4.27.2009

వ్యాఖ్యల రాజకీయాలు


నా పాత బ్లాగు "మనలోమాట నా మనసులోని మాట" బ్లాగ్ లో "విన్నపాలు వినవలే " అనే టపా రాసినప్పుడు, వ్యాఖ్యలకి సంబంధించిన చిన్న తరహ వాదన జరిగింది. ఆ వాదన ఒక ఏకాభిప్రాయానికి రాకపోయినా , అందులో నేను చెప్పింది ఎవరు బ్లాగు కోటకి వాళ్ళే మహరాణులు/మహరాజులు అని. ఒక వ్యాసం కాని, ఒక కథ కాని చదువుతుంటే మనకి తెలియకుండానే మనలో ఒక భావం వచ్చేయ్యాలి, ఆ భావావేశం మనల్ని ఒక మంచి వ్యాఖ్య రాసేలా ప్రేరేపించగలగాలి. అలాంటి భావన కలిగినప్పుడు రాసే వ్యాఖ్య మనల్ని "మంచి వ్యాఖ్యాత" గుర్తింపు తెప్పిస్తుంది. వ్యాఖ్యలు రాయడం కూడా ఒక కళ. కొత్తవారిని ప్రోత్సహించే నేపధ్యంలో వాళ్ళు ఏమి రాసినా "ఆహ, ఓహో" అని రాసి ప్రోత్సహించే పెద్దలు మంచి విషయం కనిపించే బ్లాగుల్లో మటుకు "బాగుంది" అని చెప్పడానికి వెనకాడడం చాలా సార్లు గమనించిన విషయం. ఇదంతా పక్కన పడితే బ్లాగుల్లో ఎవరికి వారే మేము సీనియర్ బ్లాగర్లమి అనో ప్రముఖ బ్లాగర్లమి అని ముద్ర వేసుకొన్నవారు వాళ్ళు పాటలు పాడినా/రాసినా, అర్థంకాని విశ్లేషణలు రాసిన వారికి కూడా వారి ప్రాముఖ్యతని పెంచే ఆరాటంతో , పలువురు పెద్దలు ఆ బ్లాగు చూరు పట్టుకొని వేళ్ళాడడం విచిత్రాతివిచిత్రంగా వింతగా ఉంటుంది. పుఱ్ఱేకో బుద్ధి .. జిహ్వకో రుచి, అన్నారు కాబట్టి మనము అలానే అనేసుకొందాము.

ఇలా అంటున్నానని బ్లాగు పాఠకులని అవమానిస్తున్నాను అని అపార్థం చేసుకోవద్దు. ఇలాంటి అర్థం లేని వ్యాఖ్యల వల్ల, చక్కటి వ్యాఖ్యాతలు కనుమరుగు అవుతున్నారు అన్న ఆలోచనే , నన్ను ఈ టపా రాసేలా చేసింది. అలాగే ఏదో గొడవలకి కాలం వెచ్చించి వ్యాఖ్యలు రాసే జనాలు, మంచి పోస్ట్‌ల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. మనం రాసుకొనే బ్లాగు మనకోసం, ఇది మన ప్రవృత్తి, ఇక్కడ వ్యాఖ్యలు అనేవి మన ఆలోచనలని మన భావనలని, మన విజ్ఞానాన్ని హరించకూడదు. ఒక మంచి విషయమో లేదా ఒక మంచి ఊహ ఇంకొకరితో పంచుకొంటున్నాము అన్న భావన బాగుంటుంది. అలాగే అవతలి వారి స్పందన కోరుకోడం అనేది మానవ సహజం . 'వ్యాఖ్యలు రావట్లేదు ' అని మనకి ఉన్న సమయాన్ని వ్యాఖ్యల కోసం ఎదురుచూడం ఎంత అజ్ఞానమో కదా. అయితే ఇదే వ్యాఖ్యలు రావడం లేదు అని అనుకొంటూ కొంతమంది కొన్ని గొడవలకు ప్రధాన పాత్రలుగా ఉన్నారని బ్లాగుజనాల భోగట్టా. ఇలాంటి వివాదాలు, వాదనలు,
చర్చలేని అనవసర రచ్చ మనకి(నాకు) అవసరమా అని అనిపించింది ఆలోచిస్తుంటే. మొన్నే ఎక్కడో చదివాను " బ్లాగు అంతర్యుద్ధాలు యధావిధిగా చేసుకొందాము రండి " ఎవరో రాశారు. ఈ అంతర్యుద్ధాల రాజకీయాలు నాకు అవసరం లేదనిపించింది. అందుకే నా బ్లాగుల్లో కామెంట్స్ ని తీసేసాను. అలా అని మీ వ్యాఖ్యానాల స్వేఛ్చని నేను లాక్కొన్నాను అనుకోకండి. నా బ్లాగు లో పోస్ట్ మీకు నచ్చిందా .....ఆ భావావేశాన్నో, ఆ స్పందననో మీరు మీ బ్లాగులో రాసేయండి. నేను చదివేసి సంతోషించేస్తాను. "అబ్బే! మీకంత సీన్ లేదండి " అంటారా.. సరే వదిలేయండి.. కొన్ని జీవితాలంతే మరి.. :(

