3.25.2012

నేనూ .. నా శస్త్రచికిత్స

ఇప్పటి వరకూ సాగిన నా జీవితంలో నాకు జరిగిన మొట్టమొదటి శస్త్ర చికిత్స ఇది.. ఇంక ఎప్పుడూ జరగకూడదూ అని  ఆకాంక్షిస్తూ.....

08/11/2011

నవంబర్ ఏడు అర్థరాత్రి మూడు ఆ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రి అష్ట కష్టాలు పడి.. ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్లో చేరాను కదా..(ముందు పోస్ట్లొ రాసాను)  రాత్రి మూడు గంటలకే చెప్పారు రేపు ఆర్థోపెడిక్  డాక్టర్ ఉంటారు.. రేపే ఆపరేషన్ చేసేస్తాము అని..   ఉదయం 5 గంటలకి ఒక నర్స్ వచ్చి ఇంజెక్షన్ ఇస్తూ ఏమన్న తినాలంటే ఇప్పుడే తినేయండి.. ఆపరేషన్ టైం కి మీ స్టమక్ అంతా ఖాళీ గా ఉండాలి అని చెప్పి వెళ్ళింది. 

నేను ఫోన్ చేసి చెప్పానో లేక మా తమ్ముడు రాత్రే ఇంటికి వెళ్ళేప్పుడు చెప్పాడో తెలీదుకాని ఉదయం 5.30 ఆ ప్రాంతంలో మా మరదలు వచ్చింది దోశలు తీసుకుని, "వదినా పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలి కదా మీ తమ్ముడు ఇంకా లేవలేదు అందుకే నేను నడుచుకుంటూ వచ్చేశాను" అని.. అలా ఆరోజు నా టిఫిన్ కార్యక్రమం ముగిసింది.. ఉదయం 9 గంటలనుండే మళ్ళీ బి.పి, సుగర్, ఫెవెర్ లాంటివేమన్నా ఉన్నాయేమో అని గంటకో డాక్టర్ వచ్చి చెక్ చేస్తూ ఉన్నారు.. ఆపరేషన్ టైం కి పేషంట్ నార్మల్ కండిషన్‌లో ఉండాలని అని .....ఎందుకిలా ప్రతి గంటకి అని... నేను అడిగిన ప్రశ్నకి "శ్రీనివాస్" అనే డాక్టర్ సమాధానం. మధ్యలో అంటే వీళ్ళు చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పెద్దాయన దాదాపుగా 60 ఏళ్ళ పైన ఉండొచ్చు.. వచ్చి "ఎలా ఉందమ్మా?" కాలికి వేసిన పి.ఒ.పి అంతా విప్పించి చూశారు..  వెళ్తూ అన్నారు.. కాంపౌండ్ ఫ్రాక్చర్ కదా.. ప్లేట్స్ కూడా వేయాల్సి ఉంటుంది, రాడ్ తెప్పిస్తున్నాము మధ్యాహ్నం రేడీగా ఉండండి అని సౌమ్యంగా మాట్లాడారు...ఆ పెద్దాయనే నాకు ఆపరేషన్  చేసిన డాక్టర్.. నాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచిన వ్యక్తి,  పేరు డాక్టర్ ముకుందన్ గారు

