11.19.2009

చిరు కానుక

"కార్తీక మాసం , తల స్నానాలు .. అంటూ చలికాలంలో చన్నీటి స్నానాలు అని ఆవేశపడకు ... జాగ్రత్త!! అని చెప్తూ .. ఈసారి బాబే పుడ్తాడని అనిపిస్తోంది రోజు వెంకటేశ్వర స్వామి కలలోకి వస్తున్నాడు. ఎందుకో అలా అనిపిస్తోంది. పుట్టిన బాబుకి ఆయన పేరే పెట్టాలి."

"తప్పకుండా.... నాకు అలాగే అనిపిస్తోంది, ముందు బాబు తరువాత పాప పుట్టారు ఈసారికూడా బాబే పుడ్తాడు. " అని అమ్మ

******

"ఆపరేషన్ ఏమిట్రా? మన ఇంటా వంటా ఉందా ఇద్దరు పిల్లలేనా.. కష్ట సుఖాలు చెప్పుకోడానికి వాళ్ళకి తోడేవరు? దానికో చెల్లెలు, వాడికో తమ్ముడు ఉండాల్సిందే, ఆపరేషన్ లేదు ఏమి లేదు, మా కాలంలో ఇలానే ఉన్నామా? నాకు చెప్పకుండా ఆపరేషన్ అంటే పచ్చి మంచినీళ్ళు ముట్టుకోను అంతే..." మామ్మ అందిట ఇలా ....నాన్నగారితో .. అక్క పుట్టిన తరువాత..

ఇన్ని తర్జన భర్జనలతో నా జననానికి ముందు నాన్నగారికి కల... పైన చెప్పిన ఉదంతం. అలా కష్టపడ్డారో , నష్టపడ్డారో కాని కార్తీక మాసం పౌర్ణమి తరువాత పంచమి రోజు పుట్టానని అమ్మ చెప్తూ ఉంటుంది.

****

నేను రోజులలో ఉన్నానో, మరి నెలలలో ఉన్నానో తెలీదు కాని నా చిన్నతనంలో భూకంపం వచ్చింది .

భూకంపానికి ఒక్కసారిగా మంచం మీంచి కిందపడ్డానుట. మెడ అదేపనిగా కదుపుతూనే ఉన్నానని అమ్మ చెప్తూ ఉంటుంది. ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా తగ్గలేదు. తాతగారు ఇలా కాదని "గోడిలంక" కి తీసుకెళ్ళి అక్కడేదో వైద్యం చేయించారట, ఒక 6 నెలలు అలా కష్టపడిన తరువాత. "ఒకవిధంగా మళ్ళీ పుట్టావే నువ్వు, ఎన్ని కష్టాలు పడ్డామని నీతో, ఆడపిల్లవి, అలా మెడమీద తల నిలబడదు.. జీవితాంతం ఇలాగే ఉంటుందా... అన్నంతగా ఉండేది అస్సలు తగ్గలేదు ఎలారా బాబు!!! ఈ పిల్లతో అని ఏడ్చేసేదానిని మీ నాన్నదగ్గిర .. చచ్చి బతికావు " అంటూ ఉంటుంది తను నావల్ల పడ్డ కష్టాలని పదే పదే తలుచుకొంటూ ...

****

1వ తరగతి ఫోటో

వెనక్కి తిరిగి గతాన్ని, గత అనుభవాలని తరచి చూసుకొంటే , నా చిన్నతనం అమ్మ కష్టాలు, అప్పుడప్పుడు చిరుకోపాలు, గారాలు, ఏడ్చి సాధించడం.. చిన్నతనంలోనే నాన్నగారు గుండెనెప్పితో కాలం చేయడం ... అన్నీ కలగలుపుకొని.. కొంత విషాదం కొంత సంతోషం, వెరసి మొత్తం కష్టమంటే ఏంటో కూడా తెలియని బాల్యమంతా సరదా సంతోషాలే. ఒకవిధంగా ఎవరి సలహాలు, సంప్రదింపులు లేకుండానే (ఇచ్చేవాళ్ళు లేకపోవడంవల్లనేమో) సొంతనిర్ణయాలతోనే నా జీవితం ఇంతవరకూ నడిచింది. ఆఖరికి నా పెళ్ళితో సహా సొంత నిర్ణయమే. చదువు విలువ అప్పట్లో తెలియకపోయినా "పెళ్ళి చేసేద్దాము ఎందుకు చదివించడం" అని అమ్మ అన్నయ్యతో అన్నప్పుడు, "లేదు చదువుకొంటా" అని మొండిపట్టుదలతో చదువుకొన్నదాన్ని, అత్తెసరి చదువులైనా ఈరోజు అవే ఒకమార్గం చూపిస్తున్నందుకు నా మనసుకు, నా నిర్ణయానికి నేనే కృతజ్ఞతలు చెప్పుకొంటూ ఉంటాను.


