11.10.2013

ఆత్మీయ సమావేశం

ముందుగా శ్రీ వాక్యంతో...

"కాలం ఎంత గడుసుదో .. నువ్వుంటే పరుగెత్తిపోతుంది వాయు వేగంతో..."   -శ్రీ వాక్యం

నిజంగానే రసాత్మకం కదూ :)

 (ఆర్ వి ఎస్ ఎస్ శ్రీనివాస్ గారు అద్భుతమండీ!  మీ ఏక వాక్య కవితా సహస్రం... దేనికదే సాటి .. పోటీ మాట లేదు )

నిజమే మరి ఈరోజు ఫేస్ బుక్ ఆత్మీయుల  సమావేశం ఉంది  (face book positive minds meeting ) అని శ్రీధర్ గారు అటు ఫేస్ బుక్ లోను, ఇటు గూగుల్‌లోను చెప్తుంటే మొదటి సమావేశానికి నేను వెళ్ళలేకపోయాను ఇప్పుడయినా  కుదురుతుందో లేదో అని చాలా సార్లు అనుకున్నాను. మొత్తానికి కుదిరింది. శ్రీధర్ గారికి బోల్డు నెనర్లు. ఇలా ఆత్మీయంగా మేము , మీరు , మనమందరం కలిసే చక్కటి వేదికని అమర్చినందుకు. ఇక సమావేశ సమయం గం 4.30ని.. సరిగ్గా ఆ సమయానికి ముఖపుస్తక పర్చయస్తులు వారి స్నేహితులు, సన్నిహితులు, హితులు దాదాపు 70 మంది దాకా వచ్చారు. సమావేశం కృష్ణకాంత్ పార్క్ లో జరిగింది. అందరూ అప్పటికప్పుడు ముఖ/ పరిచయం చేసుకున్నవాళ్ళమే


 అందరి పరిచయాల తరువాత...సమావేశమంతా  ఫేస్ బుక్ , ఇతర సోషల్ నెట్ వర్క్ ల వల్ల కలిగే పరిచయాలను ఎలా సద్వినియోగ పరుచుకోవాలో, ఏవిధమైన దృక్పధంతో ఉండాలో ఎంతో చక్కగా సందేశాత్మకంగా పలువురు వక్తలు తెలియబరచారు. ఆ వివరాలు క్లుప్తంగా ఇక్కడ:



ముందుగా నల్లమోతు శ్రీధర్ గారి మాటల్లో చెప్పాలంటే: "మన మానవ జన్మ ఎంతో ఉత్తమమైనది, నిజానికి మనమందరం చాలా అదృష్టవంతులం. ఎదో చేయాలి , ఎదో చెయ్యాలి అన్న తపన చేతల్లో చూపించండి, మనకున్నది ఒకే జీవితం ఈ జీవితాన్ని నిస్సారంగా, ఏమి చేయలేమనుకుంటూ  కాలాయాపన చేయకుండా , మన తల్లితండ్రులు మనకిచ్చిన ఈ జీవితానికి ఏదో ఒక సార్థకమయిన పనితో విలునిద్దాము. మన వ్యక్తిత్వాన్ని మన స్వతంత్ర్యతని  మంచి పనులు చేయడానికి ఉపయోగిద్దాము. ఈరోజు ఎంతో మంది రోడ్డు మీద అనాధ బాలలు ఉన్నారు వాళ్ళతో పోల్చుకుంటే మనకిచ్చిన ఈ విలువైన జీవితానికి, విలువైన సమయానికి.. మన తల్లితండ్రులకి  రుణపడి ఉందాము "మంచి పనులు " చేయడం ద్వారా."

ఎంత చక్కటి సందేశం కదా!


ఇక పెద్దవారు బ్రహ్మానందం గారు: తన పేరే తనకి మంచి వైబ్రేషన్ అంటున్నారు. చిన్నప్పుడు ఈ పేరేంటి అసలు పలకడానికి రావడం లేదు ఎందుకు పెట్టారు అని అనుకున్న ఈ ఆరడుగుల బ్రహ్మానందం గారు ఇప్పుడు తన పేరంటే తనకెంతో ఇష్టమని.. తనకి ఆజానుబాహుడు బాహుబలి అయిన ఆ ఆంజనేయుడి అండదండలు ఎలా ఉన్నాయో అలా వారి దీవెనలతొ ఇప్పటికీ తన ఉపాధ్యాయ వృత్తి పదవీ విరమణ తరువాత సంఘ సేవకి అంతే విధంగా అంతే ఆనందంగా తోడ్పడుతోందని అన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఈ సాంకేతిక వసతులు , సోషల్ నెట్వర్క్లు తనని ఎంతగానే తను సేవ చేయాలి  అనుకున్నవారికి దగ్గర చేశాయని, వీటిని ఇలాగే ఉపయోగించుకోవాలని ఉధ్ఘాటించారు. 