మధ్యాహ్నం 1.00 

నర్సులు ఒక్కొక్కరిగా వచ్చి నా బెడ్ షీట్ మార్చడం, నా జుట్టంతా ఒక పక్కకి తీసి ఒక చిన్న కాప్ పెట్టేసి నాట్ వేయడం, నా డ్రస్ మార్చడం గబ గబా హడావిడిగా చేసెస్తున్నారు . "ఎప్పుడో 3 గంటలకి అన్నారు కదా ఎందుకంత ఆతృత.. ఇప్పుడే తీసుకెళ్తున్నారా?"  అని అడిగాను నర్సులని.. మా పైవాళ్ళ చేత మాకు మాటలు రాకూడదండి.. మిమ్మల్ని ఇప్పుడే తీసుకెళ్తాము... అని అన్నారు.. నా పక్కన అప్పటికి మా పాప ఉంది.. శ్రీవారు, బాబు , మేనల్లుడు భోజనానికని ఇంటికి వెళ్ళారు..నేను మా పాప అంతే ... ఈలోపులోనే నన్ను తీసుకెళ్తే.. మొదటి సారి... అప్పటిదాక ధైర్యంగా ఉన్న నాకు సన్నగా వణుకు ప్రారంభమయింది...పాప చిన్నపిల్ల   దానికేమి తెలీదు అన్న ఆలాపనే నాకు..  పక్కనే ఉన్న ఫోన్ అందుకున్నా.. అమ్మయినా ...అక్కయినా  పర్వాలేదు తోడుగా ఉంటే అనిపించింది, అమ్మ పెద్దావిడ రాలేదు అని..  వెంటనే అక్కకి ఫోన్ చేశాను "అక్కా ఇప్పుడే అపరేషన్‌కి తీసుకెళ్తారట, నువ్వు రావా ప్లీజ్" అని  " ఇదిగో భోజమ చేస్తున్నా అవగానే బయల్దేర్తాను.. నువు కంగారు పడకు మేమంతా ఉన్నాము " అని ధైర్యం చెప్పింది.. నేను ఇటు అక్కకి ఫోన్ చేసే లోపులోనే మా పాప వాళ్ళ నాన్నకి, మావయ్యకి అందరికీ ఫోన్ చేసేసింది "వచ్చేయండి" అని.. 

1.30 కి స్ట్రెచర్ మీద తీసుకెళ్ళడానికి నన్ను రేడీ చేశారు... అప్పటికి నాకు సంబంధిన వాళ్ళే కాకుండా బంధువులు, స్నేహితులు కూడా వచ్చారు విషయం తెలుసుకుని.. నా స్ట్రెచర్ ముందుకు సాగుతుంటే చూశాను అందరిని.. బయట దాదాపు మా బందువులు స్నేహితులు.. నా అనుకునేవాళ్ళు, మొత్తం ఒక 20 మంది దాకా ఉంటారు.. భయం నన్ను వెన్నంటి ఉందేమో ధైర్యం చాలక అందరిని చూసి , నవ్వుకు బదులు కళ్ళ నీళ్ళు వచ్చాయి.. ఇప్పటిదాకా ఎలా ఉంటుందో కూడా తెలియని ఒక క్లిష్టమైన పరీక్షని ఎదుర్కోబోతున్నాను అన్న బేలతనం నాలో..  

చాలా దూరం తీసుకెళ్ళారు ఎక్కడికో నాకేమి తెలుసు ప్రతీ మలుపుకి ఇంకో ఇద్దరు నర్సులు "మేము తీసుకెళ్తాము " అని అనడం.. కొంతవరకే కొంతమందికి ప్రవేశం అన్నట్లు .. సినిమాల్లో పెద్ద డాన్‌ని కలవాలంటే ఇద్దరిద్దరు చొప్పున కొంత కొంత దూరం తీసుకెళ్తున్నట్లుగా నన్ను తీసుకెళ్ళారు.. చివర ఇక ఆపరేషన్ థియేటర్ తలుపు ఇవతల నా స్ట్రెచర్ ఉంచి లోపల వాళ్ళని పిలిచి నన్నప్పగించి వెళ్ళారు.. వాళ్ళకి అక్కడిదాకానే ప్రవేశంట.. నేను ప్రతి ఇద్దరితో మాట్లాడుతూనే ఉన్నా... నా అధైర్యాన్ని కప్పిపుచ్చుకోడానికి... "అమ్మా ఆల్ ది బెస్ట్"  అని పరిగెత్తుకుంటూ వచ్చి చేయి అందుకుని చెప్పింది పాప...లోపలికి వెళ్తుంటే... నేను నర్సులు మాత్రమే వెళ్తున్నాము అన్న నా అంచనాని తారు మారు చేస్తూ అక్కడిదాక వచ్చారు మావారు, బాబు పాప.. మేనల్లుడు.. పరిగెత్తారనుకుంట అందరూ రొప్పుతున్నారు.. "నావాళ్ళు" అన్న భావన, ఆనందం కలిగింది  అందరినీ చూడగానే....అందరివైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వి ...వెళ్ళొస్తా అని కళ్ళతోనే చెప్పి లోపలికి వెళ్ళా.... 

