9.26.2010

వేలు పట్టి పరిగెత్తిస్తుంటే...

"అమ్మా! ప్లీజ్ ఈ ఒక్క లెక్క! ఇంక చెప్పకు ఇప్పుడు, 'ఆట' ప్రోగ్రాం వస్తుంది చూడాలి ఈరోజు గ్రాండ్ ఫినాలే," అంటూ పాప

సరే! పోనిలే , వాళ్ళు ఎక్కువ టి .వి చూడరు కదా అని ఒప్పుకొని, ఫ్రండ్ కి ఫోన్ చేసా మాములుగా క్షేమ సమాచారాలు తెలుసుకొందామని,

"హాయ్ ! ఇప్పుడు చాలా బిజీ ఇంకాసేపట్లో 'ఆట ' ప్రోగ్రాం వస్తుంది ఆ టైం కల్లా డిన్నర్ అయిపోవాలి, ఈరోజు గ్రాండ్ ఫినాలె ఏంటీ నువ్వు చూడడం లేదా?" చకా చకా మాట్లడేస్తూ, బై చెప్పేసింది ఫ్రండ్.

నిజమే! నేను సాధారణంగా టి.వి చూడను, చూడను అనేకన్నా టైం తక్కువ, మళ్ళీ మర్నాడు వంటకి సంబంధించిన కార్యక్రమాల్లో మునిగిపోతాను ఆ టైం లో, ఇలాంటి వాటిని వింటాను కాని, చూడడం అనేది చాలా తక్కువే. వీళ్ళందరూ ఇంతలా చెప్తున్నారని ఆరోజు చూసా, చూసిన తరుర్వాత ఆనందం కన్నా, బాదే ఎక్కువ కలిగింది నాకు. ఎందుకంటే, ఇలాంటి కార్యక్రమాలు , పిల్లల జీవితాలను శాసిస్తున్నాయి. తల్లితండ్రుల పేకమేడల లాంటి ఆశాభావాలను ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాయి.

"వేలు పట్టి నడిపిస్తుంటే చంటిపాపలా, నా అడుగులు చూపే గమ్యం చేరేదెలా?"

ఒక సున్నితమైన ఆలోచన అది, తల్లి తండ్రులు పిల్లల గురించి పెట్టుకొన్న ఆశల ప్రతిరూపం అలా వేలు పట్టి నడిపించడము. ఎంత పెద్దయినా తమ పిల్లలు పసి పిల్లలే అనే సున్నితమైన ఆర్ధ్రత వుంది ఇందులో. ఇదంతా ఒకప్పుడు.

కాని ఇప్పుడు? పిల్లలు ఎంత తొందరగా పెరుగుతారా? ఎంత తొందరగా సంపాందించేసి తమని ఉన్నత స్థాయి కి తీసుకెళ్తారా అని అతిగా ఆలోచించేసి, ఆ అతి ఆలోచనలని, అంత లేత వయసులో, ఆ మోయలేని భారాన్ని పిల్లలపై రుద్దేసి, వాళ్ళ మనసులు తట్టుకొలేనంత శిక్ష వేసి, పెద్దవాళ్ళు కన్న కల కాస్తా కల్ల అయితే, దానికి కూడా కారణం పిల్లలిదే అని, వారిని శతృవుల్లా చూడడం, దాని వల్ల జరిగే అనర్ధాలకు ప్రతి రూపం ఇప్పటి పిల్లల జీవితం.

ఈమధ్య బెంగాలి చానెల్ లో ఇలాంటి డాన్స్ ప్రొగ్రాం లోనే, పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి డాన్స్ చేసిన ఓ అమ్మాయి, తను గెలవలేదన్న షాక్ తో పెరాలసీస్ వచ్చి మూగదయ్యింది అన్న వార్త విన్నా. అంటే ఇక్కడే అర్ధం అయిపోతుంది,ఆ పాప మీద తల్లి తండ్రులు + ఆ చానెల్ కి సంభందించిన వాళ్ళు(నిర్వహకులు+ స్పాన్సర్స్) వత్తిడి ఎంత వుందో.