పాత బ్లాగు మొదలుకొని. ఈ కొత్త బ్లాగు దాకా నన్ను కామెంట్స్ ద్వార ప్రోత్సహించిన వారికి పేరు పేరునా కృతజ్ఞతలు.

4.24.2009

ప్రేమ - ద్వేషం

ప్రేమించిన వారిని ద్వేషించగలమా? ద్వెషించిన వారిపై ప్రేమ పుడుతుందా?? ఎంటో ఈ ఆలొచనలు.. అసలేమి ఆలోచించకుండా మనిషి ఉండగలడా? లేకపోతే జీవితాంతం ఇలా ఆలోచనల సుడిలో కొట్టుకుపోవాల్సిందేనా.. అయినా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఇలా అర్థం పర్థం లేనివి, ఆచరణ యోగ్యం కానివి ఎందుకు ఆలోచించడం అని..ఈరోజు ఇలా పోలీసు అధికారిణీ గా ఉండి , ఇంతమంది నేరస్థులని చూసి కూడా అసలు నేరస్థులను అంచనా వేయలేని తన అనర్హత మీద తనకే కోపంగా, చికాకుగా ఉంది. అసలెందుకీ ఈ పోస్ట్ తనకి? ఇన్నాళ్ళు అసలేమి సాధించిందని? చాలా నిక్కచ్ఛిగా ఉంటానని పేరు. కాని నాలో ఏదో గౌరవంలాంటి మమకారం అవతలి మనిషి చేస్తున్న అన్యాయాన్ని పసిగట్టలేక పోయిందా? తను అనుకొందా అసలు.. ఏంటో ఈ ఆలోచనలు, "అసలు ఈ విషయం తనదాకా వచ్చి ఉండకపోయినా బాగుండేది. అసలెందుకు తెలిసిందిరా భగవంతుడా!" అని తలపట్టుకొంది వైష్ణవి. జరిగిన విషయాన్ని తలచుకొని కళ్ళ నీళ్ళు తిరుగుతుండగా ఒకసారి తన స్కూల్, ఆ జీవితం అదీ గుర్తొచ్చింది.

********

గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వర:
గురు సాక్షాత్ పరబ్రహ్మ
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమ:

మనిషి పుట్టిననుంచి గిట్టే వరకు ప్రతి అడుగులోనూ ప్రతిక్షణం లోనూ అతను/ఆమె ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే వున్నారు, అతడు/ఆమె నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే వున్నాడు కాని ఈ గురువుని మనమందరం ప్రత్యక్షంగా చూడ గలిగినది తరగతిగదిలో విద్యనభ్యసించినప్పుడే, ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తాడు తన భవిష్యత్తుకు అతడి/ఆమె అనుభవాన్ని వారధిగా తీసుకుని తన భవిష్యత్తువైపు పయనిస్తారు, జీవితంలో ఎవరికీ కేటాయించనంత సమయాన్ని గురువువద్ద గడుపుతారు జీవితాన్ని మలిచి తీర్చిదిద్దే గురువే ప్రత్యక్ష ప్రథమ దైవం.


"వైష్ణవి! నువ్వు చెప్పమ్మా నీకు ఏ టీచరంటే ఎక్కువ అభిమానమో?ఎందుకు? పెద్దయ్యాక ఏమి చేద్దామనుకొంటున్నావు?" అడిగారు గురువు ఆవశ్యకత చెప్తూ తెలుగు టీచర్.