10 వ తరగతి ఫోటో
*****

డిగ్రీలో ఉండగా ఆకర్షణ అనే ఉచ్చులో చిక్కుకోకుండా నాకే తెలియని దీక్షతో చదివినదాన్ని, పెద్ద చదువులు అని కాదు కాని, అక్క పెళ్ళి,
అన్నయ్య ఢిల్లీలో ఉండి అంతగా బాధ్యత తెలియకపోడం(బాధ్యత తీసుకోకపోవడం) , తమ్ముడు చిన్నపిల్లాడవడం..ఇవన్నీ నాకు అప్పట్లో అర్థం కాని సమస్యలు.. ఈ సమస్యలలో సతమతమవుతూ ఒంటరిగా ఉన్నప్పుడు తెలిసి తెలియని ఆలోనలతో, ప్రేమ కథలు వింటున్నప్పుడు... "అసలు జీవితమంటే ఏంటి?" అని ప్రశ్నించుకొనేదానిని. ... కాని చెప్పేవాళ్ళేవరు? పుస్తకాలు కొంతవరకే నాకు జ్ఞానాన్ని అలవర్చాయి.

నా జీవితం అంతా ... "రేపు నేనేంటి" అన్న ప్రశ్న వేసుకోనవసరం లేకుండానే గడిపోయిందని చెప్పొచ్చు. అందులో భాగమే పెళ్ళి. "నేను నచ్చానా" అంటూ నా మనిషైన వైనం ... "నావల్ల ఏమన్నా ఇబ్బంది పడ్తున్నావా" అని అడిగి నా వ్యక్తిత్వాన్ని గౌరవిం
చడం చూస్తుంటే , నాకు తెలియకుండానే నేను ఎంచుకొన్న మార్గాలన్ని సన్మార్గాలే అవడం..నాకు మరింత ఆనందాన్ని ఇచ్చే విషయం. "నువ్వెప్పుడన్నా ఏవిషయంలోనైనా కమిట్ అయ్యావా పిన్ని.. ?" అని అప్పుడెప్పుడో అక్క కూతురు అడిగింది. జీవితంలో కమిట్మెంట్, సర్దుకుపోడం,కష్టం , సుఖం ఇవన్నీ లేకపోతె జీవితాన్ని అర్థం చేసుకోగలమా? ఆనందించగలమా? అందుకేనేమో కొన్నిటిని సమాధానం లేని ప్రశ్నలంటారు వాళ్ళ వాళ్ళ స్వీయానుభవాలే జవాబులు చెప్పాలి. అందుకే అప్పుడు మౌనం సమాధానమయ్యింది.

బాల్యం, చదువులు, ఉద్యోగం, తరువాత పెళ్ళి, పిల్లలు ఇలా ఒక్కో మెట్టు, ఒక్కో మెట్టు, మెట్టు మెట్టుకి జ్ఞాపకాల దొంతరలు.. ఎన్నో ఆనందాలు, కొన్ని కష్టాలు ఈ మజీలీలలో తాత్కాలికమైన/శాశ్వతమైన పరిచయాలు..

పిల్లలు సంవత్సరమంతా చదివి వారి చదువుల జ్ఞానమెంత అని పరీక్షించడానికి పరీక్షలంటారు? జీవితంలో మరి మనమే స్థాయిలో ఉన్నామో ఒక్కసారన్నా మన గతాన్ని తరచి చూసుకోవాలనిపిస్తుంది కదా.. అదే ఎలా? ఇలా పుట్టినరోజు పుట్టినరోజుకి మన పిల్లలు స్థిరపడేదాక మన ఎదుగుదలను గ్రాఫ్ వేసుకొంటే?? ఆ ఏటికాయేడు వయసుతోపాటు ఆలోచనలు అప్పటి పరిస్థితులకనుగుణంగా మార్చుకొనే అవకాశముంటుంది కదా.

"అయినా ఈ వయసులో ఇక పుట్టినరోజేంటి?" అని అన్నయ్య అడిగిన ప్రశ్నకి నాకనిపించిన సమాధానమిది, మన పుట్టినప్పటినుండి మళ్ళీ పుట్టినరోజువరకు వెనక్కి తిరిగి మనల్ని మనం తరచి చూసుకొనే తీపి అనుభవాలు, చేదు గుర్తులు, చేసిన అల్లర్లు, చెయాల్సిన పనులు.. గుర్తుకొస్తున్నాయి అని ఇలా రాసుకోలేమా? ఇది ఒకళ్ళు నిర్దేశించిన జీవితం కాదు కదా, మన జీవితం మన పుట్టినరోజు ..మన కష్టం , మన సుఖం.. వెరసి అదో వింత అనుభూతి.. ఆనందం.

