Showing posts with label పుట్టిన రోజు. Show all posts
Showing posts with label పుట్టిన రోజు. Show all posts

11.19.2013

రమణి కే జైస చెష్మా లగాకే :))))



ఏమి రాయాలి ఎప్పుడు ఈరోజు  నాకు నేను గుర్తు చేసుకుంటూ ఎదో ఒకటి రాస్తూ ఉంటాను.. ఈసారి ఏమి రాయాలో తెలియడం లేదు.. ఎక్కడో వయసు సంవత్సరం సంవత్సరం పెరుగుతూ ఆయుష్షుని తగ్గించేస్తోంది. :) అయినా ఇలా వయసు పెరుగుతున్నా మనసు వయసు మటుకు తగ్గిపోతోంది. ఇక ఈసారి మటుకు ఇలా కొత్తగా వచ్చే వయసు  మార్పులను అంగీకరించాల్సిందే :( అప్పుడెప్పుడో మీఅందరికీ చెప్పిన 30+ నుండి  ఇదిగో ఈ మధ్యే 40+ లోకి అడుగుపెట్టాను అతికష్టంగా  ( ఎప్పుడు అని అడగకండి, నా చిన్ని మనసు చిన్నబుచ్చుకుంటుంది :(  ) మొన్నామధ్య ఎప్పుడో మా బాబు "ఇంకెన్నేళ్ళమ్మా నీకు 40+ " అని అడిగాడు హ...హ ....నేను మటుకు తక్కువ తిన్నానా "50+ వచ్చేదాకా రా!! " అని సమాధానం. :

చిన్నప్పుడు నా తోటి వాళ్ళల్లో ఎవరన్నా కళ్ళజోడు పెట్టుకున్నారంటే బాగా చదువుతారు , మాంచి తెలివయినవాళ్ళని అనేవారు. నాకు కూడా ఓ కళ్ళజోడు పెట్టుకోవాలనిపించేది. ప్చ్! మనిష్టమా  ఎదన్నా కావాలనిపిస్తే ఇలా వెళ్ళి అలా తెచ్చుకొని పెట్టుకోడానికి అన్నీ అమ్మని అడగాల్సిందే.. అడిగితే "భూమికి జానేడు బెత్తెడు లేవు.. నీకెందుకే కళ్ళజోడూ !"  అని ఓ పెద్ద ధీర్ఘం తీసేసి అదేదో అడగకూడనిది అడిగినట్లుగా బుగ్గలు నొక్కేసుకుని వచ్చేవాళ్ళకి వెళ్ళేవాళ్ళకి పక్కున నవ్వేసి చెప్పి శాంతపడేది మా అమ్మ.  ఇంక నేను మాట్లాడానికి ఏముంది.

సరే! కాలేజ్ చదువులు.. అప్పుడిక కళ్ళజోడంటే కాస్త మోజు తగ్గింది దానికి తగ్గట్లు నాకున్న స్నేహితుల్లో కళ్ళజోళ్ళు ఉన్నవాళ్ళు వేళ్ళమీద లెక్కపట్టొచ్చు. ఎదో మనకి ఏ "సైట్" లేదులే!  అన్న సంతృప్తి. అలా అసలు ఈ కళ్ళజోడు అన్న concept కి నేను దూరంగా ఉన్నాను. కాని మరి ఇప్పుడో.. :((((((

40+ మార్పులు అంగీకరించాలి... తప్పట్లేదు .. జానెడు బెత్తెడు ఉన్నప్పుడు అమ్మని అడిగిన ఈ కోరిక ఇప్పుడు బారెడు ,(weight)  మూరెడు (height) ఉన్నప్పుడు తీరుతోందన్నమాట .. ఇప్పుడసలు ఇష్టంలేదు కాని తప్పదు మరి,, అది సంగతి.. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే "రమణీ లలామ నవ లావణ్యసీమ"    కాస్తా   "రమణి లలామ కళ్ళద్దాల భామ... బామ్మ"  అయిందన్నమాట. ఇప్పటికిదే  రేపు జరగబోయే నా పుట్టినరోజు వచ్చిన మార్పు.. 

