
"రాచరికపు చిత్తులతో, రణతంత్రపు టెత్తులతో సతమతమవు మా మదిలో మదనుడు సందడి సేయుటయే చిత్రం".
"దూరం ..దూరం..".
"ఏమది దేవి ఎప్పుడూ లేనిది దూరమనుచూ మమ్మల్ని పరిహసించుచున్నావు ."
"ఎంతమాట నాధా! మీతో పరిహసములా?"
"మరేమది దేవి, మమ్ములను త(అ)స్మదీయుల వలే గాంచిన మాకా అనుమానం పొడసూపదా!"
"లవకుశలిద్దరూ పెళ్ళీడుకొచ్చినారు నాధా! పక్కనే ఉద్యానవనంలో కేళీ విలాసంలో తేలియాడుచున్నారు. మనల్ని గాంచే ప్రమాదమున్నదని అట్లు వేడుకొంటిగాని అన్యధా భావిచుట తమరికి ధర్మమా నాధా!."
"అటులనే దేవి నీ వేదనను అర్ధం చేసుకొంటిని."

"భూలోక విహారం చేసేదమా నాధా! పిల్లలిద్దరికి వివాహం చేయుట కాస్త సులభతరమగును."
"వివాహమునకు, భూలోక విహారమునకు సంభందమేమి దేవి?"
"మీరు నన్ను వరించినంత సులభతరమా నాధ! ఇప్పటి పరిణయం? వధువు దొరకుటయే క్లిష్ట తరముగా గాంచుచున్నది. దేవకన్యలు వయసులో పెద్దవారగుట వలన మానవ కన్యలను చూసేదము. అదియునూ కాక మనకి ఇద్దరు కుమారులు, బహు బార్యత్వం నిషేదించబడినది. మీలాగే నా కుమారులు గూడా "ఏకపత్నీ వ్రతులు" అని బిరుదాంకితులు గావలెనని నా ఆకాంక్ష. భూలోకమొలో ఓ కొత్త పద్ధతి ప్రేవేశపెట్టినారని వేగుల ద్వార తెలిసినది మరి మనము ఒకమారు భూలోకమునకు వెడలి వచ్చెదము."
"ఏమా నూతన పద్ధతి దేవి? నావరకు ఈ వేగు రానేలేదు. నావరకు ఏతెంచని ఆ పద్ధతి అంతః పురంలో ఉండే నీవరకు రావడమనగా, ఒహ్! ఏమదీ అంతఃపుర అతివలను అబల అనుకొన్నామే గాని , సబల గా మార్పు గోచరించుచున్నది."
"నిష్టూరాలేల స్వామీ! ఇప్పటికే మాపై నిందలు చాలానే యున్నవి, మేము ఆభరణముల గురించి, పాకశాస్త్ర పలహారాల గురించి , అత్తగారి ఆరడింపుల గురించి తప్ప అన్యధా ఆలోచింపలేమని మీ పురుషపుంగవుల ఉవాచ."
"ఎవరో అన్నదానికి నేనేల బాధ్యత వహిచవలె దేవి, నీవిప్పుడు అలిగినచో నేను ద్వాపరయుగ శ్రీకృష్ణ అవతారమెత్తవలె. అలుకవీడి భూలోక విహారమునకు వెడలెదము "
***

"good news for you
bad news for other computers and laptops
The feature rich stunning laptops now comes with.... ...."
"ఏమది దేవి నీవెప్పుడు ఆంగ్లం అభ్యసించినావు, అంతా శీఘ్రముగా పఠించుచుంటివి"?
"అబ్బా భూలోకమునకు వచ్చితిమి కదా ఇక ఆ భాష కట్టిపెట్టుడు నాధా! ఇక్కడి వాడుక భాషలో మాట్లాడుకొనుదము."
"అటులనే కాదు కాదు .. సరే దేవి చెప్పు ఆంగ్లం ఎక్కడ నేర్చుకొన్నావు?"
"మనఅంతఃపురంలో దూరదర్శన్లో ఇంగ్లీషు ఛానెల్స్ ద్వారా నేర్చుకొన్నాను".
"తెలివైన వారు మీ ఆడువారు"
"పదండి! ఓ రెండు లాప్ టాప్ లను కొనెదము"
"ఇప్పుడవెందుకు దేవి? ఇంట్లో టీ.వి ఉన్నది కదా! "
"అది వే

రు ఇది వేరు నాధా! ఇందులో ఇప్పుడు కొత్తగా బ్లాగులు సృష్టించుకొనే విధానం ఒకటి వచ్చినది. మనము సృష్తించుకొనకపోయినా పర్వాలేదు. పాఠకునివలే చక్కటి కథలను, వ్యాసాలను, వ్యంగ్య రచనలను చదవి, వ్యాఖ్యానించినచో, మన లవకుశలిద్దరూ అదృష్టవంతులగుదురు. ఇది ఒక పత్రికలాంటిది. భూలోకమునుండి లవ కుశలిద్దరికి బహుమతిగా రెండు కొని తీసుకొని వెడలెదము".
"బ్లాగు బ్లాగు.. వ్యాఖ్యానించినా లేదా పఠించినా మన కుమారులు అదృష్టవంతులా.. హ.. హ.. నాకు ఈ బ్లాగు బాష వంటపడ్తోంది దేవి. "
****
"దేవి ఇది చూడుడు, భూలోకం నుండి వచ్చు దారిలో పఠించినాను, ఎవరో మానవుడు నాకు ఓ రెండు దినములు సెల

