Showing posts with label నేటి భారతం. Show all posts
Showing posts with label నేటి భారతం. Show all posts

11.08.2010

ఉనికి కోల్పోయిన (ఉత్తరం ముక్క) ఉత్తరాల రాయుడు(POST MAN)

"లేఖలు అందించే చినవాడ ప్రేమలేఖలు రాసావా ఎపుడైనా??"

ఓ ప్రేయసి.. తన ప్రియుడి కోసం పాడుకొన్న పాట అది... ఒక్క ఆ ప్రేయసికేనా ఈ లేఖలు అందించే చినవాడు.. అందరికి ప్రియమైన అపరిచితుడే... మధ్యాహ్నం ఒంటిగంట నుండి మొదలు...(మా ఊర్లో మధ్యాహ్నమే ఉత్తరాల బట్వాడ ఉండేది).... ఎప్పుడెప్పుడు వస్తాడా ఈ చినవాడు॥ ఏమేమి కబుర్లు మోసుకొస్తాడో.... అన్న ఆతృత.. రాగానే ఆనందం..

తెచ్చేది ఏ వార్త అయినా.. తనకేమి పట్టనట్లుగా వుండగలిగేది కూడా ఒక్క ఈ పోస్ట్ మాన్ మాత్రమే.. ఇప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరగడంవల్ల... అందరూ.. మొగ్గు చూపేది... సెల్ ఫొన్ సంభాషణలు.. లేదా చాటింగ్ ముచ్చట్లు.. ఎవరికి ఉత్తరం విలువ అసలు తెలీదు.. సాహిత్యం కనుమరుగవుతోంది. ఎవరిని తరచి చూసినా.. e-mails... sms ...అసలు ఉత్తరం ఎలా రాయలో కూడ తెలియని వాళ్ళున్నారు.. "ఉభయకుశలోపరి" అంటే ఏంటి అని అడుగుతారు..అప్పట్లో మేము (నేను మా అక్క) పోటీలు పెట్టుకొనే వాళ్ళము.. ఎవరెక్కువ ఉత్తరాలు రాస్తారో చూద్దామా అని... "వెళ్ళగానే క్షేమంగా చేరినట్లు ఉత్తరం రాయమ్మా " అనేవారు అప్పట్లో... ఇప్పుడు ... ఫొన్ చెయ్యి.. లేదా ఓ మిస్డ్ కాల్ ఇవ్వు...
ఇలా కట్టె , కొట్టే , తెచ్చే... లా వుండే ఈ సెల్ సమాచారాలు.. మిస్డ్ కాల్స్.. వల్ల భాషలకి.. భావాలకి.. మంచి భావనలకి...ఆఖరికి బంధుత్వాలకి దూరమై పొతున్నారు అంటే అతిశయోక్తి కాదేమో.. అప్పట్లో ఉత్తరాల ద్వారా తమ సాహిత్యాభిలాషను చాటుకొనే వారు.. సాంకేతికంగా మార్పు మంచిదే... కాని మానవ సంబంధాలు ప్రశ్నగా మారేంతగా కాదు.. ఎక్కడో విదేశాలలో వున్నవాళ్ళకి ఎలాగు తప్పదు.. ఫొటోలు .. విడియోలు పంపించి.. తమ క్షేమ సమాచారలు తెలుపుకొవడం.. ఇక్కడే వున్నవాళ్ళు తప్పనిసరిగా అప్పుడప్పుడు కలుస్తూ .. ఉత్తరాల ద్వారా క్షేమ సమాచారలు తెలుపుకొన్నట్లయితే పిల్లలికి మనము బంధుత్వం గురించి వాటి విశిష్టత గురించి నేర్పిన వాళ్ళమవుతాము..... మొన్న మా కజిన్ వాళ్ళ బాబుకి... నన్ను పరిచయం చెయ్యడం.. "అత్త" నాన్న... మా పెళ్ళి విడియోలో లెఫ్ట్ నుండి.. 2nd ఫొటొ.. నీకు చెప్పానుగా....ఇలా వున్నాయి ఇప్పటి పరిచయాలు.. ఉండేది ఒకే ఊర్లో మళ్ళీ.. కలవడం తక్కువ... పరిచయాలు అంతకన్నా తక్కువ.. ఇలా అయితే పిల్లలికి ఎలా??
మొన్నామధ్య.. ఈ శ్రీజ .. శిరీష్ ల పెళ్ళిగురించి ఏదో విషయంలో ఒక పెద్దాయనని ఇంటర్వ్యూ చేసిందో ప్రైవేట్ ఛానెల్ ఆయన అన్న మాటలు నాకు చాలా నచ్చాయి.."ఇప్పటి యువత.... సినిమా మోజు లో పడిపోయింది.. మంచి సాహిత్యం చదవరు... విలువలు తెలీవు ... ఆవేశం... ఆతృత...ఆకర్షణల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు... ఆలోచన తక్కువ... మంచి పుస్తకాలు చదివి వాటిని ఉత్తరాల ద్వార ఒకరికొకరు తెలియజేసుకొంటే ఆలోచన పరిజ్ఞానం పెరుగుతుంది అని నా అభిప్రాయం.. "
అంతే కదా మరి... చక్కటి సాహిత్య విలువలు కల పుస్తకాలు మన ఆత్మ వికాసానికి .. సోపానాలు..అలాగే భావపూరితమైన లేఖలు కూడా అంతే స్థానాన్ని పొందుతాయి..

10.28.2010

పదిహేనేళ్ళ పసిడిప్రాయానికి పసుపు(ఉరి)తాడు??