నా జీవితమేమి ఇంకొకరు స్ఫూర్తి చెందే జీవితమని కాదు, కాని నా వరకు నా పిల్లలికి నేను చెప్పుకోగలిగే అంటే సలహాలివ్వగలిగే జీవితం కదా, అలా నా కుటుంబానికి మార్గదర్శకత్వం చెయాలంటే .. ముందు నేను గతానుభవాల్ని
తరచి చూసుకోవాలిగా.. అందుకే ఈ పుట్టినరోజు. ఇప్పటికీ రేపు "నేనేంటి" అన్న ప్రశ్న లేదు. నిన్న ఏమి చేసాము, ఈరోజు ఏమి చేస్తున్నాము ప్రస్తుతం ఇదే .. రేపు ఏమి చెయ్యాలి అన్నది తరువాత మాట,. చేసినవి, చేస్తున్నవి పిల్లలికి చెప్పగలిగితే చేయాల్సినవి వాళ్ళు చేస్తారనే ఆలోచన నాది.
*****

ఇహ ఈ జీవన ప్రయాణంలో ఇప్పటివరకూ కలిగిన స్నేహ పరిచయాలలో కొన్ని తాత్కలికంగా వాళ్ళ స్టేజ్ వచ్చిందనుకొని దిగిపోయినవాళ్ళున్నారు . శాశ్వతంగా నీతో పాటే అన్న ప్రాణస్నేహాలు ఉన్నాయి. తాత్కాలికంగా అనుకొన్నవాళ్ళు వెళ్ళిపోయినా... వాళ్ళ తీపిజ్ఞాపకాలు నన్ను కదిలిస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు. అలాంటి తీపిజ్ఞాపకాలలో ఒకటి, 2007 లో 20/11కి నా పుట్టినరోజు
కి చ్చిన ఒక చిరు కానుక... ఇదే..******

19 comments:

 1. మీ టపా చాలా బాగుంది. జీవన కాసారం అన్నీ రుచుల మేలు కలయిక కదా!

  కదలాడె మదిన దాగిన
  గతమంత అలలు అలలుగ, కనుగొంటిని జీ
  విత మాధుర్యము రమణీ!
  అందుకొనుము మా శుభాభినందన మాలల్.

  మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

  ReplyDelete
 2. మరి ఆటవెలది లో రాయలేము కాని మాములు తెలుగు లో అందుకోండి జన్మదిన హార్దిక శుభాకాంక్షలు. మంచి ఆలోచన ఎప్పటి కప్పుడు ప్రతి జన్మ దినానికి పునరాలోచించుకోవటం. నిజమే కదా ఏమి సాధిన్చనక్కరలేదు కాని తప్పొప్పులు ఆలోచించుకోవటం అందరం తప్పక చెయ్యవలసిన పని.

  ReplyDelete
 3. జన్మదిన శుభాకాంక్షలు రమణి గారు...

  >>వెనక్కి తిరిగి మనల్ని మనం తరచి చూసుకొనే తీపి అనుభవాలు, చేదు గుర్తులు, చేసిన అల్లర్లు, చెయాల్సిన పనులు.. గుర్తుకొస్తున్నాయి అని ఇలా రాసుకోలేమా?
  చాలా కరెక్ట్‌గా చెప్పారు..

  ReplyDelete
 4. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

  పుట్టినరోజు వేడుకలు జరుపుకోకపోయినా ఇలా మనల్ని మనం తరచి చూసుకోవటం మాత్రం అవసరమే! దానికి పుట్టిన రోజే సరయిన రోజేమో!

  బాగా వ్రాసారు.

  ReplyDelete
 5. పుట్టినరోజు శుభాకాంక్షలు రమణిగారు. మీరు పోయిన యేడాది మీ పుట్టినరోజు కి రాసిన టపా నాకింకా గుర్తుంది, ఎంత త్వరగా రోజులు దొర్లిపోతున్నాయో అనిపిస్తోంది ఇప్పుడు

  ReplyDelete
 6. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు రమణి గారు.

