12.26.2009

పెద్ద కళ్ళాడు......

ఇదిగో ఇదే అన్నారం మావయ్య గది. ఈ గదిలోనే అమ్మకి తమ్ముడు పుట్టాడు.. ఆ కిటికీలోంచి తొంగి చూసాను. వసారా ... నల్లటి గచ్చు, అలాగే ఉంది, అస్టా చెమ్మా చెక్కించారు తీరికవేళల్లో ఆడుకుంటారని .. అలాగే ఉంది. ఏమి మార్చలేదు. ఇది అమ్మగది, ఆ పక్కన సబిత టీచర్ అద్దెకి ఉండేవారు, ఎలా ఉండేది ఆవిడ తెల్లగా , సన్నగా తీగలా. టీచర్ అంటే ఇలానే ఉంటుందేమో అనిపించేంతగా.. అదేంటి ఆవిడ ఉండే ఈ గదిలో వీళ్ళు సామాన్లు వేసేసారలా... ప్చ్ ఇది సామాన్ల గదేమో, ఈ చెరువులొనే అన్నయ్యలందరూ ఈతలు కొడుతూ అమ్మమ్మని పిలిచేవారు, ఏమి మారలేదు ఇల్లసలు మార్చలేదు, అవే గదులు, అవే గొడలు, వసరా ఒక్కటే గచ్చు. మిగతా అంతా రోజు పిన్ని శుబ్బరంగా పేడనీళ్ళతో అలికి ముగ్గులేసేది. అలాగే ఉన్నాయి ఇప్పుడు కూడా మునుల గదుల్లా ముగ్గులతో కళ కళ లాడుతూ. ఒకటి , రెండు , మూడు, నాలుగు.... మొత్తం 14 గదులు, అప్పుడు కూడా ఇన్ని గదులున్నాయా ఎమో! ఎవరికి తెలుసు? లెక్కపెట్టాలన్న ఆలోచన ఎప్పుడొచ్చింది కనక, వచ్చినప్పుడలా ఈతకాయలు, చెరువుగట్టు, "రాజుల్ని పిలమ్మా కాస్తా" ... అంటే రివ్వున అటు పరిగెత్తడం, ఒక గదిలోని ఇంకో గదిలోకి పరిగెత్తుతూ "కుండ పలిగి(గిలి)ందోచ్" అనే ఆటలు.. ఎన్ని గదిలో లెక్కపెట్టేంత టైం ఎక్కడుందసలు..

అన్ని జ్ఞాపకాలను అలా మనసు నాతో మాట్లాడుతూ నెమరేస్తూ ఉంటే, వీధి గదిలోకి వస్తుంటే "గుర్తుపట్టారా పాపగోరు.. నేను వెంకాయమ్మని, మీ అమ్మమ్మగోరికి పాలు పోసేదాన్ని , పాలు పెరుగు అన్ని నేనే ఇచ్చేదాన్ని గుర్తుపట్టావామ్మా? " ఎమో గుర్తు పట్టిందా తను? తెలీదు ఎదో సెలవులకి రావడమే ఇక్కడికి అక్కకయితే బాగా తెలుసు, "పెద పాపగోరు గుర్తు పడతారు " అంది ఆమే వెంటనే నా ఆలోచనలు పసిగట్టెసినట్లుగా. అక్క నవ్వింది నా వైపు చూసి.. అలా ఒక్కొక్కళ్ళు "మమ్మల్ని గుర్తుపట్టారమ్మా" అంటే "మమ్మల్ని గుర్తు పట్టారా" అని అప్యాయంగా అడగడం, ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు, వీరి వీరి గుమ్మడిపండు అంటూ ఆడుకున్న ఆటలు అన్ని గుర్తొస్తుంటే ఆప్యాయంగా వాళ్ళిచ్చిన ఆతిధ్యం స్వీకరించి అమలాపురం బయల్దేరాము.

అటూ ఇటూ కొబ్బరిచెట్లు మధ్యలో తార్ రోడ్ పై కారు అలా పరిగెడెతూ ఉంటే.... నా ఆలోచనలు కూడా అంతకన్నా వేగంగా పరిగెడుతున్నాయి. ఎంత బాగుంది ఈ ఊరు, "అదిగో అటు చూడు ఆ వచ్చేదే గోడితిప్ప, ఇక్కడే నా మాట వినడం లేదని నిన్ను తోసాను" అంది అక్క అవును ..... ఎంత తీయటి జ్ఞాపకం. అక్క ఇక్కడే ఉండేది. ఇద్దరం గోడితిప్పలో సంతకి వెళ్దామని బయల్దేరేవాళ్ళము. అన్ని చూపించేది అక్క, "అదిగో!! అదేనే మా స్కూల్" , అంటు మొదలుకుని, గోడితిప్ప, అల్లవరం, అక్కడి కొబ్బరిచెట్లమధ్య ఒండ్రుమట్టితో బొమ్మలు చెయడం, లక్క పిడతలు, తాటాకు వాచీలు, అన్ని అరుగుమీద చేర్చి ఎంతసేపు ఆడేవాళ్ళమో. "భోజనాలకి రండఱ్ఱా!!!!" అంటే కాని ఆటలకి విరామం ఇచ్చేవాళ్ళము కాదు.