ఒక పెద్ద గది ముందు నన్ను ఆపేశారు... కుడికాలు మెట్టెలు తీసేశాను కాని ఎడం కాలువి తీయలేదు.. ఈ కాలికి కాదు కదా అని... దాని గురించి కూడా పట్టించుకోలేదు నేను నాకు సర్వ్ చేసిన నర్సులు కూడా... లోపలి గది నుండి ఇద్దరు జెంట్స్ ఇద్దరు లేడీస్ వచ్చారు.. ఒకావిడ చాలా పెద్దావిడ,ఇంకొకమ్మాయి బహుశా ట్రైనీ అయి ఉంటారు... ఒక ప్యాడ్ తీసుకుని నా డిటైల్స్ చెక్ చేస్తున్నారు. మగవాళ్ళిద్దరూ కూడా ఎలా జరిగింది ఏంటి అని నన్ను మాటల్లోకి దింపారు పరిసరాలు నాలో భయాన్ని పెంచకుండా.. అందులో ఒకతను మెట్టెలు తీసి మేడం ఇది కూడా తీసేయాలండి.. అని అన్నారు చేతిలో పట్టుకుని..  


ఇంతలో ఆ పెద్దావిడ.. "బయట ఎంతమంది ఉన్నారు?" అని అడిగారు అప్పటికే అందరినీ  చూసి,  కళ్ళతో పలకరించి వచ్చానేమో "అందరూ ఉన్నారు దాదాపుగా ఒక 20 మంది దాక" అని సమాధానం ఇచ్చాను... "ఈ మెట్టెలు ఎవరికి ఇవ్వాలి?" అని అడిగారు.. "ఎవరికిచ్చినా పర్వాలేదు,  మావాళ్ళకి తరువాత నాకు వచ్చేస్తాయి " అని చెప్పాను. కాసేపు అలా మాట్లాడిన తరువాత ఆ పెద్దావిడ మళ్ళీ అడిగారు "మీదే కులం" అని.... మళ్ళీ భయం అమ్మో కుల పట్టింపు కాదు కదా... అని "మరోలా అనుకోవద్దండి Anesthesia  ఇస్తాము కదా అది ఫలనా కులం వారికి పడదు... అందుకని.. అవునూ మీకేమన్నా కట్టుడు పళ్ళా లేక ఒరిజినల్‌వేనా"  అని ఇంకో ప్రశ్న.. హమ్మయ్య అని గుండేనిండా ఊపిరి పీల్చి " మేము ఫలనా అని చెప్పేసి.. కట్టుడు పళ్ళు ఏమి లేవు అని సమాధానమిచ్చాను.. Anesthesia  ఇచ్చినప్పుడు పళ్ళుకొరకడం,  పెదవిని బిగబట్టి కొరకడం చేస్తూ ఉంటారట వాళ్ళకి తెలియకుండానే కట్టుడు పళ్ళు అయితే చాలా ఇబ్బందిట ఆని వివరణ ఇచ్చారు. 