 (ఇంకా కొత్త ఫొటో(with spectacles) తీయలేదు మరి.. అందాక అన్నమాట ఇది. :)) 


ముజ్కో తోడ రౌండ్ ఘుమాకే
"రమణి  కే జైస చెష్మా లగాకే"
కొకొనట్  మే  లస్సి మిలాకే

ఆజా  సారే మూడ్ బనాకే
ఆల్ ది రమణి ఫాన్స్ 
( ఇక్కడ రమణి ఫాన్స్ అంటే ఆత్మీయులన్నమాట,,, )
డోంట్ మిస్ ది ఛాన్స్..


:)))))))))))))))))))) అదన్నమాట విషయం మరి విష్ చేసేయండి...Ready 1.........2............3...:))))))))

11.19.2012

మనసా తుళ్ళి పడకే.....


“
ఏయ్ ఏమయింది నీకు అలా ఉన్నావు? “

“ఎలా ఉన్నాను బానే ఉన్నాను కదా ఎందుకు మౌనంగా ఉన్న నన్ను అనవసరంగా కెలుకుతావు.. “

“ఎప్పుడూ వాగుతూ ఉండే నువ్వు మౌనంగా ఉన్నావనే పలకరించింది ఏమయింది చెప్పు.. “

“చెప్పడానికేముంది? ప్రతీసారి చెప్తున్నదే ప్రత్యేకంగా చెప్పేదేముంది? చిన్నప్పటినుండి అడుగుతున్నా నాకో తోడు చూడు అని.. విన్నావా? అసలు వింటావా? “



“నీకు తోడా నేను ఉన్నాను గా ఇంకేమి తోడు కావాలి? “

“నువ్వు నాకు తోడా.. హహహహహహహహ.. నువ్వు నేను ఒకటే అయినప్పుడు నువ్వు నాకు తోడు ఎలా అవుతావు.. పోని నువ్వు నేను వేరు వేరు అనుకున్న్నా కూడా మనిషిగా నువ్వు నీకు ఇంకో మనిషిని తోడుగా చేసుకున్నావు కాని నాకేరి నాకు ఇంకో మనసు తోడు కావాలి“

“ఇంకో మనసా ఎక్కడినుండి తీసుకురాను? తీసుకొచ్చిన ఎవరు అర్థం చేసుకునేవాళ్ళు? అయినా అంత అత్యాశ కూడా పనికిరాదు“

“ఆపు నాది అత్యాశా? నువ్వు హాయిగా నీకు మనిషిని తోడు చూసేసుకుని నాది అత్యాశ అంటావా? ఎప్పటిఎప్పటినుండి ఈ ఒంటరితనం ఎదన్నా మంచి ఊహ కలిగితే చెప్పుకోడానికి ఒక స్నేహం లేక.. సరే నీకు చెప్తే నువ్వలా గుండెల్లోనే కప్ప్ట్టెస్తావు.. నాకు అసలు నీతో విడాకులు కావాలి.. నీతో ఉండలేకపోతున్నాను. “

“నాతో విడాకులా.. నన్ను వదిలేసి ఎక్కడికెళ్తావు? నిన్ను అక్కున చేర్చుకునేవాళ్ళే లేరు నేను తప్ప.. పిచ్చి వేషాలు మాని అసలు నీ బాధేంటో చెప్పు.. “

“బాధ.. ఏమని చెప్పను? చిన్నప్పుడెప్పుడో చెప్పావు.. నాకే కాదు నీకు కూడా, నిన్ను కూడా ఇష్టపడే మనిషినే ఎంచుకుంటాను అని ఏది? నా ఇష్టాలు నీకు తెలియవా? ఎన్ని సార్లు చెప్పాను.. అసలు నువ్వేమాత్రం చెప్పకుండా “నీకోసం నేనున్నాను”  అనే మనసు కావాలి అని.. విన్నావా నువ్వు తోడు తెచ్చుకున్న నీ మనిషి కూడా అందరిలాగే బాధ్యతలు, బంధాలు అంటున్నాడు.. పోని కనీసం ఎప్పుడన్నా ఒక్కసారన్నా తనంత తానుగా నీ మీద ప్రేమని కురిపించాడా లేదే.. నీ మీదే ప్రేమ లేనివాడు ఇక నీ లోపల ఉన్న మనసు సున్నితత్వాన్ని ఎలా తెలుసుకుంటాడు? అతను నాకు తోడెలా అవుతాడు? “