తనలో అభిమానం కట్టలు తెంచుకొని వచ్చిందో లేక ఈ సంవత్సరం తను వెళ్ళిపోతున్నానని బాధో తెలీదు కాని, నిజంగానే ఏడ్చేసింది "నాకు మీరంటే చాలా ఇష్టం టీచర్, మీరు చెప్పే ప్రతి ఒక్క విషయం జీవితం సజావుగా సాగడానికి పునాది లాంటిది. ఈరోజు ఇక్కడినుండి వెళ్తున్నామన్న మాట కాని మా మనసు మీ దగ్గిరే ఉంటుంది. ఇక ముందు మా ప్రతి అడుగులోను మీ ఉపదేశాలు ఉంటాయి" కంటినిండా నీరుతో ఇక చెప్పలేక పోయింది వైష్ణవి. అంతటి అభిమానానికి ముగ్ధురాలయ్యింది ఆ తెలుగు టీచర్. అలా ఆరోజు ఒక్క వైష్ణవి అనే కాదు, ఆ క్లాస్ వారందరి అభిమానాన్ని చురగొన్నారా తెలుగు టీచర్.


*****


ఆరోజు నుండి ఈరోజు వరకు తను ఎక్కిన ప్రతి మెట్టు ఆ టీచర్ తో పంచుకొని ఆనంద పరవుశురాలయ్యింది. తన తల్లి లా భావింది. ప్రతి అడుగు ఆమె సూచన ప్రాయమే. తనతో పాటు అన్ని విజయాలను పంచుకొన్న ఆ టీచర్ ఒక్క విషయంలో తనతో ఏకీభవించలేదు. తను పోలీసు ఆధికారిణి అవడం ఆమెకు సుతారము ఇష్టం లేదు. ఇన్ని మంచి విషయాలు చెప్పే ఈవిడకి ఈ పోస్ట్ ఎందుకు ఇష్టం లేదో అని అనుకొంది తప్పితే అంతకన్నా ఎక్కువ ఆలోచించలేకపోయింది. అలా అని ఆమెని ప్రేమించడం మానలేదు, ఆమె కూడ అంతే ఆనందంగా తన మాటలు వినేది. చంద్రుడికో మచ్చలాగా తన ఉద్యోగం ఒక్కటే ఆమెకి నచ్చని విషయం. ప్రతి మనిషి లోను మంచి , చెడు రెండూ ఉంటాయి, మంచిని తీసుకొని చెడుని వదిలేయాలి అన్న ఆమె మాటలే మననం చేసుకొనేది తను ఎప్పుడూ.


నిన్నటి వరకూ ఇదే ఆలోచనలో ఉంది. ఇలానే ఆలోచిస్తోంది.. కాని ఈరోజు.. ఈరోజు.... ఆలోచనలో ఉండగా టేబుల్ మీద ఫోన్ మోగింది. తెలుగు టీచర్....??


"హల్లో"

"వైష్ణవి నేనే"


"టీచర్...!"


"శశాంక్ నా దగ్గిరకి వచ్చాడు"


"ఊ"


"నువ్వు నమ్ముతున్నావా?"


"రుజువులు నమ్మమంటున్నాయి"


"అంటే??"


"నేనేమి మాట్లడలేకపోతున్నాను టీచర్, మీమీద అదే అభిమానం, అంతే ప్రేమ ఉన్నాయి కాని రుజువులు నా ఆలోచనలు తలక్రిందులు చేస్తున్నాయి, నేనేమి చెయ్యాలో నాకు తెలియనట్లుగా చేష్టలుడిగి ఉన్నా ఇప్పుడు".


"నన్ను ద్వేషిస్తున్నావా వైష్ణవి?"


"ప్రేమించినవాళ్ళని ద్వేషించలేము, ద్వేషించిన వాళ్ళని ప్రేమించలేము".


"ఇప్పుడేమి చేద్దామనుకొంటున్నావు వైష్ణవి?"


"నా ఉద్యోగ ధర్మం పాటిద్దామనుకొంటున్నాను టీచర్".


"అంటే నన్ను అరెస్ట్ ..................?"


"తప్పదు టీచర్.... వారెంట్ తో వస్తున్నాను ". బాధగా అంది వైష్ణవి.


"సరే ఎలాగు అరెస్ట్ చేస్తానన్నావు కాబట్టి నీతో మాట్లాడాలి ఒకసారి పోలీసు అధికారిణిగా కాక, వైష్ణవిలా నా దగ్గిర చదువుకొన్న విద్యార్థినిలా మా ఇంటికి వస్తావా? ".


"తప్పకుండా.. బయల్దేరుతున్నా..."