"ఆ వెంకాయమ్మా నేనేనమ్మా పాలు పెరుగు అని అంది కాని ... అసలు ఏమి ఇచ్చేది కాదే, ఒకసారి మావయ్య హైదరాబాదునుండి వచ్చినప్పుడు అమ్మ వెళ్ళి వెంకాయమ్మ దగ్గిర పాలు తీసుకురా అంటే, వెళ్ళి అడిగానే, ఎంత బతిమాలాననుకున్నావు, ఒక చుక్క ఇవ్వలేదు , అమ్మమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుని "అంత దూరం నుండి వచ్చిన కొడుకుకి కనీసం కాఫీ ఇవ్వలేకపోతున్నానే " అని... "పర్లేదమ్మా డికాషన్ ఇచ్చేయి తాగుతాను అన్నారు మావయ్య.." అక్క మాటలకి నేను మళ్ళీ ప్రస్థుతానికి వచ్చాను. "అమ్మమ్మకి అనారోగ్యంగా రక్తం కక్కుకునే సరికి, భయం వేసి అలా చూస్తుంటే...., పిన్ని " వెళ్ళి స్కూల్ దగ్గిర ఆచారిగారిని తీసురమ్మంటే... ఏడుస్తూ వెళ్ళాను. అర్ధరాత్రి 12 గంటలకి, ఈ టైంలోనా.. ససేమిరా అన్నడు ఆ ఆచారిగారు... అలా రక్తం కక్కుకుని చనిపోయింది అమ్మమ్మ.... నాన్నగారు పోవడం పెద్ద దెబ్బ, అలా బెంగెట్టుకునే పోయిందే..." అక్క కళ్ళనీళ్ళతో దారి పొడుగునా ఒక్కొక్కటి చెప్తుంటే మనసు బాధతో మూలిగింది.

*******

అమ్మమ్మ ... "అది బంగారమయితే నువ్వు వెండివే , ఇద్దరూ రెండు కళ్ళు" , అంటూ అమ్మతో "దీన్ని కూడా ఇక్కడ వదిలేయవే అక్కకి తోడుగా చదువుకుంటుందిలే" అంటూ వెళ్ళినప్పుడల్లా వళ్ళో కూర్చోపెట్టుకుని "ఉండిపోవే" అన్నప్పుడల్లా ఎంత సంబరపడిపోయేదానినో, "ఉంటానమ్మమ్మా" అంటూ "నా బంగారు తల్లి " అంటూ ఎన్ని కథలు చెప్పేది. మానిబోగి ఇప్పటికి గుర్తుంది.. రామాయణం... అవి.. అలా పట్టి మంచం మీద పడుకు చుట్టూతా పిల్లలందరిని కూర్చోబెట్టుకుని రాత్రి కథలు చెప్తూ..... అన్నం తినిపిస్తూ .... ఎవరన్నా తిననని మారాం చేస్తుంటే "అదిగో ఆ కిటికీలొంచి పెద్ద కళ్ళాడు వస్తాడు, అన్నం తినకపోతే మిమ్మల్ని అమాంతం తీసుకుపోతాడు" అంటూ చిమ్మ చీకటిలో పాములా పాకి ఉన్న సన్నజాజి తీగని ఆనుకుని ఉన్న కిటికీని చూపించేది. అమ్మో ! ఎంత భయంవేసేదో నాకు పొద్దున్నే పాలు పట్టుకొచ్చే మనిషికి గుడ్లన్ని పైకి వచ్చేఅసి పెద్ద పెద్ద కళ్ళతో "అమ్మగోరు పాలండి" అని అరుస్తుంటే .... అక్కడే అరుగుపై ఆడుకునే మేము బెదిరిపోయి.....అతనివైపు చూసేవాళ్ళం కూడా కాదు ..అమ్మమ్మ అనేది "పిల్లలు దడుసుకుంటాఱ్ఱా అరవకు" అంటూ పాలు పోయించుకునేది అరుగుమీద తళ తళా మెరిసిపోతున్న ఇత్తడి గిన్ని పెట్టి(ఇప్పుడు కనిపిస్తాయా ఇంత మందం ఇత్తడి గిన్నేలు పట్టుకోడానికే బరువుగా ఉండేవి). వాణ్ణే అమ్మమ్మ "పెద్దకళ్ళాడు, బూచాడు" అని "మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తాడు" అంటూ భయపెట్టి అన్నం తినిపించేది. నాకు మటుకు వినగానే భయం రాత్రి నిద్రపట్టేది కాదు నాకు, కిటికీలోంచి ఆ పెద్ద కళ్ళాడు నా వైపే చూస్తున్నట్లు నన్నే తీసుకెళ్ళడానికి వస్తున్నట్లు అనిపించేది. "మర్నాడు లేచి అమ్మా మనం వెళ్ళిపోదాము, నాకిక్కడ భయంగా ఉంది " అని ఏడ్చేసేదానిని. "అదేంటే , నిన్నే కదా అమ్మమ్మ ఇది కూడా ఉంటుంది అంటే ఉంటానన్నావు ..." అని వెక్కిరించేది అమ్మ. "పెద్ద కళ్ళాడు... " అని నసిగేదానిని. అవును అతను ఇప్పుడెక్కడున్నాడో?" అని మాతోపాటు తోటంతా చూపించడానికి మిట్టమధ్యాహ్నం మండుటెండలో కాళ్ళకి చెప్పులేకుండా వచ్చినావిడని అడిగాను ఒకప్పుడు మాది(మావయ్యది) అయిన ఆ తోట వాళ్ళు కొనుక్కున్నారు. ఆ బేషజాలేమి లేకుండా ఎంత ఆప్యాయంగా పలకరించిదో ఆవిడ. అందుకే అడిగాను పేరు తెలీక "పెద్ద కళ్ళాడు" అని... అమే నవ్వేసి "సూరిడమ్మా.. అతని పేరు ... మా ఆయనే, పోయి చాలా కాలం అయ్యింది .. అమ్మమ్మగారొక్కరే పెద్దకళ్ళాడు అనేవోరు" అని చెప్పింది. మనిషి రూపు మదిలో లేదు కాని ఆ కళ్ళు ఇప్పటికి గుర్తున్నాయి నాకు.