“ష్హ్! తప్పు అలా మాట్లాడకూడదు.. బంధాలు అంటున్నాడంటే ఇక పిల్లలు పెద్దవాళ్ళయ్యారు.. ఇంకా నాకోసం, నాకోసం మాత్రమే అని అనకూడదు.. బాధ్యతల మధ్య బందీ అంతను.. “

“ఎహె ఆపు సోది గోల.. చిన్నప్పటినుండి ఇలాగే సర్ధిచెప్తున్నావు.. వాళ్ళెవరో ప్రేమించుకుంటున్నారని వాళ్ళిద్దరు ఎక్కడెక్కడికో వెళ్ళాలంటే నువ్వేదో తగుదునమ్మా అంటు మధ్యవర్తిగా వెళ్ళావు... నువ్వెళ్ళింది చాలాక నన్ను కూడా తీసుకెళ్ళి మరీ "చూడు వాళ్ళిద్దరూ ఒకళ్ళకోసం , ఒకళ్ళలా ఎలా ఉన్నారో, భలే అన్యొన్యంగా ఉన్నారు కదా మనకి (నీకు+నాకూ) అలాగే మంచి వ్యక్తి రావాలి అని నన్ను ఊరించలేదా? ఆరోజునుండి ఆ అందమయిన ఊహని అలాగే పదిలపరుచుకుని ఉన్నానే ఇంతవరకు నెరవేరిందా?  ఎంతసేపు నీ గోల నీదే కాని...


నీకు గుర్తుందా? అప్పుడెప్పుడో ఆ పిల్లాడెవరో తన ప్రేయసి పుట్టినరోజని ఆరోజు మీరు వెళ్తున్న వ్యాన్ అంతా చక్కటి పూలతో అలకరించి, వాన్ నిండా పూలతో నింపేసి పాదాలు కందకుండా నడిపించడం.... భలే ఉంది కదా ఇదిగో నీకోసం అంటూ అతను ఆ అమ్మాయికి ఇచ్చిన గిఫ్ట్ ఏడు వారాలు పేర్లు కల కర్చీఫ్ ఏరికోరి ఎంబ్రాయిడిరీ చేయించి ఇచ్చిన ఆ విధానం.. అప్పుడు నువ్వనుకొలేదు ప్రేమంటే అలాగే ఉండాలి అని.. ఏది అలా ఉందా నీకు.. నువ్వు గుర్తు చేస్తే కాని నీ పుట్టినరోజు తెలీదు ఈ మహానుభావుడికి ఇక  బహుమతులు కూడానా?”
”ష్హ్.. అతన్నేమి అనకు పాపం.. ఎదో సంసారం కోసం తాపత్రయపడే వాడు..భవసాగరం ఈద లేక ఈదుతున్నవాడు..  నా ఆలోచనలన్నీ  అతనికి చాలా వింత గా ఉంటాయి.. వదిలేయ్.. ”

”ఆ ఆ! వదిలేస్తూనే ఉన్నా కొత్తగా పంతం పట్టుకుని కూర్చుంటే మటుకు మారే మనిషా ఏంటి? అయినా ..భవసాగరం, సంసారం అంటూ అంత పెద్ద మాటలెందుకు? నువ్వు లేకుండానే ఈదేస్తున్నడా ఒంటి చేత్తో నీ పుషోత్తముడు?మరీ చెప్పేస్తున్నావు... ”

”పాపం నేనున్నాను కాబట్టే ఆ మాత్రమయినా లేకపోతే :( ”

”కదా!  లేకపోతే అంతే కదా అదయినా ఆలోచించి.. నా గురించి తెలుసుకోవాలి కదా కనీసం నీ గురించి కాకపోయినా నీ లోపల ఉన్న నీ మనసుని గుర్తించాలి కదా .. మనసులోని మాటని మన్నించాలి కదా ఇంకా ఎన్నాళ్ళిలా మూగనోము పట్టను. ఇక నా వల్ల కాదు అటో ఇటో తేలిపోవాలి.. ”

”ఏంటి అటో ఇటో తేలిపోయేది ఏమి చేస్తావు నువ్వు ఏమి చేయగలవు? ఒక్కసారి కమిట్ అయిపోయాము ఈ జీవితానికి ఇంక దీనిని తిరగ రాయలేము.. మరీ అంత మిడిసిపడకు.. ”