*******


"చెప్పండి టీచర్, ఎందుకు రమ్మన్నారు?"


"తప్పు నాది కాదు అని నిరూపించుకోడానికో, లేదా
తప్పు నాదైనా నువ్వొక్కదానివి నమ్మకు అని చెప్పడానికో కాదు వైష్ణవి నిన్ను పిలిచింది, ఒక నిజం చెప్దామని. "


"నిజమా? ఏమిటది, ఈ విషయానికి సంబంధినదయితే రుజువులు సాక్ష్యాలు మీరేనని చెప్తున్నాయి ఇక వెనుతిరిగేది లేదు మీరేమి చెప్పినా.."


"నేను దానికి సంబంధించి అసలు నీతో మాట్లడదల్చుకోలేదు, నేరం నేనే ఒప్పుకొంటున్నాను. కాని చేసింది మటుకు "నీకోసం" ఇది చెప్పాలనే నిన్ను పిలిచింది.


"నా ...కో.. స.. మా?"


"యెస్ నీ కోసమే. "


"నువ్వు ఎప్పుడన్నా గమనించావా? నువ్వు మాట్లాడుతుంటే మురిసిపోతాను, నీతో పంచుకొనే ప్రతి నిముషం కోసం నేను యుగాలయినా ఎదురుచూస్తాను. ఇంకో విషయం.. నీతో తప్పితే ఎవరితోను ఇంత చనువు, ఇంత బంధం పెంచుకోలేదు నేను, కారణం తెలుసా నీకు?"


"గురువుగా నేను బాగా చదువుతానని ఆ అభిమానం అనుకొంటున్నాను నేను".


"అదొక కారణమైతే రెండో కారణం ... మూడో కంటికి తెలియని విషయం నేను నీ తల్లినమ్మా.." ఆర్ద్రంగా అన్నారా ఆ తెలుగు టీచర్.


వ్వాట్? ఇది ఇంకో షాకా.. ఈ తెలుగు టీచర్ తనకి తల్లా? అందుకే తనకి ఏదో తెలియని మమకారం అడ్డు పడుతోందా? మరి గురువయి ఉండి, తనకి తల్లి అయి ఉండి ఈ పని ఏంటి?


"తల్లి అయి ఉండి ఈ పనేంటి అని ఆలోచిస్తున్నావు కదూ?" తన మనసులోని మాటని కనిపెట్టినట్లుగా అడిగిన ఆ ప్రశ్నకి ఏమనాలో అర్థం కాలేదు వైష్ణవి కి.


"నీకు తల్లినే కాని తల్లిగా నీ ముద్దు ముచ్చట చూడక .. అనాధ పెరిగిన నిన్ను చూసి , అక్కున చేర్చుకోవాలనిపిస్తుంది, కాని, పెళ్ళికాకుండా తల్లి అని అవహేళన చేస్తారని ఎవరికీ తెలియకుండా నిన్ను తీసుకొని ఈఊరు వచ్చాను, నిన్ను ఇక్కడే రెసిడెన్షియల్ లో చేర్చి నేను అందులో చేస్తూ నీకు తెలియకుండా నీ బాగోగులు చూసుకొన్నాను. కాని నాఎదురుగా ఎవరన్నా పిల్లలు స్కూల్ కి వచ్చిన వాళ్ళ తల్లితండ్రులని "అమ్మా" అని పిలుస్తూ వెళ్తుంటే సహించలేకపోయేదాన్ని. ఏదో తెలియని అసూయతో రగిలిపోయేదాన్ని, నాకు లేని సుఖం వాళ్ళకెందుకు అని ఒక్కోసారి నా హోదాని మర్చిపోయి, పిల్లలిని హింసించేదాన్ని. నాకేదో దక్కలేదు అన్న బాధ నాకు ఇప్పటికి ఉంది, కాని అది ఎవరితో చెప్పుకోను? నాకు తెలుసు... నాకు ఎప్పుడో ఈ దుస్థితి పడుతుందని, కాని అది నీ ద్వారా అవకూడదు అనుకొన్నాను, అందుకే నువ్వు పోలీస్ అధికారిణివి అంటే నాకు నచ్చనిది. ఎవరన్నా "అమ్మా" అని పిలుస్తుంటే నాకే తెలియని చిత్రవధ అనుభవిస్తున్నాను, ఆ అసూయే నాలో వ్యక్తిత్వాన్ని నశింపజేసింది, నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదు అన్న ఆలోచనే అలా పైశాచికంగా ప్రవర్తిచేలా చేసింది. అమ్మ అనుకొని అమ్మ వడిలో సేద తీరుతున్నవాళ్ళని ఎవరినీ వదలేదు నేను, నాకు తెలియకుండానే వాళ్ళందరనీ గొడ్డుని బాదినట్లు బాదే దాన్ని, ఇంట్లో చెప్తే మర్నాడు మరింత కఠినమైన శిక్ష ఉండేది వాళ్ళకి. నేను పొందే ఈ పైశాచిక ఆనందాన్ని అనుకోకుండా చూసింది శశాంక్. అతను చూశాడన్న ఆవేశంతో ఆ పసిదానిని ఇంకా ఘోరంగా కొట్టాను, నేరం ఒప్పుకొంటున్నాను. నా దెబ్బలకే ఆ పాప చనిపోయింది. "


