11.13.2017

మన వనభోజనాల్లో ప్రముఖులు -1 గంగాధర్ తిలక్ కట్నం గారు

గంగాధర్ తిలక్ కట్నం గారు 

అక్టోబర్ 27 న ప్రియనేస్తం ఎన్నారై గీతా గడ్డం ఏర్పాటు చేసిన గెట్ టు గెదర్ లో కలిసినప్పుడు "సర్ వనభోజనాలకి రావాలి"  అని చెప్పడం జరిగింది. "తప్పకుండా నా గర్ల్ ఫ్రెండ్ తో వస్తాను "  అని చెప్పి ఇచ్చిన మాట తప్పకుండా, వచ్చారు ఊరికేనే రాలేదు డాక్టర్ ఆఫ్ రోడ్స్ లా మనముందుకు వచ్చి ఇందిరాపార్క్ గెట్ ముందు ఉన్న గుంతకీ వైద్యం చేసి గుంతని పూడ్చేశారు. అలా ఈ సంవత్సరం ఫేస్ బుక్ స్నేహితుల వనభోజనాలకి ఒక అపూర్వ ఖ్యాతిని తీసుకొచ్చారు శ్రీ గంగాధర్ తిలక్ కట్నం గారు. 




రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర‌యిన గంగాధ‌ర్ తిల‌క్ హైద‌రాబాద్ రోడ్ల కోసం ప‌డుతున్న తాపత్ర‌యం చూస్తే ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మాన‌దు. త‌న‌కు తెలిసిన మేర‌లో రోడ్ల‌పై ఎక్క‌డ గుంత క‌న‌ప‌డినా తిల‌క్ ఆ గుంత‌ను స్వ‌యంగా పూడుస్తారు. ప్ర‌తిరోజూ ఆయ‌న తారు మిశ్ర‌మాన్ని 8 నుంచి 10 బ్యాగుల్లో నింపుకుని రోడ్డుమీద‌కు వ‌స్తారు. ఎక్క‌డ గుంత క‌న‌ప‌డినా దాన్ని వెంట‌నే పూడ్చివేస్తారు. ఆయ‌న ఇలా చేయ‌టానికి ఓ కార‌ణం ఉంది.

ఒక‌రోజు తిల‌క్ త‌న కారులో వెళ్తుండ‌గా గుంత‌లో టైర్ దిగి వెంట‌నే ఆ నీరు ప‌క్క‌నే ఉన్న వీధి బాల‌ల‌పై ప‌డింది. అది చూసిన తిల‌క్ కు చాలా బాధ క‌లిగింది. వెంట‌నే త‌న జేబులోనుంచి రూ5వేలు తీసి అక్క‌డ ఉన్న గుంత‌ను పూడ్పించారు తిల‌క్‌. అప్ప‌టినుంచి ఆయ‌న ఇలా గుంత‌ల‌ను పూడ్చే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.  స‌మాజం ప‌ట్ల తిల‌క్ క‌న‌బ‌రుస్తున్న అంకిత భావానికి మ‌నంద‌రం సెల్యూట్ చేద్దాం. రోడ్ల‌పై గుంత‌ల మూలంగా హైద‌రాబాద్ వాసులు ఎన్నో ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. అయినా అంద‌రూ ప్ర‌భుత్వాన్ని తిట్టుకునే వాళ్లే కానీ ఇలా రోడ్ల‌ను బాగుచేసేందుకు ఒక్క‌రూ ముందుకురారు. కానీ తిల‌క్ స్వ‌యంగా గుంత‌లు పూడ్చే బాధ్య‌త తీసుకుని అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.




అలాగే వనభోజనాల కార్యక్రమంలో తానూ చేసిన పని అందరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు రావాలని కేవలం గుంటలు పూడ్చడమే కాదు సమాజానికి ఉపయోగపడే ఎదో ఒక పనిని అందరం కలిసి చేద్దాం అని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలకి విన్నవించుకుని అధికారులు స్పందించి చేసే సమయంలో మనం మనపని అనుకుని అందరూ స్వచ్చందంగా ముందుకు వస్తే, ఎన్నో సమస్యలని పరిష్కరించుకోవచ్చని పిలుపునిచ్చారు. అందరితో కలిసిపోయి ఆడుతూ, పాడుతూ సామాజిక సేవ చేస్తున్న గంగాధర్ తిలక్ కట్నంగారు మీకిదే మా బిగ్ సెల్యూట్. 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Loading...