ఒంట్లో నలతగా ఉందని, ఇంటికి తొందరగా వచ్చేసాను ఈరోజు. ఇంట్లో ఎవరూ లేరు, పిల్లలు అమ్మావాళ్ళింటికి వెళ్తున్నామని, ఫొన్ చేసి చెప్పారు. బయట బాల్కనీలో చైర్ వేసుకొని, వేడి వేడి కాఫీ తాగుతున్నా! సన్నగా చినుకులు పడ్తున్నాయి. కరెంట్ కూడా ఉండనా? వద్దా? అన్నట్లుగా ఊగిసలాడ్తోంది, అందుకే బయట కాస్త చల్లగా ఉందని కూర్చొన్నా.. ఎదురు అపార్ట్ మెంట్లోంచి మాటలు వినిపిస్తున్నాయి, కొంచం అర్ధం అయి అవనట్లుగా, ఎందుకులే వినడం సభ్యత కాదని, వచ్చే పోయే వాళ్ళని చూస్తూ కూర్చొన్నా. ఇంతలో మరి సిగ్నల్ అందడం లేదో, మరింకోటో గాని ఎదురింటి అమ్మాయి బయటకి వచ్చి మాట్లాడుతోంది, అసలు మాట్లాడుతోంది అనేకన్నా అరుస్తోంది అనడం సబబేమొ. వినకూడదు అనుకొన్నా, నా ప్రమేయం లేకుండానే నా చెవిన పడ్డాయామాటలు.

"చూడు మామయ్య! బుద్ధిగా స్కూల్ కెళ్ళి చదువుకొంటున్న నన్ను, ప్రేమ అంటూ లొంగదీసుకొన్నాడు నీ కొడుకు, నిజంగా ప్రేమించాడో లేదో కాని, అమ్మ కాళ్ళమీద పడిందో, లేక నువ్వె జాలిపడ్డావో తెలీదు , పెళ్ళి చేసావు, నీకు తెలుసు పెళ్ళినాటికే నాకు మూడో నెల, ఇప్పుడు ఇద్దరు పిల్లలు, నాకీ రొగం వచ్చిందని వదిలేసి వెళ్ళిపొయాడు నీ కొడుకు, అతను వెళ్ళినందుకు నేనెమి బాధ పడడం లేదు, మహా అయితే ఇంకో 10 యేళ్ళు బతుకుతానేమొ, నా గురించి నాకు దిగులు లేదు, నా పిల్లల సంగతేంటి? నువ్వు రా ఇక్కడికి మాట్లాడుకొందాము. నా బతుకు నేను బతకగలను. ముక్కు పచ్చలారని నా పిల్లల్ని అన్యాయం చేయలేను. నా పిల్లలికో దారి చూపించండి చాలు ."

పూర్తిగా విన్న నేను, చేష్టలుదిగి ఉన్నాను. నేను కలలో కూడా ఊహించని మాటలవి. ఆ మధ్య వచ్చిన "10 క్లాస్", "నోట్ బూక్" లాంటి సినిమా ప్రభావాల వల్ల, ఈ అమ్మాయి స్కూల్ కి వెళ్ళి వచ్చే టైం కి అక్కడే కాపు కాసి, "నిన్ను ప్రేమిస్తున్నాను", అంటు వెంటపడి, లొంగదీసుకొని ఊరికి వెళ్ళిపోయాడని, అతనెవరో కాదు, వాళ్ళ అమ్మకి మేనల్లుడే అని, తల్లి తండ్రులు బతిమాలో, బామాలో 10 తరగతిలోనే ఆ చదువు కూడా పూర్తి చేయకుండా , పెళ్ళి చేసారని కొంచం కొంచంగా తెలుసు ఆ అమ్మాయి కధ.

ఎప్పుడు చూసినా, ఎవరితో ఒకరితో ఎదో పెద్ద ఆరిందాలా చేతులు తిప్పేస్తూ బాధ్యతలగురించి, పెళ్ళి, పిల్లల గురించి మాట్లాడేస్తూ ఉండడం వింటుంటే, కొన్నిసార్లు సరదాగా అనిపించి, నవ్వుకొంటూ విన్నా మరికొన్నిసార్లు ఎంటో బాధ అనిపించేది, చిన్న వయసు పెద్ద మాటలు అని.

ఇప్పుడు నిండా 20 యేళ్ళు ఉండవు, పెద్దగా పరిచయం లేదు కాని, దాదాపు చిన్నప్పుడు నుండీ చూస్తూనే ఉన్నా, చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళడం, డాన్స్ చక్కగా చేస్తుందని, ఎన్నో బహుమతులు గెలుచుకొన్న పసిడి మొగ్గ ఆ అమ్మాయి . వాళ్ళ అమ్మావాళ్ళు నిత్యం సాయి సన్నిధిలో ఉంటారు, వాళ్ళ ఇంటి సగం స్థలం కూడా సాయిబాబ గుడికని ఇచ్చారు.

ఈమధ్య ఎవరో చెప్పగా విన్నాను, చిన్న వయసులో పెళ్ళీ, పిల్లలు వల్ల ఆ అమ్మాయికి ఏదో ఆరోగ్య సమస్య వచ్చి, వంటినిండా ఏవో మచ్చలు వచ్చాయి అని, కాని ఏంటి అనేది ఇదిమిద్దంగా తెలీదు. అప్పుడప్పుడు బాల్కనీ లో నించొని వున్నప్పుడు, ఓ క్షణం అలా ప్రత్యక్షమై ఇలా మాయమయ్యెది, మధ్య మధ్యలో వాళ్ళ వాటాలోంచి మాటలు మటుకు గట్టిగా వినిపించేవి. ఏదో సంసారం గొడవలు అనుకొనేదాన్ని కాని, ఇప్పుడు ఈ ఫోన్ సంభాషణ విన్నాక నిజంగా చాలా బాధ అనిపించింది ఆమె పరిస్థితి తలుచుకొని, ఎంత పెద్ద ఆపదలో చిక్కుకుంది చిన్నపిల్ల అని . అతను వదిలేసి వెళ్ళిపోయడట, పైగా "నీకు రోగం వచ్చింది, నా వల్ల కాదునిన్ను చూసుకోడం" అన్నాడట.