”మిడిసిపడి మటుకు నేనేమి చేయగలను కాని.. ముందు నీనుండి మార్పు రావాలి.. నీకా భర్తని ఏవిధంగా మాట వినేలా చేసుకోవాలో తెలీదు.. ఎంతసేపు నీ పిల్లలు, నీ ఎదుగుదల అందరు కలిసి నన్ను ఇలా అదిమిపెట్టేసారు.. పుట్టినప్పటినుండి నీతో ఉంటూ నీ చితిలో కూడా నిన్ను వెన్నంటి వచ్చే నాకోసం మటుకు ఒక్క క్షణం కూడా ఆలోచించవు.. ఎలాగు నేను కమిట్ అయి నీతోనే ఉంటాననే/ఉంటున్నాననే  కదా ఈ అలుసు.. ”

”ఏయ్ అంత మాట అనకు.. ప్లీజ్. నువ్వు కాకపోతే నాకింకెవరు తోడు చెప్పు.. చిన్నప్పటినుండి నా ప్రతి ఆశ నా ప్రతి ఊహ, నా ప్రతి ఊసులు నీకే కదా నేను చెప్పుకున్నది.. ఎందుకలా నా స్నేహాన్ని కాదంటావు.. ఎంత నువ్వు నేను ఒకటి అయినా.. ఇప్పుడు నువ్వు నాకు చెప్పినట్లు నేను కూడా నీకన్ని చెప్పేస్తూనే ఉన్నా కదా.. ఏదన్నా దాచానా చెప్పు.. ప్రతివాళ్ళు మనకోసమే అన్న పిచ్చి భ్రమలో ఉండి, అది కాదు స్వలాభం కోసమనుకున్నప్పుడు ఇద్దరం ఒకరికొకరం ఓదార్చుకోలేదు.... గాలి, నీరు , అన్ని చితిలో కూడా తోడు వస్తాయి అంటారు కాని అదంతా ఉత్తదే అవి ఇక్కడే ఉంటాయి.. కాని నువ్వు నేను చితిలో కూడా కలిసే ఉంటాము..

ఎప్పటికీ నాకు నువ్వు , నీకు నేనే తోడు.. నీడ కూడా తోడురాదు.. కాబట్టి ఎక్కువగా ఆలోచించకు.. చూడు నువ్వలా బాధపడ్తుంటే నాకు కన్నీళ్ళు ఆగడం లేదు..”

”అయ్యో! వద్దూ.. నువ్వలా కన్నీరవకు.. నేనేమన్నానని.. బాధ అంతే.. నాగురించి పట్టించుకునేవాళ్ళు లేరు అందరూ నన్నిలా ఒంటరిగా వదిలేశారు, నువ్వేమో నీ వ్యాపకంలో బిజీగా ఉంటావు.. ఎప్పుడయినా కబుర్లు చెప్పుకుందమంటే ఇప్పుడు కాదని నిద్రపుచ్చేస్తావు.. అన్న బెంగ అంతే.. అయినా సరే నీకు నేను తోడు ఉంటాను సరేనా!..నువ్వలా కన్నీరవకు.. లేనిది కోరను, ఉన్నది మరవను.. ఒక పొరపాటుకు  యుగములు వగచను... మౌనం మటుకు నా భాష కాదు.. నేనిలా వాగుతూ నిన్ను విసిగిస్తూనే ఉంటాను.. నువ్వు బయటికి చెప్పలేకపోయినా సరే..:)

“తప్పదు.. జీవనం సాగాలి కదా.. బతుకు బండి నడవాలంటే నీతో కబుర్లు చెప్తూ ఉంటే సాగదు కదా అందుకే బిజీ బిజీ.. అయినా నేను కూడా నిన్ను వదలను.. మనిద్దరం ఒక్కటే.. నీ ఆలోచనలను నేను పంచుకుంటూనే ఉంటాను.. నీతో మాట్లాడుతూనే ఉంటాను.. కాని నీ ఆలోచనలను నేనుగా వ్యక్తం చేయలేను.. తనుగా కనుక్కునే మనిషి తోడు నాకు లేదు.. అందుకే ఈ మౌనం..

అంతేలే.. అంతకన్నా మనం చేసేదేముంది కనక.. తోడు లేనని మటుకు అనుకోకు.. ఎదో కొంచం ఆవేశంలో తిట్టేశాను నిన్ను.. బుజ్జి పాపాయివి కదా నాకు.. రేపు నీ పుట్టినరోజు కదా మరి ఏమి చేస్తున్నావు?