ఒకప్పుడు వీధి డ్రామలకి పరిమితమైన ఈ డాన్స్, ఇప్పుడు మీడియా ద్వారా , పసి పిల్లల జీవితాలతో ఆడుకొంటోంది. పిల్లల మధ్య పోటీ అనేది ఆరోగ్యదాయకమే, కాని ఇలా డబ్బుతో ముడి పెట్టి , వాళ్ళ వయసుకి మించిన పనులు వల్ల, అది పైశాచికత్వం అవుతుంది కాని, ఆనందం అవదు. దీనికి తప్పు, ప్రోగ్రాం నిర్వహించే వారిది అనేకన్నా, వాటికి వత్తాసు పలుకుతూ, తమ పిల్లలిని డబ్బులు తెచ్చే మర మనుషులుగా మార్చేస్తున్న తల్లి తండ్రులది.

10 వ తరగతి చదువుతున్న బాబు చేత కుప్పిగంతులు వేయిస్తూ, దానికి 'ఎక్స్ ట్రాడరీ' లాంటి వచ్చిరాని తెలుగు/ఇంగ్లీష్ జడ్జిమెంట్, ఆ కమెంట్స్ కి , మంచి భవిష్యత్తు వున్న ఈ పిల్లలు ఎగిరి గంతేసి చదువులను పక్కన పెట్టి మరీ ఈ డాన్స్ ల కోసం పోటి పడడాలు, ఆనక బహుమతుల రాజకీయాలలో చిక్కుకొని, జీవితాన్ని ఛిన్నా భిన్నం చేసుకోడం, వీటన్నిటికీ తల్లితండ్రుల వత్తాసు. దీనికన్నా వినాయకుడి నవరాత్రుల ఉత్సవాలకు జరిగే ఆ వీధి డాన్సులు మేలేమో అనిపిస్తోంది . అర్ధం లేని ఈ పోటీల వల్ల మాములుగా ఆడుతూ,పాడుతూ పెరగాల్సిన పిల్లలు , వాళ్ళ బాల్యాన్ని ఇక్కడ కుదువ పెట్టేస్తున్నారు.
*****

9 comments:

  1. ఇక్కడ తప్పు మాత్రం ఆ పిల్లల తల్లిదండ్రులదే. అన్ని పిచ్చి పిచ్చి సినిమా పాటలకు డాన్సులు నేర్పించి టివిలో కన్పించేలా చేయాలనే వాళ్ళ ఆశ ఈ పిల్లలను పాడు చేస్తుంది. దాని బదులు వారిని చదువులో మంచి పేరు తెచ్చుకోమనో, స్కూలులోనే పాటలు, నృత్యం నేర్చుకోమని ప్రోత్సహించాలి. మరీ ఈ టీవి పోటీలు రికార్డింగ్ డాన్సుల్లా ఐపోయాయి..

    ReplyDelete
  2. you forgot to mention the beauty pageants for litle girls- parents invest a lot of time and money into grooming these girls hoping for a shot at modeling /silver screen in future!

    ReplyDelete
  3. ఇది విస్తరిస్తున్న టెలివిజన్ లోకంలో జరగాల్సిందే.ఎంత పెద్ద ‘ప్రైజ్’ అయితే అంత పెద్ద వత్తిడి జీవితంలోనూ తప్పదు,TV లోనూ తప్పదు.

    కాకపోతే ఈ ఫాస్ట్ ఫార్వార్డ్ అవుతున్న మన ఆధునిక జీవితాల్లో పిల్లల వయసునీ, మనసునీ,వారి శారీరక స్థాయిని కూడా వేగంగా పెంచెయ్యాలంటే ఇలాగె జరుగుతుంది.

    ReplyDelete
  4. నాక్కొంచెం అర్ధం కాలేదు .. పోటీగా పెట్టడం సమస్యా? లేక ఎటువంటి ఐటంసులో పోటీ అన్నది సమస్యా? లేక ఈ పోటీలు టీవీలో జరుగుతున్నాయన్నది సమస్యా?

    ReplyDelete
  5. మంచి విషయం మీద రాసారు. మీరు ఉదహరించిన పాట చాలా నచ్చుతుంది నాకు.