ఆ 15 యేళ్ళ వయసులో పెళ్ళీ , పిల్లలూ, బాధ్యతలు ఎంతకి దారి తీసిందో, పైగా అబ్బాయి అయినవాడే, అయినా నావల్ల కాదు పొమ్మన్నాడు. సినిమా ప్రభావం మనిషిని ఎంతగా దిగజారుస్తోందో. సినిమా వాళ్ళ వ్యాపార దక్షత, ఇక్కడ చూసేవాళ్ళ ఆకర్షణాపరంపరలకి పెద్ద శిక్ష.

"8 క్లాస్ లో ఎవరో ఇద్దరమ్మాయిలు వాళ్ళ బాయ్ ఫ్రండ్స్ తో స్కూల్ నుండి ఇంటికి రాకుండా వెళ్ళిపోయారు" అన్న మాటలు వింటున్నప్పుడు, అసలేమి చెయ్యాలి ? పిల్లల్నిసినిమాలు చూడనివ్వకుండా ఆపాలా? లేక చదివించడం ఆపాలా? ఎమైపోతోందీ ఈ పసిడి వయసు అని అనిపిస్తోంది. పరిస్థితి చేతులు కాలే దాక వచ్చినప్పుడు తల్లి తండ్రులు మాత్రం ఏమి చెయ్యగలరు?

ఒక్కసారి ఇంట్లో పెద్దవాళ్ళు,స్కూల్ లో గురువులు ఆలోచించి , పరిష్కార మార్గాలు చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది అనిపిస్తుంది. హాస్టల్ లో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఈ సినిమా ప్రభావం నుండి దూరంగా తీసికెళ్ళగలగాలి ఈ పిల్లలిని.

"మంచి తీసుకొని, చెడు వదిలేయండి" అని చెప్పడమంత సులువు కాదు వీరిని కాపాడుకోవడం అనిపిస్తుంది, ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు వింటుంటే.

10.18.2010

భావి తరానికి బంధువులేరి?

మొన్నే నేనో ఫంక్షన్ కి వెళ్ళాను. ఎందుకో ఇలాంటి ఫంక్షన్స్ ఇక ముందు తరాలవాళ్ళకి తెలిసే అవకాశం లేదనిపిస్తోంది. ఆచార వ్యవహారలు పక్కనపెడితే, కేవలం బంధువుల మాత్రమే లేదా బంధువుల సమక్షంలో మాత్రమే జరిగే కొన్ని ఫంక్షన్స్ ఇకముందు కను(తెర)మరుగైపోతాయి. ఎందుకంటే, ఆలోచిస్తే భావి తరాలవారికి అసలు బంధువులు వుండరేమో అనిపిస్తుంది.

నా చిన్నప్పుడు మా ఇంటికి చాలా మంది చుట్టాలొచ్చేవారు. ఎవరెవరో అస్సలు అర్దమయ్యేది కాదు. వివరించి చెప్పడంలో అమ్మకి కూడా భలే ఛాన్స్ దొరికిందని, తెగ ఆనంద పడిపోయేది. అవును మరి! దగ్గర్లో నేనేగా వుండేది. "ఈయనెవరో తెలీదే నీకు? పిచ్చిదానా! మా అమ్మమ్మ లేదూ, వాళ్ళ ఆడపడుచు అత్తగారి, తమ్ముడి బార్య కి , వేలు విడిచిన మేన మామ" అంటూ ఏదో పెద్ద చుట్టరికం చెప్పేది కాని, నాకర్ధం అయ్యేది కాదు. అర్ధం కాకపోయినా, అర్ధం అయ్యిందని తల ఊపేసేదాన్ని, ఏమన్నా బహుమతులు తెచ్చారేమో అన్న కుతూహలంతో. ఆ బంధువు పిప్పరమెంట్ల పాకెట్(అప్పట్లో ఇవే ఫేమస్ మరి) చేతికిచ్చి "ఆడుకోమ్మా" (పండగ చేసుకో అనే లెవెల్ లో) అని అనేవారు. అలాగే ఇంకెవరో అమ్మకి తమ్ముడి (కజిన్) వరస చుట్టాలు నన్ను గిర గిరా తిప్పేసి "అక్కా నీ చిన్న కూతుర్ని మటుకు నేను తీసుకెళ్తాను" అంటూ మనిద్దరం బొంబాయ్ వెళ్దామొస్తావా? అంటూ తెగ ముద్దు చేసేవారు. మా వారితో ఏవన్నా చిలిపి తగాదాలు వస్తే, అవి కాని, గాలి వాన అవుతున్నాయని అనిపిస్తే, ఈ సంఘటలు చెప్తాను వాతవరణాన్ని చల్లబరచడానికని. "నన్ను ఎత్తుకొని , గిర గిరా తిప్పేవారు , బోల్డు బోల్డు పిపరమెంట్లు తెచ్చేవారు తెలుసా" అని, తను ఉడుక్కొని "ఏవరు? ఏమిటి? " అంటే చెప్పేదాన్ని చివర్లో ."అప్పుడు నా వయసైదేళ్ళు ఆ వచ్చినది మా మామయ్య" అని. బావ- మరదళ్ళ విషయం అయితే చాలా హస్యం . ఇంకో 5 నిముషాలలో మా వారు నాకు తాళి కడతారు అని నేను ఎంతో బుద్దిగా తలవొంచుకొని కూర్చొంటే, మా మావయ్య కొడుకు దగ్గరికి వచ్చి, "నువు నన్నెంత మోసం చేసావో తెలుసా! నేను నీ గురించి ఎన్ని కలలు కన్నానో" అని చెవిలో చెప్తే , నా ముందు ఒక్కసారిగా అలలు ఎగసి , ఎగసి ఎత్తున వున్నా కొండలను తాకుతున్న ఫీలింగ్, హృదయం ఆక్రోశించింది(ఇది కరెక్టేనా?) . వృక్షాలన్నీ మోడువరినట్లుగా, ఎడారిలో ఎర్రటి ఎండలో పెద్ద వడ గాలి వీచినట్లుగా , నా హృదయాంతరాళాలు బద్దలయినట్లు ఫీలింగ్ వచ్చేసింది. "బావ! బావ! బావ! ఎంతపని చేసావు బావ! అసలు నాకెందుకు చెప్పలేదు బావ? నేనెప్పుడు కలలో కూడా అలా అనుకోలేదే, అయ్యో! పోని ఇప్పుడు తాళి కట్టొద్దని చెప్పనా?" అని అందామనుకొన్నాను, కాని అనలేదు. అనేలోపులో పక్కన కోలహలం వినిపించిది. మా బావలుంగారు ఎవరితోనో పందేం కాసాడట, నన్ను అవాక్కయీలా చేస్తానని. అదండీ సంగతి.