ఇక తరువాత ఆర్ వి ఎస్ ఎస్ క్లుప్తంగా చెప్పాలంటే శ్రీ గారు(వారి కలం పేరు): ప్రేమ అంటే ఒక్క ప్రేయసి ప్రియుల మధ్య ఉండేది మాత్రమే కాదు ప్రేమ అనే పదానికి నిర్వచనం ప్రేమే.. ఇంక వేరే ఏ పదం ఆ పద నిర్వచానికి సరిపోదని, అలాగే ఇప్పటి సినిమాలు చూసి యువతరం ఆ మోజులో పడొద్దని, తన కవితలన్ని ప్రేమ మీదే అయినా అవి ఈ సినిమాల్లో చూపిస్తున్న లేదా ఇప్పటి యువతరం పాటిస్తున్న ప్రేమ పొకడ కాదని, ఇందులో ఎంతో భావార్థం ఉందని, ఆ ప్రేమ ఏ ఇద్దరి మధ్య అయిన అవచ్చు ఒక్క పేయసి ప్రియులు మాత్రేమె కాదు,సందర్భానుసారమును బట్టి తన వాక్యాలు అందరికి ఉపయోగపడతాయని చెప్తూ, కంప్యూటర్ పై ఒక చక్కటి భావ కవితని చెప్పారు.



ఇప్పుడు మేమే అంటే నేను కాదు (నాకంత దృశ్యం లేదు) మహిళలం అన్నమాట...:)



ఉషా రాణి గారు: ఫేస్ బుక్ అంటే చాటింగ్ మాత్రమే కాదు, ముఖ్యంగా మాలాంటి మధ్య వయసువారికి ఫ్రండ్ రిక్వస్ట్ పంపిన వెంటనే "చాటింగ్"  అంటే అది పద్ధతి కాదని, ఎంతో విలువైన సమయాన్ని ఎదో కొద్దిపాటి సృజనాత్మక ఆలోచనలతో కవితలు కథలు రాసుకునే తమలాంటి వారిని చాటింగ్ అంటూ హింసించవద్దని/వేధించవద్దని, అసలు తమకు చాటింగ్ చేసే ఉద్దేశ్యం ఉందో లేదో కనుక్కోడం ఉత్తమమయిన పద్ధతని, చాటింగ్ వల్ల కలిగే నష్టాలను వివరించారు. అలగే మన సంస్కృతి ఎంత బ్రష్టు పడిపోయిందో, మన గురించి గొప్పగా చెప్పుకునే పాశ్చ్యాత్తులు ఇక్కడికి వచ్చి మనల్ని మన అశుభ్రమైన వీధులని, చూసి ఏవిధంగా మన గురించి అక్కడ రాస్తున్నారొ ఉదాహరణలతో వివరించారు. "జూ"  లో జరిగిన ఒకానొక తన అనుభవాన్ని కూడా ఎంతో ఆవేదనతో చెప్పారు. మన సోషల్ నెట్వర్క్ ద్వారా  అందరికి చక్కటి సందేశాల ద్వారా  అందరిని మార్చుదాము రండి అని పిలుపునిచ్చారు.


అనూరాధ గారు: అమ్ము అని అందరూ పిలుచుకునే అనురాధ గారు నాది భావవల్లరి గ్రూప్, భలే అల్లరి గ్రూప్ అంటూ ఎంతో సందడి చేశారు. ఫేస్ బుక్ గురించి దాదాపుగా ఉషారాణి గారు చెప్పినవే ఇంకొంచం విపులంగా చెప్పారు, తరువాత శ్వేత వాసుకి గారు, గీత గారు ఎంతోమంది తమ అనుభవాలతో కూడిన చక్కటి సందేశాలనిచ్చారు. 





ఇక నేటి యువతరం కూడా వారి వారి అనుభవాలను చెప్తూ చక్కటి సందేశాలతో   సమావేశాన్ని విజయవంతం చేశారు.
















చివరగా మళ్ళీ శ్రీ వాక్యంతో..

"పూరణ తెలిసేది వచ్చినప్పుడైనా.. లోటు తెలిసేది నీవు వెళ్ళిపోయాకే.. "

అందరం ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళాక అనిపించింది మళ్ళీ ఎప్పుడో కదా అని.. లోటు తెలిసిందన్నమాట.. :(


ళ్ళీ చివరగా

శ్రీ గారు బోల్డు బోల్డు నెనర్లు శ్రీ వాక్యం .. రసాత్మకం.. కి. 

3 comments:

  1. andari prasangalani chala baga vivarincharu Ramani Jii......Dhanyavadalu

    ReplyDelete
  2. నైస్ పోస్ట్ రమణి గారు ... కళ్ళకి కట్టినట్లు వ్రాసారు ...ధన్యవాదాలు నా శ్రీవాక్యం ప్రశంసకి...:-)...@శ్రీ

    ReplyDelete
  3. ఈపోస్ట్ రాసినప్పుడే నా అభిప్రాయం కూడా ఇక్కడ చెప్దామనుకున్నాను కాని ప్రత్య్క్షంగా అక్కడ మీటింగ్లో ఏమి మాట్లాడలేదు ఇక ఇక్కడెందుకు అని ఆగాను. తీరా చూస్తే మళ్ళీ ఇక్కడ ఇప్పుడు రాయాల్సిన అవసరం వచ్చింది అవకాశమిచ్చిన అజ్ఞాతులకి చాలా థాంక్స్.