హెయ్" అవును నాదే కాదు.. నాతో పాటు నువ్వు కూడా పుట్టావు కదా.. ఏమి చేద్దాము.. ?

ఆనందంగా ఉందాము.. సరదాగా మంచి మంచి రుచికరమయిన వంటలు చేసిపెడ్తాను నీకు.. సరెనా!... "పుట్టినరోజు శుభాకాంక్షలు" ఓ నా మంచి మనసా"

నేను రేపటికోసం ఎదురు చూస్తున్నా.. నీకు కూడా.. అంటే  నన్నింతకాలం, నా ఊహలని, నా ఆలోచనలని భరిస్తూ , నన్ను నవ్విస్తూ అప్పుడప్పుడు కోపానికి గురి చేస్తూ నన్ను నీలో దాచుకున్న చక్కటి నా ప్రియ నేస్తానికి,  రమణీయమైన నీ స్నేహానికి .......


"పుట్టినరోజు శుభాకాంక్షలు"
*******

11.24.2011

నవంబర్ 20., 2011

నవంబర్.. ఈ నెలంటే నాకు చాలా ఇష్టం.. జనవరిలో  కొత్త కాలెండర్ ఇంటికి తీసుకురాగానే మొదట నవంబర్ లో కార్తికమాస ప్రారంభం ఆతరువాత పౌర్ణమి ఎప్పుడు వచ్చింది.. తరువాత పంచమి అనుకుంటూ ఆ పంచమి వచ్చిన డేట్ ని ఒక రెడ్ పెన్సిల్తో గుర్తుగా పెట్టుకునేదాన్ని. అలా చిన్నప్పటినుండి  పెళ్ళయ్యేదాకా  అలవాటయింది. పోయిన సంవత్సరం చిన్నప్పటినుండి నా జ్ఞాపకాలని తవ్వుకుని, మంచికి ఆనందిస్తూ చెడుకు బాధపడి వీడ్కోలు చెప్తూ.... గడిపాను. అయితే ప్రతీ సంవత్సరం నవంబర్ నెల నాకోసం, నేను ఆనందంగా ఉండాలి.. అనుకుంటూ గడిపాను. ఈ సంవత్సరం ఈ నవంబర్ నా జీవితానికే ప్రత్యేకం. నేను మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. అది కూడా విషాదం లోంచి పుట్టిన ఆనందం అనుభూతి అని చెప్పొచ్చు.

"ఇదిగో ఇలా తిది వారం వర్జ్యం అంటూ ఒక్కో సంవత్సరం ఒక్కో తేది చెప్తున్నావు నీ పుట్టిన రోజు ఎప్పుడో ఎప్పుడు అర్థం కాదు నాకు.. ఆ పౌర్ణమిలు పంచమిలు కాకుండా డేట్ చెప్పు అని శ్రీవారు అన్నారని అవును ఈ తెలుగు తిధులు కాస్త కష్టమే అని పెళ్ళి అయి మూడు పుట్టిన రోజుల తరువాత తిధులు మానేసి తేది ప్రకారం (నవంబర్ 20. ) చేసుకోడం మొదలెట్టాను. కాస్త మా కుటుంబ సభ్యులు ఆ తేది గుర్తు పెట్టుకుని నాకు శుభాకాంక్షలు చెప్తారని.. అదే రివాజు మొన్న మొన్నటిదాక. ఈసారి నవంబర్ ఒకటో తారీఖే మా పాపతో సరదాగా అన్నా... "ఈసారి నా పుట్టినరోజు ఆదివారం వచ్చింది సెలవ రోజు ఛట్ నేను చేసుకోను"  అని ….

పుట్టిన రోజు నాకెప్పుడు ఎన్నిసంవత్సారాలయినా  ప్రత్యేకమే. పాపకి కూడా అదే చెప్పాను "పండగలెన్నయినా కాని కుటుంబ సభ్యులందరు కలిసి వేడుక చేసుకోవాల్సినవి....  కాని మన వ్యక్తిగతం మనకోసం మన సంతోషం అనుకునేవి పుట్టిన రోజు, పెళ్ళిరోజు ఈ రెండు మటుకు మనం పండగలా చేసుకోవాలి. అది ఎలా అన్నది వారి వారి "  ఆలోచనలు అభిప్రాయాలను అనుసరించి ఉంటాయి  " అని .. ఎందుకింత చెప్పాల్సివచ్చిందో కాని, అనుకోకుండా సందర్భం లేకుండా చెప్పాను.