మరి ఇప్పటి/ఇకముందు తరానికి మనమీ మధురమైన, చిలిపి అనుభవాల్ని,అల్లర్లని ఇవ్వగలమా? అసలు భావి తరానికి బంధువులేరి? ఎవరో వేలు విడిచిన మేనమామలు, పిన్నులు అంటూ అప్పట్లో వచ్చేవారు కాని, ఇపుడసలు దగ్గిర వాళ్ళంటూ ఎవరు లేరు. ఆలోచిస్తుంటే బాధగా అనిపిస్తోంది. ఇంటికొక్కరు చాలు అనుకొంటున్న ఇళ్ళళ్ళో, ఆ ఒక్కరికి ఇంకో ఒక్కరు చేసుకొంటే, వారికి బంధువులేరి? బంధువులమీద ఎన్ని జోక్స్ వున్నా, ' బంధువులు రాబందులు' అని అనుకొన్నా, అసలు బంధువులంటూ లేకపోతే వూహించుకోడం కొంచం కష్టంగానే వుంది! ఇటు అమ్మా,నాన్న అటు అత్త, మామ వీళ్ళే బంధువులు అంతే. ఎంతో సున్నిత జీవన విధానానికి దూరమవుతోంది భావితరం. అవునా? ఆలోచించండి. పండగ అంటే పరవాన్నాలు, పిండి వంటలు కాదు. ఎక్కడో దూరాన వున్న అమ్మాయి, అల్లుడు, అబ్బాయి, కోడలు, మనవరాళ్ళూ, వెరసి పండగ సందడి. ఇంత సందడి ఇకముందు మనము చూడగలమా?
మనిషికి:
బంధువులు తలవాకిట దాక,
కొడుకు కొరివి పెట్టేదాక
బార్య కడ దాక అని అన్నారు.

బంధువుల స్థానం కాస్త తక్కువే అయినా, వారి ఉనికి మటుకు గొప్పదనే చెప్పుకోవచ్చు.. మరిప్పుడు ఆ తల వాకిట దాక కూడా రాడానికి ఎంతమందికి ఎంతమంది బంధువులు వున్నారు?

9.26.2010

వేలు పట్టి పరిగెత్తిస్తుంటే...

"అమ్మా! ప్లీజ్ ఈ ఒక్క లెక్క! ఇంక చెప్పకు ఇప్పుడు, 'ఆట' ప్రోగ్రాం వస్తుంది చూడాలి ఈరోజు గ్రాండ్ ఫినాలే," అంటూ పాప

సరే! పోనిలే , వాళ్ళు ఎక్కువ టి .వి చూడరు కదా అని ఒప్పుకొని, ఫ్రండ్ కి ఫోన్ చేసా మాములుగా క్షేమ సమాచారాలు తెలుసుకొందామని,

"హాయ్ ! ఇప్పుడు చాలా బిజీ ఇంకాసేపట్లో 'ఆట ' ప్రోగ్రాం వస్తుంది ఆ టైం కల్లా డిన్నర్ అయిపోవాలి, ఈరోజు గ్రాండ్ ఫినాలె ఏంటీ నువ్వు చూడడం లేదా?" చకా చకా మాట్లడేస్తూ, బై చెప్పేసింది ఫ్రండ్.

నిజమే! నేను సాధారణంగా టి.వి చూడను, చూడను అనేకన్నా టైం తక్కువ, మళ్ళీ మర్నాడు వంటకి సంబంధించిన కార్యక్రమాల్లో మునిగిపోతాను ఆ టైం లో, ఇలాంటి వాటిని వింటాను కాని, చూడడం అనేది చాలా తక్కువే. వీళ్ళందరూ ఇంతలా చెప్తున్నారని ఆరోజు చూసా, చూసిన తరుర్వాత ఆనందం కన్నా, బాదే ఎక్కువ కలిగింది నాకు. ఎందుకంటే, ఇలాంటి కార్యక్రమాలు , పిల్లల జీవితాలను శాసిస్తున్నాయి. తల్లితండ్రుల పేకమేడల లాంటి ఆశాభావాలను ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాయి.

"వేలు పట్టి నడిపిస్తుంటే చంటిపాపలా, నా అడుగులు చూపే గమ్యం చేరేదెలా?"

ఒక సున్నితమైన ఆలోచన అది, తల్లి తండ్రులు పిల్లల గురించి పెట్టుకొన్న ఆశల ప్రతిరూపం అలా వేలు పట్టి నడిపించడము. ఎంత పెద్దయినా తమ పిల్లలు పసి పిల్లలే అనే సున్నితమైన ఆర్ధ్రత వుంది ఇందులో. ఇదంతా ఒకప్పుడు.

కాని ఇప్పుడు? పిల్లలు ఎంత తొందరగా పెరుగుతారా? ఎంత తొందరగా సంపాందించేసి తమని ఉన్నత స్థాయి కి తీసుకెళ్తారా అని అతిగా ఆలోచించేసి, ఆ అతి ఆలోచనలని, అంత లేత వయసులో, ఆ మోయలేని భారాన్ని పిల్లలపై రుద్దేసి, వాళ్ళ మనసులు తట్టుకొలేనంత శిక్ష వేసి, పెద్దవాళ్ళు కన్న కల కాస్తా కల్ల అయితే, దానికి కూడా కారణం పిల్లలిదే అని, వారిని శతృవుల్లా చూడడం, దాని వల్ల జరిగే అనర్ధాలకు ప్రతి రూపం ఇప్పటి పిల్లల జీవితం.