లోపల గదిలో ఏర్పాట్లు ముగిసినట్లున్నాయి నన్ను లోపలికి తీసుకెళ్ళారు.. సినిమాల్లో చూడడమే ఆపరేషన్ థియేటర్.. నిజంగా ఇప్పుడు చూడడం.. బెడ్ పైన రెండు పెద్ద లైట్స్.. బయట చెప్పిన నలుగురితో పాటు లోపల ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళు మరీ  మా పాప వయసువాళ్ళనుకుంట అన్ని ఏర్పాట్లు చక చకా చేసేస్తున్నారు. నా చెరో చేతి కిందా ఒక చెక్కలాంటిది అమర్చి (నేను చేతులు మడవకుండా) ఒక చేతి కి సిలేన్ బాటిల్ ఇంకో చేతికి బి.పి  checkup  ఫిక్స్ చేశారు. ఇవన్నీ చేస్తూ నాతో మాట్లాడుతున్నారు..నేనెమి చేస్తాను, నా ఆలోచనలు, అభిప్రాయాలు.. రాజకీయలగురించి కూడా అడిగారు.. రాజకీయాలు నాకంత ఆసక్తి లేదు అనగానే టాపిక్ మార్చి మాట్లడడం వాళ్ళ సమయస్ఫూర్తి.. నాలో ధైర్యాన్ని నింపడానికో మరి నిజమో తెలీదు కాని.. థియేటర్లోకి అడుగుపెట్టగానే భయంతో అరుపులు, ఏడుపులు .. విరక్తి భావం లాంటివి వ్యక్తపరుస్తారట పేషంట్స్.. నేను అలా కాదని.. చర్చిస్తున్నానని అనడం... నిజానికి భయం లోపల ఉన్నా.....  పైకి మటుకు మాములుగా మాట్లాడాను..... నా కళ్ళ ముందు ఒక చిన్న స్టాండ్ ఆ స్టాండ్కి ఒక గ్రీన్ కలర్ క్లాత్ వేశారు నడుమునుండి నాకేమి జరుగుతున్నా కనిపించకుండా... 

"జాగ్రత్త మేడం... Anesthesia   ఇస్తున్నాము మీకేమి పర్వాలేదు"  అంటూ ఆ పెద్దావిడ ఇవ్వడం ప్రారభించారు... చిన్న పిల్లలు ఇద్దరూ నా చేతులు పట్టుకుంటే.. మగవాళ్ళిద్దరూ నా కాళ్ళు పట్టుకున్నారు.. వెన్నులో ఇంజెక్ట్జెచేస్తున్నారు మత్తు మందు.. నేను గమనిస్తున్నా ఒక్కసారిగా ఎదో జలదరింపు కలిగింది.. యెస్ ఒకే.. అని సూది తీసేశారు ఆవిడ.. అంటే ఇంజెక్ట్ అయిపోయింది..... నడుము దగ్గరినుండి, కాళ్ళ దాక నాకేమి జరిగినా తెలీదు ఇంక... అటు ఇటు చూసాను.. నాకు సంబంధించిన అన్ని పనులు అయిపోయాయి... పెద్దావిడ చేతులు వెనక్కి పెట్టుకుని అటు ఇటూ నడుస్తున్నారు... ఆ ఇద్దరు చిన్న పిల్లలలో ఒకళ్ళు ప్యాడ్ పెన్ దగ్గరపెట్టుకుని అలర్ట్ గా ఉన్నారు ఇంకొకరు తెచ్చిన సరంజామ సర్దుతున్నారు.. ఆ ఇద్దరు మగవాళ్ళు పిచ్చా పాటి మాట్లాడుకుంటున్నారు. 

