Showing posts with label మహిళాభ్యుదయం. Show all posts
Showing posts with label మహిళాభ్యుదయం. Show all posts

9.23.2010

ఆడవాళ్ళమండి మేము

"నాలో కలిగిన ఈ అంతర్మధానినికి దగ్గరగా ఉండే ఈ ఆలోచనలు ఒక అమ్మాయి నుండి రావడం కొత్తగా ఉంది"-నేను రాసిన 'సప్తపది' టపా స్పందనగా దిలీప్ గారి వ్యాఖ్య.
పై వ్యాఖ్య నా ఆలోచనలనో ఊపు ఊపింది నిజం చెప్పాలంటే.
దిలీప్ గారి ఈ ఆలోచన వల్ల నాకు మొదట్లో " ఎందుకు ఆడవాళ్ళకి ఇలాంటి ఆలోచనలు కలగకూడాదా?"అని ప్రశ్నించాలని అనిపించినా, తరువాత నా ఆలోచనలని కాస్త అటువైపు మరలిస్తే, అందులో నిజం లేకపోలేదనిపించింది. ఎందుకంటే, "మల్లె తీగ వంటిది మగువ జీవితం, చల్లని పందిరి ఉంటే అల్లుకుపోతుంది" అంటూ ఆడవాళ్ళు ఎప్పటికి అధారపడేవాళ్ళే చల్లని పందిరి ఉండాల్సిందే, ఫలానా వాళ్ళ కూతురు, ఫలాన వాళ్ళ సోదరి, ఫలాన వాళ్ళ బార్య అంటూ ఎప్పటికప్పుడు ఎవరిదో ఒకరి పేరు తగిలించి ఆధారపడేలా చేస్తారు తప్పితే వాళ్ళ సొంత పేరుతో గుర్తించే వారు ఎంతమంది? ఈ విధమైన ఆధారపడడం అనే విధానాన్ని, ఉగ్గుపాలతో సహా నేర్పేయడం వల్ల వాళ్ళకంటూ స్వతంత్ర అభిప్రాయాలు, సొంత ఆలోచనలు తక్కువే ఒకప్పుడు (ఇప్పుడు కూడా కొంతమంది ఇలానే ఉన్నారు). మరి అలాంటప్పుడు దిలీప్ గారి ఆలోనలు తప్పు లేదు అనిపించింది.