వు అని అడుగుచున్నాడు, ఇది ఏమి విచిత్రం దేవి? లిఖించుటకు, పఠించుటకు కూడా సెలవులా."
"అదంతా అతని అభిమానులకు విన్నవించుకోడం నాధా! అభిమానులు ఒక్కరోజు వారి బ్లాగు చదవకపోయినా, వారి అభిమానం హద్దులు దాటి ఉన్మాదులయి పోయే ప్రమాదం వాటిల్లునేమో అని సోచించి, ముందు జాగ్రత్త! ఆ సెలవు చీటి. నా దగ్గర లాప్టాప్ లో కూడా చాలా మంది , తమ తమ సొంత ప్రాంతములకు వెళ్ళూచూ , అభిమానులను అందోళన పడవద్దని విన్నవించుకొనుచున్నారు."
"ఇదేమి దేవి ఇది నా 50వ టపా, ఇది నా 100 వ టపా అనుచూ లెక్కించుకొనుచున్నారు. అర్ధ శతకం, శతకాల తరువాత వీరు రాయడం నిలిపివేయుదురా?"
"భలేవారే నాధా! ఇదేమన్నా భూలోకంలో ఆడు చిత్ర విన్యాసాలా ?? 100 రోజుల తరువాత పెద్ద ఉత్సవం జరిపి నిలిపివేయుటకు. బ్లాగులు లిఖించడం ప్రొత్సాహం, ఉత్సాహల కోసమై అట్లు రాసుకొందురు."
"బ్లాగు.. బ్లాగు... బహు బ్లాగు...హ హ హ"
"ఏమైనది స్వామీ అంత హాస్యం?"
"ఏమి లేదు దేవి! ..హ.. హ.. హ... అది..అది.. హ హ హ"
"నవ్విన తరువాతయిన చెప్పుడు లేదా చెప్పి అయినా.."
" అహ! ఏమి లేదు దేవి.. హ .. హ.. ఎవరో మానవుడు చూడు కొత్తగా సృష్టించుకొన్న తన బ్లాగు, తన టపా చదివిన తరువాత 100 వ వ్యాఖ్య రాసిన వ్యక్తి కి తన కూతురిని ఇచ్చి వివాహం చెసేదనని ..."
" నిజమా నాధా! నేను ఎదురుచూచుచున్న ఘడియ రానే వచ్చింది. నేను ఈ "బ్లాగు స్వయంవరం" గురించే సోధించుచున్నాను! నాధా! మన కుమారుల కోసం ఓ చిన్న త్యాగం చేయుడు, ఆ బ్లాగరుడేవరో కనుగొని, ఓ 99 మంది భట్రాజులవంటి వ్యాఖ్యలనిచ్చువాళ్ళను సృష్టించి వ్యాఖ్యలు రాసేట్టుగా ఉసిగొల్పుడు. టపా పఠించకపోయినా పర్వాలేదు, "బాగుంది", "చాలా బాగుంది" లాంటి రెండు పదములు చాలును ఇప్పటి వరులకు బ్లాగు పఠిచడమనే అర్హత ఒక్కటి చాలును, కుశుడు కి నేనింకో ఇలాంటి బ్లాగు శోధించెద".
"దేవి! బాగుంది కాని ఈ మానవుడు ఇక్కడ లిఖించినదంటూ ఏమి లేదు. "బాగుంది", " బహు బాగుంది" అంటూ ఏవిధంగా ??"
"ఏది ఇటు చూపించుడు నేను చూసేద ఏమి రాసెనో".
" మహిళల ప్రముఖ ముచ్చట్లు: నగలు, వంట, భర్త, పిల్లలు".
"ఎవరు నాధా ఇటుల లిఖించినది ..ప్చ్! అయిననూ పర్వాలేదు మనకి కావల్సింది మన

కుమారులని ఈ బ్లాగ్ స్వయంవరం కి అర్హతలు కావించడం కావున, వెంటనే వారిని పురి కొల్పుడు. ఈ టపా "బాగుంది", "చాలా బాగుంది" అని మీ 99 భట్రాజుల చేత వ్యాఖ్యానించేలా చేయుడు నాధ! పిదప 100వ వ్యాఖ్య మన కుమారుడు లిఖించేదడు. ఆలసించిన అదృష్టం చేజారిపోవును.
"చిత్తం దేవి! తమరి ఆజ్ఞ".
****