డాక్టర్గారు వచ్చారు... "ఎమ్మా ఎలా ఉంది కాలు నొప్పిగా  ఏమన్నా ఉందా.. ఏమి పర్వాలేదు ఒక గంటలో అయిపోతుంది " అని అన్నారు.."పర్వాలేదా డాక్టర్" అని అడిగా భయంగా.. నా తల దగ్గర జస్ట్ అలా తడిమి నో ప్రాబ్లం... అని వెళ్ళారు... పైన ఉన్న రెండు lamps వెలిగించారు అసిస్టెంట్స్. నాకేమి తెలియడం లేదు కాదు కాదు కనిపించడం లేదు..  కాకపోతే స్పృహ ఉంది.. పి.ఒ.పి కట్ చేసి dust ట్రేలో వేయడం మటుకు తెలుసు అంతే నిద్ర వస్తోంది.. నా పరిస్థితి చూసి ఆ పెద్ద మేడం అన్నారు" పడుకొండి ఏమి పర్వాలేదు " అన్నారు.. పూర్తిగా వినకుండానే నిద్రలోకి జారుకున్నా... (మత్తు ప్రభావమేమో).. మధ్య మధ్యలో మెలుకువ వస్తోంది అటు ఇటు చూస్తుంటే మటుకు ఆ పిల్లలిద్దరూ పరిగెడ్తున్నారు.. ఒకళ్ళు ఏదో రాస్తున్నారు.. సన్నగా మాటలు వినిపిస్తున్నాయి కాని ఏమి అర్థం కావడం లేదు.. కాని ప్రతిసారి అంటే మెలుకువ వచ్చినప్పుడల్లా.. ఇంకా ఎంతసేపు అనో, అయిపోయిందా అనో ఆవిడని అడుగుతున్నా .. పెదవుల కదలికతో మాత్రమే.. అలా కొంతసేపటికి నా ఆపరేషన్ పూర్తి అయింది.. అదికూడా నాకెలా తెలిసింది నా కంటి ముందు స్టాండ్ మీద ఉన్న గ్రీన్ కలర్ క్లాత్ తీసేశారు.. అసలక్కడ ఏమి జరగలేదు అన్నంత నీట్ గా ఉంది అసలేమి చేసిన ఆనవాళ్ళు కూడా లేవు.. కాలు పి.ఒ.పి తో ఎలా వచ్చానో మళ్ళీ అలాగే ఉంది.. నిద్రమత్తులోనే ఉన్నా నేను.. స్ట్రెచర్ వచ్చింది నన్ను జాగ్రత్తగా స్ట్రెచర్‌పైకి మారుస్తున్నారు.. అదిగో అప్పుడుడాక్టర్ ముకుందన్ గారు నా కాలు పదిలంగా ఒక గాజు బొమ్మని పట్టుకున్నంత భధ్రంగా పట్టుకుని స్ట్రెచర్‌పై ఉంచడం చూసి నా కళ్ళు ఆనందబాష్పాలయ్యాయి..మగత నిద్ర.. మెలుకువ స్థితిలో ఉన్నాను నేను ఆ స్థితిలోనే నాదగ్గరికి వచ్చి చెప్పారు డాక్టర్.. " ఆపరేషన్ సక్సెస్ అమ్మా.. ఏమి పర్వాలేదు.. ఒక రెండు రోజుల్లో మీరు కాస్త నడవగలిగితే (వాకర్తో) డిస్చార్జ్ చేసేస్తాము.. అన్నీ తినొచ్చు .."  అని వెళ్ళారు.. బయట ఎదురుచూస్తున్న మా పాపకి కూడా అదే చెప్పారుట... ఏమి భయంలేదు మీ అమ్మకి ఆపరేషన్ సక్సెస్ అయింది అని..అలా కాలి ఆంకిల్ (చీలమండలం) దగ్గర మూడు ప్లేట్లు ఒక 5 సెంటీమీటర్లదాక రాడ్ తో నా కుడి కాలి శస్త్ర చికిత్స పూర్తి అయింది.  ఐరన్ లెగ్ అన్నమాట.. ;-)

అక్కడినుండి వెళ్తూ...అందరికి థాంక్స్ చెప్పి నా రూం కి వెళ్ళాను అప్పటికి టైం రాత్రి 8 అయింది.. అంటే రెండు గంటల ప్రాంతంలో ఆపరేషన్ థియేటర్‌కి వెళ్ళిన నేను తిరిగిన్ నా రూం కి చేరుకునేసరికి రాత్రి ఎనిమిది అయింది.. సుదీర్ఘ ఆపరేషన్   కదా   ఇది...
****