అసలెక్కడిదాకో ఎందుకు? నేను రాసిన 'సప్తపది ' ఆర్టికల్ కి మహిళా పాఠకుల స్పందన మటుకు ఎంతవరకు ఉంది? (theresa  గారు తప్పితే) అక్కడికీ నా స్నేహితులని ఒకరిద్దరిని "మీ అభిప్రాయం ఏంటి" అని అడిగితే "బాగుంది" తప్పితే ఇంకేవిధమైన స్పందనా లేదు. మా ఆడవాళ్ళమంతా ఇంతే, టి.వి లో అత్తా కోడళ్ళ ఏడుపుగొట్టు సీరియళ్ళను, మా శక్తి కోలదీ కన్నీళ్ళు కార్చేస్తూ, రెప్పేయకుండా అసలేవిధమైన ఆలోచన లేకుండా చూసేసి, ఆనక అంతే కోపంతో సదరు అత్తాకోడళ్ళని శాపనార్ధాలు పెట్టేస్తూ, దీని గురించి అనవసరంగా అర్ధం లేని చర్చలు చేసేసుకొంటాము వెరసి ఫొను బిల్లులు, సెల్ బిల్లులు తడిసి మోపెడంత అయ్యేలా.
ఒక అర్ధవంతమైన చర్చ ఏదన్నా జరుగుతుంటే అరంగుళం కూడా ముందుకు కదలము, పైపెచ్చు అదేదో మగవాళ్ళ పనే మనకి సంభందం లేదన్నట్లు ఉంటాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకరో ఇద్దరో ఇందుకు కొంచం భిన్నం గా ఉంటే, మిగతావారికి "ఆడవాళ్ళు ఇలా కూడా ఆలోచిస్తారా ?" అని అనుకోవడం సహజమేగా మరి.
రోజూ సాయంత్రం నేను నా స్నేహితురాలు కలిసి ఎక్కే ఓ లోకల్ ట్రైన్ లో మా ముందు స్టేజ్ లో ఒక మహిళ ఎక్కుతారు, ఎంతో హుందాగా, చిరునవ్వుతో ఆ పలకరించే విధానం అది నాకు చాలా నచ్చుతుంది. ఎందుకో ఆవిడని చూడగానే ఒక విధమైన గౌరవం దానితో పాటు ఆవిడ మాట్లాడే విధానం, అదీ చూస్తుంటే ముచ్చటేస్తూ ఉంటుంది. మాట్లాడకుండా ఆవిడనీ, ఆవిడ మాటలని గమనిస్తూ ఉంటాను.
ఓ రోజు మాటల సంధర్భంలో, ఈ విషయం నా స్నేహితురాలితో మామూలుగా అన్నాను.
"ఆ! ఆవిడకి అంత లేదు లెండి, వాళ్ళాయన పచ్చి తాగుబోతు, తాగి రోడ్డు మీద పడిపోతూ ఉంటాడు" అంది నా స్నేహితురాలు వ్యంగ్యంగా.
వాళ్ళయన తాగి పడిపోడానికి, నాకు ఈవిడ మాట్లాడే తీరు నచ్చడానికి అసలు సంభందమంటూ ఏమైనా ఉందా? ఒక అమ్మాయిని/మహిళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులతోనో లేదా భర్త ప్రవర్తనతోనో అంచనా వేయడం ఎంతవరకు సబబు? ఎవరికి మటుకు ఉండదు తన భర్త క్షేమంగా ఉండాలని, అలా ఈవిడ మటుకు చెప్పుకోదా ఇది మంచి పద్దతి కాదని? అతను వినకపోతే ఈమె ఏమి చేస్తుంది? అంతమాత్రానికి వాళ్ళని వాళ్ళ సొంత వ్యక్తిత్వాన్నీ చులకన చేస్తామా? చేతనైతే ఓదార్చగలగాలి, కాని భర్త ని అడ్డుపెట్టుకొని మనిషిని చులకనగా అంచనా వేయడం అంత సబబు కాదేమొ అనిపిస్తుంది నాకు.
నా మటుకు నాకు, భర్త హోదాని అడ్డుపెట్టుకొని ఆడంబరంగా ఉండడమో లేదా భర్త చెడు అలావాట్లని తలుచుకొని కృంగిపోతూ మనల్ని మనం చులకన చేసుకొవడం అంటే నచ్చని విషయం. మన సొంతంగా మనమేమి చేయగలము అనేది ఆలోచించాలి. భర్త పేరో, లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరో వాడుకొని పని చేయించుకోవడం అంటే , అప్పు చేసి పప్పు కూడు తింటున్నామేమో అనిపిస్తుంది.
మారుతున్న ఈ తరంలో ఆడవాళ్ళు ఇలా భర్తని బట్టి బార్య అన్నట్లుగా ఉంటే, మరి ఇలాంటి అంతర్మధనం అమ్మాయిలో కలగడం కొత్తగా ఉంది అని అనడం అమోదయోగ్యమేగా మరి.
"నీతో ఎవరన్నా మాట్లాడకపోతే అది వాళ్ళ తప్పు, ఓ మంచి స్నేహితురాలిని కోల్పొతారు, నువ్వెవరితోనన్నా మాట్లాడకపోతే అది నీ తప్పు, ఓ మంచి స్నేహితురాలిని కోల్పోతావు " అని అనుకొని మన అభిప్రాయాలని నిరభ్యంతరంగా చెప్పగలగాలి.

సప్తపది

ఇది ఏ విశ్లేషణలనూ, కాని ఏ మతాలని కాని ఏ కులాలని కాని, ఏ వ్యక్తిని కాని కించపరిచే ఉద్దేశ్యం కాదు. ఎవరినన్నా నాకు తెలియక భాదిస్తే క్షమించమని ప్రార్ధన.