ఆవిడ చెప్పినదంతా ఇంకా నమ్మశక్యం కావడంలేదు వైష్ణవికి, మొదటిది ఆమె తన తల్లి అవడం , రెండోది, ఆమెలోని మృగాన్ని ఇలా బయల్పర్చడం. చిన్నప్పుడు "తన కోపమే తన శతృవు, తన శాంతమే తనకి రక్ష " అని చెప్పింది ఈవిడేనా ?" బయట అందరికి నీతులు చెప్పి , ఎవరికీ తెలియకుండా పసిపల్లల్ని కొడ్తూ వారి లేత మనసులతో భయం అనే భుతాన్ని చూస్తూ ... పైశాచిక ఆనందం పొందుతున్నది ... తనని కన్న తల్లా... తన పక్కన ఉంటునే ఇంతటి ఘోరానికి.. మైగాడ్! అని అనుకొంది వైష్ణవి, నమ్మినవాళ్ళు ఇంతలా గొంతు కోస్తారు అన్న మొదటి అనుభవాన్ని బలవంతంగా అంగీకరిస్తూ......ఆమెని కస్టడికీ తరలించింది.

*****

4.22.2009

జనాభా లెక్కల్లోంచి నన్ను తీసేసారు..... :(

"జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర...
రామ దూత అతులిత భలదామా అంజనీ పుత్ర పవన సుత నామ..
మహవీర విక్రమ భజరంగీ కుమతి నివార సుమతికే సంగీ
కాంచన వరణ విరాజ సువేశా కావన కుండల కుంచిత కేశా..
అథ వజ్ర జౌ ద్వజా విరాజై..."

"అబ్బా! సేలవు రోజు ఇంత పొద్దున్నే హనుమాన్ చాలీసా ఎంటా ??" అని నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తే .. మా బుచ్చి బాబు గారు తదేక దీక్షలో చక చకా మనసులో కాదు ..కాదు .. బయటికే మననం చేసేసుకొంటున్నారు. అప్పుడే పూజ చేసుకొంటున్నారని "ఎంతయిందబ్బా టైం " అని చూసాను. ఇంకా పూర్తిగా 8 కూడా కాలేదు. ప్చ్! సెలవంటే పొద్దున్నే లేచేస్తారు. "నేను వెళ్ళాలి బాబు లేవండి.." అంటే మటుకు మంకు పట్టు పడ్తారు. నేను లేచానని తెలిస్తే "కాఫీ ప్లీజ్" అంటారని బుచ్చి బాబు చూడకుండానే మళ్ళీ ముసుగుతన్నేసా.. కళ్ళు గట్టిగా మూసుకొన్నా చెవులకి మటుకు సహస్రనామలు వినిపించేస్తున్నాయి...

"యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః |
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ||"

లేవక తప్పేట్టు లేదు ఇక అని లేచి, "ఏంటండీ ఈరోజు... పొద్దున్నే ఈ పూజలు.. సెలవేకదా కాసేపు పడుకొందామనుకొంటే.." అన్నా (కొంచం కోపంగానే)

"సెలవెందుకిచ్చారు మేడం"??
"సెలవెందుకేంటి? ఈరోజు ఎలక్షన్స్ కదా"

"అదే మరి ఓటెయ్యవా..?"

"అబ్బా వెయ్యొచ్చు లెద్దురూ ... సాయంత్రం 5 గంటలదాక ఉంటుంది కదా ఇప్పుడే అంత మించిపోయేలా పరిగెత్తాలా ఏవిటి"?