3.23.2012

ఉగాది శుభాకాంక్షలు


బ్లాగు మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు  రమణి

3.13.2012

నిదురమ్మా! ఎటు పోతివే.......నిద్ర.. ఈ నిద్రాదేవికి నేనంటే ఇష్టం కాదు .. కాదు ప్రాణం.. నిద్ర సుఖమెరగదు అన్నట్లు,  నిద్రాదేవి నా దరికి చేరి....  ఇంట్లో ఎవరున్నారు ఎవరు లేరు అన్నది కూడా చూడకుండా నన్నలా అల్లుకుపోయి... ఆవహించేస్తూ ఉంటుంది.. అప్పట్లో నా నిద్రకి జోలపాట ... మా అమ్మ.   టీ , కాఫీ, భోజనాలు అంటూ... లేపేసి మళ్ళీ " పడుకోమ్మా తినేసి, తాగేసి ఎంత అలసిపోయావో ఎమో"  అంటూ జోకొట్టేసేది. (వేసవి సెలవుల్లో లెండి... మెలుకువగా ఉంటే ఎదో ఒకటి కొనమంటూ సతాయిస్తూ ఉండేదాన్నట.. )

సరే ఇప్పుడు పెళ్ళి అయింది.. పిల్లలు.. బాధ్యతలు... ఇప్పుడు కూడా నిద్రాదేవి అదే తరహా ఇష్టాన్ని నాపై కురిపిస్తోంది.. ఇంతవరకు ఈ ఇష్టం నాకెప్పుడు కష్టమవలేదు కూడా.....ఇదిగో ఇప్పుడే... ఇలా భయంగా వస్తున్న నిద్రని ఇప్పుడు కాదు తరువాత అంటూ ఉండేసరికి ...... పూర్తిగా నన్నొదిలేసిందెమో అనిపిస్తుంది....
*********

పాపకి మొదటి పరీక్ష.. 03.03.2012.. పొద్దున్నే 8 గంటలకి వెళ్ళాలి అని ముందే చెప్పడంతో  నేనంటూ అలారం పెట్టుకోను ఎప్పుడు నాకు నేను హిప్నటైజ్ చేసుకుంటూ ఉంటా...  ఉదయం 5 గంటలకి లేవాలి అని.... ఆ అలవాటే 2 తారీఖున కూడా అమలుపరచాను.. రాత్రి 12 గంటలకి ఒకటికి రెండుసార్లు నన్ను నేను హిప్నటైజ్ చేసేసుకుని పడుకున్నా... పడుకోగానే నిద్రదేవి నన్ను వరించేస్తుంది... నాతో పాటు పాప, బాబు, శ్రీవారు ఒకేసారి పడుకున్నాము ఆరోజు. 

ఆరతి సాయిబాబా.. అన్న పాట వినగానే ఠక్కున మెలకువ వచ్చింది. మా ఇంటికి దగ్గర్లో ఉన్న బాబా గుడి నుండి పాటలు ఉదయం 7 గంటలనుండి వస్తాయి అంటే అప్పుడు టైం 7 దాటింది. బాప్రే! పాపకి సెంటర్ చాలా దూరం .. ఉన్నపళంగా పాపని లేపేసాను అదీ టైం చూసి ఉలిక్కిపడి... "ఎలగామ్మా ఇప్పుడు ఈరోజు నేను exam  రాయలేను..."  ఏడుపు.. మొదటి రోజు నా నిద్ర కారణంగా అది పరీక్ష రాయలేకపోయింది.. అయినా నాతోపాటు శ్రీవారు , బాబు, పాప కూడా నిద్రపోవడమేమిటి.. నా తప్పుని కప్పిపుచ్చుకోడానికి వాళ్ళకి చివాట్లు... చ!  రోజంతా చికాకు చికాకుగా ఉంది.. అనుకున్నది జరగడంలేదు.. ఆ చికాకులోనే పాపకి బుజ్జగింపు.. "పోనిలే తప్పు నాదే ఎలాగోలా వెళ్ళు.. ఒకవేళ లేట్ అయితే రిక్వస్ట్ చేయి...   పర్లేదు రాసేస్తావు....."  నెమ్మదిగా బుజ్జగిస్తే ....

