11.14.2017

వనభోజనం- మనభోజనం 3. సాధనాల వెంకటస్వామి నాయుడు గారు

పేరు ప్రఖ్యాతలు దండిగా గల సాధనాలగారు పిలవగానే నేను వస్తున్నాను అని చెప్పి మాట తప్పకుండా వనభోజనాలకి  వచ్చి "అమ్మ " పై చక్కని గీతాన్ని ఆలపించి అందరిని అలరించారు. ధన్యవాదాలు సాధనాల గారు... 

సాధనాలగారి గురించి "అమ్మో సాధనలగారు" అనుకునేలా వివరంగా...... ఆయన మటుకు
నిరాడంబరంగా.. హుందాగా ఉంటారు.. ఇంతటి ఘనులు అని మనకి తెలియదు. మీరే చదవండి. 



సాదనాల వేంకటస్వామి నాయుడు సాహిత్య, సంగీత, నాటక, సాంస్కృతిక, సేవా రంగాలలో కృషి చేస్తున్న కళాపిపాసి.
సాదనాల వేంకటస్వామి నాయుడు (Sadanala Venkata Swamy Naidu) 1961, ఫిబ్రవరి 15వ తేదీన తూర్పు గోదావరి జిల్లా, ముమ్మడివరం మండలం, గేదెల్లంక గ్రామంలో సత్యవతి, బాలకృష్ణారావు దంపతులకు జన్మించారు. వీరు సికిందరాబాదు డివిజినల్ కార్యాలయంలో ఛీఫ్ సూపరింటెండెంట్‌. ఇతని భార్యపేరు మాధురి. కుమార్తె పేరు ఆర్యాణి.



వీరు కథలు, కవితలు, వ్యాసాలు, గేయాలు, నాటికలు అనేకం వ్రాశారు. సాధనాల గారి  రచనలు సమాచారం, కళాప్రభ, నేటి నిజం, అపురూప, అంజలి, రచన,ఎక్స్‌రే,ఆంధ్రజ్యోతి మొదలైన అనేక పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని కథలు, కవితలు పలు సంకలనాలలో చోటు చేసుకున్నాయి. అతను  రచించిన గీతాలు కేసెట్లుగా విడుదలయ్యాయి. ఆకాశవాణిలో సాధనాల గారు  వ్రాసిన గీతాలు, సంగీతరూపకాలు, నాటికలు ప్రసారమయ్యాయి. సాధనాల గారి రచనలకు ఎన్నో బహుమతులు లభించాయి. అలాగే అతని రచనలు ఇంగ్లీషు, హిందీ, ఒరియా భాషలలోకి కూడా  తర్జుమా అయ్యాయి. పలు సాహిత్య సంస్థలతో సాధనాలగారికి సంబంధాలున్నాయి. అనేక సెమినార్లలో పాల్గొని పత్రసమర్పణ గావించారు.

ముద్రిత రచనలు 

దృశ్యం (వచన కవితాసంపుటి)
కృష్ణాపత్రిక సాహిత్య సేవ - ఒక పరిశీలన (సిద్ధాంత గ్రంథం)
నాయుడు బావ పాటలు
సర్వసమ్మత ప్రార్థన

అముద్రిత రచనలు 
తెలుగు వచన కవులు (1930-1990)
అక్షర తమాషాలు
ఆడియో కేసెట్లు 
పుష్కర గోదావరి
కట్టెమిగిల్చిన కన్నీటి గాథ
అక్షరదీపం
సుముహూర్తం
మహనీయుల స్ఫూర్తితో
తెలుగుతేజం
విజయకెరటం

సాహితీ సంస్థలలో సాధనాల గారి పాత్ర 

ది పొయెట్రీ సొసైటీ ఆఫ్ ఇండియా (న్యూఢిల్లీ) - సభ్యుడు
కవిత్వం (రాజమండ్రి) - కార్యదర్శి
వాగర్ధ సమాఖ్య (రాజమండ్రి) - సభ్యుడు
సాహితీ సమితి (ఖమ్మం జిల్లా) - ఉపాధ్యక్షుడు
ఇండియన్ హైకూ క్లబ్ (అనకాపల్లి) - ప్రాంతీయ కార్యదర్శి
వాగనుశాసన వాజ్మయవేదిక - కార్యదర్శి
సాహితీవేదిక - కోశాధికారి
జీవనసాహితి - ముఖ్యసలహాదారు

ఆకాశవాణిలో ఆడిషన్ పాసై గాయకుడిగా అనేక జానపద గేయాలు పాడారు. డ్రామా ఆడిషన్ పాసై బి గ్రేడ్ కళాకారుడిగా పాతికకు పైగా రేడియో నాటకాలలో నటించారు. విజయశంకర్ ప్రభుత్వ సంగీత,నృత్య కళాశాల రాజమండ్రిలో మృదంగం, గాత్రం అభ్యసించాడు. మూషిక మరణం నాటకంతో నాటకరంగ ప్రవేశం చేశారు . అనేక నాటకాలకు రచయితగా, దర్శకుడిగా పనిచేసి స్వయంగా నటించారు. పల్లెరథం, సంధ్యారాగం, సువ్వీ సువ్వన్నలాలి, గోదావరి చెప్పిన సుబ్బారావు కథ, అదిగో భద్రాద్రి మొదలైన సంగీత రూపకాలను వ్రాసి ఆకాశవాణిలో ప్రసారం కావించారు. దూరదర్శన్‌లో ప్రసారమైన గురజాడ దిద్దుబాటు, కథావీధి టెలీ ఫిల్ములలో నటించాడు. 2011 నంది పద్యనాటక పోటీలకు స్కృటినీ జడ్జిగా పనిచేశారు.


పురస్కారాలు: 2012 ఫిబ్రవరిలో గుంటూరులో జరిగిన నంది నాటక ప్రదానోత్సవ సభలో బంగారు నంది ప్రదానం , 
రాష్ట్రస్థాయి ఉత్తమ కవితాసంపుటిగా దృశ్యం పుస్తకానికి తడకమట్ల సాహితీ పురస్కారం
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా సత్కారం
జేసీస్ క్లబ్ ఔట్‌స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డ్
రోటరీ లిటరరీ అవార్డ్
దక్కన్ యువకవితోత్సవ్‌లో ఉత్తమ కవితా పురస్కారం
బూర్గుల రామకృష్ణారావు స్మారక రాష్ట్రస్థాయి కవితలపోటీలో ప్రథమ బహుమతి
సమతా రచయితల సంఘం, అమలాపురం వారి సాహిత్య పురస్కారం
యు.టి.ఎఫ్. ఖమ్మం జిల్లా శాఖ నిర్వహించిన గేయరచనల పోటీలో ప్రథమ బహుమతి
లయన్స్ క్లబ్ తెనాలి నిర్వహించిన రాష్ట్రస్థాయి కవితల పోటీలో ప్రథమ బహుమతి
సిలికానాంధ్ర, రచన పత్రికలు సంయుక్తంగా నిర్వహించిన గేయరచన పోటీలో బహుమతి
ఎక్స్‌రే,మానస, కళాదర్బార్ మొదలైన సాహిత్యసంస్థలు నిర్వహించిన కవితలపోటీలలో బహుమతులు.. 
*****


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Loading...