇంతకుమించి ఏముంటాయి కనుక)

    కొన్ని రోజులకి అనిపించింది నాకు,నా పక్క వాళ్ళు నాకు నచ్చినట్టు ఉండకపోతే నాకునష్టమేంటి,ఇలా నోరు పారేసుకోవాల్సిన అవసరం ఉందా ఇంకోళ్ళ దగ్గర,ఇవన్నీ ఆలోచించి ఫోను సంభాషణలు తగ్గించాను,అలా అని అందరినీ వదిలేసి సన్యాసిని అయిపోలేదండోయ్.అనవసర మాటలు తగ్గాయి అంతే.

    బాటం లైన్ ఏమిటి అంటే, ఎదుటి వారి గురించి అనవసరం గా కలుగజేసుకోకుండా ,ఎదుటి వారిని గౌరవించడం వల్ల మన మనసు తేలికపడుతుంది.

    ఆ తేలిక మన్సుతో మీరు మరింత చురుగ్గా ఆలోచించగలరు.

    నిత్యం ధ్యానం/భగవధ్యానం అలవరచుకుంటే వచ్చే ఆనందం మీరు పూజలు వ్రతాలు చేసినప్పటికంటే బాగుంటుంది,ప్రయత్నించండి. అదే అధ్యాత్మిక అంటే.


    అలాగే వీలయితే పిల్లలని రోజూ పడూకోబోయే ముందు వాళ్ళు చేసిన తప్పొప్పులని చెప్పమనండి,వాళ్ళ చక్కటి వ్యక్తిత్వానికి పునాదులు వేసిన వాళ్ళమవుతాము.ఎందుకంటే ఆ చిన్ని మనసులో ఎన్నో సంఘర్షణలు,ఏది తప్పో ఒప్పో తెలీదు.ఏదయినా కోరుకుంటే భగవంటుడిని ఆయన అదే ఇస్తాడు,నాకు మంచిది ఇయ్యి తండ్రీ అని మాత్రం కోరుకుంటే సర్ప్రైజ్ గా ఇంకా మంచిది వస్తుంది అని వాళ్ళ మనసుకి అర్ధమయేల చెప్తే బాగుంటుంది.కోరికల వల్ల చిక్కుల్లో పడ్డ రాజు (సువర్ణష్ఠీవి అనుకుంటా ఆ రాజు పేరు)కధ ఉదహరించచ్చు

    ReplyDelete
  5. డేవిడ్ గారు : నెనర్లు.

    మౌళిగారు: మీరు చెప్పిన సునామీల్లాంటి విపత్తులలో , బ్రతికి బయటపడ్డ వారు ఖచ్చిత౦గా దైవకృప అనుకొ౦టారు .... చనిపోయిన వారిని గురి౦చి దేవుడు తీసికెళ్ళాడు అనికొని సమాధాన పడతారు ..రె౦డు చోట్ల దేవుడు ఉన్నట్లే (నా ?):- సమాధానాన్ని మీరే ఒక ప్రశ్నలా అడిగితే నేనేమనను? ఉన్నట్లే కదా అవును అనేదాన్నేమో.. ఉన్నట్లేనా అన్న ప్రశ్న మీరే కఛ్చితంగా చెప్పలేకపోతున్నారు. నేను లేడు అని ఎక్కడ అనలేదు.. అది గమనించండి.. దైవకృప, దేవుడు దగ్గరికి వెళ్ళాడు అని వాళ్ళు అనుకోవడం అన్నది పక్కన పెడితే.. ఒకసారి మనం ఆలోచిద్దాము.. కొన్ని వేల లక్షలమంది దేవుడి దగ్గరికి వెళ్తారు, ఎవఒర ఒకరిద్దరు మృత్యుజయులవుతారు.. అయినవాళ్ళని పోగుట్టుకొనో, కాలు చేయి పోగుట్టుకొనో అనాధలుగా.. దైవవకృప అనుకుంటూ..

    దేవుడు ఉన్నప్పుడు యుద్దాలు, విపత్తు లు రాలేదా. అప్పుడు ఎవరూ చనిపోలేదా ? అప్పుడు గోవర్ధన గిరి లానే ఇప్పుడు ము౦దు జాగ్రత్త చర్యలు ఉ౦డనే ఉన్నాయి . (తర్క౦ లోఅకి వెళితే అసలు అ౦త౦ ఉ౦డదు ): నాది తర్కం కానే కాదు మౌళిగారు తెలుసుకోవాలనుకునే జిజ్ఞాస. తర్కం అంటే మీరెన్ని చెప్పినా ఇదిగో ఇన్ని ప్రశ్నలు మీరెవరు ఏమి చెప్పినా దేవుడు లేడు అని తర్కిస్తానన్నమాట.. ఇప్పుడలా చేయడంలేదు.. ఆత్రేయగారన్నట్లు నా నమ్మకాన్ని దృఢపరుచుకోడానికి చేస్తున్న ప్రయత్నాలు.
    ఇక మీ వ్యాసం కొ౦త గ౦దర గోళ౦ గా ఉంది ..మీ ప్రశ్నలకి చాలా వరకు మీరె సమాధానాలు చెప్పదలిచారా ? . ఇక మిగిలిన ప్రశ్నలు ఉ౦టే వ్రాయ౦డి.: నేను చెప్పేపడమయితే ఇక బ్లాగుదాక ఎందుకండి.. ;-) నాకన్నీ తెలుసని అనుకునేదాన్ని. ప్రశ్నలు ఉదయిస్టుంటే వాటినుండి వచ్చే సమాధానాల్లో మళ్ళా ప్రశ్నలు వస్తున్నాయి అన్నాను. మీరు ఓపికగా సమాధానాలు చెప్పినందుకు నెనర్లు. వ్యాసం గందరగోళం.. నో కమెంట్స్..