ఈమధ్య బెంగాలి చానెల్ లో ఇలాంటి డాన్స్ ప్రొగ్రాం లోనే, పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి డాన్స్ చేసిన ఓ అమ్మాయి, తను గెలవలేదన్న షాక్ తో పెరాలసీస్ వచ్చి మూగదయ్యింది అన్న వార్త విన్నా. అంటే ఇక్కడే అర్ధం అయిపోతుంది,ఆ పాప మీద తల్లి తండ్రులు + ఆ చానెల్ కి సంభందించిన వాళ్ళు(నిర్వహకులు+ స్పాన్సర్స్) వత్తిడి ఎంత వుందో.

ఒకప్పుడు వీధి డ్రామలకి పరిమితమైన ఈ డాన్స్, ఇప్పుడు మీడియా ద్వారా , పసి పిల్లల జీవితాలతో ఆడుకొంటోంది. పిల్లల మధ్య పోటీ అనేది ఆరోగ్యదాయకమే, కాని ఇలా డబ్బుతో ముడి పెట్టి , వాళ్ళ వయసుకి మించిన పనులు వల్ల, అది పైశాచికత్వం అవుతుంది కాని, ఆనందం అవదు. దీనికి తప్పు, ప్రోగ్రాం నిర్వహించే వారిది అనేకన్నా, వాటికి వత్తాసు పలుకుతూ, తమ పిల్లలిని డబ్బులు తెచ్చే మర మనుషులుగా మార్చేస్తున్న తల్లి తండ్రులది.

10 వ తరగతి చదువుతున్న బాబు చేత కుప్పిగంతులు వేయిస్తూ, దానికి 'ఎక్స్ ట్రాడరీ' లాంటి వచ్చిరాని తెలుగు/ఇంగ్లీష్ జడ్జిమెంట్, ఆ కమెంట్స్ కి , మంచి భవిష్యత్తు వున్న ఈ పిల్లలు ఎగిరి గంతేసి చదువులను పక్కన పెట్టి మరీ ఈ డాన్స్ ల కోసం పోటి పడడాలు, ఆనక బహుమతుల రాజకీయాలలో చిక్కుకొని, జీవితాన్ని ఛిన్నా భిన్నం చేసుకోడం, వీటన్నిటికీ తల్లితండ్రుల వత్తాసు. దీనికన్నా వినాయకుడి నవరాత్రుల ఉత్సవాలకు జరిగే ఆ వీధి డాన్సులు మేలేమో అనిపిస్తోంది . అర్ధం లేని ఈ పోటీల వల్ల మాములుగా ఆడుతూ,పాడుతూ పెరగాల్సిన పిల్లలు , వాళ్ళ బాల్యాన్ని ఇక్కడ కుదువ పెట్టేస్తున్నారు.
*****

6.28.2009

అమ్మో! పదో తరగతా....

కృష్ణవేణి టీచరు.. పదో తరగతి క్లాస్ టీచర్, ఇంగ్లీషు, సోషల్ సబ్జెక్ట్స్ చెప్పేవారు. అన్నిటికన్నా ముఖ్యంగా క్లాస్ టీచరు అవడం వల్ల ఇక కాలేజ్ కి వెళ్తున్నారు అంటూలుగురితో ఎలా మసులుకోవాలి అనేది ఇంట్లో మన శ్రేయోభిలాషులు ఎలా చెప్తారో అలా చెప్పేవారు. ఏ విధమైన పక్షపాత వైఖరి లేకుండా అందరిని సమానంగా చూసేవారు. ఆవిడ క్లాస్ కి వస్తున్నారు అంటే సూది కింద పడినా పెద్ద విస్పోటంలా వినిపిస్తుందేమో అనేంత నిశ్శబ్ధంగా ఉండేవాళ్ళం. ఇక చదువుల విషయం చెప్పక్కర్లేదు. అంతా ప్రత్యేకమే, అందరూ ప్రత్యేకంగా చూసేవారు. వాళ్ళు పబ్లిక్ పరీక్ష వ్రాస్తున్నారు, అందుకని అసలు వాళ్ళని డిస్టర్బ్ చేయ్యద్దు అని ఒకళ్ళు, 10th క్లాస్ వాళ్ళకి ప్రవేట్ క్లాసులట, టిచర్లు చాలా బిజీగా ఉన్నారనో, స్కూల్లో ఎటెళ్ళినా ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. సాయంత్రం 4 గంటలకి స్కూల్ అవగానే ఇంకో గంటలో మళ్ళీ డ్రస్ మార్చేసి, స్కూల్ కి వెళ్ళాలి. రాత్రి ఇంటికొచ్చేసరికి ఎనిమిదో , తొమ్మిదో అయ్యేది. అప్పుడు తెలియలేదు కాని, ఎవరికి వాళ్ళు వాళ్ళ స్కూల్ పరువు కోసం, పర్సన్టేజ్ కోసం చెప్పిందే చెప్పి, 10 వ తరగతి పిల్లలిని పబ్లిక్ పరీక్షలకి తయారుచేసేవారు. కాని ఆ ప్రత్యేకత, ఆ ప్రైవేట్ క్లాసులు , ఎప్పుడు చదువు, చదువు అనే భాద ఎంతో కొంత ఉన్నా భలే సరదాగా ఉండేది. ఎదన్నా పేరంటానికో, పెళ్ళికో వెళ్తే "అమ్మో అమ్మాయి 10 తరగతా, బాగా చదవాలమ్మా, ఇదొక మైలురాయి. ఇది దాటవంటే ఇక తిరుగే లేదు" అంటూ అందరూ చేసే హితభోదలు అవి విన్నప్పుడు ఈ 10 తరగతికి ఇంత ప్రాముఖ్యత ఉందా ..... అసలీ క్లాసులోకి రావడమే ఏదో ఎవరెస్టు శిఖరం ఎక్కినంత ఆనందం ఆరోజులలో. అలాంటి అంత ప్రాముఖ్యత ఉన్న ఆ పదో తరగతిలో.. ఓ సారి..