"ఆ!!! ఫలనా బుచ్చిబాబు, వాళ్ళావిడ వస్తారు మనందరం అప్పటిదాక ఎదురుచూస్తూ ఉందాము..." అని మనకోసం ఎదురుచూస్తారు ఈలోపులోనె ఎవరో ఒకరు మన ఓట్లు కూడా వేసేస్తారు."

"పొన్లెద్దురూ! వేస్తే వేసారు, నిద్ర మానుకొని అక్కడిదాక వెళ్ళి ఓటేసినా ఒకటే వెయ్యకపోయినా ఒకటే. వీళ్ళు మనల్నేమి ఉద్దరిస్తున్నారు కనక... "

"ఎంత మాటన్నావు? ఓటు హక్కు వినియోగించుకోడం మన జన్మ హక్కు, మన నాయకుల్ని మనమే ఎన్నుకోవాలి. అసలు ఓటు అంటే........"

"అమ్మో వద్దులెండి ! ఏదో సరదాకి అన్నాను కాని, మనమే వేద్దాము మన హక్కు మనమే వినియోగించుకొందాము. "

*******
అలా మోదలయిన మా ఓట్ల ప్రహసనం ఎలా "కొన" సాగిందంటే...

వీధి వీధంతటికి నేను మావారు చాలా బాగా పరిచయమైన వాళ్ళం కావడం వల్ల మా ఇద్దరికి మా మీద కాస్త అతినమ్మకం (చిన్నప్పటినుండి ఇక్కడే ఉంటున్నామనే ధీమా) అందరినీ పలకరించుకొంటూ ..... సంబంధించిన సెంటర్ కి వెళ్ళాము.

*****


అక్కడికి వెళ్ళి నా ఓటరు ఐ.డి చూపించి ఓట్ వెయ్యడానికి స్లిప్ ఇమ్మంటే సదరు ఏజంట్..

"ఇదిగోమ్మా ! లిస్ట్ క్రమ పద్ధతిలో లేదు. పేరు ప్రకారం కాక, ఇంటి నంబర్ల ప్రకారం చూసుకొండి" అని నాదగ్గర ఓ పెద్ద పేపర్ లిస్ట్ పెట్టారు.


ఒక్కో పేజ్, ఒక్కో పేజ్ ఓపిక గా చూసాను, ఇటు ఇంటినంబర్, అటు పేర్ల ప్రకారం.. ఎక్కడా ఏ లిస్ట్‌లో


నా పేరు కనపడలేదు. నాది, మా బుచ్చిబాబుది ఇద్దరి పేర్లు లేవు. ఈ సెంటర్ కాదేమో అని, మా ఊర్లో ఉన్న మొత్తం అన్ని సెంటర్లు తిరిగి తిరిగి విసిగి వేసారాము.

అలా ఈసారి మా జన్మహక్కయిన ఓటు హక్కుని సద్వినియోగపరుచుకోలేకపోయాము. అక్కడ అందరూ తెలిసిన వాళ్ళే అవడంతో "వేరే తరుణోపాయం ఎమన్నా ఉందా" అంటే "పేర్లు లిస్ట్‌లో ఉండి ఉంటే ఐ.డి. కార్డ్ లేకపోయినా పర్వాలేదు, ఈ రేషన్ కార్డో, ఇంకో ఐ డి ఏమి తెచ్చినా సరిపోయేది. కాని లిస్ట్ లో పేర్లే లేకపోతే మేమేమి చెయ్యలేము" అని చేతులెత్తేసారు. అలా మేము ఆ జనభా లెక్కల్లో లేము.

ఓటు హక్కు వచ్చినతరువాత మొదటిసారి నేను ఓటు వెయ్యకపోడం. ఎందుకో చిన్నప్పటినుండి ఉన్న ఊళ్ళో, ఉంటున్నా , ఏదో విదేశాలలో ఉంటున్నట్లు మేము ఓటు వెయ్యలేకపోయాము.


ఈ సారి ఇలాంటి అవకతవకలు చాలా జరిగాయని తరువాత తెలిసింది.అలా జనాభా లెక్కల్లోంచి నన్ను(మమ్మల్ని) ......... :(

4.20.2009

తర్వాణి - ఆవకాయ్ ముచ్చట్లు

ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం....ఆ రోజులిక రావేమి నేస్తం...?