    ఈ కాలం పిల్లలకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓ పదిహేనేళ్ళ క్రితం ఓ పాటల పోటీ అంటే.. మహా అయితే ఓ వంద మందికి తెలిసేది. ఇప్పుడు మాత్రం కొన్ని లక్షల కుటుంబాల వరకూ చేరుతుంది. అది ఈ కాలంలో ఉండే pressure. మనం అంగీకరించాల్సిందే!!

    కాకపోతే.. తల్లిదండ్ర్రులు అనవసరంగా పిల్లల మీద వత్తిడి తేకుండా ఉంటే వీటి వల్ల బోలెడు లాభాలు. అవునూ.. జీ తెలుగులో "స్వరనీరాజనం" చూస్తున్నారా ఆదివారం రాత్రి. లేత గొంతులలో ఆపాతమధురాలు భలే ఉంటాయి. ఈ చిన్నారులను మనకి అందించిన వారి అమ్మానాన్నలు అభినందనీయులు!!

    ReplyDelete
  6. ఇందాకటి వ్యాఖ్య రాసేశాక ఇది తోచింది. బహుశా ఇలాంటి తల్లిదండ్రులు ఎప్పుడూ ఉన్నారేమో. ఎటొచ్చీ ఇప్పుడు టీవీలు వారికి ఒక వేదికని కల్పిస్తున్నాయి. తదనుగుణంగా స్టేక్సు పెరిగాయి.

    ReplyDelete
  7. జ్యోతి గారు @ కత్తి మహేష్ కుమార్ గారు,@థెరెసా గారు @ పూర్ణిమ గారు నేనర్లు.
    కొత్త పాళీ గారు : నెనర్లు. అసలు సమస్య ఎక్కడ అంటే చెప్పడం కష్టం. వ్యాసం పేరే 'వేలు పట్టి పరిగెత్తిస్తుంటే' అన్నాను కదండి, వేలు పట్టి నడిపించి చేరాల్సిన గమ్యం చేర్చాల్సిన తల్లి తండ్రులు,'పోటీ ' అన్న రెండు అక్షరాల మాట పట్టుకొని, అత్యాశలకి పోయి, పిల్లల వేలు పట్టి పరిగెత్తించి, ఎదురు దెబ్బలు తగిలితే ఓదార్చాల్సింది పోయి, ఇంకాస్త వత్తిడి కి గురి చేస్తున్నారు, దీనికి వత్తాసు పలుకుతున్నాయి, మీడియా ఛానేల్స్.అయితే ఇది గౌరవప్రదమైన వాటిలో అయితే మెచ్చుకోతగ్గదే, అక్కడ కూడా మరీ శృతిమించనంత వరకు. మీరు రాసారే "అక్షర ఈగ కుట్టింది" అలాగే పూర్ణిమ గారు చెప్పిన 'స్వరనీరాజనం' అలాంటి వాటిల్లో.. అది తల్లితండ్రులు తమ పిల్లల గురించి గర్వంగా చెప్పుకోవచ్చు, మీరే అన్నారు ఆ టపాలో (అక్షర...) ఆ పోటిలో చివరగా ఉన్న బాబు కూడా విజేతే అని, అలాంటి తృప్తి ఉండాలి పోటీ అంటే, ఇలాంటి వాటిల్లో అంత అవసరమా?

    ReplyDelete
  8. మిరుదహరించిన ఉదంతం ఎదో టీవీ లో చూసిన తరువాత మనసు కకా వికలమైపోయింది. అప్పటి ఆ కలతకు కవిత్వరూపమివ్వటానికై ప్రయత్నించా కానీ బాగా రాలేదు. మీ పోష్టు చదువుతుంటే నా భావాలకు, అస్ఫష్టంగా ఉండి అక్షరబద్దం చేయలేకపోయిన నా ఊహలకు చక్కటి రూపాన్నిచ్చారనిపిస్తుంది.

    మీ అభిప్రాయాలతో నూరు శాతం ఏకీభవిస్తున్నాను.
    అభినందనలతో

    బొల్లోజు బాబా

    ReplyDelete
  9. బాబా గారు : ఏకీభవించినందుకు నెనర్లు. మరి కవిత చదివే అదృష్టాన్ని మాకెప్పుడిస్తున్నారు?

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...