ఇప్పుడే పర్ణశాల లో 'సప్తపది ' చదివాను, ఒక సినిమా ఇలా తీస్తే బాగుండేది, ఆ సినిమాలో అంతా ఓ కుల ప్రస్తావన సంభందించిన అంశం పైన చర్చ, సోమయాజులిలా, హేమ అలా, గౌరినాధుడు ఇంకోలా అనుకొంటూ వెశ్లేషణ ని అన్ని కోణాలనుండి పరిశీలించి మరీ బ్లాగు పాఠకులని ఆలోచింపజేసారు. ఒక సినిమాకి స్పందించ తీరు అభినందనీయమే. మరి నిజజీవితంలో అలా జరిగితే? అంత పెద్ద పెద్ద మాటలు వాడి, అంత విశ్లేషణ నేను చెయ్యలేను కాని, నాకు తెలిసినంతలో ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నిస్తాను. అసలు నాకెందుకు అని ఊరుకొన్నా, కాని ఊరుకోలేని మనసుని ఊరడించలేక రాస్తున్నదే ఈ సప్తపది .

ఇక్కడ నిజజీవితం లో హేమ, ఎంతో గొప్పగా చెప్పుకొనే ఉన్నత కుటుంబంలోని పుత్రిక , చిన్నాప్పటినుండి ఆచారవ్యవహారంటూ అన్నీ కట్టుబాట్ల మద్య పెరిగింది. అదే ఆ సినిమాలో లా హరి ని ప్రేమించి ఏ సోమయాజుల (మారే) అవసరం లేకుండానే పెళ్ళి చేసుకొంది. సప్తపది సినిమా ఇక్కడితో ముగుసింది. కాని నిజ జీవితం ఇక్కడితో ఆగిపోలేదు. ఇక్కడే మొదలవుతుంది.

ఏ ఆచార దురాచారాలైనా మనుషులు ద్వారా కనుగొనబడినవే. వాటిని రూపు మాపెందుకు తమ వంతు కృషిగా, చేస్తున్న ప్రయత్నమే (కొంత వ్యాపార దక్షతని మేళవించి) ఈ సినిమాలు, ఈ కళా తపస్వుల ప్రయత్నాలు అవి, కాని ఒక్కటి మటుకు నిజం! ఈ ఆచారలను, దురాచారాలన్నిటినీ కూకటి వేళ్ళతో సహా పెకిలించలేమన్నది అక్షర సత్యం. మరి ఒక ఆచార వ్యవహారంలో 23 యేళ్ళు ఒక ఆచారానికో , ఒక మడి కట్టుకొన్న వ్యవహారానికో అలవాటు పడ్డ వ్యక్తి, ఒక్కరోజులోనో, ఒక్క గంట లోనో ,ఓ సినిమా చూసినందువల్లో, మారడమనేది అసాధ్యం.

ఇక బార్య భర్తల భందం:

"ధృవంతే రాజావరుణో ధృవం దేవో బృహస్పతిః ధృవంతే ఇంద్రశ్చాగంచ్ఛ రాష్ట్రం థార్యతాం ధృవం."
అంటే, ఈ గృహస్తూ జీవితం నిలకడగా ఉండాలని, చివరిదాక ఇద్దరూ ఎడబాటు లేకుండా జీవించాలని, అన్యోన్యమైన దాంపత్యాన్ని కలిగి ఉండాలని, పెళ్ళి సుమూహర్తం సమయంలో , వేదపండితులు, బ్రహ్మగారు ౠగ్వేదం లోని ఈ మంత్రాన్ని ఉచ్ఛరిస్తారు.
చివరి దాక ఉండే ఈ భందంలో, మరి అలా ప్రేమ అంటూ ఈవిధమైన(కులాంతర, మతాంతర) వివాహం చేసుకొన్న వారు ఎంతమంది చివరిదాక నిలకడగా ఉన్నారు? అసలు ఆ భర్త కాని, ఈ బార్య కాని ఎవరు మారాలి ఇద్దరిలో? భర్త /బార్య తను శాఖాహారిగా /మాంసాహారిగా మారలా? ప్రేమాకర్షణ మత్తులో మారుతాను అని చేసే బాసలన్నీ జీవితాంతం ఉంటాయా? సంవత్సారాల తేడాలోనే "నా కుటుంబం, మా అలవాట్లు, మా ఆచారాలు" అంటూ ఆ రెండోవారిని తమ వైపు తిప్పుకొంటారు.
ఇక్కడ నేను అమ్మాయిలు మాత్రమే అనడం లేదు ఓ ఉన్నత కుటుంబలోని ఓ అబ్బాయి అమ్మాయి కోసం ఆచారాలన్నీ పక్కన పెట్టేసి అమ్మాయి వైపు కులం లోకో మతంలోకో మారిపోయి చేసుకోడం నిజంగా దయనీయ పరిస్థితి. ఇక ముందు తరంలో కనక ఈ కుల ప్రస్తావన కనక రావడమంటూ జరిగితే(వస్తుంది, ఇంకా ఎక్కువగా ఇప్పుడు మొహమాటపడి చెప్పుకోడం లేదు కాని, అందరికి వుంది ఈ కుల పట్టింపు) వాళ్ళకి పెద్దవాళ్ళు చెప్పేది ఇలా ఉంటుంది. "పూర్వం మా ముందు తరంలో , ఇన్నీ ఆచారాలు ఇన్ని వ్యవహారలు ఉండేవి అప్పట్లో వాళ్ళు నిప్పుతో నీళ్ళు కడిగే వాళ్ళు , రాను రాను వాళ్ళు అంతరించి పోయారు వాళ్ళ ద్వార పరిచయం కాబడ్డ ఆ ఆచారాలు లేవు " అని. ప్రతీ వారికి కుల మత పట్టింపులు ఉన్నాయి, వాళ్ళ కులం గురించో మతం గురించో గొప్పగా చెప్పుకొంటుంటారు. వాళ్ళందరూ హ్యప్పీగానే ఉన్నారు వాళ్ళ పేర్ల చివర వాళ్ళ కులాల పేర్లు తగిలించుకొని. " కులాలు అంతరించి పోవాలి, అంతరించి పోవాలి" అంటూ గొంతెత్తి అరిచే వాళ్ళు కూడా, మర్నాడు పేపర్ లో తన పేరు చివర తన కులం పేరు లేదని అరిచేవారే.
ప్రతీ ఆచారం వెనక ఓ అర్ధం ఉంటుంది అని, అర్ధం చేసుకొని ఏ కుల ప్రస్తావన లేకుండా సంతోషంగా ఉండగలగడమనేది ఓ కళ. ఇది సినిమా కాదు 3 గంటల్లో ముగిసిపోవడానికో, ఓ 6 పేజిల వెశ్లేషణ రాసి చర్చించుకోడానికో, నిజ జీవితం. ప్రేమించామంటూ, జీవితం ఎవరి చేతుల్లోనో పెట్టేసి మారిపోవడం కాదు. మన జీవితం మనం జీవించడానికి, అలాగే మన మీదా మన వ్యక్తిత్వం మీద మనకి నమ్మకం ఉండాలి కాని, అవతలి వాళ్ళు మారిపొమ్మంటే గుడ్డిగా మారడం కాదు. ఈ జీవితాన్ని మనకి నచ్చిన రీతిలో మలుచుకోడానికి మనకు మనమే కళా తపస్వులం, మనమే విశ్వనాధులం కూడా.
అందరూ ఇలా ఉంటున్నారని నేను అనడం లేదు, ఎక్కడో కొందరు ఆదర్శంగా కూడా ఉంటున్నారు అని చెప్పడం నాకిస్టం లేదు. ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారేమో కాని నా చుట్టుపక్కల ఎక్కడ నాకు కులం అవసరం లేదు, కుల పట్టింపు లేదు, నా పిల్లలు అన్నిటికి అతీతులు మేము మనుషులం అంతే అన్నవారు లేరు. ఉన్న ఏ ఒక్కరో ఇద్దరో, ఉద్యోగాల్లోనో, బడిలోనో, కొన్ని కొన్ని షరతులకి లొంగినవారే. ఎందుకో ఇక ఈ అర్ధం లేని కబుర్లు, నేరవేర్చుకోలేని ఆశయాలు. ఇవన్నీ సినిమాలకే పరిమితం కాని నిజ జీవితానికి మాత్రం కాదు.
నేను గొప్ప అంటే , నేనే గొప్ప అని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సంధర్భంలో తన కులం గురించి అనుకొనేవారె, ఎవరు బయటికి కనపడరు. కనపడినవారు అలా సినిమాలు తీస్తారు. అందులో కూడా నాకు ఏ పట్టింపు లేదు అని స్పృష్టంగా చెప్పరు. చెప్పడానికి ప్రయత్నిస్తారు కాని, బంధాలో బాద్యతలో ఒప్పుకోవు, ముఖ్యంగా ప్రేక్షకులు ఒప్పుకోరు. అందుకే ప్రశ్నలు ప్రేక్షకులకే వదిలేస్తారు.