ఎంత చెప్పుకొన్నా తనివి తీరదు, మళ్ళీ కావాలనుకొన్నా తిరిగిరానిది బాల్యం. అందులోని ప్రతి ఒక్క జ్ఞాపకాన్ని మధురాతి మధురంగా మలచి చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా గొప్పగా చెప్పుకోవాల్సింది పల్లెటూళ్ళగురించి అభిమానం అనురాగం కవలపిల్లలు ...... పిల్లలికి పల్లెటూళ్ళు కన్న తల్లులు.. అన్న పాట ఎలాను ఉంది. అలాంటి పల్లెటూళ్ళు నాకు మటుకు దూరపు కొండలే. ఎప్పుడో మా అమ్మకి నన్ను తీసుకొని వెళ్ళాలి అని అనిపిస్తే ఆవిడ కరుణా కటాక్షాలు నా మీద కురిస్తే నేను ఆ సంవత్సరం వేసవి కాలంలో ఊరు వెళ్ళే భాగ్యం. అలాంటి భాగ్యం నాకు వెళ్ళమీద లెక్కపెట్టుకొనేన్నిసార్లు మాత్రమే జరిగింది. ఎంత వేళ్ళమీద లెక్కపెట్టుకొన్నా అక్కడి జ్ఞాపకాలు మటుకు అలా మదిలో నిలిచిపోయేవి. అలాంటి ఎన్నో వేసవి కాలాలు ప్రతి వేసవి కాలానికి ఇలా గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అందులో ఓ వేసవి కాలం చల్ల చల్లగా చెప్తాను మీకు.. మరి వచ్చేస్తారా ....మా పల్లెటూరికి ఒక్కసారి వెళ్ళివచ్చేద్దాము. :)

****

చిన్నప్పుడంటే కూసింత లెక్కల్లో వీకు , అయినా మనలో మాట.. ఎప్పుడు ఎన్ని గదులు అని ఎప్పుడూ లెక్కపెట్టాలన్న ఆలోచన రాలేదు , మొన్నీమధ్యే మా ఊరెళ్ళి వచ్చాము కాబట్టి అక్షరాల 15 గదులు . అప్పటి ( మా) ఇల్లు , మావయ్య గది, పెద్ద పిన్ని గది, చిన్నపిన్ని గది ఇలా గదుల పేర్లు ఉండేవి .. ముందు పెద్ద హాలు, హాలులో ఒక పక్క అమ్మమ్మ పడుకొనే ఓ పెద్ద పట్టెమంచం, బయట పెద్ద వసరా.. అటువైపు వంటిల్లు, ఇటువైపు సామాను గది, వసరా అయితే ఒకేసారి ఒక 50 మంది దాక కూర్చొని భోజనం చేసే వెసులుబాటు ఉన్న పెద్ద గది అని చెప్పొచ్చు. గది మధ్యలో అష్టా చెమ్మా ఆటకని బండమీదే చెక్కించేసారు. భోజనాలయిన తరువాత అక్కడ ఆడుకొంటూ కూర్చునేవాళ్ళము. వసరాకి ముందో తులసి మొక్క, దాని వెనుక బావి, బావికి అటుపక్కగా చూస్తే పెద్ద చెరువు, విసిరేసినట్లుగా అక్కడో ఇల్లు ఇల్లు.. నాకు గుర్తున్న మా పల్లెటూరు ఇది. అంత పెద్ద ఇల్లు మాదొక్కళ్ళదే అవడమో లేకపోతే మరి మా తాతగారు అక్కడ ఎదో పేరుగన్న వ్యక్తో (నాకు తెలీదు నిజానికి) తెలీదు కాని తెల్లారితే చాలు అరుగుమీదకి వద్దన్నా వచ్చేవి కూరగాయలు మొదలుకొని, పళ్ళు అవీ.. ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ దొండపాదు, సొర పాదు, బీరకాయలు అన్ని దొడ్లోనే పండేవేమో కూరగాయలకంటూ ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండానే ఇంట్లోనే లభించేవి.

****

ఇహ వేసవి సెలవలొచ్చాయంటే , పిన్నుల పిల్లలు ,మేము, మావయ్య పిల్లలు, ఇక మా అమ్మమ్మకి ఉన్న అక్కచెల్లెళ్ళ మనవలు అందరు కలిసి పొలో మంటు అక్కడ తిష్ట వేసేవాళ్ళము, ఒక 30, 40 దాకా పిల్లలమే తేలేవాళ్ళము.