    ReplyDelete
  6. ఆత్రేయ కొండూరుగారు : నెనర్లు.. కొంచం ఆలస్యంగా స్పదిస్తున్నందుకు మన్నించండి. మాములుగా నెనర్లు చెప్పడం కాదు , మీరు రాసిన/తెలియజేసిన విషయాన్ని అవగాహన చేసుకుని ఆకళింపు చేసుకోవాలి. అందుకే ఆలస్యం. నాకు చాలా తెలియని విషయాలు చెప్పారు మీరు. కృష్ణ లీలలు , భగవద్గీత చాలావరకు చదివానండి.. మీ నుంచి మరికొంత నేర్చుకున్నాను కాని, పూర్తిగా నాకు జ్ఞానం రావాలండి.. అందుకే కొన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇంకా సమయం పడ్తుందేమో.. మీరన్నది మటుకు అక్షర సత్యమండి..నా ప్రశ్నలు జిజ్ఞాస పెంచుకోడానికి తప్పితే వితండ వాదన చేయడనికి మాత్రం కాదు.

    ReplyDelete
  7. lakshmigaru : థాంక్స్ అండీ..

    బాటం లైన్ ఏమిటి అంటే, ఎదుటి వారి గురించి అనవసరం గా కలుగజేసుకోకుండా ,ఎదుటి వారిని గౌరవించడం వల్ల మన మనసు తేలికపడుతుంది.:- నాకు చాలా నచ్చిన వాక్యమండీ ఇది.. నెనర్లు..

    నిత్యం ధ్యానం/భగవధ్యానం అలవరచుకుంటే వచ్చే ఆనందం మీరు పూజలు వ్రతాలు చేసినప్పటికంటే బాగుంటుంది,ప్రయత్నించండి. అదే అధ్యాత్మిక అంటే.:- అధ్యాత్మికత.. సాధారణంగా నిత్యం ధ్యానంలోనే ఉంటానండి నేను.

    ReplyDelete
  8. @@@సమాధానాన్ని మీరే ఒక ప్రశ్నలా అడిగితే నేనేమనను? ఉన్నట్లే కదా అవును అనేదాన్నేమో.. ఉన్నట్లేనా అన్న ప్రశ్న మీరే కఛ్చితంగా చెప్పలేకపోతున్నారు.నేను లేడు అని ఎక్కడ అనలేదు.. అది గమనించండి.. ???//////////////////


    నేను ప్రశ్న లా అడగలేదు. 'మీ అభిప్రాయం ను బట్టి' అర్ధము చేసికొ౦టారు. ఉన్నట్లు అనుకో౦టే గొడవాలేదు. అక్కడ మీకు కనిపి౦చలేదు అన్నా గొడవ లేదు. వాదనతో నిరూపి౦చే విష్యం కాదు ఇది . ఇక మీరు ఉన్నదన్నారు, లేదన్నారు అని కూడా నేననలేదు ..మీరే మీ అనుమానాలు తేటతెల్ల౦ చేసారు.

    మీ టపా ని సరిచూసుకో౦డి ' మరి ఈ యుగంలో దేవుడేడి?' అని అడిగి , ఆ స౦దర్భ౦ లో తెలిసిన మాట చెబితే ఇ౦కోలా వాది౦చడ౦ మీకే చెల్లి౦ది :)



    @@@@దైవకృప, దేవుడు దగ్గరికి వెళ్ళాడు అని వాళ్ళు అనుకోవడం అన్నది పక్కన పెడితే.. ఒకసారి మనం ఆలోచిద్దాము.. కొన్ని వేల లక్షలమంది దేవుడి దగ్గరికి వెళ్తారు, ఎవఒర ఒకరిద్దరు మృత్యుజయులవుతారు.. అయినవాళ్ళని పోగుట్టుకొనో, కాలు చేయి పోగుట్టుకొనో అనాధలుగా.. దైవవకృప అనుకుంటూ..
    -------------------------------------------------------------------------------------------------------------------------------
    పక్కన పెట్టి ఇలా చూద్దాము అనే ఇది తర్కమే, . అలాగని అన్నివేళలా తర్కం చెడ్డది కాదు. కాని మొత్తం గా ఊహల తో సాగే తర్కం ఎన్నటికి ఒక దరి చేరదు.