  ReplyDelete
 7. రమణి గారూ !
  పుట్టిన రోజు శుభాకాంక్షలు

  ReplyDelete
 8. మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

  ReplyDelete
 9. "అయినా ఈ వయసులో ఇంకా పుట్టినరోజేంటి?" అని అన్నయ్య అడిగిన ప్రశ్నకి...
  రమణి గారూ ఏదన్నా కొనాలని తప్పించుకోడానికి వేసిన ప్లానేమో మీ అన్నయ్య గారిది పాపం,దొరికిపోయారు అన్నగారు ప్చ్!
  మీ పుట్టిన రోజుకి మా హృదయపూర్వక శుభాకాంక్షలు.ఇలాంటి పుట్టినరోజులు ప్రతీ ఏడూ మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తూ...

  ReplyDelete
 10. జన్మదినశుభాకాంక్షలు

  ReplyDelete
 11. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

  ReplyDelete
 12. Many more happy returns of the day

  ReplyDelete
 13. భాస్కర రామి రెడ్డి గారు: చాలా బాగుందండి మీరు రాసిన కవిత. థాంక్స్ :)
  @ రాణి గారు చాలా థాంక్స్ అండి మీ బ్లాగు ఈరోజే చూసాను. photos చాలా బాగున్నాయి.
  @ భావన గారు ఆట వెలది , తేట గీతి అవసరం లేదండి అచ్చతెనుగు చాలు ఆలకించడానికి, థాంక్స్ అండి.
  @ మేధ గారు : చాలా చాలా థాంక్స్ అండి,
  @ సిరిసిరిమువ్వగారు: ఏదో ఒకరోజు మనది అన్నది కావలి కదండి, మహిళా దినం, పురుషుల దినం, ప్రేమికుల దినం అని అనుకొంటూ ఉన్నప్పుడు ఈ యాంత్రిక జీవితంలో మనకంటూ మన ఆలోచనలను తరచి చూసుకోడానికి తీరిక ఏది? అలాంటప్పుడు పుట్టినరోజుని మనరోజు చేసుకోడంలో తప్పేముంది? దానికి వేడుక అవసరం లేదు కాని అదో సరదా అంతే. ఏదో చెప్పాలనుకొన్నారు, కాని చివరికి పుట్టినరోజు ఓకే అనేసారు :) నెనర్లు.
  @ వేణు గారు, @ సునీత గారు @ విజయ మోహన్ గారు @ సత్యసాయి గారు @ రాఘవ్ గారు @sravya గారు @ ఎస్ ఆర్ రావు గారు : నెనర్లు.
  @లక్ష్మి గారు: నిజమే కదూ యుగమొక క్షణంలా గడిచిపోతోంది. అలా అలలా ఒక కలలా.. అప్పుడే నా వయసు ఒక సంవత్సరం పెరిగిపోయిందా మొన్నెగా చేసుకొన్నాను అని నేను అనుకొన్నానండి.
  శ్రీనివాస్ పప్పుగారు: నెనర్లు. ఇంకోసారి ఇంకో సారి ఎప్పుడూ ఎల్లప్పుడూ అన్నయ్య విషయంలో నేను ఆలోచించే విషయం మరోకసారి చెప్పే అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్. ఏ చెల్లెలు ఏ అన్నని వాళ్ళకంటూ సంసారాలు వచ్చిన తరువాత ఏమిస్తాడో ..ఏమి తెస్తాడో.. అని ఆలోచించదు. "మాట" చాలు అనుకొనేవాళ్ళు కోకొల్లలు నాతో కలుపుకుని. అది అర్థం చేసుకొంటే చాలు ఈ అన్నలందరూ, అప్పుడే అన్నా చెల్లెళ్ళ బంధం గట్టిపడేది. :)

  ReplyDelete
 14. ముందుగా బిలేటెడ్ పుట్టినరోజు శుభాకాంక్షలు రమణి గారు..
  పుట్టినరోజున ఇలా అన్నీ నెమరువేసుకుని చూసుకోవాలన్న ఆలోచన చాలా బాగుందండి..మీ అన్నయ్య అడిగిన ప్రశ్నకు మీరిచ్చే వివరణ కూడా బాగుంది.
  ఇంతకు మీ ఫోటోలలో మిమ్మల్ని రౌండ్ చేసి చూపించుంటే బాగుండేది కదండీ..బుల్లి రమణి గారిని చూసుండేవాళ్ళం...:)

  ReplyDelete
 15. శేఖర్ గారు : థాంక్స్ అండీ, పుట్టినరోజు శుభాకాంక్షలకీ, అన్నగారికిచ్చిన సమధానానికి హర్షించినందుకు కూడా... మీ కోరిక మేరకు బుల్లి రమణిని... చూడండి. :))

  ReplyDelete
 16. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 17. @ hits me : ????? తెలుగులో చెప్పుంటే బాగుండేమో.. చివర్లోనైనా రవళి కాకుండా రమణి అన్నందుకు థాంక్స్.

  ReplyDelete

Loading...