******

అల్లవరం దాటి అమలాపురం వైపు దారితీస్తోంది కారు.. "ఇక్కడే చిన్నన్నయ్య స్థలం కొన్నాడట.. మనం కూడా మన ఊరిలో అంతొ ఇంతో స్థలం కొనాలే, అన్ని బాధ్యతలు తీరాక ఇక్కడికొచ్చి ఉండొచ్చు.. కొందామా ఇద్దరం కలిసి....." అక్క అడుగుతోంది... కొంటామా? ఏమో.. :)
******

పోయిన సంవత్సరం పిల్లలికి వేసవి సెలవులకి, చిన్నపిన్ని , బాబయ్యల షష్ఠిపూర్తికని తాళ్ళరేవు వెళ్తూ పిన్నుల పిల్లలందరం కలిసి మా ఊరయిన గోడిలంక కి వెళ్ళొచ్చాము. ఆ జ్ఞాపకాల వెల్లువ ఈ పోస్ట్. ఈ పోస్ట్ రాస్తుంటే కూడా కళ్ళు ఆనందంతో తడిసాయి..... మంచి జ్ఞాపకాలు. ....

********

గోడిలంక

వికీపీడియా సౌజన్యంతో

గోడిలంక, తూర్పు గోదావరి జిల్లా, అల్లవరం మండలానికి చెందిన గ్రామము.

అల్లవరం · బెండమూరులంక · బోడసకుర్రు · దేవగుప్తం · గోడి · గోడిలంక · గూడాల · కొమరగిరిపట్నం · మొగలమూరు · రెల్లుగడ్డ · సామంతకుర్రు · తాడికోన · తూరుపులంక · యెంట్రుకోన · కోడూరుపాడు · గోడితిప్ప · పల్లిపాలెం · గుండిపూడి · దేవగుప్తం రావులపాలెం · తుమ్మలపల్లె · ఓడలరేవు ·


మన ఊరి అందాలు




ఈ పైన సిత్రాలు విశ్వామిత్ర-మరో ప్రపంచం బ్లాగులోనివనియునూ.. ఆ బ్లాగు అధిపతి శ్రీ పప్పు శ్రీనివాస్ రావు గారు అనియునూ.. వారి అనుమతి ఎంతమాత్రం తీసుకొనకుండా ఇక్కడ నా బ్లాగులో నా బ్లాగు సందర్శకులకనుకూలంగా "కోనసీమ అందాలు" చూపించే ప్రయత్నం చేసి ఉన్నా
నియునూ... ఇంచుమించు మా ఊరుకూడా ఇలాగే ఉన్నందువల్ల ఈ పని చేయవలసి వచ్చినదనియునూ సవినయముగా మనవి చేసుకుంటున్నాను. పప్పు గారికి క్షమాపణలతో..








1 comment:

  1. రమణి గారూ !
    రమణీయమైన సొంతవూరి జ్ఞాపకాలు. అందులోనూ ప్రకృతి మాత ముద్దుబిడ్డ
    మన ' కోనసీమ ' జ్ఞాపకాలు మరింత మధురంగా అందించిన మీకు ధన్యవాదాలు.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...