*****


అసెంబ్లీ లో పద్మశ్రీ .. పద్మశ్రీ పక్కన నేను.. ఎప్పుడూ పక్కన బొమ్మలా నిలబడడమే, ఎప్పుడు స్కూలుకి రాకుండా ఉండదు. ఒక్కరోజన్నా నాకు ఆవకాశం రాదు
, "భారత దేశం నామాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు...." గట్టిగా చెప్పేస్తోంది. ఆమె స్కూల్ లీడరు, నేను 2nd లీడర్ని. అంటే పద్మ రాకపోతే నాకు అలా భారతదేశం .. అంటూ ప్రతిజ్ఞ చెప్పే అవకాశం వచ్చేది. ఒక్కరోజు కూడా అవకాశం ఇవ్వదు. పోనిలే ఈరోజన్నా కాస్త నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది కదా, చూద్దాం , వాళ్ళే గమనిస్తారు అని మౌనం వహించి అందరితో పాటు " భారతదేశం నా మాతృభూమి.. అంటూ గొంతు కలిపాను. కాని మనసు మాత్రం ఊహల్లో తేలిపోతోంది, ఇంకాసెపే అందరూ నన్ను గమనిస్తారు, సిస్టర్ వచ్చి నన్ను ఏంటి అని అడుగుతారు.. అప్పుడు ఇదీ సంగతి అని చెప్తాను, అప్పుడు అందరూ గట్టిగా చప్పట్లు.. చప్పట్లతో పాటు ..అందరూ.. అని ఆలోచిస్తూ ఉండగా, అందరి చప్పట్లు మిన్నంటాయి, అరెరె! నేను చెప్పకుండానే అందరికి తెలిసిపోయినట్లుంది అనుకొని ఆలోచనలని కట్టిపెట్టి, అసెంబ్లీ చుట్టూ చూద్దును కదా!.. అంతా సైలెంట్, మైక్ లోంచి "జన గణ మన అది నాయక జయహే..." అదేంటి అసెంబ్లీ అయిపోయింది, ఎవరూ గమనించలేదు.. ప్చ్! నా కళ్ళలోంచి నీళ్ళూ..ఇదే ఆఖరి సంవత్సరం ఇంక ఇక్కడ కుదరదు ఎలా? స్కూలంతా ఒక్కచోట చేరేది అంటే ఇక్కడే కదా పొద్దున్న అసెంబ్లిటైంలోన కదా..ఎందుకిలా జరిగింది, జనగణమన తరువాత అడిగితే....?? "ఇంక ఇప్పుడొద్దు, అసెంబ్లీ అయిపోయింది క్లాసులకి వెళ్ళండి " అనేస్తారు. నాలో మధనపడ్తూనే.. క్లాస్ వైపు దారి తీసాను అందరితో పాటుగా.. పోనిలే కృష్ణవేణి టీచర్ కి చెప్పి క్లాసులో సరిపేట్టుకోవచ్చు అనుకొని.

****




పీరియడ్లు మొదలయ్యాయి.. అంతా ముందర ఉన్న హాఫ్యర్లీ పరీక్షల సిలబస్ ముగించే ప్రయత్నంలో హడావిడి, సాయంత్రం ప్రత్యేక క్లాసుల హడావిడి.. ఎవరూ గమనించడం లేదు , ప్రత్యేకంగా వెళ్ళి అసలు విషయం చెప్దామంటే ఆ అవకాశం రావడం లేదు, వస్తున్నారు హడావిడిగా క్లాసులు తీసుకొంటున్నారు, మధ్య మధ్యలో "మీరు 10 వ తరతిలోకి వచ్చారు, ఇంక చిన్నపిల్లలు కారు .. మిమ్మల్ని కొట్టలేము, అలా బాగా చదువుకోవాలి, రేపు కాలేజిలకి వళ్తారు, ఫలనా స్కూల్ పిల్లలు అని మా స్కూల్ పేరు నిలబెట్టాలి అని చెప్తున్నారు తప్పితే అసలు ఇటుకేసి చూడరు.. అసలు చివర కూర్చున్నవాళ్ళ పరిస్థితే అంతేనేమో.. మధ్యాహ్నం రెండయింది. ఇంకో గంటన్నర ఉంది, కాని అప్పటి దాకా ఆగితే ఆ తరువాత నా కోరిక నెరవేరుతుందని ఎలా అనుకోడం.... ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ ఈ కోరిక నెరవేరుతుందా? అర్థం చేసుకోరూ... సుశీల టిచర్ లెక్కల క్లాసులో ఉన్నాను, బోర్డ్ మీద (a+b) హోల్ స్క్వేర్ ఎంతా అనేది చెప్తున్నారు, అది వినే పరస్థితి కాదు నాది.. ఎలా ఎలా ఎలా ఇదే నా ఆలోచన, ఇక ఉండ బట్టలేక లేచి నించొన్నా.. నేను నించోగానే "ఏంటి" అన్నట్లుగా చూసారు టీచర్ నా వైపు.. హమ్మయ్య గమనించారు మొత్తానికి అనుకొని, నెమ్మదిగా ముందుకొచ్చా..

"టీచర్ కృష్ణవేణి టీచర్తో మాట్లాడాలి " అని అడిగాను.

"ఏంటి పని? "

" అదే టీచర్ ఈరోజు.. ఈరోజు..."


"ఊ ఈ రోజు తెలుసు.. నీ పుట్టినరోజే కదా..ఇచ్చేవుగా చాక్లెట్లు."

"అదే అందర్లా..నేను టీచర్ తో మాట్లాడుతాను"


"నాకు చెప్పు నేను చెప్తాలే ఆ టీచర్ కి"

"అదే టీచర్ ఇంక తరువాత అంటే మేము కాలేజ్కి వెళ్తాము, మరి మరి...."

