4.30.2011

చిన్నారి పెళ్ళి కూతుళ్ళు.... :-)

మా టి. వి లో ఈ మధ్య హింది డబ్బింగ్ సీరియల్ ఒకటి వస్తోంది. నేను సాధారణంగా టి .వి జోలికి వెళ్ళను కాబట్టి ఈ సీరియల్ ఒరిజినల్ .. అంటే హిందిలో చూడలేదు.. డబ్బింగ్ అయినా నాకెందుకో ఈ సీరియల్ చాలా నచ్చింది. ముఖ్యంగా  ఎపిసోడ్ చివరిలో ఇచ్చే కోట్స్ భలె ఉంటాయి. అందుకే క్రమం తప్పకుండా చూస్తున్నా.. మొదట్లో మిస్ అయ్యాను కాని ఆ ఎపిసోడ్స్ అన్ని నైట్ 11 కి మళ్ళీ ఇవ్వడంతో స్టోరీ ఫాలో అవుతున్నా.. ఒరిజినల్ హింది అవడంతో,..నాంచడాలు, సాగదీయడాలు లేకుండా సాగుతోంది ఈ సీరియల్.   బాల్య వివాహాలు జరిగితే ఎదుర్కునే సమస్యలని , వాటి పరిష్కారాల ఆధారంగా తీస్తున్న సీరియల్ ఇది.

సీరియల్ సరే ... నాకు సడన్ గా మా అమ్మా, పిన్ని గుర్తొచ్చారు.వీళ్ళిద్దరివి ఒకేసారి ఒకరికి 9 ఏళ్ళకి ఒకరికి 7 ఏళ్ళకి వివాహాలు జరిగాయి. 

అందుకనే  అమ్మని అడిగాను అత్తారింట్లో మీరెలా ఉండేవారు అని?  దానికి అమ్మ.. "ఎలా ఉండడమేమిటే పిచ్చి మొహమా? అసలు కాపురానికి వెళ్తేగా..మీ నాన్న మంచి ఉద్యోగం వచ్చేదాకా నన్ను తీసుకెళ్ళను అన్నారు, దానికి  మీ మామ్మ వత్తాసు..నాకు  15 ఏళ్ళు రాగానే కాపురానికి పంపారు. మా మొదటి కాపురం మద్రాసులో (ఇప్పటి చెన్నై) అందరు తమిళం మాట్లాడేవారు.. నాకేమో రాదు. ఒక్కదాన్ని మీ నాన్నగారు వచ్చేదాకా బిక్కు బిక్కు  మంటూ ఉండేదాన్ని,, మామ్మ కూడా మాతో రాలేదు. "  అని చెప్తుంటే ఈవిడేనా ? నాన్నగారు చిన్నతనంలోనే కాలం చేసిన తరువాత ఒంటరిగా నలుగురు పిల్లలిని పెంచి పెద్ద చేసింది అనిపించింది. పరిస్థితులు మనకి అన్ని అలవాటు చేసి,  ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయి అంటే ఇదేనేమొ. చిన్నతనంలోనే పెళ్ళి, ప్రతి మూడేళ్ళకి ఒకరు తరువాత ఒకరు, తమ్ముడు పసివాడుగా... అంటే .. 2 ఏళ్ళు కూడా పూర్తి కాకుండానే నాన్నగారు కాలం చేయడం.. సుఖం అంటే తెలుసా ఈవిడకి అని అనిపించింది. ఇప్పటికీ అదే చురుకుతనం.. "ఒంట్లో కాస్త నలతగా ఉందమ్మా!"  అంటే చక చకా తను వంట చేసేయడం.. ఒకవిధంగా ఈ "చిన్నారి పెళ్ళి కూతురు"  జీవితంలో సాధించిన విజయాలు ఏమిటి? నలుగురు పిల్లలు ఆ పిల్లల ఎదుగుదల అంతే. కదిలిస్తే.. "ఇంట్లో ఎప్పుడు 30 ఆకులు తక్కువ వేయలేదు.. పెద్ద పెద్ద గుండిగలు వార్చేదాన్ని మీరేంటర్రా  ఒక పూట వంటకే వెళ్ళాడిపోతారు"  అంటూ హడావిడిగా తిరిగేస్తూ ఉంటుంది. అదే జీవితం అనుకునే "చిన్నారి పెళ్ళి కూతురీవిడ." (పిన్ని జీవిత విధానం నాకు తెలిసింది తక్కువ అందుకే ప్రస్తావించలేదు).
******

2 comments:

  1. మీరు అచ్చం మీ పిన్ని గారి పోలికండీ రమణీ!

    మీ అమ్మగారి ఓర్పుకు వేల వందనాలు! ఇప్పుడైతే కాస్త పని ఎక్కువైతేనే ఎంతో విసుగు కోపం ముంచుకొస్తాయి. జనరేషన్ గాప్ అంటారో కాలమే మారిందో మరి!

    ReplyDelete
  2. చిన్నారి పెళ్ళికూతురితో జాగ్రత్తండోయ్. నేనూ మీలాగే సీరియల్ ఏదో కాస్త కొత్త సబ్జెక్ట్, డిఫరెంట్ గా ఉంది, పైగా చిన్ని బంగారు తల్లి ఆనంది నాకు చాలా చాలా నచ్చేది, ఇలా ఆ సీరియల్ చూడటం మొదలెట్టాను. చివరికి ఆ జిడ్డు భరించలేక, చూడటం మానలేక టెన్షన్ పడుతుంటే, మావారు కేబుల్ తీయించేశారు. కానీ ఏమాటకామాటే నటీ నటులు అందరూ చాలా బావుంటారు, దాదీసా ఏక్షన్, డైలాగ్ డెలివరీ (హిందీ లో) మంచి హైలేట్.

    శ్రీరాగ

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...