అదే తిరిగి నాకు మళ్ళీ అప్ప చెప్పింది మా పాప.. ముందు రోజే అక్కా వాళ్ళు వచ్చి శుభాకాంక్షలు చెప్పి బహుమతి ఇస్తే నవ్వొచ్చింది ఇలా ఉండి  పుట్టినరోజు అవసరమా? .. ఇది ఒక భారం తప్ప అనుకున్నా.. కాని నేనలా అనుకోకూడదనుకున్నారో లేక ఆలోచించకూడదనుకున్నారొ మరి  నాకెలాంటి ఇబ్బంది కలగకుండా నా పుట్టినరోజు వెడుక జరిపించి.. నా కళ్ళ నుండి నీళ్ళు తెప్పించారు నా కుటుంబ సభ్యులు. ఆనందం.. నేనెప్పుడు కోపం వస్తేనో, నా మాట విననప్పుడో మా వాళ్ళని కసురుతూ ఉంటా “మీరందరూ ఏ జన్మలో ఏ బంగారు పూలతో పూజ చేసారో నేను మీకు అమ్మగా(పిల్లతో ) బార్యగా(శ్రీవారితో) దొరికాను అని అంటూ ఉంటా....  అదే మరి నేనేమి పూజ చేసుకున్నానో  ఎమఒ కాని వీళ్ళంతా నాకు లభించారు అని  మనసులో అనుకుంటూ ఉంటా ఇప్పుడు ...  అలా నన్ను నేను మరిచిపోయేలా నాకు చేదోడుగా ఉంటున్నారు నావాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా నాకు ఆనందాన్ని పంచారు.. పిల్లలిద్దరు   కొత్తబట్టలు , కేక్ అంటే ... శ్రీవారి ప్రేమ ఇంకోవిధంగా , అమ్మ నాకిదిష్టం అది ఇష్టం అంటూ వంటలు, ఆప్తమిత్రుల శుభాకాక్షలు మరోవైపు ఉక్కిరిబిక్కిరి చేసాయి. చాలా ఆనందంగా ప్రత్యేకంగా చేసుకున్న మొదటి పుట్టినరోజు ఇది. ఏందుకిలా చెప్తున్నాను అంటే నేను ప్రస్తుతం కదలలేని పరిస్థితిల్లో కూడా చాలా మనో ధైర్యంగా ఆనందంగా ఉన్నాను .. దానికి కారణం నా కుటుంబ సభ్యులు. వారందరికి నా కృతజ్ఞతలు ఇలా చెప్తున్నాను. ఎందుకు కదలేని పరిస్థితి అంటే ఇప్పుడు ఫొటో చూపిస్తాను.. నా ప్రతి ఒక్క అనుభవం మీతో తొందరలో పంచుకుంటాను.. అంతవరకు…. 

ఒకసారి ముందు పుట్టినరోజుల సందడి ..... ఇక్కడ ఇంకోసారి..

20 నవంబర్ 2008 బ్లాగు రివ్యూ: మనలోని మాట – నా మనసులోని మాట

నవంబర్ 20  2010
నవంబర్ 20, 2011
నేనిలా ఉన్నా....  అయినా  కాని  పుట్టినరోజు కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రత్యేకంగా చేసుకున్నా.. ఆనందంగా....
******

11.20.2010

అనుకోకుండా ఒక రోజు....(మళ్ళీ ఈరోజు)