మేము బాగా చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు మా ఆఖరు పిన్నికింకా పెళ్ళి కాలేదు, సో, అక్కడికి వెళ్ళినప్పుడల్లా మా బాధ్యత అంతా మా అఖరి పిన్నే తీసుకొనేది. స్నానాలు, జెళ్ళేయడం, భోజనాలు అవి ఇవి అని కాదు అన్ని భాధ్యతలు మా ఆఖరి పిన్నివే. అందులో ఆ పిన్నితో పనులు చేయించుకొడానికి, గోరు ముద్దలు తినిపించుకోడానికి మేమందరం ముందు ఉండేవాళ్ళము. దానికి కారణం లేకపోలేదు, ముద్ద ముద్ద కీ ముద్దు చేస్తూ.. "నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి" అంటూ అసలు ఆవిడకి విసుగంటే ఎంటో తెలీదేమో అన్నట్లుగా ఉండేది. (ఇప్పటికీ అంతే) .

ఇదిగో ఇక్కడే నా మధురమైన అనుభూతి మీతో చెప్పాలని నా మనసు ఉవ్విళూరుతోంది.


మేమందరం వస్తామని మా పిన్ని ముందుగానే కాస్త గోంగూర పచ్చడి, దోసవకాయి, మరి కాస్త ముక్కావకాయ్ పెట్టి ఉంచేది. సెలవల మొదట్లోనే కదా అప్పటికింకా మావిడికాయ పక్వానికి రాదు కదా అందుకని ముక్కావకాయ్ పెట్టేది.


నిజం చెప్పొద్దు, ఎవరిని తరిచి అడిగినా అసలు మా పిన్ని పెట్టే ఆవకాయ్ - తర్వాణి గోరుముద్దలకోసమే ఊరు వస్తారు అనేది మటుకు నేను కఛ్ఛితంగా చెప్పగలను. అంత రుచిగా ఉండేది. ఆవిడ చేతి మహత్యమో లేక ఆ ఊరు మహత్యమో తెలీదు కాని, పొద్దున్నే ఇంకా తెల్లారదేమో అప్పటికి, "మళ్ళీ ఎండెక్కిందంటే కష్టమఱ్ఱా తొందరగా మొహాలు కడుక్కొండి చక్కగా కాస్త దొసావకాయో, గోంగూరో, ఆవకా
యో వేసి చద్దన్నం కలిపి పెడ్తాను " అని పిన్ని తొందర పెట్టేది. అందరం వసరాలో వరసగా కూర్చొనే వాళ్ళము. వరసగా అరిటాకు పరిచేసి పైనుండి నల్ల కుండ తీసి ముందు రోజు రాత్రి గంజిలోనో/మజ్జిగలోనో ఉప్పేసి నానేసిన అన్నం (మేము తర్వాణి అన్నం అంటాము) గట్టిగా పిండి అందులో కాస్తంత ఆవకాయ్ వేసి ఎఱ్ఱగా కలిపి అంత నూనో, నెయ్యో వేసి (నాకయితే అందులో నూనే ఇష్టం) అందరి ఆకుల్లో పెట్టేది. మేము ఏ 10 మందో అయితే తనే తినిపించేసేది. అసలు ఆ రుచి కనక తలుచుకొంటే, ఇప్పటికీ నోరూరుతుంది. భలే గమ్మత్త్లుగా కూడా ఉండేది. ఇక ఆవకాయ్ ముక్కలు అవి తరువాత కలిపే తర్వాణి అన్నంలో నలుచుకోడానికి.. ఇప్పటి ఏ టిఫిన్‌కి సాటి రాని టిఫిన్ అది. కడుపులో చలవ చేస్తుంది అని పెట్టేవారు అప్పుడు. మరీ రెండు రోజులు మూడు రోజులు ఉంచకుండా , ముందు రోజు అన్నం అయితే ఆరోగ్యానికి మంచిదే అనేవారు అప్పటి పెద్దవాళ్ళు. వేసవి కాలం వచ్చింది అంటే .. నాకు అలా తర్వాణి అన్నం తినాలంటే ఇష్టం కాని, నల్లకుండ, గంజి/మజ్జిగ, అది కాస్త పులుపెక్కదాక ఆగడం ప్చ్! ఇప్పటి ఇన్‌స్టెంట్ జీవితాలకి అంత ఓపిక, తీరికా ఎక్కడ, కాస్త ఉప్మా చేసుకొని తిని, పరిగెత్తడమే గగనం.. అంతేనంటారా? :-)
Loading...