    ముఖ్యంగా చెప్పేదేమిటంటే నేను ఎంతయినా రాయగలను కాని నలుగురిలో నించుని మాట్లాడడమంటే మరి ఎందుకో తెలీదు చిన్నపాటి వణుకు వస్తుంది. చిన్నప్పటినుండి వ్యాసాలు రాయడానికయితే సై అనేదాన్ని. మళ్ళీ అందరితో మాట్లాడతాను చర్చిస్తాను .. స్టేజ్ ఫియర్ మటుకు అనుకోకుండా వచ్చేస్తుంది. ఫేస్ బుక్ పాసిటివ్ మైండ్స్ మీటింగ్లో అందరిని పరిచయం చేసుకున్నాను. నిజానికి చెప్పాలంటే వాళ్ళందరి ప్రొఫైల్ ముందు నా ప్రొఫైల్ చిన్నబోతోందనిపించింది, వారి సేవా కార్యక్రమాలు, అల్లర్లు చూసిన తరువాత. [ఆత్మన్యూమతా భావమా.. ఎమో మరి :)]

    ఇక అసలు విషయం నేను అక్కడ చెప్పాలనుకున్నది ఇక్కడ ఇప్పుడు మనకోసం: మేము (అంటే అందరం వస్తామిక్కడ అమ్మాయిలం, యువతులం, మధ్యవయసు మహిళలము వెరసి మొత్తం మహిళలందరం) మా సమయాన్ని కాస్త ఇటు వైపు అంటే ఈ సోషల్ నెట్వర్క్ వ్యాపకానికి కేటాయిద్దామనుకుంటాము..... మీకు (అబ్బాయిలకి, యువకులకి, మధ్యవయసువారికి వెరసి మగవారికి,)ఎలా ఒక అమ్మాయి పేరు చూస్తే ఒకసారి పింగ్ చేసి మాట్లాడాలనిపిస్తుందో అదే భావన మాలో కూడా కలిగే అవకాశాలుంటాయి అలాంటప్పుడు ఒకసారి వాళ్ళుహాయ్ అన్నారు కదా అని రెప్లై ఇచ్చినంత మాత్రాన వాళ్ళని నెగిటివ్ దృక్పదంతో చూడడం ఎంతవరకు సమంజసం? నమస్కారానికి , ప్రతి నమస్కారం సంస్కారం అంటారు మన పెద్దలు మరి అలాంటప్పుడు పలకరించిన వారిని తిరిగి పలకరించగానే వాళ్ళు తిరిగి పలకరించారు కాబట్టి మనమంటే ఇష్టమే అనే సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? ఈ సమస్య ఇక్కడ ఈ సోషల్ నెట్వర్క్ అనే కాదు ఎక్కడయినా ఇలా వెంటాడుతూనే ఉంటుంది అరే! ఒక అబ్బాయితో మాట్లాడుతున్నాము అంటే ఒకే ఆలోచనా? మనతో మాట్లాడుతోంది అంటే మననుండి ఎదో ఆశిస్తోంది అనా? ఒక్కటి మటుకు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం.. ఏ ఆడపిల్లా ఒక్క మాటకే, ఒక్క పూటకే, ఒక్క చూపుకే పడిపోదు .. అలా జరిగింది అంటే అదీ వాళ్ళ వికసీ వికసించని వయసుది/మనసుది తప్పు. ఒక నిజమైన ప్రేమ మనకి లభించాలి అంతే మనం తపస్సు చేయాలి.

    ఇకపోతే నా పేరు రమణి.. ఈ పేరు చెప్తేనే నేను ఇంకా టీనేజ్ లో ఉన్నాను అనుకుంటే అది నా తప్పు కాదు. సాధారణంగా నాకు స్వతంత్ర భావాలు ఎక్కువ అందుకని ఎక్కడా నేను ఫలానా వారి బార్యని, ఫలానా వారి కూతురిని అని చెప్పను నేను రమణి ని అంతే... రమణి అమ్మ, రమణి అమ్మమ్మ అని చెప్పాలేమొ ఇంక... అవతలి వారి సంతృప్తి కోసం.. నేనేమి చెప్పకముందు నేను చాలా రమణీయంగా ఉంటానట వాళ్ళ ఊహల్లో (ఒక అనామకుడి అభిప్రాయం లెండి ఇది) .. నా ప్రొఫైల్ అంతా చెప్పిన తరువాత నేను చెల్లెలిని/అక్కని.(ముందంతా ఊహలు, ఇప్పుడు బంధువిని అసహ్యంగా లేదూ) బంధం , బంధుత్వం తప్పు కాదు నిజంగా మీకలా అనిపిస్తే పిలవండి కాని వాటిని ఇంకొకరి నమ్మకం కోసం తొడుక్కోకండి.. ఆడవాళ్ళని అర్థం చేసుకోడానికి కనీసం ప్రయత్నించండి..

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...