"నస పెట్టకు చెప్పు ఎంటో.."

"అందరికి అసెంబ్లీలో పాట పాడ్తారు... మరి ఈరోజు నాపుట్టినరోజుకి అందరూ మర్చిపోయారూ... అది చెప్దామని..."

"ఇందుకా..మళ్ళీ అసెంబ్లీ ఎలా కుదురుతుంది ఇక రేపే కదా.. స
రే వెళ్ళు వెళ్ళీ మాట్లాడు.. " అని పంపిచారు.

అలా వెళ్ళిన నేను ఆ టీచర్ దగ్గిర భయపడ్తూనే అసలు విషయం చెప్పాను. మళ్ళీ సంవత్సరం పుట్టినరోజు చేసుకోలేను కదా టీచర్ అని, నిజానికి ఆవిడ అర్థంచేసుకొన్నారు.

అందరూ ఉదయం మర్చిపోయారు. అసలు స్కూల్ లీడర్ చెప్పా
లి, ఈరోజు పుట్టినరోజు అమ్మాయిలు స్టేజ్ పైకి రండి అని అప్పుడు అందరూ కలిసి ... హ్యాపి బర్త్ డే టు యు అని పాడ్తారు. మరి పద్మ ఎందుకు మర్చిపోయిందో తెలీదు. మొత్తానికి స్కూల్ వదిలే పావు గంట ముందు, మా ప్రిన్స్ పల్ అనుమతితో స్పెషల్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకొని, అందరి చేత అడిగి పుట్టినరోజు పాట పాడించుకొన్న వైనమిది. అలా గుర్తుండిపోయింది. అది ఎవరి పుట్టినరోజునైనా అలా కళ్ళముందు మెదుల్తూ ఉంటుంది.
******

10 తరగతి, పబ్లిక్ పరీక్షలు తీసేస్తారు అంటే, ప్రాధాన్యత తగ్గినట్లే.. ప్రైవేట్ క్లాసుల హడావిడి లేదు. 10వ తరగతి అనేది ఒక మైలు రాయి అనే ప్రాధాన్యత తగ్గింది, దీనివల్ల చదువు విలువ కూడా తెలియదు పిల్లలికి అనిపిస్తుంది. ఇదివరకు 7th క్లాస్ కామన్ అనేవారు, అది తీసేసినా అంత అనిపించలేదు కాని, పిల్లలికి పరీక్షల విలువ తెలియాలి, రెపొద్దున్న ఎదన్నా కాంపిటేషన్ ఎక్జామ్స్ వ్రాయలంటే ఈ పదో తరగతి ప్రీ ఎక్జామ్ అవ్వాలి. ఆ వి్లువ తగ్గింది అనిపిస్తొంది. లాభం ఏంటి అంటే పిల్లలు ఒక్క సబ్జెక్ట్ లో పోయినా సంవత్సరం అంతా వృధా అన్నది నిజం. దీనిని ప్రత్యామ్నాయం ఆలోచిస్తే బాగుంటుంది కాని, పబ్లిక్ తీసేయడం మాత్రం ఏమో.. ఒక స్కూల్ స్టాండర్డ్ ఎలా తెలుస్తుంది? ఇప్పటిదాకా 10 వ తరగతి ని స్టాండర్డ్ కి ప్రామాణికంగా తీసుకొనేవారు. ఇప్పుడు ఏ స్కూల్ ఎలా అన్నది కచ్చితంగా అంచనా వెయ్యలేము. ఇప్పటికే పరీక్షల ప్రాధాన్యత తగ్గింది. ఆ హడావిడి లేదు.

*******


ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మా పాప 10 వ తరగతి. సెలవులంతా ప్రైవేట్ క్లాసులని స్కూల్ కి వెళ్ళింది, ఇప్పుడా ప్రైవేట్ క్లాసుల కళ లేదు. ఎదన్నా అంటే "హ్యాపీస్ అమ్మా! పబ్లిక్ లేదు" అంటోంది. "అమ్మో 10 వ తరగతా" అనే బాద లేదు.. ఏమనను.. "చదువుకో తల్లీ " అంటే .. "నొ ప్రాబ్లం" అని నాకు అభయమిస్తోంది. పబ్లిక్ లేదు అన్నది అమలులోకి వస్తే.... పరిస్థితి??

ఇవన్నీ పక్కన పెడితే , ఈ రోజు పాప పుట్టినరోజు, పబ్లిక్ ఉన్నా లేక పోయినా పరీక్షలు రాయక తప్పదు, అది స్కూల్ వదలక తప్పదు. అందుకే నా అనుభవం పాపకి జరగకూడదని, ముందే చెప్ప్పాను. ఈ అనుభూతులు మళ్ళీ రమ్మన్నా రావు నాన్న! ఒకవేళ పాడక పోతే అడుగు అని... (వాళ్ళకి కూడా అసెంబ్లీ పాటా మొ! ఉన్నాయి) స్కూల్ అనుభూతులు, ఆ అనుభవాలు ఎన్ని చెప్పినా తక్కువే .. తిరిగిరాని బాల్యం అది. అందుకే పాపని + మా పాప వయసులు పిల్లలిని కూడా ఏమి మిస్ అవ్వద్దని చెప్పడానికే ఈ ప్రయత్నం.
*****


చిట్టితల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలతో.. ఇట్లు ప్రేమతో అమ్మ.


4.22.2009

జనాభా లెక్కల్లోంచి నన్ను తీసేసారు..... :(

"జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర...
రామ దూత అతులిత భలదామా అంజనీ పుత్ర పవన సుత నామ..
మహవీర విక్రమ భజరంగీ కుమతి నివార సుమతికే సంగీ
కాంచన వరణ విరాజ సువేశా కావన కుండల కుంచిత కేశా..
అథ వజ్ర జౌ ద్వజా విరాజై..."