పుడమి తల్లి పులకరించింది... ఆకాశం దద్దరిల్లింది.. మేఘాలు వర్షించాయి.... ప్చ్.. ఇంకా తెలియలేదా అక్కా.. ఇన్ని ప్రత్యక్ష సాక్ష్యాలు చెపుతున్నా అర్ధం కాలేదా... ఇన్ని సంఘటనలకు దారి తీసిన ఆ రోజు ఆ ఒక్క రోజు ఇంక చెప్పుకోలేకపొతున్నావంటే॥ నీకసలు నామీద ప్రేమ.. అప్యాయత అనురాగాలు అసలున్నాయా??
తమ్ముడు తన ప్రతి పుట్టినరోజుని నాకు గుర్తు చేసే ప్రయత్నంలో జరిగే ఉప్పొద్ఘాతమది.. భలే సరదాగా అంటాడు॥ ఇవన్నీ వినడం కోసమన్నా.. మర్చిపోయినట్లు నటిస్తాను ఒక్కోసారి..
చిన్నప్పుడు... ఒక రోజు మిట్ట మధ్యాహ్నం వేళ .. మా అక్క వాళ్ళ స్కూల్ లో మా ఇంటి పక్కన నలుగురమ్మాయిలు... అర్జంటుగా ఆత్మహత్య చేసేసుకొందామనుకొన్నారట .. ఏమయ్యింది అని అడిగితే....యునిట్ టెస్ట్ సరిగ్గా రాయలేదని.. అక్క పరుగు పరుగున ఇంటికివచ్చి... వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఉమ, ప్రసన్న, విజ్జి, మాధవి వీళ్ళంతా అక్కడ బావిలో దూకేస్తామంటున్నారు నన్ను వెళ్ళి చెప్ప మన్నారు అంది వగరుస్తూ... వాళ్ళ ఆమ్మలందరు.. నింపాదిగా అప్పడాలొత్తుకొంటూవున్నారు..వార్త విన్న తరువాత కూడా. ఆ తరువాత కొద్దిసేపటికి.. " అలాగా!!.. నువ్వు భోజనం చేసి వెళ్ళేప్పుడు.. మా ఉమ కి చెప్పు రేపు దాని పుట్టినరోజని .... అందిట సదరు ఉమ వాళ్ళ అమ్మ.. అక్క ఈ వార్త అక్కడ చేరవేయగానే.... ఆ ఆత్మహత్యాప్రయత్నాన్ని.. కాన్సిల్ చేసుకొందట ఆ ఉమ ఆమెతో పాటు మిగతావారు ఆమె బాటే.. పట్టారు.. పుట్టినరోజా???.. మజాక...
ఇలా ఎన్నో సరదా సరదా సంఘటనలు చోటు చేసుకొన్న ఈ పుట్టిన రోజుల సంబరాలంటే... ఎవరికి మటుకు ఇష్టం వుండదు చెప్పండి.. అందుకే తమ్ముడికి (గుర్తు చేయాలి) చెప్పాలి..
సరిగ్గా కొన్నేళ్ళ కిందట..నవంబర్ 20 న పుడమి తల్లి పులకరించింది.... ఆకాశం దద్దరిల్లింది... మేఘాలు వర్షించాయి... అని తమ్ముడికి చెప్దామనుకొంటున్నాను వాడి ఫందాలోనే... చాన్స్ ఇవ్వడు॥ రాత్రి కేక్ తో ప్రత్యక్షమవుతాడు... హ్యాపి బర్త్ డే అక్కా!! అంటూ... చూడాలి...
ప్రతి మనిషి.. తన జన్మకి పరమార్ధం తెలుసుకొని......
నా జన్మకి పరమార్ధం ఇంక తెలియకపొవడమే.. విశేషం.. అందుకే ఆ పరమార్ధం ఎప్పటికైనా తెలుసుకొవాలనే ఆకాంక్షతో మళ్ళీ మళ్ళీ రావాలి ఈరోజు అని .... అనుకొంటూ వుంటాను..

9.12.2010

మళ్ళీ మళ్ళీ రావాలి ఈరోజు..

ఇది 2008 సంవత్సరం రాసిన టపా.. మళ్ళీ ఈరోజు ఇదిగో అమ్మ పుట్టినరోజు. అంతే సంతోషంతో పొద్దున్నే "పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి...నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి  "  అంటూ శుభాకాంక్షలు చెప్పాము. మళ్ళీ ఒకసారి అందరం అలా స్మరణ చేసుకుంటూ ....ఇక్కడ ఇలా మీ, మా... మనందరికోసం. 
 ******
"హల్లో! అమ్మా చెప్పు ఏంటి ఫోన్ చేసావు?"

"ఏముంది చెప్పడానికి? నీకు అసలు అమ్మ ధ్యాస ఉందా అసలు? నా అంత నేనే ఫోన్ చెయ్యాలి కాని, నువ్వసలు అమ్మ ఒకత్తి ఉంది అని పట్టించుకొంటున్నావా? అంతేలే, సంపాదన పరులయ్యాక ఇక అమ్మ ఎందుకు? ఎంతసేపు ఆ బ్యాగులేసుకొని ఉరుకుల పరుగులే, అమ్మ అసలేలా ఉందో ఒకసారి ఫోన్ చేద్దాము అన్న ఆలోచనే లేదాయే"!

