7.18.2016

తాగి నడిపితే కెరీర్ ఖతం!

డ్రంకెన్ డ్రైవ్ మీద పోలీసుల ఉక్కుపాదం:  ఇదో మంచి పరిణామం

ఇకపై మద్యం తాగి బండి నడిపితే కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడ్డట్టే! పాస్‌పోర్టు రాదు. వచ్చిన పాస్‌పోర్టు మీద వీసా రాదు. విద్యార్థులకు కొత్తగా కాలేజీల్లో సీట్లు ఇవ్వరు. ఉద్యోగులైతే వ్యక్తిగత రిమార్కుల్లోకి చేరిపోతుంది. నిరుద్యోగులైతే రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు బ్లాక్‌లో పెడుతాయి. డ్రైవింగ్ లైసెన్స్‌పై శాశ్వత నిషేధం విధిస్తారు. నూతన వాహనాల రిజిస్ట్రేషన్ చేయరు. ఉన్న వాహనాల ఆర్సీలను రెన్యూవల్ చేయరు. పైండ్లెన వాళ్లకు మరో చిక్కు. తాగి పట్టుబడితే పోలీసుల వద్దకు భార్యతో సహా వచ్చి ఆవిడ ముందు కౌన్సెలింగ్ తీసుకోవాలి.

-మైనర్లకు మద్యం ఇస్తే బార్ల లైసెన్సులు రద్దు
-బండి ఇచ్చే యజమాని మీద కేసు
-భార్య/కుటుంబ సభ్యుల ఎదుట కౌన్సెలింగ్ 
-అన్ని విషయాలు పోలీస్ డేటాబేస్‌లోకి..
-డ్రంకెన్ డ్రైవ్ మీద పోలీసుల ఉక్కుపాదం

మైనర్లకు బండి ఇస్తే పెద్దల మీద కేసులు పెడతారు. మద్యం మత్తులో ప్రమాదాలకు పాల్పడితే ఐపీసీ 304 పార్ట్ 11 సెక్షన్ కింద కేసులు పెడతారు. పదేండ్ల శిక్ష పడుతుంది. గతంలో డ్రైవర్ తాగిందీ లేనిదీ తెలుసుకునేందుకు వైద్యశాలలకు పంపితే కేసులు తారుమారయ్యేవి. ఇపుడా పద్ధతి మార్చేశారు. బ్రీత్ ఎనలైజర్లతో సంఘటన స్థలంలోనే తేల్చేస్తారు. ఈ వ్యవహారం మొత్తాన్ని వీడియా తీయించి సాక్ష్యంగా కోర్టుకు సమర్పిస్తారు. మొత్తంగా మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాల నివారణ మీద, డ్రంకన్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్‌ల మీద హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

లైట్ తీసుకుంటే భవిష్యత్తు చీకటే..! 

డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, లైసెన్స్ లేని డ్రైవింగ్, మైనర్ డైవింగ్‌కు భారీ మూల్యమే చెల్లించవలిసి వస్తుంది. పోలీసులు ప్రతి కేసును డాటాబేస్ రూపంలో భద్ర పరుస్తారు. పట్టుబడ్డ వారి వివరాలను ఆయా విభాగాలకు పంపించడం, లేదంటే ట్రాఫిక్ విభాగం డాటాబేస్‌ను షేర్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఫలితంగా ఈ కింద తెలిపిన వాటికి మీరు అర్హత కోల్పోవల్సి వస్తుంది. 

-మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం చేస్తే పాస్‌పోర్టు జారీ కాదు
-పాస్‌పోర్టు ఉన్న వ్యక్తులకు వీసా కష్టసాధ్యమయ్యే అవకాశం
-ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది
-ఉద్యోగాలకు వెళ్లాలంటే క్యారెక్టర్ సర్టిఫికెట్‌లో ఈ వివరాలుంటాయి.
-డ్రైవింగ్ లైసెన్స్ రాదు, ఉన్న వారిపై శాశ్వత నిషేధం విధించే అవకాశముంది. 
-వాహనాలు కొనుక్కున్నా రిజిస్ట్రేషన్ చేయించలేరు
-మైనర్లు అయితే స్కూల్, కాలేజీల్లో అడ్మిషన్ ఇవ్వరు.
-డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల ఆర్సీల రెన్యూవల్ చేసుకోలేరు. 
-స్కూల్/ కాలేజీ నుంచి సస్పెన్షన్ తప్పనిసరి కావచ్చు.
-బార్లు, పబ్బుల యాజమాన్యాలు లైసెన్స్ కోల్పోవాల్సి వస్తుంది. 
-ప్రభుత్వం, ప్రైవేట్ ఉద్యోగులైతే ప్రవర్తన సరిగా లేదని చర్యలకు ఆదేశిస్తారు.
*****

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Loading...