"అబ్బా! సేలవు రోజు ఇంత పొద్దున్నే హనుమాన్ చాలీసా ఎంటా ??" అని నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తే .. మా బుచ్చి బాబు గారు తదేక దీక్షలో చక చకా మనసులో కాదు ..కాదు .. బయటికే మననం చేసేసుకొంటున్నారు. అప్పుడే పూజ చేసుకొంటున్నారని "ఎంతయిందబ్బా టైం " అని చూసాను. ఇంకా పూర్తిగా 8 కూడా కాలేదు. ప్చ్! సెలవంటే పొద్దున్నే లేచేస్తారు. "నేను వెళ్ళాలి బాబు లేవండి.." అంటే మటుకు మంకు పట్టు పడ్తారు. నేను లేచానని తెలిస్తే "కాఫీ ప్లీజ్" అంటారని బుచ్చి బాబు చూడకుండానే మళ్ళీ ముసుగుతన్నేసా.. కళ్ళు గట్టిగా మూసుకొన్నా చెవులకి మటుకు సహస్రనామలు వినిపించేస్తున్నాయి...

"యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః |
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ||"

లేవక తప్పేట్టు లేదు ఇక అని లేచి, "ఏంటండీ ఈరోజు... పొద్దున్నే ఈ పూజలు.. సెలవేకదా కాసేపు పడుకొందామనుకొంటే.." అన్నా (కొంచం కోపంగానే)

"సెలవెందుకిచ్చారు మేడం"??
"సెలవెందుకేంటి? ఈరోజు ఎలక్షన్స్ కదా"

"అదే మరి ఓటెయ్యవా..?"

"అబ్బా వెయ్యొచ్చు లెద్దురూ ... సాయంత్రం 5 గంటలదాక ఉంటుంది కదా ఇప్పుడే అంత మించిపోయేలా పరిగెత్తాలా ఏవిటి"?

"ఆ!!! ఫలనా బుచ్చిబాబు, వాళ్ళావిడ వస్తారు మనందరం అప్పటిదాక ఎదురుచూస్తూ ఉందాము..." అని మనకోసం ఎదురుచూస్తారు ఈలోపులోనె ఎవరో ఒకరు మన ఓట్లు కూడా వేసేస్తారు."

"పొన్లెద్దురూ! వేస్తే వేసారు, నిద్ర మానుకొని అక్కడిదాక వెళ్ళి ఓటేసినా ఒకటే వెయ్యకపోయినా ఒకటే. వీళ్ళు మనల్నేమి ఉద్దరిస్తున్నారు కనక... "

"ఎంత మాటన్నావు? ఓటు హక్కు వినియోగించుకోడం మన జన్మ హక్కు, మన నాయకుల్ని మనమే ఎన్నుకోవాలి. అసలు ఓటు అంటే........"

"అమ్మో వద్దులెండి ! ఏదో సరదాకి అన్నాను కాని, మనమే వేద్దాము మన హక్కు మనమే వినియోగించుకొందాము. "

*******
అలా మోదలయిన మా ఓట్ల ప్రహసనం ఎలా "కొన" సాగిందంటే...

వీధి వీధంతటికి నేను మావారు చాలా బాగా పరిచయమైన వాళ్ళం కావడం వల్ల మా ఇద్దరికి మా మీద కాస్త అతినమ్మకం (చిన్నప్పటినుండి ఇక్కడే ఉంటున్నామనే ధీమా) అందరినీ పలకరించుకొంటూ ..... సంబంధించిన సెంటర్ కి వెళ్ళాము.

*****


అక్కడికి వెళ్ళి నా ఓటరు ఐ.డి చూపించి ఓట్ వెయ్యడానికి స్లిప్ ఇమ్మంటే సదరు ఏజంట్..

"ఇదిగోమ్మా ! లిస్ట్ క్రమ పద్ధతిలో లేదు. పేరు ప్రకారం కాక, ఇంటి నంబర్ల ప్రకారం చూసుకొండి" అని నాదగ్గర ఓ పెద్ద పేపర్ లిస్ట్ పెట్టారు.


ఒక్కో పేజ్, ఒక్కో పేజ్ ఓపిక గా చూసాను, ఇటు ఇంటినంబర్, అటు పేర్ల ప్రకారం.. ఎక్కడా ఏ లిస్ట్‌లో


నా పేరు కనపడలేదు. నాది, మా బుచ్చిబాబుది ఇద్దరి పేర్లు లేవు. ఈ సెంటర్ కాదేమో అని, మా ఊర్లో ఉన్న మొత్తం అన్ని సెంటర్లు తిరిగి తిరిగి విసిగి వేసారాము.

అలా ఈసారి మా జన్మహక్కయిన ఓటు హక్కుని సద్వినియోగపరుచుకోలేకపోయాము. అక్కడ అందరూ తెలిసిన వాళ్ళే అవడంతో "వేరే తరుణోపాయం ఎమన్నా ఉందా" అంటే "పేర్లు లిస్ట్‌లో ఉండి ఉంటే ఐ.డి. కార్డ్ లేకపోయినా పర్వాలేదు, ఈ రేషన్ కార్డో, ఇంకో ఐ డి ఏమి తెచ్చినా సరిపోయేది. కాని లిస్ట్ లో పేర్లే లేకపోతే మేమేమి చెయ్యలేము" అని చేతులెత్తేసారు. అలా మేము ఆ జనభా లెక్కల్లో లేము.

ఓటు హక్కు వచ్చినతరువాత మొదటిసారి నేను ఓటు వెయ్యకపోడం. ఎందుకో చిన్నప్పటినుండి ఉన్న ఊళ్ళో, ఉంటున్నా , ఏదో విదేశాలలో ఉంటున్నట్లు మేము ఓటు వెయ్యలేకపోయాము.


ఈ సారి ఇలాంటి అవకతవకలు చాలా జరిగాయని తరువాత తెలిసింది.అలా జనాభా లెక్కల్లోంచి నన్ను(మమ్మల్ని) ......... :(
Loading...