"అమ్మా! ఆపు ఆఫీసులో ఉన్నా! నేనేమి సమాధానం చెప్పలేను. ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావో చెప్పు?"

"ఎప్పుడూ ఆఫీసు! ఆఫీసు! వెధవ సంత, బుద్ధిగా ఇంట్లో కూర్చొని, పిల్లల్ని చూసుకోక. సరే! రేపు వినాయక చవితి గా ఏమి చెస్తున్నావు?".

"రేపటి గురించి ఇంకా ఏమి అనుకోలేదు, సాయంత్రం ఇంటికొచ్చి మాట్లాడతాలే ఫోన్ పెట్టేయి."

" ఓ రెండు ముక్కలు మాట్లాడతానో లేదో ఫొన్ పెట్టేయి అంటావు, ఇంటికోపట్టాన రావు. వాడు అలానే తయారయ్యాడు, నువ్వు అలానే తయారయ్యావు, అవునులే! అడ్డాలనాడు బిడ్డలు కాని, గడ్డాల్నాడు బిడ్డలా మీరు?" ....

"సరె నాకు గడ్డాలు లేవు కాని సాయంత్రం వస్తానన్నా కదా! నువ్వు ఫొన్ పెట్టేలా లేవు కాని నేనే పెట్టెస్తున్నా! సాయంత్రం కలుస్తాను."

***

"అలిగితివా అమ్మా!! అలుక మానవా?"

"నాకెందుకు కోపం? మీరు మీ ఉద్యోగాలు, మీ పిల్లలు... ఇంట్లో పెద్దవాళ్ళు గుర్తొస్తారేంటి మీకు?"

"అలిసిపోయి వచ్చానమ్మా! ఇప్పుడు దండకం మొదలెట్టకుండా మధ్యాహ్నం ఫోన్ ఎందుకు చేసావో చెప్పు?".

"అంతేనమ్మా! ముందు ఆఫీసు గోల! ఆనక ఆలిసిపోవడం గోల! ఎదన్నా అంటే నాది దండకము, లేదా భారతాలు, భాగోతాలు ఇవేగా మీరనేది. వాడు అంతే పెత్తనమంతా పెళ్ళానికి ఇచ్చి కూర్చున్నాడు. ఎమన్నా అడిగినా, మాట్లాడినా "తనకి చెప్పమ్మా!" అని అంటాడు. ఇంతప్పటినుండీ పెంచాను,నిన్న కాక మొన్నొచ్చింది నేను దానిని అడగడమేమిటి? అదేమిటిరా అంటే, నాకు నీతులు చెప్తాడు, నాకు తెలీదా ఏంటి, ఎదో గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్లు.."

"అమ్మా! ఇంట్లో పిల్లలొక్కళ్ళే వున్నారు, నేను వెళ్ళాలి ! నీ బాధ అంతా తరువాత వెళ్ళగక్కుదుగాని, కాస్త కాఫీ అన్నా ఇస్తావా! నన్ను వెళ్ళమంటావా?" .

"అయ్యో పిచ్చి తల్లీ! మర్చేపోయాను ఇస్తానుండు, ఏవిటో! ఈ మధ్య మతిమరుపు ఎక్కువవుతోంది. వచ్చినప్పటినుండి నా కష్టాలు ఏకరువు పెట్టుకోడమే సరిపోతోంది, ఈడ్చుకొంటూ పడి , లేచి వస్తావన్న ధ్యాసే ఉండదు నాకు".

****



ఇలా తనకు లేని బాధలు మాకు చెప్పుకొంటూ, తన తీయనైన అష్టొత్తర, శతనామవాళితో మా బాగోగుల్ని చూసుకొంటూ నిత్యం సందడి సందడిగా ఉండే మా అమ్మ పుట్టినరోజు , నిన్ననే మనవలు మనవరాళ్ళ మధ్య నిరాడంబరంగా జరిగింది.

మళ్ళీ మళ్ళీ రావాలి ఈరోజు అని ఆశిస్తూ.. కుటుంబ సభ్యులందరి తరుపునా ...

మా అమ్మకి పుట్టిన రోజు శుభాకాంక్షలు
Loading...