అక్కడ చదివేసి, ఇక్కడ కాస్త ఆవేశంగా ఇంత పెద్ద టపా రాసాను అంటే , నెనేదో నీతి వాక్యాలు నేర్పెద్దామని కాదు కాని, ఒక్కసారి ఆలోచించండి, ఇవేవి మారిపోయెవి కావు, గోవుల్లు తెల్లన, గొపయ్య నల్లన అన్నవి పాటలవరకె బాగుంటాయి. ప్రేమ వివాహాలు, మతాలు మార్చుకోడాలు లాంటివి చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. మాములు శాఖాబేధం ఉన్న పెళ్ళిళ్ళు చేసుకొనే వాళ్ళే అప్పుడప్పుడు కొన్ని కొన్ని విబేధాలల్లో చిక్కుకొంటున్నారు. మరి ఇక మత మార్పిడులు, చిన్నప్పటినుండి మనం పెరిగిన వాతావరణం కాక పూర్తి భిన్నంగా ఉన్నా ఇంకో వాతవరణంలోకి, వెళ్ళి మనసు చంపుకొని చెయ్యలేని పనులు చేసే కన్నా, ఒక్క క్షణం ఆలోచించి, ఆకర్షణలకి లొంగిపోకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం.
కొ.మె: నాకు ఒక్కటే ఎప్పుడు అర్ధం కానిది. తమ జంటకి పిల్లలు పుడితే, ఎంతో గర్వంగా పేరు చివర ఆ కులం పేరు పెట్టుకొనే ఆ భర్త , " అరే! తన బార్యకి కూడా కొంత స్వతంత్ర ఆలోచనలు ఉంటాయి చుద్దాము ఆలోచించి ఓ నిర్ణయానికి వద్దాము" అనుకొనో, లేదా నేనింత గొప్పగా చెప్పుకొంటున్నాను కదా మరి తన అభిప్రాయం ఎంటో అని ఆలోచించడెందుకో? అలాగే సదరు బార్య కూడా "అరె! అంత పెద్ద/చిన్న కుటుంబం నుండి వచ్చాను కదా! మరి తను అంత గొప్పగా తన కులం గురించి చెప్పుకొంటున్నప్పుడు మరి నేనెంటి ఇలా మౌనం" అని అనుకోదెందుకు? హ! అందుకే అన్నది, ముందు తరంలో కుల పట్టింపులు ఇంకా ఎక్కువవుతాయి అప్పుడు, ఈ ఉన్నత కులాల గురించి, ఈ సప్తపదుల గురించి కథలు కథలు గానే చెప్పుకొంటారు. ఎందుకంటే వాస్తవం కనిపించదు. అంతరించేది అదొక్కటే కాబట్టి. 90% ప్రేమ వివాహాల్లో, వధూ వరులిద్దరులో ఒకరు ఉన్నత కులాలవారు/మతాలవారు అవడం విశేషమయితే, సదరు ఉన్నత కులాల/మతాల వధూ/వరులు, వాళ్ళ కులాన్నో/మతాన్నో మార్చుకోడం మరో విశేషం. ఏ కళాతపస్వి దర్శకత్వం లేకుండానే.
Loading...