"ఫైనలియర్ పరీక్షలంటే నువ్వు ఆషామాషీ అనుకుంటున్నావా అమ్మా..one  ఇయర్ వేస్ట్ అవుతుంది.. నాదే తప్పు నాలుగు సెల్స్‌లో  అలారం పెట్టుకున్నా ..... మెలకువ రాలేదు చట్.. కళ్ళనీళ్ళతో పాప.. 
ఏమి చేయను? ఏమి చెయగలను? దగ్గరకి తీసుకుని ఒదార్చుదామని అనుకునేంతలో ".. ఏహే పో అమ్మా!" అని   విదిల్చి దూరం జరిగింది.... 

విసుగుతో కూడిన ఆ విసురుకి ఒక్క ఉదుటన లేచి చూశాను.... హాలంతా నిశ్శబ్ధంగా ఉంది.. పక్కన పాప పుస్తకాలని తదేక దీక్షతో చదువుతోంది.. టైం చూస్తే తెల్లవారుఝాము 4 గంటలయింది అప్పటికి... 

**********
"నీకు కల వచ్చిందని మమ్మల్ని ఇలా ప్రతి పదినిముషాలకి సతాయించకమ్మా ప్లీజ్!".. 

ఆ తరువాత అంటే పైన కల వచ్చిన తరువాత , నేను నిద్రని దూరంచేసేసుకున్నా..  ఇష్టమైన నిద్రని అతి కష్టంగా.. భయం .... నాతో పాటు పిల్లలు కూడా నిద్ర పోతారేమో అనే ఆలోచన.... "అమ్మా! మూడింటికి లేపు" లేదా "రెండింటికి లేపు" అని చెప్తే వాళ్ళ టైంకి,  అనుగుణంగా లేపడానికి నేను పన్నెడింటినుంచే ఎదురుచూపులు.. లేచిన తరువాత ప్రతి పదినిముషాలకి ... చదువుతున్నారా  , పడుకున్నారా అని పిలిచి అడగడం చూసి మా పాప  అన్న మాటలవి..  

నిజమే కాని విచిత్రం మొదటి రెండురోజులు  నిద్ర నా దరిచేరతానని ఎంత ప్రయత్నించినా  బలవంతంగా దూరం నెట్టేశాను.. ఇప్పుడసలు అంటే ఇంక నిద్రపోవచ్చు పర్వాలేదు.. పిల్లలు లేపగానే లేస్తున్నారు , నేను లేపకపోయినా లేచేట్టుగానే ఉన్నారు అనుకునే సమయానికి నేను నిద్రని వెతుక్కోవాల్సిన పరిస్థితి.. :-) . పిల్లలికి పరీక్షలంటే మనమెంత కష్టపడాలో కదా.. 

అమ్మ గుర్తొచ్చింది  హాయిగా నవారు మంచం పై పడుకు కఱ్ఱ  పక్కన పెట్టుకుని, ఎప్పుడు మెలుకువ వస్తే అప్పుడు "చదువుతున్నారా, ఏది ఫలనా ఎక్కం చెప్పు" అనేది నిద్రలోనే..... మేము సగం చెప్పేసి ఠక్కున ఆపేసినా,  అమ్మకి తెలిసేది కాదు.. ఇప్పుడలా కాదు.. లేచి వాళ్ళని లేపి,  మనం పక్కన కూర్చుంటేకాని వాళ్ళకి చదువుకోవాలి అనే ఆలోచన రావడంలేదు.. 

నాకు తెలిసి ఈ పరిక్షల సీజన్‌లో  తల్లితండ్రులందరూ ఇదే పరిస్థితిలో ఉండిఉంటారు.... :-)  Have a nice sleep to you all ... 

హ! ఇప్పుడు కూడా నిద్రపట్టకే.. పక్కన ఇద్దరు పిల్లలు చదువుకుంటూ ఉంటే రాస్తున్నా... "కునుకమ్మా ఇటు చేరవే"  అంటూ ...
******


Loading...