    ///దేవుడు ఉన్నప్పుడు యుద్దాలు, విపత్తు లు రాలేదా. అప్పుడు ఎవరూ చనిపోలేదా ? అప్పుడు గోవర్ధన గిరి లానే ఇప్పుడు ము౦దు జాగ్రత్త చర్యలు ఉ౦డనే ఉన్నాయి . (తర్క౦ లోఅకి వెళితే అసలు అ౦త౦ ఉ౦డదు ): నాది తర్కం కానే కాదు మౌళిగారు తెలుసుకోవాలనుకునే జిజ్ఞాస. తర్కం అంటే మీరెన్ని చెప్పినా ఇదిగో ఇన్ని ప్రశ్నలు మీరెవరు ఏమి చెప్పినా దేవుడు లేడు అని తర్కిస్తానన్నమాట.. ఇప్పుడలా చేయడంలేదు..///
    ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

    ఈ మొత్తం మీ ' ' మరి ఈ యుగంలో దేవుడేడి?' అన్న బాధ కోసమే ..సో మీ టపా, మీ తర్క౦ సరిచూసుకోగలరు. అసలు దేవుడు ఉన్నాడా లేదా అని నేనె౦దుకు మీతో చర్చిస్తాను/వాదిస్తాను అ౦డి. నాకు అవసర౦, కాని అనుమాన౦ కాని ఉ౦టే మీ టపా చదవడమే జరగదు. ఇక మీ ప్రతివ్యాఖ్య సరి చూసుకోవచ్చు.



    ఆత్రేయగారన్నట్లు నా నమ్మకాన్ని దృఢపరుచుకోడానికి చేస్తున్న ప్రయత్నాలు.
    ఇక మీ వ్యాసం కొ౦త గ౦దర గోళ౦ గా ఉంది ..మీ ప్రశ్నలకి చాలా వరకు మీరె సమాధానాలు చెప్పదలిచారా ? . ఇక మిగిలిన ప్రశ్నలు ఉ౦టే వ్రాయ౦డి.: నేను చెప్పేపడమయితే ఇక బ్లాగుదాక ఎందుకండి.. ;-) నాకన్నీ తెలుసని అనుకునేదాన్ని. ప్రశ్నలు ఉదయిస్టుంటే వాటినుండి వచ్చే సమాధానాల్లో మళ్ళా ప్రశ్నలు వస్తున్నాయి అన్నాను. మీరు ఓపికగా సమాధానాలు చెప్పినందుకు నెనర్లు. వ్యాసం గందరగోళం.. నో కమెంట్స్..
    ------------------------------------------------------------------
    @తెలిసిన కొ౦త, క్లారిటీ తో వ్రాస్తే కొ౦త/సగం చదివి వదిలేసే వారు తగ్గుతారు కదా అని నా సద్విమర్శ. ఇక మీ భావమే అలా ఉ౦ది అన్నారా వదిలెయ్య౦డి. తప్పులేదు.

    ReplyDelete
  9. మౌళిగారు: సద్విమర్శకి నెనర్లు..:-) ప్రయత్నిస్తాను.. మీరు చెప్పినటువంటిబ్లాగు పాఠకులకు అర్థం అయ్యేలా రాయడానికి..

    ReplyDelete
  10. మౌళీ గారు థాంక్స్.. మంచి సలహ ఇచ్చారు.. నిజమే ఇది పరీక్ష కాదు అందుకే ముందు కమెంట్ డిలీట్ చేసేసాను. అనవసరంగా మీతో వాదిస్తున్నాను అనుకోపోతే.. ఒక చిన్న సందేహం.. మీరెందుకు నాతో ఎదో ద్వేషంతోనో, కోపంతోనో మాట్లాడుతున్నట్లు వ్యాఖ్యలు రాస్తున్నారు? నాకు మీరెవరొ కూడా తెలీదు.. బజ్ లో సాయి సుజన అనే బ్లాగర్ క్లారిఫికేషన్ తప్పితే..ఆ మౌళి మీరే అనుకుంటున్నాను.. నెనర్లు.. ఇంతకుముందు నా/మీ బ్లాగులో కమెంట్ రాసిన సందర్భాలు కూడా లేవు.. మీకు నేను రాసే పోస్ట్ .. నేను రాసే వ్యాఖ్యలు.. మొత్తానికి నా బ్లాగే నచ్చలేదనుకొండి లేదా అర్థం కాలేదనుకొండి నా బ్లాగు క్లిక్ చేయకండి.. అప్పుడు ఏ గొడవ ఉండదు కదా! :-) ఏ విషయం సాగదీయకపోతే సంతోషం. కాని అదేదో మనిద్దరి మధ్య శతృత్వం ఉన్నట్లు మాట్లాడితే నా మనసు అంగీకరించడంలేదు.. మీ కాలాన్ని వృధా చేసినందుకు క్షంతవ్యురాలిని.. నా బ్లాగు చదివి మీ సమయం వృధా చేసుకోవద్దని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...